top of page

అమ్మతనంAmmathanam written by talluri nagamani

రచన :తాళ్లూరి నాగమణి

పచ్చని కళ్ళాపితో, చక్కని ముగ్గులతో కళకళలాడుతూ ఉన్నాయి ఆ వీధిలోని వాకిళ్ళన్నీ. సంక్రాంతి శోభ కనపడుతోంది నేను నిలబడ్డ ఆ వాకిలి లో తప్ప.ఈ ఉదయం ఊడ్చినట్టుగా లేదు. ముగ్గు జాడ కానరానే లేదు.మనసు జావ కారిపోవడం ధైర్యం జారిపోవడం అంటారే! అటువంటి స్థితిలో ఆందోళన, భీతి కలగలుపుగా ఉన్న ఒక విధమైన ఉద్వేగంతో గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టాను.

అది నా పుట్టిల్లు.

గుమ్మం లోనే నవ్వు ముఖంతో ఎదురయ్యే అమ్మ కనపడక, ఆప్యాయంగా చేతిలోని బరువు అందుకునే నాన్న కానరాక చిన్నబోయింది నా మనసు.

ఇరుగు పొరుగు ఆడవాళ్ళతో చిన్న గొంతుతో ఏదో చెబుతోంది వదిన. వింటున్న వారి మొహాల్లో జాలీ, సానుభూతి కన్నా కుతూహలం కొట్టొచ్చినట్లుగా కనపడుతోంది.


వారి పలకరింపులకు తలపంకింపుతో సమాధానం చెబుతూ వణుకుతున్నగుండెతో లోపలికి అడుగుపెట్టాను.వసారాలో నాన్న మంచం గోడకు నిలబెట్టి ఉంది.ఇంటి వెనక భాగంలో జామచెట్టు కింద వేసిన ఓ రేకుల పాక, దాని చుట్టూ కట్టిన పాత పట్టాల మధ్య చిన్న నులకమంచం పై స్పృహ లేని స్థితిలో ఉన్నాడు నాన్న.ఆరునెలల క్రితం నేను వచ్చినప్పుడు తన పని తాను చేసుకుంటూ, చేతి కర్ర సాయంతో తిరుగుతూ ఉన్న మనిషిలో ఎంతటి మార్పు!

పదేళ్ళుగా పక్షవాత రోగ గ్రస్థుడు ఆయన.

ఊహ తెలిసిన దగ్గర నుండీ చాకిరి తప్ప మరొకటి ఎరుగని మనిషి హఠాత్తుగా కూలిపోయాడు.

అప్పటి నుండీ వ్యవసాయం అన్నయ్యే చూసుకుంటున్నాడు.ఏనుగు కాలు లా ఉబ్బి భయంకరంగా ఉన్న కుడి కాలు నుండీ బొట్లు బొట్లుగా నీరు కారుతూ కింద మడుగు కడుతోంది. మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

కడుపులో దేవేసేలాంటి అదోరకమైన నీచు వాసనతో ముక్కుపుటాలు అదురుతున్నాయి.

అసంకల్పితంగానే ఊపిరి బిగబట్టాను. నాన్న కాలికి పొడిబట్ట చుట్టి నేలమీద మడుగు కట్టిన రక్తం తో కూడిన రసిని ఫినాయిల్ తో తుడుస్తోంది అమ్మ.

ప్రహరీ గోడ వెంబడి పేర్చిన పాత ఇటుకల మీద రెపరెపలాడుతున్నాయి అమ్మ ఆరేసిన పాత బట్ట ముక్కలు. తన మోకాళ్ళ నొప్పిని కూడా లెక్కచేయకుండా ఆ వాసన ను భరిస్తూ ఎలా చాకిరి చేస్తోందో అమ్మ అనిపించింది.ఏ ఆడపిల్లా ఇలాంటి స్థితిలో తల్లిదండ్రులను చూడలేదు, చూసి తట్టుకోలేదు.మనసును మెలిపెట్టి ఎవరో పిండుతున్న భావన.వృధ్ధాప్యం శాపం అని తెలుసు కానీ ఇలా మంచాన పడటం పాపం అనిపిస్తోంది ఇప్పుడు.

అమ్మను చుట్టేసుకున్నాను.

