'Anapathyulu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'అనపత్యులు' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
అనపత్యులైన ముకుందరావు- ఆర్యాణిలకు సంపదకు లోటు లేదు. వాళ్ళిద్దరు మంచి మర్యాదస్తులు. మరు జన్మ ఉంటదో ఉండదో కాని లోక మంత ఈ జన్మలో కష్ట పడుతూ దైవారాధన, దైవ దర్శన, మొక్కులు, నోములు, వ్రతాలు, పూజలు, దాన ధర్మాలు, ప్రదక్షిణలు ఇత్యాది కార్యక్రమాలు నెరవేర్చుచుంటారు ఒకటి సద్గతులని, రెండవది శివపురాణము విష్ణు పురాణము విన్న కారణంగా మరణించిన తరువాత యమలోకపు శిక్షల భయముతో. -- అందులో ముకుందరావు- ఆర్యాణి దంపతులు కూడఆ కోవకు చెందినవారే. మహా భక్తి తత్పరులే.
ఏబది యేండ్ల ముకుందరావు, నలుబది దాటిన ఆర్యాణి లకు కేశ సంపద తెలుపెక్కి రాలి పోయి పలుచ పడుతుండడము చే ఆ ముదిమి ఛాయలకు వ్యాకులత చెందుచూ భవిష్యత్ లో తోడు ఎవరు లేరుగదా అని కృంగిపోతుంటారు.
అప్పుడు వాళ్ళకు ఆలోచన మొదలౌతుంది- ఉడుకు రక్తము మీద ఉన్నప్పుడు సంతానము లేక ఆత్మ క్షోభ ఉన్నా నెట్టుక రాగలిగాము- కాని వయసు మీద పడుతున్న కొలది తోడు లేకుండా బతుక కలిగేది ఎట్లా అని- ఇద్దరిలో ఎవరు ముందొ ఎవరు తుదకో ఎట్ల రాసి ఉందో అని వాపోతు ఎవరినైనా దత్తత తీసుకుంటె బాగుంటుందనుకుంటారు.
శాస్త్రోక్తంగ దత్తత ఈయడానికి ఎవరూ ముందుకు రారు. కారణం కులము, గోత్రము, వరుసలు ఇత్యాది ఇబ్బందులెన్నో అడ్డుగా నిలుస్తాయి.
పోనీ ఏ అనాథుల ఆశ్రయము నుండి తెచ్చుకున్నా అది దత్తత అనబడదు కేవలము పెంచుకునడమో, సాదుకునడమో అంటారు. ఇంకొకటి రేపు చనిపోయిన తరువాత కర్మకాండ శాస్త్రోక్తంగ చేస్తరో లేదో- అయినా శాస్త్రోక్తము అంటె గోత్ర నామాలు చెప్పవలసి ఉంటుంది - ఛీ ఇదంతా కాని పని ఎటూ తేల్చుకోలేక ద్వైదీ భావవతో సతమత మౌతుంటారు.
అదీ గాక ఎవరినో తెచ్చి పెంచి పెద్ద జేసి విద్యా బుద్ధులు నేర్పించే వరకు ఇంకా ఇరువది ఏండ్ల కాలము పడుతుంది. అప్పటికి వృద్ధాప్య జాబితాలో చేరడము జరుగుతుంది. ఆ వచ్చిన వాడు చదువు పూర్తైతె ఏ అమెరికానో లండనో పోడని నమ్మకమేముంది. అనుకుంటూ ఎటూ తేల్చుకోలేక పోతారు దంపతులు ముకుందరావు- ఆర్యాణి.
ఆలోచనల తోటే నాలుగైదేండ్లు గడిచి పోతవి.
తలవని తలంపుగా ముకుందరావు దూరపు బంధువు హరినారాయణ అనునతడు వీళ్ళ ఇంటికి వచ్చి ఒకరోజు వీళ ఇంట్లనే ఉంటాడు. ఆ ఒక్క రోజులోనే వీళ్ళ ఆవేదన అర్థం చేసుకొని ఒక ఉపాయము చెబుతానంటాడు హరినారాయణ. దంపతులు ఆత్రతగా ఏమిటని ప్రశ్నిస్తారు.
