top of page

అమ్మ వీలునామా


Amma Veelunama Written By G, Satyanarayana Rao రచన : జి.సత్యనారాయణ రావు


“ముగ్గు బుట్టవంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతిలేని గాజుకళ్ళు, తనకన్నా శవం నయం ఓల్టేజ్‌ హోంలో.

తనకు కేటాయించిన రూంలో మంచంపైన కూర్చొని శ్రీశ్రీ రచనను గుర్తుకు తెచ్చుకొని, తనలోతాను నవ్వుకోసాగింది కాత్యాయిని. శ్రీశ్రీ తనకోసమే రాశాడా అని, తననుతాను పోల్చుకొంటూ, ఓసారి తన గతంలోకి తొంగిచూసింది, ఏడుపదులు దాటిన కాత్యాయిని. శ్రీశ్రీ అంటే అంతే, తట్టిలేపని దెవరినని!

“ఏంటో ఈ పిల్లలు తెల్లారినా లేవరు, ఓ పండగాలేదు, ఓ పబ్బమూలేదూ అంటూ తనలో తనే గొణుక్కొంటూ, శ్రావణమాసం కావడంవల్ల, తెల్లారి నాలుగ్గంటలకే లేచి, ఇల్లంతా చిమ్మి స్నానంకూడా ముగించి, తులసిపూజ కానిచ్చింది కాత్యాయిని. ఇంటిపనులకోసం, కూతుళ్ళు 'కవిత, వనిత'లను లేవండని ఓ కేక వేసింది.

“ఏంటే నీ అరుపులు, నిద్రనంతా పాడుచేస్తున్నావు" అంటూ గొణుక్కొన్నాడు, కాత్యాయిని భర్త శ్రీమన్నారాయణ,

“మీకు నిద్ర పాడుకావడమేమిటండి, ఊళ్ళో అందరిపనులూ మీవేగా. వాటికోసం తిరిగి తిరిగి తప్పకుండా అలసిపోయే వుంటారు, పడుకోండి పడుకోండి” కొంత కోపంగానే సమాధానమిచ్చింది భర్తకు కాత్యాయిని.

“ఎందుకే ఉదయాన్నే అంతకోపం, ఎలాగూ నిద్రలేకుండా చేసేశావు, కాస్తా నీ బంగారు చేత్తో కొంచం కాఫీ ఇవ్వరాదూ" భార్యకోపం తగ్గడానికి ఓ ఎత్తువేశాడు శ్రీమన్నారాయణ. ఎంతైనా భార్యభర్తల అనుబంధం చాలా గొప్పది. చేస్తున్న పనులను కాస్తా పక్కనపెట్టి భర్తకు ఓ స్ట్రాంగ్ ‌ కాఫీ అందించింది కాత్యాయిని.

అంతలోనే కూతుళ్ళిద్దరూ కళ్ళు నులుముకొంటూ “ఏమ్మా! రోజూమేమేనా, అన్నలనూ తమ్ముళ్ళను లేపవచ్చుగా అన్నారు కవిత, వనితలు.

అందుకు కాత్యాయిని “మాటలుబాగా నేర్చారే మీరీమధ్య! మిమ్మల్నికాదు, మిమ్మల్నిలా తయారుచేసిన మీనాన్నను అనాలి" అంటూ, "సరే సరే తొందరగా స్నానాలు

చేసిరండి, చాలా పనులున్నాయి అని పురమాయించింది . నాన్నను ఓకంట చూస్తూ

నవ్వుకొంటూ స్నానాలకు వెళ్ళిపోయారు అక్కావెల్లెళ్ళు.

కాత్యాయిని దంపతులకు ఆరుగురు సంతానం. ముందు కవలలు, ఇద్దరూ మగపిల్లలే. సంతోషంగా ఆనందంగా వుండాలని వాళ్ళకు “సంతోష్‌, ఆనంద్‌” ఆని పేర్లు పెట్టారు. అమ్మాయి ఇంటికి అందమని, అమ్మాయి వుంటే బాగుంటుందని అనుకొన్నారు కాత్యాయిని, శ్రీమన్నారాయణలు. అంతే తర్వాతి కాన్పులో మరలా కవలలు. కాకుంటే ఈసారి ఇద్దరూ ఆడపిల్లలు. వారే కవిత, వనితలు. వాళ్ళుకాస్తా పెద్దయ్యేలోపు వారికి ఇద్దరు చిట్టితమ్ముళ్ళు వచ్చారు. వారే రాముడు, కృష్ణుడు. కాత్యాయిని ఇల్లంతా సందడే సందడి.

శ్రీమన్నారాయణ ఊళ్ళో అందరికీ కావాల్సినవాడే కాని, ఆదాయం సంగతి దేవుడికే తెలియాలి. ఆదేవుడి దయవల్ల, తాతలనాటి సాంతిల్లు వుండడమనేది కాస్త సహాయమనే చెప్పాలి. ఇల్లు గడవడంకోసం

కాత్యాయిని టైలరింగ్‌ చేస్తూ పిల్లలకు ట్యూషన్లు చెబుతుండేది. భార్య ఏమడిగినా దానికి ఒకటే సమాధానం 'ఆ పైవాడున్నాడులేవే, కంగారెందుకు' అని. ఆపైవాడి దయవల్లనో, ఇంకే కారణాల వల్లనో, ముందుగా అమ్మాయిల పెళ్ళిళ్ళు, ఆతర్వాత 'సంతోష్‌ ఆనంద్‌ల' పెళ్ళిళ్ళు చకాచకా జరిగిపోయాయి.

మనిషి ఎంత ఎదిగినా "జరిగేదాన్ని ఆపలేకపోవడం, జరగనిదాన్ని జరిగేలాగ చేయడంగాని" ఓ వీలుకాని వింత కాబోలు. పెళ్ళిసంబరాలు సద్దుమణిగిన తర్వాత, ఓరోజు శ్రీమన్నారాయణ భార్యను తన గదిలో కూర్చొని 'ఏమే' అని కేకవేశాడు. 'ఈయనగారిదొకటి, ఉన్నఫళాన పిలవడమనేది బాగానే వంటబట్టింది'

అని తనలోతనే గొణుక్కుంటూ "చెప్పండి, ఏంటి ఆ ఆరుపులు?" అని కాస్త గట్టిగానే కసిరింది, భర్తను కాత్యాయిని.

"సరేలే... రారా, ఆతలుపు కాస్త ముందుకేసి ఇలాకూర్చో... నీకోముఖ్యమైన విషయం చెప్పాలి,

అలా కస్సుబుస్సులాడితే ఎలాగే" అంటూ కాస్త సరసంగానే పిలిచాడు.

“సరే కానీయ్యండి, ఆ చెప్పేదేంటో కాస్త తొందరగా చెప్పండి, నాకవతల చాలా పనులున్నాయి" అని, ఆత్రపడసాగింది కాత్యాయిని.

"అదికాదులే, కాస్త నింపాదిగా నేనుచెప్పేది కాస్తా విను, నీపనులు ఎప్పుడూ వుండేవే" అంటూ “ఏదో మన జీవితాలుఆ పై వాడి దయవల్ల గడిచిపోతున్నాయి, ఇకముందుకూడా అంతా వాడే చూసుకోంటాడులేవే!"

భర్త ఏం చెబుతున్నాడో కాత్యాయినికి ఏమీ అర్ధంకాలేదు.

“ఇదిగో నేను ఈ కవర్‌ నీకిస్తున్నాను, అనవసరంగా దీన్ని విప్పిచూడకు, మరెవ్వరికికూడా ఇవ్వనేఇవ్వకు. నీ జీవితంలో అత్యంత కష్ట్టమయంలో మాత్రమే దీన్ని ఓపెన్‌చేసి, వుపయోగించుకో, సరేనా... ఇదిగో తీసుకో అంటూ ఎన్నోజాగ్రత్తలు చెప్పాడు. ఏమీపాలుపోని

కాత్యాయిని “ఇదేంటండీ, ఈ కొత్తతంతు" అని అడిగినా, భర్తనుండి ఏలాంటి సమాధానం లేకపోయేసరికి, ఇచ్చిన ఆకవర్ను కాస్తా తన పెట్టెలోని చీరమడతల్లో దాచింది. మనిషి బ్రతుకే ఓ విచిత్రం. ఇంట్లో వివాహాలు జరిగిన రెండు నెలలకు గుండెపోటుతో శ్రీమన్నారాయణ హటాత్తుగా గతించాడు.

తన జీవితంలో ఏం జరుగుతున్నదో కాత్యాయినికి ఏమీ అర్థంకాలేదు.


“మనిషికి కష్టాలొచ్చినపుడే, మనమనుకొనే మనుషుల నైజం బయట పడుతుందట. కాత్యాయిని

విషయంలోకూడా అదే జరిగింది. భర్త చనిపోయిన షాక్‌నుండి కోలుకొనేలోపే, పెద్ద కొడుకులిద్దరూ, తమతమ భార్యల సలహామేరకు, వేరు కాపురాలకోసం ఉన్నవూరినే వదిలేశారు. తల్లి, ఇద్దరు తమ్ముళ్ళ ఆలనాపాలనా గురించి, మాత్రము ఆలోచించలేదు. ఇక కూతుళ్ళిద్దరూ వారివారి కాపురాల్లో మునిగిపోయారు. కాత్యాయినికి వయసు మీదపడటంవల్ల, టైలరింగ్‌ కష్టమైపోయింది. దానికితోడు ట్యూషన్సుకూడా తగ్గిపోసాగాయి. జీవితాన్ని వడబోసిన కాత్యాయిని ఏమాత్రం భయపడలేదు. పరిచయమున్న ఇళ్ళల్లో వంటలుచేయడం ప్రారంభించింది. తీరిక సమయాల్లో వడియాలు వరైరా అమ్ముకొంటూ, తన ఇద్దరు చిన్నకొడుకులు రాము,కృష్ణలచే టీచర్‌ట్రైనింగ్‌ ముగించింది. అతి తక్కువకాలంలోనే ఇద్దరకీ టీచర్‌ ఉద్యోగాలొచ్చాయి. "ఆకలికి ముందున్న ఆలోచన, మనిషికి ఆకలి తీరింతర్వాత వుండకూడదన్నదే ధర్మం

కాబోలు". అదే ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తించారు రాముడు, కృష్ణుడు ఊద్యోగాలు రాగానే, వారివారి పెళ్ళాలను వారే వెతుక్కొన్నారు. ఇక తర్వాతికథ మామూలే...పెళ్ళాము బెల్లమాయె..తల్లి....... ఊద్యోగం వున్నవూళ్ళోనే అయినందున, తల్లిని విధిలేక తనవద్దే వుంచుకొన్నాడు చిన్నకొడుకు కృష్ణుడు.


భర్తలేని లోటును భరిస్తూ ఓఏడాది, కాలం గడిపింది కాత్యాయిని. అందులోనే తన పిల్లల వల్ల ఎన్నో క్రొత్త

పాఠాలు నేర్చుకొన్నది కూడా! మన సమాజంలో చాలామంది బ్రతికినోళ్ళ ఆకలిని తీర్చకపోయినా, పోయినవారికి మాత్రం ఆబ్దికాలు చేస్తూనే వుంటారు, పిండాలు పెడుతూనే వుంటారు. పవిత్రమైన ఈ కార్యక్రమం ఓ తంతులాగా మారిపోయింది. నాన్నగారి సంవత్సరీకానికని, కాత్యాయిని పిల్లలందరూ తాము పుట్టిపెరిగిన ఇంటికి చేరుకొన్నారు. స్థానికంగావున్న కృష్ణుడు కార్యక్రమానికి నడుం బిగించాడు. కొడుకుల్లోని మార్పుచూసి

కాత్యాయిని అంతా నిజమేనని నమ్మింది, సంతోషించిందికూడా.ఎంతైనా 'తల్లికదామరి'.

మంచి ఆలోచనలు ప్రణాళిక ప్రకారం జరుగుతాయో లేదో తెలియదుకాని, కుత్సితతో కూడిన ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి, అందరిమనసుల్లో అదే బాగా తిష్ట వేసినపుడు, జరక్కుండా ఎక్కడికి పోతుంది? అదే జరిగింది కాత్యాయిని కొడుకులు వేసుకొన్న ప్రణాళికకు. ముందుగా కాత్యాయిని (ఆడమగ) సంతానం వేసుకొన్న ప్రణాళికను అమలుచెయ్యడానికి, కాత్యాయిని ప్రియమైన చిన్నకొడుకు కృష్ణుడు బాధ్యత తీసుకొన్నాడు. అందరూ కలిసి, శ్రీమన్నారాయణగారి సంవత్సరీకాన్ని కానిచ్చారు. పనిలోపనిగా, వాళ్ళ

నాన్న సంవత్సరీకానికి అయిన ఖర్చులను వివరించాడు. అన్నలు వారివారి వాట కృష్ణుడికి ఇచ్చేశారు.

అంతా గమనిస్తున్న కాత్యాయినికి, తన పిల్లలు ఏంచేస్తున్నారన్నది, ఎంతవరకూ బోధపడలేదు. అంతలోనే కవిత అందరికీ కాఫీలు అందించింది. ఇక తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దకొడుకు సంతోష్‌

అమ్మా! సూటిగా విషయానికొస్తున్నా. మేమందరంకలిసి ఓ నిర్ణయానికొచ్చాము, అదే ఈ ఇంటిని

అమ్మేద్దామని. దానికి సంబంధించి మార్వాడీ కిషన్‌సేట్‌తో, కోటీఇరవై లక్షలకు బేరంకూడా అయిపోయింది,ఎల్లుండే రిజిస్ట్రేషన్‌. కవిత, వనితలకు పసుపు కుంకుమల కోసం తలా పదిలక్షలు, తక్కింది మా నలుగురు అన్నదమ్ములకు చెరో ఇరవై ఐదు లక్షలు. ఇకనీవు మావద్ద చెరో మూడు నెలల వంతున వుంటావు. అంతేకాక నీ చాదస్తాలుమాని, ఉన్నంతలో సర్దుకుపోవాలి. లేదంటే నీవే కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి రాము

నిన్ను చూసుకొంటాడు అంటూ ఇంచుమించు హుకుం జారీచేసినట్లుగా, ముగించాడు. అంతావిన్న కాత్యాయినికి కళ్ళు బైర్లుకమ్మాయి. కూర్చొన్న కుర్చీచేతులు గట్టిగా పట్టు కొని తననుతాను తమాయించుకొంటూ తనలోతను అనుకొన్నది “ఈఇంట్లో తనస్థానం ఎక్కడ? పైగా తనప్రమేయం లేకనే, తనను నాలుగు ముక్కలుచేసేశారు, వీళ్ళనా నేను పెంచి, పెద్దచేసింది?" గత్యంతరంలేక కొడుకుల నిర్ణయానికి సరేఅన్నట్లు తలూపింది. అమ్మను పంచుకొన్నట్లే, అమ్మనగలను, సామాన్లను ఆడమగా తేడాలేకుండా పంచుకొన్నారు. వాటినిమాత్రం భద్రంగా దాచుకొన్నారుగాని, అమ్మనుమాత్రం అలా భద్రంగా గాలికొదిలేశారు.


“నాలుకకు ఎముకలేదు, అది తనకు తోచినప్పుడు, ఏదోవాగేస్తుంది. పరిస్థితిని బట్టీ మాట మార్చేస్తుంటుంది".

అమ్మను చెరి మూడునెలలు చూసుకొంటామన్న మాటకాస్తా, నీటిమూటయింది. ఒకడేమో “నేను,నా భార్య ఇద్దరం ఉద్యోగస్తులం, అమ్మను తమదగ్గర వుంచుకోవడం కుదరద"న్నాడు, రెండోవాడేమో నా భార్యకు ఆమె మూల్గుడు, దగ్గు భరించడం కుదరదన్నాడు. ఇక మూడోవాడు ఆమెకు ఆస్థిలేదు, ఏమీలేదు, నేనెందుకు భరించాలి, నావల్లకాదన్నాడు. అందరు అలా అనేసరికి, చిన్నవాడు కృష్ణుడు చూసుకొంటాడని కలగనింది కమ్మనైన అమ్మమనసు. అమ్మ కలను వమ్ముచేస్తూ, ఎవరికీ చెప్పకుండా, ఆమె పెట్టెతోసహా “అనాధ" అనిచెప్పి, ఓ ఓల్టేజ్‌ హోంలో చేర్పించి వుడాయించేశాడు, అమ్మకు చాలా బాగా ఇష్టమైన చిన్నకొడుకు "కృష్ణుడు".


