Agree..Culture Written By Sridhara Kumar Chittela
రచన : శ్రీధర కుమార్ చిట్టేల
చెన్నై నుండి కారులో తన సొంత ఊరికి బయల్దేరాడు బంగారు నాయుడు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో ఉన్న చిన్నపాటి పట్టణం వారి ఊరు. అక్కడున్న పొలాలు, తోటలు కౌలుకిచ్చి తన పిల్లల చదువుల కోసం చెన్నై కి మకాం మార్చాడు నాయుడు. అక్కడే బిజినెస్ కూడా!! రెడ్ హిల్స్ దాటాక కారు వేగం పెంచాడు డ్రైవర్. సాధారణంగా డ్రైవర్ తో మాట్లాడటం అరుదుగా చేస్తూ ఉంటాడు. ఊరిలోని ఒక పేద కుటుంబాన్ని అందరించినాడన్న మంచిపేరు కోసం ఒక రైతు కూలీ కొడుకుని డ్రైవర్ గా పెట్టుకున్నాడు. మరోవిధంగా, చెన్నై డ్రైవర్లతో పోలిస్తే వీడు చౌకగా దొరికినట్టే! ఊరి వాడని అతిచనువిచ్చి నెత్తినెక్కించుకోకూడదని గంభీరంగా, తక్కువగా మాట్లాడుతుంటాడు నాయుడు. కారులో ఏ.సీ. కాస్త పెంచుకొని, ఆడియో సిస్టంలో పాటలు పెట్టించుకొని, వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నాయుడు. దగ్గరే అయినా, సొంత ఊరికి ఎప్పుడో కానీ వెళ్ళడు. డబ్బుల వసూళ్లకి, బ్యాంకులో పంట రుణాల రెన్యువల్ కి మాత్రమే వెళుతుంటాడు. కానీ ఈ ప్రయాణానికి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రశేఖర్ అనే చిన్న రైతు ఉన్నాడు ఆ ఊర్లో. ఉన్నది నాలుగైదు ఎకరాల పొలం అయినా పంటల మార్పిడి ద్వారా, అంతర పంటల ద్వారా ఏడాది పొడవునా పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాడు. అతడి నీటి వాడకం, సేంద్రియ ఎరువుల వాడకం తెగుళ్ల రక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు వినూత్నంగా ఉండటంతో, కొందరు వాటిపై పరిశోధనలు చేసి ఇతర ప్రాంతాల్లో కూడా వాటిని అమలు చేశారు. తద్వారా అతడికి "ఆదర్శ రైతు" అని అవార్డు కూడా ఇచ్చారు. పత్రికల్లో టీవీల్లో కూడా అతని గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రచురణ కావడం, ప్రసారం కావడం జరిగింది. తమ ఊరి వాడిని తాము కూడా సత్కరించడం సబబుగా ఉంటుందని ఊరి పెద్దలు నిర్ణయించి, ఊరికంతటికి పెద్ద కుటుంబం కాబట్టి బంగారు నాయుడిని ముఖ్య అతిథిగా పిలిపించారు. బంగారు నాయుడి తండ్రి చనిపోయిన తర్వాత గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తననే పిలిచి గౌరవం చాటుకుంటూ ఉంటారు ప్రజలు. కళ్ళు తెరిచేసరికి బంగారు నాయుడి ఇంటి ముందుకి వచ్చింది కారు. ఆ ఇంట్లో దాయాదులు ఉంటున్నారు. కారు రావడం గమనించిన పొలం పనులు చూసే వాళ్ళు, ఇంటి పనులు చూసే వాళ్ళు పరుగున వచ్చారు. బంగారు నాయుడు లోనికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. "ఏం పళని స్వామి? వడ్ల డబ్బులు వచ్చినాయా?" అడిగాడు నాయుడు. "ఇల్లింగే! రైతులు ఎల్లార్ కు కలిపి మీ అకౌంట్లో పోట్టు న్నా రంగా!