
'Amma Diary' Written By Ramu Kola
రచన : రాము కోలా
అమ్మ నా చేతిలో డైరీ ఉంచుతూ,
చివరి సారిగా నా వైపు చూసిన చూపు,ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు నన్ను శోధించుకోమనేలా అనిపించడంతో...
గుండె దిటవు చేసుకుంటూనే ..
అమ్మ వ్రాసుకున్న డైరీలోని అక్షరాన్ని ప్రేమగా కంటి చూపుతో స్పృశిస్తూ చదువుతున్నా!
చేయి తిరిగిన శిల్పి అక్షరాలను చెక్కినట్లు ఎంత ముద్దుగా ఉన్నాయో అక్షరాలు.
"ఏమండి!
ఈ రోజైనా కాస్త గుర్తుపెట్టుకుని,
కళ్ళజోడు గ్లాసులు మార్పించుకొండి..!
చీకట్లో తడుముకుంటూ నడవడం మీకు ఇబ్బంది అవుతుందని నేను గ్రహించాను లెండి.,
"ఎన్నాళ్ళు నాకు తెలియకుండా దాస్తారు" అంటుంటే
నా వైపు చూసి తను నవ్విన నవ్వు నాకు ఇంకా బాగా గుర్తు.
పసితనం తొలగలేదు తనలో అనిపించేలా ఉంది.
"దీనికి పెట్టే ఖర్చుతో నీకో మంచి కాటన్ చీర కొనాలనుందోయ్..!"
"కానీ! అబ్బాయికి అదేదో పుస్తకం కావాలంటేను! నా మతిమరుపును మరోసారి వేడుకున్నా! నా వెంటే ఉండి ఆ విషయంను గుర్తురానీయక కాపలా ఉండమని."
అని సమయస్ఫూర్తితో మీరు చెప్పిన మాట,గృహస్తుని బాధ్యతను తెలియ చేసింది.
ఆనాడు.
"నాకు బాగా గుర్తుంది!
సంవత్సరమంతా శ్రమించి,పండించిన పంట పట్నంలో అమ్మలేక అమ్మేసి,
వస్తూ వస్తూ నాకోసం ఓ కాటన్ చీర తెచ్చి, వెనుక వెనుక దాచుకుంటుంటే!"
"ఆట పట్టించడానికి అనుకున్నా!"
"కానీ!చిరిగిన మీ పంచె నాకు కనిపించనీయక చేస్తున్నారని,మరుసటి రోజు మీ పంచె ఉతికే వరకు నాకు తెలియలేదు."
"ఎంత స్వార్థం మీది.!"
"చూడండి అల్లుడుగారు,
పిల్లల్ని చదివించారు సరే!మరి విదేశాలు పంపించే ప్రయత్నం ఏదైనా చేస్తాన్నారా?
"వాడితో చదువుకున్న వాళ్ళు అందరూ విదేశాలు వెళ్ళిపోతున్నారు."
"పిచ్చి సన్నాసి! మిమ్ముల్ని అడగలేక మోహమాట పడుతున్నాడు"
"తాను చదివిన చదువుకు ,మంచి ఉద్యోగం వస్తుందంట అక్కడ"
"వాడి చిన్న కోరిక తీర్చేయండి అల్లుడు గారు."
"నా కోరిక కూడా అదే అనుకోండి."
ఓ పెద్ద గుదిబండ మీ నెత్తిన మా అమ్మగారు వేసి చేతులు దులుపుకు వెళ్ళిపోతే!
వాడిని విదేశాలకు పంపేందుకు మీరు కిడ్నీ ఒకటి..
తండ్రిగా మీ బాధ్యతను నెరవేర్చడం కోసం
ఆ వయసులో...
ఎంత స్వార్థరహితంగా నిర్ణయం తీసుకున్నారో?
"మనిషి దేవుడుగా మారడమంటే ఇదేనని..
నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పేవరకు తెలియలేదండి.
"మా మధ్యన సంచరించే దైవం మీరని."
"తొలిసూరు కాన్పు,డిలివరీ కష్టంగా ఉంది,ఆపరేషన్ చేయాక తప్పదు,
తనకేమో రక్తం సరిపడ లేదు,మీరు బ్లడ్ డొనేట్ చేసేవారిని విలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలి"
అని డాక్టర్ చెప్పారని తెలిసి మీ స్నేహితులతో కలిసి మీరూ హాస్పిటల్ లో రక్తం అందించిన విషయం , ఎవ్వరికీ తెలియనీయకుండా దాచిన మీ దొంగ బుద్దిని ఏమనాలో తెలియక,చేతులేత్తి నమస్కరించిన వియ్యపురాలిని,ఈ విషయం వాడికి చెప్పకండి"అని వేడుకున్నా మీ రూపం
నా కన్నుల్లో చెరగని చిత్రమే..
"విదేశాలకు ఎగిరిపోతున్న తన బిడ్డ,ఎదగాలని మనసారా కోరుకున్న ఒకప్పటి పది ఎకరాల భూస్వామి,నేడు రోజువారి కూడలిగా తన భూమి లోనే పని చేస్తున్నాడనే విషయం బిడ్డకు తెలియనీయక తనలోనే దాచుకుని,ఎదబారమై
దివికేగిన నీకోసం ..
నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలను అనుకున్నావ్?
నువ్వు దాచినట్లే నేనూ కొన్ని దాచాను నా శరీరంలో
,అవే నన్ను నీ దగ్గరకు చేర్చే మృత్యువుకు స్వాగతం పలుకుతున్నాయ్.
వస్తున్నా!నీకోసం...
కొన్ని నిజాలు మనం కలిసి మాట్లాడుకుందాం!
తరువాత ..పేజీ ఖాళీగా కనిపిస్తుంది.
అమ్మా నాన్నల స్వచ్చమైన త్యాగాలను
లిఖించేందుకు అక్షరమే లేదంటూ..
�� శుభం��
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : నా పేరు రాము కోలా. మాది ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు.
విద్యార్హత డిగ్రీ.
ఇప్పటివరకు150 కథలు,1500 కవితలు వ్రాసాను. అనేక వార్తా పత్రికలు నా కవితలు, కథలుప్రచురించి తగిన గుర్తింపునిచ్చాయి. గాంధీ గ్లోబల్ ఫామిలీ & గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారు గాంధీ విశ్వకవి సమ్మేళనం 2020 హైదరాబాద్ లో నిర్వహించి ఇచ్చిన " సాహిత్య రత్న" బిరుదు నాకు అమూల్యమైనది.
Comments