'Athmaviswasam' - New Telugu Story Written By M. Bhanu
'ఆత్మవిశ్వాసం' తెలుగు కథ
రచన: M. భాను
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“నాన్న! ప్లీజ్ డబ్బులు పంపించవా” అని అడిగింది మౌనిక.
ఆ మాటలకు నిట్టూరుస్తూ ఫోన్ పెట్టేసాడు శంకర్రావు.
వంటగది నుంచి వస్తున్న సువర్చల ‘ఎవరూ.. ఫోన్’ అడిగింది.
“ఇంకెవరూ! మన అమ్మాయే.. మౌనిక. డబ్బులు పంపించమని.. ఒక్కగానొక్క కూతురు. దాని జీవితానికి ఇలా రాసి పెట్టాడు భగవంతుడు” బాధగా అన్నాడు శంకరరావు.
“ఏం చేస్తాము.. దాని కున్నది దిక్కుమొక్కు మనమే. మనల్ని కాక ఎవరిని అడుగుతుంది? అయినా మీకు కిందటి నెల చెప్పాను దాని నుండి ఫోన్ రాకముందే మీరే డబ్బులు పంపించండి అని.. పంపించడం ఎలాగూ తప్పదు కదా!” అంది సువర్చల.
“అవును చెప్పావు కానీ మర్చిపోయాను. ఈమధ్య మతిమరుపు కూడా ఎక్కువయ్యింది. దాని జీవితం ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావటం లేదు. పోనీ మన దగ్గరకు వచ్చి ఉండమంటే ఉండదు. ”
“మన దగ్గరికి వచ్చి ఎలా ఉంటుందండి.. మన ఇల్లు మనకే సరిపోదు. మళ్లీ అది, దాని భర్త వస్తే, అతనికి ప్రత్యేకంగా రూమ్ ఉండాలి, బాత్రూం ఉండాలి.
అయినా దాని బాధలు చూస్తూ మనం ఉండలేము. అక్కడే ఉండనివ్వండి. ఇలా నెల నెల డబ్బులు పంపడం, వెళ్లి చూసి రావడం తప్ప ఏమీ చేయలేము ఈ వయసులో. భగవంతుడు పుణ్యమా అని మీకు పెన్షన్ కూడా వస్తోంది కాబట్టి, ఈ మాత్రమైనా చేయగలుగుతున్నాము”
***
శంకర్రావు సువర్చల ఏకైక సంతానం మౌనిక. ఎంతో గారాబంగా పెంచారు. తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపించారు. ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా ఈడు జోడుగా ముచ్చటగా ఉండేవారు. ఎవరు చూసినా ఎంత బాగుంది జంట అనుకునేలా. అందరి దృష్టి తగిలిందేమో, మోహన్ కి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు తీసేసారు.
ఆరోజునండి మౌనికయే తల్లి తండ్రి అయ్యి అతన్ని చూసుకుంటూ కాలం గడుపుతోంది. తండ్రి పంపించే డబ్బులతో నెట్టుకొస్తోంది.
మోహన్ కి తండ్రి లేడు, తల్లి ఉంటుంది. తల్లి తన పెద్ద కూతురు దగ్గర ఉంటుంది. ఆవిడ ఆలానా పాలన ఆ అమ్మాయి చూసుకుంటుంది.
మోహన్ బాధ్యత మౌనిక తీసుకున్నది. మోహన్ చేసేది ప్రైవేటు ఉద్యోగం కాబట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత అతనికి ఏమీ రాబడి లేదు. పక్క పోర్షన్ అద్దెకు ఇచ్చుకుని, నెలనెలా తండ్రి పంపే డబ్బులతో కాలం గడుపుతోంది.
మౌనిక బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేదు, మోహన్ ని అలా వదిలేసి. అత్తగారు వచ్చి చేసే పరిస్థితి కాదు.
ఈసారి శంకర్ రావు కి ఫోన్ లో ఇలా చెప్పింది, “ఈ నెల డబ్బులు తీసుకుని అమ్మానాన్న. మీరు కూడా రండి. ” అని.
ఎప్పుడూ చూడడానికి వెళ్దామన్నా రావద్దనే మౌనిక ఈసారి రమ్మనడంతో, కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు శంకరరావు.
సువర్చలను తీసుకొని శంకర్రావు మౌనిక ఇంటికి వెళ్ళాడు.
ఇంటి బయట టెంటు వేసి ఉంది. మనుషులతో కోలాహలంగా ఉంది. ఆ వాతావరణం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు శంకర్ రావు కి. గుండెలు చిక్కబెట్టుకుని లోపలికి దారి తీశాడు.
తల్లి తండ్రిని చూడగానే మౌనిక ఆనందంగా ఎదురొచ్చి, నాన్న రండి అంటూ పక్క పోర్షన్ లోకి తీసుకువెళ్ళింది. ఆ పోర్షన్ కి మావిడాకులు కట్టి అలంకారం చేశారు.
శంకర్రావు “ఏమిటమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది?” అని అడిగాడు.
“నాన్నా! ఎన్నాళ్ళని మీ మీద ఆధారపడతాను? మోహన్ ని వదిలి ఉద్యోగం చేయలేను. అందుకే, నేను ఇక్కడ ఒక చిన్న కిరాణా కొట్టు, మోహన్ ఆఫీస్ వాళ్లకి కూరలు తయారు చేసి ఇవ్వడము మొదలు పెడుతున్నాను. ఈ బిజినెస్ లో నేను అభివృద్ధి చెందాలని ఆశీర్వదించండి” అని తల్లి తండ్రి కాళ్ళకు నమస్కరించింది మౌనిక.
“మోహన్ కి కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది కొట్లో కూర్చోవడం వలన. బ్యాంకులో లోను తీసుకుని ఏర్పాటు చేశాను. ఇకనుంచి మీరు ఇబ్బంది పడనవసరం లేదు డబ్బులకి. ”
మౌనిక మాటలకు శంకర్రావు దంపతులు ఆనందించి ఆశీర్వదించారు. సుఖంలోనే కాదు కష్టంలో కూడా ఈడు జోడు లాగే కనిపించారు అందరికీ మోహన్, మౌనిక.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.
ధన్యవాదములు 🙏
కథ అనురాగం-బాధ్యతలను-ఓర్మి తెలుపుతున్నది-అభినందనలు.