top of page

అంతస్సూత్రం


'Anthassuthram' New Telugu Story

Written By Pandranki Subramani

'అంతస్సూత్రం' తెలుగు కథ

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


కొందరు భారీగా కనిపిస్తారు. ఎంత భారీగా అంటే, ఏనుగుంత బరువుతో మందగమనంతో నడుస్తారు. ఆవేశం గాని వస్తే చుట్టు ప్రక్కల వారందరూ గుండెలదుముకునేలా సింహగర్జన చేస్తారు, దిక్కులి పిక్కిటిల్లేలా--కాని ఆశ్చర్యం-వాళ్ళ హృదయాంతరాళంలో సుగంధమంతటి మృదు మనోభావం చల్లని సెలయేరులా ప్రవహిస్తూ ఉంటుంది. అది అందరికీ తెలవదు. హృదయ స్పందన తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది.


అంబటివలస నరసియ్య ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు. ఆయన రచ్చబండ వద్దకు నడచి వస్తుంటే దారి మధ్య నుండి ఊరి జనం రహదారి తొలగి ప్రక్కలకు తప్పుకుంటారు. రచ్చబండకు ఆనుకుని ఉన్న తుమ్మచెట్టు పైనుండి కాకులు కావ్ కావ్ మని అరుస్తూ ప్రక్క మ్రానులపైకి యెగిరి పోతుంటాయి. ఆయన శారీరమూ రూపమూ అటువంటిది మరి. ఆరోజు రచ్చబండకు వచ్చిన తగాదా ఇది—


రామిశెట్టి వద్ద రెండు చేతులా అప్పుచేసి చెప్పాచెయ్యకుండా యెగ్గొట్టి బొబ్బిలికి ఉడాయించిన రామాంజనేయులు పెద్ద కొడుకు వామనయ్య వ్యవహారం ఊరి పెద్దల ముందుకు వచ్చింది.. చేతులు కట్టుకుని నిల్చున్న రామాంజనేయులు ప్రక్కన తలవంచుకుని నిల్చున్న వామనయ్యను నరసియ్య అడిగిన మొదటి ప్రశ్న- “అదెప్పుడో అప్పులు అమాంతం యెగ్గొట్టి పారిపోయిన వాడివి ఇప్పడెండుకురా ఊరొచ్చావు?”


దానికి వామనయ్య తలవంచుకునే బదులిచ్చాడు-“అమ్మా చెల్లీ ఇంటికొచ్చేయమని గగ్గోలు పెడ్తుంటేనూ—“


“అంటే-మొత్తానికి నువ్వు నా వద్ద తీసుకున్న సొమ్ము తిరిగివ్వాలన్న చింతనతో ఊరు చేరలేదన్నమాట- ఆడోళ్ళ గోడు వినలేక తిరిగొచ్చావన్న మాట“ జనం మధ్యన నిల్చున్న రామిశెట్టి యెలుగెత్తి అరిచాడు.


అప్పుడు మందలింపుగా రామిశెట్టిని వెనక్కి తగ్గమని హెచ్చరించేలా చేతులతో సైగ చేస్తూ నరసియ్య రెట్టింపు కంఠస్వరంతో అడిగాడు “బదులియ్యవేం? అప్పుతీసుకుని చెప్పాచెయ్యకుండా పొరుగూరులో తలదాచుకోవడం నేరమని తెలియదట్రా! ఆరో తరగతో యేడో తరగతో చదువుకున్నవాడివి కదా--‘అప్పులేనివాడే అధిక సంపన్నుడు‘ అన్న వేమన మాట చెవిన పడలేదట్రా!”


ఈసారి వామనయ్య తలెత్తి చూసాడు-“ఎంతమాటండి బాబూ! వేమనయ్య చెప్పిన మాటలు చెవిన బాగానే పడ్డాయండి బాబూ! కాసులు చేతిలో లేకపోతేనూ-- ఎక్కడ రామిశెట్టిగారు పేట రౌడీలను ఉసిగొల్పి వీపు చీల్చేస్తాడోనని భయపడి పారిపోయానండి. పైడమ్మ తల్లిపైన ఒట్టు పెట్టి చెప్తున్నానండి- అప్పు యెగ్గొట్టాలని నేనెప్పుడూ తలపోయ లేదండి”.


