top of page

అందం

Writer: Sudarsana Rao PochampalliSudarsana Rao Pochampalli

'Andam' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'అందం' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


మంజరి అందానికి మారుపేరుగా నిలుస్తుంది- ముప్పది ఒక్క మంది అప్సరసలే కాదు, ప్రకృతి నంతా ఒడబోసినా అంత అందము గల యువతి ఎక్కడా లేక పోవచ్చు.


1. రంభ

2. ఊర్వశి

3. మేనక

4. తిలోత్తమ

5. ఘృతాచి

6. సహజన్య

7. నిమ్లోచ

8. వామన

9. మండోదరి

10. సుభగ

11. విశ్వాచి

12. విపులానన

13. భద్రాంగి

14. చిత్రసేన

15. ప్రమ్లోచ

16. మనోహరి

17. మనోమోహిని

18. రామ

19. చిత్రమధ్య

20. శుభానన

21. కేశి (సుకేశి)

22. నీలకుంతల

23. మన్మధోద్దపిని

24. అలంబుష

25. మిశ్రకేశి

26. పుంజికస్థల

27. క్రతుస్థల

28. వలాంగి

29. పరావతి

30. మహారూప

31. శశిరేఖ


ఆమె వివాహము జరుగాలంటె ఆమెకు సరిదూగు అందమైన యువకుడు దొరికితేనే పెళ్ళి చేసుకుంటానని పట్టు బడుతుంది మంజరి.


తండ్రి విశ్వజిత్తు ఎందరో యువకుల చూసినా మెచ్చనంటది మంజరి. తల్లి గంధవతి ఎంత బ్రతిమిలాడినా ఎవ్వరినీ మెచ్చక పోయే సరికి తల్లి దండ్రులు ఇంకా ఆలస్య మైతె ఈడు మీద పడుతున్న కొద్ది జోడు దొరకడము దుర్లభమే కాక మంజరి అందము గూడ కళావిహీనమైతదనుకొంటారు-- అందము అంటె ప్రకృతి అంతా అందమే - ఆకాశము, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు..


పసిపిల్లల నగుమోము- పల్లెటూరి పాటలు, ఆటలు, కేరింతలు ఇలా చెప్పబోతె కోమలి కోపము కూడా అందమే నంటారు- అందానికి హద్దులు లేవు.

అవి గాక ఒక కవి చెప్పినట్టుగా - పుష్పేషు జాతి- పురుషేషు విష్ణు- నారీచ రంభ- నగరేషు కంచి.


అందానికి మారు పేరు ఇందీవర లోచనలే. ఒక ప్రేమికుడు తలుస్తాడు అందగత్తె అందము ఊహించుకుంటు.


నెచ్చెలి ముచ్చటిస్తే అందం

కోమలికి కోపగిస్తే అందం

నళిన లోచన నవ్వితే అందం

ముదిత మూతి ముడిస్తే అందం


పడతి పలకరిస్తే అందం

చక్కెరబొమ్మ చిక్కితే అందం

పల్లవాధర పాట పాడితే అందం

చామ చిరంటి చదివితే అందం


ముష్టి మధ్య ముంగురులు లేస్తే అందం

జవ్వని కవ్వించితే అందం

నాతి నాట్యము చేస్తే అందం

చారు లోచన చూస్తే అందం


ననబోడి నడిస్తే అందం

ఇందీవరనేత్ర పందెమేస్తే అందం

పువ్వారుబోడి పరుగెడితే అందం

చెలి చెక్కిలిపై చెయ్యేస్తే అందం


వరవర్ణిని వీణ వాయించితే అందం

కర్పూరగంధి ప్రతి కదలికా అందమే

అందానికి మారుపేరే అంచయాన


ఆ ముద్దుల గుమ్మ వద్ద నుంటే పొద్దుగృంకులన గనబోరు పురుష పుంగవులు నిమిషమైన-


అలాగే ఇంకొక ప్రేమికుడు ఏమనుకున్నాడు అంటె


మూడు వంకల ముద్దుగుమ్మ

చూడ చక్కని చక్కెర బొమ్మ

లతాయాతక లావణ్య కొమ్మ

పదుగురు మెచ్చెడి పుత్తడి బొమ్మ

కప్పురగంధిగ ఒప్పెడు కొమ్మ

రేపటి బిడ్డగు కాగల అమ్మ

దివి భువి జీవుల దెసయగు అమ్మ


అలాగే ఇంకొక గ్రంథసాంగుడు ఏమనుకున్నాడు అంటె


ఒప్పుల కుప్ప

నేను కంటి నొక చామ చిరంటిని

ఆమె చుబ్రము ఛాయాంకు బింబము

చర్మజములు కలాపములు

విశ్వంకరములు వైసారిణములు

అభివీక్షణములు రస తూపులు

పలువలువలు బింబ ఫలములు

ద్విజన్మలు మృగేష్టములు

ఆభాషణములు రసరమ్య గీతాలు

పైంజుషములు పాథోజములు

గండములు లతా మణులు

సంఘాటిక స్థిరగంధము

శిరోధరము షోడశావర్తము

ప్రగండములు మందార మాలలు

చర్పటములు సౌమ్యగంధములు

చను గవలు జక్కవలు

అంతరాళము సంగ్రహ ప్రమాణము

ఊరువులు రంభా స్థంభములు

అంఘ్రి ద్వయము లతాయాతకములు

అందంద శృంగార రమణీ లలామ

అవతరించె మది పులకరించె

మదాస్వనితము ప్రయోషించె


దీని అర్థమేమిటంటే.


పలు వలువలు=పెదవులు--బింబ ఫలములు=దొండ పండ్లు

విశ్వంకరములు=కళ్ళు--వైసారిణములు=చేపలు

సంఘాటిక=ముక్కు-- స్థిర గంధము=సంపెంగ

ద్విజన్మలు=పళ్ళు--మృగేష్టములు=మల్లెలు

చర్మజములు=వెండ్రుకలు--కలాపము=నెమిలి పింఛము

అంతరాళము=నడుము --సంగ్రహ ప్రమాణము=పిడికెడంత

గండములు=చెక్కిళ్ళు--లతామణులు=పగడాలు

శిరోధరం=మెడ--శోడశావర్తము=శంఖు

పైంజుషములు=చెవులు--పాథోజములు=శంఖములు

చుబ్రము=ముఖము--ఛాయాంకు బింబము=చంద్ర బింబము

ప్రగండములు=భుజములు--మందార మాలలు=మందార పూదండలు

అభివీక్షణములు=చూపులు--రస తూపులు=శృంగార బాణాలు

చర్పటములు=అరచేతులు--సౌమ్యగంధములు =గులాబీలు

చను గవలు=వక్షోజములు--జక్కవలు=చక్రవాక పిట్టలు

అంఘ్రిద్వయము=పాదాలు--లతాయాతకములు=చిగురుటాకులు

ఆభాషణములు=పలుకులు-=రసరమ్య గీతాలు= శృంగార గానాలు.

అందంద శృంగార రమణీ లలామ= మిక్కిలి అందమైన పడతి

అవతరించె=ఉద్భవించె--మది పులకరించె =మనసు ఉప్పొంగె

మదాస్వనితము=నా మనసు--ప్రయోషించె=దోచుకొనె.


పురుషులు యువతుల ఈ తీరుగా ఊహించుకుంటె-మగువలు మేమేమి తక్కువ కామని పురుషుల అందాన్ని ఊహించుకుంటారు- రాముణి అందాన్ని పోల్చినట్టుగా.


నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్

విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ

జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం

జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్


జగన్మోహన మైన నలకూబరుడు రంభకు ప్రియుడు- అత్యంత అందగాడు- ఆయనతో పోల్చుకుని అంతటి అందమైన పురుష పుంగవుడు కావాలంటది మంజరి.


తల్లి దండ్రులు మంజరి కోరిక తీర్చలేము అనుకుంటున్న తరుణములో వాచస్పతి అనే అబ్బాయి వారాలు చేసుకుంటు చదువుకునే క్రమంలో వీళ్ళింటి కొస్తాడు.


అతడు చాలా అందగాడు గుణవంతుడు కాని కడు బీద. మంజరికి అతడు నచ్చుతాడు - బీదవాండ్లలో కూడా ఇంత అందముగా ఉండే వాళ్ళు ఉంటారా అనుకుంటుంది మనసులో.


అతనికి అందరు వంద రూపాయలు ఇస్తే తాను వేయి రూపాయలు ఇస్తుంది మంజరి. మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడుగుతుంది వాచస్పతిని- మళ్ళీ వచ్చే ఆదివారము అంటూ వెళ్ళి పోతాడు వాచస్పతి-


“బీదవాళ్ళలో కూడ ఇంత అందగాళ్ళు ఉంటారా అమ్మా! పైగా అతని పేరు వాచస్పతట- ఇదేమిటమ్మా విచిత్రంగా ఉన్నది?” అంటుంది మంజరి-


తల్లి గంధవతి అంటుంది “అందము ఒకరి సొత్తు కాదు. పేరు పెట్టుకొనడములో కూడా ఎవరి స్వేఛ్చ వారిది- మనము తప్పు బట్టినాము అంటే అది మన అహంకారము. ఎంత అందముగ ఉన్నా ఎంత శ్రీమంతుల మైనా అహంకారమనేది ఒక మచ్చ- రూపుకంటె, ఆస్తి కంటె గుణము ప్రధానము” అంటుంది తల్లి.


వాచస్పతి వస్తానన్న వారము రోజుల లోపలే మంజరికి పూలు తెంప బోతుంటె ముఖమంతా కందిరీగలు కరుస్తాయి. దానితో మంజరి అందవిహీనంగా ఔతుంది. తనకు తానే అద్దములో చూసుకోలేనంత వికారము ఏర్పడుతది.


చక్కగా వారము రోజులకు వాచస్పతి వీళ్ళింటికొస్తాడు. మంజరి వాచస్పతికి ముఖము చూపలేక పోతుంది.

గంధవతి వాచస్పతికి డబ్బులు ఈయ బోతుంటే మీ అమ్మాయి లేదా అని అడుగుతాడు వాచస్పతి.

గంధవతి మంజరిని కందురీగలు కుట్టిన విషయము- మంజరి ప్రకృతి దాచుకోకుండా వాచస్పతికి చెబుతుంది.


అంతా విన్న వాచస్పతి “అందము తోడు మీ అమ్మాయి గుణము గూడ గొప్పదని నేననుకుంటాను- ఆమె అంగీకరిస్తె - మీరు ఒప్పుకుంటే నేను పెళ్ళి చేసుకుంటాను. నా చదువు కూడా అయిపోవచ్చింది” అంటాడు వాచస్పతి.


లోపలి నుండి ఇది వింటున్న విశ్వజిత్, మంజరి లకు వాచస్పతి మాటలు ఆశాజనకంగా తోస్తది. విశ్వజిత్ మంజరిని అడుగుతాడు “ఆ అబ్బాయి నీకు ఇష్టమేనా” అని-


మంజరి మౌనంగా ఉండి పోతది- మౌనము అంగీకార సూచకము అని తలచి బయటకొచ్చి వాచస్పతిని కూర్చోబెట్టి అడుగుతాడు “నిజంగా నీవు అన్న మాట మీద నిలబడుతావా?” అంటాడు-


దానికి “నోటినుండి ఒక మాట పలికాము అంటే దానికి కట్టుబడి ఉండడమే నేను నేర్చుకున్న నీతండి” అని జవాబు ఇస్తాడు వాచస్పతి.


ఇన్నాళ్ళకు కూతురుకు తగిన వరుడు దొరికిండని మనసులో సంతోషిస్తాడు విశ్వజిత్. గంధవతి ఈ పూట మా యింట్లనే భోంచేసి పొమ్మంటుంది వాచస్పతిని.


మంజరి గర్వము అణగడానికి కందురీగలే కారణ మైతాయి.

త్వరలో మంజరికి వాచస్పతికి వివాహము చేసి వాచస్పతిని తమ ఇంట్లోనే ఉంచుకుంటారు అల్లుని హోదాలో.


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


 
 
 

Comments


bottom of page