“ఏమిజరిగినా, ఎన్నిజరిగినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గతంతో తడిసి ముద్దై పోయిన కాత్యాయిని, అప్పుడే బయటినుండి వచ్చిన, వృద్ధాశ్రమంలో తనతోపాటు ఉంటున్న 'శకుంతలమ్మ' పలకరింపుతో వాస్తవంలోకి వచ్చింది. “ఏమమ్మా మరలా నిన్ను చీదరించుకొన్న అందర్నీ తలచుకొని బాధపడుతున్నావా? మనంకాదు బాధపడాల్సింది, మనల్నిలా వదిలేసినందుకు వారే బాధపడాలి. సరేసరే ముఖంకడుక్కో. భోజనానికి పోదాం,ఎవరిదో పుట్టినరోజట, భోజనంతోపాటు చీరలు, దుప్పట్లు ఇంకా ఏవేవో ఇస్తున్నారట,వాళ్ళే మన పిల్లలనుకొని, దీవించివద్దాం పదా" అంటూ తనతోపాటు తీసుకెళ్ళింది శకుంతలమ్మ. మనసు

బాగాలేనప్పుడు, ఏదీ రుచించదు. ఏదో నాలుగు మెతుకులుతిని, తనరూంకు వచ్చిన కాత్యాయినికి, తళుక్కున తన భర్త ఇచ్చిన కవరు సంగతి, గుర్తుకొచ్చింది. గబాగబా తనపెట్టెను తెరిచి, చీరమడతల్లో వెతకసాగింది కంగారుగా! దొరికిన కవరులోని కాయితాలను తీసి ఆత్రంగా చదవసాగింది. ఎంత ప్రయత్నించినా, సరిగా కనిపించక పోవడంతో, ఓల్టేజ్‌ హోం మేనేజర్‌ సర్వేశంగారికి చూపిస్తూ "బాబు,ఈ కవరు నాభర్త నాకిచ్చి చాలాకాలమయింది. దీని సంగతే మరచిపోయాను. తీరా ఈరోజు గుర్తుకొచ్చి చదవబోతే, సరిగా కనిపించడంలేదు, ఇదేంటో కొంచెం చూడరూ" అని అడిగింది.

కవరులోని కాగితాలను తీసి చదివిన సర్వేశంగారు, ఒక్కసారిగా ఆశ్చర్యంగా కాత్యాయినిని చూస్తుండి పోయాడు.

కాత్యాయినికి ఏమీ అర్ధంకాలేదు. “ఏం బాబు? ఏముంది అందులో.ఎందుకు నన్నలా చూస్తుండిపోయారు" అని ఆదుర్దాగా అడిగింది . కొంత తమాయించుకొని ఓల్టేజ్‌ హోం పెద్దల్నికూడా పిలిచాడు. కాత్యాయినికి ఏం జరుగుతుందో ఏమీపాలుపోలేదు. “అమ్మ, మీరు కాస్త నిబ్బరంగా వినాల్సిన విషయం, కంగారుపడకండి, ఇప్పుడు మీరు మామూలు కాత్యాయినిగారు కాదు. ఇప్పుడు మీరు కోటీశ్వరులు. మీఆయన మీ పేరున ఏడెకరాల భూమిని రిజిష్టర్‌ చేయించారు. అదికూడా మన హైవేకు దగ్గర్లోనే, ఇప్పుడు దానివిలువ కోట్లల్లో వుంటుంది. మీరు గొప్ప అదృష్టవంతులు" అంటూ అసలు విషయాన్ని చెప్పారు ఓల్జేజ్‌హోంపెద్దలు. అదివిన్న కాత్యాయినికి అంతా అయోమయంగా వుంది.

“అయ్యా మీరు సరిగానే చూశారా! ఎందుకైనా మంచిది, ఇంకోసారి సరిగా చూడండి” అని ఆత్రంగా అడిగింది కాత్యాయిని.

"అలా ఏంకాదమ్మా ! మేం మీకు చెప్పినదంతా అందులో వున్నదే".

విషయం తెలుసుకొన్న ఓల్డేజ్‌ హోంలోని అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరిపోయారు.


“ఇంతాస్తి ఉన్నా మనతోటే కలిసే వుందే" అని ఒకరు


"ఇంతకాలం ఈ ఆస్తిసంగతి ఎందుకు చూసుకోలేదోమరి” అని మరొకరు


“ఇంత ఆస్తిఉన్న తర్వాత ఇంక ఇక్కడెందుకు వుంటుందని" ఒకరు


“ఇప్పుడీ ఆస్తినంతా ఏం చేస్తుందో మరి"


“ఇక ఇప్పుడు చూడాలి, ఆమె పిల్లలమని, బంధువులమని, బాగా దగ్గరి వాళ్ళమని

ఓ సంత జరిగినా జరుగుతుంది"

ఇలా అక్కడచేరినవారు ఎవరికితోచినట్లు వారు మాట్లాడసాగారు. ఇంత జరుగుతున్నా కాత్యాయిని మాత్రం ఈ జరిగిందంతా నిజమేనా అనే సందిగ్ధంలోనే వుంది.


'తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు' అన్నట్లు, ఎలా తెలుసుకొన్నారో ఏమో, ఒక్కసారిగా పిల్లాజల్లాతో సహా ఊడిపడ్డారు కాత్యాయిని కొడుకులు, కోడళ్ళూ, కూతుళ్ళు, అల్లుళ్ళు. ఇంకా వారి మంది మార్బలం. ఒక్కసారిగా ఐదుకార్లు ఓల్దేజ్‌ హోం ముందు ఆగేసరికి, అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. 'దాచుకొనేవారికీ , దోచుకొనేవారికీ సిగ్గు-సెరం ఏమీ వుండవు కాబోలు'. వచ్చిందే తడవు 'అమ్మా' 'అత్తయ్యా' అంటూ లోపలికి వెళ్ళబోయినవారిని హోం వాచ్‌మెన్‌ ఆంజనేయులు ఆపేశాడు.