హరినారాయణ అంటాడు నాకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ---- ఇద్దరి కూతుర్ల పెళ్ళిళ్ళు అయిపోయినవి. చిన్నదాని పెళ్ళి చేతామంటె అధిక చదువు చదివిన కారణ మొకటి, వరదక్షిణ, లాంఛనాలు ఇత్యాదివి ఈయ కూడదని ఒకటి, అక్కల మాదిరిగా పెళ్ళి చూపులని వచ్చిన వారి ముందర ముస్తాబై కూర్చోవడము వాళ్ళ యక్ష ప్రశ్న్లకు సమాధాన మీయడము లాంటి దుష్ట సంప్రదాయమునకు తలఒగ్గడము కారణంగా పెళ్ళి చేసుకోనిని భీష్మించి కూర్చున్నది.
వయసు కూడా ముప్పది ఏండ్లు దాటి పోయినవి. నేనిక దాని పెళ్ళి చేయలేను కూడ. మీరు ఇష్ట పడితె దాన్ని మీ దగ్గర ఉంచుకొండి - మీకు సహాయకారిగా ఉండి ఒక గ్రంథాలయము నడుపుతా నంటున్నది- లంకంత మీ యింటిలో ఆ వసతి కూడా ఉన్నది. మాకు తోడుగా మా అబ్బాయి ఉంటాడు - విదేశాలకు పోయే ఆలోచనలో లేడు” అని సుధీర్గంగ చెబుతూ ఉంటాడు హరినారాయణ.
“ఇదేదో ఆశాజనకంగానే ఉన్నది కాని మీ ప్రతిపాదనకు మీ అమ్మాయి ఒప్పుకుంటుందా” అనీడుగుతారు సందేహంగా.
“నా కూతురు హైందవి ఎప్పటినుండో గ్రంథాలయ స్థాపన ఆలోచనలో ఉన్నది- నా ఆర్థిక పరిస్థితి అనుకూలించక దాని కోరిక తీర్చ లేకపోయినాను. మెరుపు లాంటి ఆలోచన వచ్చి మీ ఇంటికి రావడము జరిగింది- కాకపోతె పెద్ద ఇల్లుగదా అని వసతి బాగుంటదనే రావడము జరిగింది. సంతానము లేక పరితపించే మీ ఆవేదన అర్థము చేసుకొని ఈ ప్రతిపాదన చేయడము జరిగింది ఉభయ తారకంగా ఉంటుందని” అంటాడు హరినారాయణ.
“హరినారాయణగారూ! మీ ఆలోచన మాకూ సమ్మతమె. అది కార్యరూపం దాల్చెటట్టు చూడండి. ఎందుకైనా మంచిది ముందుగా మీ ఇంట్లో వాళ్ళతో, విశేషించి మీ హైందవితో సంప్రదించి వారి అభిప్రాయాలు తెలుసుకొండి. ఇంకొకటేమిటంటె మీకు అనుకూల వాతావరణము ద్యోతకమైతె మీ అమ్మాయిని ఒక పూట కొరకు ఇక్కడికి తీసుక రండి. ఇక్కడి వాతావరణము ఆమెకు అనుకూలించితే మా అదృష్టంగా తలుస్తాము” అంటారు దంపతులు ముకుందరావు- ఆర్యాణి ముక్తకంఠంగా.
దానికి హరి నారాయణ “మీరేమి బెంగ పెటుకోకండి- రేపే మా కుటుంబ యుక్తం వచ్చి ఒక రోజు మీ ఆతిథ్యము స్వీకరించి మీ అభీష్టము నెరవేరేలా నా ప్రయత్నలోపం లేకుండ చూస్తాను. ఇక సెలవు” అని తన ఇంటికి తిరుగు పయనమైతాడు హరి నారాయణ.
అప్పుడే తమ వ్యాకులత పటాపంచలైనట్టు మురుస్తారు ముకుందరావు- ఆర్యాణి. ఇల్లు జేరిన హరినారాయణ
భార్య మాధవితో ముకుందరావు ఇంటికి పోయిన విషయము అతని ఇంట్లో ఉండి హైందవి చిరకాల వాంఛ ఐన గ్రంథాలయ స్థాపన మున్నగు విషయాలు చెబుతాడు-
అక్కడే ఉండి వింటున్న హైందవి “నాన్న, రేపు వాళ్ళింటికి పోయి అక్కడి వాతావరణ మెట్లుంటదొ- గ్రంథాలయానికి పాఠకులు వచ్చే అవకాశమున్నదో లేదో బేరీజు వేసుకున్న తరువాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తోడు ఉండడానికి ఆలోచిస్త” అంటది హైందవి.
“అట్లనే కానీయమ్మా! నీవు నాకు బరువేమి కావు. ఐనా ఉన్నత చదువులు చదువుకున్నదానివి నా స్థాయికి మించి పోయిన దానివి. నా బాధ్యతగా కన్యాదానము చేతామంటె తిరస్కరించుచుంటివి- అక్కలు అత్తగారిళ్ళకు పోలేదా - ఐనా నీకిక ఏమీ చెప్పదలుచుకోలేదు- నా చాదస్తము వదలలేక ఇప్పటి ప్రతిపాదనకూడా ఒక రకమైన కన్యాదానముగా అనుకుంటాను- కాని ఎట్టి పరిస్థితిలో నీ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి నీ మనసు నొప్పించే తలంపు నాకుంటదని కలలో కూడా అనుకోకు అమ్మా” అని గద్గద స్వరం తో అంటాడు హరినారాయణ.
భార్య మాధవి భర్తను అనునయిస్తూ “అదేమిటిటండి మీరు మనసెందుకు నొచ్చుకుంటారు.. దాని ఇష్ట ప్రకారమే ఒక మార్గము చూపిస్తున్నారు. వృద్ధ దంపతులకు తోడుగా ఉండడము ఒక సత్కార్యమే కద- ఐనా రేపు వాళ్ళింటికి పోదాము అంటున్నది కదా - రేపు పోయి వత్తాము” అంటుంది మాధవి.
మరునాడు ఉదయమే హరినారాయణ, మాధవి, కూతురు హైందవి కొడుకు ప్రదీప్ కలసి ముకుందరావు ఇంటికి పోతారు.
ముకుందరావు - ఆర్యాణి దంపతులు వీళ్ళను సాదరంగా ఆహ్వానించుతారు- కుశల ప్రశ్నల అనంతరము నలుగురికి చాయ ఫలహారము అందిస్తుంది ఆర్యాణి.
ఫలహారము చేసి చాయ రుచి చూసి “చాయ బాగుంది పిన్నీ” అంటుంది హైందవి తొలుతనే ఏమి మాట్లాడాలొ మనసుకు తట్టక.
“సంతోషము అమ్మా” అంటుంది ఆర్యాణి.
పెద్దవాళ్ళు మట్లాడుకుంటుంటె హైందవి - ప్రదీప్ ఇల్లంతా తిరిగి చూసి వస్తారు-
“మీ ఇల్లు బాగుంది బాబాయ్. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది” అంటుంది హైందవి.
“అంతకు మించిన సంతోషము మాకు వేరే ఉండదు అమ్మా” అంటాడు ముకుందరావు.
“అవునమ్మా” అంటుంది ఆర్యాణి.
హైందవికి ఇల్లు పరిసరాలు బాగా నచ్చుతాయి- తండ్రిని చాటుకు పిలిచి “నాకు మీ ప్రతిపాదన ఇష్టమే నాన్నా” అంటుంది హైందవి.
సరె అని ముకుందరావు దగ్గరికి వచ్చి “నిన్న మీ ఇంటికొచ్చిన వేళా విశేషము ఈ రోజు నా ప్రతిపాదన సఫలీకృతమైనది” అని హరినారాయణ చెప్పగానే “ధన్యులము” అంటాడు ముకుందరావు.
ఆరోజు మొత్తము నలుగురు ముకుందరావు ఇంట్లోనే ఉండి మరునాడు తిరుగు పయన మైతారు-
“మంచి రోజు చూసుకొని వచ్చి మా అమ్మాయిని మీ అమ్మాయిగా స్వీకరించ”మని, “పోతాము” అంటాడు హరినారాయణ.
“ఇక ముందు మనము ఎనిమిది మందిమి అనుకొండి హరినారాయణ గారు” అని చేతిలో చేయి కలిపి వారికి వీడ్కోలు చెబుతాడు ముకుందరావు.
ఒక మంచి రోజు చూసుకొని హరినారాయణ, మాధవి, హైందవి, ప్రదీప్ ముకుందరావు ఇంటికి వచ్చి హైందవిని ముకుందరావు, ఆర్యాణిలకు తోడుగా ఉండి నీ అభీష్టము నెరవేర్చుకో తల్లీ అని చెప్పి వెళ్ళి పోతారు-
ముకుందరావు- ఆర్యాణి లకు ఆ రోజు నుండి ఇక రోజూ పండుగే.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments