'Alu ledu Chulu Ledu' written by Madduri Bindumadhavi
రచన : మద్దూరి బిందుమాధవి
అసలు పెళ్ళే కాని ఒక పెద్ద మనిషి, డాంబికంగా నా అల్లుడి పేరు సోమలింగం అని ఎవరితోనో చెబుతున్న సందర్భంలో వాడిన సామెత ఇది!
కధలోకి వెళదాము.
***
"వంటింట్లో సింకులో పంపు కారి పోతోందండి. సొసైటీ సెక్రెటరీ మాటి మాటికీ వచ్చి 'మీ మూలాన వాటర్ ట్యాంక్ గంటలో ఖాళీ అవుతున్నది, మీ పంపు బాగు చేయించకపోతే ఈ నెల నీళ్ళ బిల్ మీరు ఎక్కువ కట్టాలి ' అని వార్నింగ్ ఇచ్చి వెళుతున్నాడు. ఎన్ని సార్లు చెప్పినా మీపనులు మీవే కానీ నా గోడు పట్టించుకోరేం" సుమతి ఇరవయ్యొకటో సారి భర్తతో పోరుతున్నది.
"ఇంకెన్నాళ్ళు, నాలుగు నెలలు ఓపిక పట్టు. ఇంచక్కా మన కొత్త ఫ్లాట్ లోకి వెళ్ళిపోతాం!
మన ఓనర్ కి అద్దె తీసుకెళ్ళటమే తెలుసు కానీ రిపేర్లు చేయించటం మీద శ్రద్ధ లేదు. చచ్చిపోతున్నా ఫోన్ చెయ్యలేక" అన్నాడు అర్జున్ భార్యని ఊరడిస్తూ.
"ఏడిచినట్టే ఉంది. మన కొత్త ఫ్లాట్ కి వెళ్ళి పోదాం అనే మాట ఏడాది బట్టి చెబుతున్నారు. ఆయనదేముంది, ఇదిగో చేయించేస్తానంటాడు ఓనర్. సెక్రెట్రీ తో మాటలు పడలేక మనం చస్తున్నాం! నా మాట విని మన సందు చివర ఉన్న దినేష్ ట్రేడింగ్ కి వెళ్ళో, అర్బన్ క్లాప్ ద్వారానో ఒక ప్లంబర్ ని పిలుచుకు రండి. కనీసం ఉన్నన్నాళ్ళు నీళ్ళు కారిపోకుండా జాగ్రత్త పడచ్చు" అన్నది.
"ఏరా మన కొత్త ఫ్లాట్ లో పూజ గది ప్రత్యేకంగా ఉన్నదా? మీరు హాల్లో గోడకి పెట్టిన దేవుడి పటాల ముందు నిలబడి దీపం పెట్టటం, సుప్రభాతం చదువుకోవటం కష్టంగా ఉందిరా! వచ్చే వయసా..పోయే వయసా..మోకాళ్ళు ఒకటే నొప్పి" అన్నది అర్జున్ తల్లి వెంకమ్మ గారు.
"నీ సమస్య చూస్తూనే ఉన్నానమ్మా! అందుకే ఆ బిల్డర్ కి మన ఫ్లాట్ వరకు పూజ గది సెపెరేట్ గా కట్టాలని ముందే చెప్పా. పాపం అతను 'సరేనండి, మీరు అంతగా చెప్పాలా? పెద్దవారి అవసరాలు, కష్టాలు నాకు తెలుసు. మీకు కావలసినట్టే కడతానని' హామీ కూడా ఇచ్చాడు" అన్నాడు తల్లి భుజం మీద చెయ్యేసి!
***
"అమ్మా తమ్ముడు చూడవే పెద్ద సౌండ్ తో పాటలు పెట్టి దానికి తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నాడు. రేపు నాకు పరీక్ష ఉంది" అని గట్టిగా శ్రీలేఖ తన రూం లోనించి అరుస్తోంది.
"నీ ఏడుపేదో హాల్లో ఏడవచ్చు కదరా" అంది సుమతి కొడుకు మహేష్ తో!
"అక్కడ బామ్మ టీవీ చూస్తోంది. పాటలు వినటం కుదరదు. రేపు మా కాలేజిలో ఫ్రెషర్స్ పార్టీ ఉంది. దానికి మా ఫ్రెండ్స్ అందరం ఒక పాటకి డ్యాన్స్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేస్తుంటే ఈ రాక్షసి అరుస్తోంది. నన్ను చూస్తే చాలు రెచ్చిపోతుంది. నా రూం నాకు కావాలి మమ్మీ. నువ్వేం చేస్తావో " అన్నాడు.
"అబ్బబ్బా ఏంటర్రా మీ గొడవ. అరగంట సేపు ప్రశాంతంగా ఉండరు కదా! ఆరు నెలలు ఓపిక పట్టండి. మన కొత్త ఫ్లాట్ లో ఎవరి రూంలో వాళ్ళు హాయిగా మీకు నచ్చినట్టు ఉండచ్చు" అన్నాడు అర్జున్.
"ఆరు నెల్ల క్రితం కూడా ఇలాగే ఆరు నెలలు ఓపిక పట్టు అన్నావు. ఇంతవరకు ఒక్క సారి కూడా తీసుకెళ్ళి మన ఫ్లాట్ చూపించలేదు. అసలు ఎడ్వాన్స్ అయినా కట్టారా?" అన్నాడు మహేష్.
***
"ఓహో మీ స్టాఫ్ అంతా ఎక్కడైనా గ్రూప్ హౌసింగ్ లో ఫ్లాట్స్ కొంటున్నారా? లేక మీ యాజమాన్యం వాళ్ళు మీ అందరి కోసం ఎక్కడైనా లే అవుట్ చేయిస్తున్నారా? చెప్పనే లేదేరా" అన్నాడు అప్పుడే లోపలికి వస్తున్న మిత్రుడు ప్రకాష్.
"నీకు చెప్పకుండానా? మొన్న మా ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి ఉప్పల్ అవతల నాగోల్ విలేజిలో ఒక స్థలం చూసొచ్చాము. అది మేము అనుకున్న రేట్ కి ఫైనలైజ్ అయితే, త్వరలో కొనేసి ఫ్లాట్స్ కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం" అన్నాడు అర్జున్ ఉత్సాహంగా!
"ఏది ఆ పొలాలా? అది చెరువుకదరా! పైగా అది వ్యవసాయ భూమి! దాన్ని ముందు ఫీజ్ కట్టి రెసిడెన్షియల్ కిందికి కన్వర్షన్ చెయ్యాలి. తరువాత అక్కడ ఇళ్ళు కట్టాలంటే ముందుగా మట్టితో బోలెడంత నింపాలి. పునాదుల్లో నీరు ఊరితే బిల్డింగ్ గట్టి ఉండదు. గట్టివానలు పడితే, సెకండ్ ఫ్లోర్ వరకు నీరొచ్చేస్తుంది. భలే చోటే ఎన్నుకున్నారు. అసలు ఎవడు నీకు ఆ స్థలం చూపించింది! పైన చెప్పినవన్నీ కాక అక్కడ కొన్ని లాండ్స్ డిస్ప్యూట్స్ లో ఉన్నాయి. మీరు చూసిన లాండ్ అందులో ఉందేమో చూసుకోవాలి. నిన్న పేపర్ చూశావా? ఒక పేరు మోసిన రాజకీయ నాయకుడికి, బిజినెస్ మ్యాన్ కి మధ్య చాలా రోజుల నించి కోర్ట్ లో కేస్ నడుస్తున్నది. మధ్యలో మూడో వాడెవడో మీబోటి అమాయకులని పోగేసి డబ్బు చేసుకుంటున్నాడన్నమాట" అన్నాడు.
"ఎడ్వాన్స్ ఏమన్నా ఇచ్చావా" అన్నాడు కంగారుగా ప్రకాష్.
"ఆఫీసులో లోన్ కి అప్లై చేశాను. వచ్చాక కడతానని చెప్పాను" అన్నాడు.
"ఓరిని ఇదా మీరు మాకు ఇన్నాళ్ళనించి చెబుతున్న ఫ్లాట్! మీ మాటలని బట్టి కట్టుబడి అంతా అయిపోయి రేపో మాపో ఇచ్చేస్తారు. కార్తీక మాసంలో గృహప్రవేశం అయిపోవటమే అనుకుంటున్నాను." అంటూ
"వెనకటికి మా బామ్మ చెబుతుండేది 'ఆలూ లేదు చూలూ లేదు..అల్లుడికి సోమ లింగం అని పేరు ఉండాలని' మన బోటి మొగుడూ పెళ్ళాలు పోట్లాడుకున్నారుట. అట్లా ఉంది. మీరు రాబట్టి సరిపోయింది అన్నయ్యా..లేకపోతే పప్పులో కాలేసి, జీవితమంతా కడుక్కునే పని చేసేవారు మీ ఫ్రెండ్. కూర్చోండి, మమ్మల్ని పెద్ద ప్రమాదం నించి రక్షించినందుకు మీకు స్వీట్ పెట్టి కాఫీ ఇస్తాను" అని లోపలికి వెళ్ళింది సుమతి.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.
సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
Comments