top of page

అట్ట చెదిరిన పుస్తకాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Atta Chedirina Pusthakalu' Written By Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్


అట్ట చెదిరిన పుస్తకాలు హాల్లో ఉంచడానికి ఇబ్బంది పడతారు.

ఏ అటక మీదికో, స్టోర్ రూమ్ లోకో పంపుతారు.

అలాంటి పాత పుస్తకాలకే ఒక ఇల్లు కేటాయిస్తే....

అప్పుడు అదొక దర్శనీయ స్థలం అవుతుంది.

ఆ పుస్తకాల విలువ పెరుగుతుంది.

అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు.


---------------------------

ఆశ్రమం గేటు తీసుకుని లోపలికి వెళ్లిన రఘుని చూడగానే చెయ్యూపుతూ పలకరించాడు సుబ్రమణ్యం.


"శాంతమ్మా! మా అల్లుడొచ్చాడు .ఓ కప్పు వేడి కాఫీ పట్రా"అన్నాడు హుషారుగా.

రఘుకి మామగారి మొహంలో మునుపు చూడని కొత్త కళ కనిపించింది


"మీ అమ్మా నాన్నా భోజనం చేసి పడుకున్నారు. కాసేపట్లో లేస్తారులే. రా!ఇలా వచ్చి కూర్చో!" అన్నాడు కుర్చీ చూపిస్తూ.



కుర్చీలో కూర్చున్నాడు రఘు

ఇదివరకు మామగారి ముఖం విషాదానికి

బ్రాండ్ అంబాసిడర్ లా కనబడేది .

ఇప్పుడు ఉత్సాహానికి చిరునామాగా మారిపోయి సరికొత్తగా కనబడుతుంటే

ఆశ్చర్యపోతూ చూసాడు రఘు



గతంలో రఘు మామగారింటికి వెళ్లినపుడల్లా ఆయన నిర్వికారమైన చూపులే అతడ్ని పలకరించేవి.

ఎందుకొచ్చిన జీవితం అన్నట్టు ఉండేవాడు

ఎవరితోనూ మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడు ఆయనదగ్గరకు వెళ్లినా



"అమ్మాయి వంటయ్యిందా? పిల్లలు స్కూల్ కి వెళ్ళారా?" ఇలాంటి రొటీన్ ప్రశ్నలు వేసి ఊరుకునేవాడు.


'ఊ'అని ముక్తసరిగా సమాధానం ఇచ్చేవాడు

రఘు.


రోజూ వాళ్ళకది అలవాటైపోయింది. నిరాశ ఒక అంటువ్యాధి . అది పక్కనున్నవాళ్ళనీ పట్టి పీడిస్తుంది .

ఆకులకు వచ్చిన తెగులు వేరుదాకా పాకినట్టు నిరాశ మనసులోని ఆశల చెట్టుని పీల్చి నిలువునా కూల్చివేస్తుంది


సుబ్రమణ్యం కూతురూ అల్లుడు రెండు బజార్ల అవతల ఉంటారు. ఆయన భార్య పోయి రెండేళ్ళయింది.

అప్పటి నుంచీ కూతురే ఆయనకు కావలసినవి వండి పంపిస్తుంటుంది. అల్లుడు తీసుకొచ్చి ఇస్తాడు.

కూతురికి ఇల్లు కదలటం కుదరదు.

ఆమె అత్తా మామా కూడా వృద్ధులు, అనారోగ్యంతో మంచం పట్టారు .

వాళ్ళ సేవతోనే కాలం గడుపుతున్న కూతుర్ని

చూసి బాధ పడతాడు సుబ్రహ్మణ్యం.

ఇంతసేపూ వాళ్ళకి వండి పెట్టడం, మందులివ్వడంలోనే కాలం గడుపుతూ వాళ్లకంటూ ఒక సరదా సంతోషం లేకుండా పోయింది. వాళ్ళకే కాకుండా తనని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్న అల్లుడుమీద కూడా అపారమైన ప్రేమ ఉంది. అంతకు మించిన జాలి ఉంది సుబ్రహ్మణ్యానికి.




"మీ అమ్మ,నాన్నతో పాటు నీ ప్రాణానికి

నేనూ ఒకడిని తయారయ్యాను. ముగ్గురి

ముసలివవాళ్ళ బాధ్యత నీ మీద పడింది . మా వల్ల ఏం ఉపయోగం ఉందనీ? తినడానికి, తాగడానికి తప్ప మేం ఎందుకు బతికున్నట్టు!ఇలా ఇంకెన్నాళ్లు ఈ భూమ్మీద మీకు భారంగా పడుండాలో" అంటాడు

సుబ్రమణ్యం


రఘు స్పందనా రహితంగా చూస్తాడు.

ఇంట్లో అమ్మా నాన్నా, ఇక్కడ ఈయన కూడా అవే మాటలు . అదే నిర్వేదం.



"అలా అనుకోవద్దు మావయ్యా! రేపు మేం మాత్రం ముసలివాళ్ళం అవమా?! మాకు ఈ పరిస్తితి వస్తే మా పిల్లలు మమ్మల్ని ఎలా చూడాలనుకుంటామో మిమ్మల్నీ మేం అలాగే చూసుకుంటాం. మీరేం ