top of page

అపార్ధం

Apartham Written By Gandham Murali Mohan

రచన : గంధం మురళీ మోహన్


ఉదయం 7 గంటలు అవుతుంది. అప్పుడే వాకింగ్ కు వెళ్లి వచ్చి, వరండా లో పడి ఉన్న న్యూస్ పేపర్ తీసికొని ఇంట్లోకి వచ్చి,కుర్చీలో కూర్చున్నాను. నేను రావడము చూసి మా ఆవిడ కాఫీ కప్ తో వచ్చింది. ఉదయం వాకింగు కు వెళ్లే టప్పుడే కాలకృత్యాలు తీర్చుకొని,బ్రష్ చేసుకొని. వెళ్లడము అలవాటు, కాఫీ యాబై సంవత్సరాల నుండి ఉన్న అలవాటు, కాఫీ నా జీవితం లో ఎంతగా కల్సి పోయిందంటే కాఫీ తాగడం కోసమే ఎదురు చూసేటంత . మా ఆవిడ చేతి కాఫీ కి ఉన్న రుచే వేరు, ఉద్యోగ విరమణ అయిన తరువాత స్వయంగా కాఫీ పెట్టు కొందాము, అని ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా ఆమె చేతి కాఫీ రుచి లా లేక చివరకు ఆమె ముందు ఓటమి ఒప్పుకొని కాఫీ పెట్టడం పూర్తిగా మానేశాను. బయట పని మనిషి నీళ్లు చల్లుతుంది. టి వి ఎవరూ వినక పోయినా వేంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంది.

" ఏమండీ ఇప్పుడే మీ కోసం శేఖర్ అన్నయ్య వచ్చి వెళ్లాడండి. " అంది నా శ్రీమతి. ఇంత ఉదయాన్నే వాడు రావడo కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది!

"ఏంటట? ఒక ఫోన్ చేసి వస్తే సరి పోయేది కదా!."

“అన్నయ్య ఫోన్ చేశారట మీరే తీయలేదు ! రా(తి సైలెంట్ లో పెట్టారు , ఉదయం వాకింగ్ కు ఫోన్ మర్చి పోయి వెళ్లారు, ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. మిమ్మల్ని పూజ.. అది అయిన తరువాత వాళ్ళ ఇంటికి రమ్మన్నారు."....అంది.

సరే,సరే...., వేడి నీళ్లు పెట్టావా? అన్నాను. "ఆ..హా.. సిద్ధంగానే ఉన్నాయి" అంది. పేపర్ ని, పక్కకు పెట్టి, కాఫీ తాగి బాత్రూము కు వెళ్ళాను. స్నానం చేస్తుంటే ఒక్కసారి ఆలోచనలు శేఖర్ పైకి వెళ్ళాయి.

*******************

ఇంత ఉదయమే శేఖర్ ఎందుకు వచ్చి నట్లు!?, సున్నిత మనస్కుడు, ఇద్దరం చిన్నప్పటి నుండి స్నేహితులం నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాను. వాడు గవర్నమెంట్ ఉద్యోగం నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఎవరో స్నేహితులతో కల్సి వ్యాపారం పెట్టాడు, మొదట్లో బాగానే ఉన్నది. తరువాత ఏమైందో కానీ నష్టాలు రావడము మొదలయింది. వాడి స్నేహితులు తప్పించుకొని వ్యాపారం వదిలి పెట్టి ఎవరి దారి వారు చూసు కొన్నారు. శేఖర్ ఒక్కడే వ్యాపారము లో మిగిలిపోయాడు. వ్యాపారం కోసము చేసిన అప్పులు అన్ని వీడి పైన పడ్డాయి. అప్పటికి ఒక దాని తరువాత ఒకటి తీర్చుకొంటూ వస్తున్నాడు. నాతో పాటు వాడికి చాలా మంది సలహాలు ఇచ్చారు. 'నీ పార్టనర్స్ లానే నీవు కూడా అప్పులు ఎగవేయి' అని. వాడు ఒప్పుకోలేదు. 'నన్ను నమ్మి కొంత మంది అప్పులు ఇచ్చారు. వాళ్లను మోసం చేయడం కంటే చావడము నయము' అని వాడి వాదన . నిజాయితీ గా నిలబడి వ్యాపారం కంటిన్యూ చేస్తున్నా డు.

'ఇక నీ ఇష్టం', అని అందరం వదిలేసాము. కష్టపడి కొంత..కొంత.. తీర్చుతూ వస్తున్నాడు, వాడికి ఉన్న రెండు ఇళ్ల స్థలాలు కూడా అమ్మి అప్పులు తీర్చాడు. గవర్నమెంట్ పెన్షన్ కొంత వస్తుంది. 'కష్ట జీవి, నిజాయితీ పరుడు, ఈ కాలంలో ఉండాల్సిన వాడు కాదు', ఇవి వాడి బిరుదులు.

***

ఈ లోపు స్నానం అయిపోయింది. నాకు ప్రతి రోజు ఉదయం పూజ కార్యక్రమాలు ఒక గంట చేయటం అలవాటు, అలాంటిది, అరగంటలోనే పూజ ముగించు కొని , శ్రీమతి ఇచ్చిన వేడి వేడి ఇడ్లిలు తిని శేఖర్ ఇంటికి వెళ్ళాను. శేఖర్ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ అపార్ట్మెంట్ కొనుక్కొన్నాడు, చివరకు వాడికి మిగిలిన ఆస్తి ఇదొక్కటే. శేఖర్ నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. నేను రాగానే ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. “ఏమైందిరా, ఉదయమే వచ్చావట” అన్నాను.

"ఏమి లేదు అన్న య్య గారు," శేఖర్ భార్య కమల చెప్పబోతుంటే ,శేఖర్ అరచేతిని అడ్డుగా పెట్టి ఆపాడు. నేను చెపుతాగా అన్నట్లు.

"నువ్వెళ్ళి కాఫీ తీసుకు రా!" అన్నాను.

కమల లోనికి వెళ్ళింది. "పృధ్వి తో మాట్లాడాను రా..... , " శేఖర్ అన్నాడు. (పృథ్వి ,శేఖర్ కొడుకు అమెరికా లో ఉంటాడు).

"దేని గురించి" అన్నాను నేను .

"ఔను, చెప్పావు గుర్తుకు వచ్చింది." అన్నాను.

"మనము డబ్బులు ఇవ్వాల్సిన ఆవిడ కూతురు పెళ్లి రా!. రెండు నెలల నుండి తిరుగుతుందిరా! పాపం అని పించింది, అన్ని చోట్లా ప్రయత్నం చేశానురా! ,ఎక్కడా దొరక లేదు.చివరకు పృథ్వి సర్దుతాడేమో అని అడిగానురా, అన్నాడు.

“ఏమంటాడు”?, ఆసక్తి గా అడిగాను.

"వాడి దగ్గర లేవంట,ఇప్పటికే చాలా ఇచ్చాడంట, ఇంకా ఇవ్వడంట,"

అప్పుడే కమల కాఫీ కప్పులతో వచ్చి, సంభాషణ మధ్యలో, "వాడు అలా అనలేదు అన్నయ్య గారు .'నా దగ్గర లేవు నాన్న గారు' అన్నాడు. ఈయన గారే కన్న కొడుకుని పట్టుకొని 'నీ చదువుకు అంత ఖర్చు పెట్టాను, నిన్ను అమెరికా పంపడానికి 25 లక్షలు ఖర్చు అయింది' అంటే వాడు, 'నేను చాలా ఇచ్చాను నాన్న గారు' అన్నాడు."అంది .

"శేఖర్.... ఏదయితే ఏమిటి, అర్ధము అదే కదా, నేను మా కుటుంబానికి మా నాన్న కు ఎంత చేశాను. "

కమల ......"వాడూ చేస్తాడు లెండి"

“ఇంకెప్పుడు నేను చచ్చి న తర్వాత”

"అవేమి మాటలు అండి..., కల్పించుకోకపోతే ప్రవాహం ఆగేటట్లు లేదు, "సరే శేఖర్. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు?"

" ఈ ఇల్లు అమ్మేద్దామంటున్నాడన్నయ్యా, నేను ఒప్పుకోవడం లేదు, అన్నీ అమ్మేశాడు, ఉన్న ఇల్లు కూడా పోతే చెట్టుకింద ఉండాల్సి వస్తుంది అంది కమల గధ్గద స్వరంతో.

అంటూ కళ్ళు తుడుచుకుని,"రాత్రంతా ఆయన నిద్ర కూడా పోలేదు అన్నయ్య గారు," నేనే , ఆయన బాధ చూడ లేకపోతున్నాను .మీ సలహా తీసుకుందామని ఉదయాన్నే మీ ఇంటికి వచ్చారు," అంది కమల.

ఏమి చెప్పాలి ! కమల వాదన సబబు గానే ఉన్నది,'ఉన్న ఒక్క ఇల్లు పోతే చెట్టు కింద ఉండాలి. ''డబ్బులు కట్టక పోతే శేఖర్ పరువు పోతుంది. 'నాకు ఏం చెప్పాలో బోధ పడ లేదు. మరికొంత గడువు ఆమెను అడగమని, ఈ లోగా ఏదో ఒక పరిష్కారం దొరక్క పోదు అని శేఖర్ తో చెప్పి , కొద్ది సేపు మాట్లాడి ఇంటికి వచ్చాను.

************

" కొడుకు,కొడుకు అను కొంటాము కానీ శేఖర్ ఇన్ని ఇబ్బందులతో ఉంటే ,పృథ్వి డబ్బులు పంపనన్నాడట." అన్నాను నా శ్రీమతి తో.

"అయ్యో పాపం ! కొడుకు అలా చేయటం ఏoటండి. ఏం చేస్తాము,కలి కాలం, పిల్లల కోసము మనము పాకులాడటమే కానీ,..పిల్లలకు తల్లి తం(డు లు పైన అంత (పేమ ఉండటం లేదు." అంది నిష్టూరంగా.

"డబ్బులు సర్దుబాటు చేద్దామంటే మనము అంతంత మాత్రమే కదా" అన్నాను నా శ్రీమతి తో..'

వారం గడచి పోయింది, నా పనిలో పడి పోయాను. ఉదయాన్నే పిడుగు లాంటి వార్త, "రా(తి నిద్రలో నే శేఖర్ చనిపోయాడు"

నేను నా భార్య ఇద్దరమూ శేఖర్ ఇంటికి వెళ్ళాము. శేఖర్ భార్యను కలిశాము. "ఎలా జరిగింది? "అడిగాను నేను.

కమల..... "రా(తి మామూలుగానే భోజనం చేసి పడుకున్నారు , అన్నయ్య గారు, ఉదయాన్నే ఆరు గంటలకు నిద్ర లేస్తారు.ఏడు గంటలు అయిన ,లేవక పోయే సరికి, వెళ్లి లేపుదామని ప్రయత్నించాను...." దుఃఖంతో ఆమె మాట్లాడ లేక పోయింది.

నాకు తెలిసిన దాని ప్రకారం శేఖర్ బాగా వత్తిడికి గురి అయి ఉంటాడు. 'టైంకు డబ్బులు అంద లేదు,కొడుకు పంపలేదు' అని చాలా సార్లు అనుకొన్నాడట. డబ్బులు అప్పు ఇచ్చిన ఆమె గట్టిగా మాట్లాడి వెళ్లిందట. ఆ బాధను భరించలేకపోయి ఉంటాడు అనుకున్నాను. ఏదయితే ఏమి గాని నిజాయితీగా, సున్నితంగా ఉన్న దానికి ఫలితం చావు. శేఖర్ మరణము నన్ను బాగా కుంగ తీసింది. సంవత్సరాల స్నేహం వాడితో.సమయానికి ఆదుకోలేక పోయాను.కళ్ళు మూసినా తెరిచినా వాడే గుర్తుకు వస్తున్నాడు. రెండు రోజుల తరువాత, శేఖర్ కొడుకు అమెరికా నుండి వచ్చాడు. కార్యక్రమాలు అన్ని చక చక జరిగి పోయాయి. నేను కూడా పృథ్వి తో కలసి అన్ని పనులు దగ్గర ఉండి చేయించాను. కానీ ఒక్క విషయం మాత్రం నా మనసును తొలిచి వేస్తుంది . సందేహ నివృత్తి కోసం ఎలాగైనా పృథ్విని అడగాలని అనుకున్నాను. పదకొండవ రోజు శ్రాద్ధ కర్మలు పూర్తి అయ్యేవరకు వేచి ఉండి, పన్నెండో రోజు పృథ్విని అడిగాను.

" పృథ్వి !ఒక చిన్న మాట రా ఏమనుకోవద్దు. " అన్నాను.

“అడగండి మామయ్యా!" అన్నాడుపృథ్వి

"నాన్న అడిగినప్పుడు రెండు లక్షలు పంపించి ఉంటే బాగుండేది కదరా." అన్నాను.

"మామయ్యా , .......కరోనా రాగానే మార్చ్ లోనే మా కంపెనీ మమ్మల్ని అందరి ని ఫైర్ చేసింది. అప్పటి నుండి ఉద్యోగం లేదు మామయ్యా! నాన్నకు అమ్మకు తెలిస్తే బాధ పడతారు అని ఈ విషయం చెప్పలేదు.....నా కోసం ఎంతో చేసిన నాన్న కు, ఏమీ చేయలేక పోయాను, అని ఎప్పుడూ బాధ పడుతుండే వాడిని, ....అమెరికాలో బతకడానికి చిన్న,చిన్న పనులు ఎన్నో చేసే వాడిని, రాత్రుళ్ళు నిద్ర పోకుండా పెట్రోల్ బంకు లో,బార్ ల లో పని చేసి... .... వచ్చిన కొద్ది మొత్తాన్నీ నాన్న కు పంపే వాడిని. తిండి తినడానికి కూడా ఆలోచించే వాడిని.... నాన్న సంతోషంగా ఉండాలి అని, నా బాధలను చెప్పకుండా ,అంతా బాగుంది అని చెప్పేవాడిని, ఉద్యోగం కొరకు చాలా ప్రయత్నాలు చేశాను మామయ్యా!, కానీ... ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు. లేకుంటే నేను ఈ పాటికి సెటిల్ అయి వుండే వాడిని, ఇప్పుడు ఇండియాకు వచ్చేశాను కదా వీసా కూడా లేదు, ఇక అమెరికా కూడా వెళ్లలేను మామయ్యా" అన్నాడు బాధగా.

నాకు గొంతులో నుండి మాటలు రావడము లేదు. "మరి అక్కడే ఉండి ఏదో ఒక జాబ్ వచ్చిన తరువాత వస్తే సరి పోయేది కదరా." అని చిన్నగా అన్నాను.

"నాన్న అంటే నాకు ప్రాణం మామయ్యా!! అందుకే ఇక అక్కడ ఉండలేకపోయాను, నాన్నకంటే నాకు ఏది ముఖ్యం కాదుగా మామయ్య, ఆఖరు చూపులకు కూడా నోచుకోకుంటే ఇక నేను ఉండి ఏం లాభం మామయ్య" అన్నాడు, కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ.

"మరిప్పుడెలారా ...అన్నాను.

"ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసు కుంటాను." మామయ్యా! .ఉన్న అమ్మనైనా జాగ్రత్తగా చూసుకుంటాను" అన్నాడు బాధ నిండిన గొంతుతో.

'అయ్యో! నేనెంత అపార్ధం చేసుకున్నాను? ఎంత పొరపాటు గా ఆలోచించాను! శేఖర్ ....."నీ కొడుకు బంగారం రా! మనమే వాడిని సరిగా అర్ధం చేసుకోలేదు. వయసులో చిన్న వాడయిన ఎంత పెద్ద మనసు వాడిది, వాడి సంస్కారాన్ని చూసి చిన్నవాడైనా వాడికి చేతులెత్తి మొక్కాలనిపించింది. ఇంక ఏమీ మాట్లాడలేకపోయాను. మాటలు రాక, నా గొంతు మూగ బోయింది, నా మనసు బాధను కళ్ళు దాచలేకపోయాయి. అప్రయత్నంగా నా కళ్ళు వర్షించాయి.

*****


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


46 views0 comments
bottom of page