నాన్న అనారోగ్యం కన్నా అమ్మ పరిస్థితే నన్ను ఇప్పుడు ఎక్కువగా బాధిస్తోంది. నన్ను చూడగానే వర్షిస్తాయి అమ్మ కళ్ళు, బహుశా కడుపులో దాచుకున్న దిగులు కుండ భళ్ళున పగుల్తుందేమో నా రాకతో, లేక ఎవరికీ చెప్పుకోలేని తన హృదయ వేదన కూతుర్ని చూడగానే చల్లారుతుందేమో!

రెప్పల మాటున కల్లోలపు సముద్రాలు, గుండె లోతుల్లో కష్టాల అగాధాలు దాయగలదు అమ్మ. తన తలపై నెరిసిన ఒక్కో వెంట్రుకా ఒక్కో కథను, దాని చాటున దాగిన వ్యధనూ చెబుతుంది.

తనకు గుంభన ఎక్కువ. అందుకే భగవంతుడికీ అమ్మ అంటే మక్కువ ఎక్కువ అనుకుంటా! ఎప్పుడూ ఏదో ఒక అగ్ని పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆమె ఓర్పూ, సహనం అనే కవచంతో తట్టుకుని నిలబడగలుగుతూ ఉంటుంది‌.

కాని ఈమారు తన కళ్ళలో మునపటి ధైర్యం, జీవం కనపడ లేదు నాకు.నాన్న కోలుకుంటాడనే నమ్మకం సన్నగిల్లింది కాబోలు.

చల్లని నీళ్ళతో మొహం కడుక్కుని,వదిన ఇచ్చిన టీ తో కాస్త తెప్పరిల్లింది.

"ఏంటమ్మా ఇది! ఇక్కడెలా ఉంటారని ఇక్కడ పడుకోబెట్టారు నాన్నని?"

అమ్మ మౌనం లో సమాధానం దొరకలేదు.

"వదిన ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అందా లేక అన్నయ్యే బయటకు పంపేసాడా! చెప్పు అడిగేస్తాను" బాధ లో అంటున్నానే గానీ నాన్న పరిస్థితి ఇంట్లో ఉంచేలా లేదని నాకు మాత్రం తెలియదా!

"పిచ్చి పిల్లా! వాళ్ళేమంటారే మమ్మల్నీ. పిల్లలు తిరిగే ఇల్లు, వాసన తట్టుకోలేరని నేనే మంచం బయటకు మార్పించాను"

"హాస్పిటల్ కు వెళ్ళారా! డాక్టర్ ఏమన్నారు?"

"నిన్ననే అన్నయ్య కారు మాట్లాడి తీసుకెళ్ళాడు,

"నిదానంగా తగ్గుతుంది, మందులు వాడుతూ ఉండాలి" అన్నారంట.పక్షవాతం మందులు సరిగ్గా వేసుకోకపోవడం వల్లనే ఇంతలా ముదిరింది, ఎంత చెప్పినా లక్ష్యం ఉండేది కాదు మీ నాన్నకు"


కొడుకుని గానీ కోడల్ని గానీ ఒక్కమాట తప్పుపట్టి ఎరగదు అమ్మ ఏనాడూ.ఎంత గరళమైనా తను మింగేయగలదు.ఎంత బరువైనా మోయగల భూదేవి ఆమె.అసలు ఎన్నడు సుఖమెరుగుందని, ఎప్పుడు ఆ మనసుకు శాంతి ఉందనీ? తన జీవితమంతా ఉమ్మడి కుటుంబం లో ఆడపడుచులూ, మరుదులూ, అత్తమామల కోసం ధారపోసిన చెమట చుక్కలే, కన్నీటి ధారలే.

మంచంలో పడ్డ నానమ్మకు ఐదేళ్ళు ఎత్తిపోసింది అమ్మ. పువ్వులా ఉంచేది నానమ్మను. ఏనాడూ విసుగన్నది కనపడనిచ్చేది కాదు.నాన్నను ఏనాడు ఎదిరించి మాట్లాడి ఎరుగదు. మౌనంగా తన పని తాను చెసుకుంటూ రోజుల్ని దాటుకుంటూ నడవడమే చాతనవును తనకు.

