top of page

అమ్మబోతే అడవి....

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Ammabothe Adavi' Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి


విత్తనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

వాళ్ళు చెప్పిన ధరకు కొనాల్సిందే.

కానీ రైతు కష్టపడి పండించిన పంటను తనకు నచ్చిన ధరకు అమ్మే అవకాశం అతనికి లేదు.

రైతుల ఆత్మ హత్యలు పెరుగుతున్నాయి.

రైతుల బాధలు తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి ఎం బిందుమాధవి గారు రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్"అమ్మబోతే అడవి కొనబోతే కొరివి" అనేది ఒక సామెత:


@@@@@


"ఏంది మామా ఏదో ఆలోసిస్తా ఉండావు. అన్నం తినేప్పుడు కూడా ఆలోసనేనా?" అన్నది మంగి కంచంలో పులుసు పోస్తూ రామయ్యతో.


"ఏం సేసేది. నీకు తెలియంది యాముండాది. ఎరువులు కొనటానికి డబ్బు కావాలి. ఇత్తనాలు కొండానికే సేతిలో డబ్బులు అయిపాయే! నిరుడు ఎరువులు కొండానికి తాకట్టెట్టిన నీ పుస్తెల గొలుసు సావుకారు గారి దగ్గరనించి ఇడిపించకనే పోతిమి! ఎవురినడగాలి? అడిగితే మాత్రం ఇస్తారా? ఏ ఏటికాఏడు పరీచ్చేనాయే!" అన్నాడు.


"ఎరువులేసేదానికి అదను మించిపోతాంది. ఏం చెయ్యాలో తోసక సస్తాఉన్నానే" అన్నాడు.


"అబ్బాయికాడికోపాలి పోయి రారాదా? కాస్తో కూస్తో సద్దుబాటు సేస్తాడేమో?" అన్నది.


'నాను అదే అనుకుంటన్నాను' అని, 'ఓ పాలి అలా ఎల్లొస్తా' అని


నాలుగిళ్ళ అవతల ఉన్న భిక్షపతి ఇంటికి బయలుదేరాడు.


@@@@


'ఏంది నాన్నా ఇటొచ్చినావ్! ఆరోగ్యం మంచిగున్నాదా? అమ్మెంట్టుండాది?' అన్నాడు కొడుకు వెంకటేశు.


'ఎరువులు కొనాలే! మూణ్ణాలుగు రోజుల్లో ఎరువులెయ్యాల! నా కాడ డబ్బు తక్కువ పడ్డాది. కొంచెం డబ్బేమన్న సర్దుతావేమో అనొచ్చినా!' అన్నాడు సణుగుతున్నట్టు.


కరెంటాఫీసులో లైన్మెన్ గా పని చేస్తున్న వెంకటేశు బతుకు కూడా బొటాబొటి జీతంతో కట కటగానే నడుస్తున్నది. మొన్నీ మధ్య కూతురుకి జెరమొస్తే డాక్టర్ ఫీజు, మందులు, ఇంజక్షన్లకి బానే ఖర్చయింది. ఆ మాట అయ్యతో అనలేక, 'అట్నే నాన్నా. నే జూస్తాలే ' అన్నాడు.


మరునాడు ఆఫీసులో తనతో పనిచేసే మల్లేశు దగ్గర కొంత, వీరయ్య కొంత పంట రాగానే ఇస్తానని తీసుకుని తండ్రికిచ్చి పంపాడు.


@@@@


సరైన సమయానికే ఎరువులు కొని వేశాడు రామయ్య.


'పంట ఈ ఏడు బాగా పండింది. దేవుడు సల్లగా జూసి ఏ ఇబ్బంది రాకుంటే రెండేళ్ళ నించి చేసిన అప్పులన్నీ తీర్చచ్చు' అనుకుంటూ హాయిగా నిద్రపోయాడు, రాత్రి వసారాలో పడుకున్న రామయ్య.


తెల్లారేసరికి అకాలంగా వరద గుడేసింది ఆకాశాన. పంట కొయ్యటం ఆలస్యమైతే చేతికి దక్కటం కష్టమని ఎక్కువ కూలీ ఇచ్చి పంట కోయించాడు.


'ఈ సారి పంట ప్రభుత్వం కొనదు' అనే వార్త విన్న రామయ్య నిలువునా నీరు కారిపోయాడు.


'ప్రభుత్వం కొనక పోతే దళారీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి తన పంట అమ్ముకోవాలి. వాళ్ళేది చెబితే అదే రేటు.'


'గిట్టుబాటు ధరలు ఇప్పిస్తానంటదే కానీ ఏ ప్రభుత్వమూ దీని గురించి పట్టించుకోకపాయే! సట్టం సట్టం అంటరె కానీ ఏ రైతు గోస ఇనే వాడు లేడు, ఆదుకునే వాడు లేడు. ఇత్తనం కొంటం దగ్గరనించీ ఎరువులు, పురుగు మందులు, సావుకారుకి వడ్డీలు, కూలీలకి డబ్బులు....ఎక్కడి నించి తేవాలె?'


'దేశానికి రైతే ఎన్నెముక! ఆన్ని బాగా సూసుకోటం మా బాద్దెత అని ఉపన్నాసాలె కానీ పట్టించుకునేటోడు ఒక్కడూ లేకపాయే! "అమ్మబోతే అడివి కొనబోతే కొరివి' లెక్కన మా బతుకులే పెశ్నార్దకమయినాయి!'


'ఈ పంట టయానికైనా పాత అప్పులన్నీ తీర్సి, మంగి పుస్తెలు ఇడిపించాలనుకున్నా! దానికి మొగమేం చూపించను' అనుకున్న రామయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు!!


@@@@


'అయ్యో రామయ్య పొలంలో పడిపోయి ఉన్నాడు' అంటూ పక్కింటి భిక్షపతి పరుగెత్తుకొచ్చాడు.


'అయ్యో దేవుడా నా గతేం కావాల?' అని మంగి గుండెలు బాదుకుంటూ పరుగు పరుగున పొలానికి బయలుదేరింది.


అప్పటికే అక్కడున్న నలుగురు సాయం పట్టి రామయ్య శవాన్ని గట్టుకి చేర్చారు.


'పొద్దుగాల వసారాలో ఉన్న పురుగు మందు డబ్బా తీస్తా ఉంటే, పంట కోసినాడు కదా..ఇంకెందుకు పురుగుమందు డబ్బా తీస్తున్నాడు అనుకున్నా! ఇంత జేస్తడని అనుకో బోతిని' అని ఏడుస్తున్న మంగిని ఓదార్చటం ఎవరికి చేతకావట్లేదు.


కబురు తెలిసిన వెంకటేసు ఉన్నపాటున పరుగెత్తుకొచ్చాడు.


అయ్య చితికి నిప్పంటించి వస్తున్న వెంకటేసుకి దూరంగా షామియానాలో ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మీటింగులోంచి మాటలు గాలిపాటుకి వినిపిస్తున్నాయి....


'ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు. ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఎరువు బరువై… కూలీలు కరువై. నీరు కన్నీరై…

పెరుగుతున్న పెట్టుబడులు! ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే… బతుకే భారమనుకుని రైతు తనువు చాలిస్తున్నాడు.'


'యువ రైతులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యమిస్తూ… అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిని, పెట్టుబడులు రాక చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ… రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు' అనే మాటలు విన్న వెంకటేసు....


'ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒరిగేదేం లేదు. సంవత్సరానికో ఆత్మహత్య తప్ప' అని నిర్వేదంగా అనుకుంటూ వడి వడిగా ఇంటికేసి నడిచాడు.


[అడవి చిక్కగా అల్లుకున్న చెట్లతో, దుబ్బులతో, జంతువులతో ప్రత్యేకంగా ఏ ఒక్క దానికి విలువ లేనట్టుగా, అమ్మలేని వస్తువులాగా ఉంటుంది. కొని స్వంతం చేసుకోవటానికి ఆకర్షణీయంగా ఉండదు.


కొరివి అంటే నిప్పు...ముట్టుకుంటే కాలుస్తుంది. ప్రత్యేకంగా ఏదైనా కొనాలంటే దాని ధర ఆకాశాన్నంటేట్లు ఉండి కొరివి కాల్చినట్టు చెయ్యి కాలుతుంది అనే చెప్పాల్సిన సందర్భంలో ఈ సామెత వాడతారు. మన కడుపులు నింపే అన్నదాత జీవితాలకి ఇప్పుడు ఈ సామెత బాగా అన్వయమౌతుంది]

(ప్రతిపక్ష పార్టీ ఉపన్యాసంలో కొంత భాగం అంతర్జాలం నించి తీసుకోవటమైనది)

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు85 views0 comments
bottom of page