top of page
Writer's pictureRamya Namuduri

ఆడపిల్ల జీవితం ఇంతేనా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.








'Adapilla Jivitham Inthena' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూడాలన్నా అత్తింటి వారి వైపు ఆంక్షలు.

చావు బ్రతుకుల్లో ఉన్న కన్న తండ్రిని పట్టించుకోలేదని పుట్టింటివారి విమర్శలు...

పుట్టినింటికి, అత్తింటికి మధ్య నలిగి పోయిన ఒక ఆడ పిల్ల కథను చాలా చక్కగా వివరించారు రచయిత్రి రమ్య నముడూరి గారు.


" అమ్మా సుజాతా..! నాన్నకి అస్సలు బాగోలేదు. నిన్నే చూడాలని కలవరిస్తున్నారు. నువ్వు బయలుదేరి రామ్మా.!" అంటూ ఏడుస్తూ ఫోన్ చేసింది సుజాత తల్లి వనజ.

" అమ్మా.. నేను ఆయన్ని ఎలాగోలా ఒప్పించి, రాత్రి బస్సుకే బయలుదేరి వస్తాను.! నువ్వు ఏడవకు. నాన్న జాగ్రత్త.!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుజాత.

' భర్త కి ఈ విషయం ఎలా చెప్పాలి.. క్రిందటిసారి పుట్టింటికి వెళ్ళినపుడు తండ్రి చేసిన పనికి, ఇప్పటికీ కోపంతో రగిలిపోతున్న భర్తతో..

'ఇప్పుడు తన తండ్రి గురించి ఎలా చెప్పాలి?

పుట్టింటికి వెళ్తాను అని ఎలా అడగాలి?'

అనుకుంటూ, జరిగిపోయిన సంఘటనలే తలుచుకుంటూ.. వాటివల్ల జరగుతున్న, జరగబోతున్న పరిణామాల గురించి కుమిలిపోతోంది సుజాత.

ఇప్పుడు తను పుట్టింటికి వెళ్తాను అని ఏం మొహం పెట్టుకుని అడగాలో.. అనుకుంటూ ఆలోచనలలో మునిగిపోయిన ఆ దీనురాలు, కాలింగ్ బెల్ మ్రోగండం తో ఉలిక్కిపడి, ఈ లోకం లోకి వచ్చింది.

కన్నీటిని కొంగుతో తుడుచుకుని, మొహం కడుక్కుని, ఒకసారి అద్దంలో చూసుకుని, ఏడ్చినట్టు ఆనవాలు లేకుండా దిద్దుకుని వెళ్లి తలుపు తీసింది.

" ఏంటి ఇంత లేటు.. తలుపు తీయడానికి ఎంత సేపు? ఆకలేస్తోంది అన్నం పెట్టు.! కాళ్ళు కడుక్కుని వస్తా.!" అంటూ విసురుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు విజయ్.!

ఈలోగా సుజాత తల్లి మళ్ళీ ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసిన సుజాత,

" అమ్మా..! నేను మళ్ళీ చేస్తాను. మీ అల్లుడు గారు భోజనానికి వచ్చారు.! " అంటూ ఫోన్ కట్ చేసింది.

విజయ్ వచ్చి సోఫా లో కూర్చున్నాడు.

ప్లేట్ లో భోజనం పట్టుకుని వెళ్లి విజయ్ కి అందించి పక్కనే కూర్చుంది సుజాత.!

అన్నం తింటూ, టీవీ లో లీనం అయిపోయిన భర్త తో..

" ఏమండీ..! మా అమ్మ ఫోన్ చేసింది.!" అంటూ ఏదో చెప్పబోతు ఉండగానే విజయ్ ఫోన్ రింగ్ అయింది.

అది వాళ్ళ ఇంటి నుండి కావడంతో.. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసాడు విజయ్.!

ఫోన్ లో అవతలి వ్యక్తి ఎం చెప్తున్నారో కానీ.. విజయ్ మొహం వెలిగిపోతోంది.!

"సరే నాన్న.. ఓకే నాన్నా..!" అంటూ ఫోన్ పెట్టేసాడు విజయ్.!

తనవైపే ప్రశ్నర్ధకంగా చూస్తూ ఉన్న సుజాత తో..

" మా తమ్ముడి ఉపనయనానికి ముహూర్తం కుదిరింది. కాకపోతే టైం తక్కువ ఉంది. ఇంక పది రోజులలో కుదిరింది ముహూర్తం. అమ్మ ఒకతే కష్టపడలేదు. నువ్వు ఇవాళ రాత్రి బస్ కి బయలుదేరి ఊరు వెళ్ళు. అమ్మకి సాయంగా ఉంటుంది. నేను ఒక నాలుగు రోజుల్లో వస్తాను.!" అంటూ మాట్లాడుతున్న భర్త వైపు ఏ భావం లేకుండా చూస్తూ ఉండిపోయింది సుజాత.!

'ఇప్పుడు తన పుట్టింటి విషయం ఎలా చెప్పాలి?' అనుకుంటూ ఉండిపోయింది.

ఇంతలో విజయ్.. సుజాత భుజం పై చేయవేసి కదిపే సరికి ఈ లోకంలోకి వచ్చింది.

" ఏం ఆలోచిస్తున్నావ్? పెరుగు వెయ్.!" అన్నాడు విజయ్.

పెరుగు తీసుకువచ్చి వడ్డీస్తూ.. ఏదైతే అది అయింది అని ధైర్యం తెచ్చుకుని...

సుజాత తన తల్లి బాధ గురించి చెప్పింది విజయ్ కి.

తింటున్న వాడల్లా.. ప్లేట్ లో చేయ కడిగేసుకుని... " మీ నాన్న చేసినది మర్చిపోయి, ఇప్పుడు నిన్ను మీ పుట్టింటికి సాయం పంపించమంటావ్ అంతే కదా..!" అన్నాడు విజయ్ ఉక్రోషంగా.!

" అది కాదండి... మీ ఊరికి మా ఊరికి అరగంట ప్రయాణం కదా...ఎలాగో ఊరు పంపుతున్నారు కదా.. పగలంతా అత్తయ్యగారికి సహాయం చేసినా.. రాత్రి పూట మా అమ్మకి సాయంగా మా ఊరు వెళ్ళడానికి అయినా ఒప్పుకోండి.!" అంటూ దీనంగా అడిగిన సుజాత మొహం చూసిన విజయ్ మనసు చలించింది.

" నీ బాధ చూడలేక ఒప్పుకుంటున్నాను. కానీ మీ నాన్న ని మాత్రం ఈ జన్మలో క్షమించను.!" అంటూ వెళ్ళిపోయాడు విజయ్.!

అతను వెళ్ళిపోయాక, తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది సుజాత.!

" పోనీలేమ్మా.. అల్లుడు ఒప్పుకోవడం గొప్పవిషయం. మీ నాన్నగారి ప్రవర్తన అతని మనసుని అంత గాయం చేసింది మరి. ఏమి చేస్తాం. జాగ్రత్తగా రా తల్లి.!" అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది సుజాత తల్లి వనజ.

ప్రయాణానికి బట్టలు సర్దుకుంది.. తన తండ్రి గురించే బాధపడుతూ..ఆ ఆలోచనలలో మునిగిపోయింది సుజాత. నెల రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమె కళ్ళలో కదలాడుతోంది.

ఒక నెలక్రితం..

అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత తండ్రిని హాస్పిటల్ లో చేర్చారు. అతనికి లివర్ సంబంధిత కాన్సర్ వచ్చింది అని, అది కూడా ఆఖరి స్టేజి లో ఉంది అని డాక్టర్స్ చెప్పారు.

కొంత చికిత్స అందించి, ఇంటికి పంపించేశారు.

ఆ వ్యాధి పర్యవసానంగా తీవ్రమైన అనారోగ్యం చేస్తూ ఉండేది ఆ పెద్దాయనకి.

కడుపు మొత్తం నీటితో ఉబ్బిపోయి, నీరు కృత్రిమ పద్దతిలో తీయవలసి వచ్చేది. ఆ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంటుంది.

