కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Ame Padalu' New Telugu Story
Written By Kotthapalli Udayababu
రచన : కొత్తపల్లి ఉదయబాబు
''అమ్మా.. ధరణీ. దేవుడి మందిరంలో ఒక పసుపు పచ్చని పాదాల ఫోటో ఉండాలి కదా. ఏమైందమ్మా? కనిపించడం లేదు?'' పూజకు కూర్చోబోతూ కోడలిని అడిగాడు పూర్ణచంద్రరావు.
''దానిని తీసి మీ బట్టల బీరువాలో బట్టల మధ్య భద్రంగా దాచి పెట్టాను మామయ్య గారు. కొత్తగా గృహప్రవేశం అయిన ఇంట్లో పూజామందిరంలో దేవుళ్ళ పక్కన అలాంటి ఫోటోలు ఉండకూడదని యు ట్యూబ్ వీడియోల్లో ఒక పండితుడు చెప్పారండీ. అందుకే తీసేసాను. ఏమీ అనుకోకండి'' అంటూ పూజా మందిరం బయటే నిలబడి జవాబు చెప్పింది ధరణి.
పూర్ణచంద్ర రావు గారు వెంటనే లేచి పూజామందిరం లోంచి బయటికి వచ్చేసారు.
''అదేంటి మావయ్యగారు... దీపం పెట్టుకోకుండా వచ్చేసారు?'' అడిగింది ధరణి.
''అవి ఉన్న చోటే నాకు పూజా మందిరం అమ్మా.. ఈరోజునుంచి నువ్వు గాని, అబ్బాయి గాని దీపం పెట్టేసుకోండి. '' అని తన గదిలోకి వెళ్లిపోబోయారాయన.
''మీతో చెప్పకుండా తీసేశానని కోపం వచ్చిందా మామయ్యగారు?'' అడిగింది ఆమె
''లేదమ్మా. దానికి నాకు కోపం ఎందుకు? నా దృష్టిలో ఆ పాదాలే నాకు నిజమైన దేవుడు. నేనీవేళ ఇలా ఉన్నానంటే ఆ పాదాలే కారణం. ఉదయం అనగా ఆఫీసుకు పోయి ఎపుడో రాత్రి వస్తాడు వాడు. తెల్లవారి లేస్తూనే ఏ టిఫిన్ చేయాలా అన్న ఆలోచనతో వంటగదిలో కుస్తీ పడుతుంటావు నువ్వు. నిండు ఇంట్లో దీపం పెట్టుకోకపోతే అరిష్టం అని మాఅమ్మగారు చెప్పారు. నేను ఆపాదాలు దేవుడి మందిరంలో పెట్టిననాడు నువ్వు అభ్యంతరం చెప్పలేదని ఇంతకాలం దీపారాధన చేస్తూ వచ్చాను. అది అక్కడ లేకపోయిన తరువాత నాకు దేవుడి మందిరంలో పనిలేదమ్మా. ఎందుకంటే అది ఉన్నచోటే నాకు దేవుని మందిరం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా”.
ఆయన తన గదిలోకి వెళ్లిపోయారు.
''ఆ... యు ట్యూబ్ లో పంతులు గారికన్నా ఈయనకు ఎక్కువ తెలుసేమిటి? మీరు పెట్టకపోతే మానేయండి. వీలున్ననాడు పెట్టుకుంటాను.. లేనినాడు లేదు. అయినా అసలా ఫొటోలో ఏముందని? కాళ్ళకి చిక్కటి దేశవాళీ పసుపురాసుకుని, పారాణీ పెట్టుకుని, రెండు కాళ్ళ బొటన వేళ్ళకు పక్కనున్న రెండో వేళ్ళకు వెండి మట్టెలుపెట్టుకుని, వెండి పట్టీలు పెట్టుకున్న లేత తములపాకుల్లా మెరిసిపోతున్న రెండు కాళ్ళు ఉన్న బొమ్మ అది. ఇంతకాలం ఎక్కడ దాచారో... బయటకు వెళ్ళినపుడు లామినేషన్ చేయించి తెచ్చుకున్నారు కాబోలు పూజామందిరంలో పెట్టుకున్నారు. అలా ఉండకూడదని తెలుసుకున్నాకా తీసేసింది తానూ. ఇందులో తప్పేముంది? కొడుకు వచ్చిన వెంటనే పిర్యాదు చేస్తారేమో. చేస్తే చెయ్యనీ.. ఈయనకన్నా ముందు మొగుడికి తానే చెప్పేస్తే సరి అనుకుంది ధరణి.
******
ఆఫీసునుంచి భర్త రాగానే విషయం చెప్పేసింది ధరణి. ధీరజ్ విని ఊరుకున్నాడు. ఆయన అడిగితే అప్పుడే ఆ విషయం గురించి మాట్లాడవచ్చు అని.
ప్రతిరోజు సాయంత్రం 6, 7 గంటల మధ్య టిఫిన్ చేసేయడం పూర్ణచంద్రరావుగారు ఉద్యోగవిరమణ చేసాక అలవాటుగా మార్చుకున్నారు.. టిఫిన్ తిన్న తర్వాత, పడుకునే లోపు తిన్న ఆ కాస్త టిఫిన్ జీర్ణం అయిపోవాలని ఉద్దేశంతో పది నిమిషాలైనా నడక కొనసాగిస్తారు ఆయన. అనంతరం సరిగ్గా తొమ్మిది గంటలకు వార్తలలో ముఖ్యాంశాలు వినేసి, తన గదిలో నిద్రకుపక్రమించడం పరిపాటి ఆయనకు.
ఆరోజు ఆయన అలాగే ముఖ్యాంశాలు వినేసి ''పడుకుంటున్నాను అమ్మాయి'' అని చెప్పేసి సోఫాలో టీవీ చూస్తున్న కొడుకుతో 'శుభరాత్రి నాయనా' అని చెప్పి వెళ్లి మంచం మీద నడుం వాల్చారు.
ఆయనకు వెంటనే నిద్ర పట్టలేదు. ఆ ఫొటోలోని పాదాలు, వాటితో పాటు తన భార్య గుర్తుకువచ్చింది.
''ఏవండీ''
''ఏమిటి ?''
'' ఎంత సేపు ఫోను లేదా టివి. వాటి నుంచి ఈ ప్రపంచం లోకి వస్తే చెప్తాను. ''అంటూ ఫోన్ అతని చేతుల్లోని ఫోన్ తీసుకుని తన పక్కన పెట్టుకుంది ధరణి.
'' ఊ.. చెప్పు... ''అన్నాడు
''ఆఫీసునుంచి వచ్చిన వెంటనే చెప్పానుగా. చచ్చిపోయిన వాళ్ళవి గాని, అమ్మవారి పాదాలో అలాంటి ఫోటోలు పూజామందిరంలో పెట్టుకుంటారా ఎవరైనా? పైగా దేవుళ్ళ పక్కన. నిన్న సాయంత్రం ఆ ఫోటో తీసేసి మీ నాన్నగారి బీరువాలో పెట్టేసాను. దానికి ఆయనకు కోపం వచ్చినట్టుంది. ఇవాళ ఉదయం 'ఈరోజునుంచి నిత్య దీపం నువ్వే పెట్టేసుకో అమ్మా' నా గది అలమారులో నేను దీపం పెట్టుకుంటా' అన్నారు. ఇంటికి పెద్దాయన, మన అందరి తరపున ఆయన పెడుతున్నారు గదా... అని నేను దీపం పెట్టడం లేదు. మీరు టైం ఉండదు. నాకు ఆయన పద్దతి నచ్చలేదు. '' అంది
''పోనీలే... నిన్ను దీపం పెట్టుకోమన్నారుగా... మన కుటుంబ శ్రేయస్సుకోసం నువ్వే పెట్టు. ''అన్నాడు ధీరజ్.
''ఏంటి ధీరజ్ నన్ను... ఏడిపిస్తావ్... దీపం ఎలా పెడ్తారో తెలుసు.. కానీ ఒక్క శ్లోకం కూడా రాదు. ''
''మరి రానిదానివి ఆయనతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు?''
''నువ్వు పెడతావని. ''
''నువ్వే చెప్పావుగా నాకు టైం సరిపోదని. ''
''ప్లీజ్ ధీరు... నువ్వు పెట్టూ.. ''
''చూడు... నీకు తోచదు... నాన్నగారు చేస్తే నచ్చదు.... ఎలా నీతో? చూడు. ఈ యూ ట్యూబ్ వచ్చాకా మిడి మిడి జ్ఞానం ఉన్నవాళ్లు అందరూ ఏదో నోటి కొచ్చిన విషయాన్ని చెప్పేయడం... అది విని అక్షరం ముక్క తెలియనివాళ్ళు నమ్మేయడం. అంటే తప్ప... అయ్యో... పెద్దాయన.. ఏ కారణం లేకుండా అలాంటి ఫోటో దేవుడి మందిరం లో పెట్టరన్న కనీసపు ఆలోచన ఉండాలి కదా. ''
''ఓహో.. అలాగా... అయితే అలాంటి ఫోటోలు పెట్టుకోవచ్చన్నమాట. కానీ ఈ మధ్య దొంగ బాబాలు, దేవుడమ్మలు వెలుస్తున్నారుగా... వాళ్ళ ఫోటో ఏమో అని నా అనుమానం. అందుకే తీసేసాను,. ''
''పెట్టుకోవచ్చొ లేదో నాకు తెలీదు. నాకు తెలిసినది మాత్రం ఒకటే. మన నమ్మకమే మనని కాపాడే భగవంతుడు. దేశంలో ప్రసిద్ధి కెక్కిన సాయిబాబా సమాధి పై గుడి కట్టి పూజిస్తున్నారు. రక్తం అంటుకున్న రాయిని అమ్మవారి రూపం గా భావించి కొలుస్తున్నారు. దేవుళ్ళ విగ్రహాలని ఈనాటికీ ఆగ్రహంతో విరక్కొట్టి సవాలు విసిరే సంఘటనలు ఎన్నో ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. నమ్మకంతో దృష్టి కేంద్రీకరించి పూజించడం ముఖ్యం. నీ పూజామందిరం లోని దేవుని విగ్రహాలు మంత్రం తో ప్రతిష్టించినవి కావు. అలా ప్రతిష్టించిన ఖరీదైన గుడులలోనే పూజారులు యాంత్రికంగా పూజ చేసి డబ్బు గూగుల్ పే ల ద్వారా తమ ఖాతాలలోకి రప్పించుకుంటున్నారే. ఆయన ఏ నమ్మకంతోనో ఒక చిన్న ఫోటో పెట్టుకుని ఇంటి పెద్దగా మన కుటుంబ క్షేమం కోసం పూజ చేసుకుంటుంటే దాన్ని కూడా ఆపించడం నువ్వు మన కుటుంబానికి చేసిన అపకారంగా భావిస్తున్నాను. '' అన్నాడు ధీరజ్.
''అబ్బాయి చెప్పింది అక్షరాలా నిజమమ్మా. '' ఉలిక్కిపడి ఆమాటలు విన్న దిక్కుగా చూసింది ధరణి.
పూర్ణచంద్రరావుగారు ఆయన గది గుమ్మంలో నిలబడి ఉన్నారు. ఆయన చేతుల్లో ధరణి పూజామందిరం లోంచి తీసేసిన ఫోటో ఉంది.
''మీరింకా పడుకోలేదా మావయ్యా?'' ధరణి దిగ్గున లేచి నిలబడింది.
''కూర్చోమ్మా... ఏ విషయంలో అయినా అనుమానం ఉన్నపుడు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం మంచిది. కొన్ని అనుమానాలతో జీవితాలే విడిపోవచ్చు. అందుకే నేను కూడా మీదగ్గరకు వచ్చాను. ''
ధరణి కూర్చుంది. ఆయన కొడుకు పక్కన కూర్చున్నారు.
ధరణికి తన చేతిలోని ఫోటో చూపిస్తూ అన్నారు.
'' ఈనాడు మనం ఇలా ఉన్నామంటే కారణం ఈ పాదాలేనమ్మా. స్నేహితులు, వ్యసనాల పేరుతో సిగరెట్టు, జూదం, తాగుడు అన్ని అలవాట్లు ఉన్న జంతువు లాంటి మనిషిని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దిన ఓ దేవుడమ్మ పాదాలు ఇవి. పవిత్ర శ్రావణ శుక్రవారం నాడు సాక్షాత్తు లక్ష్మీదేవిలా నా నట్టింట్లో నిలబడినపుడు నన్ను మనిషిగా మలచిన ఆ పవిత్రమూర్తి అనుమతితో ఫోటో తీసుకున్న పాదాలు. ఈనాడు నీభర్త, నువ్వు పిల్ల పాపలతో ఇంత ఉన్నతంగా సుఖంగా ఉన్నారంటే ఆమె ఓర్పు, సహనం, కృషి,పట్టుదల, సాధనలే కారణం. ఈ అయిదు పంచప్రాణాలుగా నన్ను మార్చిన దేవత. ఆమె లేకపోతే నీ భర్త లేడు. నేను లేను. మేము లేకపోతే నీవూ లేవు.
మనకన్నా చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, మరణించినవాళ్ళు దైవంతో సమానం అంటారు. అందుకే ఆమె పాదాల ఫోటోని దేవుని మందిరంలో పెట్టాను. నిజానికి నేను దీపం పెట్టేది నీ వెండి విగ్రహాలకు కాదమ్మా. ఆ నిండు ముత్తైదువ పాదాలకు. నిజానికి దీపం ఎందుకు పెడతారో తెలుసామ్మా?
*దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతేl
భావం... దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం.
నాలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించిన ఆపాదాలు స్వయానా నీ అత్తగారివి. ఇదుగో. దీనిని నీ చేతుల్లో పెడుతున్నాను. నువు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం" అన్నారాయన దానిని ఆమె చేతుల్లో పెడుతూ.
మణికర్ణికా ఘట్టంలో మిట్టమధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం చేసివచ్చినట్టుగా కన్నీళ్లు జాలువారుతుండగా ఆ ఫోటో అందుకుంది ధరణి.
"నన్ను క్షమించండి మామయ్యా. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన చట్రంలో ఇరుక్కుపోయిన నేను మీ శిక్షణలో అన్ని నేర్చుకుని నాలోని అజ్ఞానాన్ని పారద్రోలేందుకు అనునిత్యం నేనే దీపం పెడతాను మామయ్యా. నా అజ్ఞానాన్ని మన్నించండి" అని పూర్ణచంద్రరావుకి నమస్కరించింది ధరణి.
మరునాడు ఉదయమే తండ్రీకొడుకులు దేవుని మందిరంలోనుంచి వస్తున్న హారతి ఘంటానాదాన్ని వింటూనే లేచి, పవితమైన మనసులతో వచ్చి నమస్కరించుకున్నారు.
***శుభం***
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
సమాప్తం
రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
*చివరగా నా అభిప్రాయం :*
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్
Comments