ఇప్పుడు నాన్నతో అవస్థలు పడుతోంది.నాన్న పక్కనే కూర్చుని చేతులు నిమురుతూ ఉండిపోయాను. పొలం నుండి వచ్చిన అన్నయ్య మొహం నన్ను చూడగానే కళతప్పింది, కళ్ళ వెంబడి అశ్రుధారలు.అన్నయ్య గుండెలపై వాలిపోయాను.


"లాభం లేదురా సూరీ! ఈ రాత్రి గడిచే నమ్మకం లేదు, నాడి ఎక్కడో కొట్టుకుంటోంది, ఊపిరి కూడా చాలా నెమ్మదించింది, ఆశ వదిలేసుకోవడమే" అన్నయ్య స్నేహితుడు కంపౌండర్ కృష్ణ మాటలు ఎక్కడో మిణుకుమిణుకుమంటున్న ఆశను చప్పున చల్లార్చేసాయి.

బంధువులందరికీ కబుర్లు వెళ్ళాయి.

బడి నుండి వచ్చిన అన్నయ్య పిల్లలు కూడా బిక్క మొహాలతో మాతో పాటే కూర్చుండిపోయారు. ఉండీ ఉండీ ఓ కెరటంలా తన్నుకు వస్తోంది ఓ దుఃఖపు తెర.

తెల్లవారుజామున ఓసారి కళ్ళు తెరిచి అందర్నీ చూసిన నాన్న మరు నిముషంలోనే హాయిగా శాశ్వత నిద్ర పోయాడు.తన జ్ఞాపకాలను మోయమని అమ్మ కో బరువును ఇచ్చి వెళ్ళిపోయాడు.


తల స్నానం చేయించుకుని పట్టు బట్టలు ధరింపజేసుకునిపూల పందిరి లా అలంకరించిన పాడె మీద ఊరేగింపుగా తన ఆఖరు ప్రయాణానికి వెళ్ళిపోయాడు నాన్న. పిలిచినా వినపడనంత దూరం వెనక్కి తిరిగైనా చూడకుండా సాగిపోయాడు.ఒక్కగానొక్క కొడుకుని తన భుజాల మీద మోసి పెంచుకున్న నాన్న , వాడి భుజాల మీదుగా సాగిపోయాడు.మంచీ చెడూ నేర్పి పెంచుకున్న కొడుకు దారి చూపగా కాటికి కదలి వెళ్ళాడు.


ఇంటి వెనక వసారాలో చింకి చాపపై ఒంటరిగా మిగిలి పోయింది అమ్మ.

ఆమెను ఎవరూ తాకకూడదని, తను ఇంట్లోకి రాకూడదనీ, ఏ వస్తువూ ముట్టుకోకూడదనీ కాంతం అత్తయ్య గట్టిగా చెప్పింది.నాన్న పెద్ద చెల్లెలు ఆవిడ. ఎవరికేం కావాలో చెప్పకుండానే గ్రహించి, అందరికీ వండి వడ్డించిన అమ్మకు దూరం నుండి వడ్డించి విస్తరి తోస్తున్నారు.అంటరాని దానిని చూసినట్టు చూస్తున్నారు.

ఒక్కసారిగా ఏమిటీ మార్పు?అమ్మ తప్పు చేసిన దానికి మల్లే వంచిన తల ఎత్తడం లేదు, కన్నీటిని ఆపే యత్నమూ చేయడం లేదు.

"అబ్బాయ్! పంతులు గారికి కబురు చేసారా!అమ్మాయ్ మీ ఇంటి చాకలికి కబురెట్టు, పెద్ద కర్మ రోజు మీ అత్త గారికి పసుపు కుంకుమ తీసేయాలి, ఓ ముసలమ్మను తీసుకు రావాలి. మరి కట్టడి ఎంత అడుగుతుందో ఏంటో? ముందే మాట్లాడుకుంటే మంచిది కదా" కాంతం అత్తయ్య సలహాలు ఇస్తోంది.

ఆవిడకు మన ఆచారాల గురించి బాగా తెలుసు పైగా ఈమధ్యే ఆవిడ భర్త పోయాడు.

"చాకలి ఎందుకత్తా?" అర్థం కాక అడిగాను.

"మీ అమ్మకు పసుపు కుంకుమ తీయడానికి?విధవను చేయడానికి" విలవిలలాడింది నా ప్రాణం.

"అలాంటి తతంగాలేమీ లేకుండా అమ్మను అలా వదిలేయకూడదా అత్తా!" బతిమాలాను.

చూడమ్మాయ్! ఇది అనాదిగా వస్తున్న ఆచారం. మార్చడానికి నువ్వెవరూ నేనెవరు? అయినా ఇది బస్తీ కాదు పల్లె. ఇక్కడ ఏ ఆచారం గాడి తప్పినా జనం నోళ్ళలో మనం నానాల్సిందే! నా అన్న ఇంట్లో ఇలాంటి అనర్ధం జరగనివ్వను అన్నీ పధ్ధతి ప్రకారం జరగాల్సిందే" అత్త మాట శాసనం లా వినపడుతోంది. అన్నయ్యా వదినా కూడా తల వంచారు.


పదకొండవ రోజు వచ్చింది.కుర్చీలో పూల దండను అలంకరించుకుని నవ్వుతూ నాన్న.మనసును మెలిపెడుతున్న ఆయన హఠానిష్క్రమణం.అన్నయ్య స్మశానంలో జరపాల్సిన క్రియల కోసం బాబాయి వాళ్ళతో వెళ్ళాడు.బంధువులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు.

వాకిట్లో ఓ పళ్ళెంలో పసుపు, గరిక ఉంచింది అత్తయ్య.ఆడవాళ్ళంతా మంగళ సూత్రానికి పసుపు రాసుకుని, పుస్తెల తాడుకు గరిక దర్భ ముడి వేసుకుని ఇంట్లోకి వస్తున్నారు.మా ఇంటి చాకలి వెంట వచ్చిన ముసలమ్మ వాకిట్లో నీళ్ళు జల్లి పిండితో ముగ్గేసి పీటవాల్చింది.అక్కడ జరిగే తతంగం నేను ఏనాడు చూసి ఉండకపోవడంతో ఒకింత అయోమయం కలిగిస్తోంది.

అమ్మను వాకిట్లో బంధువులు ఇరుగు పొరుగు వారందరి ముందూ పీటపై కూర్చోబెట్టి మొహానికి పసుపు రాసి పెద్ద కుంకుమ బొట్టు దిద్దింది.కాళ్ళకు పసుపూ, పారాణి అద్ది తలలో పూలు చేతుల నిండుగా గాజులు అలంకరించింది.నాకు భయంతో వెన్ను జలదరించింది అమ్మను అలా చూస్తోంటే.అమ్మోరులా అలంకరించి ఎందుకిలా నలుగురిలో కూర్చోబెట్టి అవమానిస్తున్నారు? భర్త పోయి ఆవిడ అంత దుఃఖం లో ఉంటే ఓదార్చడం మానేసి ఇంత వికృతమైన చర్యలేంటీ? ఎవరూ వ్యతిరేకించరెందుకు?


ఎంత వేదనను అనుభవిస్తోందో మరి గట్టు తెగిన ప్రవాహం లా ఉంది అమ్మ కన్నీరు.అమ్మను చూసి కుమిలిపోతోంది నా హృదయం. పుట్టింటి వాళ్ళు బొట్టు పెట్టాలంట, అమ్మకు ఎవరూ లేకపోవడంతో ఆ ముసలమ్మే ఎడమ చేత్తో బొట్టు పెట్టింది. దుఃఖ భారం పెరిగిందో లేక వత్తిడిని అధిగమించలేకో మొదలు నరికిన చెట్టల్లే అమ్మ కూలబడిపోయి స్పృహ కోల్పోయింది.

అందరూ "అయ్యో! పాపం" అని జాలి చూపుతున్నారే గానీ ఒక్కరూ అమ్మను తాకడం లేదు.

"అమ్మా" అంటూ నేను పరుగెత్తబోగా

"సుధా! ఆగు..ముట్టుకోకు" పిన్ని హెచ్చరించి ఆపేసింది.

అమ్మ మొహం పై నీళ్ళు జల్లి లేపింది ఆ పెద్దమ్మ. కాస్త తేరుకోగానే కాసిని మజ్జిగ తాగించి ఆటోలో ఎక్కడికో తీసుకెళ్ళారు.

ఏమిటీ ఆచారం? ఏం ఉపయోగం ఉంది దీనివల్ల? దిగులుగా బెంగగా అనిపించింది.