"అసలు మీరెవరు, ఎవరు కావాలి మీకు? మిమ్మల్నెవర్నీ మేమింతవరకూ చూడనేలేదే! అలా ఎవరు బడితే వారు లోపలికి వెళ్ళడానికి కుదరదు, కావాలంటే మా మేనేజరు గారొస్తారు, అలా కూర్చోండి" అన్నాడుఅంజనేయులు. అంతలోనే అక్కడికివచ్చిన మేనేజరు సర్వేశంగారు, విషయం తెలుసుకొని అందర్నీ లోపల హాల్లో కూర్చోమన్నాడు. అందరికీ కాఫీ ఇచ్చిన తర్వాత, వారు వచ్చిన విషయాన్ని అడిగారుసుందరంగారు.

వచ్చిన అందరి తరఫున “నాపేరు సంతోష్‌ . నేను కాత్యాయినిగారి పెద్దకొడుకు" అంటూ

వచ్చిన అందర్నీ పరిచయంచేశాడు సర్వేశంగారికి. అంతటితో ఆగకుండా, తాము వచ్చింది, తమ తల్లిగారిని తమతో తీసుకెళ్ళడానికొచ్చామని, ఇంతవరకు జరిగిపోయిందేదో జరిగి పోయిందని చెప్పుకొచ్చాడు. అందుకు సర్వేశంగారు “కాత్యాయినిగారు ఓ అనాధ అని తమ రికార్డుల్లో వుఉన్నట్లు , అంతేగాక, ఇంతవరకు ఆమె తరుపున ఎవరు కూడా చూడడానికి రానేలేదని” ఆ వచ్చినవారికి తెలిపాడు.

దానికి వారంతా “కాదుకాదు, మేమంతా ఆమె సంతానం, కావాలంటే అమ్మనే పిలవండి, అన్నీ అమ్మే చెబుతుంది" కూడబలుక్కున్నట్లుగా అన్నారు. దానికి సర్వేశంగారు “సరే అలాగే కానివ్వండి” అని భజన మందిరంలోవున్న కాత్యాయినిగారికి కబురంపాడు. విషయం తెలుసుకొన్న కాత్యాయిని, తాను రానని తనకెవ్వరూలేరని, చెప్పిపంపింది. చివరికి సర్వేశంగారే వచ్చినందున, వెళ్లక తప్పనందున, అందరూవున్న హాల్లోకెళ్ళి కూర్చొంది.

అంతే! అందరూ ఒక్కసారిగా, లేని ఆప్యాయతతో పలకరించడం మొదలుపెట్టారు. కాని కాత్యాయిని మాత్రం తొణకలేదు, బెణకలేదు సరికదా తనకెవ్వరూలేరని ఖరాఖండిగా చెప్పి

భజన మందిరానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇక చేయగలిగింది ప్రస్తుతానికి ఏమీలేనందున,

సర్వేశంగారన్నారు “మీరందరు చాలాదూరం ప్రయాణం చేసి ఆలసి పోయుంటారు, భోజనాలుచేసి,రెస్ట్‌ తీసుకోండి, మనం రేపు ఉదయం పదిగంటలకు మరలా కలుసుకొందాం” అంటూ వారందరికీ భోజనాలు మరియు గెస్ట్‌రూంలు చూయించమని సిబ్బందికి చెప్పి, తనూ వెళ్ళిపోయాడు.

“చెడుకాలం దాపురించినపుడు, మంచి అన్నది మచ్చుకైనా దరి చేరదేమో, భోజనాల తర్వాత కాత్యాయిని కొడుకులు, ఇంకా వారి పరివారం, నిద్రపోకుండా చాలాసేపు మాట్లాడుకొన్న తర్వాత, ఓ తీర్మానానికి వచ్చారు. “మేనేజరు మంచివాడు లాగున్నాడు, అతన్నికాస్తా మనబుట్టలో వేసుకొంటే మనమొచ్చిన పని చాలా సులభమవుతుంది. ఎలాగూ మనము అంతా రెడీగానే వచ్చాం కాబట్టి, ఎంత కావాలంటే అంతిచ్చేస్తే సరిపోతుంది. ఎలాగైనా సరే, మనం ఆ భూమికి సంబంధించిన పత్రాలు తీసుకొన్నతర్వాతే ఇక్కడినుండి కదలాలి, అదే మనకు ముఖ్యమైన పని. ఒకవేళ ఆమె మనతో రానంటే, అది మరీ మంచిది అంటూఓ దిగుజారుడు సలహాపడేసింది పెద్దకోడలు. అందరూ ఆమె అభిప్రాయానికి అంగీకారం తెలియజేస్తూ మేనేజర్‌తో మాట్లాడే బాధ్యతను ఆనంద్‌కు అప్పగించారు. పెద్దలెవ్వరికీ నిద్రరాలేదు, ఎప్పుడెప్పుడుతెల్లారుతుందా అని ఎదురుచూడసాగారు. అత్యాశ అలాగే చేస్తుంది మరి.

ఆనందాన్ని కోల్పోయిన 'ఆనంద్‌' తెల్లారకముందే లేచి, కాలుగాలిన పిల్లిలాగా, మేనేజర్‌ ఎప్పుడు

కనిపిస్తాడా అని అటూటూ తిరగసాగాడు. అంతలోనే వెతక బోయిన తీగ కాలికి తగిలినట్లు

‌ వాకింగ్‌కు బయలుదేరిన సర్వేశంగారు కనిపించారు ఆనంద్‌కు. తనకుతానుగా ఎదురుపడి

“గుడ్‌ మార్నింగ్‌ సర్‌, నేనూ మీతోపాటు రావచ్చా?” అని అడిగాడు సర్వేశంగారిని.

"ఆ మీరా, గుడ్‌మార్నింగ్‌ .అరె... దానిదేముంది, రండి రండి... అలా వెళదాం, అన్నట్లు మా భోజనాలు మీకు సరిపోయాయా, అందరూ బాగా నిద్రపోయారా ?" అన్నమాటలకు ఒక్కసారిగా ఆనంద్‌లో ఆనందం మరీఎక్కువయింది.

అదే అదనుగా భావించి “సర్వేశంగారూ, మేమెందుకొచ్చామో మీకు ఈ పాటికే తెలిసేవుంటుంది. మీరు కాస్త సహకరిస్తే మీ రుణం వుంచుకోమనుకోండి" అంటూ విషయాన్ని అంటీ ముట్టనట్లు చెప్పాడు ఆనంద్‌.

“దానిదేముందండీ! మనమనుకొన్నట్లు ఉదయం పది గంటలకు కలిసి, కాత్యాయినిగారు ఇష్టపడితే మాట్లాడి,మధ్యాహ్నం భోజనాల తర్వాత మీరు బయలుదేరవచ్చు" అన్న సర్వేశంగారి మాటలకు ఖంగుతిన్న ఆనంద్‌ “అదికాదండి. ఆ భూమిపత్రాలు మాకిచ్చేస్తే మీకేమివ్వాలో చెబితే, అలాగేచేసి, ఒకవేళ మా అమ్మ మాతో రావడానికి ఇష్టపడితే అలానే తీసుకెళ్ళిపోతాం" అని బేరమాడాడు.

“ఓహ్‌ మీరలాగాన్నారా! సరేసరే ...మీరేమివ్వాలనుకొంటున్నారు" తనలో తను నవ్వుకొంటూ చెప్పాడు సర్వేశం.

విషయం ఇంతసులభంగా తెముల్తుందని ఊహించని ఆనంద్‌ “అదేదో మీరే చెబితే బాగుంటుంది. మీరేమీ మొహమాట పడనవసరంలేదు, మేమంతా రెడీగానే వచ్చాము అన్నాడు. "ఇప్పుడు ఆభూమి విలువ మీకు తెలియంది కాదు, దానికి తగినట్లు ఆలోచించండి అన్నారు ప్రపంచాన్ని చదివిన సర్వేశంగారు.

“అంటే ఓముప్పెలక్షలు సరిపోతాయా లేక ఇంకా పెంచంంటారా"

అన్న ఆనంద్‌ మాటలకు “మీరు మరీ పిసినారి లాగున్నారు, మీరు మీఅమ్మను సరిగా చూసుకోనిదానికి, ఆమె అంగీకరిస్తే, ఒకవేళ మేము ఆమె తరుపున కేసువేస్తే...” ఆ మాటలు విన్న ఆనంద్‌కు చెమటలు బట్టాయి.

"మీరలాగంటే ఎలాగండి? సరే చివరిమాటగా ముస్పై ఐదుకు సరిచేసుకోండి, మీరింకేం చెప్పకండి" అంటూ ఫైనల్‌ బేరమడాడు ఆనంద్‌. “అది. ఆలాగన్నారు బాగుంది. ఉదయం తొమ్మిదింటికి ఓకుర్రాడు మిమ్మల్ని కలుస్తాడు, అతనికి చేరిస్తే సరిపోతుంది సరేనా అంటూ వాకింగ్‌నుండి వెనుదిరిగారు సర్వేశంగారు.

ఆనంద్‌ వచ్చి జరిగిన విషయాన్ని తన వారందరికీ చెప్పాడు. అంగీకరించిన మొత్తము కాస్త ఎక్కువేమోనని గొణిగాడు పెద్దవాడు సంతోష్‌. అనుకొన్న ప్రకారం డబ్బు బాగ్ లో సర్ది , దాన్ని జాగ్రత్తగా చేర్చే బాధ్యతను కూడా ఆనంద్‌కే అప్పజెప్పారు. అందర్లోనూ ఒకటే ఆత్రత, 'ఆ భూమి పత్రాలు ఎప్పుడెప్పుడు తమచేతికి వస్తాయా' అని.


అనుకొన్నట్లు తొమ్మిది గంటలకు సర్వేశంగారి గుమాస్తా ఆనంద్‌ను కలిసాడు. అప్పటికే

సిద్ధం చేసిన సూట్‌కేస్‌ను ఆనంద్‌ నుండి తీసుకెళ్ళాడు. నిర్ణయించిన సమయం పదిగంటలకు అందరూ భజన మందిరంలో సమావేశమయ్యారు. కాత్యాయిని మరియు సర్వేశంగారి ప్లాన్‌ ప్రకారం లాయర్లు,తహసిల్దార్‌ మరియు ప్రెస్‌వాళ్ళూ వచ్చారు. వీరందర్నీ చూసేసరికి సంతోష్‌ గ్యాంగ్‌కు ఏమీ అంతుబట్టలేదు.

