'Adrushtaniki Chirunama' written by Yasoda Pulugurtha
రచన : యశోద పులుగుర్త
నా ఫ్రెండ్ వైష్ణవి గురించి చెప్పాలి ముందు. అదీ నేనూ హైస్కూల్ నుండి డిగ్రీవరకూ ఒకే స్కూల్ , కాలేజ్ లో చదివాం.. దాని ఆశలూ, కోరికలకు ఎల్లలు ఉండేవి కావు.. అప్పుడప్పుడు దాన్ని చూస్తూ అనుకునేదాన్ని, దీని కోరికలూ, ఆశలకు తగ్గట్లుగా దేవుడు కలవారింట్లో పుట్టించవలసి ఉండేదని.. అది మాత్రం నాతో అనేది, 'భగవంతుడికి కూడా వలపక్షమేనే పల్లవీ , ఎందుకు కొందరిని అత్యంత ధనవంతుల ఇళ్లల్లో పుట్టిస్తాడు, నన్నుకూడా అక్కడే ఎందుకు పుట్టించలే'దంటుంది.. ఎవరైనా తన ముందు అత్యంత ఖరీదైన కార్లలో వెళ్లిపోతుంటే, 'చూడు చూడు, ఆ కారులో ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉందో కదా! అదేనే ఐశ్వర్యపు అందం.. మనలాంటి వాళ్లం ఎంత అందంగా ఉన్నా కంటికి కనపడం.. ఆ అమ్మాయి అందంలో ఒక మెరుపు ఉంది, హోదా ఉంది, అ అందాన్నిమరింత మెరుగులు దిద్దకునే స్తోమత ఉంది.. అందుకనే ఆ అమ్మాయి అందరినీ ఆకర్షిస్తుందే అంటుంది.. కారులో వెడ్తున్న ప్రతీ అమ్మాయి బాగుంటుంది, కావాలంటే ఛాలంజ్' అంటుంది..
వైష్ణవి మనస్తత్వం ఏమిటంటే ఏదైనా అది కోరుకున్నది వెంటనే జరిగిపోవాలి.. జరగక పోతే చాలు " ప్చ్ ...... అదృష్టం ఉండాలే బాబూ , అందుకే జరగలేదు” అని వాపోతుంది. ప్రతీ చిన్న విషయానికి ‘అదృష్టం లేదు, అందుకే జరగలేదు’ అంటుంది. దాని దృష్టిలో తను తప్ప అందరూ అదృష్టవంతులే లోకంలో. తన ఆడపడుచు వాళ్లు కొత్త మోడల్ కారు కొనుక్కున్నారు. ఆ విషయం చెపుతూ ‘కారు కొన్నారు. అదృష్టం కదా!’ అంటుంది. నిజానికి మా వైషూ వాళ్లది మధ్యతరగతి కుటుంబం, నాదీ అంతే..
మంచి, చదువు, ఉద్యోగం, ఆస్తి అంతస్తు ఉన్న అబ్బాయి తనను పెళ్లాడాలని కలలుగంది.. తనలాగే మధ్యతరగతి కుటుంబంలోని శ్రీరామ్ తో తన వివాహం కుదిరిందని చెపుతూ, "దేనికైనా లక్ ఉండాలి కదే పల్లూ" అనగానే నేను దాన్ని కోప్పడ్డాను.. నీ అదృష్టానికి ఇప్పుడేమైందంటూ.. “చక్కని ఉద్యోగం, అందగాడు శ్రీరామ్.. అంతకంటే ఏమికావాలే వైషూ, ప్రతీదాన్నీ పోల్చుకోకుండా చూసుకుంటే నీవు చాలా అదృష్డవంతురాలి”వంటూ అభినందించాను.. ..
వాళ్లాయన శ్రీరామ్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లో సూపర్వైజర్ పోస్ట్ లో ఉన్నాడు. పెళ్లవడం, వెంట నెంటనే ఇద్దరు పిల్లలు పుట్టేసారు దానికి. అతను ఎంతో మంచివాడు, నెమ్మదస్తుడు, జీవితం పట్ల ఎంతో ముందు చూపు కలవాడు. మా వైషూ అటువంటిది కాదు. దానికి డాబు దర్పం కావాలి.
