top of page

అమ్మంటే అమ్మే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Ammante Amme' written By Pendekanti Lavanya Kumari

రచన: పెండేకంటి లావణ్య కుమారి


అమ్మ అంటే అమ్మే, పిల్లలకు ఎప్పుడు బాధ కలిగినా అక్కున చేర్చుకొని ఓదార్చేది అమ్మే. ఆమె అమృతవర్షిణిలా ఎంత వయసొచ్చినా తను చేయగలిగింది పిల్లలకు చేసిపెడ్తూనే వుంటుంది.

ఒక చిన్న పిల్లవాడు తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పే కథకు మూలం. త్యాగం అంటే అమ్మే గుర్తొస్తుంది. ఆమె చేసిన త్యాగమేంటో ఈ కథను చదివి తెలుసుకోండి. ​

* * * ​

​“రాజూ! రాజూ!” అంటూ పిలుస్తూ వుంది కళ్యాణి.

రాజు పలకకపోతే పక్కనే వున్న నందినిని, “ఏమ్మా నందినీ! ఈ రాజుగాడు ఇంకా ఇంటికి రాలేదా? ఎక్కడికెళ్ళాడో తెలుసా?” అని అడిగింది కళ్యాణి.

నందిని “రాలేదమ్మా! ఎక్కడికెళ్ళాడో కూడా తెలీదు” అంది.

దాంతో కళ్యాణి మొహమంతా మాడ్చుకుని, “వీడు చదువుకోకుండా ఎక్కడెక్కడికో పోతుంటాడు, ఏదో ఒకటి నెత్తి మీదకు తెస్తుంటాడు వెధవ..” అని తిట్టుకుంటూ కోపంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది.

​కళ్యాణి ఒక మధ్యతరగతి గృహిణి. కళ్యాణి భర్త రాజశేఖర్ ప్రక్కనే వున్న పట్నంలో క్లర్కుగా చేస్తున్నాడు. వాళ్ళ గ్రామం నుంచి పట్నంకి బస్సులో రెండు నుండి రెండున్నర గంటల ప్రయాణం. అప్పుడప్పుడూ ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది.

పట్నంలో ఖర్చెక్కువవుతుంది, సొంతూర్లోనే వుంటే సొంతిల్లుంటుంది. పెరట్లో పండే పండ్లు, కూరగాయలు ఇంకా ఎన్నో ఖర్చులు కలిసొస్తాయని కుటుంబాన్ని గ్రామంలోనే వుంచి, కొంచెం కష్టమనిపించినా తనే రోజూ పట్నం వెళ్ళి వస్తుంటాడు రాజశేఖర్.

కళ్యాణి, రాజశేఖర్లకు నలుగురు సంతానం. ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ముద్దు అనే నినాదం చేస్తున్నప్పట్టి కాలంలో కన్నారు.

కాకపోతే అందరికీ తెలిసినదే కదా.. ప్రభుత్వం ముగ్గురు పిల్లలు చాలు అంటే మనం కొసరుగా ఇంకొకరిని ఎక్కువ కంటాము. వీళ్ళు కూడా అంతే. ఇంకొక మగపిల్లాడు కావాలని చూసి నాల్గవ సంతానంగా మళ్ళీ ఆడపిల్లనే కన్నాక ఇంక చాలనుకున్నారు.

నందిని పెద్దది, రాజు రెండవవాడు, తర్వాత ఇంకో ఇద్దరు ఆడపిల్లలు. ఇంక కళ్యాణి గురించి చెప్పాలంటే, కళ్యాణి వాళ్ళమ్మకు ఎంతో కాలానికి లేక లేక కలిగిన ఏకైక సంతానం కావటాన, చాలా అల్లారు ముద్దుగా పెంచింది. కళ్యాణి ఒక్కతే బిడ్డ అవటం వల్ల వాళ్ళ నాన్నగారు పోయినప్పటి నుండి వాళ్ళమ్మ కూడా కళ్యాణితోనే వుంటోంది.

కళ్యాణి ఎంతో కాలానికి పుట్టినందుకు వాళ్ళమ్మకిప్పుడు చాలా వయసయ్యింది. కళ్యాణి వాళ్ళమ్మను ఒక్కదాన్నే వాళ్ళ ఊర్లో వుంచలేక వాళ్ళమ్మ చేత ఊర్లోని ఇల్లు అమ్మేయించి, తన దగ్గరే వుంచేసుకుంది. అక్కడే కొంత పొలం వుంటే కౌలుకిచ్చారు. ​

​ఇక పోతే రాజశేఖర్ వాళ్ళ అమ్మానాన్న ఆరు నెలలు వీరి దగ్గరుంటే ఇంకో ఆరు నెలలు రాజశేఖర్ తమ్ముడు దగ్గర వుంటారు. ‘ఇక్కడే వుండండి. ఏమి తిరుగుతారు’ అంటే ‘వాడు బాధ పడతాడు’ అని వెళ్తుంటారు. ​

​కళ్యాణే ఇంటిపనులు, పిల్లల పనులు, పెరటి చెట్ల పనులు, ఇంట్లో పెద్దవాళ్ళ పనులు చూస్కుంటూ క్షణం తీరిక లేకుండా వుంటుంది. తనకి కష్టపడటం లోని తృప్తి బాగా తెలుసు, క్షణం వృధా చేయదు.

కళ్యాణి తల్లి కూడా ఏదో చిన్నా, చితకా చేతి పనులు చేస్తూ కళ్యాణికి సాయంగా వుండేది. కళ్యాణి తన కూతురు నందినికి కూడా సెలవు దినాల్లో చిన్న, చిన్న పనులు చెప్పి నేర్పించేది. కళ్యాణికి ఈ పనులన్నీ ఒక ఎత్తైతే, రాజుని పెంచటం ఒక ఎత్తై కూర్చుంది.

ఇంట్లో అందరూ నెమ్మదస్తులే, కానీ ఈ రాజుకి ఎవరి బుద్దులొచ్చాయో కానీ చాలా మొండి వాడు. చెప్పిన మాట వినడు, చెయ్యొద్దన్న పనే చేస్తాడు. కళ్యాణికి వాడిని ఎలా భరించాలో, ఎలా దారిలోకి తేవాలో అర్థం కావటం లేదు.

‘స్వామీ! ఇంట్లో అందరూ నెమ్మదస్తులైతే ఏమీ కొత్తదనం వుండదనా ఇంత మొండివాడిని ఇచ్చారు. వీడి అల్లరిని ఎలాగైనే మాన్పించు స్వామీ’ అని వేడుకోని రోజు లేదు. ​

​పల్లెటూరు కాబట్టి ఊరికి బయట అటూ, ఇటూ వున్న ఎన్నో రకాల పండ్ల తోటలకు తోటి అల్లరి పిల్లలతో రాజు వెళ్తుంటాడు. అక్కడ ఏదో ఒక తోటలోకి దూరి కావలివాడికి తెలియకుండా పండ్లు కోసుకుని తినటం సరదా అయిపోయింది రాజూకు, వాడి స్నేహితులకునూ.

ఒకసారి ఎవరో ఒకరు వచ్చి ఫిర్యాదు చేయటం కూడా జరిగితే, వాళ్ళకు ఏదో సర్ది చెప్పి పంపింది కళ్యాణి. ఆ రోజు వాడికి బాగా నాలుగు తగిలించి, ఇంకోసారి ఇలా జరిగితే మీ నాన్నకు చెపుతానని బెదరించటం కూడా జరిగింది.

“నీకు నేనంటే ఇష్టమేలేదు, ఏమి చేసినా ఎప్పుడూ కొడుతుంటా”వని ఏడ్చి, ఏడ్చి పెట్టాడు వాడారోజు. “అక్కను కానీ చెల్లెళ్లను కానీ ఏమీ అనవు. ఎప్పుడూ నన్నే అరుస్తుంటా”వని ఏడుస్తుంటే, కళ్యాణి వాడితో “ఇంట్లో ఒక్క పిల్లన్నా నీ లాగా అల్లరి చేస్తుందారా” అంది.

“మొన్నటికి మొన్న మీ లెక్కల టీచరు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టాడని ఆయనకు కనిపించకుండా అరటి తొక్క వేసి కింద పడేలా చేసావు. నేనుగా విన్నానది, నువ్వూ, ఆ కిట్టిగాడు చెప్పుకోని నవ్వుతుంటే” అంది కళ్యాణి.

దానికి రాజు “అందరి ముందు మాష్టారు నన్ను కొట్టాడు. అందుకే అలా చేసాను” అన్నాడు.

“తప్పు చేస్తే పెద్దవారు బుద్ది చెప్తారు. నీలాంటి వినని పిల్లలను అప్పుడప్పుడూ కొడ్తారు కూడా. అందులో తప్పేముంది? నువ్వే ఆయన చెప్పినట్టుగా విని చదువుకుని వుంటే ఎందుకు కొట్టేవారు.. పెద్దవారిని, గురువులను గౌరవించాలని ఎన్ని సార్లు చెప్పినా వినవేంటిరా నువ్వు” అని బాధ పడింది కళ్యాణి. ​

​“అంతేనా.. ఒకరోజు ఎవరో నీతో చదివే పిల్ల జుట్టు కత్తిరించావని ఫిర్యాదు. అంతకు ముందు చెల్లెలని కూడా లేకుండా దాని కొత్త బట్టలకు ఊదుకడ్డీతో బొర్రలు పెట్టి ఏడ్పించావు. నీకు ఏమీ అన్పించదా రా ఇలాంటివి చేయకూడదని...

మంచిగా చెప్పినా బుద్ధి రాదు, కొట్టినా బుద్ధి రాదు, ఎలారా నీతో. మీ జేజయ్య(అంటే తండ్రికి తండ్రి అని) ఊర్లో వుంటే ఎలానో నిన్ను దారిలో పెట్తుంటాడు. ఆయన లేనప్పుడు నేను నిన్ను భరించలేక పోతున్నారా” అని వాపోయింది కళ్యాణి.

“ఒక్కోసారి ఎందుకు కన్నానురా నిన్ను అనిపిస్తుంది, ఇంకా నయం ఇంకో మగపిల్లాడు పుట్టలేదు. మీ నాయనకు చెప్తే నిన్ను ఏ బోర్డింగు స్కూల్లోనో వేస్తాడు. అక్కడైతే వాళ్ళు చెప్పినట్లు వినకపోతే తాట తీస్తారు, సరిపోతుం”దని భయపెట్టింది కొడుకుని. ​

​కళ్యాణికి అర్థమే కావటం లేదు, ఆడపిల్లలు ఎంత పద్దతిగా వుంటారు, ఎంత బాగా చదువుతారు, ఎందుకు వీడిలా సతాయిస్తాడు. వాళ్ళమ్మమ్మనైతే అస్సలు ఖాతరు చేయడు. ఈసారి కళ్యాణి అత్తమామలు వాళ్ళ చిన్నబ్బాయి దగ్గరకు వెళ్తుంటే కళ్యాణి ఆపుకోలేక ఏడుస్తూ, వాళ్ళ మామయ్యతో “మీరు ఎలా రాజుని కట్టి పడేస్తారో ఏంటో నా వల్లైతే కావటం లేదు. వాడికి మీరే బాగా నచ్చ చెప్పి వెళ్ళ”మని అడిగింది.

దానికి ఆయనేమో “పిల్లలు కాక పెద్ద వాళ్ళు చేస్తారా అల్లరి? కొంచెం పెద్దైతే వాడే దారికొస్తా”డని చెప్పి వెళ్ళాడు. ​ఎంత చెప్పినా షరా మామూలే, ఈరోజు కూడా వీడు ఏ తోటకో వెళ్ళుంటాడనుకోని వంటింట్లోకి వెళ్తున్న కళ్యాణికి బయట ఎవరివో కేకల లాంటి ధ్వని, పరుగులలాంటి శబ్దాలు దానితో పాటు ఎవరో “అమ్మగారూ! అమ్మగారూ!” అన్న పిలుపు వినిపించింది.

‘ఏమైందబ్బా!’ అని కంగారుగా బయటకెళ్ళి చూసిన కళ్యాణి భయంతో ఏడవటం మొదలెట్టే సరికి ఇంట్లోవాళ్ళతో పాటు చుట్టు పక్కల వాళ్ళందరూ చేరారు.

చూస్తే ఏముంది, అక్కడ ఎవరో కావలి వాడంట రాజును ఎత్తుకొచ్చాడు. రాజు వళ్ళంతా రక్తం చుక్కలు, కళ్ళనుండి కూడా రక్తం కారుతోంది. ఒక కంట్లో ముల్లు అలాగే ఇంకా గుచ్చుకునే వుంది. రాజు నొప్పితో మూర్చపోయివున్నాడు.

“మీ వాడు మా తోట పక్కన పిట్టగోడ దూకి, తోటలోకి దూకబోయి, పట్టుతప్పి ముళ్ళకంపలో బోర్లా పడ్డాడు. దానితో వళ్ళంతా కళ్ళతో సహా ముళ్ళు గుచ్చుకున్నాయి. వీలుగా వున్న కొన్ని ముళ్ళు తీసాము. మిగిలినవి జాగ్రత్తగా డాక్టరు దగ్గరనే తీయించుకోటం మంచిదని నేను ఎత్తుకోని వచ్చేసాను.

మా తోటలో దొంగగా వచ్చి కాయలు కోస్కోని పోయేవాళ్ళు రాకుండా ఈ మధ్యే దండిగా ముళ్ళ కంపలు గోడకానించి పెట్టాము. మీ వాడికి తెలియక ఎప్పటిలా దూకాడు. దూకగానే కాళ్ళలో ముళ్ళు దిగబడి నిలబడలేక అదే ఊపులో ముళ్ళ మీద బోర్లా పడ్డట్టున్నాడు. అందుకే అంతటా ముళ్ళు గుచ్చుకున్నాయి, తొందరగా డాక్టరు దగ్గరికి తీస్కెళ్ళం”డని చెప్పాడతను.

కళ్యాణి వెంటనే పక్కింటి వాళ్ళకు పిల్లలను చూస్కోమని, భర్త వస్తే పి.హెచ్.సీ కి రమ్మని చెప్పి వాళ్ళమ్మను, రాజూని తీస్కోని పి.హెచ్.సీ కి ఏడుస్తూనే బయల్దేరింది.

దారి పొడువునా కళ్యాణి, కళ్యాణి వాళ్ళమ్మ ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నారో లెక్కేలేదు. తట్టుకోలేక పోతోంది కళ్యాణిలోని తల్లి మనసు, స్వామీ! మా వాడి అల్లరి మాన్పించమంటే, ఇలా మాన్పిస్తున్నావా స్వామీ అనుకుంటూ, చిన్నవాడు వాడిని మన్నించమని దేవుడ్ని వేడుతూనే వుంది కళ్యాణి. ​

​ఇంతలో పి.హెచ్.సి వచ్చింది, డాక్టరు అక్కడక్కడా లోతుకు గుచ్చుకున్న ముళ్ళు తీసి ఫస్టెయిడ్ చేసి, టి.టి ఇంజక్షన్ ఇచ్చి “పట్నంలోని పెద్దాస్పత్రికి తీస్కెళ్ళండి, కంట్లో గుచ్చుకున్న ముళ్ళను చాలా జాగ్రత్తగా తీయాలి. ఏ మాత్రం తప్పు చేసినా ప్రమాదమే”నని చెప్పాడు.

కళ్యాణి వూరికెళ్ళటానికి ఇంటికి బయల్దేరింది. ఇంటికెళ్లి తనవి, భర్తవి, పిల్లాడివి రెండు, రెండు జతల బట్టలు, ఫ్లాస్కు ఇంకా కావాల్సినవి సర్దుకునే లోపల భర్త వచ్చాడు. తల్లికి, మిగిలిన ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పి, భర్తతో విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి పట్నంలోని పెద్దాస్పత్రికి బయల్దేరి వెళ్ళారు.

అక్కడ స్పెషలిస్టు డాక్టరు వచ్చి ఇంకా గుచ్చుకునే వున్న ఒక కంటి లోని ముల్లును జాగ్రత్తగా తీసి, ఇంకో కంటిని కూడా పరీక్షించి రెండు కళ్ళకు మందు వేసి బ్యాండేజీ వేసి వెళ్ళాడు.

కళ్యాణి డాక్టర్తో “మా బాబు కళ్ళు కనబడతాయా?” అనడిగితే “బ్యాండేజీ తీసాక కానీ ఏ సంగతీ చెప్పలే”మన్నారు. కళ్యాణి ఏడుస్తూనే వుంది రాత్రంతా... భర్త ఎంత సముదాయించినా ఆమెకు ఏడుపు ఆగటంలేదు. రాజశేఖర్కు కూడా చెప్పలేనంత బాధగా వుంది, కానీ ఎలాగో ఆపుకున్నాడు. వీడి అల్లరి ఎంత పని చేసింది అని ఏదేదో గొణుక్కుంటూ రాత్రంతా ఏడుస్తూనే వుంది కళ్యాణి.

తెల్లవారుజామున రాజూకు మెలకువ వచ్చి కదులుతూ కళ్ళు తెరవటానికి లేక చేతులతో బ్యాండేజీ లాగటానికి పోతే కళ్యాణి చేతులు పట్టుకుని ఆపింది.

వాడు “అమ్మా.. నాకు కనపడటం లేదు” అన్నాడు ఏడుపు గొంతుతో.

“రాజూ! బాధ పడకురా, నీ అల్లరే నీ కళ్ళకు ప్రమాదం కల్గించింది. ఇప్పుడు బాధపడి ఏమి లాభం. కళ్ళలో ముళ్ళు గుచ్చుకునుంటే తీసి కట్టు కట్టారు. పీకవద్ద”ని చెప్పింది.

“బాధ పడొద్దు నాన్నా! తగ్గిపోతుంది, మట్టసంగా కదలకుండా నిద్రపో” అంది. కానీ కళ్యాణికి తెలుసు కంటి చూపు వచ్చేది కష్టమని, అలాంటి ఆలోచన రాగానే మళ్ళీ కళ్యాణికి ఏడుపు ఆగలేదు. అలా పక్కకెళ్ళి ఏడుపు ఆపుకొని వచ్చింది. తను ఏడ్చేది చూస్తే పిల్లాడు ఎక్కడ ఎక్కువగా భయపడ్తాడో అని. ​

​పొద్దున డాక్టరు వచ్చారు. ‘మీ పిల్లవాడిని ఇంక ఇంటికి తీస్కెళ్ళవచ్చ’ని చెప్పాడు. బ్యాండేజీకి నీళ్ళు తగలకుండా చూస్కోవాలనీ, ముఖం వూర్కే గోరు వెచ్చని సోపు నీళ్ళలో శుభ్రమైన బట్టను ముంచి తుడుచుకుని తర్వాత మంచి నీళ్ళతో తుడుచుకోవాలని చెప్పాడు.

‘బ్యాండేజీ రెండు రోజులకొకసారైనా మారుస్తుండాలి. ఇక్కడికే రావాలని లేదు మీ ఊరి డాక్టరు చేతైనా బ్యాండేజీ వేరేది వేయించుకోవచ్చ’ని వాడాల్సిన మందులు వ్రాసిచ్చి, మళ్ళీ రెండు వారాలకు పిల్లాడిని తీసుకువచ్చి కలవమన్నాడు. ​

​ఈ రెండు వారాలు కళ్యాణి రాజూని చంటిపిల్లాడిలా చూసుకోసాగింది. అప్పుడు వాడికి వాళ్ళమ్మ ఒకసారి దేనికో అరిచిందని, వాళ్ళమ్మకు ఇష్టమైన నాగమల్లి చెట్టును వాళ్ళమ్మ లేనప్పుడు నరికేసింది గుర్తొచ్చి బాధపడ్డాడు. వాళ్ళమ్మ వాడ్ని అరిచినప్పుడంతా నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే నన్నెప్పుడూ అరుస్తుంటావన్నది కూడా గుర్తొచ్చింది.

అందుకే వాళ్ళమ్మతో “నన్ను క్షమించమ్మా! నీ మాటలు విననందుకే నాకిలా అయ్యింది, నీకిష్టమైన చెట్టుని కొట్టేసినా నీవేమీ కోపము పెట్టుకోకుండా నాకన్నీ చేసి పెడ్తున్నా”వన్నదానికి వాళ్ళమ్మ ఇలా అంది.

“తిక్కలోడా! అమ్మకు పిల్లల మీద కోపమెప్పుడూ వుండదురా. పిల్లలు బాగుపడటానికే అరుస్తుంది. తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు మంచి నేర్పించటానికే అరుస్తారని గుర్తుపెట్టుకో” అంది.

దేవుడిని రోజూ నిన్ను మార్చమని కోరుకునేదాన్ని, దేవుడు నీలో ఈ విధంగా మార్పు తీసుకు వస్తాడని కలలో కూడా ఊహించలేదంది.

అప్పుడు వాడికనిపించింది అమ్మంటే ప్రేమ పంచటమే కాదు, తప్పు చేస్తే దండించాలి కూడా అని. ​

​ఇప్పుడు వాడి కోసం ప్రతిరోజూ సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక అక్కచెల్లెల్లు రాజూకి పొద్దుపోవటానికి ఏదైనా మాట్లాడటమో లేక ఆడుకోవటమో చేసేవారు. వాళ్ళు లేనప్పుడు పొద్దున పూట వాడికి చాలా బోరుగా అనిపించేది. అప్పుడు వాడికి వాళ్ళ విలువ తెలిసి రావటమే కాదు, ఇంకెప్పుడూ వాళ్ళని ఏడిపించ కూడదనుకున్నాడు.

