top of page

ఆత్మ ఘోష

Atma Ghosha Written By Ayyagari Lakshmi

రచన : లక్ష్మీ అయ్యగారి


“కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని నేను మీతో పంచుకోవాలి. రైలు గేటు ఇక మూసుకో బోతున్నది. సబ్వేని చేసుకొని మీరు వెతుక్కుని మూసేయాలని నిశ్చయించుకున్నట్లు ఉన్నారు. నిత్యం పచ్చని తోరణాలతో పెళ్లి వారిల్లులా కళకళ లాడుతూ వస్తూపోతూ ఉండే రహదారిని, వెలవెల బోయేలా చేసి, శాశ్వత విశ్రాంతి కలిగించేలా చేస్తున్నట్లున్నారు. ఇదంతా మీ చలవే అనుకుంటాను. నేను పడుతున్న బాధ ఏమిటో నీకూ తెలియాలి. మీతో నాకు ఉన్న అనుబంధాలన్నీ ఒక్కొక్కటీ గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే అర్ధరాత్రి అయిపోయిందని కూడా చూడకుండా ఆయాసపడుతూ మరీ నీ దగ్గరకు వచ్చాను.”

ఎవరో లొడలొడా మాట్లాడుతూ, నన్ను తట్టి లేపుతుంటే ఉలిక్కిపడి లేచాను. అస్తమిస్తున్న సూర్యుడిలా వెలవెలబోతున్నట్లు కనిపించింది మా ఊరి రైలు గేటు. దానిని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. 'రైలు గేటు నా దగ్గరికి కదలి రావడం ఏమిటో, నాతో మాట్లాడడం ఏమిటో' నాలో నేనే అనుకున్న మాటలు బయటకు అనేసాను. అంతే నేను ఊహించని సమాధానం దాని నుండి రానేవచ్చింది.

“ ఓసోసి విఠలాచారిగారి సినిమాలలో బల్లలు, కుర్చీలు మాట్లాడితే చప్పట్లు చరుస్తూ, సినిమాలు చూసే మీరు, నేను మాట్లాడడం ఎందుకు విచిత్రం అనిపిస్తోంది” అంది. “బహుశా ఆ సినిమాలు నువ్వు చూసి ఉండక పోవచ్చు కానీ, మీ నాయనమ్మలు, అమ్మమ్మలు జట్కా బళ్లు కట్టించుకొని రైలు గేటు ని దాటి మరీ సినిమాలు చూసి వచ్చేవాళ్ళు” అంది.

ఇది ఖచ్చితంగా సినిమాల ప్రభావంతో మాట్లాడుతోంది అని నిశ్చయించుకున్నాను. ఇది మహా తెలివైన రైలు గేటు. అన్ని విషయాలూ తెలుసుకుని మరీ నన్ను సాధించడానికి సిద్ధపడి వచ్చినట్లు ఉంది అని కూడా అనిపించింది. ఏదో కొంత దీని వ్యధ వినేలా లేకపోతే నన్ను వదిలేలా లేదు. అని దిండుని మంచానికి ఆసరాగా చేసుకొని, రెండు కాళ్ళు చాపుకొని ఓపికగా వినాలని నిశ్చయించుకున్నాను. అందమైన ఆడపిల్ల లంగా వోణీ వేసుకుని, పెద్ద సింధూరం బొట్టుతో, వినయంగా, చేతులు జోడిస్తున్నట్లుగా, ఎప్పుడూ కనపడే మా రైలు గేటు ఈరోజు ఎందుకో, తెలియని మనో వేదనను అనుభవిస్తూ, తనకున్న బాధని చెప్పుకోవాలి అన్నట్లు, గుటకలు మింగుతూ నా ముందుకి ఒదిగి కూర్చుంది.

మన గోడు ని మన అనుకున్న వాళ్ళతో చెప్పుకుంటే కాసింత మనశ్శాంతి ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాన్ని కాబట్టి ఒక చెవిని దాని వైపు పడేసాను.

“నీతో నా అనుబంధం నీ చిన్నతనం నుండి మొదలైంది అంతే కదా” అంటూ “ఒకసారి ఇటు చూడు” అని తన చేతివేళ్ళని గోడ వైపు తిప్పింది. ఏదో పాత సినిమా ఆ..ఆ.. ఆ.. గుర్తొచ్చింది బాలనాగమ్మ ఆ సినిమాలో మాంత్రికుడు తన మంత్ర దండంతో ఒక చోట తాకిస్తే, అందులో నుంచి బాలనాగమ్మ కనిపించినట్లు, తను చెయ్యితో గోడ మీద తాకించిన జాగాలో నాకు నా చిన్నతనం చేతిలో స్కూల్ బ్యాగ్ తో గేటు దాటుతూ వెళ్లడం, నా చిన్ననాటి సంఘటనలు అన్నీ అక్కడ అదే గోడమీదే కనిపించాయి.

ఒక్కసారి నా ఆనందం హద్దులు దాటింది. కళ్ళముందు ఒక్కొక్కటి చిత్రంగా కదులుతున్నాయి. నేను నానమ్మ చెయ్యి పట్టుకొని గేటు దాటడం, దాటుతూ పట్టాల మీద గెంతడంలో కింద పడి పోయి, కాళ్ళకి దెబ్బ తగిలితే, "అమ్మో అమ్మడు పట్టాల మీద పడిపోయింది, ఇంటికి వెళ్లి, దిష్టి తీసి, తాయత్తు కట్టించాలని అరుస్తూ, రైలు పట్టాలకి, రైలు గేటుకి, మెటికలు విరుస్తూ, శాపనార్ధాలు పెట్టుకుంటూ, నా చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళడం అన్నీ అందులో కనిపించాయి. గేటు నావైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. నేనూ తనతో ఆనందంగా శృతి కలిపాను. మాది పల్లెకీ, నగరానికి మధ్యస్థంగా ఉన్న ఊరు. మధ్యస్థం అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, ఇటు పల్లెకీ, అటు నగరానికి మధ్య ఉన్న రైలు గేటు, ఇరువురి అనుబంధాలను అనుసంధానం చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నిస్తూనే వచ్చింది.

కానీ సమాంతరంగా ఉన్న పట్టాల మాదిరిగా, అవి కలిసి ఉన్నట్లుగా కనిపించినా, ఆచార వ్యవహారాలు, ఆప్యాయతలు, అన్నిటిలోనూ భిన్న ధ్రువాలు గా నిలిచాయి అన్నది మాత్రం అక్షర సత్యం అనే చెప్పాలి. అటు పట్నం వాళ్ళు ఇటు రావాలన్నా, ఇటు పల్లె వాళ్ళు అటు వెళ్లాలన్నా, గొప్ప బీదా అన్న తారతమ్యం లేకుండా గేటు మాత్రం దాటవలసిందే. ఆనందంతో పట్టాలు దాటే వాళ్ళ దగ్గర నుండి, ఎప్పుడో వచ్చే రైళ్ల కోసం మూసిన గేటుని తెరవమని తిట్టుకొనే వాళ్ళని, రైలు వస్తుంటే పట్టాల మీద అడ్డంగా పరుగులు పెట్టే అల్లరి మూక ని, ఒకరేంటి, అన్ని రకాల వాళ్ళని ఎంతో సహనంతో భరిస్తూనే వచ్చింది.

గేటు పడిందంటే, అక్కడ ఒక పెద్ద రాజకీయ చర్చావేదిక మొదలైనట్లే. ఊరుని ఉద్ధరించేది శూన్యమే కానీ, ఉద్ధరించినట్లు నటించే నాయకులు అంతా మహానటులు అయిపోయేవారు రైలు వచ్చి వెళ్లే లోపునే. ఇవే కాదండోయ్ ఎన్నో ప్రేమకథలకి కూడా గట్టి పునాదులు మా రైలు గేటు పుణ్యమే అనుకోవాలి. అమ్మాయిలు, అబ్బాయిల కొసరి కొసరి చూపులు, క్రీగంట నవ్వులు అబ్బో చాలా తమాషాలే జరిగేవి. శుభం కార్డుల వరకూ వెళ్ళేవి కొన్ని ప్రేమకథలు మాత్రమే. అయితే సమాంతరంగా కనిపిస్తూ కలవని పట్టాల మాదిరిగా మిగిలిపోయి బాధని మిగిల్చేవి మరికొన్ని. నేను ఆనాటి జ్ఞాపకాల లో పడి తన మాటలకి తల ఊపడం మరిచిపోయాను అనుకుంటా.