ఫాల్స్ ప్రిస్టేజ్ ఉంది దానికి. తన కంటే ఎక్కువ స్టేటస్ ఉన్న వాళ్లతో పోల్చుకుంటూ ‘తనకి అంతటి అదృష్టం లేదు కదా అందుకే అన్నింటికి ఎడజస్ట్ అయిపోవలసివస్తోంది’ అని వాపోతుంది. దానికి, నాకు ఈ విషయంలో ఎన్నో సార్లు వాదోపవాదనలు జరిగాయి. తొందరగా కోపం వచ్చేస్తుంది దానికి. పోనీలే పాపం అన్న సానుభూతి నాకు దాని మీద.
నిజానికి నాకు తెలిసినంతవరకు అది అదృష్టవంతురాలు కాదా? తనకు ఏం తక్కువ ? ఈ మధ్యనే భర్త టూ బెడ్ రూమ్ ఫ్లాట్ బేంక్ లోన్ తీసుకుని కొన్నాడు.
గృహప్రవేశానికి తనూ వెళ్లింది. ఫ్లాట్ అంతా చూపిస్తూ, త్రీ బెడ్ రూమ్స్ ఫ్లాట్ కొనమని పోరానే శ్రీరామ్ ని.. ససేమిరా నా మాట వినలేదు.. ‘పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్నారు, వాళ్లూ చదువులూ అవీ ఉంటాయి.. మన తాహతుకు మించిన కమిట్ మెంట్స్ చేయకూడదు, మనం హాయిగా సదుపాయంగా ఉండడానికి ఒక గూడు ఉంటే చాల’న్నాడుట.. ముఖం ముడుచుకునే ఉంది.. సొంత ఇల్లు కొనుక్కున్నామన్న ఉత్సాహమే లేదు దాని ముఖంలో.. ప్రేమగా చూసుకునే భర్త, ముచ్చటైన పిల్లలు, అనురాగ దాంపత్యమే దానిది. ఎందుకు ఎప్పుడూ ఏదో అసంతృప్తికి లోనౌతుంది?
వాళ్ల అక్కా బావగారూ ఆ మధ్య ఎప్పుడో నార్త్ ఇండియా టూర్ ఫ్లైట్ లో ఫామ్లీ తో వెళ్లారుట. ఆ విషయం తెలిసి ఇది ఒకటే వాపోవడం, ‘చక్కగా నార్త్ ఇండియా అంతా టూర్ చేసారు , అదృష్టం కదే’ అంటుంది. ఎవరి స్థాయిని బట్టి వారిని అదృష్టం వరిస్తూనే ఉంటుంది కదా? మరి ఇన్ని ఉన్న తను అదృష్టవంతురాలు కాదంటే , రోడ్డు మీద అడుక్కునే బిచ్చవాడు, ఇల్లులేక ఏ రోడ్డు పక్కనో, లేక ఏ పేవ్మెంట్ పక్కనో నిద్రపోతాడు, అడుక్కుంటేగాని పొట్ట గడవదు, అతను అదృష్టవంతుడా?
మరి ఆ బిచ్చగాడు తమలాంటి వాళ్లను చూసి ఏమనుకోవాలి మరి?
దీనికి జ్ఞానోదయం ఎప్పడౌతుందా అనుకుంటాను..
ఒక ఆర్నెల్లు కాలం గడచిపోయింది.. ఒకసారి రావే పల్లూ అంటూ వైష్ణవి ఫోన్ కాల్స్, అలకలు.. ఎందుకొస్తావులే అంటూ నిష్టూరాలూ..
