అసలుకే మోసం

'Asaluke Mosam' written by Kalamraju Venugopal
రచన : కాళంరాజు వేణుగోపాల్
"అమ్మాయి కావ్యా! ఏమి చేస్తున్నావు? " అంటూ ప్రేమగా పిలిచింది విజయమ్మ...
"చెప్పండి ఆంటీ ! " అని హాల్లోకి వచ్చింది వేసుకుంటున్న జడను ఒక పక్కకు పట్టుకొని..
"బాబు ఇంట్లో లేడామ్మా.." అని అడిగింది ఇల్లు పరికించి చూస్తూ...
"ఉన్నారు ఆంటీ లోపల స్నానం చేస్తున్నారు...." అని అన్నది ఎందుకా అని అనుమానంగా
చూస్తూ...
"ఏమి లేదు ఒక ఐదు వేలు ఉంటే ఇస్తాడని...." ఆశగా అంది విజయమ్మ.....
'నన్ను అడగకుండా ఆయనను అడుగుతుంది' అని కాబోలు ఉక్రోషంతో... "ఏమో ఆంటీ
నెలాఖరు కదా చెప్పలేను ఆయన దగ్గర కూడా ఉంటాయో ఉండవో" అని అనుమానం తో
చెప్పినట్లుగా లేవని చెప్పింది..
"ఉండండి ఆంటీ... అర్జెంటా... సాయంత్రం అయినా పరవాలేదా" అని అడుగుతాడు
అప్పుడే బయటకు వచ్చిన రాజేష్.
"రేపు ఉదయం అయినా పరువాలేదు బాబు... అంకుల్ రేపు మధ్యాహ్నం బండికి
వెళ్ళాలి... అమ్మాయికి నెలలు నిండాయి కదా కాన్పుకి తీసుకు రావాల్సి ఉంటుంది అందుకు..."
అని ఉన్న విషయం చెప్పింది.
"అయితే నేను సాయంత్రానికి తెచ్చిస్తాను లే ఆంటీ ..." అని అంటాడు రాజేష్.
"మర్చిపోకు బాబు ... ఆయన ఇబ్బంది పడుతారు... రేపు నెలలో డబ్బులు రాగానే మొత్తం
ఇచ్చేస్తాను.." అని చెప్పి వెళ్ళింది..
**********************************************************
"మీకేమైనా పిచ్చా ఇప్పటికే ఇరవై వేలకు పైగా ఇచ్చారు.... ఆయనదా అంతంత మాత్రం
ఉద్యోగం, ఇవ్వలేక పొతే ఇబ్బంది" అని అంటుంది కావ్య.
"వాళ్ళ గురించి మనకు తెలుసు కదా , మంచివారు అన్నిటిలో మనకు సహాయం
చేస్తుంటారు.. ఎప్పుడో ఒకసారి డబ్బులు అడిగితే ఇవ్వక పొతే ఏమి బాగుంటుంది చెప్పు"
అంటాడు రాజేష్.
"ఏమోలే బాబు చెబితే నీకర్థం కాదు..." అని నిష్టూరుస్తూ పిల్లలకు , ఆయనకు టిఫిన్
బాక్సులు సర్దడంలో నిమగ్నమైనది కావ్య.
**************************
రాజేష్ అటు వెళ్ళగానే పక్కింటి పంకజం కావ్య దగ్గరకు వచ్చింది..
ఉదయం విజయమ్మ గారు వచ్చారుగా విషయం తెలుసుకుందామని వచ్చింది..
"ఏమే కోడలు పిల్లా ఏమి చేస్తున్నావు..." అంటూ వరుస కలుపుకుంటూ...
"ఏమీ లేదు ఆంటీ... ఇప్పుడే వంట అయిపోయింది.. బట్టలు చాకలికి వేస్తున్నాను"
అంటూ హాల్లోకి వచ్చి విజయమ్మను సోఫాలో కూర్చోమని, తనూ కూర్చుంది.
వేడి వేడిగా కాఫీ తాగుతారా అని అడిగింది..
"వద్దులేరా ఇప్పుడే ఫ్రూట్ జ్యూస్ తాగి వచ్చాను.."అని చెబుతుంది గర్వంగా...
" అది సరే అమ్మాయీ ! మీరు స్థలం కొనాలని చూస్తున్నారుగా ఎంత వరకు వచ్చింది సెర్చింగ్?" అని అడుగుతుంది..
"చూస్తున్నామాంటీ.... ఒక పది చేతిలో ఉన్నాయి.... ఇంకో పదహైదు లోన్ తెచ్చి కొంచెం
మంచి స్థలం తీసుకొని పై ఏడు కట్టాలని ఆలోచన ఉంది.."అని అంటుంది..
మెల్లిగా ఆరా తీస్తూ..."పొద్దునే ఆ విజయమ్మ ఇలా తగలడిందేమి?" అని అడుగుతుంది...
"ఏముంది ఆంటీ డబ్బుల కోసం ... "
"ఎంత కావాలంటేమిటి.... ఎంతిచ్చినా ఆశ చావదు..అ మహానుభావురాలికి" అని అంటుంది..
