top of page

అబ్బ నీ తియ్యని దెబ్బ - పార్ట్ 2


'Abba Nee Thiyyani Debba - Part 2/2' - New Telugu Story Written By Vasundhara

Published In manatelugukathalu.com On 14/10/2023

'అబ్బ నీ తియ్యని దెబ్బ - 2/2' పెద్ద కథ ప్రారంభం

రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ

నా పెళ్ళికీ, చెంపదెబ్బకే సంబంధం ఉందంటాడు నా మిత్రుడైన ఒక జ్యోతిష్యుడు.

నా చేత చెంపదెబ్బ తినే అమ్మాయి కోసం వెదుకుతూ ఉంటాను.

ఒకరోజు పార్క్ దగ్గర ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది.

అనుసరించి వెడతాను..

ఒక యువకుడు ఆమె కోసం పార్కులో ఎదురు చూస్తూ ఉంటాడు.


ఇక అబ్బ నీ తియ్యని దెబ్బ పార్ట్ 2 చదవండి.


“శిక్ష కాదు. శిక్షణ. నీకు సహనం తక్కువ. అది అలవడ్డానికి ఈ నిరీక్షణ అవసరం” అందామె కోయిల గొంతుతో.


ఇద్దరూ మౌనంగా ఒకర్నొకరు చూసుకుంటే- మేము వాళ్లిద్దర్నీ చూస్తున్నాం.

పీలగా ఉన్నాడు. ఎత్తు ఐదున్నర అడుగులు. రంగు చామనచాయ. అతి సామాన్యంగానే ఉన్నాడు. కానీ మగాడు.


నాజూగ్గా ఉంది. ఇంచుమించు అతడంత ఎత్తూ ఉంది. గులాబి రంగు వళ్లు. అందగత్తె అనిపిస్తుంది. కానీ ఆడది.


“కాకి ముక్కుకి దొండపండు” ప్రకాష్ ఊహలు మా చెవుల్లో గుసగుసలాడాయి. “తన పక్కన నువ్వున్నా కాకినే అనిపించే అందమామెది” మనసు నాతో ఊసులాడింది.


ఉన్నట్లుండి అతడామె చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు.

“ఇదే వద్దన్నాను. ముందు నేను చెప్పేది విను” ఆమె అతణ్ణి విదిలించింది.


“ఏంచెబుతావ్!” విసుగ్గా అన్నాడతడు.


“నీకూ నాకూ పొసగదు. అది చెప్పడానికే వచ్చాను” అందామె దృఢంగా.


మా ముగ్గురికీ చెప్పలేనంత ఆనందం. ఎందుకు పొసగదని అడుగుతాడనుకున్నాం. అప్పుడామె ఏదో జవాబిస్తుందిగా- ఆ జవాబుకి అనుగుణంగా మమ్మల్ని మేము తీర్చి దిద్దుకోవాలని సిద్ధపడుతూ ఆశగా చెవులు రిక్కించాం.


కానీ ఉన్నట్లుండి, “నేనెవరనుకున్నావ్! ఎంపీకి మనవణ్ణి. ఎమ్మెల్యే కొడుకుని. నన్నెదిరించడానికి పుటిన్‌కీ, బైడెన్‌కీ, హమాస్‌కీ కూడా ధైర్యం చాలదు. నన్ను కాదనే హోదా నీకు లేదు” అంటూ చెయ్యట్టుకుని దగ్గరకు లాక్కున్నాడతడు.


ఆమె గజగజ వణుకుతోంది.

అరుద్దామంటే- అసలే చిన్న నోరు. భయానికి మరింత చిన్నదైంది. ఇక ఆ నోట్లోంచి మాటేమొస్తుంది? పెద్ద పెద్ద కళ్లు. నోటి అవస్థ చూసి అవి మరింత పెద్దవయ్యాయి. వాటితో జాలిగా చుట్టూ చూస్తోంది, ఎవరైనా సాయమొస్తారేమోనని.


చెట్ల మధ్య వాళ్లిద్దరే! చెట్ల చాటునుండి వాళ్లని చూస్తున్నది మేం ముగ్గురమే!

అసలే ఆవేశపరుణ్ణి. చటుక్కున డెన్‌లోకి చొరబడి, ఆ యువకుణ్ణి సమీపించి, చెంప చెళ్లుమనిపించాను. అంతే! ఆ ఎంపీ మనవడు- ఎమ్మెల్యే కొడుకు- నిలువునా నేలకూలాడు.

అంతలోనే నేనూహించని విశేషం జరిగింది. అక్కడున్న చెట్లమీంచి కొంతమంది మనుషులు నేలకురికారు.


“ఎవడ్రా నువ్వు?” అంటూ గద్దించాడొకడు.


నేనెవణ్ణో చెబుతాడని ఎంపీ మనవణ్ణి చూశాను. వాడింకా నేలమీదే ఉన్నాడు. మాట్లాడే స్థితిలో లేడు. అది గమనించి, “ఎవడు చెంప చెళ్లుమనిపిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకౌతుందో, వాడే నేను” అన్నాను పొగరుగా.


కానీ ఆ పొగరు దిగిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు. ఎందుకంటే- ఆ యువకుడు ప్రముఖ సినీ నిర్మాత జయసేన కొడుకు మునిరాజు. జయసేన రాజకీయనేత కాకపోవచ్చు కానీ- ఆయన కనుసన్నల్లో మసిలేవాళ్లది అంతకంటే పెద్ద హోదా. కొడుకుని దిమ్మతిరిగేలా చెంప చెళ్లుమనిపించినందుకు ఆయన ప్రతీకారం మహాభయంకరంగా ఉండొచ్చు.


జరిగిందేమిటంటే-

కొడుకు మునిరాజుని హీరో చెయ్యాలని- భారీ ప్రోజెక్టు తలపెట్టాడు జయసేన. షూటింగుని కొత్త తరహాలో చెయ్యాలని అనుకున్నాడు. పబ్లిక్ స్థలాల్లో, జనం మసిలే సమయంలో- అది షూటింగని తెలియకుండా ఉండేలా కొన్ని సీన్లు ప్లాన్ చేశాడు. ఆ వివరాలకి పబ్లిసిటీ ఇవ్వకుండా గోప్యంగా ఉంచాడు. ఈ పార్కు సీను ఆ షూటింగులో భాగం.


“ఇదంతా నాకు తెలియదు. ఆమెకు ఎక్కువ మాట్లాడే అవకాశమివ్వకుండా, అంత వెంటనే ఆమె చెయ్యి పట్టుకుంటే- అత్యాచారం కామోసు అనుకున్నాను” అన్నాను సంజాయిషీగా.


“చెయ్యి పట్టుకుందుకు గంటలకు గంటలు తీసుకుందుకు- ఇదేమన్నా టీవీలో డెయిలీ సీరియల్ అనుకున్నావా- సినిమా” అని గద్దించాడు మరొకడు.


అతణ్ణి చూస్తే కొన్ని డెయిలీ సీరియల్సు తీసి, కొత్తగా ప్రమోషనొచ్చిన సినిమా డైరెక్టరయుంటాడని అనిపించింది. “అయాం వెరీ సారీ” అని చేతులు జోడించాను.


“సారీతో తప్పించుకోలేవు. తెలిసి తాకినా, తెలియక తాకినా- నిప్పు కాల్చక మానదు. ఇప్పుడు నీ విషయంలోనూ అంతే! మా మునిరాజే క్షమించమన్నా- ఆయన అభిమానులు ఒప్పుకోరు. పద, పోలీస్ స్టేషనుకి” అన్నాడు డైరెక్టరు.


మునిరాజు పేరే వినలేదు. అతడి సినిమా ఇంకా రిలీజవలేదు. అప్పుడే అతడికి అభిమానులా, అని ఆశ్చర్యపడబోయాను. కానీ- “వాళ్లు పోలీసు స్టేషను అంటున్నారు. ఆశ్చర్యానికిదా సమయం! ముందీ పరిస్థితినుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించు” అని హెచ్చరించింది వివేకం.


“హమ్మయ్య, నువ్వింకా నాతోనే ఉన్నావుగా, అది చాలు నాకు” అంటూ వివేకానికి ధన్యవాదాలు చెప్పి- సాయానికి రవి, ప్రకాష్‌ల కోసం చూశాను. కానీ వాళ్లెప్పుడో- ఎరని వేటకీ, కలల్ని గాలికీ వదిలి కారుతోసహా అక్కణ్ణించి ఉడాయించారు.


ఇక వివేకమొక్కటే నాకు దిక్కనుకుని అక్కడున్నవాళ్లలో ఒకొక్కర్నే చూస్తుంటే హీరోయిన్ కనిపించింది. చటుక్కున ఆమెను సమీపించి, “జరిగింది నీకు తెలుసు. నిజం చెప్పి నువ్వే నన్ను కాపాడాలి” అన్నాను.


