top of page

అతడు గెలిచాడు


Athadu Gelichadu written by B. Narsan

రచన : B . నర్సన్

ఒక్కోసారి మనిషి తాను సాధించిన దానికీ, ఆ సాధనా క్రమంలో కోల్పోయిన దానికీ సయోధ్య కుదురదు. తాను ఓడిపోయానా, గెలిచానా అనే సందిగ్ధంలో పడతాడు. దిగాలుగా బయటికొచ్చి హాస్పిటల్ గేటు దగ్గర ఆగిపోయిన కవి భాస్కర్, సరిగ్గా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కొన్ని రోజులుగా ఆయనకు దగ్గుతున్నప్పుడు తెమడలో రక్తపుజీరలు కనబడుతున్నా ఎవరికీ చెప్పలేని స్థితి. తన కవిత్వాన్ని ఇష్టపడే ఒకాయన సిఫారసుతో డాక్టర్ ను కలిశాడు. 'ఇది క్షయ వ్యాధి. లంగ్స్ కి టిబి ఎఫెక్ట్ అయింది. ఇదిగో చూడు' అంటూ డాక్టర్ ఎక్స్ రే లో తెల్లగా కనిపిస్తున్న గుండాలను భాస్కర్ కు చూయిస్తూ.' 'ఊపిరితిత్తులకు రంధ్రాలు పడ్డాయి. ఆర్నెల్ల పాటు రెగ్యులర్ గా మందులు వాడుతూ బలమైన ఫుడ్, రెస్ట్ తీసుకోవాలి. పాలు, గుడ్లు తీసుకుంటూ మందులు వాడాలి. లేకుంటే కష్టం' అన్నాడు.

ఆ మాటకు భయం మొదటిసారిగా గడప దాటి ఆయన మనసులో తిష్టవేసింది. ఇప్పటికే ఇంట్లో ఉన్న కష్టాలు సరిపోవన్నట్లు ఈ విషయం తెలిస్తే భార్య పార్వతి గుండెలు బాదుకుంటుంది.. భార్య గుర్తుకురాగానే వచ్చేప్పుడు కిలో బియ్యం తీసుకురమ్మని ఆమె చెప్పిన మాట గుర్తుకొచ్చింది. జేబులో చూస్తే అంతా కలిసి వంద రూపాయలుండొచ్చు. ఏడ్పును అసహ్యించుకునే ఆయన కళ్ళు, చెంపల్ని తడిపేస్తున్నాయి. కష్టాలతో కలగలిసి బతకడానికి వెరవని ఆయన, వ్యాధి పేరు వినగానే చలించిపోయాడు. ఎన్నడూ లేనిది తన బ్రతుకుపై ఆలోచన మొదలైంది. మొట్టమొదటిసారిగా ఆయనకు సొంత ఊరిని వదిలి నగరానికి రావడం పొరపాటైందని అనిపిస్తోంది. సొంతూరు వేములవాడలో హాయిగా సాగే బతుకు, పాకుడు రాళ్ల హైదరాబాదుకొచ్చి ఐదేళ్లవుతోంది. నాలుగు పదులైన నిండని జీవితం చేయి దాటి పోతున్నట్లనిపిస్తున్న సమయాన గతం గుర్తుకొచ్చి ఆయన్ని మరింత మెలిపెడుతోంది.

భాస్కర్ టెన్త్ పాస్ కాగానే, ఆయన బావ ఇంటర్ మ్యాథ్స్ లో చేర్పించాడు. రెండేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో ఇంటి నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నాడు. తల్లికి వచ్చే తండ్రి ఉద్యోగం బాపతు పింఛనుతో, ఇల్లు గడుస్తోంది. భాస్కర్ కు లెక్కలంటే పీడ కలంత భయం. నావల్ల కాదని మొత్తుకున్నా. మ్యాథ్స్ చదివితే ఉద్యోగం గ్యారెంటీ, ట్యూషన్లు చెప్పుకోనైనా బతకచ్చు. క్లాసులకెళుతుంటే అదే అర్థమైతదని ఆయన భాస్కర్ మాట గెలువనీయలేదు. లెక్కలు అర్థం కాలేదు గాని ఆయనకు క్లాసులు డుమ్మాకొట్టడం అలవాటై పోయింది. ఆ రెండేండ్లు భాస్కర్ కు ఎడారిలో ఒంటరిగా తిరుతున్నట్లు గడిచింది.. లెక్కలు లెక్క తప్పి, చదువు బొక్క బోర్లా పడి, ముందుకు సాగనని మొరాయించింది. వేరే కోర్సు ప్రైవేటుగా రాయొచ్చని మిత్రులు చెప్పినా, బావను అడిగే ధైర్యం లేక ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇలా అలా బతకాలని పెద్దగా ఊహలేవీ లేని భాస్కర్, ఆగిన చదువును అక్కడే వదిలేశాడు. పని పాటు లేక తిరుతున్నాడని, ఆయన తల్లి, అక్క వెంట పడడంతో భాస్కర్ బావ, బ్యాంకు లోను తీసి ఆయనతో జెరాక్స్ కాపీల దుకాణం తెరిపించాడు. రోజూ వచ్చిన డబ్బుల్లో తన ఖర్చులకు కొంత తీసుకోని మిగితాది తల్లికి ఇచ్చేసేవాడు. జేబులో గలగలతో పదో తరగతిలో చాటుమాటుగా తాగిన సిగరెట్ పొగ దుకాణంలోకొచ్చింది. ఇంట్లో బాత్ రూమ్ లో మొదలై బెడ్ రూమ్ లోకి వచ్చింది. పొగ వాసనను పసిగట్టిన తల్లి మందలించినా నాకేం తెలుసని భాస్కర్ బుకాయించి, మాట దాటవేసేవాడు తప్ప అలవాటు మానలేదు. పొగ తాగడంలో అంత తప్పేముందనే భావన కూడా ఆయనకు కలిగేది.

చదువుపై ఆశలు వదులుకున్నా, ఖాళీగా ఉన్నప్పుడు జెరాక్స్ కోసం వచ్చిన పుస్తకాలు తిరిగేయడం ఆయనకు అలవాటైంది. ఊర్లో ఉన్న సాహితి సమితి నిర్వహించే పోటీలకు వచ్చిన కవితలను, జెరాక్స్ చేయించేవారు. వాటిని చదవడంతో భాస్కర్ కు కవిత్వంపై ఇష్టం ఏర్పడి సమితి వారి దగ్గర పుస్తకాలు తీసుకొని చదివేవాడు. అలా అభిరుచిగా దగ్గరైన కవిత్వం చదివిన కొద్దీ ఆయనకు తెలియకుండానే ఆయనను ఆవహించింది. తనలోనూ ఏవో ఆలోచనలు గూడు కట్టుకోవడం, వాటిని కాగితంపై పెట్టేదాకా మనసు తేలిక కాకపోవడం మొదలైంది. దుకాణంలో ఖాళీ సమయాల్లో, ఇంట్లో నడిరాత్రి దాకా అదే ధ్యాస, ఒకటే సాధన. రాయడం, నచ్చక చించేయడం. కొన్ని నెలలు ఇలాగే గడిచాయి. ఆ తరవాత పదుల్లో, ఒకటో రెండో కవితలు బాగనిపిస్తే దాచుకోవడం. సమితి మిత్రులకు చూయించడానికి బెరుకు. వాటిని చూసి నవ్వుతారనో, అసలు కవిత్వమే కాదంటారనో మొహమాటం.