'ఇక ఈ వ్యాధిని భరించే శక్తి, ఆ నొప్పి తట్టుకునే శక్తి నాకు లేదు' అంటూ 'నాకు మెర్సీకిల్లింగ్ కావాలి' అని ప్రాధేయపడేవాడు.

కానీ చూస్తూ చూస్తూ అలా ఎవరూ ఒప్పుకోలేదు.

తండ్రికి బాగోలేదు అని చూడడానికి వెళ్లిన సుజాత, ఆమె భర్త ఇంటికి వెళ్లే సరికి ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి.

లోపలికివెల్లి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు సుజాత తండ్రి.

పీక కోసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రధమచికిత్స అందిస్తూనే అంబులెన్సు కి కాల్ చేసాడు విజయ్.

పది నిముషాలకి వచ్చిన అంబులెన్సు లో హాస్పెటల్ కి తీసుకువెళ్తుండగా, కూరల బ్యాగ్ తో ఇంటికి వచ్చిన సుజాత తల్లి వనజతో కలిసి , అన్నీ అక్కడే పడేసి హాస్పిటల్ కి ఆఘ మేఘాల పై చేరుకున్నారు.

ఇది అసలు ఎవరూ ఊహించని ఘటన కావడంతో ఎవరికీ గుండె దడ తగ్గలేదు.

డాక్టర్ కుట్లువేసి, మెడిసిన్ ఇచ్చి, నయం చేసినా..

అలా కోసుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి పోలీస్ లు ఇంటికి రావడం, విజయ్ ని స్టేషన్ కి రమ్మనడం లాంటివి జరగడం... విజయ్ మనసులో బాధతో నిండిన కోపానికి తెర లేపింది.

ఆనాటి నుండీ విజయ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.

"ఇంత మంది బంధువులు, అయిన వాళ్లు, నేను, అందరం ఆర్ధికంగా ఆదుకుంటున్నా కూడా... ఇలాంటి పిరికి పనీ ఏమిటి?

ఆయన వల్ల ఎప్పుడూలేనిది నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది.! " అంటూ సుజాత మొహమ్మీదే చాలా సార్లు అనేస్తున్నాడు.

అదే సుజాత మనసుని క్షోభ కు గురించేస్తోంది.!

ఇప్పుడు కూడా తమ్ముడి ఉపనయనం ఉంది కాబట్టి ఊరు పంపిస్తున్నాడే కానీ, తన తండ్రికి చివరి రోజులు అని కాదు. ఒక పూట అయినా వెళ్ళడానికి, తల్లి దగ్గర ఉండడానికి ఒప్పుకున్నాడు అదే చాలు అనుకుంటూ ఉండిపోయింది సుజాత.

అలా సాయంత్రం అయింది. విజయ్ వచ్చి, ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కించాడు. మనసంతా బాధతో మెలిపెట్టేస్తోంది సుజాతకి.

" నాకు చాలా కష్టంగా ఉంది. నా పుట్టింటికి నేను వెళ్ళడానికి స్వేచ్చలేదు. ఒక్క పూట మాత్రమే, అది కూడా రాత్రిళ్ళు ఉండడానికి మాత్రమే ఒప్పుకుంటారా?

ఇదే సమస్య అతని తండ్రికి వస్తే...!" అని మనసులోనే బాధపడుతూ...తన తలరాత ఇంతే అని సర్దిచెప్పుకుంటూ... ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సుజాత.

కదిలే బస్సు.. కాలానికి మల్లె ఆగకుండా.. ఆమెతో పాటే ఆమె బాధను కూడా మోస్తూ... ముందుకు సాగిపోయింది.

తెలవారుతూనే అత్తవారి ఊరు చేరుకుంది సుజాత. ఆమె మరిది వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు.

ఎప్పటిలాగే ఆమెకు ఈపూటా ఏ ఆదరణ లేదు.

ఇంటికి రాగానే అత్త, మామల కాళ్ళకి దండం పెట్టి, అత్తగారు చెప్పిన పనులన్నీ చేస్తూ పగలు వెళ్ళబుచ్చింది.

రాత్రి భోజనాలు కూడా సిద్ధం చేసి పెట్టి , పుట్టింటికి బయలుదేరింది.

అరగంట ప్రయాణం తరువాత పుట్టి పెరిగిన ఇంటికి చేరింది.

ఆఖరి రోజులలో తండ్రి పడుతున్న దీనావస్థ, తల్లి చేస్తున్న సపర్యలు చూస్తూ.. మౌనంగా రోదించింది సుజాత.

ఆ పూట అంత ఆ తల్లి కూతుర్లు.. ఆ పెద్దాయన మంచం దగ్గరే కూర్చుని, వారి పేదరికపు,దీన స్థితి కి తోడైనా అనారోగ్యం గురించి బాధపడుతూ...

వారి కష్టాన్ని కన్నీటి రూపంలో కరిగించుకుంటూ.. ఆ రాత్రిని కరింగించారు.

వారి బాధ నేను చూడలేనంటూ... చంద్రుడు బాధాతప్త హృదయడై.. మబ్బులను కౌగాలించుకుని ఏడుస్తూ...

సూర్యుడ్ని ముందుకు తోసాడు.

తెలవారంగానే.. మళ్ళీ అత్తింటికి వెళ్ళిపోవాలి కదా...

తన కోడలి బాధ్యత నెరవేర్చందుకు వెళ్ళిపోయింది.

అలా పగలు అత్తింట్లో చాకిరీ చేసి, రాత్రి పూట పుట్టింట్లో సాయంగా, తల్లికి ధైర్యంగా .. తండ్రి చివరి రోజులని గడిపింది సుజాత.

విజయ్ శెలవు పెట్టుకుని ఊరు వచ్చాడు.

ఈ నాలుగు రోజులుగా... సుజాత పడుతున్న మానసిక వేదన, అతని మనసు కూడా కరిగిందేమో...

సుజాతను పుట్టింట్లో వదిలిపెడితూ....

" నువ్వు మీ నాన్నగారి దగ్గరే ఉండు. ఇక్కడి పనులు నేను చూసుకుంటాను ఈ రెండురోజులు.

అవతల ఎల్లుండి పెళ్ళికొడుకుని చేసే టైం కి అక్కడికి వద్దువుగాని.!" అని చెప్పేసరికి ఆ తల్లి కూతుర్ల మొహంలో సంతృప్తి కనిపించింది విజయ్ కి.

ఆ రెండు రోజులు తండ్రికి సపర్యలు చేసుకుంటూ.. తల్లికి సాయంచేస్తూ గడిపింది సుజాత.

ఇక ఆ రోజూ రానే వచ్చేసింది.

తల్లితండ్రుల వంక బాధగా చూసి, తండ్రి పక్కనే కూర్చుని,

" నేను మళ్ళీ వస్తా...నువ్వు జాగ్రత్త నాన్న.!' అంటూ ఉంటే...

అప్పటికే మాటలు కోల్పోయిన ఆ తండ్రి కంట కన్నీటి రూపంలో సమాధానం వచ్చింది. అయినా గుండె రాయి చేసుకుని, పెద్ద కోడలిగా తన బాధ్యత నెరవేర్చందుకు, మరిదిని ఒడుగు పెళ్ళికొడుకుని చేసేందుకు అత్తారింటికి వెళ్ళింది సుజాత.

విజయ్ తప్ప.. మిగతా అందరూ ఆమెను ఒక దోషిగా చూసారు." మరిది ఒడుగు పెట్టుకుని పుట్టింట్లో కూర్చుంది పెద్ద కోడలు మళ్లీను...!" అంటూ దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు.

" నువ్వు వాళ్లెవరిని పట్టించుకోకుండా ధైర్యంగా ఉండు సుజాత.! నీ భర్త ని నేనే చెప్పాను. నిన్ను అక్కడే ఉండమని. ఈ ఒడుగు అయిపోయాక నీకు కావాల్సినన్ని రోజులు మీ నాన్న గారికి సపర్యలు చేసుకుందువుగాని. నీ భర్తని నేనే చెప్తున్నా.. అడ్డమైనవాళ్ల మాటలు నువ్వు పట్టించుకోకు. మామయ్య గారంటే నాకు కూడా ఇప్పుడు కోపం లేదు.! నీతో కఠినంగా ప్రవర్తించిందుకు క్షమించు.!" అంటూ ధైర్యం చెప్పాడు విజయ్.


అలా ఆరోజు విజయ్ తమ్ముడిని ఒడుగు పెళ్ళికొడుకుని చేసింది సుజాత. పేరంటం అంతా చాలా చక్కగా జరిపించింది ఆ ఇల్లాలు. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక, సుజాత మనసు ఏదో కీడుని సంకించడం మొదలుపెట్టింది. ఏదో తెలియని బాధ, దిగులు ఆమెను చుట్టు ముట్టింది.

విజయ్ ఆమె పరిస్థితి అర్ధం చేసుకుని ఆమెను ఓదార్చసాగాడు. ఇంతలో ఆమె ఫోన్ మ్రోగింది. ఆ రింగ్ ఆమె గుండె వేగం పెంచేసింది. డిస్ప్లే లో ఉన్న పేరు చూసి,

" అమ్మ.. ఫోన్ చేస్తోంది. మా నాన్న కి ఏమి కాలేదు కదా..!" అంటోంది. కానీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతోంది.

ఆమె చేతులు వణికి పోతున్నాయి.

సుజాత చేతిలో నుండీ,విజయ్ ఫోన్ తీసుకుని ఆన్ చేయగానే.. అతని కన్నుల వెంబడి నీరు... సుజాత గుండెను ముక్కలు చేసేస్తోంది.!

అతను ఫోన్ కట్ చేసి...

సుజాతను దగ్గరకు తీసుకుని.. "మీ నాన్నగారు... ఇకలేరు.!" అని చెప్పాడు.

ఆ క్షణం సుజాత కుప్పకూలిపోయింది. ఆమెకు అంతా శున్యం లా కనిపించింది. శోకంతో గుండె బ్రద్దలైపొతోంది.

"ఈ కష్టం నేను భరించలేను..! నాన్న లేరు అంటే నాకు చాలా కష్టంగా ఉంది.!" అంటూ గుండెలవిసేలా ఏడుస్తోంది.

" అయ్యో.. అయ్యో.. నిండు ఇంట్లో ఇలా ఏడవకూడదు అమ్మాయ్.! బుజ్జి గాడిని ఒడుగు పెళ్ళికొడుకుని చేసాం కదా..! మీకు పక్షిణి. ఇక నువ్వు, నీ మొగుడు ఇక్కడ ఉండకూడదు. నీ పుట్టింటికి వెళ్ళు. ఒడుగు సంగతేదో మేమే అఘోరిస్తాం..!" అంటూ నిష్ఠురంగా మాట్లాడింది ఒక పెద్దావిడ ( వయసులో మాత్రమే )

అసలే తండ్రిని కోల్పోయిన బాధలో ఆ మాటలు సుజాత మనసుని ఛిద్రం చేసాయి.

బాధగా భార్యని పుట్టింటికి తీసుకువెళ్ళాడు విజయ్.

గుమ్మంలో కాలు పెట్టగానే....

"నీ తండ్రి చచ్చిపోతాడు అని తెలిసినా.. అత్తింటి వైభవం మరిగి... పండగ చేసుకునేందుకు పోయావా..?" అన్నారు పుట్టింటి బంధు గణం.!

తన తప్పులేకుండా... రెండు కుటుంబాల ముందూ అపరాధిలా నిలబడింది సుజాత..

"""ఆడపిల్ల జీవితం ఇంతేనా...!? ఈ కష్టం పగ వాడికి కూడా రాకూడదు.!""" అంటూ..తండ్రీ శవంపై పడి ఏడుస్తూ... 😭

***************************************

ఇటువంటి క(వ్య )ధలకు ముగింపు ఉంటుందా 😭?

పుట్టినింటికి, అత్తింటికి మధ్య నలిగిపోతున్న సోదరీమణులకు ఈ కథ అంకితం 😭🙏

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.


341 views0 comments

Comments


bottom of page