ఆనంద్‌ సర్వేశంగారివైపే చూస్తున్నాడు. అది గమనించిన సర్వేశం తనూ ఓచిరునవ్వు విసురుతూ, కాత్యాయిని వైపుకూడా చూశాడు. అంతే ఆనంద్‌లో ఓ కొత్త ఆనందం. అంతా సర్దుకొన్న తర్వాత, సభను ప్రారంభిచేంతలో, ఆ ప్రాంత పోలీసులూ రావడంతో, వారినికూడా సాదరంగా ఆహ్వానించి, అందరికీ స్వాగతం చెబుతూ సభను ప్రారంభిచారు సర్వేశంగారు. ముందుగా కాత్యయినిగారికి భూమికి సంబంధించిన పత్రాలన్ని సరిగానే వున్నాయని, వాటిపై సర్వహక్కులు, పూర్తిగా ఆవిడకే చెంది వుంటాయని, వాటిని ఏమి చేయాలన్నది ఆమె ఇష్టంగా వుంటుందని, లాయర్లు సమావేశంలోని అందరికీ విశదపరిచారు.తర్వాత కాత్యాయిని గారిని తమ అభిప్రాయాన్ని తెలియ చేయవలసిందిగా కోరారు సర్వేశంగారు.

"ఇక అమ్మ అంతా తమకే ఇస్తుందని తమలో తాము అనుకోసాగారు కాత్యాయిని సంతానం.


“సభకు నమస్కారం, ఇక్కడికివచ్చిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇప్పటికీ ఈ పత్రాల విషయాన్ని నేను నమ్మ లేకపోతున్నాను. ఏదో అంతా మాయలాగుంది. ఈరోజు నా సంతానాన్ని తప్పక మీకు పరిచయంచేసి తీరాలి. ఎందుకంటే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళే గనుక నన్ను ఓ అనాధనని ఇక్కడ చేర్చకపోయి వుంటే, మీలాంటి మంచి మనుషుల్ని నేను కలవకుండా వుండేదాన్ని. అప్పుడు అన్నింటికీ మూలమైన ఈ కవరు సంగతి పూర్తిగా మరచి పోయేదాన్నేమో!

కన్నవారిపైన కాసింతైనా కనికరంలేక, పాత వస్తువుల్ని విసిరేసినట్లు విదిలించుకొంటున్నారు అనేదానికి, ఇక్కడున్న మనమే నిదర్శనం. అమ్మనాన్నల ఆస్తులు కావాలిగాని వారు మాత్రం అక్కర్లేదు. అంతేకాక తల్లిదండ్రలుకూడా, అతిగా పిల్లలకు అతుక్కుపోవడం వల్లనే ఈలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందువల్ల మనం మన పిల్లల్నే తప్పుపట్టాల్సిన పనిలేదు.

పెద్దలైన మనలాంటి వారిమీదకూడా తప్పులున్నాయి. ఇక ఈ కవరు విషయానికొస్తే. ఇందులోని ఆస్తి ఏం చేయాలన్నదాన్ని సర్వేశంగారు మరియు ఇంకొంతమందితో ఆలోచించాను. కాని చివరికి దీన్ని ఏం చేయాలనే దాన్ని ఎటుతిరిగి నాకే వదిలేశారు. అయినా ఈవయసులో నేను తీసుకొని ఏం చేసుకోవాలి? నాపైన ఇంతటి భారాన్ని మోపిన నాభర్త కోసమైనా, ఓనిర్ణయం తీసుకోకతప్పదు. ఈ అనాయాసంగా వచ్చిన ఆస్తి నాకు అఖ్ఖర్లేదు, కాని ఏం చేయాలనే దాన్ని మాత్రం చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ గట్టి నిర్ణయానికొచ్చాను. అందరూ నా నిర్ణయాన్ని మంచి మనసుతో అర్థంచేసుకోగలరని, అంగీకరించగలరని ఆశిస్తున్నాను."

అది విన్న కాత్యాయిని గుంపులో ఒకటే ఆనందం, ఆత్రత.

" ఇక నా నిర్ణయాలు ఇలా వున్నాయి.

1. మొత్తం పదెకరాలలో, రెండెకరాలు మనముంటున్న ఈ ఆశ్రమానికి వ్రాయదలచుకొన్నాను.

అందులో అనాధపిల్లలకు, వికలాంగులకు అన్ని వసతులతో కూడిన ఆశ్రయం కల్పించ బడుతుంది.

2. మిగిలి ఐదెకరాలు అమ్మేయాలని నిర్ణయించాను. వచ్చే డబ్బుతో ముందుగా తెలిపిన

ఆశ్రమం కోసం ఖర్చుచేయబడుతుంది.

3. ఇక మిగిలిన మొత్తంనుండి, ఇక్కడ చాలాకాలంగా పనిచేస్తున్న సిబ్బందికి ఇళ్ళు కట్టించడం, ఆ కుటుంబాలకు ఉచితవైద్యం, వారిపిల్లలకు ఉచిత విద్య ఏర్పాట చేయబడుతుంది.

4. ఇక మిగిలిన డబ్బు ఈ ఆశ్రమంపేరున ఫిక్సెడ్‌ డిపాజిట్‌ రూపంలో వుంటుంది. ఈపైన కనపరచిన వాటిలో నాకుగాని, నా వారసులకు గాని చట్టపరమైన ఏలాంటి హక్కు వుండదు.

ఇకనేను ఎప్పటిలాగే, నా ఊపిరున్నంతవరకు ఇక్కడే, ఇప్పుడున్నట్లే వుండదలచుకొన్నాను" అంటూ లాయరువైపు చూసింది కాత్యాయిని. లాయరు కొన్ని పత్రాలను ఆమెకిచ్చాడు. వాటిని అందరికీ చూపిస్తూ "నా నిర్ణయాలను ఈఆశ్రమంవారు అంగీకరించవలసిందిగా కోరుతున్నాను" అంటూ వీలునామా పత్రాన్ని సర్వేశంగారికి అందచేసింది కాత్యాయిని. ఇదంతా చూస్తున్న కాత్యాయిని పరివారానికి ఏం చేయాలో తోచలేదు. అంతలోనే సర్వేశంగారి గుమాస్తా ఉదయం ఆనంద్‌ ఇచ్చిన సూట్‌కేస్‌ తెచ్చి సర్వేశంగారికి ఇచ్చాడు. ఆనంద్‌ ఆన్నదమ్ములకు చెమటలు పట్టసాగాయి. సభలోవున్న అందర్లోను

“అందులో వున్నదేంటని ఒకటే గుసగుసలు”. దానికి తెరదించుతూ సర్వేశంగారు సూట్‌కేస్‌ ఓపెన్‌ చేసి అందులోవున్న డబ్బును అందరికీ చూపిస్తూ "ఇది మొత్తం ముప్పెఐదులక్షలు. ఇది కాత్యాయిని కుమారులు ఆ భూమికోసం నాకు లంచంగా ఇవ్వచూసిన డబ్బు, ఇక ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది కాత్యాయినిగారే నిర్ణయించాలి" అంటూ డబ్బును కాత్యాయినిగారికి అందించబోయారు. అంతవరకు ఆ విషయం తెలియని కాత్యాయినికి తనవారిపై మరింత అసహ్యం కలిగింది. “క్షమించండి, నేను ఆ డబ్బును ఆసలు ముట్టకోను, దాన్ని ఏంచేస్తారో దయచేసి మీరేనిర్ణయించండి" అని నిర్ద్వందంగా చెప్పింది.

'ఆ డబ్బైనా తిరిగి ఇస్తే బాగుంటద'నుకొన్నారు సంతోష్‌ ఆనంద్‌లు. కాత్యాయినిగారు ఎటూ తేల్చకపోయేటప్పటికి , సర్వేశంగారు మాట్లాడుతూ, ఈ ముప్పై ఐదులక్షల నుండి కొంత మొత్తాన్ని పాడిఆవుల కొనుగోలుకు, వాటికి అవసరమైన షెడ్డు, దాణా మొదలగువాటికి వాడి, మిగిలిన మొత్తంగురించి తర్వాత నిర్ణయిస్తామని సభకు వివరించారు. ఇక తమకు ఏమీ లాభంలేదని సంతోష్‌గ్యాంగ్‌కు అర్ధమైపోయింది. ఏ సమస్య లేకుండాఅక్కడి నుండి వెళ్ళిపోతే చాలనుకొన్నారు. చివరిగా సర్వేశంగారు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తనకంటూ ఏమీవుంచుకోకుండా, తన అస్తినంతా సేవకోసం ఇచ్చేసిన కాత్యాయిని గారికి

పాదాభివందనం చేస్తూ అభినందించారు. దేన్నో ఆశించి వచ్చిన సంతోష్‌ పరివారానికికూడా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక వారు ఎప్పుడైనా సరే యధేచ్చగా ఆశ్రమానికి రావచ్చని తెలియజేశారు. కాత్యాయిని కుమారుల్లో ఏదో తెలియని న్యూనతా భావం . తమలో తాము కుమిలి పోసాగారు. సంతోష్‌ సర్వేశంగారిని కలిసి మాట్లాడడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరాడు. “అరెరె దానికేం, ధారాళంగా మట్లాడండి, పిలవండి మీ వాళ్ళందర్నీ" అన్నారు సర్వేశంగారు. అన్నదే తడవు అందరూ స్టేజి మీదికి చేరిపోయారు. అందరి తరుపునా సంతోష్‌ మాట్లాడుతూ “అందరూ మమ్మల్ని క్షమించాలి. నిజం చెప్పాలంటే మాకెవ్వరకీ ఇక్కడ నిలబడే అర్హత లేదు. మేము ముమ్మాటికీ ఆ భూమి కావాలనే దురాశతోనే వచ్చాము. నిజంగా కూడా మేమందరము

మా అమ్మకు చేయరాని ద్రోహం చేశాము, మా పిల్లలు మమ్మల్ని హెచ్చరిస్తున్నా మేము దురాశ కొద్దీ వారి మాటలు వినలేదు. ఇప్పుడు మాకు మా అమ్మను చూడాలన్నా, మా పిల్లల్ని చూడాలన్నా చాలా భయంగాను, సిగ్గుగానూ వుంది. మా జీవితంలో ఇంతకంటే పెద్దశిక్ష వుండదు. మా అందరి తరఫునా మా అమ్మగారిని వేడుకొంటున్నాను, ఓసారి ఆమె పాదాలకు నమస్కారం చేసే అవకాశం ఇవ్వమని"

కళ్ళు మూసుకొని అన్నీవింటున్న అమ్మవైపు చూశాడు సంతోష్‌. ఈదేశంలో ఏ తల్లికూడా తన పిల్లలపై కక్ష కట్టదు, అదే ఆమ్మ హృదయం. తన పిల్లల్లో వచ్చిన మార్పుచూసి కాత్యాయిని కళ్ళు చెమర్చాయి. అందర్నీ మనసారా దీవించింది. భోజనాల తర్వాత అందరూ ప్రయాణమయ్యారు. కాత్యాయిని అందర్నీ సంతోషంగా సాగనంపింది. తక్కినవారు ఎవరి పనుల్లోవారు నిమగ్నమయ్యారు. కాత్యాయిని యధావిధిగా తన గది చేరింది.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
107 views1 comment

1 Kommentar


lkamakoti
lkamakoti
06. Jan. 2021

paatraloo kathaa pathave kaanee bagaa utkantatho చదివించారు.ఈనాటికీ అప్యాయతలకన్నా డబ్బు ముఖ్యమైపోయింది. అమ్మది సరైన నిర్ణయం.

Gefällt mir
bottom of page