ఇంకా కైలో తీసుకోలే" బదులిచ్చాడు పళనిస్వామి. "అదిచెప్పే కదరా.. మొన్న చెక్కు రాయించుకున్నావు? ఇంకా డబ్బులు తీసుకోలేదా?" అసహనం గా అడిగాడు నాయుడు. " ఇల్లే... బ్యాంకులో పణం లేదాంట అయ్యా!.. క్యాష్ తీసుకోకుండా..అకౌంట్ లోకి మార్చుకుంటే... మార్చుకోండి అంటున్నారు బ్యాంకోళ్లు " అని వినయంగా చెప్పాడు పళనిస్వామి. "అకౌంట్లు అందరికీ యాడ ఉంటాయి రా?.. ఆ డబ్బులు మావి కాదు.. వడ్లు అమ్మితే వచ్చిన డబ్బులు. రైతులందరికీ పంచి పెట్టాలని చెప్పకబో యినావా?" "చెప్పినా వినలేదు అయ్యా! అంత పెద్ద డబ్బు డ్రా చేసుకోవాలంటే పాన్ కార్డు నెంబరు ఇవ్వాలన్నారు" "మనం రైతులం! రైతులకి పాన్ కార్డు ఎందుకు ఉంటది రా? నువ్వు ఒక అరివు కెట్ట ముండం!! నిన్ను చూడగానే బ్యాంకోళ్లు అట్ట చెప్పినారు. ఏం రా?.. రామ్మోహన్!.. నువ్వు చదువుకున్నోడివి కదా. నువ్వు బోరాదూ బ్యాంకుకి?" పక్కన ఉన్న యువకుడిని అడిగాడు బంగారు నాయుడు. రామ్మోహన్ ఇది వరకే వెళ్లి వచ్చాడు కాబట్టి వెంటనే బదులిచ్చాడు " అయ్యా ఇంతకు ముందు మాదిరి లేదు ఇప్పుడు. బ్యాంకు కి పోయిన ప్రతిసారి ఆధార్ కార్డు జిరాక్స్ అడుగుతా ఉండారు. ఎన్నిసార్లు ఇచ్చినా మల్ల ఇయ్యాల్సిందే! పాన్ కార్డు లేకపోతే అసలు అకౌంట్ కూడా ఓపెన్ చేయడం లా!. యాభై వేలు డబ్బు కట్టాలన్నా, తీసుకోవాలన్నా పాన్ కార్డు నెంబరు రాయమంటారు ఉన్నారు. ఏడాది లో ఇరవై లక్షలు మించి డబ్బులు తీసుకుంటే టాక్స్ కట్టాలంట. ఇచ్చేవాళ్ళు అకౌంట్ నుండి తీసుకునే వాళ్ళ అకౌంట్లోకి మార్చుకోవలసిందే అంట! రోజువారీ ఖర్చుకి లక్షల అవసరం ఎందుకు ఉంటుంది, యాభై వేలు కావాలంటే తీసుకోమంటున్నారయ్య " వివరంగా చెప్పాడు రామ్మోహన్. ఆశ్చర్యపోయాడు బంగారు నాయుడు. "ఇదేందిరా!.. మనూరేమన్నా పెద్ద సిటీనా? తిరుపతా! మద్రాసా!! అకౌంట్ లోకి అకౌంట్ లోకి మార్చుకొనేది ఏంది? మొన్న రోడ్డు పక్కన పొలం అమ్మినప్పుడు కోటి రూపాయల డబ్బు.. క్యాష్.. రెడీ క్యాష్ తీసుకుపోయి అదే బ్యాంకులో నేనే కట్టినా కదా! ఆ మేనేజర్ నాకు కూల్డ్రింకులు ఇప్పించి ఫిక్స్డ్ డిపాజిట్ వేయించుకున్నాడు కదా! పానూ అడగలేదు- గీనూ అడగలేదు. మన డబ్బులు మనకు ఇవ్వడానికి ఇన్ని రూల్సా?...ఇప్పుడు బ్యాంకు టైం అయిపోయింది కానీ కొంచెం ముందు వచ్చుంటే ఆ బ్యాంకు మేనేజర్ ని కడిగేసి ఉందును. రైతులకి పాన్కార్డ్ ఏంది? అయినా నాకు పాన్ కార్డు ఉంది...లేక కాదు. అయినా, ఎందుకు ఇయ్యాల? రేపు మనల్ని కూడా ఇన్కమ్ టాక్స్ కట్టమంటారా ఏంది?" మండిపడ్డాడు బంగారు నాయుడు. నిజానికి లెక్కకడితే బంగారు నాయుడు టాక్స్ కట్టవలసిన వాడే! చెన్నైలో తను ఉంటున్న అన్నా నగర్ ఎక్స్టెన్షన్ లో ఇల్లు కాకుండా మొగప్పేరులో రెండు ఫ్లాట్ లు, నుంగంబాక్కం లో ఒక షాపు అద్దెకి ఇచ్చి ఉన్నాడు. తడ వద్ద 'సెజ్' రావడం వల్ల అద్దె ఇళ్ళకి గిరాకీ బాగా ఉందని రెండు అపార్ట్మెంట్స్ కొని అద్దెకిచ్చి ఉన్నాడు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. వాటి మీద వచ్చే వడ్డీకి టిడిఎస్ పడకుండా పాన్ కార్డు ఇచ్చి ప్రతి సంవత్సరము తప్పకుండా మినహాయింపు ఫారం ఇస్తూ ఉన్నాడు. కానీ నగదు కోసం నెంబర్ అడగడం అన్నది అతని "రైతత్వా"న్ని అవమానించినట్టు గా ఫీలయ్యాడు బంగారు నాయుడు. మళ్లీ ఇంకా ఏదో గుర్తు వచ్చింది అతనికి. "పంట లోన్లు అన్నింటికీ వడ్డీ తక్కువే పడతా ఉంది కదా! పోయిన తూరి ఒక లోనుకి రూపాయ వడ్డీ పడింది." "అవునయ్యా!"వినయంగా బదులిచ్చాడు రమణ. "గోల్డ్ లోన్ లు అన్నీ ముప్పై పైసల వడ్డీతోనే ఉండాయి కదా! ఏ బ్యాంకులో ఏ రోజుకి సంవత్సరం పూర్తవుతుందో గుర్తు పెట్టుకున్నావా?" "ఆ.. కరెక్ట్ గానే ఉన్నాయయ్యా!.. సంవత్సరం తిరగకముందే బ్యాంకోళ్లే మనిషిని పంపించి చెప్తున్నారు.. కానీ అయ్యా ఇప్పుడు బంగారు లోనికి వడ్డీరాయితీ ఇవ్వడం లేదంట అయ్యా" చెప్పాడు రమణ. "అది ఏందిరా వ్యవసాయదారులకు ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారు వడ్డీ మినహాయింపు? అయినా మనం బయట...తీసుకునే వడ్డీ కంటే ఇది తక్కువే కదా అందుకే ఈ లోన్లు కంటిన్యూ చేస్తూ ఉన్నా. మావన్ని రెన్యువల్ చేసుకున్నాము లే!.. అవి కాదు! నేనడిగేది. నీ పేరు మీద ఉన్నవి, నీ పెళ్ళాం పేరు మీద ఉన్నవి, ఇదిగో ఈ పళనిస్వామి-వాడి పెళ్ళాం పేరు మీద తీసుకున్న లోన్లు కరెక్ట్ గా పడతాన్నయ్య.. లేదా? అని!" అడిగాడు బంగారు నాయుడు. ఉన్న పొలం కాగితాల జిరాక్స్ కాపీలతో ఊరిలో ఉన్న నాలుగు బ్యాంకుల్లోనూ చెన్నైలో కూడా వ్యవసాయం కోసం గోల్డ్ లోన్లు తీసుకొని ఆ డబ్బులు వడ్డీలకు తిప్పుతూ ఉంటాడు బంగారు నాయుడు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినట్లు ఉంటుంది. తక్కువ వడ్డీకి ఋణాలు పొందినట్టు ఉంటుంది. తక్షణ లిక్విడిటీ కలిగిన ఈ సదుపాయం క్రమం తప్పకుండా ఉపయోగించుకుంటూ వస్తున్న అనేకమంది "ఉత్త"మరైతుల్లో బంగారు నాయుడు మొదటి వాడు. "అయ్యా! ఆ బస్టాండ్ కాడ ఉన్న బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మొన్నకతూరి, వారంలో చాలా రోజులు మీకోసం తిరిగి ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు అని ఒకటే అడగడం- మాకు తెలీదు మీరు ఫోను చేసుకోండి అని నీ ఫోను నెంబరు ఇచ్చినా. నీకేమన్నా చేసినాడా? అడిగాడు రమణయ్య. "ఆ..చేసినాడు లే! నేనే ఫోన్ తీయలే!! అవి క్రాపు లోనులు రెండు మూడు ఉన్నాయి వాళ్ళ కాడ. అవి రుణమాఫీ లో పోతాయి లే అని వదిలేసిన. ఇంకా అవి పోయినట్టు లేవు" ఉదాసీనంగా అన్నాడు నాయుడు. "అవునయ్యా! మొత్తం మూడు లోన్లు కలిపినా యనభై వేలు కూడా లేవు- ఆయనొక్క సంతకం పెడితే చాలు. డబ్బులు ఏమీ కట్టక్కర్లేదు...మేమే ఓ పదివేలు పెంచి ఇంకో లోను ఇచ్చి తిరగ రాసుకుంటాం అని పాపం చాలా బంగపోయినాడు అయ్యా!" ఫీల్డ్ ఆఫీసర్ మీద జాలి పడ్డాడు పాపం రమణయ్య. బంగారు నాయుడు కి కోపం నషాళానికంటింది. "ఎందుకు అన్ని సార్లు రావడం? మనమేం దేశం విడిచి పెట్టి పోయినమా ఏందీ? కోట్లు ఎగ్గొట్టి పోయే వాళ్ళని మాత్రం ఏమీ చేయలేరు కానీ మన ప్రాణాలు తీస్తారు. ఎంతది? -ముష్టి ఎనబయి వేలే కదా!! మనమేం కావాలని ఎగ్గొట్టినామా? మాఫీ డబ్బులు గవర్నమెంటు ఇస్తుందనే కదా! మల్ల ఆ లోన్లు క్లోజ్ అయిపోతే మనకు రావాల్సిన డబ్బులు కూడా రాకుండా పోతాయి. గవర్నమెంటే ఇస్తా ఉంటే మధ్యలో వీళ్లదేoది?" రమణయ్య మీద విరుచుకుపడ్డాడు నాయుడు. కిక్కురు మనలేదు రమణయ్య. డబ్బు తెచ్చి కట్టి క్లోజ్ చెయ్యి మన లేదు కదా ఒక్క సంతకం పెడితే వాళ్లే పదివేలు ఇస్తాము అంటున్నప్పటికీ అంత కోపగించుకోవలసిన అవసరమేమిటో అతడి అమాయకపు బుర్రకి తట్టలేదు. ఇంతలో- స్కూలు గ్రౌండ్లో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం నుండి మైకులో అనౌన్స్మెంట్ వినపడసాగింది. అప్పటికే బంగారు నాయుడు కోసం వేదిక వద్ద నుండి ఒక వార్తాహరుడు రావడంతో తన గోష్టిని ముగించి మీటింగ్ వద్దకి బయలుదేరాడు నాయుడు. వెళ్లేసరికి వేదికమీద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్కూలు పిల్లలు సినిమా పాటలు పాడుతున్నారు. " దండాలయ్య! దండాలయ్య!.. " అనే పాట వస్తుంటే అది తన కోసమేననుకుంటూ గర్వంగా వెళ్లి ముందువరుసలో కూర్చున్నాడు నాయుడు. ముఖ్యఅతిథి రావడంతో సభాధ్యక్షులు వేదికనెక్కి సభ ప్రారంభం చేశారు. అందరినీ కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానించాడు. అందులో బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నాడు. సమయం దొరికినప్పుడు కడిగేద్దామని వేచి ఉన్నాడు నాయుడు. సభ ప్రారంభం అయ్యింది. ముందుగా అధ్యక్షులు మాట్లాడాక ముఖ్యఅతిథి అయిన బంగారు నాయుడిని మాట్లాడమన్నారు. చంద్రశేఖర్ గురించి పెద్దగా తనకి తెలీదు. మీటింగ్ కి ముందు కూడా తెలుసుకోవాలి అనుకోలేదు కాబట్టి... తన గొప్పతనం గురించి తన తాతల తండ్రుల గొప్పదనం గురించి, ఆ గ్రామానికి వారి కుటుంబం చేసిన మహత్కార్యాల గురించి అనర్గళంగా మాట్లాడాడు నాయుడు. అది సందర్భం కాకపోయినా ఆ వూరికి బ్యాంకు రావడానికి తమ కుటుంబం, తన తాత ఎంత కష్టపడినదీ చెప్పి, ఆ బ్యాంకు లో తనకెన్ని డిపాజిట్లు ఉన్నాయో చెప్పి, తానెంత వి.ఐ.పి అన్నది తెలియజేసి, చివరకు తన చెక్కు కి డబ్బు ఇవ్వకపోవడం చాలా తప్పని సభాముఖంగా తన అసహనం చాటాడు బంగారు నాయుడు. ఈ దాడిని ఎదురుచూడక ఖంగుతిన్న బ్యాంకు మేనేజరు తనవంతు మైకు వచ్చినప్పుడు అది ఖాతాదారుల సమావేశం కాదని చెప్పుకొస్తూ, అంతటి విఐపి కి తన శాఖ నగదు ఇవ్వకపోవడానికి క్షమాపణలు తెలియజేసి, తర్వాత చంద్రశేఖర్ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. "మన చంద్రశేఖర్ గారు తనకున్న కొద్దిపాటి పొలంలో పంట మార్పిడి మరియు అంతర పంటలు... కూరగాయలు పండించడమే కాకుండా కేవలం సేంద్రీయ ఎరువులు మాత్రమే వాడటం జరిగింది. రసాయనాలను వాడకుండా భూసారాన్ని కాపాడుకో గలిగాడు. అందుకే ఆదర్శ రైతు కాగలిగాడు అన్నది మీకు బాగా తెలిసిన విషయం. కానీ, ఈయన ఆర్థిక కార్యకలాపాల్లో కూడా ఆదర్శంగానే వ్యవహరించాడు అన్నది బయటి ప్రపంచానికి తెలియక, కేవలం మాకు మాత్రమే తెలిసినందుకు మేము గర్వపడుతున్నాము. తిరుపతిలో ఉన్న వీరి పూర్వీకుల ఇల్లు ఒకటి విక్రయించినప్పుడు వచ్చిన డబ్బుని మా వద్ద దాచుకున్న సమయంలో ఈయన పాన్ కార్డు తో వచ్చాడు. తనకి వచ్చిన ఆదాయానికి ఆయన పన్ను కూడా మా బ్యాంకు నుండే చెల్లించాడు. విక్రయించిన ధరకే రిజిస్టరు చేయించి నల్లధనం మాట అన్నది లేకుండా పన్ను కట్టాడు. ఆదాయాన్ని పెంచే కమర్షియల్ క్రాప్స్ జోలికి వెళ్లకుండా, దేశ భవిత ని ఆకాంక్షించే నిజమైన రైతుగా కేవలం ఆహార ధాన్యాలు, కూరగాయలే తన పొలంలో పండించాడు. మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో ఎవ్వరూ చేయని విధంగా... తీసుకున్న ఋణాలను మాఫీ కోసం ఎదురు చూడకుండా సకాలంలో పంట చేతికి రాగానే వచ్చి తానే చెల్లించాడు. మళ్లీ ఋణం పొందాడు. ఆర్థిక వ్యవస్థపై గౌరవం ఉన్నవాడు. విత్తనాలకీ పురుగు మందులకి కూడా నగదు వాడకుండా ఏటీఎం కార్డు ద్వారా చెల్లింపులు జరిపేవాడు. వ్యవసాయదారులు కూడా మారుతున్న సాంకేతికతని ఉపయోగించుకుంటూనే, సాంప్రదాయ రీతిలో పంటలు పండించడం పర్యావరణానికి, ప్రజలు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో- చట్టాల కోసం ఎదురు చూడకుండా నిజాయితీ గల పౌరులుగా ఆర్థిక వ్యవహారాల్లో కూడా నడుచుకోవాలన్న ఆదర్శాన్ని పాటించి చూపించాడు. కోట్ల రూపాయలకు మాగాణి భూములను అమ్మకానికి పెడుతున్న రైతులు, రియల్ ఎస్టేట్ కోసం భూములను వ్యవసాయేతరాలుగా మార్చుకుంటున్న 'రైతువన్నె' వ్యాపారులు ఉన్న ఈ కాలంలో... శ్రీ చంద్రశేఖర్ గారు నిజంగానే ఆదర్శప్రాయులు!.. శిఖర సమానులు!! వీరిని చూసి దేశంలోని ప్రజలందరూ స్ఫూర్తి పొందాలి" అని చెప్పి ముగించాడు మేనేజర్. తమకున్న గౌరవానికి చిహ్నంగా దుశ్శాలువతో సత్కరించాడు. చివరగా చంద్రశేఖర్ మాట్లాడడం మొదలు పెట్టాడు. "నేను ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదువుకున్నానండీ! రైతు అనేవాడు బాగా చదువుకోవాలండీ! 'నేను రైతుని బాబు నాకు చదువు రాదు- నిశాని!' అని చెప్పే రోజులు వెళ్ళిపోయాయి. నేను అయితే స్మార్ట్ ఫోన్ వాడతాను. సినిమాలు వీడియోలు చూడడానికి కాదు. వెదర్ ఫోర్ కాస్ట్ తెలుసుకుంటాను. వాట్సాప్ ఫేస్ బుక్కు కూడా చూస్తూ ఉంటాను. దేశ సరిహద్దుల్లో జవాన్లకు దేశ భూభాగంలో రైతన్నల కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. రైతుల ఫోటోలు పెట్టినా, సమస్యలు పెట్టినా లక్షల లైకులు వస్తాయి. నాకప్పుడే అనిపించింది. సైనికులు డబ్బులకి ఆశపడి శత్రువుల్ని మన దేశంలోనికి వదలడం ఎంత ద్రోహమో... భూమిని నమ్ముకొని కోట్ల మందికి అన్నం పెట్టే రైతు, మాగాణి భూములను రియల్ ఎస్టేట్ కి అమ్ముకోవడం... తల్లిని అమ్ముకోవడం అంత ద్రోహమని!!.. పండ్లు కూరగాయల్ని సహజంగాకాక, రసాయనాలతో పక్వ పరచడం కూడా అంతే ద్రోహమని!! వ్యవసాయదారులకు పన్ను మినహాయింపు ఉన్నదన్న ముసుగులో కోట్ల రూపాయలు బదలాయింపు చేయడం, ఇతర ఆదాయాలు చూపించక పన్నులు కట్టకపోవడం... దేశ ఆదాయానికి గండి కొట్టడం అవుతుంది. అది శత్రువులని దేశం లోకి వదలడంతో సమానమే మరి!! నల్ల ధనాన్ని నియంత్రించడానికి తీసుకువచ్చిన ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని దేశ పౌరుడిగా, బాధ్యతగా అనుసరించి సహకరించాల్సిన బాధ్యత రైతుకి కూడా ఉంటుంది. మార్పులను అంగీకరించాలి. అంగీకరించే..సమ్మతించే సాంప్రదాయమే...అంగీకార సంస్కృతి! అదే... అగ్రీ.. కల్చర్!!. దానిని అగ్రికల్చరిస్ట్ పాటించకపోవడం తప్పు. అగ్రీ అంటే సమ్మతించడం ఆ కల్చర్ ఉన్నవాడే అగ్రికల్చరిస్ట్. 'వ్యవసాయం' అనడంలోనే 'సాయం' చేయడం ఉంది. 'మోసగించడం' అనేది లేదు. మనుషులకి, పశువులకి తిండి సృష్టించి 'సాయం' చేసే విధాత -రైతు!! కలుషితం చేసి వ్యాధులు కలిగించే వాడు కాడు. ఈ స్పృహ రైతులందరికీ ఎల్లవేళలా తప్పనిసరిగా ఉండాలి. దీన్ని గుర్తుపెట్టుకొని మసలుకుంటే ప్రతి రైతూ ఆదర్శ రైతే అవుతాడు. ప్రపంచం మొత్తం వారికి మ్ర్రోకరిల్లుతుంది. "రైతు" అన్నది సదుపాయం కాదు- ఋణాలు ఎగొట్టడానికి! అదొక గౌరవప్రదమైన బాధ్యత!! కృషీవలుడు ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండాలి. నిజాయితీగా-క్రమశిక్షణగా!..వ్యక్తి వికాసానికి, సమాజ వికాసానికి...తద్వారా దేశ అభివృద్ధికి అదే దోహదం చేస్తుంది. ధర్మో రక్షతి రక్షితః - ధర్మాన్ని పాటించడం భారతీయత! మోసగించడం అసలు ధర్మమే కాదు" అని ముగించాడు చంద్రశేఖర్. సభ అంతా... స్కూల్ గ్రౌండ్ మొత్తం కరతాళధ్వనులతో మార్మోగింది. బంగారు నాయుడు మస్తిష్కం మొద్దుబారిఉంది. "నేను రైతునా?- మోసగాడి నా?- మేకనా? - మేక వన్నె పులినా?" సందిగ్ధంలో పడిపోయాడు బంగారు నాయుడు. -అయిపొయింది.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
Comentarios