ఒకరోజు సర్ ప్రైజ్ చేయాలని ముందు వస్తున్నానని చెప్పకుండా వైషూ ఇంటికి వెళ్లాను.. నన్ను చూడగానే అమాంతం నన్ను కౌగలించుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేసేసింది.. ‘ఒక్క క్షణం’ అంటూ వేడి వేడిగా ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చింది.. ఆతరువాత లంచ్ ఏర్పాటుకు కూరగాయలు కట్ చేస్తుంటే, నేనే అడిగాను.. “ఆ......వైషూ! ఇప్పటికైనా నీ ఆలోచనలలో మార్పు వచ్చిందా, ఇంకా అదృష్టం లేదు, అది లేదూ, ఇది లేదూ అంటూ బాధపడిపోతున్నావా” అని అనగానే ఫక్కున నవ్వేసింది అది..
“ఫోవే పల్లూ, నేనెప్పుడూ దేనికో దానికి అసంతృప్తిగా ఉంటాననేకదూ, బాగా లోకువైపోయానే నీకూ” అంటూ అలకముఖం పెట్టేసరికి దాన్ని ప్రసన్నం చేసుకోడానికి తెగ జోకులేసి నవ్వించేసరికి మామూలుగా అయిపోయింది..
ఆ మధ్య ఒకసారి వాళ్ల ఆయన హెడ్ ఆఫీస్ నుండి రీజినల్ మానేజర్ వచ్చారుట. ఆయనతోబాటే వారి సతీమణి కూడా వచ్చిన సంధర్భంగా ఫామ్లీ గెట్ టుగెదర్ ఒక మంచి రిసార్ట్ లో ఏర్పాటుచేసి స్టాఫ్ ఫేమిలీస్ అందరినీ ఆహ్వానించారుట.. తనకు వెళ్లడం అసలు ఇష్టం లేదన్నా భర్త బలవంతం చేస్తే పిల్లలను తీసుకుని పార్టీ కి వెళ్లినట్లుగా చెప్పింది.
నీకు తెలుసా పల్లూ, చాలా సింపుల్ గా వెళ్లాను, కాటన్ కలంకారీ పాటియాలా డ్రస్ లో.
" ఏం, పట్టుచీర కట్టుకోలేదా వైషూ” అనగానే “అవును, నీవు ఈ ప్రశ్న అడుగుతావని తెలుసు పల్లూ , శ్రీరామ్ కూడా ఇలాగే ఇన్నాడు, మొన్న గృహప్రవేశానికి కొన్న పట్టు చీర కట్టుకో” అన్నాడు, నేను “ఊహు కట్టుకోను” అనగానే, “ఏం? ఎందుకు? ఇష్టపడే కొనుక్కున్నావుగా” అంటే ... “అవును ఇష్టపడే కొనుక్కున్నాను .. పట్టుచీర కట్టుకుంటే దానికి సమానంగా బంగారు నగలు పెట్టుకుంటేనే దానికి విలువ” అనగానే శ్రీరాం ముఖం ముడిచేసుకున్నాడు..
“అసలు నీకు వెళ్లడం ఎందుకు ఇష్టం లేదే?” అని దాన్ని అడిగాను.
“అది అంతే లేవే, ఆ హైక్లాస్ ఫామ్లీస్ తో కలవలేననిపించింది. మావారా సూపర్వైజర్ కేడర్ లో ఉన్నారు. అసలు వాళ్లు నన్ను పలకరిస్తారా, నా వైపైనా కనీసం చూస్తారా” అని అనుకుందిట. ఇది ఇలా అంటుందిగాని మా వైషూ ఎలా ఉంటుందో చెప్పలేదుకదూ ? ఇద్దరు పిల్లల తల్లైనా సన్నగా, నాజూగ్గా బాపు బొమ్మలా ఉంటుంది. కాలేజ్ లో చదువుకునే అమ్మాయిలా ఉంటుంది.
" ఎంత బాగుంటావే వైషూ అంటే కోపంతో మీద పడుతుంది. అది తప్ప లోకంలో అందరూ అందగత్తెలే , అదృష్టవంతులే అంటుంది.
