top of page

అనుభవం


Anubhavam Written By Lakshmi Raghava Kamakoti రచన : డా. లక్ష్మీ రాఘవ కామకోటి


“ఈ రోజు రచయితల సంఘానికి వెళ్లి వస్తా నాన్నా. కాస్త ఆలస్యం కావచ్చేమో” “ఆఫీసు నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి వెళ్ళు రవీ. ఒకవేళ ఆలస్య మయితే కష్టం.” “వాళ్ళు ఎంతసేపు వుంటారో తెలియదు. ఈ రోజు కలిసి వాళ్ళ టైమింగ్స్ తెలుసుకుని వస్తా..” “సరే, నీ ఇష్టం “అన్నాడు రాజారావు. రవి ఉద్యోగంలో చేరాక రెండేళ్లకే చనిపోయింది అమ్మ శాంతమ్మ. 'పెళ్లి చేసుకోరా ..అని ఎంత పోరినా వినలేదు రవి. కారణం అక్క వసుధ జీవితం. అక్కకూ తమ్ముడికీ పదేళ్ళుతేడా. రాజారావు ఉద్యోగం లో ఉండగానే వసుధ పెళ్లి చేశాడు. ఎంతో మంచివాడు అనుకున్న వసుధ భర్త కమలాకర్ పెళ్ళైన రెండేళ్లకే అతని చెడు అలవాట్లతో అక్కకు ప్రతి విషయం లో నరకం చూపించమే కాక రాజారావు కుటుంబాన్నీ డబ్బుకోసం పీడించాడు. చివరకు ఈ లోకం లోనే లేకుండా పోయింది అక్క. ఆ ఒక్కటే కాదు, ఒకటో రెండో స్నేహితుల వివాహ జీవితం లో ఎదురవుతున్న సమస్యలకు మనసుకు బేజారు అయి జీవితంలో పెళ్లి చేసుకోను అని నిర్ణయం తీసుకున్నాడు రవి. రవికి సాహిత్యం మీద మక్కువ. చుట్టూ వున్న విషయాలను గమనించి కొన్ని కథలు రాస్తే అవి పత్రికలూ పబ్లిష్ చేశాయి. దాంతో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ రచయితలతో పరిచయాలు పెంచుకుంటే వారి ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు అన్నకోరిక తీరటం లేదు. రాజారావుకు ఎందుకో కొడుకు సాహిత్యం మీద ఆసక్తి చూపడం ఇష్టం వుండదు.అది తిండీ పెట్టదు, పైకీ రానివ్వదు అంటారు ఎప్పుడూ. ఇక్కడకి ట్రాన్స్పర్ మీద వచ్చి నెల దాటింది. ఆఫీసు దగ్గరలో ఇల్లు దొరకడం ఆఫీసులో కొంత మంది పరిచయాలు పెరిగాక రచయితల గురించి అడిగితే ఒకటో, రెండో రచయితల సంఘాలు వున్నట్టు తెలిసింది. అప్పటినుండీ అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం. ఇన్నాళ్ళకి తీరింది అని సంతోషం గా వున్నాడు. అందులో ఒక సంఘం చాలా పాతది అని విన్నాడు. అడ్రస్ ప్రకారం వచ్చి రచయితల ఆఫీసు దగ్గరపడగానే ఉద్వేగంగా అనిపించింది. ఆ సంఘం చాలా పాతది అనీ, ఎన్నోఏళ్లుగా ఉన్నదని తెలిశాక ఎటువంటి ఉద్దండులు ఉంటారో..తనది ఎంత అదృష్టమో అనుకున్నాడు. తీరా దగ్గరికి వెడితే అక్కడ చిన్న బోర్డు “మాధవాపురం రచయితల సంఘం” చూశాక అంత చిన్న బోర్డు వుండటం కాస్త నిరాశగా అనిపించింది. తలుపుకు తాళం వుండటంతో ఒకసారిగా నీరసం ఆవరించింది. నిస్సహాయంగా తలుపు ముందు వున్న మెట్ల మీద కూర్చున్నాడు. ఒక అయిదు నిముషాల తరువాత ఒకతను వచ్చి”ఎవరు సార్?” అన్నాడు. ”ఇక్కడా... రచయితలు ...” పూర్తి అవకుండానే “వాళ్ళు ఇప్పుడప్పుడే రారు సార్. నేను బయట వూడ్చి ఒకసారి క్లీన్ చేసి వెడతాను. వాళ్ళు ఒక గంట తరువాత వస్తారు. ” “నీవు...” “నేను పక్కనే వున్న ఆఫీసులో పని చేస్తాను అటెండర్ గా. నాకు అక్కడ పని అవగానే ఇక్కడ చుట్టూ వూడ్చి వెడతాను...మీరు కొత్తగా వున్నారు..” ఆపాడు. “అవును కొత్తగానే వచ్చాను ఈ వూరికి. ఈ సంఘం గురించి విని చూద్దాం అని...” “ఎవరు చేరినా ఎక్కువ రోజులు వుండరు సార్...” అతని మాటలతో ఒక్కసారిగా నీరసం వచ్చింది. “ఎందుకని?” అని అంటే “తెలియదు సార్ ..కొంతమంది తప్ప కొత్తవారు ఎక్కువ కనపడరు అందుకని అలా నేను అనుకుంటా..”

నీవు అనుకోవటమే కదా అని మనసు తేలిక అయ్యింది. ఆయన క్లీన్ చేసి వెళ్ళిన ఒక అరగంటకి ఒక ముసలాయన వచ్చాడు. రవిని చూస్తూ “కొత్తగా వచ్చారా?” అని నవ్వుతూ పలకరించి ‘రండి లోపలి’ అన్నాడు తలుపు తీస్తూ. లోపల చిన్నపాటి హాలు లాటిది. మధ్యలో ఒక పెద్ద టేబుల్, దాని చుట్టూ కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు, ఒక మూలగా ఒక చెక్క అల్మేరా గాజుతలుపులు కనుక లోపల వరుసగా పేర్చిన పుస్తకాలు కనబడుతూ వున్నాయి. గోడమీద చాలా పాత కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, కిందగా కాస్త కొత్తగా వున్నఒక కలర్ ఫోటో... అన్నీ ఒక క్షణంలో ఆసక్తిగా వీక్షించాడు రవి. ఆయన ఒక బట్టతో కొన్నికుర్చీలు దులిపి రవిని కూర్చోమని చెబుతూ...తాను కూర్చుని “నా పేరు రామనాధం. సుమారు ముప్పై ఏళ్ళ నుండీ ఈ సంఘానికి సెక్రటరీ గా ఉంటున్నాను...” ఆశ్చర్యంగా అనిపించింది. ఏ కాలం లో కూడా ముప్పై ఏళ్లుగా ఒకే వ్యక్తీ ఒకే పోస్ట్ లో వుండటమా? “మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇన్ని ఏళ్ల సర్వీసు ఎలా అని. ఈ రోజుల్లో సాహిత్యం మీద మక్కువ లేదండి జనానికి. అక్షరం రాయగలిగిన ప్రతివాడూ తాను రచయితనైనట్టే ఫీల్ అయిపోతాడు. అందుకే మధ్యలో ఒకరిద్దరు మారినా వారి సమర్థత చూసాక నేనే ఉండవలసి వచ్చింది. ఇంతకూ మీరు ఈ వూరికి కొత్తగా వచ్చారా? ఏ ఆఫీసులో పనిచేస్తారు? మీకు సాహిత్యం మీద మక్కువతో ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చినట్టు అర్థం అవుతూంది.” “అవును సార్. నా పేరు రవి. ఇక్కడకు ట్రాన్స్ఫర్ అవగానే చాలా ఆనందపడ్డాను. ఈ సంఘం చాలా పాతది అని విన్నాను. ఇందులో మీ లాటి పెద్దలను అందరినీ కలిసి, మెంబెర్ ను అయితే నాకు సాహిత్యానికి వున్న బంధం మరింత బలపడుతుందని అనిపించింది” “ఇన్ని రోజులకు మా పాత వైభవాన్ని గుర్తుపెట్టుకుని కలుసుకున్న వ్యక్తి మీరే. సంతోషం. మీరు చేరడానికి మాకు కొన్ని రూల్స్ వున్నాయి. మొదటగా ఇదివరకు మీరు చేసిన రచనలు చూస్తాము. మాకు కొన్ని పద్దతులలో రాసి చూపించమని టాపిక్ కూడా ఇస్తాము. అందులో మీరు నెగ్గితే ఈ సంఘంలో మెంబెర్ అవచ్చు. ఫీజు కూడా సంవత్సరానికి నూరు రూపాయలే.”అంటూన్న ఆయన వైపు ఆశ్చర్యంగా చూసాడు రవి. ఇంతలో మరో ఇద్దరు సభ్యులు కాబోలు వచ్చారు. లోనికి రాగానే రవిని చూస్తూ “కొత్తగా వచ్చారా?” అంటూ కూర్చున్నారు. రామనాధం గారు “ఈయన పేరు రవి. ఈ వూరికి కొత్తగా వచ్చారుట. మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. వీరు గోపాలం, రామారావు” అని పరిచయం చేసాడు ఆయన. “సార్, ఫీజు చెప్పి కడితే మన టైమింగ్స్ చెప్పండి.“ అన్నారు రామారావు గారు. “అదేమిటి రామారావుగారూ, మన రూల్స్ చెబుతున్నా...” రామనాధం. “ఈ సారి అలా వద్దు. మొదట చేరనివ్వండి.మనకూ మెంబెర్స్ కావాలి” “అంటే మన రూల్స్ గాలికి వదిలేద్దమా?” “ఈ సారికి ఒక మార్పుని తీసుకు వస్తాం సార్, మీకు తెలియనిది ఏముంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. నేను మొన్న మీటింగ్ లో చెబుతామని అనుకున్నా”.

ఇంతలో మరో ఇద్దరు వచ్చారు. అందరూ బాగా వయసు పైబడ్డవారే. రిటైర్ అయి చాలా ఏళ్ళు అయివుంటుంది. వారి పేర్లు, ఆంజనేయులు, శ్రీనివాసరావు గా పరిచయం చేయబడ్డారు. అందరూ రవి విషయం మరచి కబుర్లలో పడ్డారు. అందులో సాహిత్యానికి సంబంధించి ఒక్క టాపిక్ లేక పోవడం రవికి నిరాశ పెంచింది. కాస్సేపు అయ్యాక “సార్, ఇంటి దగ్గర నాన్నగారు వెయిట్ చేస్తూ వుంటారు. నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు?“ “మేము రోజు విడిచి రోజు కలుస్తాము. మీరు ఈ రోజు సమయాన్నే ఎంచుకోండి” “సరే సార్” అని అందరికీ నమస్కారం పెడుతూ లేచి ఇంటికి బయలు దేరాడు రవి. ఇంటికి చేరేలోపు మనసు నిండా ఆలోచనలు...ఎంతో గొప్పగా ఊహించుకున్నాడు అతను ఈ సంఘం గురించి. అక్కడకు వచ్చిన వ్యక్తులుకానీ, వారు ప్రస్తావించిన విషయాలు కానీ కొద్దిగా కూడా నచ్చలేదు. ఆ మాట ఇప్పుడే నిర్దారించుకోకూడదు. ఒకటి రెండుసార్లు వెడితే తప్ప విషయాలూ, విశేషాలూ ఏవీ తెలియవు అని సమాధాన పరచుకున్నాడు. ఇంటికి వచ్చాక నాన్న అడిగినా ఏమీ వివరించకుండా రచయితలను కొంతమందిని కలిసాననీ. ఇంకా కొన్ని రోజులు వెడితే అన్ని విషయాలూ తెలుస్తాయని దాటవేశాడు. ఆఫీసులో సీనియర్ బాస్కరం గారు అడిగారు ‘మీరు రచయిత అట కదా?’ అని ”అబ్బే అంత లేదండీ, ఏవో మూడు నాలుగు కథలూ కవితలూ పత్రికలలో వచ్చాయి. ఇంకా చాలా నేర్చుకోవాలి.” “మీరుగా ఎదగడానికి ప్రయత్నం చెయ్యండి కానీ ఈ సంఘాలతో పెట్టుకోవద్దు. మీ లాటివారిని పైకి రానివ్వరు. పైగా అణగ దొక్కుతారు.” “అదేమిటి అలా అన్నారు?” “మా చెల్లెలికి కొంచెం సాహిత్యం మీద పిచ్చి. ఈ వూర్లో వుండే సంఘాల గురించి విచారించి వెడితే ఆమెకు, ఒక సంఘం వారు ఆమె రాతలకు ప్రోత్సాహం ఇవ్వకుండా.. నీవు రాయటం మానేసెయ్యమ్మా, నీవు పైకి రాలేవు’ అన్నారు. అలా తను అక్కడనుండీ తప్పుకుంది.” “అయితే మీకు తెలిసే వుంటుంది ఈ వూర్లో ఇంకా సంఘాలు ఉన్నాయా?” “కొన్ని వున్నాయి, అన్నీ యాక్టివ్ గా లేవు. ఒకటి కేవలం ఆడవాళ్ళదే. అక్కడ పాలిటిక్స్ ఎక్కువ. ఎప్పుడూ పెద్దవారిని పిలిచి సభలు జరపాలని ఆరాటం ఎక్కువ. అందులో పార్టిసిపేట్ చెయ్యడానికి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వరు.. అన్నీ వాళ్ళే చేస్తారు. సభ్యులను సంఖ్య కోసం అందరినీ చేర్చుకుంటారు. అందులో కొంత బాగా రాసే రచయిత్రులదే హవా అంతా. ప్రోగ్రా౦ పెట్టి, రకరకాల ఫోటోలతో న్యూస్ పేపర్స్ లో వచ్చేలా చేస్తారు. అందుకని పేపర్ వాళ్ళు ఇది గొప్ప రచయితల సంఘం అని పొగుడుతుంది. బయట కాస్త పేరూ, ఏదైనా అవార్డు ఇచ్చే సంస్థలని ప్రత్యేకంగా పిలిచి సన్మానిస్తారు. ఆ తరువాత వాళ్ళు కూడా వీరిని గుర్తు ఉంచుకుని పిలుస్తారు. అందుకే ఈ సంఘం పేరు నలుగురికీ బాగా తెలుస్తుంది. అంతే కాదు, పొలిటికల్ గా పెద్దవారిని ముఖ్య అతిదులుగా పిలిచి సన్మానిస్తారు. వాళ్ళ దగ్గర డొనేషన్ రూపం లో డబ్బు తీసుకుంటారు. ఈ సంఘం లో ఒకావిడ కాస్త డబ్బున్న మనిషి. ఈ విధమైన గుర్తింపుకోసం ఆవిడ ఖర్చుకు వెనుదీయదు. ఇంకా కొన్ని ప్రత్యేక విశేషాలు వున్నాయి ఇంకోరోజు చెబుతాను లెండి “అన్నాడు ఆయన నవ్వుతూ. ఆయన మాటలతో రవికి చాలా కన్ఫ్యూసింగ్ గా అనిపించింది. సాహిత్యంలో ఇలాటివి కూడా ఉంటాయా? ఒకరికొకరు సాయం చేసుకోరా? అయినా తను ఇంకా కొన్ని రోజులు రచయితల సంఘానికి వెడితేనే అర్థం చేసుకోగలదు. ఇలా ఎవరో చెబితే తన ప్రయత్నం ఎందుకు మారాలి?? అనుకున్నాడు. కొన్ని రోజులు రచయితల సంఘానికి వెళ్ళాడు. అక్కడ అందరూ సాహిత్యం గురించి మాట్లాడ్డం తక్కువ అయినా ఏదైనా టాపిక్ గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అద్బుతమైన విశ్లేషణ వుంటుంది. ఏ విషయమైనా పూర్వాపరాలు చెప్పగల జ్ఞానం వుంది కొంతమందికి. అది నచ్చింది రవికి. ఏమైనా ఇక్కడే వుండి నేర్చుకోవాలి అనుకున్నాడు. ఒకరోజున ఒక్క రామనాధం గారు తప్ప ఎవరూ రాలేదు. ఆరోజు తను రాసిన రెండు మూడు కవితలను, కథలను ఆయనతో ప్రస్తావించి చదివితే ఆయన ఎక్కడ సరిచేసుకోవచ్చో చక్కగా చెప్పారు. ఆయన చెప్పిన పాయింట్స్ ను నోట్ చేసుకున్నాడు. ఈ సారి కొత్తది రాసినప్పుడు ఆయన సలహా తీసుకోవాలి అని అనిపించింది. పద్యమైనా, పురాణమైనా,అనుకోని వార్త అయినా ఆయన విశ్లేషణ అద్బుతం గా వుంటుంది. ఎందుకు సాహిత్యంలో ఈయన పేరు అంత ఎక్కువగా వినిపించదు? ఈ సందేహాన్ని వెల్లడించాడు ఆయన ఒంటరిగా దొరికిన రోజున. “నేను ఎవరికీ తలవంచి దాసోహం అనను. నా జ్ఞానం నా సొంతం, దాని గుర్తి౦పు కోరకు. అందరి కాళ్ళూ పట్టుకోవడం కానీ, కొత్త పోకడలు అనుసరించడం కానీ చెయ్యను. సలాములు కొట్టేవాడు పైకి ఎదుగుతున్న ఈ రోజుల్లో నాకు దాని అవసరం రాలేదు, వద్దు కూడా....”అన్నారు ఖచ్చితంగా. అందుకే ఆ సంఘంలో ఇతరసభ్యులు అతని గురించి కొద్దిగా తేడాగా, అతని మొండితనాన్ని ఎత్తిచూపుతూ మాట్లాడినా ఆయన ఖాతరు చేయ్యరు అని గమనించాడు. ఒక పత్రిక ఒక కథల పోటీ పెడుతూంటే ఒక కథరాసి, ఈసారి ఈయన సలహా తో మార్పులు చేసుకుంటే పోటీలో బహుమతి గెలవచ్చేమో అనిపించింది. అందుకే ఈ సారి కథను ఒక జిరాక్స్ కాఫీ తీసుకుని ఆయనను కలిసి ఇచ్చాడు.

"మీరు ఒకసారి చూసి ఇంకా మార్చవచ్చా, ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి సార్. ఒక పోటీ కి పంపుదామని అనుకుంటున్నాను.” అని చెబితే ఆ పోటీ వివరాలు అడిగాడు ఆయన.

రవి జవాబు విన్నాక “పోటీ కి పంపడానికి ఇంకా టైం ఉందిగా, చెబుతాను లే“ అన్నాడు.

తరువాత రెండు వారాలు గడిచాయి ఒకసారి రిమైండ్ చేస్తే “అయ్యో మరచిపోయానోయ్. ఈసారి కలిసినప్పుడు ఇక్కడికే తెచ్చి అప్పటికప్పుడు ఏదైనా తప్పులు చెబుతాను నోట్ చేసుకు౦దువు గానీ” అని ఆయన అనగానే మనసు తేలిక అయ్యింది.

'పర్వాలేదు. ఈ వారంలో పంపెయ్యచ్చు చివరితేదీ లోపల చేరిపోతుంది' అనుకున్నాడు. మరు మీటింగు రోజు ఆశ్చర్యంగా అందరూ టైం కి వచ్చారు. రామనాధం గారు రవిని చూసి “అందరూ వచ్చేసారు. ఇక ప్రారంభిస్తాను “అంటే అర్థం కాలేదు. ఆయన రవి రాసిన పేపర్లు తీసి చేతిలో పట్టుకునేసరికి ఆశ్చర్యం వేసింది. తన కథ విషయమై అందరూ ఉండాల్సిన పని లేదు. దాని గురించిన విషయాలను తనతో చెబితే చాలుగదా అనుకున్నాడు. “అందరూ వినండి. రవి ఒక కథను పోటీకి పంపడానికి రాసి, ఏదైనా మార్పు చెయ్యచ్చా అని నాకు ఇచ్చాడు. అది నేను ఎలా చెబుతానో మీరందరూ కూడా వినవచ్చుకదా అని పిలిచాను. ఇక విషయానికి వస్తే దీనిని కథ అనలేము. ఒక సంఘటన మాత్రమే. అందులో చాలా తప్పులు వున్నాయి. సంఘటన సమయాన్ని సరిగా వివరించలేదు. ఏ సంఘటన గురించి రాసినా పూర్వాపరాలు కొంచెం తెలపాలి. ఇక సంఘటనలోని వ్యక్తుల సంభాషణ చాలా విరుద్దంగా వుంది. అంటే సాహిత్యంలో సంభాషణలు ఎలా చెయ్యాలి? ఎలా ముగించాలి అన్న దానికి కొన్ని ప్రమాణాలు ఉనాయి. అవి పాటించలేదు. కథకు ఒక మొదలు ఒక ముగింపు చక్కగా ఉంటేనే చక్కని కథ అనిపించుకుంటుంది....” ఇంకా ఏదో చెప్పినా ఒక్క ముక్క బుర్రకు ఎక్కలేదు రవికి . మిగిలిన సభ్యులు కూడా దేనికీ అభ్యంతర పెట్టక పోవడం చిత్రం గా అనిపించింది. “రవీ ...” రామనాధం గారి గొంతు విని తలతిప్పి ఆయనవైపు చూసాడు. “ఇప్పుడు నేను చెప్పిన వన్నీఒకసారి ఆలోచించి మళ్ళీ వ్రాయి రవీ, నీవు మంచి రచయితవు కావాలంటే ముందు లైబ్రరీ కి వెళ్లి అందరి రచనలూ చదవాలి. అలా ఆరునెలలో, సంవత్సరం పాటు చేస్తే నీకు ఒక రచన ఎలా ఉండాలో అర్థం అవుతుంది. అప్పుడు నీవు చేసే ప్రతి రచనలో ఒక మెచూరిటీ వుంటుంది. ఏమ౦టావు?” రవి నిరాశగా తలవూపాడు. ఇంటికి వచ్చినా ఆరోజు జరిగిన విషయాలు జీర్ణించుకోలేక పోయాడు. పెద్ద రచయితలు ఒక రచయితకు ఇచ్చే ప్రోత్సాహం ఇదా?? అనిపించింది.