ఇలా ఊగిసలాటలో ఉండగా, ఓ రోజు సాహితి సమితి కవితల పోటీ వార్త పేపర్లో వచ్చింది. ఇలాగైనా తన కవితల్ని వారి దృష్టికి తేవచ్చని, లోకల్ పోస్టు ద్వారా పోటీకి పంపాడు. నాల్రోజులు గడిచాక సాహితి సమితి నడిపేవారిలో ఒకడైన నరేష్, దుకాణంలోకి వస్తూనే - 'భాస్కర్ నువ్వు కవిత్వం రాస్తావా.. ఎప్పుడూ చెప్పనేలేదు.. చాలా బాగా రాశావ్..నీ కవితకు ప్రైజ్ కూడా వస్తుంది. వచ్చే సంపుటిలో కూడా వేస్తాం.' అన్నాడు. భాస్కర్ ఆనందం అంబరమైంది. సాహిత్యంపై అవగాహన ఉన్ననరేష్ తాను రాసింది కవిత్వమే అని నిర్ధారించడంతో, భాస్కర్ భయం, మొహమాటం తొలిగిపోయాయి


'రమేష్! కొద్దిసేపు కూర్చో.." అని వేళ్ళ మధ్యన ఉన్న సిగరెట్ విసిరేసి, అవతలి వైపు ఉన్న టీ కొట్టు మల్లేశం కు, రెండు టీలు తెమ్మన్నట్లు చేతి వేళ్ళు చూపి, ఆయన పక్కకొచ్చి కూచొని 'రమేష్.. 'నేను రాసిన కవితలు ఇంకా ఉన్నాయి..ఓసారి చదువుతావా!' అన్నాడు. 'సరే..దాందేముంది ..చూయించు' అన్నాడు నరేష్ ఆసక్తిగా.

ఒక్కో కవితను పరీక్షగా చదువుతున్న నరేష్ ముఖకవళికల్నిభాస్కర్ శ్రద్ధగా గమనించసాగాడు.

సుమారు ముప్పై కవితల్లో నరేష్ ముఖంలో సంతృప్తిని కనబరచిన నాలుగు కవితలను భాస్కర్ గుర్తుపెట్టుకున్నాడు.

'పర్వాలేదు..కొన్ని బాగున్నాయి..నేను పత్రికల అడ్రసులిస్తాను. పంపించు. ప్రింటయితే నలుగురు చదువుతారు, నీకు పేరొస్తుంది..' అని నరేష్ కవితల కట్టను భాస్కర్ చేతిలో పెట్టాడు.

భాస్కర్ పొద్దుటే పోస్టాఫీసుకు వెళ్లి, పది పోస్టల్ కవర్లు తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకున్నాడు. దినమంతా నరేష్ కోసం ఎదురుచూడగా ఆయన సాయంత్రం వచ్చాడు. చేతిలోని సిగరెట్ ఆఖరి దమ్ము గట్టిగా లాగి, రెండు టీలు అన్నట్లు హోటల్ వైపు వేళ్ళు ఊపి భాస్కర్ లోపలికొచ్చాడు.

ఓ కాగితం భాస్కర్ చేతిలో పెడుతూ నరేష్- 'ఈ నాలుగు పత్రికలకు ముందు పంపించు. వేయకపోతే తిప్పి పంపటానికి నీ అడ్రస్ ఉన్న కవర్ లోపల పెట్టు.'అని కూర్చున్నాడు.

ఆయన పక్కన కూచుంటూ భాస్కర్ -'ఈ నాలుగు కవితలు దేనికి పంపితే బాగుంటుంది' అని కవితలు నరేష్ చేతిలో పెట్టాడు.

'నాలుగు ఒకటే పత్రికకు పంపుదాం, నచ్చినవి వేసుకుంటారు' అన్న నరేష్ 'ఇంకా ఉండాలి కదా!' అన్నాడు భాస్కర్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ.

'చింపేశాను' అన్నాడు భాస్కర్ నేల చూపులు చూస్తూ.

'అరే.. అట్లెందుకు చేసినావు ..పత్రికలకు పంపేవాళ్ళం కదా!' అన్నాడు నరేష్ ఏమి అర్థం కాక.

'వద్దు..వేసినా వేయకున్నా మంచివే పంపుదాం'

‘పంపితే తప్పేమి?'

'వద్దు..వద్దు' అన్నాడు భాస్కర్ తల అడ్డంగా ఊపుతూ.

కస్టమర్లు వచ్చినప్పుడు తప్ప, పగలు షాపులో భాస్కర్ ధ్యాసంతా కవితల పైనే. రాత్రి పడుకునే గదంతా భాస్కర్ విడిచిన సిగరెట్ పొగతో, ఆయన బుర్రలో తిరిగే కవితల సుడులతో వేడెక్కేది.

భాస్కర్ కవితల కోసం రోజూ సాయంత్రం వీలు చూసుకొని రావడం నరేష్ కు దినచర్యగా మారింది. కవితల్ని చదివేప్పుడు ఆయన హావభావాలే తొలి ఎడిటింగ్ గా భాస్కర్ భావించినా, ఆ విషయం నరేష్ కు ఎప్పుడూ చెప్పలేదు. అలా ఎంచుకున్న కవితల్నిమర్నాడు పత్రికలకు పంపేవాడు.

ఓ రోజు తన అడ్రసున్న కవరు పోస్టు మాన్ భాస్కర్ చేతిలో పెట్టి వెళ్ళాడు. చించి చూస్తే కవితలపై 'ప్రచురణకు స్వీకరించలేమని' రబ్బరు స్టాంపు వేసి ఉంది.

సాయంత్రం నరేష్ రాగానే చాలా నిరాశగా కవరు ఆయన చేతిలో పెట్టాడు.

'మొదటి ప్రయత్నం ఇలాగే ఉంటుంది. ఈ తిప్పలు మహామహులకే తప్పలేదు. దిగాలు పడకు. పత్రికలు వేశాయా లేదా అనేది పక్కన పెట్టి, నీవు రాస్తూనే వుండు.' అని ధైర్యం చెప్పాడు.

రెండో రోజు, మూడో రోజు ఇలా రోజూ ఓ కవర్ భాస్కర్ ను వెతుక్కుంటూ వెనక్కి వచ్చేస్తున్నాయి. లెక్క చూస్తే పంపినవన్నీ వచ్చేసినట్లే అనిపించిందాయనకు.