తన మాటలు వినకుండా పరాకుగా నేను ఉండడం, చీకట్లో కూడా అనుక్షణం నన్ను గమనిస్తున్నట్లు అనిపించింది.

“ నా మాటలు వినిపిస్తున్నాయా” అని గట్టిగా ఒక్క అరుపు అరిచింది. ఆ అరుపుకి మంచంమీద జారబడి చాపుకొని కూర్చున్న కాళ్ళను, దగ్గరగా ముడుచుకుని బాసింపట్టు వేసుకుని మరీ కూర్చున్నాను. వస్తున్న ఆవలింతలని కూడా ఆపుకుంటూ. మాతో తనకున్న తీపి జ్ఞాపకాల కన్నా, తనతో మాకు ఎదురైన చేదు అనుభవాలే ఎక్కువ అని నేను క్షుణ్ణంగా తనతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. అప్పుడైతేనే నేను పూర్తిగా నిమగ్నం అయ్యి, తన మాటలని వింటున్నానని అర్థం చేసుకుంటుంది అని అనిపించింది.

“నీ వలన మాకు జరిగిన ఉపకారాలు మాత్రమే కాదు, అపకారాలు కూడా ఉన్నాయి. రెండింటినీ ఒక్కసారి విశ్లేషిస్తా ఉండు”. అన్నంతలో చీకటిలో “అన్నిటికీ సిద్ధపడి నీ దగ్గర తేల్చుకోడానికే వచ్చాను’ అన్న మాటలు కాస్త మెల్లగా వినిపించాయి.

“పిల్లలు ఆటలు ఆడుతూ పట్టాల మీద పది పైసల బిళ్లలని సాగదీయడానికి ప్రయత్నించినప్పుడు, ఎంతోమంది ఎన్నో బాధలు తట్టుకోలేక బంధాలు విడిచి తనువు చాలించాలని, నీ పట్టాలపై పవళించి కుత్తుకలు తెగి, నెత్తురోడినపుడు ఎన్ని కుటుంబాలు తల్లడిల్లాయో. అక్కడ ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డావు గాని, నోరు మెదిపి ఒక్కరికైనా తప్పని చెప్పావా. ఈరోజు ఇలా నన్ను ప్రశ్నించుతున్న నీ నోరు, ఆనాడు వాళ్లతో మాట్లాడడానికి ఏమైంది” మామూలుగానే మాట్లాడాను అనుకున్నా. కానీ నా ప్రశ్నల స్థాయి తీవ్రంగా తనకి వినిపించినట్లు ఉంది. చీకట్లో కన్నీళ్ల శబ్దం వినిపిస్తోంది.

“నా మేనకోడలు కొత్తగా పెళ్లి అయ్యి కాళ్ళ పారాణి కూడా ఆరని నిండు గర్భిణీ. పురుటి నొప్పుల కి తాళలేక, అటువైపు వెళ్లడానికి వేరే అవకాశం కూడా లేక, రైలుగేటు ఎత్తే లోపే పసిబిడ్డని ప్రసవించి, అక్కడే తనువు చాలించింది. ఎందుకో అది గుర్తు చేసుకుంటే నా కడుపులో దేవినట్లు అయింది. ఈ చేతులతోనే దానిని పెంచి పెద్ద చేశాను. చెయ్యి పట్టుకొని ఇదే గేటుని దాటిస్తూ బడికి తీసుకొని వెళ్ళిన నేను, దాని చావుని కూడా ఇక్కడే చూస్తానని ఏనాడు అనుకోలేదు. భూమి మీద నూకలు చెల్లిపోయాయని మిన్నకున్నాము. ఏనాడైనా ఒక్కసారైనా నిన్ను తిట్టుకున్నానా. ఆనందానికి, విచారానికి దూరం ఎంతో లేదు. నేను పట్టాల దగ్గర చెవిని పెట్టి వింటున్నప్పుడు అక్కడి నిశ్శబ్దతరంగాల శబ్దాలు వినిపించేవి.

అవి అక్కడ ఆత్మలు పెట్టే ఘోషో, లేక నా అంతరాత్మ ఘోషో తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలే పట్టింది.” ఇలా తనని గట్టిగా అడిగే సరికి అక్కడ స్మశాన నిశ్శబ్దం ఆవహించింది. ఒక్కసారి నన్ను నేను సంభాళించుకున్నాను. బాధతో ఉన్న వాళ్ళని మరింత బాధ పెట్టడం భావ్యం కాదని అనిపించింది. ఎన్నో చిన్న చిన్న సరదాలు గేటు మూసి ఉన్నప్పుడు కొసరికొసరి తీర్చుకున్నవే అని గుర్తు చేసి మరీ, ఈసారి తనని నవ్వించడానికి ప్రయత్నించాను. నాతో మీకు ఉన్న జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా మన మధ్యనే ఈ చీకట్లో కలిసిపోవాలని రైలు గేటు నా దగ్గర మాట తీసుకుంది. నేను మాటలలో నీ ముందు ఓడినా , ప్రేమతో మీ మనసులని కొన్ని సార్లు అయినా గెలిచానని, కొంత ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఇక బయలుదేరడానికి నిశ్చయించుకుంది.

తూర్పు తెల్లవారకముందే, అందరూ లేవకుండానే, “ఇక నేను నిష్క్రమిస్తాను” అంటూ పడమటి దిక్కు కి తిరిగింది. ఇన్ని రోజులుగా మాకు ఏకైక దిక్కైన తనని, నా మాటలతో ఇక బాధపెట్టాలని అనిపించలేదు.

“ మేము రహదారిలో మా నడకని మాత్రమే మార్చుకుంటున్నాము. మా నడతని కాదు. దూరాలని దగ్గర చేసుకోవడానికి మాత్రమే వేరే దారిని వెతుక్కున్నాము. అంతే కానీ నిన్ను దూరం చేసుకోవాలనే ఉద్దేశం మాకు ఏనాడూ లేదు. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లుగా నిన్ను ఏనాడూ తీసి పారేయాలని అనుకోము. మా పిల్లలని గేట్ దగ్గరకి తీసుకొని వచ్చి, రైళ్లు చూపిస్తూ, టాటా చెప్పిస్తూ నీ కనుచూపు మేరలోనే తిరుగుతూ ఉంటాము కదా

మాకు నీ ఆశీస్సులు ఉన్నట్లే మా పిల్లలకూ నీ ఆశీస్సులను ఇవ్వాలి. అర్థం అయ్యింది కదా” అన్నాను. ఆనందంగా నా వైపు చూసినట్లు అనిపించింది.

“ చివరగా ఒక మాట నీతో చెప్పాలి అనుకుంటున్నా” అన్నాను.

‘ ఇంకా సందేహం ఎందుకు, అది కూడా చెప్తే వినేసి వెళ్ళిపోతాను’ అన్నట్లు చూసింది.

“ అన్నిచోట్ల మంచి, చెడ్డ ఉంటుంది. మన మనసు అద్దంలాంటిది. దాని వైపు మనం ఏవిధంగా చూస్తామో మనకు ఆ విధంగా కనిపిస్తుంది. విజేతగా నిలబడాలి అంటే ఎవరినో ఓడించటం మాత్రమే కాదు నిన్ను నువ్వు గెలవటం. నీ ఆత్మ ఘోషతో మమ్మల్ని, మా మనసుల్ని కూడా గెలుచుకున్నావు. ఇక నీకు తిరుగు లేదు. నీతో పంచుకున్న ఈ అనుభవాలని, రైలు కథలుగా రాసి, ఒక పుస్తకంగా అచ్చు వేయించి, మా పిల్లలు, పెద్దలు అందరూ నీ గురించి తెలుసుకునేలా చేయాలని ఉంది” అన్నాను.