ఇట్టే రెండు వారాలు గడిచిపోయాయి, రాజూకు మాత్రం అవి నరకంలా గడవడమే కాక ఎన్నో రోజులు అయినట్టుగా అన్పించింది. ​రాజూను డాక్టరు దగ్గరికి తీస్కెళ్ళారు. డాక్టరు బ్యాండేజీ తీసి రాజూను కళ్ళు తెరిచి చూడమన్నాడు.

రాజూ తనకేమీ కనపడటం లేదని చెప్పాడు. డాక్టరు, రాజు అమ్మానాన్నలతో రాజు కంటిచూపు పోయినట్లుగా తేల్చి చెప్పాడు.

కళ్యాణి డాక్టర్ని అయితే మందులు వాడినా ఇంక చూపు రాదా అని అడిగింది.

మందులతో రాదు కానీ ఎవరైనా దాతలు కళ్ళు దానం చేస్తే చూడగల్గుతాడని చెప్పాడు.

దానికి వెంటనే కళ్యాణి డాక్టర్తో, “నా కన్ను ఒకటి తీసి పెట్టండి డాక్టర్! భవిష్యత్తున్న వాడు, కళ్ళు లేకపోతే చదువుకు కూడా దూరమవ్వాల్సి వస్తుంది. నా రెండు కళ్ళూ ఇవ్వచ్చు కానీ నా మీదనే ఆధారపడిన పిల్లలు ఇంకా ముగ్గురున్నారు. వారిని కూడా చూస్కోవాల్సిన బాధ్యత నాదే కదా” అంది.

దానికి డాక్టర్ “ఒక కన్నా, రెండు కళ్ళా అని కాదమ్మా! అసలు బ్రతికున్న వారి కళ్ళు అలా తీసి పెట్టరు. సామాన్యంగా ఎవరైనా చనిపోతూ దానం చేసినవే పెడతారు” అన్నాడు.

“ అలా దానం చేసే వాళ్ళు దొరకాలి కదా డాక్టర్! ఎప్పుడు దొరుకుతారనీ.. అందుకే నా కన్నొకటి పెట్టి వాడికి జీవితాన్నివ్వండి డాక్టర్” అంది.

“అది కాదమ్మా! ఇప్పుడే వద్దు. ఒక సంవత్సరం పాటు చూద్దాం ఎవరైనా దాతల నుండి దొరుకుతాయేమో.. అప్పటికీ దొరకకపోతే అప్పుడాలోచిద్దాము. ఇప్పుడిప్పుడే కొంతమంది, చనిపోయాక తమ అవయవాలు దానం చేయటానికి ముందుకు వస్తున్నారు. మీ వాడి పేరు వ్రాసుకుంటాము. కళ్ళు దానం కాబడి వచ్చిన వాటిని వచ్చినట్టుగా అమరుస్తూ వుంటాము.

మీవాడి వంతు వచ్చినప్పుడు తెలుపుతాము ఒకటి రెండేళ్ళు పట్టవచ్చు.. ఓపిక పట్టాలన్నాడు, అలాగే రాజశేఖర్తో ఆమెకు సర్ది చెప్పమని చెప్పి డాక్టరు వెళ్ళిపోయాడు.

అదంతా వింటున్న రాజూకు వాళ్ళమ్మ మాట్లాడేది విన్నాక అమ్మ గొప్పతనం తెలిసొచ్చింది. అంతేకాక అమ్మ అందరి పిల్లలనూ సమానంగా చూస్తుందని కూడా తెలిసొచ్చి అమ్మ మీద గౌరవం ఆకాశమంతకు పెరిగిపోయింది.

రాజశేఖర్ కళ్యాణిని సముదాయించి, “వాడికి అదృష్టం వుంటే ఎవరో ఒకరి కళ్ళు దొరుకుతాయి. నీవు బాధ పడ”కని సర్ది చెప్పాక ఇంక అందరూ ఇంటికి బయలుదేరి వెళ్ళి పోయారు.

ఇంటికి వచ్చాక కళ్యాణి వాళ్ళమ్మ అడిగితే విషయమంతా చెప్పారు, అలాగే సంవత్సరం లోపు ఎవరైనా దాతలు కళ్ళు దానం చేస్తే పెడతారని కూడా చెప్పారు. ​ఇంక అప్పటినుండి రాజుకు చీకటే జీవితం అయిపోయింది. ఇంట్లో అమ్మ అన్నీ తనే అయ్యి చేసి పెడ్తూ వుంది. అలాగే చిన్న, చిన్న పనులు చూడకుండా తనకు తాను ఎలా చేస్కోవాలో కూడా నేర్పించసాగింది. అప్పుడప్పుడూ ధైర్యంగా వుండమని నూరి పోస్తూ వుండేది.

కళ్యాణి అప్పుడప్పుడూ దేవుడి ముందు కూర్చుని ఏడ్వటం కళ్యాణి వాళ్ళమ్మ చూసి చాలా బాధ పడేది. నా కూతురికీ, మనవడికీ ఎంత కష్టమొచ్చిందని లోపల్లోపల చెప్పలేనంత మధనపడేది. ​

​ఇంతలో విషయం తెలుసుకుని వాళ్ళ జేజయ్యా వాళ్ళు వచ్చి ఇంక అక్కడే వుండి పోయారు. వాళ్ళ జేజయ్య రోజూ వాడికి కథలు చెప్పడం, వాడి పుస్తకాలు చదివి విన్పించటం లాంటివి చేస్తూ వాడికి పొద్దుపోనిచ్చేవాడు. వాళ్ళ జేజి కళ్యాణికి ధైర్యం చెప్తూ చేదోడుగా వుండ సాగింది. ​

​ఎనిమిది నెలలు గడిచాయి, మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళారు, డాక్టరుతో మాట్లాడారు. ఇంకొన్ని రోజులు ఆగి చూడమన్నాడు. కానీ దాతల కళ్ళు రెండు, మూడేళ్ళయినా దొరికే దాఖలాలు కనపడ లేదు, ఇంకా రాజు నెంబరు ఎంతో దూరంలో వుంది. ఇప్పుడప్పుడే వచ్చే అవకాశమైతే లేదు.

కళ్యాణి డాక్టర్ తో తన కన్నొకటి పెట్టమని ఒకటే గొడవ. డాక్టరు ఎలాగో నచ్చచెప్పి పంపాడు. ఇంటికొచ్చి నప్పటి నుండి కళ్యాణి ఒకటే ఏడుపు. కళ్యాణిని చూస్తే ఎంతో వయసు మీద పడిపోయిన దానిలా అయిపోయింది, మనిషి చిక్కిపోయి కనిపిస్తుంది, ఎవరెన్ని చెప్పినా దిగులు పడుతూనే వుంది.

ఇదంతా చూసిన కళ్యాణి వాళ్ళమ్మ కూడా చాలా బాధపడి ఒక నిర్ణయానికి వచ్చింది. తానెలాగూ ముసలిదాన్నయ్యాను, తను చనిపోతే తన కళ్ళు మనవడికి పెట్టే అవకాశం వుంటుంది. అప్పుడు కానీ కళ్యాణి మామూలు మనిషి కాదనిపించింది ఆమెకు.

ఆ అమ్మ మనసు ఆ బిడ్డ కోసం తల్లడిల్లుతుంటే, ఈ అమ్మ మనసు కూడా తన బిడ్డ కోసం తల్లడిల్లిపోతోంది.

తన ఒక్కగానొక్క కూతురి బాధ చూడలేక పోతోంది. రోజూ దేవుడి ముందు నిలబడి తనని తొందరగా తీసుకుపొమ్మని కోరుకోసాగింది. తిండి బాగా తగ్గించేసింది. కళ్యాణి కూడా బాధలో వుండి అంతగా గమనించలేదు. కొద్ది కాలానికే ఆవిడ మంచం పట్టింది.

అప్పటి నుండి ఆవిడ “నా వయసైపోయింది, నేనింక ఎంతో కాలం బ్రతకను” అనసాగింది.

కళ్యాణి “నీకేమీ కాదమ్మా! ఈ కష్ట సమయంలో నీవు కూడా నాకు తోడు లేకుండా పోతావా” అంది.

“ముసలి వారయ్యాక ఎవ్వరైనా పోవాల్సిన వారే” అంది కళ్యాణి వాళ్ళమ్మ. “ఒకవేళ నేను పోతే నా కళ్ళు నా మనవడికి పెట్ట”మని కోరింది. రాజశేఖర్తో చెప్పి ఒక పేపర్లో తన మరణానంతరం తన కళ్ళు తన మనవడికి పెట్టాలని వ్రాయించి సంతకం కూడా చేసింది. ​

​రాజు కళ్ళు పోయి సంవత్సరం దాటింది కానీ ఎవ్వరూ కళ్ళు దానం చేసినట్టు కబురు లేదు. ఇంక కళ్యాణి తన కన్నొకటి పెట్టించాలని దృఢ నిశ్చయానికి వచ్చేసింది. ఇంతలో కళ్యాణి వాళ్ళమ్మకు సీరియస్ అయ్యింది. డాక్టరు వచ్చి ఇంక రోజులే అని చెప్పి వెళ్ళాడు.

కళ్యాణి వాళ్ళమ్మ తను అనుకున్నట్టే చనిపోయి రాజూకి కళ్ళు తెప్పించి, కళ్యాణి జీవితంలో మళ్ళీ ఆనందాన్ని తెచ్చింది. నిజంగా అమ్మ అంటేనే అమృతమూర్తి. ఆమె చనిపోయైనా పిల్లలను బ్రతికించుకోవాలనుకుంటుంది. ఇది కళ్యాణి వాళ్ళమ్మ నిరూపించింది. దేవుడి ఫోటో ప్రక్కన వాళ్ళమ్మ ఫోటో కూడా పెట్టుకుని రోజూ పూజిస్తుంది కళ్యాణిప్పుడు.

తిరిగి కళ్ళొచ్చాక రాజులో చాలా మార్పొచ్చింది. ఇప్పుడు వాళ్ళమ్మ మాట జవదాటడు, గురువుల మాటలు వింటూ బాగా చదువుకుంటున్నాడు. చెల్లెల్లతోనే కాకుండా సహ విద్యార్థులతో కూడా మంచిగా బుద్ధిమంతుడిలా వుంటున్నాడు.

వాడికిప్పుడు అమ్మంటే త్యాగమూర్తని, అమ్ముంటే ఏమి కోల్పోయినా తిరిగి సంపాదించేలా చేస్తుందని గట్టి నమ్మకం.

అదే అందరికీ చెప్తుంటాడు కూడా. వాడిలో వచ్చిన మార్పు నిజంగానే కళ్యాణికి ఎక్కడ లేని ఆనందం తెచ్చి పెట్టింది. కొద్ది కాలంలోనే కళ్యాణి మునుపటిలా తయారయ్యింది. కానీ ఇప్పటికీ కళ్యాణికి తెలియదు, రాజు కోసమే వాళ్ళమ్మ మంచం పట్టిందని. మీరు కూడా ఎప్పుడూ చెప్పకండేం. ​

​వాళ్ళమ్మ గురించి తెలుసుకుని మళ్ళీ కళ్యాణి బాధపడటమెందుకు చెప్పండి. ​

కథను సుఖాంతం చేస్తూ ఇక ఇక్కడితో కథను ముగిస్తున్నాను. ​

అమ్మ అంటే అమ్మే... ​

​తాను అలసిపోయినా మన అవసరాలు తీర్చేదే అమ్మ,​

తాను తినకున్నా మనకు మమతానురాగాలను కలిపి పెట్టేదే అమ్మ, ​

​అరమరికలు లేకుండా పిల్లలను పెంచేదే అమ్మ,​ అందం చూడకుండా అక్కున చేర్చుకునేదే అమ్మ, ​

​అలసి వస్తే ఆసరా అవుతుంది అమ్మ, ​

అడక్కుండానే ఆకలి గ్రహిస్తుంది అమ్మ,​

అల్లరి చేసినా, ఆమెపై అరిచినా భరిస్తుంది అమ్మ,​

అన్నింటినీ ఓపికగా నేర్పిస్తుంది అమ్మ, ​

​ఆడుతూ, ఆడిస్తుంది అమ్మ,​

ఆకలిని పిల్లల దరిచేరనివ్వదు అమ్మ,​

ఆపదలను ముందే హెచ్చరిస్తుంది అమ్మ,​

ఆఖరికి తప్పు చేస్తే దండించేదే అమ్మ, ​

​అమ్మ లేనిదే మనము లేము,​

అమ్మంటే కనిపించే/ కని పెంచే దేవత!🙏🙏🙏 ​

-×-×-సమాప్తం-×-×- ​

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.


141 views1 comment
bottom of page