ఇంట్లో నాన్నకు ఏమీ చెప్పలేదు. ఆఫీసులో తనను గమనించిన బాస్కరం గారు ”ఏమిటి రవీ అలా వున్నారు??” అని అడిగితే పేలవం గా నవ్వాడు...రెండు రోజులు రచయితల సంఘానికి వెళ్ళలేదు. భాస్కరం రవి తీరు గమనిస్తూనే వున్నడు. ఆరోజు కాంటీన్ లో పట్టుకుని “రవీ ఏమైంది నీకు?”అని అడగ్గానే మనసులో బాధ ఎవరికైనా చెప్పుకుంటే పోతుంది అనుకుంటూ జరిగిన విషయం చెప్పాడు.అది విని భాస్కరం గట్టిగా నవ్వుతూ “నేను మీకు ముందే చేపాను. అలా సలహాలకు వెళ్లి, వాళ్ళ తీరు నచ్చకే చాలామంది దూరం అయ్యారు. వాళ్ళకి తెలీని విషయం లేదు. ఇంకా వాళ్ళకి వున్న జ్ఞానం అపారం ఒప్పుకుంటాను. కానీ వారికి విపరీతమైన గుర్తింపూ రాలేదు. అది ఎవరూ ప్రశ్నించరు. ఇతరులను పైకి రావడానికి చేయి అందించరు. పాతచింతకాయ పచ్చడి లాగా అది చెయ్యి, ఇది చేస్తే నే నీవు మంచి రచయిత అవుతావు అని సలహాలు ఇస్తారు. ఫలితం నీకు రచనల మీద మక్కువ తగ్గుతుంది. వారితో పోటీకి పోలేవు.” “వారి మీద పోటీ ఏమిటి భాస్కరం గారు, అందులో ఒకరు అద్బుతమైన పద్యాలు రాస్తారు. ఒకరు పురాణాలలో ఏవిషయం పైన అయినా మంచి విశ్లేషణ ఇస్తారు. ఒకాయన వేరే భాషల నుండీ ట్రాన్స్ లేట్ చేస్తారు కాబట్టి ఏ భాష గురించి అయినా ఎంతో సమాచారం ఇస్తారు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక టాలెంట్ వుంది. నేను ఒక సామాన్యమైన కొత్త రచయితని, అంతటి నిష్ణాతుల అబిప్రాయం తెలుసుకోవాలనుకున్నానే గానీ ఏ విధం గానూ పోటీదారును కాదు. కానీ నన్ను అంత దారుణం గా డిస్కరేజ్ చెయ్యడం ఎందుకు?అని తల బద్దలు కొట్టుకుంటున్నాను” అన్నాడు ఆవేశంగా. “వాళ్ళ ప్రామాణికాల మధ్య మీరు ఎదగ లేరు. నేను చెప్పేది విని మంచిదనిపించింది రాయండి.. పాకులు పలురకాలు. ఈ మధ్య గమనించారా ఎందరో కొత్త రచయితల పేర్లు వినిపిస్తున్నాయి. రవీ! ఇలా చెబుతాను విను.మన సినిమా సంగీతం విషయానికి వస్తే అలనాటి సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన క్లాసికల్ టచ్ వున్న పాటలు విన్నాక, ఇళయరాజా వి కూడా చాలా పాపులర్ అయ్యాయి. రాజేశ్వర రావుగారి అబ్బాయి కోటి మాస్ పాటలు, రెహమాన్ పాటలూ అపరిమితమైన ఆదరణ ఎలా పొందినట్టు.? అంతా కాలమహిమ. ఇప్పటికీ పాతను మరచిపోము. ఇప్పటికీ పాత సినిమాలకు, పాటలకూ ఆదరణ వుంది అయినా ఇప్పటి ప్రేక్షకులు కొత్తను ఇష్టపడుతున్నారు వారి ఆభిరుచిని బట్టి పాటలు వస్తున్నాయి. అలాగే సాహిత్యం కూడా...కొత్తకు ఆదరణ వుంటుంది ఎప్పటికీ .