భాస్కర్ ను ఊరడించడం, ధైర్యం చెప్పడం నరేష్ పనైంది.

ఇంకెలా రాయాలి, ఏమి రాయాలి,తప్పెక్కడుంది, అనే దారి దొరకని మనోమథనంలో, సిగరెట్ల, టీల బిల్లు మాత్రం పెరిగింది.

తాను రాస్తున్న వాటిని, పత్రికల్లో వస్తున్న కవిత్వాన్ని పోల్చుకొని, లోపమెక్కడుంది అని తెగ విశ్లేషణ చేసేవాడు.

అయితే ఇంత నిరాశలోను, తాను రాయడం మాత్రం ఆపలేదు. నరేష్ చదివి, సరిదిద్ది, ప్రోత్సహించడం మానలేదు. పత్రికలకు పంపడమూ ఆగలేదు.

ఏ కవిత, ఏ కవర్లో, ఏ రోజు, ఏ పత్రికకు, పంపిందీ అనే వివరాలు, భాస్కర్ కవితల వారిగా పుస్తకంలో రాసుకుంటున్నాడు. అప్పుడప్పుడు దాన్ని తిరిగేస్తూ వాపసు వచ్చిన వాటికి గుండం పెడుతున్నాడు. ఓసారి ఆ వరుసను గమనిస్తే రెండు నెల్ల క్రితం పంపిన మూడు కవితలు ఇంకా వాపసు రానట్టు తేలింది. అయినా వేస్తారన్న విశ్వాసం భాస్కర్ కు కలగలేదు.

ఎప్పుడూ సాయంత్రాలు వచ్చే నరేష్, ఓ రోజు పొద్దున్నే వచ్చి ' భాస్కర్! నీ కవిత నవజ్యోతి పత్రికలో అచ్చయింది. యూ ఆర్ గ్రేట్ ..మొత్తానికి సాధించావు. చాలా సంతోషంగా ఉంది.' అంటూ భాస్కర్ ను గట్టిగా వాటేసుకున్నాడు. పత్రికలో కవితను తన కళ్ళతో చూసేదాక భాస్కర్ కు నమ్మకమే కలుగలేదు. ఇద్దరిలో సంతృప్తి, ఆనందం పోటీ పడినట్లున్నాయి. టీతో పాటు బిస్కెట్లూ వచ్చాయి. ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలిసినవారి అభినందనలతో ఆ దినం క్షణంలా గడిచిపోయింది.


మరో కవిత రావడానికి కొంత సమయం పట్టినా, మెల్లమెల్లగా తిరుగు టపాలు తగ్గుతున్నాయి. వారంలో ఏదో పత్రికలో భాస్కర్ పేరు కనబడుతోంది. విచిత్రమేమిటంటే మొదట్లో వాపసు వచ్చిన కవితలను మళ్ళి పంపినా అవే పత్రికలు వేసుకొంటున్నాయి. భాస్కర్ రాసేవి చురకల్లా ఉండే మినీకవితలు కాబట్టి, పండుగల ప్రత్యేక సంచికలో ఐదారు వేసేవారు. ఏడాదిలో భాస్కర్ అనే కవి ఒకడున్నాడు అనే గుర్తింపు వచ్చింది.

దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేశాక విద్యార్ధి, యువజన సంఘాలు క్రియాశీలమయ్యాయి. కవిత్వంలో విప్లవపదజాలం పెరిగింది. స్వతహాగా కష్టజీవికి బాసటగా నిలిచిన భాస్కర్ పై, శ్రామిక ఉద్యమాల ప్రభావం గాఢంగానే పడింది. భూస్వామ్య, ధనస్వామ్య వ్యవస్థను నిలదీస్తూ తెగేసి రాసేవాడు. సరళంగా, సూటిగా వుండే ఆయన పొట్టి కవితలు యువతను ఆకర్షించేవి. భాస్కర్ కవితలు నినాదాలుగా ఊరి గోడలపై కనబడేవి. ఇప్పుడు భాస్కర్ అంటే ప్రౌడ్ ఆఫ్ టౌన్,స్టేట్ ఫిగర్.

నరేష్ తో సహా ఆయన బ్యాచ్ వాళ్ళు చదువులు పూర్తి చేసి దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయారు. యువతకు, యూనివర్సిటీల్లో చదివేవాళ్ళు సెలవుల్లో ఇంటికొచ్చినపుడు భాస్కర్ షాపుయే అడ్డా. అందరు కలగలిసి 'ఇన్ని కవితలు రాసినావు, పుస్తకమెప్పుడేస్తావు' అనే ఒత్తిడి ఆయనపై మొదలెట్టారు.

పుస్తకమంటే మాటలా..వేలతో పని. తనది తనకు సరిపోయే సంపాదనే. డబ్బు మిగిలినా కూడబెట్టే తెలివి, ఆలోచన ఆయనకు లేదు, రాదు. అయినా భాస్కర్ కు పుస్తకంపై మనసు పడింది. ఓ రోజు రాత్రి భోజనం చేస్తూ తల్లితో తన మనసులోని మాట చెప్పాడు. కొడుకు కోరిక తీర్చేందుకు ఆ తల్లి, తన పింఛను ఖాతాలోంచి పది వేలు తెచ్చి భాస్కర్ చేతిలో పెట్టింది. తల్లి కాళ్లకు మొక్కి కొంత తన చిల్లర, మిత్రుల సాయం కలిపి తొలిసారిగా తన కవితా సంపుటిని తీసుకొచ్చాడు. పత్రికలకు సమీక్షల కోసం, తెలిసినవారికి చేతికీయడం, దూరమున్నవారికి పోస్టులో పంపడం ఇలా బిజీ బిజీగా రెండు నెలలు గడిచాయి.


ఇంటి భారం తెలియకుండా బతుకుతున్న భాస్కర్ ను ఆకస్మాత్తుగా సంభవించిన తల్లి మరణం ఏకాకిని చేసింది. ఎన్నాళ్ళు ఒంటరి బతుకని అక్క బావల ప్రమేయంతో పార్వతి ఆయన జీవితంలోకి అర్ధాంగిగా ప్రవేశించింది. పార్వతి పల్లెటూరి పిల్ల. ఆమెకు భాస్కర్ తనకన్నా కవిత్వాన్ని, సిగరెట్లని, ఎక్కువగా ప్రేమించే అర్థంకాని భర్త. పేద కుటుంబంలోంచి రావడం వల్ల ఇదే జీవితమని సర్దుకు బతుకుతోంది.


భాస్కర్ తొలి సంపుటికి హైదరాబాద్ లోని ఓ ప్రతిష్టాత్మక సాహితి సంస్థ ఆ యేటి పురస్కారం ప్రకటించింది. కవిని ప్రధానోత్సవానికి ఆహ్వానిస్తూ ఖర్చులకు డబ్బుల్ని కూడా పంపింది. నరేష్ ను తోడు తీసుకోని సభకు వెళ్ళాడు భాస్కర్. కవులంటే ఇలా ఉండాలన్నట్లు అందరు రకరకాల, రంగు రంగుల బట్టల్లో, హేర్ స్టయిల్లో మెరిసి పోతున్నారు. భాస్కర్ వాలకం చూస్తేనేమో ఈయన కవి అంటే నమ్మకం కలిగేలా లేదు.

ఆ వాతావరణం చూసిన నరేష్-'దగ్గర్లో సెలూన్ కెళ్ళి తయారై వస్తావా! 'అన్నాడు భాస్కర్ తో.

'ఇట్లాగే ఉంటాను, ప్రైజ్ ఇస్తే తీసుకుందాం, లేదంటే వెళ్లి పోదాం!' అన్నాడాయన దృఢంగా.

భాస్కర్ ను వేదికపై పిలిచి, సగౌరవంగా కూర్చోబెట్టి, మెరుపుల శాలువా కప్పగానే, తీసి చేతిలో పట్టుకున్నాడు. ఉండనీయమంటే వద్దని సున్నితంగా చెప్పాడు.


'మినీ కవితపై ఈ కవి సాధించిన పట్టు అనితరసాధ్యం. చిన్న చిన్న పదాల్లో గొప్ప భావాన్ని కుదించి, అక్షర విస్ఫోటనాల్నిసృష్టించే దిట్ట' అని ప్రధాన వక్తగా వచ్చిన ఓ పత్రిక సంపాదకుడు భాస్కర్ ను తెగ మెచ్చుకున్నాడు.

'కవి కన్నా ముందు నేనో సాధారణ మనిషిని, మధ్య తరగతి జీవిని. మీ గౌరవానికి కృతజ్ఞుణ్ణి. వేదిక మీద నేనున్నా, నాకు కవిత్వాన్ని పరిచయం చేసి, నా అక్షరాలకు నడకల్ని నేర్పిన నా మిత్రుడు నరేష్ సభలోనే ఉన్నాడు. కవిగా ఆయన చెక్కిన శిల్పాన్ని నేను' అని భాస్కర్ అనగానే, సభికుల్లోంచి నరేష్ చేతులు జోడించి నిలబడ్డాడు. హాలు చప్పట్లతో మోగిపోయింది.

రాత్రి బస్సెక్కాక భాస్కర్ తో నరేష్- 'నీవీ స్థానానికి చేరడమంతా నీ కృషి శ్రమ వల్లే సాధ్యమైంది. నలుగురిలో నా గురించి అలా మాట్లాడితే నాకే నామోషు అనిపించింది. నీవేమి రాశావు? అని ఎవరైనా అడిగితే నా దగ్గర జవాబే లేదు తెలుసా! ఒక్కసారి భయపడిపోయాను. నేనేంటో నువ్వెంటో మనిద్దరికీ తెలుసు, అది మూడో మనిషికి తెలిసే అవసరం లేదు.'అన్నాడు.


భాస్కర్ కుటుంబంలోకి మూడో మనిషి వచ్చాడు. కూతురును ఇంటికి తీసికెళ్ళే స్తోమతలేని పార్వతి తల్లి, ఇక్కడికే వచ్చి పురుడు పోసి కొంత కాలం బిడ్డా,మనవడికి తోడుగా ఉంది.


హైదరాబాద్ సభలో భాస్కర్ కవిత్వం గురించి మాట్లాడినాయన, ఆంధ్రదర్శిని దినపత్రిక ఎడిటర్ శివప్రసాదరావు. కవిత్వం నించి పాత్రికేయానికి మారాడు. పత్రికా నిర్వహణలో సమర్థుడు.

ఓ రోజు ఆ ఎడిటర్ నుంచి భాస్కర్ కు ఉత్తరం వచ్చింది. అందులో 'భాస్కర్! నవజ్యోతి వీక్లి వాళ్ళు కొత్తగా డైలీ పేపర్ తీస్తున్నారు. ఎడిటర్ గా నేను వెళ్తున్నాను. కొత్త పత్రికలో రోజుకో కవిత నీతో రాయించి మెయిన్ పేజీలో వేద్దామనుకుంటున్నాను. నీ వల్ల అవుతుంది. రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. అయితే స్టేట్ ఇష్యులపై రాయాలి కాబట్టి, నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ కావాలి. ఆలోచించి చెప్పు. కింద నా ఫోన్ నెంబర్ ఉంది ' అని ఉంది.

ఊరు, ఊర్లోని మిత్రులు,, సొంత ఇల్లు, చౌరస్తాలో పదేళ్లుగా దుకాణం, పుట్టింది, పెరిగింది, బతుకుతోంది అంతా ఇక్కడే. మరో చోట జీవితం ఊహించుకోలేనంత అనుబంధం. హైదరాబాద్ అంటే సముద్రం, తెలియని ప్రాంతం, పరిచయాలూ తక్కువే. తెలిసినవాళ్ళున్నా ఎవరెక్కడో. ఎవరి పనులు వాళ్ళకే. మనిషి పక్క మనిషి నడిచినా పక్కనెవరూ లేనట్లే ఉంటారు. ఇలా రెండు పార్శ్యాలు పోటీపడి తలపై గిరా గిరా తిరుగుతున్నాయి. సిగరెట్ పై సిగరెట్ అంటిస్తున్నాడు గాని దారి దొరకడం లేదు.

నరేష్ కు చెబితే 'మంచి అవకాశం, హైద్రాబాద్లో బతుకు కష్టం' అని వద్దనలేదు, పొమ్మనలేదు.

ఈ సంగతి వినగానే పార్వతి కళ్ళలో భయం కనిపించింది.

నాల్రోజులు గడిచాక భాస్కర్ మనసుకే- కవిగా ముందుకెళ్లాలనుకున్నప్పుడు ఇలా బెదిరిపోవడం తప్పనిపించింది. నాలా భయపడితే హైదరాబాద్ లో అంత జనాభా ఉండేదే కాదు. అందరిలో నేనొకరిని. పోవలసిందే అని తీర్మానించుకున్నారు.

దసరాకు కొత్త దినపత్రిక అంటూ నవజ్యోతి ప్రచారం మొదలైంది. అంటే ఇంకో పది రోజుల్లో మొదలన్నమాట. షాపు పక్కనే ఉన్న ఎస్ టి డి బూత్ నుండి ఎడిటర్ కు ఫోన్ చేసి 'తాను నవజ్యోతిలో రోజొక పోయెమ్ రాయడానికి రెడీ, హైదరాబాద్ కు వచ్చేస్తున్నాను' అని చెప్పేశాడు.

సంతోషంగా ఆయన 'వెల్కమ్ ..వెల్కమ్ టు హైదరాబాద్' అన్నాడు.

ఇక ఆలస్యమెందుకని భాస్కర్.. నరేష్ తో కలిసి హైదరాబాద్ వెళ్లి విద్యానగర్ లో ఓ మూలన జెరాక్స్ బిజినెస్ కోసం చిన్న షెట్టర్ మాట్లాడారు. కిరాయి నెలకు ఐదు వందలు. నడిచి వెళ్లేంత దూరంలో రాంనగర్ లో చిన్న ఒంటి గది ఇల్లును చూశారు. దానికో ఐదొందలు నెలకు. హోటల్లో లంచ్ చేసి ఎడిటర్ కు ఫోన్ చేస్తే ఆఫీసు కు రమ్మని చెప్పాడు. వెతుక్కుంటూ బంజారా హిల్స్ లో ఉన్న నవజ్యోతి బిల్డింగ్స్ లోకి వెళ్లారు. ఎడిటర్ వెంట ఉండి భాస్కర్ ను స్టాఫ్ కు పరిచయం చేశాడు. రాత్రి బస్సెక్కి తెల్లవారుతుండగా ఇంటికి చేరుకున్నారు.

ఇక భాస్కర్ మనసంతా కొత్త పత్రిక, కొత్త శీర్షిక మీదికే పోతోంది. పార్వతి ఉన్న కొద్ది బట్టల్ని, సామానుని సంచుల్లో సర్ది ఓ పక్కన పెడుతోంది. అది చూసిన నరేష్ వి ఐ పి సూట్ కేస్ కొనుక్కొచ్చి ఇచ్చాడు. మూడేళ్ళ పిల్లాడు సరళ్ కు జరుగుతున్నతతంగమేది అర్థం కావడం లేదు.


కలిసిన మిత్రులు వీడ్కోలు మాటలుగా జాగ్రత్తలు చెప్తున్నారు. ఓ రాత్రి చివరి బస్సుకు భాస్కర్ కుటుంబం హైద్రాబాదుకు పయనమైంది. ఇంటిని ఆర్టీసీ బస్ డ్రైవర్ కు నెలకు వంద కిరాయికి ఇచ్చారు. సిటీ డ్యూటీకి వచ్చినప్పుడు కలిసి, కిరాయి డబ్బులిస్తానన్నాడు. మర్నాడు నరేష్ జెరాక్స్ మెషిన్ ను హైదరాబాద్ కు ట్రాన్స్ పోర్ట్ లో వేశాడు .


రాంనగర్ ఇంట్లో దిగాక, పార్వతి పక్కింటావిడ సాయంతో కావలసిన సామాగ్రి కొనుక్కొచ్చుకుంది. భోజనం చేసి భాస్కర్ పత్రికాఫీసుకు బయలుదేరాడు. ఎడిటర్ ను కలవగానే అకౌంటెంట్ ను పిలిచి భాస్కర్ కు వేయి రూపాయలు అడ్వాన్సుగా ఇప్పించాడు.

'పత్రికకు ఎలాంటి పాలిటిక్స్ లేవు. నీవు నీ ధోరణిలో రాసేయ్. ప్రాబ్లమ్ వుంటే నేనే చెప్తా. రెండ్రోజుల్లో కొన్ని ఐడియాస్ రాసుకొని తెచ్చివ్వు. బస్ పాస్ కోసం నెలకు వంద రూపాయలు ఇప్పిస్తా. సిటీలో ఇంపార్టెంట్, టిపికల్, వెరైటీ ప్లేసెస్ అన్ని తిరిగి చూడు. సిటీ లైఫ్ అబ్జర్వేషన్ తో చాలా ఎక్స్ పోజర్ వస్తుంది. పోయెమ్స్ రాసేప్పుడు యూజ్ అవుతుంది. పాస్ ఉంటుంది కాబట్టి కవితలు వచ్చి ఇస్తూ ఉండు. నీ శీర్షిక పేరు ‘కవి కిరణం’. ఎలా ఉంది..ఆల్ ద బెస్ట్' అంటూ తల ఊపాడు.

నల్లా నీళ్ల చప్పుడు, బట్టలుతుకుతున్న, గిన్నెలు కడుగుతున్న శబ్దాలు భాస్కర్ ను నిద్ర లేపాయి. టైం ఎనిమిదిన్నర. ఊర్లో అయితే ఏ పదింటికో లేచేవాడు. వంట రెడీ కాగానే తినేసి పత్రికాఫీసుకు బయలుదేరాడు. కొత్త పత్రికకు స్వాగతం పలకండి అనే రీతిలో రాసిన కవితలు ఎడిటర్ కు బాగా నచ్చాయి.

'ఎల్లుండే రవీంద్రభారతిలో పత్రిక ఇనాగరేషన్..రా.' అంటూ పనిలో పడ్డాడాయన.

తొలి రోజు పత్రికలో తన కవితను చూసుకొని చాలా సంతోషపడిపోయాడు. హైదరాబాద్ రావడం మంచిదే అయిందనిపించింది.

సరళ్ ని స్కూల్ కు పంపుదామని భాస్కర్ కు చెప్పి, చెప్పి తానే చూసి ఇంటికి దగ్గర్లోని బడిలో వేసింది. జెరాక్స్ మెషిన్ రావడంతో పదింటికి భాస్కర్ షాపుకు వెళ్తున్నాడు.

‘కవి కిరణం’ శీర్షిక పాఠకులకు బాగా చేరిపోయింది. కరీంనగర్ జిల్లాకు చెందిన యూనివర్సిటీ స్టూడెంట్స్ భాస్కర్ ను కలవడానికి వస్తున్నారు. జెరాక్స్ పనేదైనా ఉంటే ఈయన వద్దకే తెస్తున్నారు. అప్పుడప్పుడు కలిసే కవులు అటుగా వెళ్తున్నప్పుడు పలకరిస్తున్నారు. ఊర్లో మాదిరి ఇక్కడ కూడా సర్కిల్ ఏర్పడిపోయింది. ఆరు నెల్లకోసారైనా వచ్చి పోయే నరేష్ రాకపోకలు తగ్గిపోయాయి.

ఇక్కడికొచ్చాక చిన్న చిన్నరిపేర్లతో మూడేళ్ళ పాటు పనిచేసిన జెరాక్స్ మెషిన్ పూర్తిగా ఆగిపోయింది.

'మెషిన్ పాతదైపోయింది. ఇంక పని చేయదు. ఎంత రిపేర్ చేసినా నాల్రోజులే.' అన్నాడు టెక్నీషియన్.