నాన్నతో బాటే అమ్మ సౌభాగ్యం వెళ్ళిపోయింది అని తెలుసు కానీ ఆమె విలువ గుర్తింపు కూడా కాలిపోయాయా!

అక్కడే కూర్చుండిపోయాను నిర్వేదంగా. ఓ గంట తరువాత ఆటో తిరిగొచ్చింది.

కాంతం అత్తయ్య అందర్నీ తప్పుకోమని కేకలేసింది.

ముత్తయిదువలంతా చప్పున కళ్ళు మూసుకుని తప్పుకున్నారు."మా అమ్మను చూడకూడదా!" ఎదురు తిరిగిన నా మనసు వెదికిన చూపులకు అమ్మ కనపడకుండా కట్టిన అడ్డు తెరల చాటున బోసి పాదాలు, తెల్లని చీర కనిపించాయి.

భీతిని కలిగించేంత తెల్లదనం అది. విపరీతమైన జలదరింపు నాలో. మూల గదిలోకి వెళ్ళింది అమ్మ.

"అమ్మాయ్! పిల్లలను అటుగా వెళ్ళనివ్వకండి జడుసుకుంటారు, సుధా! నువ్వూ జాగ్రత్త. కాస్త ఎడంగా ఉండు." అంటున్నారు ఎవరో.

భోజనాలు చేసి ఒక్కొరొక్కరుగా బంధువులంతా వెళ్ళిపోయారు అతి ముఖ్యమైన వాళ్ళు తప్ప.

ఆ రాత్రి కాసిని పాలు అమ్మకు ఇచ్చి తలుపేసింది అత్తయ్య.

గాలి కూడా ఆడని ఆ ఇరుకుగదిలో అమ్మ ఎలా ఉందో! ఆ తలుపు వంకే చూస్తూ నేనూ వసారాలోనే పడుకున్నాను. తెల్ల వారు ఝామున "అమ్ములూ అమ్ములూ!" అనే పిలుపుకి ఉలిక్కిపడి లేచాను.ఆ మసక చీకటిలో నా ఎదురుగా పూర్తిగా ముసుగేసుకున్న ఓ ఆకారం. కళ్ళు నులుముకుని చూసినా పోల్చుకోలేక పోయాను.

"అమ్ములూ! బాత్ రూమ్ కి వెళ్ళాలమ్మా!నేను ఉదయాన్నే ఎవరికీ మొహం చూపించకూడదంట అమ్మా,కనపడకుండా ఎలా తిరగ గలనమ్మా? మీ నాన్న బదులు నేను పోయినా బాగుండేది." అమ్మ ఆక్రందన నా గుండెను పిండేస్తోంది.నాన్న పోయిన దుఃఖం కంటే ఇది వేయి రెట్లు లోతైనది.నా చేతులకు వేయి బాహువుల వైశాల్యం ఉండి ఉంటే అమ్మను ఆలింగనం చేసుకుని తన ఆవేదనను చల్లార్చాలని ఉంది.ఆమె గుండె మంట ఆర్పే శక్తి నాకు లేకపోయిందేమా అనిపించింది. అమ్మను పొదువుకుని బాత్ రూమ్ వైపుకు నడిపించాను.

రాత్రి ఉండిపోయిన ఒకరిద్దరు బంధువులు , కాంతం అత్తయ్య ఊరికి బయల్దేరుతున్నట్లు ఉన్నారు కాబోలు సర్ధుకుంటున్నారు.అమ్మ అలికిడికి ముఖం చిట్లగించుకుని తలలు తిప్పుకున్నారు.

గునపాలతో గుండెను తవ్వేస్తున్నట్లు ఉంది నాకు.ఏమీ అనలేని స్థితి నాది. అమ్మను తిరిగి గది ముందు వదిలేసాను. గుండెలో సన్నని మంటలా ఆరంభమైన ఆలోచనలు ఏతీరానికీ చేరక ముందే, ఏ పరిష్కార మార్గమూ చూపక ముందే తెల్లారింది.

తలుపు తీసుకుని గదిలోకి వెళ్ళాను. బొట్టులేని నుదురు, బోసి మెడ, గాజుల్లేని చేతులు ఏదోలా ఉంది అమ్మ.చూడలేకపోతున్నాను. ఇద్దరి గుండెలు ఎగసిపడుతున్నాయి రోదనతో.

లోకమంతా నిరాశ దుప్పటి కప్పుకున్నట్లు, కలతల చీకటిలో మునిగినట్లు అనిపించింది నాకు.

నా బలం,ధైర్యం అమ్మ. నా కష్టాలన్నీ అమ్మకు చెప్పుకుని స్వాంతన పొందే నేను ఈరోజు తనకు ఏ సాయమూ చేయలేని నా నిస్సహాయతను నిందించుకుంటున్నాను.

"ఎలా ఉన్నావమ్మా!" బేలగా అడిగాను తన ఒడిలో తల పెట్టుకుని మెట్టెలు లేని బోసి పాదాలను నిమురుతూ, మౌనంగా క్షమాపణ వేడుకుంటూ. నా తల నిమురుతోంది అమ్మ.

"అమ్ములూ!" అమ్మ కంఠం వినపడుతోంటే మౌనంగా వింటూ ఉన్నాను.

"నువ్ పసి పాపాయి గా ఉన్నప్పుడు ఒకసారి పాకుతూ నిప్పుల దగ్గరకు వెళ్ళావు. పట్టుకుంటావేమో అనే కంగారులో నేను పరుగెత్తుకుంటూ వచ్చి నిన్న కాపాడి నేను చేతులు కాల్చుకున్నాను.

ఆ గాయం చాన్నాళ్ళు మానలేదు. అది సలిపినప్పుడల్లా నొప్పి కలగక పోగా గర్వంగా అనిపించేది. నా బిడ్డను కాపాడుకున్నాను, దాని ఒంటి మీద మచ్చ పడనివ్వకుండా ఆపగలిగాను అని. ఇప్పుడు కూడా అంతే. మీ నాన్న వెళ్ళిపోయారు. ఆయన పరువు నా భుజాలపై ఉంది. నేను ఉన్నంత వరకూ మోయాల్సిన భాధ్యత నాకుంది. అందుకే తల వంచాను.ఈ పరిస్థితి మారాలని అందరి ఆడవాళ్ళ మనసుల్లోనూ ఉంది కానీ తెగువ చూపలేకపోతున్నారు.

"ఆడదాని బతుకులో ఇది ఒక దశ, దాగి ఉన్న మరో కోణాన్ని పరిచయం చేసిన దిశ. ఎదురొచ్చిన ప్రతి అడ్డంకి ని గుప్పెడు ధైర్యం తోడు తీసుకుని, ఓర్పూ సహనాలతో అధిగమించాను.తల వంచుకు బతకడమే తెలుసు గానీ ప్రవాహానికి ఎన్నడూ ఎదురీదలేదమ్మా. ఇప్పుడూ అంతే!

ఈ దుఃఖం శాశ్వతంగా ఉండదూ, ఉండిపోదు.రోజులు గడిచే కొద్దీ అంతా మాములైపోతుంది."

మౌనంగా వింటూ ఉన్నాను.


తలుపు తోసుకుని గదిలోనికి వచ్చింది మా అన్నయ్య కూతురు పదేళ్ళ సాయి.అమ్మ మొహంలోకి తేరిపారా చూస్తూ "అలా ఉన్నావేంటి నానమ్మా, నీ బొట్టేది? చెరిగి పోయిందా!" అమాయకంగా అడుగుతోంది.

" నా బొట్టు దేవుడు తీసుకెళ్ళాడమ్మా" గద్గద స్వరం తో అంటోది అమ్మ.

మనసు ముక్కలయిపోతోంది ఆ మాటలకు.

రివ్వున వెళ్ళి కుంకుమ భరిణె తెచ్చింది సాయి. "నీ మొహం బాలేదు నానమ్మా! బొట్టు పెట్టుకో"అంటూ. దాని తల నిమిరాను. నూతన తరం ఇది. చైతన్యం కలిగినది. మార్పు ఆశించవచ్చు.ఈ మూఢాచారం నుండి ఆడవాళ్ళు బయటపడే సమయం ఆసన్నమయినట్లే తోచింది.

చిరు కాంతి పుంజమేదో నా చీకటి కమ్మిన మనసులో వెలుగు రేఖల్ని నింపుతానంటోంది.

దాని పేరే విశ్వాసం. అమ్మ పక్కకు తిరిగి విభూది ని నుదుట దిద్దుకుంది.

సూరీడులా కాంతిని చిందే కుంకుమ రాలిపోతేనేం, చల్లని వెన్నెల కురిసే చంద్రుడిలా మెరుస్తోంది విభూది. అమ్మలో ఏదో వెలుగు.. అది అమ్మతనం.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నాగమణి తాళ్ళూరి

సాధారణ గృహిణి

419 views1 comment

6 Comments


మణి గారు మణి పూసలాంటి కథను పంచారు, కొన్ని సాంప్రదాయాలు గా యపడ్డ మనసులను మరింత చిత్రవధ చేస్తాయి. ఈ మూఢాచారాలు ఎప్పుడు అంతరిస్తాయో! రచయిత్రి ఈ రచన కోసం ఎంతగా పరితపించి పోయిందో ప్రతీ అక్షరం సాక్షం చెపుతున్నాయి. అభినందనలు నాగమణి గారు.

Like

అమ్మతనం కథ కళ్ళలో నీళ్ళు తిరిగేలా చేసింది.మరో raajaaraammohanaray పుడితే తప్ప ఈ దురాచారం ఆగదేమో. పుట్టుకతో వచ్చిన అలంకారం భర్త పోయిన మహిళలను మానసికంగా చిత్రవధ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఉన్నా...స్త్రీని విలాస వస్తువుగా అనుకొనే రోజుల్లో సాంప్రదాయం. తల్లిగా మలముత్రాలు ఎత్తిన చేతులు, భూదేవి సహనం తో భర్తకు చేసే సేవలు...ఏవీ ఆమెను గుర్తుకు తేవడం లేదు....అవును..జీవితాంతం ఆధారపడే ఒక దారం తెగిన గాలిపటం...

అసహ్యం అన్న పదం తెలియని అమ్మతనానికి వందనం..

కళ్ళు చెమర్చే చక్కటి కథ..ను అక్షరబద్ధం చేసేందుకు రచయిత్రి ఎంత తపన పడ్డారో....అడుగడుగునా కనిపిస్తోంది...వాస్తవం కళ్లముందు నిలబడి మన అసమర్థతను వెక్కిరిస్తున్నట్టుంది. రచయిత్రి కి అభినందనలు.

Like

Sricharan Mitra
Sricharan Mitra
Jan 18, 2021

అమానవీయం అనబడే ఈ ఆచారాన్ని మరింత దృశ్యబద్ధంగా రాసి చూపారు. ఇలాంటివి రచయితలకు అంటే మగవాళ్ళు రాయడానికి అవకాశం ఉండదు. ఒక రచయిత్రి తన ప్రగతిశీల ఆలోచనతో సమాజానికి తెలియజేయాలని అనుకోవడం అభినందనీయం..ఆ విధంగా ఎప్పుడో ఒకప్పుడు మార్పు సాధ్యమే..అందుకు ఇలాంటి రచనలూ అవసరమే.. అభినందనలు రచయిత్రి గారికి.

Like

renuka jaladanki
renuka jaladanki
Jan 17, 2021

కన్నుల ముందు దృశ్యం కదలాడేట్లు రాశారు మణి గారూ! మూఢాచారాలతో ఓ మనసు నలిగపోతుందని స్పృహ లేకుండా వుంటాయి ఇలాంటి ఆచారాలు. నిజమే! స్వస్తి చెప్పాలి ఇలాంటి వాటికి. ఇలాంటి కథలు రాకపోతే ఇది సమస్యనే విషయమే మర్చిపోతాం. ఇలాంటి కథలు రావాలి. అప్పుడే మనుషులలో చైతన్యం వస్తుంది. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది.👏👏👏

Like

Surekha Devalla
Surekha Devalla
Jan 17, 2021

మనసును మెలిపెట్టింది ఆండీ మీ కథ. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారా ఇప్పటికీ... చాలా చాలా బాధగా అనిపించింది. చివరికి కొత్త తరంలో మార్పు ఆశించవచ్చు అనే ఆశావహ దృక్పథంతో కథ ముగించడం చాలా బాగుంది అండీ. కథనం కథలో లీనమయ్యేలా చేసింది.

Like
bottom of page