top of page

అనసూయ

Anasuya Written By Subbarao Mandava

రచన : సుబ్బారావు మండవ


“ ఏంటి అను ? ఎంత చెప్పినా వినవు. నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావు. “ ఎంతో అనునయంగా చెప్పాడు ఛార్లెస్.

“ ఏంటి భవిష్యత్తు, భవిష్యత్తు అంటున్నావు? నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఒక్కటే. పదేపదే ఎందుకు అలా మాట్లాడుతున్నావు చారు ? “ అంది అనసూయ ఛార్లెస్ నోటిలో నుంచి కారుతున్న సొంగను గుడ్డతో తుడుస్తూ.

“ లేదు అను. నా మాట విను. నీ వయస్సు నిండా పాతిక కూడా లేదు. మనం కలిసివుంది కేవలం మూడు సంవత్సరాలు. మన అదృష్టం కొద్ది పిల్లలు కూడా లేరు. ఇక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నేను బ్రతకనని , బ్రతికినా పసి పిల్లాడిలా బ్రతకాలని డాక్టర్లందరూ కరాఖండిగా చెప్పేశారు కదా. ఇంకా నాకు ఊడిగం చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. నేను చెప్పేది విను. “ ఆయాసంగా ముద్దముద్దగా మాట్లాడు తున్నాడు ఛార్లెస్.

“ చాల్లే చారు. ఇంకా మాట్లాడాకు. నీకు ఏమీ కాదు. నా ప్రేమతో నిన్ను బ్రతికించుకుంటాను. వైద్యం చేయలేని పనులెన్నో ప్రేమ చేస్తుంది. నువ్వు నాకు ఈ మూడు సంవత్సరాలలో ఇచ్చిన ప్రేమ నాకీ జన్మకు చాలు. నిన్ను నా బిడ్డలా జీవితాంతం సాకుతాను. నా గత జీవితం గురించి నీకు తెలుసు కదా! అనవసరంగా మనస్సు పాడు చేసుకోమాకు. ఏమీ కాదు. నీకు నేనున్నాను. నాకు నువ్వు తోడుంటావు. కాసేపు నిద్రపో !“

ఛార్లెస్ అయిష్టంగానే కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో నర్స్ వచ్చి డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పింది. అనసూయ ఛార్లెస్ కు దుప్పటి కప్పి, డాక్టరును కలవటానికి వెళ్ళింది.

“ సర్ ! మే ఐ కమిన్? “ డాక్టర్ ఛాంబర్ డోర్ తట్టి అడిగింది.

“ ఎస్ . ప్లీజ్ కమిన్. కూర్చోండి. చూడండి అనసూయగారు ! మీరు ఇక్కడకొచ్చి రెండు నెలలై పోయింది. మీ కంపెనీ వారు ఇక ఇన్స్యూరెన్స్ ఇవ్వరట. అంతే కాదు. ఇంకా కొత్తగా ఛార్లెస్ కు చేయవలసిన ట్రీట్ మెంట్ కూడా ఏమీ లేదు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పరమేశ్వరన్ గారి అభిప్రాయం కూడా తీసుకున్నాము. వారు చెప్పిందేమంటే, ఛార్లెస్ వెన్నెముకలో లింక్ పోయింది. ఆపరేషన్ ద్వారా సరిచేసే ప్రయత్నం చేస్తే, అసలు ప్రాణానికే ముప్పు. ప్రపంచంలో ఎక్కడా ఇప్పుడు దీనికి చికిత్స లేదు. అందుకని మీరు ఇంటికి తీసుకు వెళ్ళండి. మేము రాసిచ్చే మందులు జీవితాంతం వాడాలి. ఒక మనిషి నిరంతర కనిపెట్టుకొని వుండాలి. ఏదైనా అత్యసరం అనిపిస్తే ఇదిగో ఈ నెంబరుకు ఫోన్ చేయండి. ఈ రోజు డిచార్జ్ చేస్తారు.” అని ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఆమె చేతికి ఇచ్చి, “ ఓకే. ఇక మీరు వెళ్ళవచ్చు “ అని కాలింగ్ బెల్ కొట్టాడు. వచ్చిన సిస్టరుకు వివరాలు చెప్పి పంపించాడు డాక్టర్. అనసూయ తల్లిదండ్రులిద్దరూ సివిల్ సర్వెంట్స్. అమ్మ ఐపిఎస్., నాన్న ఐఏఎస్. ఒకరు ఆంధ్రాలో మరొకరు ఝార్ఖండులో. నెలకు ఒకటి రెండు సార్లు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు కూడా మనస్సు విప్పి మాట్లాడుకోరు. ఎవరు ఎంత సంపాదించారో ఎలా పొదుపు చేసుకుంటున్నారో, ఏమేమి కొంటున్నారో ఇంకా ఎలా సంపాదించ వచ్చో , ఎలా దాచుకోవచ్చో మాట్లాడుకుంటారు నిస్సిగ్గుగా, నిర్భయంగా. ఆలు మగలు కాబట్టి శారీరకంగా వాంఛలు తీర్చుకోటానికి కలుసుకుంటారు. తత్ఫలితంగా అనసూయ పుట్టింది. పాలిచ్చి పెంచింది ఆయా .