కొత్త దానికి కనీసం ముప్పై వేలైనా ఉంటుంది. తన వల్ల కాని పని. దగ్గర్లోని బ్యాంకుకు లోను అడగడానికి వెళ్ళాడు. షూరిటీ కావాలన్నారు. ఉద్యోగం చేస్తున్న పరిచయమైన రచయితలను. పాత్రికేయ మిత్రులను మనసు చంపుకొని కష్టంగానే అడిగి చూశాడు. ఎవరూ ముందుకు రాలేదు. కొందరు తనవైపు రావడం మానేశారు. ఇంతకాలం ఎంతో కలిసిపోయినట్లున్న మనుషులు ఒక్కసారిగా మారిపోవడాన్నిభాస్కర్ జీర్ణించుకోలేక పోతున్నాడు. అందరు సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళే అనిపించింది. మరో వైపు వారినెందుకు తప్పు పట్టాలి. ఇలా ఉంటేనే ఈ మహానగరంలో బతుకగలుగుతారేమో అనుకున్నాడు. మొత్తానికి ఊర్లోని మిత్రులూ వీళ్ళు ఒక్కటి కాదని మాత్రం అనిపించింది. ఎంత కష్టమొచ్చినా ఎవరిని ఏమి అడగొద్దని మనసులో తీర్మానించుకున్నాడు. 'నగరం నటస్వాముల గడి, ఊరు వెచ్చని కన్నతల్లి ఒడి' అని 'నగరం అదృశ్య కరవాలం, గాటు పడుతుంది గాని బాకు కనబడదు' అని తన కసినంతా కవిత్వంలో చూయించాడు


నెలాఖరున షట్టర్ ఖాళీ చేసి ఇంటికి, పత్రికాఫీసుకు పరిమితమయ్యాడు. పత్రికవాళ్ళు అడ్వాన్సుగా డబ్బులిస్తున్నా నెలకొచ్చే సంపాదన ఇరవై రోజులకే సరిపోతున్నాయి. మిగితా పది రోజులు పార్వతి పక్కవాళ్ళ సర్దుబాటుతో, కిరాణా కొట్టు ఖాతాలతో గడుపుతోంది.

ఏంపని చేద్దామన్నాఇంతవరకు ఒకరి దగ్గర పనిచేసిన అనుభవం లేదు. మాట పడడం, దులుపుకు బతకడం, బాసే కదా అనకుండా ఉంటాడా అని సర్దుకోవడం భాస్కర్ వ్యక్తిత్వానికి కుదరనిది. పత్రికలో పనీయండి అని ఎడిటర్ ను అడిగితే ఏమంటాడో.. చాన్సు లేదని చెప్పడానికి ఆయనేమి మొహమాటపడడు గాని ఆ మాట విని తట్టుకొనే శక్తి భాస్కర్ కు లేదు. మరోచోట చేస్తే ‘కవికిరణం’ దెబ్బ తింటుంది. కవిత రాయడానికి, ఆఫీసులో ఈయడానికి ప్రత్యేక సమయం కావాల్సిందే. దానికి దూరమై తాను పడుతున్న శ్రమకు అర్థం లేదు .

ఆదాయం తగ్గడంతో సరళ్ స్కూల్ ఖర్చులు పెరిగిపోయి, ఫీజు బకాయిపడింది. కిరాణా ఖాతా బిగుసుకుపోతోంది. టీ, సిగరెట్ చిల్లరకు దిక్కులు చూడవలసి వస్తోంది. కవిత్వమొక్కటే అన్ని ఒడుదొడుకులను తట్టుకొని మరింత పదునుగా సాగుతోంది. ఇంటిదాకా వచ్చి ప్రశంసలు కురిపించేవారికి కొదువ లేకున్నా నా అనే హస్తమొక్కటీ కానరాదు.

కిరాయి ఇవ్వడానికి డ్రైవర్ ఇంటికొచ్చాడు.

ఆయనను చూడగానే అనాలోచితంగానే 'మా ఇల్లు అమ్మితే ఎంతొస్తుంది?' అనే ప్రశ్న భాస్కర్ నోటిలోంచి వచ్చింది.

'రావచ్చు లక్షదాకా..' అన్నాడాయన.

ఆయన వెళ్ళిపోగానే ' ఇల్లు అమ్మొద్దు..కావలిస్తే అక్కడికే పోయి ఉందాం' అంది పార్వతి మెల్లగా.

'నీకేం తెలియదు ఊర్కో..'అని సర సర బయటికెళ్లి పోయాడు.


ఇంటి కిరాయి రెండు నెలలు కట్టాలి. అర్జెంటుగా వేయి రూపాయలు కావాలి. లేదంటే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. అదీ కిరాయి చేతిలో పెట్టాకే..కిరాణాలో ఐదు వేలు బకాయి. సగమన్నా కడితేనే సరుకులిస్తానన్నాడు. ఇల్లు ఖాళీ చేస్తే అడ్డం తిరిగి బజార్లో నిలబెడతాడు. సిటీ దాటితే ‘కవికిరణం’ చేయి దాటి పోతుంది. జీవితానికే అర్థం లేకుండా పోతుంది.

పొద్దున్నే లేచి వేములవాడ బస్సెక్కాడు. ఎవరి వైపు చూడకుండా ఇంటికెళ్ళాడు. డ్రైవర్ ఇంట్లోనే ఉన్నాడు.

'ఇల్లు అమ్ముదామనుకుంటున్నా..అవసరమైతే మీరు ఖాళీ చేయవలసి వస్తుంది..' అన్నాడు.

'ఎవరికో ఎందుకు, మాకే అమ్ము' అన్నాడు డ్రైవర్.

'లక్ష రూపాయలకు తీసుకోండి. ఓ ఇరవై వేలు అడ్వాన్స్ గా ఇవ్వండి.'

డ్రైవర్ ఇంట్లో కెళ్ళి టీ పెట్టమని చెప్పి ' కూచోండి. ఇప్పుడే వస్తాను' అని బయటికెళ్ళాడు.

అరగంట తర్వాత వచ్చిన ఆయన ' ఓకే అంటే, అగ్రిమెంట్ రాసివ్వు. అడ్వాన్స్ ఇస్తా. అయితే అగ్రిమెంట్ మీద ఒక సాక్షి సంతకం ఉండాలి.ఎవరినైనా తీసుకొనిరా !' అన్నాడు.

'నేను బయటి పోను, మా ఫ్రెండ్ నరేష్ తెలుసు కదా. విషయం చెప్పి రమ్మను.'

'సరే' అంటూ బయటికెళ్లాడాయన.

పది నిమిషాల్లో నరేష్ వచ్చాడు.

'ఇల్లు అమ్మడమెందుకు.. ముందు మా ఇంటికి పోదాం పద.'' అన్నాడు నరేష్ కూచోకుండా.

'నేను వాపసు పోవాలి.ఇంకా పత్రికకు కవిత రాయలేదు.'

'అవన్నీ తర్వాత ..ఇంటికొస్తే అన్ని మాట్లాడుకుందాం'

'నేను ఇప్పుడు ఎక్కడికి రాను. సాక్షి సంతకం చేసినాకే ఏదైనా మాట్లాడుకుందాం'.

'ఇంకెవరినైనా తీసుకురానా..' అని డ్రైవర్ తొందరపడుతున్నాడు.

'వద్దు..ఈయనే పెడతాడు'.

మారు మాట్లాడకుండా నరేష్ అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టాడు.

అడ్వాన్స్ డబ్బు తీసుకొని బయటికొచ్చిన భాస్కర్, బస్టాండుకు వెళ్తాను అన్నాడు నరేష్ తో.

'సరే.. దింపేస్తా రా.. ' అని బైక్ స్టార్ట్ చేశాడు.

'నేను రానంత మాత్రాన సీదా నా ఇంటికి రాకూడదా. కష్టాలేమైనా ఉంటే నాకు చెప్పచ్చు కదా .. ఇల్లే అమ్మాలనుకుంటే నేను మంచి బేరం కుదిర్చేవాణ్ణి. తొందరపడకు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరవై వేలు నేను ఇస్తాను. అడ్వాన్స్ వాపసిద్దాం' అన్నాడు నరేష్.

'వద్దు. మాట కన్నా డబ్బు ముఖ్యం కాదు. వదిలేయ్' అంటూ బైక్ దిగి, సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కేశాడు.

రాణిగంజ్ లో బస్సు దిగి, పత్రికాఫీసుకెళ్లాడు. ఓ కాగితం తీసుకొని కవిత రాసిచ్చి, బయట పడ్డాడు.

ఇంట్లో పార్వతి ఏడుస్తూ కూచుంది. సరళ్ ఇద్దరి మొఖాలు చూస్తూ బిత్తరపోతున్నాడు.

తెచ్చిన డబ్బులు పార్వతి చేతిలో పెట్టాడు. ఇన్నిబాధల్లో రూపాయలు చూడగానే ఊరట కలిగిందామెకు.

నెల రోజుల్లో ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. వచ్చిన ఎనభైవేలలో సగం పార్వతికిచ్చాడు.

ఎప్పటి నుంచో తను ఐదేళ్లుగా రాస్తున్న ‘కవి కిరణం’ కవితల్లో, మంచివాటిని పుస్తకంగా వేయాలనే ఉంది. కాపీలు అమ్ముడు పోతాయనే నమ్మకముంది..పది రోజులు వాటిని ముందేసుకుని ఎనిమిది వందల కవితల్ని ఎంపిక చేశాడు. ప్రెస్ కెళ్ళి అడిగితే 'ముప్పై వేలకు నాలుగు వేల కాపీలు వస్తాయి.ఇరవై రూపాయలు ధర పెట్టినా నీ ఖర్చు పోను పదివేలు లాభం వస్తుంది' అన్నాడు లెక్కలేసి.

'సరే...అని పది వేలు అడ్వాన్స్ ఇచ్చాడు.

రోజుకొన్ని కవితలు కంపోజ్ చేసి ఇస్తున్నారు. సరిదిద్ది వాపసు ఇస్తున్నాడు. ఇంకో మూడు వందలు కంపోజ్ కు ఉండగా, డిసెంబర్ రావడంతో క్యాలెండర్లు, డైరీలు ప్రింటింగ్ అని ఈ పని పక్కకు పెట్టారు.

మళ్ళీ ఫిబ్రవరిలో పుస్తకాలు వేయడం మొదలైంది. ప్రెస్ లో పెండింగ్ బుక్స్ ఎక్కువగా ఉండడంతో, పని వెనుకబడింది.. మొత్తానికి నాలుగు నెలల శ్రమ అనంతరం పుస్తకాలు ప్రెస్ లోంచి బుక్ సెల్లర్స్ కి చేరాయి. ఈలోగా జేబులు ఖాళీ అయినా, కాపీల అమ్మకం వల్ల కొంత కొంత సొమ్ము చేతికి వస్తోంది.

భాస్కర్ ఇచ్చిన సొమ్ములోంచి పది వేలతో బాకీలన్నీ తీరిపోయాయి. ఇంత సొమ్ము ఇంట్లో ఎందుకని పార్వతి ఇరవై వేలు కిరాణా షాపు ఓనరు కు అప్పుగా ఇచ్చింది. వడ్డీతో ఇంటి కిరాయి కడుతోంది. డబ్బుకు కట కట లేకుండా ఆరు నెలలుగా గడుస్తోంది. చేతిలో ఏం లేకున్నావడ్డీకి ఇచ్చిన సొమ్మును తాకద్దనుకుంది. చిల్లర ఖర్చులకు భాస్కర్ నే అడుగుతోంది.


ఓ రోజు పొద్దునే బయట గొడవ వినిపిస్తే పార్వతి రోడ్డు మీదికి వెళ్ళింది. కిరాణా షాపు దగ్గర అందరు నిలబడి ఉన్నారు. గుండెలో రాయి పడ్డట్లు పరిగెత్తింది. షాపు ఓనర్ పారిపోయాడని, ఆయనకు అప్పు ఇచ్చినవారు జమై ఉన్నారు. కొద్దిసేపయ్యాక షాప్ యజమానిని తిడుతూ, తమ కర్మని తల కొట్టుకుంటూ ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. బయటికి ఏడవలేక కుమిలిపోతూ, పార్వతి ఇంట్లోకొచ్చింది. తాను ఇచ్చిన పైసల లెక్క ఎప్పుడూ భాస్కర్ పార్వతిని అడగలేదు. ఆయనకు ఆ అలవాటు కూడా లేదు.

పుస్తకాలు అమ్మగా వచ్చే డబ్బుల రాకడ మెల్లగా మందగించింది. సిటీలోని బుక్ సెంటర్ల నుంచి స్వయంగా వెళ్లి తెచ్చుకుంటున్నాడు గాని బయటి ప్రాంతాలవాళ్ళు ఇప్పుడు అప్పుడు అని వాయిదాలు పెడుతున్నారు. లెక్క చూసుకుంటే లాభం మాటేమో గాని పెట్టుబడికే పది వేల బొక్క కనబడుతోంది. పత్రికవాళ్ళు పెంచే సొమ్ము బెత్తెడైతే ఖర్చు జానెడు పెరుగుతోంది. మళ్ళీ కటకట పర్వం మొదలైంది.

ఇంటికొస్తున్నవాళ్ళ దగ్గర భాస్కర్ కు పని కావాలనే ప్రస్తావన పార్వతే తెస్తోంది. 'మా కాలేజీ లైబ్రరీలో పనిచేస్తూ నీ కవిత్వం రాసుకో!' అని ఒకాయన ఆఫర్ ఇచ్చాడు. భాస్కర్ దగ్గుతున్న తీరును గ్రహించి, 'పనిలో చేరే ముందు నల్లకుంట మార్కెట్లో ఉన్న మా ఫ్రెండ్ డాక్టర్ ను కలువు' అంటూ తన కార్డుని ఇచ్చాడు. ఇలా బతుకు తిరిగి తిరిగి ఇక్కడికొచ్చి ఆగింది.


