top of page

అతిగారాబం సర్వ అనర్ధాలకు మూలం'Athigarabam Sarva Anarthalaku Mulam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 19/02/2024

'అతిగారాబం సర్వ అనర్ధాలకు మూలం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


“ఏమోయ్ వసంతా! భోజనం వడ్డించు. పొలం వద్దకు వెళ్లాలి. ఇవాళ నాట్లు వేయాలి. కూలీలు వచ్చారో? లేదో?” అన్నాడు మురహరి తన భార్య వసంతతో. 


“అలాగే” అంటూ వంటింట్లోకి వెళ్లి భోజనం సిధ్ధం చేసి భర్తను పిలిచింది వసంత. 


వెంటనే మురహరి వచ్చి భోజనం ముగించి పొలానికి బయలుదేరి వెళ్లాడు. 

 వసంత తనుకూడా భోజనం ముగించి వంటగది సర్ది తన గదిలోకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంది. 


కాసేపటికి కొడుకు మధు రావడం గమనించి ఇవతలికి వచ్చింది. 


“ఏరా! మధూ! ఉదయమనగా వెళ్లావు. తిండీ తిప్పలు లేకుండా ఎక్కడ తిరిగావురా? ఆ మొహం చూడు ఎలా వాడిపోయిందో ?” కాసింత ప్రేమ, కూసింత మందలింపు స్వరంతో అడిగింది కొడుకుని వసంత. 


వెంటనే చివాలున తల్లి మీద ఇంతెత్తు కోపంతో “ఎక్కడికెళితే నీకెందుకు? నీవిలా ప్రశ్నలు వేసి, ఆరాలు తీసేట్టయితే నేనసలు ఇంటికి రావడమే మానేస్తాను. ” హెచ్చరింపు ధోరణిలో అన్నాడు మధు. 


ఎందుకు వాడితో అనవసరంగా గొడవ. వాడు నిజంగా అన్నంత పనీ చేసేస్తాడు. ఇప్పుడీమాత్రమన్నా వీడు కంటికి కనబడుతున్నాడు. ఇంకెప్పుడూ వాడిని అడగ్గూడదు. వాడి ఖర్మ ఎలా రాసిఉంటే అలా అవుతుంది నిర్లిప్తంగా మనసులో అనుకుంది వసంత. 


“లే!లేచి కాళ్లు కడుక్కొని రా! భోజనం పెడతాను” అంది వసంత. 

“ఏం? ఇలా ఉంటే పెట్టవా? నీ చాదస్తాలు, నువ్వూను. నేనిలాగే ఉంటా. ” అన్నాడు నిర్లక్ష్యంగా మధు. 


తమ పొడంటేనే గిట్టని వాడితో వాదన ఎందుకనుకుని మిన్నకుండిపోయి కొడుకుకి. భోజనం వడ్డించింది వసంత. కాసేపటికి భోజనం ముగించి మళ్లీ ఎక్కడికో బయటకు వెళ్లాడు మధు. 


కొడుకు వెళ్లిన వైపే చూస్తున్న వసంత మనసు గతంలోకి వెళ్లింది

 అవి తన పెళ్లైన తొలి రోజులు. తల్లితండ్రులు చూసిన సంబంధమిది. పదెకరాల మాగాణి పొలము, పెద్ద మండువా ఇల్లు, ఒక్కగానొక్క కొడుకు, కష్టపడి పనిచేసే వ్యవసాయ దారుడని తన వాళ్లు మురహరితో వైభవంగా పెళ్లిచేసి తనని కాపురానికి పంపారు. భర్త తన కంటే పదిసంవత్సరాలు పెద్దైనా తండ్రి మాటకు ఎదురుచెప్పకుండా తలవంచి భర్త చేత తాళికట్టించుకుంది తను. 


కాపురానికి వచ్చిన తొలిరోజులలోనే ఆ ఇంటి వాతావరణం అర్ధమవసాగింది వసంతకు. అత్తగారు యశోదకు మడి, ఆచారాలు, సాంప్రదాయాల పట్టింపులు చాలా ఎక్కువ. మామగారు కాలం చేసి పదేళ్లయింది. ఆ ఇంట్లో ఆవిడ మాటే రాజశాసనం. తల్లిమాటే వేదం మురహరికి. నిత్యం ఆ ఇల్లు పాడి పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. 

పల్లెటూరు ఇల్లు, ఇంటెడు చాకిరి ఉంటుంది అని అర్ధమైంది వసంతకు. 


క్రొత్త కోడలు అని కూడా లేకుండా తొలిరోజు నుంచి తనకి అత్తగారు పనిపురమాయించేది. 

“ఇదిగో అమ్మాయ్! మీ పుట్టింట్లో నీవొక్కత్తివే కనుక బాగా గారాబంచేసి ఉంటారు మీవాళ్లు. పనిపాటలు నేర్పి ఉండరు. మా ఇంటికి వచ్చాక అవేమీ కుదరవు. ఇంట్లో అన్ని పనులూ నీవు చేయాల్సిందే “ హుకుం జారీ చేసింది అత్తగారు. 


తనకి పెళ్లై పదిరోజులు కూడా కాలేదు. వేకువజామున లేవడం. వాకిలి ఊడ్చి, పేడతో కళ్లాబు చల్లి ముగ్గులు, తర్వాత గేదెలకు పాలు పితికి కుంపటి వెలిగించి అత్తగారికి, భర్తకు ఇత్తడి గ్లాసులలో కాఫీలు ఇవ్వాలి. 


తర్వాత లంకంత ఇంటిని ఉఊడ్చి తడిబట్టతో వంగి శుభ్రం చేయాలి. ఆ తర్వాత కాసా మడికట్టుకుని ఫలహారాలు సిధ్ధంచేసి వాళ్లకు కూర్చుని తినేందుకు పీటలు వేసి క్రిందనే వాళ్లకు వడ్డించాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా మడితోనే వండి వడ్డించాలి. సాయంత్రం మరలా వాళ్ళు. తినేందుకు ఏమన్నా ఫలహారాలు చేసి కాఫీలు… ఇలా రోజంతా బండెడు చాకిరీ చేసి, వంటింటిని శుభ్రం చేసి రాత్రి పడుకునేటప్పటికి 11 గంటలయ్యేది. 


ఇవన్నీ తనకు క్రొత్తగా ఉన్నా ఆ ఇంటి వాతావరణానికి తగ్గట్టే తనని తాను మలుచుకుని అత్తగారు, భర్త చెప్పినట్టు చేసేది వసంత. అయినా ఆవిడలో అత్త అనే అహంకారం ఆవిడ మాటలలో, చేతలలో స్పష్టంగా కనిపించేది వసంతకు. ఎంత పని చేస్తున్నా ఏదో విధంగా ప్రతి దానికీ వంకలు పెట్టి తనని మాట్లాడేది. ఆవిడ మాటలు, చేతలు తన మనసుకు బాధ కలిగి తన భర్తతో చెబుదామనుకుంటే అతను తల్లిమాటను జవదాటని వ్యక్తిత్వం. అది అలుసుగా తీసుకుని ఆవిడ విజృంభించేది. 


ఆవిడ తన కొడుకు ముందే ఏమాట పడితే ఆమాట అనేది తనని. ఒకసారి తను గదిలో భర్తతో ఉన్న సమయంలో అతని మూడ్ చూసి సాయంత్రం ఇంట్లో జరిగిన సన్నివేశం‌, అతని ముందే తనని ఆవిడ అన్న మాటలని గుర్తుచేసి బాధపడింది వసంత. అంతా విన్న అతను “అమ్మని మెప్పించు. ఆవిడ నన్ను కష్టపడి పెంచింది. ఆవిడని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు” అన్న భర్త సమాధానం విని నివ్వెరపోయింది వసంత. ఇంక ఆయనతో ఏం చెప్పినా ప్రయోజనం లేదు అనుకుని మౌనంగా ఊరుకుంది వసంత. 


పైగా యశోద ప్రతిరోజూ “నా కొడుకు తల్లి చాటు పిల్లాడు. వాడు నా మాట జవదాటడు. ” అనేది వసంతతో. 27సంవత్సరాల కొడుకు ని పట్టుకొని పిల్లాడు ఆంటుందేంటి? అయినా అతనికి పెళ్లై, భార్య వచ్చాక కూడా 

ఇంకా తన చెప్పుచేతలలో కొడుకు, కోడలు ఉండాలనుకుంటోంది. అలా కొడుకుని నోరూవాయాలేకుండా పెంచి తన చెప్పుచేతలలో ఉంచుకుంది. ఈవిడ తన భర్త మీద కూడా ఇలాగే ప్రవర్తించి ఉంటుంది. అందుకే ఆ మహానుభావుడు త్వరగా కాలంచేసి ఈవిడ బారినుంచి తప్పించుకున్నాడు. అదృష్టవంతుడు” మామగారిని తలుచుకుని మనసులో అనుకుంది వసంత. 


ఇంక ఆవిడని, ఆవిడ స్వభావాన్ని ఆవిడని. పుట్టించిన బ్రహ్మ దేవుని తరం కూడా కాదు అనుకుని తనే ఆ ఇంటికి, ఆ ఇంట్లో మనుషులకు అనుగుణంగా ఉంటోంది వసంత. రోజులు గడుస్తున్నాయి. 


 “పెళ్లైసంవత్సరమయినా ఇంకా నీ కడుపున ఒక కాయన్నా కాయలేదు. నట్టింట్లో ఊయల వేసే అదృష్టం మా మొహాన ఉండొద్దూ. మనవడిని చూసే యోగం నాకుండాలికా. వంశోధ్ధారకుడు ఉంటే ఎంత బాగుండు” అని ప్రతిరోజూ ఆవిడ సాధింపులలో ఇవికూడా క్రొత్తగా చేరాయి. అదేదో తన లోపమైనట్లుగా తనని చూసేది ఆవిడ. 


“అయినా ఏడాదికే ఆవిడ ఎందుకలా సాధిస్తుందో? ఏదన్నా జవాబివ్వబోతే గోరంత దానిని కొండంత చేసి కొడుక్కి చెబుతోంది. ఆయన అన్నిటికీ తల్లిని. వెనకేసుకొచ్చి తననే నిందిస్తాడు. కొరివితో తల గోక్కొవడం ఎందుకు?” అనుకుంది వసంత. 


చూస్తూండగానే నాలుగు సంవత్సరాలు గడిచాయి. వసంత చేత పూజలు చేయించడం, ఉపవాసాలు చేయించడం, గుడులూ, గోపురాలకు త్రిప్పడం, స్వామీజీల సందర్శనం చేసేది యశోద. ఇంటికి వచ్చిన బంధువులకు, చుట్టుప్రక్కల వారికీ తన కోడలు ‘గొడ్రాలు’ అనే నిందలు కూడా వేసేది. అది భరించలేక ఒకసారి ధైర్యంగా తన భర్త, అత్తగారి ముందే ఆవిడ తప్పుని చెప్పి బాధపడి “ ఇంకెప్పుడూ నా మీద నిందలు వేసి సాధించద్దు. నన్ను అవమానించద్దు. మీరు సాటి ఆడవాళ్ళే కదా. మీరు ఆ మాటని నన్ను ఎలా అనగలుగుతున్నారు? మీ మనసెలా ఒప్పుతోంది? ఒకసారి ఆలోచించండి అత్తయ్యా ” అని అత్తగారిని సున్నితంగా హెచ్చరించింది వసంత. 


 ఆవిడ తన ముఖాన్ని కందగడ్డ చేసుకుని కొడుకు వేపు చూసింది. ఎప్పుడూ తన తల్లిని వెనకేసుకొచ్చి మాట్లాడే మురహరి మౌనం వహించాడు. ‘హమ్మయ్య. ఇది చాలు. భర్తలో ఈ మార్పు చాలు నాకు’ అనుకుంది మనసులో వసంత. 


“అంతేలే! అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలనాడు కాదు. నా పిచ్చి గానీ పెళ్లాం రాగానే నీవు మారావు. తల్లి అల్లం - పెళ్లాం బెల్లం” అని ఊరికే అన్నారా?” అన్నది కొడుకుతో యశోద. ఇంక అక్కడ ఉండకుండా లేచి బయటకు వెళ్లాడు మురహరి. మౌనంగా లేచి వంటగదిలోకి వెళ్లింది వసంత. 


“ఏ స్త్రీ అయినా ఎన్ని బాధలను, కష్టాలనైనా భరిస్తుంది కానీ ‘గొడ్రాలు ‘ అనే నిందని సహించలేదు. తట్టుకోలేదు. మాతృత్వం అనేది స్త్రీ కి వరం. తను తల్లి కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ఈ నిజాలు తన అత్తగారి లాంటి వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో?” అనుకుంది వసంత. 


మరో సంవత్సరం తర్వాత వసంత పూజలు ఫలించి దేవుడు వరమిచ్చినట్లుగా వసంత గర్భవతైంది. వసంత చాలా సంతోషించింది. వసంత తల్లితండ్రులకు, యశోద, మురహరిల ఆనందానికి అవధులు లేవు. ఇంక తన కోడలి మీద ఎక్కడ లేని ప్రేమని తన భర్త ముందు, బయటివాళ్లముందు ప్రదర్శిస్తోంది యశోద. ఎవరూలేనప్పుడు కోడలితో ఆవిడ తీరు మాములే. పనిపాటలు చేయకపోతే నరాలు చిక్కబడతాయి. కాన్పు తేలిగ్గా కాదు అని ఎప్పటిలా ఇంటెడు చాకిరీని కోడలి చేత చేయించి తృప్తి పడేది. ఆవిడ నటనకు మనసులో నవ్వుకుని ఆస్కార్ అవార్డును ఆవిడకు ఇవ్వచ్చు స్ధిరంగా అనుకుంది వసంత. 


 వసంతకి సీమంతవేడుకలని ఆమె తల్లితండ్రులు వచ్చి ఘనంగా చేశారు. కాలం సాగుతోంది. నెలలు నిండి సుఖప్రసవం జరిగి తనకు మధు పుట్టాడు. మనవడు, వంశోధ్ధారకుడు వచ్చాడని సంబరపడింది యశోద. మధు క్రమేపీ పెరుగుతూ తన ముద్దుమచ్చట్లతో అందరినీ అలరిస్తున్నాడు. క్రమేణా వాడికి మూడవసంవత్సరం రాగానే స్కూలుకు పంపారు వసంత దంపతులు. 


ఇంట్లో వాడిని అతి గారాబంచేయడంచేత వయసుతో పాటు వాడి మొండితనం, మూర్ఖత్వం పెరిగాయి. అది గమనించిన వసంత వాడిని మందలించబోతే అత్త, భర్తలు ‘వాడినేమనద్దు. చిన్నపిల్లాడు’ అని వాడిముందే తనని కసిరేవారు. అది వాడికి బాగా లోకువ అయింది. స్కూలులో కూడా వాడి అల్లరి,ఆగడాలు ఎక్కువయి చదువు వంటబట్టట్లేదు. మాస్టర్లు ఫిర్యాదులు చేస్తే యశోద వెళ్లి వాళ్లమీదకు తన నోటిని జాడించి వచ్చేది. వాళ్లు మధుకి టీసీ ఇచ్చి పంపించారు. ఇంక తన కళ్లముందే తన మనవడుంటాడు. తినడానికి తిండి, పొలం, ఇల్లు ఉన్నాయి. వాడికేంలోటు అనుకుని మనవడిని నెత్తినెక్కించుకుని గారాబంచేసి పెంచింది యశోద. తన కొడుకు విషయంలో మురహరి తీరు కూడా అదే. 


మధు పెద్దవాడయ్యాడు. చదువు సంధ్యలబ్బక ఊరిలో బలాదూర్ గా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వార్ధక్యంలో యశోదకి మధు చెడిపొయ్యాడనే మనోవేదన పట్టుకుంది. మనవడిని దగ్గరకు పిలిచి నయానా,భయానా చెప్పింది. ఆవిడ మాటని వాడు పెడచెవిన పెట్టి ఆవిడని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. మనోవ్యాధికి మందులేదు కదా! ఆ దిగులుతో రెండు సంవత్సరాలతర్వాత ఆవిడ కాలంచేసింది. 


 ఏదో అలికిడైతే గతస్మృతులనుంచి తేరుకుని కాఫీ కలుపుకోవడానికి వంటగది లోకి వెళ్లింది వసంత. 


 “మొక్కై వంగనిది మానై వంగుతుందా ?” చిన్నతనానే మధుని క్రమశిక్షణతో పెంచి ఉంటే వాడు చక్కగా చదువుకుని ప్రయోజకుడయ్యేవాడు. 


వాడి పెంపకంలో కూడా తన మాటని చెల్లనివ్వకుండా తన అత్తగారు, భర్త కలిసి అతిగారాబం చేసి వాడినిలా తయారు చేశారు. ఫలితం బంగారం లాంటి కొడుకు ఇలా తయారయ్యాడు. ఇదంతా వాడి ఖర్మ. విధాత గీతని, రాతని మార్చ ఎవరి తరమూ కాదు. ఇప్పటికే చాలా ఆలశ్యమయింది. విలువైన వాడి జీవితం చాలా పాడయింది. ఇంక ఆ భగవంతుడి దయవలన ఇప్పటికైనా వాడిలో పరివర్తన వస్తే బాగుండు. తన వంతు కృషి తను చేసి వాడి ప్రవర్తనని మార్చే దిశగా గట్టి ప్రయత్నం చేస్తాను. కృషితో నాస్తి దుర్భిక్షం కదా!” అనుకుని స్ధిరనిర్ణయం తీసుకుంది వసంత. 


 ….సమాప్తం.


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

85 views0 comments

Komentáře


bottom of page