ఆమె తెల్లబోయి, “ఏ నిజం చెప్పాలి? నువ్వు హీరో సార్ని కొట్టిన మాట నిజమే కదా!” అంది.


“నేను హీరో సార్ని కొట్టాను. ఆయన కింద పడ్డాడు. ఆ వెంటనే ఆయనకు స్పృహ తప్పింది. ఇవి కనిపించే మూడు నిజాలు. కానీ కనిపించని నాలుగో నిజమొకటుంది. అది చెప్పాలి నువ్వు” అన్నాను.


“ఏమిటా నాలుగో నిజం!” అందామె.


“ఓ అమ్మాయి కష్టంలో ఉందని జాలిపడ్డాను. మానవత్వంతో స్పందించాను. పర్యవసానం ఆలోచించకుండా- ఓ అమాయకుణ్ణి కొట్టాను. అది తెలియక చేసిన తప్పు. అందుకు కనుక నాకు శిక్ష పడితే, ఇకమీదట ఎవ్వరూ ఆపదలో ఉన్న మహిళకు సాయం చెయ్యాలని అనుకోరు. అదీ కనిపించని నాలుగో నిజం”” అని ఆక్రోశించాను.


ఆమె ఆశ్చర్యంగా, “మా సినిమాలో నెక్స్ట్ సీన్లో ఓ కేరెక్టరు యాక్టరు డైలాగిది. నీకెలా తెలిసింది?” అంది.


డైరెక్టరు దిగులుగా చూసి, “మన రైటరువి మరీ రొటీన్ డైలాగ్సు. రాసేవన్నీ ఇలా జనాలు పట్టేసేవే! అందుకే డైలాగ్సు కూడా నేనే రాస్తానని జయసేన సారుకి చెప్పాను. ఆయన వినలేదు. ఇప్పుడు నువ్వైనా చెప్పు” అని వాపోయాడు.


ఆ పాలిటిక్సులోకి దిగడం హీరోయిన్‌కి ఇష్టం లేదు కాబోలు. అందంగా నవ్వేసి, “జయసేన సార్- కొత్త సినిమా రేపే కదా రిలీజ్! బాగా టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది వింటే బాగా డిస్టర్బౌతారు. ఇప్పటికి వివరాలు తీసుకుని ఇతణ్ణి వదిలెయ్యండి. తర్వాత సార్‌కి నెమ్మదిగా చెప్పి, ఆయనేం చెబితే అది చేద్దాం” అంటూ మాట తప్పించింది.


అప్పుడామె ఆకర్షణీయమైన యువతిలా కాక, ఆలయంలో దేవతలా అనిపించి, అప్రయత్నంగా చేతులు జోడించాను.


నామీద జాలితో కాక, ఆ అందగత్తెను ప్లీజ్ చెయ్యడానికేమో- వాళ్లు ఒప్పుకున్నారు.

బ్రతుకు జీవుడా అనుకుంటూ వాళ్లకు నా వివరాలిచ్చి అక్కణ్ణించి బయటపడ్డాను. ఐనా నాలో భయం పోలేదు. ఆ తర్వాత రెండు వారాలు ఆఫీసుకి సెలవెట్టాను. ఇంట్లో టూర్ అని అబద్ధం చెప్పి ప్రయాణమయ్యాను.


దిక్కు లేనివారికి దేవుడే దిక్కంటారు. దేవుళ్లలో పవర్‌ఫుల్‌ అయిన ఏడుకొండలవాణ్ణి ప్రార్థిద్దామని ముందు తిరుపతి వెళ్లి శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నాను. కొండమీద వాతావరణం నచ్చి, సెలవయ్యేదాకా అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ మునిరాజు ఎలా ఉన్నాడో! తెలివొచ్చిందో లేదో! జయసేనకు విషయం తెలిసి పోలీసు కంప్లయింటు ఇస్తే, వాళ్లు నాకోసం అన్వేషణ మొదలెట్టారేమో!


స్థిరంగా ఒకేచోట ఉంటే, నన్ను పట్టుకోవడం పోలీసులకి సులభమౌతుందిన్న భయం పట్టుకుంది.

పోలీసులు తరుముతున్న ఉగ్రవాదికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ నాలుగూళ్లు మారాను. పేపరు చదవాలన్నా, టివి చూడాలన్నా భయం. అలా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పది రోజులు గడిపాను. పదోరోజు నాకో కొత్త నంబర్నించి ఫోనొచ్చింది. ఎవరా అని చూస్తే, “జయసేన స్పీకింగ్” అంది అవతలి గొంతు.