ఆ మాట విని నరసియ్య కాసేపాగి అడిగాడు-“ఇప్పుడు దీనికి సూటిగా బదులియ్యి. అసలు అప్పెందుకు తీసుకున్నావురా?ఎడా పెడా తిప్పసారయం తాగి తందనాలాడటానికా!”

“అవ్వ! అవ్వ! ఎంతమాట! తాకట్టు పెట్టుకోవాడానికి ఇంట్లో నగానట్రా లేకపోయేసరికి టీ - దుకాణం పెట్టుకోవడానికి అప్పు తీసుకు న్నానండి బాబుగారూ!”


కాసేపాగి మళ్ళీ అడిగాడు నరసియ్య-“ కొట్టులో టీ అమ్ముకుంటూ ఊళ్ళోనే పడుండ వచ్చు కదరా!”

“వాస్తవం. అలాగే టీ అమ్ముకుంటూ పొట్ట నింపుకోవా లనుకున్నానండీ! కాని టీకొట్టు నుండి జనం టీ-తాగడం తగ్గించేసారండీ!”


అది విని నరసియ్య నమ్మశక్యం కానట్టు కళ్లు పెద్దవి చేసుకుని చూసాడు. “ఔను బాబుగారూ! నా టీకొట్టుకి దగ్గరగా సారాయి కొట్టు లేచింది. పూర్తి కలపడం చేసిన సరుకుని కాలవ ధారలా అమ్మేస్తుంటే జనం యెగబడి తాగనారంభించారండి. అప్పుడు గిట్టుబడి కాక కొట్టు మూసేసానండి”.


ఆమాట విని చిన్నగ నిట్టూర్చుతూ అడిగాడు నరసియ్య- “అది సరేగాని—ముందు దీనికి బదులియ్యి. అప్పు అంత త్వరగా కట్టలేనని మన ఊరి పెద్దమనిషి రామిశెట్టిగారి వద్ద గడువడిగావా?”


“ఇంకెక్కడ గడువడిగేది బాబయ్యా? నాచుట్టూ మాఇంటి చుట్టూ పేట రౌడీలు దుడ్డుకర్రలు పట్టుకుని తిరుగుతుంటేను- ఇస్తావా చస్తావా అని. అంచేత పెళ్ళాం బిడ్డలతో పొరుగూరుకెళ్ళి తలదాచుకున్నాను. నేనిప్పుడు ఊరువచ్చేసాగా! ఇప్పుడు మీరేమి శిక్ష వేసినా శిరస్సు వంచి అందుకుంటాను“.


వామనయ్య బదులు విని నరసియ్య కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి ఈ విధంగా ప్రక టించాడు- “నీకిప్పుడు శిక్ష విధిస్తున్నాను వామనయ్యా! నీకే కాదు-నీ పెళ్ళానికి కూడాను. నువ్వు పిలిస్తే నీ వెంట పారొచ్చిందే గాని నిన్నాపడానికి ప్రయత్నించనందు వల్ల— ఈ రోజునుంచి నువ్వూ నీ పెళ్ళామూ కలసి వారం రోజులపాటు గుడి పరిసరాలను శుభ్రం చేస్తారు. పిచ్చి మొక్కలన్నీ పీకి గుడి చుట్టూ పూల మొక్కలు తులసి మొక్కలు నాటుతారు. అంతటితో చాలదు. వారం రోజుల తరవాత కూడా ప్రతి రోజు ఉదయమూ పంటకాలవ నుండి నీళ్లు తోడుకు వచ్చి మొక్కలు ఒరిగిపోకుండా పూలు వాడిపోకుండా తడుపుతారు. ఇందులో మీ బాబు రామాంజనేయులు గాని మీ యింటి పిల్లలు గాని పాలు పంచుకోరు”అని రచ్చబండనుండి లేచాడు.


అప్పుడు రామిశెట్టి సమీపించాడు పరుగువంటి నడకతో-“మరి నా అప్పు సంగతి?”

“నీకు వడ్డీతో సహా అందుతుంది. కంగారు పడకు” అంటూ తనతో రమ్మనమని వామనయ్యకు సైగచేసి ముందుకు కదిలాడు నరసియ్య. రామిశెట్టి కూడా వాళ్లిద్దర్నీ అనుసరించాడు.

-------------------------------------------------------------------------------

కాలం ఇలా కోల్డ్ వార్ వాతావరణంలా యెగుడు దిగుడుగా సాగుతూన్న సమయాన నరసియ్య దంపతుల ఇంటివాకిట పెట్రోల్ పేలుడు పదార్థం పేలినట్టు ఎస్ టీ డీ రూపంలో ఒక వార్త వచ్చి తాకింది. భాగ్యనగరం చిక్కడపల్లి నుండి పెద్ద కోడలు పిల్ల గగ్గోలు పడిపోతూ కొంప కొల్లేరయి పోయిందంటూ ఇంటికి తక్షణం రావాలని కబురు పంపింది. నరసియ్య దంపతులిద్దరూ ఎలర్ట్ అయారు.


వేదవతి గురించి వాళ్ళకు తెలుసు. చిన్నచిన్నవాటికి యెండుటాకులా అల్లల్లాడిపోయే మనస్తత్వం కాదామెది. ఆకాశమంత ఆపదను అలా పుక్కిట బట్లగల స్త్రీత్వం అంటారే- అటు వంటి గుండె నిబ్బరం గల ఆడదన్నమాట. మరి అటువంటి కోడలు ఈనాడిలా బెంబేలు పడిపోతూ రమ్మంటుందంటే-- ఏదో జరగకూడనిది జరిగిందన్న మాటేగా--


ఇక యే మాత్రమూ జాప్యానికీ తావివ్వ కుండా కొడుకులిద్దరినీ పిలిచి ఇల్లూ వాకిలీ కోతకు సిద్ధంగా ఉన్న వరి మడిని కూడా చూసుకొమ్మని చెప్పి బయల్దేరారిద్దరూ—

----------------------------------------------------------------------------

అత్తామామలిద్దరూ ఇంట్లోకి వచ్చీ రావడంతోనే వేదవతి ప్రక్కన బుంగమూతి పెట్టుకుని నిల్చున్న కొడుకులిద్దర్నీ అక్కున చేర్చుకుని రోదన లంకించుకుంది. ”మా అమ్మ అప్పుడే చెప్పింది—మరీ మరీ చెప్పింది నాయనోయ్!”


ఏమి చెప్పింద న్నట్టు ప్రశ్నార్థకంగా కనుబొమలెగరేసి చూసాడు నరసియ్య.

“ఇంకేమి చెప్పేది నాయనోయ్! మీ వంశం జల్సారాయుళ్ళ వంశ మని, రాముడి బాణంలా ఒక్కదానితో సంసారం చేసే రకం కాదని- ఒకరికి మరొకరు ఉంటేగాని తృప్తి చెందరని. అందుకే మీ ఇంటి ఆవరణంతా కృష్ణుడి పటాలే గాని శ్రీరాముడి పటాలేవీ ఉండవంది. మతి మాలిన దానిని ఆ తల్లి మాట వింటేనే కదా! రాగిమీసాల మొగుడు కదానని పెళ్ళి పందిరలో తల చాచి ఇప్పుడిలా గొంతువరకూ తెచ్చుకున్నాను”.


అప్పుడు రమణమ్మ వెళ్ళి ఇద్దరు మనవళ్ళనీ కోడలి చేతుల్లోనుండి విడదీసి తన ఒడిలోకి తీసుకుంది. నరసియ్య నిగ్రహం కోల్పోకుండా నిదానంగా స్టూలు తెచ్చు కుని కోడలిపిల్లకు యెదురుగా కూర్చున్నాడు. “చూడమ్మా వేదవతీ!అసలు విషయం తెలుసుకోకుండా నిజానిజాలు తేల్చుకో కుండా మాట్లాడటం పొరపాటు. అప్పట్లో మా తాతలూ ముత్తాతలూ అలా చేసుంటారు. ఎందుకలా జరిగిందో తెలుసుకునే అవకా శం ఓపికా ఇప్పడు లేదు. ఇకపోతే మా బాబు విషయానికి వస్తే-అలా జరగలేదు.


మా పెద్దమ్మకు పిల్లలు కలగక మా అమ్మను చేసుకున్నాడు వంశాంకురం కోసం. ఇక విషయానికి వస్తే ఇప్పుడా విధంగా మా కుటుంబంలో జరిగిందన్న ప్రూఫ్ ఉందా?”


అప్పుడు రమణమ్మ కలుగచేసుకుంది. “మీరిప్పుడు కొంచెం ఆగుతారా! మీ గురించి కోడలి పిల్లకేం తెలుసు నాకు తెలవాలి గాని. ఇక అసలు పాయింటుకి రండి. చెట్టంత పెద్ద కొడుకుని యెవతో యెక్కణ్ణించో వచ్చి యెగరేసుకు పోయినట్లుంది. ముందా సంగతి తెలుసుకుని రండి”


ఆ మాటకు అతను ముఖం చిట్లించాడు-“సమయం చూసి సెల్ఫ్ గోల్ వేయడంలో మీ ఆడవాళ్లు సిధ్ధహస్తులని నాకు తెలవదూ!” అంటూ వేదవతి వేపు తిరిగాడు.

“జరిగిందంతా యేదీ దాచకుండా లాయర్ కి చెప్పినట్టు వివరించు. అప్పుడు వాడు మనదారికి రాకపోతే ఒళ్ళు హూనం చేస్తాను. ఇది నిశ్చయం!”


అప్పుడు కళ్లు తుడుచుకుంటూ తేరిపార చూస్తూ బామ్మ ఒడిలో కూర్చున్న కొడుకుల ముఖాలలోకి దిగాలుగా ముఖం పెట్టి వేదవతి చెప్పిన సారాంశం ఇంది—ప్రశాంత్ కుమార్ సహోద్యోగి సింగార స్వామి వాటర్ ట్యాంక్ పైకెక్కి ఇరుక్కున్న పైపు లైన్ ని సరిచేస్తుండగా కాలు జారి క్రింద పడ్డాడు. కాలు విరిగింది. తలకు గాయమైంది. అది చూసిన ప్రశాంత్ అతణ్ణి ఆటోరిక్షాలో యెక్కించుకుని ఆస్పత్రిలో చేర్పించాడు. సీరియస్ స్థితిలో ఉన్న సింగార స్వామిని ఐ సీ యూ లో ఉంచారు. అప్పుడక్కడ స్పెషల్ వార్డ్ నర్స్ ప్రశాంత్ కి పరిచ యమయింది. సింగార స్వామికి సమయానికి తగిన గ్రూపు రక్తం యెక్కించడంలో సహాయం చేసి ప్రాణాలు కాపాడి ప్రశాంత్ మన్ననలు పొందింది. అప్పట్నించి అతడి వాలకం పూర్తిగా మారింది. క్యాంపుకి వెళ్ళాలంటూ మాటి మాటికీ మాయమవు తున్నాడు. ఇదంతా తనకు తానుగా లేడీ డిటెక్టివ్ గా మారి వేదవతి తెలుసుకుంది. భర్త నుండి సరాసరి-పిల్లలపైన ఒట్టు పెట్టించి చెప్పాలంటూ అడిగి రూఢి చేసుకుంది.


అప్పుడంతా విన్న నరసియ్య క్వరీ లేవదీసాడు. “సినియర్ గ్రేడ్ నర్సమ్మ అంటున్నావు. హైద్రాబాదు స్త్రీయేనా! లేక మలయాళ క్రైస్తవ స్త్రీయా?”


దానికి బదులివ్వడానికి ఇబ్బంది పడ్తూన్న కోడలి పిల్ల అవస్థ గమనించి రమణమ్మ కస్సుమని లేచింది. “ఇప్పుడదా ముఖ్యం? ఇంకొకెతకు స్వంతమైన మగణ్ణి లాక్కుపోయిన దాని మతాలతో జాతులతో మనకేమి పనంట? తిన్నగా వెళ్ళి ప్రశాంత్ కార్యాలయానికి వెళ్ళి నాలుగు చాచి గుంజీలు తీయించి దారికి తీసుకురండి. అదీ ఇదీ కాదంటే ఉద్యోగం మానుకుని తిన్నగా ఊరుకి వచ్చి పొలం పనులూ తోటపనులూ చూసుకోమనండి”


“మంచి ఆలోచనే! ఇప్పటికి ఆ విషయం ప్రక్కనుంచు. ఎంత యెర్రగా బుర్రగా ఉంటే మాత్రం ఉల్లి మల్లి అవుతుందా! ఎంతటి సీనియర్ నర్సయితే మాత్రం కట్టుకున్నదానికి సమానమవుతుందా?

అదెప్పుడో నీకొడుకంతటి వాడొకడు-చదువుకోక ముందు బాగానే అనేవాడట- కాకరకాయని. చదువుకున్న తరవాత కీకరకాయనడం ఆరంభించాడట. వీళ్ళకు దైవభక్తీ లేదు. మనస్సాక్షీ లేదు”


వేదవతి వెంటనే అందిపుచ్చుకుంది. “అదే మాఁవగారూ గుండె కోతగా ఉంది! మునుపల్లా ఉఁ అంటే తిరుపతి వెళ్దామనేవాడు. ఆఁ అంటే ఆముదాలవలస సత్య న్నారాయణ దివ్యక్షేత్రానికి బయల్దేర మనేవాడు. ఇప్పుడేమో అంతా అక్కడే! రేపు సంసారం కూడా అక్కడే పెట్టేటట్లున్నాడు మీ బంగారు కొడుకు“


“సరే—నువ్వు మరీ బాధపడికోమ్మా! నువ్వుగాని మంచాన పడితే పిల్లకాయల గతేమవుతుందో ఆలోచించుకో. నీకు అన్యాయం జరుగుతుంటే మేమందరమూ చూస్తూ ఊరుకుంటామా? పోలీసు స్టేషన్ లేదూ! ఫ్యామిలీ కోర్టులు లేవూ! మా ఊరి రచ్చబండ లేదూ! వాణ్ణీ ఆవిణ్ణీ మూడు చెరువుల నీళ్ళు తాగించనూ!”


మాఁవగారి నోట ఆ మాట విన్నంతనే వేదవతి ఉలిక్కిపడ్డట్లయింది. ”మీరు మరీ ఆవేశపడిపోకండి మాఁవగారూ! ఇటువంటి విషయాలలో పామూ చావ కూడదు- కర్రా విరక్కూడదు అన్న చందాన ముందుకు సాగాలి మాఁవగారూ! ఇప్పటి చట్టాల ప్రకారం ముఖ్యంగా హైందవ వివాహ చట్టం ప్రకారం ఇటువంటివి జరిగినట్టు నిరూపణమయితే ఉద్యోగం ఊడినా ఊడుతుందండీ! మరి పిల్లల గతీ నా గతీ యేమవుతుంది? ముల్లు పైన పడ్డ చీరను చినక్కుండా ఒడిసి పట్టుకోవాలి కదా!”


అప్పుడు నరసియ్య బదులిచ్చాడు-“అలాగే! అలాగే! మరిప్పుడు వాడు కార్యాలయంలో నే కదూ ఉన్నాడు?”

టూరుపైన వెళ్ళాడని బదులిచ్చింది వేదవతి.

“అలాగా! ఈ నెల వాడికిది మొదటి క్యాంపు కదూ!”

“కాదు మాఁవగారూ! ఇది మూడవది“


“ఏమిటేమిటీ! ఒక నెలలో మూడు సార్లా క్యాంపు కెళ్ళేది? దొరికాడు దోసకాయల దొంగ! ఇప్పుడు తప్పకుండా వాడు దానితోనే కులుకుతుంటాడని ఘంటాపథంగా చెప్పగలను. ఏదీ—ఆవిడ ఇంటి విలాసం ఇలా ఇవ్వమ్మా! ఈ రోజు వాడి అంతూ వాడి ఉంపుడు గత్తె అంతూ చూస్తాను. వాడి ఉద్యోగం ఊడిపోతుందని మరీ భయపడిపోతున్నావు గాని— వాడెంత, వాడి సంపాదన యెంతని— మేమంతా నీకూ నీబిడ్డలకూ తోడుగా ఉండమూ!”


వేదవతి తలూపుతూ లోపలకు వెళ్లి తన కుటుంబంలోకి దొడ్డిదారిన నల్లపిల్లిలా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నఆ నర్సావిడ ఇంటి విలాసం తెచ్చి ఇచ్చింది, అందుకున్న వెంటనే వాయువేగంతో రోడ్డుపైకి వెళ్లి అటు పోతూన్న ఆటోరిక్షాను ఆపా డు నరసియ్య.


జీవితంలో తరచుగా అద్భుతాలు జరక్కపోయినా కొన్నిసార్లు తప్పని సరిగా అనివార్యంగా ఆశ్చర్యార్థకాలు యెదురవు తుంటాయి. వెళ్లినవాడు వెళ్ళినట్టుగా గంట లోపున నరసియ్య యింట్లో ప్రత్యక్షమయాడు; విరిగిన కత్తితో తిరిగొచ్చిన సైనికుడిలా- ఆతడి రాక చూసి అత్తాకోడళ్ళు ఇద్దరూ కళ్ళు తేలేసారు. తమను తాము అదుపులోకి తెచ్చుకుంటూ యేక స్వరంతో అడిగారిద్దరూ— “అక్కడింట్లో లేడా?”


“ఎందుకు లేడూ! ఉన్నాడు. ఆ ఉడుపీ ప్రాంత కన్నడ నర్సు కూడా ఉంది. ఇద్దరూ కబుర్లాడుతూ మోర్నింగ్ కాఫీ తాగుతూ కనిపించారు. ముందుకు ఉరికి వాడి రెండు చెంపలూ యెడాపెడా వాయించాలనే అనుకున్నాను. ఆ కోపంలో ఆ ఊపులో ఆ ఉడిపీ అమ్మాయికి కూడా ఒకటి తగిలించాలనుకున్నాను- పెళ్ళియిన వాడితో సరసాలాడుతావా అని- నా కోడలి పిల్ల పచ్చటి సంసా రాన్ని బుగ్గిపాలు చేస్తావా అని మొట్టికాయలు పెట్టాలనిపించింది. వాణ్ణి అందరూ చూస్తుండగా రోడ్డుపైకి బరబరా లాక్కురావా లనే అనుకున్నాను. కాని ఆగిపో యాను”


రమణమ్మకు భర్త వాలకం చూసి ఉక్రోశం పెల్లుబికింది. “ఏమిటయ్యా మీరు నిర్వహించిన రాచకార్యం? పెళ్ళాం ఉందని తెలిసి కూడా కొడుకుతో జతకట్టిన ఆ ఉడుపీ నర్సుని తిన్నగా పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లి నిల బెడ్తారనుకుంటే— కేసు బనా యిస్తావనుకుంటే రంయ్ మని వెళ్లి రంయ్ మని వచ్చేస్తారా! సిగ్గు చేటు-మన కుటుంబ గౌరవానికి సిగ్గు చేటు- మీ పెద్దరికానికి సిగ్గు చేటు”

అప్పుడు నరసియ్య భార్యవేపు తేరి చూసి అన్నాడు-“ఇప్పుడు ఉన్నదున్నట్లు చెప్పేదా! ఓర్పుతో వింటావా పూనకం వచ్చిన మాతాంగిలా రెచ్చిపోకుండా ?”


రమణమ్మ సహనం కొనితెచ్చు కుంటూ చెప్పమన్నట్టు తలూపింది.

“నిజానికి నేనలాగే చేయాలనుకున్నాను. కాని--”

“మళ్ళీ ఆ కానీ అణా వ్యవహారం యేమిటండీ!ఆవిడ స్వంత మనుషులు యెవరైనా యెదురొచ్చి మిమ్మల్ని అడ్డగించారా?”

“అటువంటిదేమీ లేదే రమణమ్మా! అనుకోకుండా ఒకటి జరిగిపోయింది. నా చూపు చెదిరిపోయింది. ఆ అమ్మాయి మెడన మంగళ సూత్రం వ్రేలాడుతూంది. అది చూసి---“


“అయ్యోరామ! ఈరోజుల్లో వన్ గ్రామ్ మంగళ సూత్రాలు యెక్కడబడితే అక్కడ కారు చౌకగా దొరుకుతాయండీబాబూ! అవన్నీ నకిలీ వండీ! శంఖం నుండి పోస్తేనే తీర్థం అవుతుందని మీకు తెలియనిదా! నకిలీ ఉత్తీర్ణ పత్రాలు దొరకపుచ్చుకుని నకిలీ ఇంజనీర్లుగా నకిలీ పట్టభద్రుల్లా రోగ్స్ తయారవడం లేదూ! అటువంటి నకిలీ కేసండీ దానిది. మొత్తానికి ఆ మంగళ సూత్రం మాయలో పడ్డారన్నమాట—“