“ఏడూ చేపల కథలు”అలాగే కాకుండా కొత్త పోకడలు పోయాయి. ఈమధ్య అదే కథ మోడరన్ టెక్నాలజీ లో ఎలా చెబుతారు అని చూపించారు. నీవు కూడా అంతే! కొత్త ఆలోచనలకూ, కథ చెప్పడం లో కొత్తదనాన్ని తెస్తున్నావు. నీవు ఈ తరం మనిషివి కాబట్టి నీ స్టైల్ లో కొనసాగించు... “ఇంకా ఒకటి గుర్తుంచుకో కథల్లో ప్రాంతీయ తత్వాన్ని బట్టి సంఘటనలు వుంటాయి. రాయలసీమ రచయితలూ కరువు, ఎదురు చూసే వానచినుకు, రాళ్ళను కొట్టుకుంటూ జీవనం సాగించే విధానం గురించి రాస్తే, ఉత్తరాది వారు వరదలు, అధిక నీటి వల్ల వచ్చే కష్టాలు గురించి రాస్తారు. ఇందులో సత్యం, అసత్యం అని ఏదీ లేదు. నీకు తెలిసిన ప్రాంతం లో జరిగిన విషయాలు నీవే కళ్ళకు కట్టినట్టు రాయగలవు. ప్రతిదాన్లోనూ తప్పనిసరిగా ఒక హీరో ఒక విలనూ, ఒకే కారణం ఏదీ వుండక్కరలేదు..” అంటూన్న భాస్కరం “గీత”ను బోధిస్తున్న కృష్ణుడిలా కనబడ్డాడు రవికి.

అందుకే అడిగాడు “ఇన్ని తెలిసిన మీరెందుకు రచయిత కాలేదు” అని.

దానికి సమాధానం గా నవ్వుతూ “ఇంట్లో ఒక రచయిత్రి వుంది కాబట్టి నాకు ఇంత జ్ఞానం అబ్బింది. ప్రతి విషయం లోనూ తనను సరైన బాటలో నడిపించడానికి సూత్రదారుడు అవసరం కదా అందుకే నేను రచనలు చెయ్యాలి అన్న ఆలోచనలను పక్కన పెట్టాను. నీవూ ఒకసారి నేను చెప్పింది ఆలోచించు..” 'నిజమే! తన స్టైల్ తనది. తనకు ఇతరుల సలహా నచ్చకపోతే ఫాలో అవాల్సిన పని ఏముంది? సలహాలు తీసుకోవచ్చుకానీ అన్నీపాటించాలని రూల్ లేదు. తనకు నచ్చితే వాడుకోవచ్చు..' అనుకోగానే మనసు తేలికైంది. మనసు ఫ్రెష్ గా వున్నప్పుడు మరోసారి తన కథను చదువుకుని, సరి చేసుకుని, బాగానే వుందని అనిపించగా పోటీకి పోస్ట్ చేసాడు. సంఘానికి వెళ్ళడం తగ్గించి, వారి ఆలోచనలకు అనుగుణంగా కొంత ఏదైనా వారి దగ్గర నుండీ నేర్చుకోవాలి. ఎలా అయినా ముందు తరంవారు అప్పట్లో డాక్టర్ లాగా ఏ రోగానికైనా మందు ఇచ్చేవాడు. ఇప్పటిలాగా స్పెషలిస్టు అవసరం వుండేది కాదు. సంఘం లో వున్నవారు పాతకాలం డాక్టర్ లాగా అన్ని రంగాలలో ప్రవేశం వున్నవారు కాబట్టి గౌరవం ఇవ్వాలి అనుకున్నాడు. అనుకోకుండా ఆ కథల పోటీల్లో రవి కథకు మూడవ బహుమతి వచ్చింది. సంఘం లో అందరూ అభినందించారు. వారు చెప్పిన మార్పులు చెయ్యబట్టే బహుమతికి నోచుకుంది అని మాట్లాడుతుంటే నవ్వుకున్నాడు రవి, అన్ని సంఘాలలో ఇదే వాతావరణం ఉంటుందని అనుకోకూడదు. కొన్ని చాలా విశేషమైనవి కూడా వున్నాయి, వుంటాయి కూడా... నలుగురు మనుష్యులు కలిసి వున్నచోట రకరకాల స్వభావాలు వుండటం సహజమే, కొందరిలో స్వార్థం మరికొందరిలో తానే గొప్ప అనుకోవడం, జలసీ, కొందరికి ఇతరులను అణగదొక్కితే ఆనందం... మరికొందరు తోటి రచయితలకు మంచి సూచనలు ఇచ్చేవారూ వుంటారు. మనిషి స్వభావాన్ని బట్టే అన్నీ.. కాలం తో బాటు మార్పు తప్పదు రాబోయే కాలం లో కథ రాయడానికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా వుండవచ్చు. ఏదైనా రచయిత కాలం తో బాటూ నడవాల్సింది కదా...


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


రచయిత్రి పరిచయం

మొదటి కథ 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో.

6 కథా సంపుటులు ప్రచురణ, రెండు కథా సంపుటులకు, కొన్ని కథలకూ బహుమతులు.

380 views15 comments
bottom of page