top of page

అహం కూడా మంచిదే


Aham Kuda Manchide Written By Phanikiran Kiranmayi Anisingaraju

రచన : అనిసింగరాజు ఫణికిరణ్ కిరణ్మయి

"ఏమండీ, ఇదుగో కాఫీ" కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో చేస్తున్న భర్త గిరిధరం కోసం కాఫీ తీసుకొచ్చింది వసుధ.

“టిఫిన్ చేయి. త్వరగా ఆఫీసుకు వెళ్ళాలి.”

తలూపి, వెళ్ళి టిఫిన్ చేసే పనిలో పడింది. “ఏమండీ. టిఫిన్ రెడీ” కిచెన్లోంచే అరిచి చెప్పింది. “పదినిమిషాలు.” చెప్పి కంప్యూటర్ దగ్గరనుండి లేచి వెళ్ళాడు. రెడీ అయ్యి వచ్చి గబగబా టిఫిన్ తిని, కంప్యూటర్లో తను స్టోర్ చేసిన వివరాలను ఒకసారి చూసి, సేవ్ చేస్తుండగా, “ఇదుగోండి మీ సెకండ్ కోటా కాఫీ” అంటూ వచ్చింది వసుధ. కప్పు అందుకున్నాడు గిరిధరం. వసుధ దృష్టి కంప్యూటర్ స్క్రీన్ పై పడింది. అక్కడ ఉన్నది చదివిన వసుధ, "హాయ్. మధురవాణిగారి కథ" సంబరంగా అంది. తమ పత్రిక మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కథల పోటీకి వచ్చిన కథలని చదివి, వాటిల్లో అర్హమైన వాటిని విడదీసి పెట్టమని తమ పత్రిక ఓనర్, సంపాదకుడు అయిన బలదేవ్ గారు పురమాయించడంతో ఉదయమే ఆ పనిలోకి దిగాడు. "ఆగు. ఎందుకంత సంబరం?"

"అదేంటండి, మధురవాణిగారి కథలు బాగుంటాయని అందరూ అంటారుగా."

"కథల గురించి, రచనల గురించి నీకేం తెలుసు? ఎంతసేపు ఇంటిలోనే ఉంటూ కూపస్థ మండూకంలా ఉండే నీలాంటి ఇల్లాళ్ళకు సాహిత్యం గురించి ఏం తెలుస్తుంది?"

"అదేంటండి? సాహిత్యం గురించి తెలిస్తేనే కథలు చదవాలా?" అమాయకంగా అడిగింది. "గొప్ప గొప్ప రచనలు చదివితేనే సాహిత్యం గురించి తెలుస్తుంది. నువ్వెప్పుడైనా ఓ గొప్ప రచన చదివావా? లేదు . ఎప్పుడుచూడు, ఇంటి పని, పిల్లల పని,పక్కింటాళ్ళ పని అంటూ ఇంట్లో కూర్చోవడమేగా నువ్వు చేసేది." విరుపుగా అన్నాడు గిరిధరం.

"అంటే గృహిణిగా ఉండడం తప్పా?"

"గృహిణి గృహిణి అంటారు. అసలు ఏంటి మీ గొప్ప? కష్టపడి సంపాదించేది మేము. కానీ పేరు మీకు. ఎందుకంట?" వెటకారంగా అన్నాడు.

"అవునులెండి. మా గొప్పేమి ఉంది.?మేము చేసేది ఏముంది? " అని లోపలకు వెళుతున్న భార్యని చూసి, వాదనలో ఈసారి కూడా తానే గెలిచినందుకు గర్వ౦గా నవ్వుకుంటూ, “వెళ్ళొస్తా” అని చెప్పి హుషారుగా బయలుదేరాడు గిరిధరం. ********************

“ఏమండీ , ఈ కథలో రచయిత చెప్పదల్చుకున్నది ఏమిటో నాకు అర్ధం కాలేదు.” మర్నాడు ఆఫీసుకు బయలుదేరుతున్న భర్తను అడిగింది వసుధ.

“అందుకే అన్నా సాహిత్యం తెలీని నీలాంటి వాళ్లకు కథలు ఏం అర్ధం అవుతాయి.” వ్యంగ్యంగా అన్నాడు.

“ఇదుగో నిన్న కూడా ఇలాగే అన్నారు. ఏం సాహిత్యం తెలీకపోతే కథలు చదవడానికి పనికిరారా. మీ పత్రికలో పడే కథలు చదివేవాళ్ళు అందరూ సాహిత్యం లోతుపాతులు తెల్సినవారే అంటారా. నాలాంటి వాళ్ళు ఉండరా?”ఉడుక్కుంటూ అంది.

“ఎందుకుండరు? వాళ్ళు నీలాగా గృహిణులేగా.”

“గృహిణులు అంటే అంత వెటకారం ఎందుకో?” కోపంగా అంది.

“గృహిణులు కాబట్టి.” అంటూ ఆఫీసుకు బయలుదేరాడు. మూతి మూడు వంకరలు తిప్పింది వసుధ.

*****************

రెండు రోజులు గడిచాయి. ఆదివారం కావడంతో తొందరగా లేచి, తాను ఇంతకు ముందు చదివి వేరు చేసి ఉంచిన పోటీ కథలను మళ్ళీ ఒకసారి చెక్ చేసి, బలదేవ్గారికి ఆ కథలను పంపిస్తే, వేటికి ఏ బహుమతులు ఇవ్వవచ్చో ఆయన చదివి నిర్ణయిస్తారని , రెడీ అయ్యి వచ్చి ఆపనిలో పడ్డాడు గిరిధరం. టిఫిన్ చేయడంలో బిజీగా ఉంది వసుధ.

“అబ్బా, ఈ గృహిణులైన ఇల్లాళ్ళకు ఏం తెలుసు? ఎంతసేపు ఇల్లు, పిల్లలు అంటూ ఉండడం తప్ప. సర్లే. నా పని అయ్యాక మళ్ళీ కాల్ చేస్తా.” చెప్పి ఫోన్ పెట్టాడు.

గిరిధరం ఫోన్ సంభాషణ వసుధ చెవిన పడింది. ఐదునిమిషాలు కూడా గడవలేదు. లోపలి నుండి వసుధ గొంతు వినపడుతుంటే, ఏంటా అని లేచి లోపలకు వెళ్ళాడు. కిచెన్లో టిఫిన్ చేస్తోంది. " హు , గృహిణుల గొప్పేమిటి అట? గృహిణి అంటే అంత అలుసా? అసలు ఏం తెలుసు వీళ్ళకు గృహిణి గురించి?" భార్య మాటలు వింటున్న గిరిధరం ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు తమ ఇద్దరి మధ్యన వాదన జరిగినా తాను గెలవడం, ఆపై ఆఫీసుకు వెళ్లిపోవడమే తప్ప తర్వాత తన భార్య ప్రవర్తన గురించి తెలీదు గిరిధరానికి. ఈరోజు త్వరగా లేచి పని మొదలుపెట్టడంతో, తమ రోజూవారీ కోటా అయిన వాదన కార్యక్రమం కూడా త్వరగానే పూర్తయ్యింది. అందువల్ల ఇప్పుడు భార్య ప్రవర్తన చూడడానికి అవకాశం దొరికింది. వసుధ గొంతు తిరిగి వినపడడంతో ఆశ్చర్యంలోంచి బయటకు వచ్చి, ఆవిడకు తెలీకుండా వినడం మొదలుపెట్టాడు.

"అసలు గృహిణి లేకపోతే కుటుంబం ఉంటుందా? సమాజం ఉంటుందా? సత్సమాజం ఏర్పడుతుందా? పెద్ద ఉద్యోగం చేస్తున్నాము, పోషిస్తున్నాము అంటారు. వీళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేస్తూ, అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి, బాస్తో శెభాష్ అనిపించుకోడానికి, ఉన్నత స్థానాలు పొందడానికి గృహిణిగా ఉండే ఇల్లాలు కాదు కారణం. ఇంటికి, కుటుంబానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్యైనా చెప్పకుండా, ఉద్యోగ సమస్యలతో సతమతమైయ్యే వాళ్లకి ఈ సమస్యలు కూడా చెప్పి వారి ప్రశాంతతను చెడగొట్టకుండా అవన్నీ నెత్తిన వేసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్ని౦చేది, తమదాకా రాకుండా తీర్చేది గృహిణిగా ఉండే ఇల్లాలని ఈ మగమహారాజులకు తెలిసేదెప్పుడో?"

విన్న గిరిధరం ఆలోచనలో పడ్డాడు. "పిల్లలకి అన్నీ అమర్చిపెట్టి, వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినవి చూస్తూ, వారికి అన్నింటిలోనూ చేదోడు వాదోడుగా ఉండేది గృహిణేగా. వాళ్ళకి గెలుపు సొంతం అయితే ఫలానా ఆయన పిల్లలు ఎంత చక్కటివాళ్ళో అని వాళ్లకు పొగడ్తలు, వాళ్ళు విఫలం అయితే ఆ ఇల్లాలికి పిల్లలని ఆమాత్రం చూడడం చేతకాదు అనే దెప్పి పొడుపులు మాకు అని వీళ్లకు ఎలా తెలుస్తుంది?"

నిజమేగా అనిపించింది గిరిధరానికి.

"అటు పుట్టింటికి పేరు తెస్తూ, ఇటు మెట్టినింటి బాధ్యతలని చక్కగా నిర్వహించే ఇల్లాలిని చూసి, మగాడు గట్టి వాడు అని వాళ్లకు కితాబులు, సరిగా లేకపోతే ఆ ఇల్లాలు పడనిస్తేనే కదమ్మా, మగాడు ఏమైనా చేయడానికి అన్న తెగడ్తలు మాకు. గృహిణి బాధ్యతలంటే ఈమగాళ్ళకు ఎంత అలుసో?"

తొలిసారిగా తన భార్యలోని మరో కోణం చూస్తున్నాడు గిరిధరం.

"అందరితోనూ కలివిడిగా ఉంటూ, స్నేహబాంధవ్యాలను పెంపొందిస్తూ చక్కటి ఇంటి వాతావరణాన్ని సృష్టించేది ఇల్లాలే అని ఎవరు చెప్తారు? అలాంటి ఇంటి వాతావరణం ఉంటేనే చక్కని సమాజం నెలకొంటుందని ఎలా తెలుస్తుంది వీళ్ళకు?"

"అయితే సమాజంలో మీ గృహిణుల పాత్ర చాలానే ఉంది అంటావు. అవునా?" భర్త ప్రశ్నకి చేస్తున్న పని ఆపి వెనక్కు తిరిగింది వసుధ.

" ఏమోయ్. మాట్లాడవు. ?"

"కాదనగలరా మీరు?" ఎదురు ప్రశ్నించింది వసుధ.

"అవునని అనిపించగలవా?" సవాలుగా అన్నాడు గిరిధరం.

"అంటే?"

"మీలోనూ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారుగా. మరి వాళ్ళ పాత్ర ఏమిటో?" కళ్ళు విచిత్రంగా తిప్పుతూ అడిగాడు.

"అంటే సమాజంలో వారి పాత్ర లేదంటారా?"

"ఎలా ఉంటుంది? వాళ్ళు గృహిణులు కాదుగా?" లాజిక్ లాగాడు గిరిధరం. గిరిధరానికి ఉత్సుకతగా ఉంది తన భార్య ఏమని చెప్తుందా అని?

"ఓహో. ఇంటిలో ఉంటేనే వారు గృహిణులు. ఉద్యోగాలు చేసే స్త్రీలు గృహిణుల విభాగంలోకి రారు. ఇదేనా మీ లాజిక్?" అడిగింది

"అనేగా నేను అన్నది."

"గృహిణులైన స్త్రీలు ఎంతమంది ఉద్యోగాలు చేయటంలేదు. అన్నింటిని చక్కబెడుతూ గృహిణులుగా రాణిస్తూనే, ఆర్ధికంగా ఇంటికి చేదోడు వాదోడుగా ఉండటంలేదు? అయినా మీ మగాళ్ళకి కుటుంబ విజయంలో ఇంటి ఇల్లాలి పాత్రని ఒప్పుకోడానికి అహం అడ్డు వస్తుంది. కాదనగలరా?" ప్రశ్నించింది.

"స్త్రీలు కొంతమంది తమ స్వార్ధం చూసుకుంటున్నారుగా? నీది నాది అంటూ విడదీస్తున్నారుగా?" అన్నాడు .

"ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు అలాంటివాళ్ళు. నూటికి పది శాతం. అందుకని అందరిని ఒకేగాట కట్టకూడదుగా?"

"మగాళ్లు అంతే. అహం ఉన్నవాళ్లు నూటికి పదిశాతం. అందుకని అందరినీ ఒకేగాట కట్టకూడదుగా" తన మాట తనకే అప్పచెప్పిన భర్తని చూసి, "ఆ పది శాతంలోను మీరు ఉన్నారుగా. మీరే కాదు మావయ్యగారు ఉన్నారు. కాదని అనగలరా. మీ గుండెలమీద చెయ్యేసుకుని చెప్పండి కాదు అని."

మాట్లాడలేదు గిరిధరం. నిజమే. భార్య అన్నదాన్ని ఒప్పుకోడానికి, ఏనాడూ లేనిది భార్యతో వాదనలో ఓడిపోడానికి గిరిధరం అహం అడ్డు వస్తోంది.

"మావయ్యగారు ఆ రోజుల్లోనే ఉద్యోగం చేయమని అత్తయ్యగారిని అడగడం, కొన్ని పరిస్థితుల కారణంగా అత్తయ్యగారి సంపాదనతోనే ఇల్లు గడవడం, ఒప్పుకోలేని ఆయన అహం అత్తయ్యగారితో రోజూ ఏదో ఒక గొడవపడేలా చేయడం మీకు తెలీనివా? అయినా ఆవిడ సహనంతో భరించి, తన కుటుంబం అనుకుని ఓర్పుతో చక్కబెట్టకపోయుంటే ఈరోజు ఆనందరావు కుటుంబానికి సమాజంలో మంచి పేరు వచ్చేదా? ఇటు గృహిణిగా, అటు ఉద్యోగిగా ఆవిడ తన బాద్యతని నిర్వహించలేదా? ఇప్పుడు కదా తన భార్య సహకారం లేకపోయుంటే ఈనాడు తాను సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపగలిగేవాడినే కాదు అని చెబుతున్నారు. కాదంటారా?"

వసుధ మాటల్లో నిజం ఉండడంతో మౌనం వహించాడు గిరిధరం.

"వచ్చి టిఫిన్ తినండి. ఆఫీస్ టైం అవుతోంది." టేబుల్ పై టిఫిన్ పెట్టి, వాషింగ్ మెషిన్ పిలవడంతో బట్టలు ఆరేయటానికి పెరట్లోకి వెళ్ళింది. మౌనంగా టిఫిన్ ముగించి, తనపనిలో పడ్డాడు. కానీ వసుధ మాటలు మెదడులో గిరగిరా తిరుగుతున్నాయి. ఎదురుగా కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడుతున్న అక్షరాల వెంట కళ్ళు పరుగులుపెడుతున్నా,మెదడులోకి ఎక్కటం లేదు ఏమీ. విసుగ్గా తల విదిల్చి లేచి కిచెన్ వైపు వెళ్ళాడు మంచినీళ్ళు తాగడానికి. తాగి రాబోయిన గిరిధరానికి వినపడింది, పక్క ఇంటిలోనే ఉండే చెల్లెలు లలిత గొంతు. పెరటి గోడ దగ్గర నుంచుని మాట్లాడుకోవటం ఆఇద్దరికీ అలవాటే గనుక పెద్దగా పట్టించుకోకుండా అక్కడినుండి కదలబోయిన గిరిధర౦ చెవిన పడింది లలిత ప్రశ్న. ఆగిపోయాడు.

"అదేంటి వదిన? అన్నయ్యతో వాదనలో నెగ్గే అవకాశం వస్తే అలా వదిలేశావు. ఎప్పుడూ వాడే నెగ్గుతానని, నీకేమీ తెలీదని మాట్లాడతాడుగా. ఈరోజు నువ్వేమిటో చూపించే అవకాశం వస్తే దాన్ని కాస్తా తుస్సుమనిపించావు."

నవ్వింది వసుధ. "ఏంటి వదినా? ఆ నవ్వుకు అర్ధం ఈసారి అర్ధం కాలేదు" నిజంగానే అర్ధంకాక అడిగింది.

"లలితా , మీ అన్నయ్యకు ఈ ఒక్కవిషయంలోనే అహ౦."

"అంటే?"

"మీ అన్నయ్యకు నాతో వాదించి నెగ్గాలనే కోరిక తప్ప ఇంకేం లేదు. ఆయన అహం అంతా ఇక్కడే చూపిస్తారు. కావాలనే నాతో వాదనకు దిగుతారు. అంతే తప్ప, మరే విషయంలోనూ ఆయన మగాడినన్న అహం చూపించరు. ఈ ఒక్కవిషయంలో నేను తగ్గితే ఆయనకు ఆనందంగా ఉంటుంది. అది ఆయన ఆనందంగా ఉద్యోగ బాధ్యత నిర్వహించడానికి ఉపయోగపడుతుంది."

"ఇందు కోసమా అన్నయ్య దగ్గర ఓడినట్టు నటిస్తావు?"

"అవును. నువ్వు ఎప్పుడైనా గమనించావా? మీ అన్నయ్య నాతో వాదన చేసేది ఉదయం మాత్రమే. అదీ ఆఫీసుకు వెళ్ళేముందు. మరెప్పుడైనా నాతో వాదించగా చూశావా?"

"నిజమే వదినా. వేరే ఏ సమయంలోను, శెలవు రోజుల్లోనూ కూడా అన్నయ్య వాదించడం నేను చూడలేదు." ఒప్పుకుంది లలిత.

"అదేగా నేను చెప్పేది" అని నవ్వింది వసుధ. వసుధ ఇంట్లోకి వస్తుండడంతో, గబగబా హాలులోకి వెళ్ళాడు గిరిధరం.

*********************

మహిళా దినోత్సవ౦ రానే వచ్చింది. ఆరోజు సాయంత్రమే తమ పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం కావడంతో, కళాభారతి ఆడిటోరియంకి వెళ్ళాడు గిరిధరం, ఏర్పాట్లు పర్యవేక్షించడానికి. అనుకున్న సమయానికే కార్యక్రమం మొదలైంది. సాహితీ పెద్దలు, బలదేవ్గారు వేదికపై ఆసీనులైయ్యారు. సాహిత్యాభిలాష కలవారు, తమ అభిమాన రచయితలను చూడచ్చన్న ఆశతో వచ్చినవారితో ఆడిటోరియం కళకళలాడుతోంది. కార్యక్రమం మొదలవ్వగానే, గబగబా వచ్చి రెండో వరుసలో ఉన్న ఆహుతుల కుర్చీలలో కూర్చున్న భార్య, చెల్లెలు, బావగారు ప్రసాద్లను చూసి ఎప్పుడూ లేనిది వాళ్ళెందుకు వచ్చారో అర్ధం కాలేదు గిరిధరానికి. అయితే తానే వ్యాఖ్యాత కావడంతో అడిగే అవకాశం లేకపోవడంతో ఊరుకున్నాడు. ముందుగా పోటీలలో పాల్గొన్నవారికి ప్రశంశా పత్రాలు అందజేయబడతాయని, వారి వారి చిరునామాలకు వాటిని పంపిస్తామని ప్రకటించారు. కన్సొలేషన్ బహుమతులను, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.

“ఈపోటీలలో విజేతగా నిలిచి, యాభై వేల రూపాయల ప్రథమ బహుమతిని గెలుచుకున్న రచయిత్రి మరెవరో కాదు. తన కథారచనతో ఎంతోమంది పాటకుల మనసు దోచుకున్న రచయిత్రి మధురవాణిగారు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నందున, కొద్ది ఆలస్యంగానైనా సభకు చేరుకుంటానని ఆవిడ తెలియచేశారు. తాను రాసే రచనలకే విలువకానీ, తన రూపుకు కాదు అన్నది ఆవిడ నియమం కనుక, ఆ నియమాన్ని గౌరవించి ఆవిడ ఫోటోని ఈనాటివరకూ అడగలేదు. అందువల్ల వారు ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న్ కుతూహలం ఆవిడ అభిమానులకే కాదు మాకు కూడా ఉంది.”

వచ్చి తన చెవిలో ఏదో చెప్పిన ఓపర్యవేక్షకురాలి మాటలు విని, “ ఇదుగో మధురవాణిగారు చేరుకున్నారని మెసేజ్ వచ్చిందిట. అందువల్ల ప్రముఖ రచయిత్రి, ఎందరికో అభిమానపాత్రురాలు అయిన మధురవాణిగారిని ప్రధమ బహుమతి అందుకోడానికి వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను.” గిరిధరం మాట పూర్తయ్యిందో లేదో, కూర్చున్న చోటునుండి లేచింది వసుధ. లేచిన భార్యను చూసి, కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. ఆ సైగలను గమనించనట్లుగా అందరి కరతాళధ్వనుల మధ్య ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళి వేదికనెక్కి౦ది వసుధ అలియాస్ మధురవాణి.

“వసుధ, నువ్వేంటి!?” ఆశ్చర్యం, అనుమానం కలగలిపి ప్రశ్నించాడు గిరిధరం.

“మొదటి బహుమతి వచ్చింది మధురవాణి గారికేగా?” ప్రశ్నించింది.

“అవును.”

“అయితే నేను రావడం కరెక్టే.” చిరునవ్వుతో అంది. విస్తుపోయాడు గిరిధరం. చిరునవ్వుతో పెద్దలకు, సభికులకు వినమ్రంగా నమస్కరించింది వసుధ. బహుమతిని అందుకుని, వినయంగా నమస్కరించి వేదిక దిగింది వసుధ. సభ పూర్తి అయ్యాక, ఆడిటోరియం బయట నుంచున్న భార్య వాళ్ళ వద్దకు వచ్చాడు గిరిధరం. గిరిధరం అడిగేలోపే, “మీకు చెప్పకూడదనో, లేక దాచాలనో నేనీపని చేయలేదు. నాతో వాదించి నెగ్గాలన్న మీ కోరికని, సరదాని, దానివల్ల మీరు పొందే సంతోషాన్ని పాడుచేయడం ఇష్టం లేక చెప్పలేదు. అంతే. మన్నించండి.”

వసుధ మాటలకి, “ నేను కాదు, నిజానికి నువ్వే నన్ను మన్నించాలి. నీమీద నెగ్గాలన్న నా అహాన్ని తృప్తి పరుచుకోడానికి, ఎన్నోసార్లు వాదనలో నేను ఓడిపోతానేమో అని నిన్ను కించపరుస్తూ మాట్లాడాను. అందుకు నువ్వే నన్ను క్షమించు. ఇకపై నాకున్న ఆకొద్దిపాటి అహాన్ని కూడా వదిలేస్తాను.”

“అదెలా కుదురుతుంది అన్నయ్యా?”

“అంటే?” “నువ్వు వాదిస్తేనేగా వదిన మంచి మంచి రచనలు చేసేది, నాకు వినోదం దక్కేది.” “అవునా. నావాదన వల్ల నీకు వినోదం కలుగుతుందో లేదో కానీ, నాభార్యకు పేరొస్తుంది అంటే వాదించడానికి నాకేమీ అభ్యంతరం లేదు.” భార్య భుజం చుట్టూ చెయ్యేసి కించిత్ గర్వంగా అన్నాడు.

“బాగుంది బావా. భార్యకు పేరొస్తుందని ఎవరైనా వాదిస్తారా?” బావగారు ప్రసాద్ అడిగాడు. “ఇలా అయినా భార్య విజయం వెనుక నేనున్నానన్న పేరొస్తుందిగా నాకు.” నవ్వుతూ అన్నాడు గిరిధరం.

“ఇక్కడకూడా నీ ఈగో వదలలేదు అన్నయ్యా.” నవ్వుతూ అంది లలిత. “ఈ ఈగో మంచికేగా. పర్వాలేదు.” అన్నాడు గిరిధారం. నవ్వేశారు అందరూ.

******=======*******

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

329 views12 comments
bottom of page