“ప్రశాంత్ చేసిన పని తప్పో ఒప్పో తేల్చుకోవలసింది మనం. ఆ తరవాత హైందవ వివాహ చట్టం ప్రకారం కోర్టు తీర్మానించాల్సిన విషయం. కాని వాడు ఆమె మెడన మూడు ముళ్లూ వేసిన మంగళ సూత్రం మాత్రం నిజమైనది. ఎందుకంటే- అచ్చు అటు వంటి మంగళ సూత్రమే- మాఁవిడి పిందెల మంగళ సూత్రమే మా అమ్మ మెడన వ్రేలాడేది. చిరు ప్రాయంలో మా అమ్మ గుండెపైన వ్రేలాడే ఆ మంగళ సూత్రాన్ని యెన్ని సార్లు చూసానని. ఆ మాటకు వస్తే మా అమ్మకూడా మా బాబుకి రెండవ మనువేగా! అంత మాత్రం చేత అది నిజమైన మంగళ సూత్రం కాకుండా పోతుందా?”


ఇక రమణమ్మా వేదవతీ మాటా పలుకూ లేకుండా గుడ్లప్ప గించి చూస్తూండి పోయారు. అప్పుడక్కడ్నించి కదులుతూ లోపలకు వెళ్తూ-“చివరి మాట “అని ఆగి తిరిగి చూసాడు నరసియ్య.

ఆడాళ్లిద్దరూ కళ్లు పెద్దవి చేసుకుని అతడి వేపు కనుబొమలు యెగరేసి చూసారు. ”ఆ ఉడిపి అమ్మాయి ఇప్పుడు వట్టి మనిషి కాదు. నిండు గర్భిణీ! రేపో మాపో పురుడు పోసుకునేలా ఉంది. ఈ సమయంలో ఆమెతో తగవులాటకు దిగడం అంత మంచిది కాదేమో! ఆమెలో సదైవ ప్రియ దర్శనత్వం గోచరించడానికి ఇది కూడా ఒక కారణమేమో! మరొకటి—ఆఖరు విషయం కూడా ఉంది. చెప్పేదా!”


అత్తాకోడళ్లి ద్దరూ తలలూపారు. ”కొన్ని నియమాలున్నాయి. కొన్ని ధర్మాలున్నాయి. వాటిని మనమెన్నడూ ఉల్లంఘించ కూడదు. మనం అడపా దడపా దానధర్మాలు చేస్తుంటాం. అంతెందుకు, మన ఊరి గుడి పునరు ధ్ధరణకు మనమే పూనిక వహించి ఖర్చులన్నీ భరించి పూర్తిచేసి ముగించాం. అలాగని మనం అర్చకుణ్ణి ప్రక్కకు తోసి గర్భ గుడిలోకి ప్రవేశించగలమా? ప్రవేశించి మనంగా అర్చన చేయగలమా! లేదు కదా! అదే విధంగా యెటువంటి ఇక్కట్టైన పరిస్థితి లోనూ గర్భిణీ స్త్రీకి కష్టం కలిగించ కూడదు. గర్భిణీ స్త్రీని మానసికమైన అశాంతికి గురి చేయకూడదు. గర్భిణీ స్త్రీ అంటే ఒకరు కాదు. ఇద్దరన్నది మనం మరవ కూడదు. నాకు తోచింది నేను చెప్పాను. చట్టం ప్రకారం ఆవిణ్ణి కోర్టుకి ఈడ్చుకు వెళ్ళి కటకటాల వెనక్కి పంపుదామా-- లేక ధర్మాచారం ప్రకారం ఆ ఉడిపి అమ్మాయికి పురుడు పోసుకోవడానికి అవకాశం యిద్దామా! ఇకపైన యేమి చేయాలో యెలా చేయాలో మీరే ఆలోచించండి. మీరు చెప్పినట్టే ముందుకు సాగుతాను” అంటూ తనలో తను ఉఛ్ఛరించుకుంటూ లోపలకు కదిలాడు-“సర్వమంగళ-మాంగళ్యే—శివే సర్వాస్థ-సాధికే శరణ్య త్రయాంబికే గౌరి నారాయణి నమోస్తుతే-- “


అత్తాకోడళ్ళిద్దరూ నిదానంగా నడచి వెళ్ళిపోతూన్న నరసియ్యను చూస్తూ యేమి చెప్పాలో తెలియక గ్రుడ్లు మిటకరిస్తూ నిల్చున్నారు.

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
58 views0 comments

Comentarios


bottom of page