ఇంతకీ పార్టీ ఎలా జరిగిందే అని అడిగాను.. బాగానే జరిగిందని, తను ఒక్కర్తీ ఒక పక్క కూర్చుని ఉంటే ఆర్ ఎమ్ గారి సతీమణి మిసెస్ గీతారామన్ చొరవగా తన దగ్గరకు వచ్చి తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని చొరవగా మాటలు కలిపిందిట.. తమిళం కాకుండా తెలుగులో కూడా చాలా స్పష్టంగా మాటలాడిందిట. ఎంత సింపుల్ గా అలంకరించుకున్నా అందరిలో మెరిసిపోతోందిట. ఆవిడ చిరునవ్వు ఎంత సమ్మోహనంగా ఉందో తెలుసా పల్లూ, చల్లని వెన్నెలలాగ ఆహ్లాదకరంగా ఉందని, ఆవిడను అలా ఎంతసేపైనా చూస్తూ ఉండచ్చే అంటూ చెప్పుకు పోతోంది. అలా చెపుతుంటే దాని కళ్లల్లో ఒక మెరుపు కనిపించింది. దాన్ని ఎప్పుడూ అలా చూడలేదు నేను. ఇంతకీ అది చెప్పిన విషయం ఏమిటంటే తనతో చాలా ఆప్యాయంగా మాటలాడిందనీ, తన పిల్లలిద్దరినీ ముద్దుచేస్తూ, పార్టీ జరుగుతున్నంతసేపు తన పిల్లలను తన దగ్గరే ఉంచుకుని వాళ్లతో కబుర్లు, నవ్వులతో గడిపిందని, మీరు చాలా అదృష్టవంతులు వైష్ణవీ, ముద్దులు మూటకట్టే ముత్యాల్లాంటి పిల్లలు, మీరు, మీవారూ కూడా చూడచక్కని జంట అంటూ ఒకటే అభినందించడంట.
చాలా సేపు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకున్నామని వైషూ చెప్పింది.. వైషూ ఇంగ్లీష్ వాగ్ధాటికి ఆశ్చర్యపోతూ ఏమి చదువుకున్నారు వైష్ణవీ అంటూ అడిగిందట.. బికామ్ వరకు కాలేజ్ లో చదివి ఆ తరువాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎమ్ కామ్ చదివానని, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నానని చెప్పిందిట.. అరె...... నాకు చెప్పారు కాదే, ఎక్కడో ఎందుకు, మీ వారు పనిచేస్తున్న బ్రాంచ్ లోనే మీకు అకౌంటెడ్ జాబ్ చూస్తానని చెప్పారుట.. ఇది గాలిలోకి తేలిపోతున్నట్లుగా హడావుడి హాడావుడి గా ఆవిడ గురించి చెప్పేస్తోంది..
మీరు ఈ పటియాలా డ్రస్ లో చాలా అందంగా ఉన్నారు వైష్ణవీ అని తనని అదేపనిగా మెచ్చుకుందిట. ఇంత పొడవైన ఒత్తైన జడను ఎలా మెయిన్ టైన్ చేస్తున్నారంటూ అబ్బుర పడిందిట.. వీడ్కోలు తీసుకుంటూ, పిల్లలను తీసుకుని దసరా శెలవల్లో చెన్నై రమ్మనమని, ఫ్లైట్ టికట్స్ ఎరేంజ్ చేయిస్తానని చెప్పి ప్రామిస్ చేయించుకుందట. అదీ దాని సంతోషం. అది పార్టీ నుండి బైటకు వస్తూ వాళ్లాయనతో అందిట " మీ ఆర్.ఎమ్ గారి భార్య ఎంత మంచి ఆవిడ, అస్సలు గర్వం లేదుకదా అని".. దానికి శ్రీరామ్ “అవును వైషూ , గీతా మేడమ్ గురించి మా ఆఫీస్ స్టాఫ్ చెప్పుకుంటూ ఉంటారు.. చాలా మంచి ఆవిడని, పాపం చాలా దురదృష్టవంతురాలని కూడా ! "
“ ఆ... ఏమన్నారూ... ఆవిడ దురదృష్టవంతురాలేమిటండీ? మంచి పొజిషన్లో ఉన్న భర్త, స్టేటస్.. ఇంతకంటే ఏమికావాలంటూ"..
“ అదృష్టం అంటే అదేనా వైషూ, నీకు ఇంతకంటే ఏమీ అర్ధం కావడంలేదనుకుంటా. అన్నట్లు నీకు తెలియదేమో, ఆవిడకు పిల్లల్లేరు.. ఒకసారి బాబు పుట్టి మూడేళ్ల వయసులో గుండెలో హోల్ ఉందని ఆపరేషన్ చేయిస్తే సక్సెస్ కాలేక చనిపోయాడుట పాపం.. తరువాత రెండు సార్లు ఎబార్షన్స్, ఇంక పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయారుట” “అవునా?” అంటూ వైష్ణవి షాక్ అయిందట. ‘చాలా బాధ పడ్డానే పల్లూ విషయం తెలిసాక’ అంది.
అప్పుడు అన్నాను వైషూతో... " ఇప్పుడు చెప్పు అదృష్టం అంటే ఏమిటో? ఎప్పుడూ నీవు తప్ప లోకంలో అందరూ అదృష్టవంతులే అంటావు, అదృష్టం నిన్ను చిన్న చూపు చూస్తుందంటూ వాపోతావు, నేను చెప్పినా వినవు, కోప్పడతావు, ఎవరు అదృష్టవంతులు? నీవా, ఆ ఆర్. ఎమ్ గారి సతీమణా ? చూడవే, ప్రతీ వారికీ ఏవో బాధలు, తీరని కోరికలంటూ ఉంటూనే ఉంటాయి. కొంతమంది పైకి కనబడరు. మీ ఆర్.ఎమ్ గారి భార్య చూడవే పాపం, పిల్లలు కలగరని తెలిసినా ఆ దుఖాన్ని పైకి కనబడనీయకుండా చల్లగా చిరునవ్వు చిందిస్తూ ఎంత అభిమానంగా మాటలాడిందో. ఇప్పటికైనా తెలుసుకోవే " అదృష్టం అంటే లక్షల కోట్ల సంపద వుండటం కాదు . ఉన్నదానితో తృప్తి పొంది దాంట్లోనే ఇంకొకరికి సాయం చేసే మనస్సు ఉండటం. అయినా గీతా మేడమ్ దురదృష్టవంతురాలు కాదంటాను, ఎందుకో చెప్పనా వైషూ? ఆవిడ ఎల్లవేళలా నవ్వుతూ ఉండే ఆ పగడాల పెదాలనెపుడూ అదృష్టం హత్తుకునే ఉంటుంది. ఆ చిరునవ్వే ఆవిడకు వెలకట్టలేని అదృష్టం..”
వైష్ణవి చిరునవ్వుతో తల ఊపుతూ, " నిజమేనే పల్లూ, గీతా మేడమ్ గారిని చూసాక నాలో, నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందే.. ముందర ఆవిడను చూడగానే అనుకున్నాను, భగవంతుడు అందంతోపాటూ, ఆస్తీ , ఐశ్వర్యం, హోదా అన్నీ ఇచ్చాడు ఈవిడకు, ఎంత అదృష్టవంతురాలూ అనుకుంటూ ఈర్ష్యపడ్డాను.. కానీ, ఆవిడ అందమైన చిరునవ్వువెనుక ఎంతటి ఆవేదన దాగి ఉందో తెలిసాక నా హృదయం బాధతో కదిలిపోయింది” అంటూ నిట్టూర్చింది..
“నీలో మార్పు రావాలనే నేను కోరుకున్నాను వైష్ణవీ.. అదృష్టానికి చిరునామా ఏమిటీ అంటే ఎవరూ చెప్పలేరు.. అది ఎవరిని వెతుక్కుంటూ, ఎప్పుడువస్తుందో గొప్ప గొప్ప మహానుభావులే చెప్పలేరు.. మనమెంత? ఇంతకీ అన్నం పెట్టవే బాబూ, కడుపులో ఆకలి దంచేస్తోం”దంటూ పల్లవి వైష్ణవిని తొందర పెట్టింది..
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
Comments