'Aa Naluguru' New Telugu Story
Written By Nagavarapu Srinivasa Rao
రచన : నాగవరపు శ్రీనివాస రావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
చుట్టూ చిమ్మ చీకటి. ఎక్కడ ఉన్నానో చూద్దామనుకున్నా కానీ, చెప్పానుకదా! కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారం. నా పక్కన ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని చేతులు చాచాను. ఎవరూ తగల్లేదు కానీ, ఏవో మెత్తటి గోడల్లాగా తగిలాయి. అంత చీకటిలో ఒంటరిగా ఉన్నా, నాకు భయం కలగలేదు సరికదా ఏదో వెచ్చటి భద్రతాభావం కలుగుతోంది.
అంతలో ఎవరో నన్ను బలవంతంగా ముందుకు తోస్తున్నట్లనిపించింది. అది కూడా, గుంపులో తోపులాటలా కాకుండా, చాలా జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారం శ్రద్ధగా తోస్తున్నారు. అప్పుడే బయటినుండి ఎవరో బాధగా అరుస్తున్న అరుపులు వినిపించాయి. ఆ అరుపులు ఎవరివో తెలియకపోయినా, నన్ను కూడా ఎందుకో తెలియని బాధ ఆవరించింది. బహుశా, ఆ వ్యక్తిపై ఉండే సానుభూతి దానికి కారణం అయి ఉండవచ్చు. అంతలోనే, ఆ అరుపులతో బాధకన్నా మించిన ఒక రకమైన ఆనందం వినిపించింది. 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్' అని కవిగారు చెప్పినా, నిజంగా బాధని ఆనందంగా అనుభవించేవారుంటారా? అనుకున్నాను.
"జాగ్రత్త. జాగ్రత్త." ఈ మాటలు వినిపిస్తుండగా వెనకనుండి తోసిన తోపులకి, మెల్లగా ఒక ఇరుకు గుహలాంటి ఆ వెచ్చని చీకటి ప్రదేశంనుండి బయట పడ్డాను. అంత చీకటిలోంచి బయటకొచ్చిన నాకు ఆ గదిలోని వెలుతురు కోటి సూర్యుల కాంతిలా అనిపించింది. కళ్ళు విప్పడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో, ''ఆహా! ఎంత చక్కటి పిల్లాడమ్మా! దిష్టి తగిలేటట్టున్నాడు. నలుగురి కంట పడకుండా కాచుకోడం నీకు పెద్ద పనే " అని నన్ను డెలివరీ చేసిన డాక్టర్ మా అమ్మతో అన్న మాటలు వినగానే భయంతో, నలుగురంటే ఎవరో నన్నెత్తుకెళ్లిపోయేవారనుకుని ఆరున్నొక్క రాగంలో ఏడుపు మొదలెట్టాను. మా అమ్మ నీరసంగా నవ్వి, "నలుగురి నోళ్ళలో పడేవాడు కాకుండా ఉంటే చాలు." అంటూ మత్తులోకి జారుకుంది.
ఆ గదిలో అప్పుడే పుట్టిన నేను, అమ్మ, డాక్టర్, నర్సు కాక వేరే ఎవరు కనిపించకపోడంతో, ఆ నలుగురు లేరనుకుని ధైర్యంగా నవ్వడం, హాయిగా పడుకోవడం చేశాను. కాస్సేపటికి నన్ను చూడడానికి కొంతమంది మనుషులు వచ్చారు. వాళ్లలో ఆ నలుగురు ఉన్నారేమోనని భయపడి ఏడవడం మొదలెట్టాను. "వెధవ వేలెడంత లేడుగానీ ఎంత గట్టిగా ఏడుస్తున్నాడో, నీ నాన్న, తాతా, నానమ్మలంరా బడుద్ధాయి." అన్న మాటలు విని, ఓహో! మన వాళ్ళే కానీ, ఆ నలుగురు కాదన్నమాట అనుకుని నవ్వడం మొదలెట్టాను.
నా వాళ్లందరితో కలసి, మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంట్లో మనవాళ్ళందరూ ఉన్నారు. ఆ నలుగురి భయం మరి లేదనుకుని హాయిగా ఉండసాగాను. ఆ రోజు ఉదయం లేవగానే హడావుడి మొదలైంది. "మా చిన్నిగాడికి ఈ రోజు పేరు పెడతామంటా" తాత నన్ను ఎత్తుకుని ఆడిస్తూ ఉంటే, నా నామకరణం అని తెలిసింది.
"అదేం పేరురా! మీ తాత పేరు, కోడలి తాత పేరు, మన కులదైవం పేరు, వాళ్ళ కులదైవం పేరు, మన గురువుగారి పేరు వంశపారంపర్యంగా వస్తున్న మిగతా పేర్లు కలపకుండా కేవలం 'ఆత్రేయ' అని పెడితే ఎలాగరా?" నానమ్మ ప్రశ్నకు, "ఈ కాలంలో అంతంత పెద్ద పేర్లు ఎవరూ పెట్టుకోడంలేదు అమ్మా! 'ఆత్రేయ' అని పేరు పెడితే స్కూల్ లో అక్షరక్రమంలో మొదటివరుసలో కూర్చోవడంతో పాటూ, అన్నిటిలో మొదట ఉంటాడు. అదీకాక, ఇది మన గోత్రపురుషుడి పేరు." అన్నారు నాన్న.
"అయినా ఇలా ఇష్టంవచ్చిన్నట్లు పేరు పెడితే నలుగురూ ఏమనుకుంటారు?" అన్న నానమ్మతో, "నేను నాకొడుకుకి పేరు పెడడానికి కూడా నలుగురి అనుమతి తీసుకోవాలా?" అన్నారు నాన్న. "మన సంతానం నలుగురి తలలో నాలుకలాంటివాడు కావాలి కానీ, నలుగురి నోళ్ళలో నానేవాడు కాకూడదు. నలుగురిలో బతికేటప్పుడు 'నలుగురితో నారాయణ కులంతో గోవిందా' అన్నట్టుండాలి కానీ, 'తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళు' అన్నట్టుండకూడదురా!" అన్నది నానమ్మ. ఆ విధంగా నలుగురి భయానికి ఉత్త 'ఆత్రేయ'గా ఉండవలసిన నేను A to Z ఆత్రేయగా మారాను.
"ఏమిటీ? పిల్లాడిని మామూలు కాన్వెంట్ స్కూల్ లో చేరుస్తావా? ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్చకపోతే నలుగురూ ఏమనుకుంటారు? ఆరు నూరైనా నా మనవడు ఇంటర్నేషనల్ స్కూల్ లో చదవాల్సిందే." తాత తీర్మానంతో పాటు, నలుగురి భయంతో నేను ఇంటర్నేషనల్ స్కూల్ లో చేరాను.
"మా స్నేహితులందరి పిల్లలూ IIT, NIT లలో చదువుతున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకు కూడా వాటిల్లోనే చదవాలి. లేదంటే, నలుగురిలో తలెత్తుకోలేను." నాన్న చేసిన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో ఇష్టం లేకున్నా కష్టపడి NIT లో చదివాను.
"నా కిట్టి పార్టీ స్నేహితురాళ్లందరి కోడళ్ళు, అందమైనవాళ్లు, మందమైన ధనకనకాలతో వచ్చినవాళ్లు. నాకూ అలాంటి కోడలే కావాలి. లేదంటే నలుగురిలో చులకనైపోతాను." అన్న అమ్మ మాటలకూ, నలుగురికీ తలవంచి ప్రేమను త్యాగంచేసి, ప్రతిమను చేసుకున్నాను. 'ఏర్పాట్లు చాలా నాసిరకంగా ఉన్నాయి. పెళ్ళికొచ్చే నలుగురిలో తలెత్తుకోకుండా చేసారు మీ మామగారు.' నాన్న మాటలతో, కొంచెం బాధ కలిగినా, ఆ నలుగురిని ఇప్పటికైనా చూడొచ్చనే కుతూహలం ఎక్కువైంది. పెళ్ళంతా అయిపొయింది కానీ, ఆ నలుగురూ కనపడలేదు.
‘మీ నాన్న చేయించిన మీ తాతా నానమ్మల ఉత్తరక్రియల గురించి ఇప్పటికీ నలుగురూ కథలుకథలుగా చెప్పుకుంటుంటారు. నువ్వు కూడా అంతకు తగ్గకుండా జరిపించాలి. లేదంటే నలుగురిలో నగుబాటు.' పరామర్శించడానికొచ్చిన ఒక స్వయంప్రకటిత పెద్దమనిషి మాటలతో, నలుగురి భయం ఆ సందర్భంలో నాలో మళ్ళీ మొదలైంది.
ఉద్యోగం ఎంత బాగా చేసినా, చివరలో ఏదో ఒక విజిలెన్సు కేసులో ఇరుక్కుని రిటైరయితే మొత్తం మంచి పేరు పోయి, నలుగురిలో దోషిగా నిలబడాలి. నిత్యం సహోద్యోగులు చెప్పే మాటలతో పాటూ, నలుగురి భయం తోడై, జాగ్రత్తగా ఉద్యోగజీవితం నిర్వహించి, ఏ అవాంఛనీయ సంఘటనలకు తావియ్యకుండా విరమించాను.
'మొత్తానికి A to Z ఆత్రేయ నలుగురూ మెచ్చేలా సంతానాన్ని పెంచడంతో పాటూ, మనవలతో కలసి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడయ్య!' దారినపోతూ, మాఇంటి వరండాలో ఆ ఉదయమే ఊరునించి వచ్చిన మనవలతో ఆడుకుంటున్న నన్ను చూసి, నా స్నేహితుడన్న మాటలు విన్న మా ఆవిడ, "కొంచెం కూడా దాపరికం లేదయ్యా ఈ మనిషికి. నరుడి దృష్టికి నల్లరాళ్లు పగులుతాయంటారు. నలుగురి నోళ్ళలో పడకండంటే వినరుగా! ఆ వాకిట్లోనుంచి ఇంట్లోకి రండి." భార్య పెడుతున్న చివాట్లు తింటూ, పెట్టబోయే అట్లు తినడానికి లోపలి వెళ్ళాను.
"ఎంతైనా ఆత్రేయ అదృష్టవంతుడు. 'అనాయాసేన మరణం' అన్నారు. ఎక్కడెక్కడో ఉన్న పిల్లలిద్దరూ కుటుంబాలతో సహా సెలవులు దొరికి ఒకేసారి రావడమేమిటి, చక్కగా అందరితో ఆనందంగా గడుపుతూ అతను హాయిగా పోవడమేమిటి. నలుగురూ అసూయపడే అలాంటి చావు ఎంతమందికొస్తుంది చెప్పండి." నా చావు నేను చచ్చినా నలుగురూ ఎందుకు అసూయపడతారో వింటున్న నాకర్ధం కాలేదు.
'అయ్యా! నలుగురూ నాలుగు కాలాలపాటు చెప్పుకునేలా చక్కగా మీ తండ్రిగారి కర్మకాండ జరిపించి, ముగించారు. ఆయనకు శాశ్వత స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని ఘంటాపధంగా చెప్పగలను.' సంభావన బాగా ముట్టిన ఆనందంలో ఉన్న శాస్త్రిగారి మాటలతో భౌతిక జగత్తును విడిచిపెట్టి, అగమ్య పయనం మొదలుపెట్టాను.
చిక్కటి చీకటి గుహలను దాటుకుంటూ చాలాకాలం ప్రయాణించి, ఒక బ్రహ్మాండమైన వెలుతురు ముందర నిలుచున్నాను నేను. అదే బ్రహ్మగారి సభ అని, ఆ వెలుతురులోనే బ్రహ్మగారు ఉన్నారని ఎవరో చెప్పారు. ఉద్యోగవిరమణ ముందు చేసే ఎగ్జిట్ ఇంటర్వూ లాగా జన్మవిరమణ చేసేముందు బ్రహ్మగారు నాతో మాట్లాడి, నా జీవనాద్యంత పరిణామాలన్నీ చర్చించిన తర్వాత, "నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా లేదా తెలుసుకోవాలనుకుంటున్నావా?" అన్నారు.
“పుడుతున్నప్పటినుండి ఇక్కడికి ప్రయాణం కట్టే వరకు ప్రతి సమయం లోను సమయం, సందర్భం లేకుండా విన్న ఒకేఒక మాట 'ఆ నలుగురు'. ఏ పని చేసినా, చెయ్యకపోయినా నలుగురు ఏమంటారు? ఎక్కడికి వెళ్లినా, వెళ్లకపోయినా నలుగురు ఏమంటారు? ఏదైనా మాట్లాడినా, మాట్లాడకపోయినా నలుగురు ఏమంటారు? మనకు నచ్చినట్లు బతికినా, బతకకపోయినా నలుగురు ఏమంటారు? నలుగురిలోనూ మంచిగా మెసలుకోవాలి. నలుగురి కంటా పడరాదు. నలుగురి నోళ్ళలో నానకూడదు. ఇలా ఆ నలుగురంటే భయమో, గౌరవమో తెలియని భావనతో జీవనయాత్ర ముగించాను. నలుగురికి మర్యాద ఇవ్వాలో, వారి మీద తిరగబడాలో తేల్చుకోలేకపోయాను.
పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు 'ఆ నలుగురు' ఎవరో తెలుసుకోవాలనే కోరిక, చూడాలనే ఆరాటం తీరలేదు. వీలైతే ఆ నలుగురిని చూపించండి అలాగే వారిని గౌరవించాలా, తిరస్కరించాలా తెలియజేయండి." అని అడిగాను.
అది విన్న బ్రహ్మగారు తన నాలుగు నోళ్లతో పక్కున నవ్వి, " నేను సృష్టించని వారి గూర్చి నన్నడిగితే ఏం చెప్పగలను? నిజానికి ఆ నలుగురినీ చూడాలని నేనుకూడా నా నాలుగు ముఖాలతో, నాలుగు యుగాలనుంచి వెతుకుతున్నాను. ఇంకా కనపడలేదు, కనపడతారనే ఆశ కూడా లేదు. ఇన్ని కల్పాలలో ఈ ప్రశ్న అడిగిన మొదటివాడివి నువ్వే కాబట్టి, నువ్వే మళ్ళీ భూమిపైకి వెళ్లి, సమాధానం తెలుసుకుని వచ్చి నాకు చెప్పు.” అన్నారు.
బ్రహ్మగారికే కనపడని ఆ బ్రహ్మపదార్ధానికి రాబోతున్న జన్మలోనైనా భయపడాలా, వద్దా అని ఆలోచించేలోపలే మళ్ళీ వేగంగా తిరుగు ప్రయాణం చేసి, మరో వెచ్చనైన చీకటి గుహలో ప్రవేశించాను.
సమాప్తం
నాగవరపు శ్రీనివాస రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: నాగవరపు శ్రీనివాస రావు
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పాఠకుడిగా ముదిరి రచయితగా మారిన చిరు రచయితను నేను. స్వస్థలం శ్రీకాకుళం. ఉద్యోగరీత్యా 25 సంవత్సరాలుగా కర్ణాటక లోని మంగళూరు వాసం చేస్తున్న ప్రవాసాంధ్రుడిని. ఎప్పుడూ చదవడం, అప్పుడప్పుడు రాయడం అభిరుచులు.
Comments