తెల్లబోయాను. ప్రముఖ నిర్మాత జయసేన నాకు ఫోన్ చేశాడు. ఎలా?

అప్పుడు గుర్తొచ్చింది. ఆరోజు పార్కులో నేను జయసేన టీముకి ఇచ్చిన వివరాల్లో నా ఫోను నంబరు కూడా ఉన్నదని!


నన్ను కంటాక్ట్ చేసే ఆధారాన్ని వాళ్లకిచ్చి, నేనిన్నాళ్లూ బయటెందుకు తిరుగుతున్నట్లు? ఊళ్లెందుకు మారుతున్నట్లు?

“నమస్కారం” అంటూ నా పేరు చెప్పాను.


“వచ్చే ఆదివారం సాయంత్రం సుచేతా పార్కుకి రా. ఎవరికీ చెప్పకు. కూడా ఎవర్నీ తీసుకు రాకు” అన్నాడాయన. ఆయన గొంతులో కోపం లేదు. ఆవేశం లేదు. పైగా ప్రసన్నత ఉంది.

ప్రమాదం లేదని ఆశ పుట్టినా- ‘సినిమావాళ్లు. డైలాగ్సులో ఫీలింగ్సు బయటపెడతారా?’ అని హెచ్చరించింది మనసు.


“ఐతే ఎన్నాళ్లని ఇలా పరుగులు తీస్తావు! ఏమైతే ఔతుంది. ఆయన్ని కలవడమే దీనికి పరిష్కారం” అంది వివేకం.


ఆదివారం వచ్చింది. జయసేన మాట పాటించి ఇంట్లో విషయం చెప్పలేదు. కూడా ఎవర్నీ తీసుకెళ్లలేదు. అన్న టైముకి సుచేతా పార్కుకి వెళ్లాను.


అక్కడ లవర్స్ డెన్‌లో జయసేనతో పాటు- మునిరాజు, హీరోయిన్ కూడా ఉన్నారు.

“ఇదే షూటింగ్ అనుకో. జరిగింది జరిగినట్లుగా, అప్పటి సీన్ మళ్లీ రిపీట్ కావాలి” అన్నాడు జయసేన నాతో.


అంటే- మళ్లీ మునిరాజు చెంప చెళ్లుమనిపించాలా? లేక- ‘దీని భావమేమి?’ అని తటపటాయిస్తుంటే- “ఊఁ క్విక్” అని గద్దించాడు జయసేన.


భయపడి ప్రయత్నించాను కానీ, చెయ్యి లేవడం లేదు. “నా వల్లకాదు సార్!” అన్నాను.

అంతే! జయసేన చేతిలో రివాల్వర్ మెరిసింది.


‘ఏమిటి ఈయన ఉద్దేశ్యం! తను చూస్తుండగా నేరం చేయించి ఎన్‌కౌంటర్ చేస్తాడా?’ అనిపించింది.

‘అన్న పని చెయ్యకపోయినా, ఎన్‌కౌంటర్ తప్పదు. ఊఁ గో ఎహెడ్’ అంది మనసు జయసేన గొంతునే మిమిక్రీ చేస్తూ.


నెమ్మదిగా చెయ్యెత్తి, మునిరాజుని సమీపించాను. మునిరాజు గట్టిగా కళ్లు మూసుకున్నాడు. నా చెయ్యి అతణ్ణి తాకింది.


మునిరాజు కళ్లు తెరవలేదు. అతడి ముఖంలో పరవశం. “ప్రియా! నీ చేయి ఇంత మృదువుగా అనిపించడం ఇదే మొదటిసారి. ఎంతో హాయిగా ఉంది. అలాగే మృదువుగా నా బుగ్గలమీద రాస్తూండు. తర్వాత వాడెంత బలంగా కొట్టినా తట్టుకోగల శక్తి వస్తుంది” అన్నాడతడు.


జయసేన నన్ను చిరాగ్గా చూసి, “ఎంత మృదువుగా తాకావయ్యా, మావాడు తనను కొట్టింది అమ్మాయనుకుంటున్నాడు’ అని గాల్లోకి రివాల్వర్ పేల్చి, “దెబ్బకి మావాడు నేలమీద పడిపోవాలి. లేకపోతే గుండు సరాసరి నీ గుండెల్లోకే” అని హుంకరించాడు.


తప్పదని అర్థమైంది, మనసు చిక్కబట్టుకుని- బలంగా మునిరాజు చెంప చెళ్లుమనిపించాను.

అంతే- మునిరాజు కింద పడిపోయాడు. చెట్లమీంచి కొందరు యువకులు కిందకి ఉరికారు.

నేను గజగజ వణుకుతున్నాను. కానీ ఆశ్చర్యంగా జయసేన ముఖంలో చిరునవ్వు. రివాల్వర్ పాంటు జేబులోకి తోసి, నన్ను సమీపించి ఆప్యాయంగా భుజం తట్టాడు.


“ఆ రోజు ఇదే చెంపదెబ్బకి- అప్పటిదాకా వెనకదీస్తున్న నలుగురు పెద్ద బయర్స్ సడెన్‌గా మనసు మార్చుకుని, పిక్చర్ కొనడానికి ముందుకొచ్చారు. పిక్చర్ వసూళ్లలో వందకోట్ల క్లబ్బులోకి చేరిపోయింది. ఈ రోజు రాత్రి- ప్రొడక్షన్లో ఉన్న మా మునిరాజు పిక్చరుకి బయర్స్ మీట్ ఉంది. దాని సక్సెసుకే ఇక్కడకు నిన్ను పిలిచింది” అన్నాడు జయసేన.


ఒకసారి నేను చెంప చెళ్లుమనిపిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాకైపోయింది మునిరాజుకి. ఐనా- దాన్ని ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ అంటూ పరవశించడానికి తండ్రీ కొడుకులిద్దరూ సిద్ధపడ్డారు.

‘ప్రతిభకంటే సెంటిమెంటుకి ప్రాధాన్యమిచ్చే సినీరంగమా! నీకు నా జోహార్లు’ అనుకుంటూ అక్కణ్ణించి బయటపడ్డాను.


సినీరంగంలో రహస్యాలు దాగవు. ఈ చెంపదెబ్బ విశేషం కూడా రెండ్రోజుల్లో గాసిప్ కాలంలోకి వచ్చేసింది. అందులో నా పేరూ బయటికొచ్చింది. లోపాయికారీగా నాకు మరికొన్ని ఆఫర్సొచ్చిన ప్రస్తావన కూడా ఉంది.


మూడోరోజు రేఖనుంచి ఫోనొచ్చింది. “జయసేన పిక్చర్ చూశాను బావా! వాటే మూవీ! నువ్విప్పుడు నానోస్టార్‌వి కాదు. సెలబ్రిటీవి. నాకైతే గిగాస్టార్‌వి. అంటే మెగాకి వెయ్యిరెట్లు. అయాం ఫ్లాట్ ఫర్ యూ” అంది.


‘పెళ్లి చెంపదెబ్బతో ముడి పడిందంటే- ఇలాగా! యాజి జోస్యం ఇలా నిజమైందా?” అని ఆశ్చర్యపడ్దాను.


నా చెంపదెబ్బకి బ్లాక్‌బస్టరైన జయసేన మూవీలో విశేషమేమిటో తెలుసుకోవాలనిపించింది. బుక్‌ మై షో లో- జీయస్టీ ఎక్కువని తెలిసీ- కాంబో టికెట్టు తీసుకుని- ఆ రోజే మొదటాటకి వెళ్లాను.


సినిమా టైటిల్నించే మహా రొటీన్. మొదలై పది నిముషాలయిందో లేదో- ఉన్నట్లుండి నాకు చెంప చెళ్లుమన్నట్లు అనిపించింది. ఉలిక్కిపడి చుట్టూ చూస్తే- కనబడ్డ ప్రేక్షకులదీ అదే ఫీలింగ్ అనిపించింది. కానీ సెంటిమెంటులో మేమూ తక్కువేం కాదన్నట్లు- వాళ్లంతా మధ్యమధ్య ఈలలు వేస్తూ, ‘అబ్బ నీ తియ్యని దెబ్బ’ అని మురిసిపోతూ- ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా కొనసాగడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.


‘ప్రముఖులైనా, ప్రేక్షకులైనా- సినీరంగంలో చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ’ అనుకుని నిట్టూర్చి అడుగడుగునా తగిలే చెంపదెబ్బల్ని ఓర్చుకుంటూనే- మూవీ చూడసాగాను.


స్పష్టీకరణః ఇది సినీరంగానికే కాదు- రాజకీయరంగానికీ వర్తిస్తుందని ఎవరికైనా అనిపిస్తే- అందుకు నేను బాధ్యుణ్ణి కాను.

---0---

========================================================================

సమాప్తం


========================================================================

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.




38 views0 comments

Comments


bottom of page