తల విదిల్చుకొని భాస్కర్ తాను హాస్పిటల్ గేటు దగ్గరే ఉన్నానని గ్రహించాడు. కాళ్ళు పీకుతుంటే పక్కనే బెంచిపై కూచొని కాగితం తీసి 'డాక్టర్ నీ సూదిమందు, నిలుచునా ఈ మహమ్మారి ముందు, దారులు మూసుకున్న ఈ మహానగరమందు, రోగం కాదది నా పాలిటి రాబందు' అని రాసుకొని బయటపడ్డాడు.

సాయంత్రం ఇంటికొచ్చి, ముసుగు తన్ని ముడుచుకు పడుకున్నాడు. ఒంట్లో సత్తువ తగ్గుతోంది. మందులేసుకుంటే బలమైన ఆహారం లేక తల తిప్పుతోంది. బస్సు ఎక్కి దిగేప్పుడు, తూలిపోతున్నాడు.

దగ్గు పెరగడం చూసి పార్వతి 'ఏమైంది.. డాక్టర్ ఏమన్నాడు' అంది 'మందులిచ్చాడు..వేసుకుంటున్నా' అని మాట పెంచలేదు.

పత్రికాఫీసు దాక వెళ్లలేని స్థితి వచ్చింది. రోజూ కవితను బయటి ఎస్ టి డి నుండి చెబుతున్నాడు. ఇలా నెల గడిచింది. మరింత శక్తి సన్నగిల్లింది. కవితను పక్కింటి అబ్బాయికిచ్చి ఫోన్లో చెప్పమంటున్నాడు. రాత్రంతా దగ్గుతూనే వున్నభాస్కర్ తెల్లవారి లేవలేదు. పదకొండు దాటినా లేవలేదేమని దుప్పటి తీసి, పార్వతి కదిలించి చూస్తే, చల్లని కట్టెలా శరీరం తగిలింది. నిద్రలోనే ప్రాణం పోయినట్లుంది.

పార్వతి కూలిపోయి శోకమందుకుంది. చుట్టుపక్కలవాళ్ళు జమయ్యారు. పత్రికకు కవిత చెప్పే పిల్లాడు ఫోన్లో భాస్కర్ మరణవార్తను చేరేశాడు. ఎడిటర్ రాలేదు కానీ, స్టాఫ్ ను పంపించాడు. సాయంత్రం భాస్కర్ నిర్జీవంగా దహనమయ్యాడు.

మర్నాడు నవజ్యోతి పత్రికలో, రోజూ ‘కవికిరణం’ వేసే చోట, భాస్కర్ ఫోటోతో పాటు 'కవి భాస్కర్ ఇక లేరు' అని నివాళిగా ఆయన సేవలు గుర్తుచేస్తూ ఈ శీర్షికను ఇంతటితో ముగిస్తున్నాం అని వేశారు.


రోజూ పొద్దుటే పేపర్లో భాస్కర్ కవిత చదివే అలవాటున్న నరేష్ ఆ వార్త చదివి కొద్దిసేపు కోలుకోలేకపోయాడు. పార్వతి, సరళ్ గుర్తుకొచ్చి వెంటనే హైదరాబాద్ బయలుదేరాడు.

ఇంట్లో అనాధలుగా కూచున్న తల్లి, కొడుకులు నరేష్ ను చూడగానే ఆయన్ని చుట్టుకొని, ఇంతసేపు ఓదార్పు దొరకని దుఃఖ భారాన్ని దించుకున్నారు.

బయటికెళ్లి ఫుడ్ పార్సల్ తెచ్చి బలవంతంగా ఇద్దరికీ తినిపించాడు నరేష్.

కాస్త తేరుకున్న పార్వతి 'ఎక్కడా ఏమీ లేకుండా చేశాడు..ఎలా బతకడం.'అని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది.

'వేములవాడ వెళ్ళిపోదాం, అక్కడ ఫ్రెండ్స్ నలుగురం కలిసి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. హాస్టల్లో నీ ఇష్టమైన పని చేయి. సరళ్ అందులోనే చదువుకుంటాడు. మీరు ఎంతకాలమైనా హాస్టల్ లో ఉండొచ్చు.' అని నరేష్ సామాను సర్దడం మొదలు పెట్టాడు.

పార్వతికి మరోదారి లేదు. వారికీ నరేష్ ను మించిన బంధువు కూడా లేదు. సరే అన్నట్లు తల ఊపిందామె.

సూట్ కేస్ జిప్ మూస్తూ నరేష్ పార్వతి, సరళ్ ల వైపు చూసి, ‘హైదరాబాద్ వచ్చి భాస్కర్ ఓడినట్లా ..గెలిచినట్లా..' అన్నాడు.

'ఏమి గెలిచాడు... మమ్ముల నడి సముద్రంలో విడిచి పెట్టి పోయాడు.' అంది పార్వతి.

'ఎ ఫెయిల్యూర్ ఫాదర్ ' అన్నాడు సరళ్.

‘మీ అభిప్రాయం ఎట్లున్నా, నేను మాత్రం భాస్కర్ గెలిచాడనే అంటాను. భాస్కర్ మాదిరే ప్రపంచంలో ఎందరో మహానుభావులకు, ఇంట్లో పాస్ మార్కులు కూడా పడలేదు. కానీ వారు చరిత్రలో నిలిచారు. అదే వారి గెలుపు. మానవత్వం లేని మనుషుల సహవాసాన్ని భాస్కర్ తట్టుకోలేకపోయాడు. తన కార్యాన్ని ముగించుకొని భాస్కర్ ఇష్టంగానే ఈ లోకం లోంచి వెళ్ళిపోయాడు. రేపు, నేను భాస్కర్ భార్యను, కొడుకును అని గర్వంగా చెప్పుకొనే రోజు మీకు తప్పకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి.' అన్నాడు ఉద్వేగంగా.

నరేష్ మాటలు ఇద్దరికీ వింతగా అనిపించాయి.

పట్టుకొచ్చిన పేపర్లో భాస్కర్ మరణ వార్తను చూయించేందుకు నరేష్ పత్రికను బయటకు తీశాడు. స్నేహితుడి మరణవార్త వ్యధతో మరో వార్త చూడలేదు. 'ముఖ్యమంత్రికి అల్లుడి వెన్నుపోటు' అని హెడ్ లైన్ కంటబడింది. 'మామ అల్లుళ్ళ సవాలు, ప్రజాస్వామ్యం నవ్వుల పాలు ' అని భాస్కర్ ఎంత బాగా సెటైర్ రాసేవాడో అని, అంత విషాదంలోనూ నరేష్ కు నవ్వొచ్చింది. .

*******************


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



రచయిత పరిచయం :

రచయిత బి.నర్సన్ విశ్రాంత బ్యాంకు అధికారి. గత ఆరేళ్లుగా స్వతంత్ర పాత్రికేయుడిగా రచనా వ్యాసంగంలో ఉన్నారు. సుమారు యాభై కథలు రాశారు, వీటిలో కొన్ని కథల పోటీల్లో బహుమతులు పొందాయి.

160 views0 comments
bottom of page