అమ్మ నాన్నల ప్రేమ అంటే ఏమిటో తెలియదు పాపం. స్కూల్ కు వెళ్ళే వయస్సు రాగానే ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు. పొద్దున్నే జిమ్ము, సాయత్రం స్కూల్ ఐపోయాక స్విమ్మింగ్. రోజంతా బిజీబిజి. అమ్మ దగ్గర స్కూల్ రోజుల్లో. స్కూల్ సెలవుల్లో నాన్న దగ్గరకు. ఎక్కడవున్నా ఒక్కటే. ఊరకే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లు చెప్పటానికే అమ్మ నాన్నలు. అన్ని పనులు ఆయానే చేసి పెడుతుంది. తనకు ఏది కావాలన్నా ఆయాతో వెళ్ళి కొనుక్కో వచ్చు. ‘ఎందుకు ? ఏమిటి?’ అని అడిగే వాళ్ళు లేరు. గౌహతి ఐఐటీలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఛార్లెస్ పరిచయమయ్యాడు. క్లాసులో ఇద్దరూ మొదటి రెండు ర్యాంకుల్లో ఉండేవారు. పోటీబడి ఒకరిని మించి ఒకరు మార్కులు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. మానవ సంబంధాలకు మొఖం వాసిపోయివున్న అనసూయ ఛార్లెస్ కుటుంబాన్ని చూసి మరీ దగ్గరయ్యింది. ఆ కుటుంబంలో డబ్బుకోసం కాక ఒకరి బాగోగులు కోసం మరొకరు చేసే త్యాగాలు అనసూయకు బాగా నచ్చాయి. ఛార్లెస్ స్నేహం అనసూయకు మరో నూతన ప్రపంచాన్ని చూపించింది. జీవితాంతం ఛార్లెస్ తో కలసి బ్రతకాలని నిర్ణయించుకుంది. అమ్మ నాన్నలకు తన ప్రేమ విషయం చెప్పింది. అందరి తల్లిదండ్రుల్లాగానే కాదు కూడదు అన్నారు. డిగ్రీ పూర్తికాగానే యుఎస్ వెళ్ళి ఎమ్మెస్ చేయాలన్నారు.

“ లేదు. నాకు మైక్రోసాప్ట్ లో మంచి ఆఫర్ వచ్చింది. సెప్టెంబర్ లో నేను జాయినవుతాను. ఛార్లెస్ కూడా జాయినవుతాడు. నెక్స్ట్ మార్చ్ లో పెళ్ళి చేసుకుంటాము. “ తన అభిప్రాయాన్ని చెప్పేసింది.

కలెక్టర్, ఎస్పీలిద్దరు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. “నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాము?”

“నేను కూడా మీ మీద ఎన్నో ప్రేమలు పెట్టుకున్నాను. మీరెప్పుడైనా నా గురించి ఒక్కటంటే ఒక్క గంట మీ సమయాన్ని ఉపయోగించారా? “

“ అనూ ! ఏమిటా మాటలు? నువ్వింకా చిన్న పిల్లవు కాదు కదా ? నీకు మా ఉద్యోగాలు ఎలాంటివో తెలీదా ? “

“ అవును ఈ దేశంలో మీరిద్దరే గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఏం చేస్తుంది? ఏం చదువుతుంది? తనకు అసలేం కావాలి? అని ఎప్పుడైనా తెలుసుకున్నారా?” అనేక సంవత్సరాలుగా తన మనస్సులో రగిలిపోతున్న ప్రశ్నలను సంధించింది. “ అవన్ని తెలుసుకున్నాం కాబట్టే, మంచి స్కూల్లో, మంచి కాలేజీల్లో చేర్పించాము. “ “ ఔనౌను. మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు. అంతే గానీ, అసలు నా మనస్సులో ఏముందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? “ కోపంతో రగిలిపోతూ అడిగింది.

“ నువ్వెప్పుడైనా నా కిది వద్దు, ఇది కావాలి. అని అడిగావా? నువ్వు అడిగింది మేమెప్పుడైనా కాదన్నామా? “ అంతే కోపంగా ప్రశ్నించింది.

“అసలు నేను చెప్పుకోటానికీ, మీరు వినటానికి నాకెప్పుడైనా టైమిచ్చారా? మీరు ఆయాకు చెప్పటం. ఆయా నాకు చెప్పటం. నేను ఆయాకు చెప్పిన మాటలు మీదాకా రావు. వచ్చినా పట్టించుకోరు. ఇంట్లో వాళ్ళు ప్రేమించక పోతే, ఆ ప్రేమ బయట దొరికితే, చిన్న పిల్లలైనా, నా లాంటి పెద్ద పిల్లైనా అల్లుకు పోరా ! అతుక్కు పోరా? “

“ ఏంటీ, కవిత్వం చెపుతున్నావా? “

“ నాకు అనిపించింది చెపుతున్నా. ఇది మీకు కవిత్వంలా అనిపించిందా? “ “ ఏ సినిమాలోది ?”

“ నేను సినిమాలు కూడా చూస్తానా ? ఇదేగా నేను అంటున్నది. అసలు నాకేది ఇష్టమో, నేనేమి చేస్తున్నానో మీకు పడితే కదా ?”

ఇంతలో అమ్మ ఫోను మోగింది. అమ్మ తన గదిలోకి వెళ్ళి పోయింది. ఈ సంభాషణంతా విన్నాడో లేదో నాన్న. మౌనంగా ఏదో ఆలోచిస్తూవుండి పోయాడే గానీ, ఒక్క మాటా మాట్లాడ లేదు. “ అనూ ! “ అంటూ దగ్గరకొచ్చి అను భుజంమీద చెయ్యి వేశాడు. ఇంతలో.. ఈయన గారి ఫోను రింగైంది. తను మరో రూంలో దూరాడు. ఇదే అనుకు ఊహ వచ్చిన దగ్గరనుంచి జరుగుతున్నది, చూస్తున్నది. మరో పది నిమిషల్లో ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళి పోయారు. అనసూయ ఏమాత్రం ఆశ్చర్య పోలేదు. తనకిది అలవాటేగా.

*** *** ***

డాక్టర్ చెప్పినట్టుగానే ఛార్లెస్ ను డిచార్జ్ చేశారు. ఇంటికి వచ్చారు. అనసూయ మరో మూడు నెలలు తన సెలవు పొడిగించింది. అత్తగారు కోడలికి ఒక కన్న తల్లిలా చెప్పింది. “ "చూడమ్మా ! మా ఛార్లెస్ సంగతి మాకందరికీ బాగా అర్థమైంది. ప్రభువు వాడియందు లేడు. మేమందరం రక్త సంబంధీకులము. ఎవరిమో ఒకరము నిరంతరం వాడి బాగోగులు చూచుకుంటాము. నువ్వు చిన్న పిల్లవు. ఛార్లెస్ చెప్పినట్టు చెయ్. ఆ ప్రభువు నిన్ను చల్లగా చూడాలి “, అంటూ అనునయించే ప్రయత్నం చేసింది.

“ అదేంటత్తయ్య మీరు కూడా అలా అంటారు? నా జీవితమంతా ఛార్లెస్సే. మీ కుటుంబంలో నా కెంతో ప్రేమ దొరికింది. ఈ మూడు సంవత్సరాలలో నాకేమైనా పని చెప్పారా మీరు ? ఏదో ఉద్యోగం చేస్తున్నానని, నా పనులూ మీరే చేసి పెట్టారు. ఇకనైనా నా పనులు ఛార్లెస్ పనులు నన్ను చేసుకోనివ్వండి” , తన నిశ్చితాభిప్రాయం చెప్పింది అనసూయ.

“ చూడు అను. ఛార్లెస్ గానీ, నేను గాని ఎందుకు చెపుతున్నామో అర్థం చేసుకో. నీ మంచి....” ఇంకా ఏదో చెప్పబోతుండగ, “ చూడండి అత్తయ్య . ఇక మీరు ఏమీ చెప్పవద్దు. ఛార్లెస్ మీకెంతో నాకూ అంతే. నా కన్న బిడ్డలా సాకుకుంటా. ఈ జన్మకిది చాలు. దయచేసి ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడకండి. “ ఈ సంభాషణ తరువాత ఆ కుటుంబంలో ఎవరూ అనుసూయను అనునయించే ప్రయత్నం చేయలేదు. ఛార్లెస్ ఒకటి రెండు సార్లు చెప్పబోయే ప్రయత్నం చేసినా, కాస్తా కటువుగానే తిరస్కరించి హెచ్చరించింది. అంతటితో ఆ కథ ముగిసింది. మూడు నెలల్లో ఛార్లెస్ కొంత కోలుకున్నాడు. అంటే భార్యా సహాయంతో బాత్ రూంకు వెళ్ళడం, మొఖం కడుక్కోవటం, వాలు కుర్చీలో కూర్చోని తినటం, టీవీ చూడటం.

సెలవులు అయిపోగానే ఉద్యోగంలో చేరింది. అది కూడా ఛార్లెస్ బలవంతం చేస్తే. కుటుంబంలో అందరూ ఉద్యోగస్తులే. ఆర్థిక సమస్యలేమీ లేవు. కానీ తామిద్దరూ కూర్చుని తినటం బాగుండదని, అన్నదమ్ములు, వదిన మరదళ్ళు ఎంత చెప్పినా వినకుండా అనుసూయను ఉద్యోగానికి పంపించాడు. ఇక పగలంతా బోరు కొట్టకుండావుండటానికి తనెప్పుడో వదిలేసిన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు. తానా వారికి ఒక కథానికను పోటీకి పంపించాడు ‘అనుశ్రీ’ అనే కలం పేరుతో. ఆ కథకు ప్రథమ బహుమతి వచ్చింది, పాతిక వేలు డబ్బూ వచ్చింది. ఆ ఉత్సాహంతో అనేక పత్రికలకు కథలు పంపించాడు. ఆరు నెలల్లో ఇరవై కథలు రాశాడు. ఐదింటికి ప్రథమ బహుమతులు, మరో నాలుగు కథలకు ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, అమెరికా వరకు అనుశ్రీ పేరు మారుమ్రోగింది. వర్థమాన కథా రచయితగా విమర్శకులు ఆయన శైలిని , కథాకథనాన్ని మెచ్చుకుంటూ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. బహుమతులు అందుకోటానికి ప్రత్యక్షంగా తను వెళ్ళక పోవటం కూడా అతనికి మంచిదే అయింది. అనేక మంది విమర్శకులు ‘ అనుశ్రీ బహుమతులకోసం, పేరు కోసం తన కలాన్ని తాకట్టు పెట్టడ’ని పొగిడారు. కరోనా మహమ్మారి ఫలితంగా ఛిద్రమైన వలస బ్రతుకుల మీద రాసిన మొదటి నవల ‘చతుర ‘ మాస పత్రికలో ప్రచురించబడింది. అదో సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలోని అనేక సాహితీ సంస్థలు ఆ నవలకు బహుమతులు ప్రకటించాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారు నవలా విభాగంలో ఉత్తమ రచనగా గుర్తించి, అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు తీసుకోటానికి హైదరాబాద్ రావలసిందిగా ఆహ్వానం అందింది. ఛార్లెస్ ఆరోగ్య పరిస్థితి గురించి యూనిర్సీటీ వారికి అనసూయ వివరించింది. ఇది మరో సంచలనమైంది. ‘మడత కుర్చీకే పరిమితమైన మహా రచయిత అనుశ్రీ స్టీఫెన్ విలియం హాకింగ్’ అంటూ పత్రికలు, టీవీలు కథనాల్ని ప్రచురించాయి, ప్రసారం చేశాయి. కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశాయి.

సమకాలీన సామాజిక సమస్యలపై తన పరిశీలన, పరిష్కారాలు సూచిస్తూ చేసిన రచనలు పాఠకుల్ని చైతన్య పరిచాయి. కథైనా, నవలైనా, వ్యాసమైనా , కవితైనా, పాటైనా అనుశ్రీ కలం నుండి అక్షరాలు చైతన్యమై ఆబాలగోపాలాన్ని మేల్కొలుపుతాయి. రెండు నవలల సినిమాలుగా వచ్చాయి. అందులో ఒక సినిమా కథకు ఉత్తమ సినీరచనా పురస్కారం లభించింది.

అనుశ్రీ రచయిత ప్రతి విజయం వెనక అనసూయ పాత్రవుందని తెలుగు సమాజం మొత్తానికి తెలిసిపోయింది. అనసూయ , ఛార్లెస్ జీవితమే ఒక కథగా సినిమా తీయటానికి ఎంతో మంది నిర్మాతలు ముందుకు వచ్చారు. అనసూయ ఆత్మ కథ ఆధునిక సమాజానికి ఒక దిక్సూచి అయింది. ***XXX***


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

236 views0 comments

Comments


bottom of page