రైలు గేటు “రైట్ రైట్ అలాగే కానివ్వు” అంటూ ఆనందపడి నవ్వుతూ పచ్చజెండా ఊపింది. ఎంత ఆదివారం అయితే మాత్రం, బారెడు పొద్దెక్కేవరకు పడుకుంటారా భార్యామణులు. ఎప్పుడూ లేనిది నిద్దరలో కలవరింతలు కూడా మా రాధీ కి అంటూ ఆటపట్టించాడు శ్రీకర్. మన ఆఫీసులకి మాత్రమే ఆదివారం సెలవు. ఆకలికి కాదు కదా అని శ్రీకర్ ముద్దుగా విసుక్కుంటున్నప్పుడు, నేను పలవరించటం ఏమిటో ఎప్పుడూ లేనిది అని ఆలోచిస్తుంటే, అప్పుడు గుర్తు వచ్చింది. నిన్న రాత్రి పడుకునే ముందు కథల పోటీలు గురించి ఇద్దరం మాట్లాడుతూ "రైలు గేటు" మీద నేను రాసిన కథని తనకి వినిపించడం, బాగుందని తను కితాబు ఇవ్వడం కూడా జరిగింది.

కథకి ఇంకా పేరు పెట్టాలని, తనని వెళ్లి పడుకోమని చెప్పి, గెస్ట్ రూమ్ లో మంచం మీద ఆలోచిస్తూ పడుకుండిపోయినట్టున్నాను. శ్రీకర్ కి తెలివి వచ్చి నన్ను లేపి బెడ్రూమ్ వైపు తీసుకుని వెళ్లడం మాత్రం గుర్తుంది. నిన్న రాత్రి నువ్వు రాసిన కథ గురించి నాతో చర్చించిన మాటలే నిద్రలో కూడా మాట్లాడుతున్నావు అన్నాడు. అస్తమానం కథలు రాయడం గురించి ఆలోచిస్తుంటే అంతే మరీ! మొగుడి కబుర్ల కన్నా నీకు నీ కథలే ఎక్కువ అయిపోయాయి ఈమధ్య అని శ్రీకర్ అంటుంటే, మహాప్రభో నన్ను కావాలంటే తిట్టండి కానీ నా కథలని మాత్రం దూషించవలదు.

అని నాటక ఫక్కీలో అంటూ, సుతారంగా తన బుగ్గని ఒక చేత్తో గిల్లుతూ, “ముందు నేను రాసిన కథకి పేరు పెట్టేసి,మెయిల్ కూడా చేసి వచ్చాక, మిగతా అచ్చట్లు, ముచ్చట్లు” అని తనని చూసి నవ్వుతూ, పక్కరూము లోకి పరుగు తీశాను. పుస్తకం అందుకుని పేజీ తిప్పి చూద్దును కదా! నేను ఏ పేరు అయితే నిన్న రాత్రి అంతా ఆలోచించి పెట్టాలి అనుకున్నానో, అదే పేరు ఎర్రరంగు తో, పెద్ద అక్షరాలతో, "ఆత్మఘోష" అని రాసి ఉంది. అంతే! పుస్తకాన్ని ఒక మూలకి విసిరేసి, శ్రీకర్ అని గట్టిగా అరుస్తూ, స్థాణువులా నిలుచుండి పోయాను. ( ముగింపుని పాఠకుల అభిరుచి మేరకు వదిలేద్దాం అని నిర్ణయించుకున్నాను).

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.రచయిత్రి పరిచయం : నా పేరు లక్ష్మీ అయ్యగారి

విశాఖపట్నం

కథలు,ఆర్టికల్స్ రాస్తూ వుంటాను

నా అక్షరాలతో మీ అందరి మనసులను ఆకట్టుకోవాలనేదే నా కోరిక


120 views0 comments
bottom of page