Arudaina Maitri Written By Rajyalakshmi Pottabathini
రచన : పొట్టాబత్తిని రాజ్యలక్ష్మి
ఎనిమిదేళ్ల మున్నాకి రోజూ ఇదో తంతు అయిపోయింది. ఉండుండి తనలో తానే నవ్వుకుంటాడు. లేదంటే చిరాకు పడుతూ అరుస్తాడు. దీంతో మహతి కంగారు పడుతూ... ' బాబుని ఓసారి డాక్టర్ కి చూపిస్తే బావుంటుంది' అని భర్త వేదాంత్ తో చెప్పింది. ఇలా జరగడం మొదటిసారి ఏం కాదు. తరువాతి రోజు అనుకున్నట్లే తెలిసినవాళ్ల రిఫరెన్స్ తో చైల్డ్ సైకియాట్రిస్ట్ స్పెషల్ డా. కైలాష్ మంత్రిని కలిశారు. ఆయన మున్నాని చెకప్ చేసి, "ముందు నేను చెప్పేది కంగారు పడకుండా స్థిమితంగా వినండి. 'ఇజ్ ఎఫెక్టెడ్ విత్ ఏ బైపోలార్ డిసీజ్' అంటే ఈ వ్యాధి ఉన్న పిల్లల మానసిక స్థితి అందరిలోకెల్లా భిన్నంగా ఉంటుంది. తోటి పిల్లలతో ఎక్కువగా కలవలేరు. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుంటారు. అలా అని నయం చేయలేనిది కాదు. బాబు మూడ్ స్వింగ్స్ ని బట్టి మీరు అతనికి సపోర్ట్ గా ఉంటూ సమయానికి మందులు వాడితే దీన్ని మొదటి దశలోనే నయం చెయ్యొచ్చని చెప్తాడు. మున్నా పరిస్థితి విని మనసులో ఆందోళనగా అనిపించినా తరువాత తేరుకొని, మీరు చెప్పినట్లుగానే ఫాలో అవుతాం అంటూ డాక్టర్ దగ్గర సెలవు తీసుకున్నారు. నెక్స్ట్ అపాయింట్మెంట్ గురుంచి రిసెప్షన్ లో కనుక్కుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
***
ఒకరోజు కొన్ని ఆటవస్తువులతో మున్నాని ఇంటి పక్కనున్న కాలనీ పార్క్ కి తీసుకెళ్లారు మహతి, వేదాంత్ లు. కానీ ఆ చోటు తనకి ఎప్పటిలానే నచ్చలేదు. కారణం మున్నా ఎవ్వరితో ఆడుకున్నా కాసేపు బానే ఉండేవాడు. తరువాత ఎవర్నో ఒకరిని కొట్టడమో, తిట్టడమో చేసేవాడు. తన ప్రవర్తనకి భయపడిపోయి మళ్ళీ ఆటలో చేర్చుకునేవాళ్లు కాదు. దీంతో ఇంకాస్త మూడి అయ్యాడు. ఎప్పుడూ తన ప్రపంచంలో తాను అన్నట్లు ఉండేవాడు. దీంతో ఎలాగైనా బాబులో మార్పు తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా ఇంటి వాతావరణాన్ని, వస్తువుల్ని ఇంకోరకంగా మార్చి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
***
ఓరోజు భోరున వర్షం. కురిసిన వానకి దారి తప్పి వచ్చింది ఓ కుక్కపిల్ల. బెదిరిపోయి అదే పనిగా కు..కు.. అని అరుస్తూనే ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మున్నానే వెళ్లి దాన్ని మెల్లిగా చేతుల్లోకి తీసుకొని తన గదికి వచ్చాడు. అదేమో భయంతో, వాననీటికి బిక్కచచ్చిపోయి ఉంది. ఏం చేయాలో తెలియలేదు. దాన్ని కిందకి దింపి దూరంగా ఉంచాడు. కానీ మళ్లీ మళ్లీ మున్నా కాళ్ల దగ్గరకే వచ్చి ఆగింది. ఇలా చాలాసార్లు జరగడంతో దాన్ని దగ్గరికి తీసుకున్నాడు. అలా మున్నాకి తను, తనకి మున్నా కాసేపట్లోనే అలవాటైపోయారు. కుక్కపిల్లని కిందకి వదలి గదంతా తిరిగాడు. అది కూడా మున్నా ఎటువెళ్తే అటు అదేపనిగా కాళ్ల చుట్టూనే అరుస్తూ, తిరగడంతో సంతోషంగా అనిపించింది. మొదటిసారి తనతో ఆడుకోవడానికి ఒక మంచి స్నేహం దొరికిందని ఎంతో ఆనందిస్తాడు.
ఈసారి రెండో అపాయింట్మెంట్ కి మహతి, వేదాంత్ లతో పాటు, మున్నా తన స్నేహితుడ్ని కూడా ఒక బుట్టలో వేసుకొని తీసుకువెళ్లాడు. దానికో టోపీ, వెచ్చగా ఉండటానికంటూ కోటు సొంతంగా తనే తయారుచేసి తొడిగాడు. డాక్టర్ తో "అంకుల్, ఇజ్ మై న్యూ ఫ్రెండ్ మాక్స్" అని పరిచయం చేశాడు. అదేమో షేక్ హ్యాండ్ ఇవ్వడానికంటూ దాని ముందు కాలుని ఇవ్వబోయింది. ఈసారి ఆశ్చర్యపోవడం డాక్టర్ వంతైంది.
" కొన్నిరోజుల క్రితం మున్నా ప్రవర్తన మాములుగా ఉండటం గమనించాం డాక్టర్. తనకంటూ ఫ్రెండ్స్ లేకపోవడంతో గది నుంచి బయటకి రావడానికే ఇష్టపడేవాడు కాదు. మందులు వేసుకోమన్నా అయిష్టంగా విసిరేసేవాడు. అలాంటిది ఈ మాక్స్ వల్ల పార్క్ కు రోజూ తీసుకెళ్లమని ఆడిగేవాడు. అక్కడ ఉన్న పిల్లలంతా ఒకప్పుడు మున్నాని దూరంగా పెట్టారు. కానీ ఈసారి అలా జరగలేదు. మున్నాతో ఉన్న కుక్కపిల్లని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ మాక్స్ కి ఒక కాలు సరిగ్గా పనిచేయదు. అయినా కూడా మున్నా ఎలా చేస్తే అలా చేస్తుంది. ఎలా ఆడితే అలా ఆడుతుంది. ఇది చూసి పిల్లలందరూ వీళ్లిద్దరి దగ్గరికి వచ్చారు.
'గ్రేట్... మున్నా! నీతో ఉన్న ఈ కుక్కపిల్ల నువ్ ఎలా చెప్తే అలా వింటుంది. పైగా కాలు బాలేకున్నా భలే జంప్ చేస్తుంది' అంటూ మెచ్చుకున్నారు. 'ఇకమీదట మనం ఫ్రెండ్స్ అవుదాం. రోజు ఇలానే ఆడుకుందా'మంటూ తనని రిక్వెస్ట్ చేశారు. మున్నాని ఆడుకోనివ్వలేదని ఇన్నిరోజులు బాధపడ్డాడు. కానీ అదే ఫ్రెండ్స్ ఆడుకుందామనేసరికి ఒప్పుకున్నాడు. నిజానికి ఫ్రెండ్షిప్ చెయ్యడానికి వయస్సు, స్థాయిలతో పనిలేదు. మనసులోని భావాల్ని అర్ధం చేసుకుంటే చాలు. అలాంటివాళ్ళు అరుదుగా దొరుకుతారు. మున్నా విషయంలో మాక్స్ లాగా.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం :
మనతెలుగు కథలు సంపాదకీయ వర్గానికి ముందుగా ధన్యవాదాలు. నా పూర్తి పేరు పొట్టబత్తిని రాజ్యలక్ష్మి, నేనొక ప్రైవేట్ ఉద్యోగిని, రచనల మీద అభిలాషతో కథలు, కవితలు, వ్యాసాలు రాయడం నా అలవాటు.
留言