"మొత్తం ఇరవై వేలు ఇచ్చారాంటీ.... "
"అబ్బో ఇరవై వేలా.. ఎన్ని నెలలు అయిందేమిటీ" అని అడుగుతుంది పంకజం...
"దాదాపు ఆరు నెలలు అయిపొయింది ఆంటీ... " "అబ్బో పది వేల వరకు వడ్డీ లాస్ మీకు..."అని అంటుంది కావ్య వైపు ఓరగా చూస్తూ..
"అదేంటి ఆంటీ ఇరవై వేలకు , ఆరు నెలలకు పది వేలు వడ్డీ ఎవరు ఇస్తారాంటీ..."అని
అడుగుతుంది అనుమానంగా... ఒకింత ఆశగా...
"ఎందుకివ్వరమ్మా మీ అంకుల్ చేసే వ్యాపారం అదే కదా.." అని ఆశ పెడుతుంది.
"నీకు లోకం పోకడ తెలిసినట్లు లేదు అమ్మాయి... బయట వడ్డీ వ్యాపారం ఎలా నడుస్తుందో
తెలిస్తే గుండె ఆగిపోతుంది నీకు... "
అర్థమయింది తనకు, ఎప్పుడూ పట్టు చీర కట్టుకని, మంచి మంచి నగలు పెట్టుకొని దర్జాగా
ఎలా ఉంటుందో అర్థం అయింది కావ్యకు.
పంకజం వాళ్ళు ఇక్కడికొచ్చి ఒక సంవత్సరం అయింది...
విజయమ్మ వాళ్ళు గత ఆరు సంవత్సరాలనుండి పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి
బాగా తెలుసు.
విజయమ్మ భర్త ఏదో ప్రైవేటు కంపెనీలో చేస్తున్నారు. ఎదుగూ బొదుగూ లేని సంసారం.
పైగా పెద్ద కూతురికి పెళ్లి చేసి అప్పులు ,ఈ లోపే మళ్ళీ కాన్పు.. బయట తెస్తే వడ్డీ ఇవ్వాల్సి
వస్తుందని అపుడప్పుడు చేబదులు కింద కొంత మొత్తం తీసుకుంటూ ఉంటాడు... మళ్ళీ
డబ్బులు రాగానే జాగ్రత్తగా తెచ్చి ఇస్తుంటాడు.
**************************************
సాయంత్రం భోజనాల వేళ అన్నంలో కూర వండిస్తూ "ఏమండీ... మీరు ఏమీ అనుకోరుగా
నేను ఒకటి చెబుతాను.. "
"ఏంటి "అని చూసాడు ప్రశ్నార్ధకంగా....
"మన పక్కింటి పంకజం ఆంటి, మన ఇరవై వేలకు సంవత్సరానికి మళ్ళీ ఇరవై వేలు కలిపి
నలబై వేల వేలు ఇస్తుందట తెలుసా" అని కళ్ళు ఇంత చేసుకొని ఆశ్చర్యం నటిస్తూ
చెబుతుంది.
"అంత వడ్డీ ఇచ్చేదెవరే పిచ్చి ముఖమా" అని విసుక్కుంటాడు...
"ఎవరో ఒకరు కానీ ... నాకు ఇది చెప్పు... మనకు బ్యాంకు లో ఎంత వడ్డీ వస్తుంది...
అనవసరంగా పక్కింటి వాళ్లకు, బ్యాంకు వానికి తక్కువ వడ్డీ కి మనం ఎందుకు లాస్ కావాలి
చెప్పండి" అంటుంది.
"మన పక్కింటి పంకజం ఆంటీ ఈ రోజు ఉదయం వచ్చింది.. వాళ్ళు అయితే ఎక్కువ
వడ్డీకి మన దగ్గర తీసుకొని ఇంకా ఎక్కువ వడ్డీ కి బయట వారికి ఇస్తారంటా. మనకు మన
లాభం వారికి వారి లాభం. బ్యాంక్ లో ఉంటే వృధా కదండీ..." అని గొప్ప సలహా ఇచ్చినట్లు ఫోజ్
కొడుతుంది...
"ఆలోచన మంచిదే కానీ , ఎక్కువ ఆశ పడితే ఉన్నది పోతే కష్టం కదా , అత్యాశకు పోతే
ఎప్పటికీ మంచిది కాదు అన్న సంగతి తెలుసు కదా" అంటాడు సావదానంగా
ఆలోచిస్తూ...పెళ్ళాం మాటను మొదలే వద్దనకుండా....
"ఏమండీ అలా మాట్లాడకండీ.. అవకాశం పోతే రాదు... మొదట ఒక లక్ష రూపాయలు
పెడదాము. సంవత్సరం తిరిగే సరికి రెండు లక్షలు వస్తాయి కదా" అంది కావ్య
"కానీ మొత్తం పది లక్షలు ఇస్తే ఒకేసారి ఇరవై లక్షలు వస్తాయి కదా" అని ఆశగా అంటాడు రాజేష్.
"అబ్బా నిజం కదండీ బ్యాంకు లోన్ కూడా అవసరం ఉండదు..." అని ఎగిరి గంతేస్తుంది..
కావ్య...
"రేపు వెళ్లి మాట్లాడదాం" అని చెప్పి పడుకున్నారు...
కానీ కావ్య కు నెలకు ఎంత వడ్డీ, సంవత్సరానికి ఎంత వడ్డీ అని లెక్క లేసుకోవడమే
సరిపోయింది.. ఈలోపు తెల్లారింది..
తెల్లారే టప్పటికీ పంకజం కావ్య తో మాట్లాడుతూ ఉంది.
వేడి వేడి టీ తాగుతూ కొద్దిసేపు రాజేష్ కూడా మాట్లాడాడు.
"అంకుల్ తో కూడా మాట్లాడు" అని అతడిని కూడా పిలిచి మాట్లాడిస్తుంది.
తనకున్న అనుమానాలు అన్నీ అడుగుతాడు...
సంతోషంగా కావ్య వైపు చూస్తూ, "ఎల్లుండి అమావాస్య వెళ్ళగానే బ్యాంకుకు వెళ్లి పది
లక్షలు డ్రా చేసుకొని వచ్చి ఇస్తాను ఆంటీ "అంటాడు...
**********************
మూడు రోజుల నుండి రాజేష్ తో మాట్లాడడానికి అవకాశం కూడా దొరకడం లేదు కావ్యకు...
చాలా బిజీగా తిరుగుతున్నాడు... ఈ రోజు అగ్రిమెంట్ రాసుకునే తేదీ వచ్చింది.. ఒక్కరోజు
ఆలస్యమైనా వందల్లో వడ్డీ లాస్ , అందులో మధ్యాహ్నం 12 లోపు తెస్తేనే ఆ రోజు వడ్డీ అని
ఖచ్చితంగా చెప్పారు పంకజం దంపతులు. అందుకని రాజేష్ ని హడావిడి చేస్తుంది..
ఈ లోపు ఇంటి ముందర ఏదో అల్లరి.. ఏమైందా అని బయటకు వెళ్లి చూడబోతుంటే
"పోలీసులు వచ్చారేమో" అని అంటాడు రాజేష్...
బయటకు వెళ్లి చూసిన కావ్య ఆశ్చర్యపోతూ వస్తుంది.. "మీకెలా తెలుసండీ పోలీసులు
వస్తారని.. "అని అడుగుతుంది..
"ఓసి పిచ్చిముఖమా అంత వడ్డీ ఇవ్వడానికి, పది రూపాయల వడ్డీ కి తీసుకు పోవడానికి
వాళ్ళేమైనా పిచ్చి ముఖాలా....
మొన్న డబ్బు ఉందని నీవు చెప్పావుగా , వాళ్ళు డ్రామా మొదలెట్టారు... నేను కూడా వాళ్ళ
సంగతి చూద్దామని డ్రామా మొదలెట్టాను.అంత డబ్బు ఎవరైనా ఇస్తారా అని అడిగితే వారికి
ఇచ్చిన వారి పేర్లు చెప్పారు..
మరి అంత పెద్ద వడ్డీ తో తీసుకునేది ఎవరా అని అడిగితే ఏదో నాలుగైదు పేర్లు చెప్పారు...
నాకు అనుమానం వచ్చి వాళ్ళను కలిసాను... వాళ్ళు అంతా తాగుబోతులు , పేకాట
రాయుళ్ళు... వాళ్లకు ఇచ్చింది వేలల్లోనే... వాళ్ళు తీసుకున్నది లక్షల్లో.... ఇలా వాళ్ళ పేర్లు
వీళ్ళ పేర్లు చెప్పి అధిక వడ్డీ ఆశ చూపి మన లాంటి వాళ్ళ దగ్గర లక్షలకు లక్షలకు వసూలు
చేసుకొని ఉడాయిస్తారు. ఇదంతా నిన్నా మొన్నా ఎంక్వైరీ చేసుకొని ఇచ్చిన వారికి వివరంగా
చెప్పి వారిచేత వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను..
ఎక్కువగా ఆశ పడకుండా బ్యాంకు వాళ్ళు ఇచ్చే రూపాయి వడ్డీ వస్తే మన జీవితాలకు
వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.. "అని అంటాడు ప్రేమగా...
'హమ్మయ్య ఎంత గండం గడిచిపోయింది. అనవసరంగా ఆశపడ్డాను' అని
భయపడుతుంది... కావ్య మొగుడ్ని గట్టిగా హత్తుకుంటూ...
ఈ లోపు విజయమ్మ ఆంటీ వచ్చి "జీతం పడింది బాబు ఏదో అలవెన్సు డబ్బులు కూడా
వచ్చాయంటా మొత్తం డబ్బు తీసుకోండి" అని ఇస్తుంది....
******************************************************
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి