top of page

ఆకలి తీరిందా?


'Akali Tirinda?' written by Venkata Siva Kumar Kaku

రచన : కాకు వెంకట శివకుమార్

వాడు ఆమె పై నుంచి లేచి నిలుచున్నాడు. ఒళ్ళు విరుచుకుని గర్వంగా చూస్తున్నాడు. ఆమె శరీరంతో వాడి ఆకలి తీరింది. ఉయ్యాల్లో తన పిల్లాడి ఆకలి తీర్చలేక పోయింది. పిల్లాడు ఏడుస్తూనే వున్నాడు. ఈమె కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి.

వాడు లేచి బట్టలు వేసుకున్నాడు. జేబు నుంచి అయిదు వందలు తీసి ముఖాన విసిరాడు. "అయిదు వందలేనా?" అని దిగాలు గా ముఖం పెట్టి అడిగింది. ఒక్క సారి నీ ముఖం అద్దంలో చూసుకో! ఒంటి మీద కండ వుందా? ఎముకలకి అతుక్కుపోయిన నీ చర్మం. అయిదు వందలు చాలా ఎక్కువ" అని కోపంగా అన్నాడు. "ఆకలి తీర్చుకున్న తర్వాత మగాడి మాటలు అలా కాకుండా ఎలా వుంటాయి?" అని మనస్సులోనే బాధ పడింది.

తను కడుపు నిండా తిని రోజులు గడుస్తున్నాయి. పిల్లాడికి ఇవ్వడానికి పాలు కూడా రావడం లేదు. డబ్బా పాలు పట్టడానికి డబ్బులు లేవు. తన అవతారం చూసి కస్టమర్లు కూడా సరిగ్గా రావడం లేదు.

పిల్లాడిని ఉయ్యాల నుంచి తీసుకుంది. వాడు ఆకలి తీర్చుకోడానికి ఆమె శరీరం తడుముతున్నాడు. దూరం నెడితే పెద్దగా ఏడుస్తున్నాడు. వాడిని భుజం పైన వేసుకుని బయటకు వెళ్లింది. షాప్స్ అన్నీ మూసేసి వున్నాయి.

పరిగెత్తే ఓపిక లేదు. కళ్ళు మూత పడుతున్నాయి. పిల్లాడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయాడు. అర్ధరాత్రి దాటింది. రోడ్ పక్కనే ఒక కుక్క ఆకలితో వెంట పడుతున్న తన పిల్లల మీద అరుస్తూ వుంది.

నడి రోడ్డు మీద ఒక ఆడది ఒంటరిగా ఆకలితో పరుగులు తీస్తోంది. అదే రోడ్డు మీద మందు బాబులు ఆకలి చూపులు తనని వెంటాడుతున్నాయి. మొండి ధైర్యంతో రోడ్లన్నీ తిరుగుతోంది.

"ఏం పిల్లా! ఎక్కడకి పోవాలి?" అని ఆటొవాడు పక్కనే ఆపాడు.

ఒక చిన్న టీ కొట్టు కనిపించింది. "అన్నా! పాలు , బిస్కట్ పాకెట్" అని అడిగింది. "అయిదువందలకి చిల్లర లేదు" అని కొట్టు వాడు అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ ఆ అయిదు వందలు లాక్కున్నాడు. "ఏయ్! ఈ అయిదు వందలు ఎక్కడవి నీకు? దొంగతనం చేసావా?" అని బెదిరించాడు. ఒంటి మీద చెయ్యి వేసాడు. "ఈ పిల్లాడు ఎవరు? ఎక్కడ నుంచి తీసుకొచ్చావు? పద స్టేషన్ కి పద" అని కోపంగా అన్నాడు.

చిరాకుతో తోసేసింది. కానిస్టేబుల్ కింద పడిపోయాడు. ఆమె భయంతో పరిగెట్టింది. కొంచెం దూరం వెళ్ళాక అదే కుక్క నిలబడి తననే చూస్తోంది. కొంచెం దూరంలో కుక్క పిల్లలు మూలుగుతూ వున్నాయి.

కుక్క దగ్గరకి వెళ్లింది. ప్రేమగా తలపై నిమిరింది. బిస్కట్ ప్యాకెట్ లు చించి నేల మీద వేసింది. కుక్క గబగబ బిస్కట్ లు తింటూ వుంది. పోలీసు కానిస్టేబుల్ విజిల్ వినిపించింది. తను మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్లింది.

తన గుడిసె వచ్చింది. లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. పొయ్యి మీద పాలు వేడి చేసింది. డబ్బాలో పోసి బిడ్డకి మెల్లగా పట్టింది. కాసేపటికి బిడ్డ కళ్ళు తెరిచాడు. ఇంకో బిస్కట్ ప్యాకెట్ తెరిచి తను తింటూ వుంది. బిడ్డ ఆకలి తీరాక తన ఆకలి గురించి ఆలోచించింది.

అక్కడ ఆకలి తీరిన కుక్క తన పిల్లలకు పాలు ఇస్తోంది. అవి ఆనందం గా తల్లి కడుపులో దాక్కొని పాలు తాగుతున్నాయి. ఆ కుక్క మిగిలిన బిస్కెట్ ముక్కల్ని కూడా నాకుతూ తింటూ వుంది.

ఆ కానిస్టేబుల్ గుడిసె దగ్గరికి వచ్చాడు. తలుపు తట్టాడు. తను భయంతో ఒక మూల కూర్చుంది. "నీ అయిదు వందలు వద్దా?" అని గట్టిగా అరిచాడు. "నీకు ఇంకో అయిదు వందలు ఇస్తాను. తలుపు తెరువు" అని కోపం తో అన్నాడు.

అప్పుడే కుక్క అరుస్తూ వచ్చింది. దాన్ని తరిమేసే ప్రయత్నం చేసాడు. రాయి విసిరాడు. అది కోపంగా అరుస్తూనే వుంది. మీద మీదకి వస్తూ వుంది. ఆ కుక్క అలా గట్టిగా అరుస్తూనే వుంది. ఇక చేసేది లేక కానిస్టేబుల్ ఆకలి తీరకుండానే అక్కడి నుంచి పారిపోయాడు.


56 views0 comments
bottom of page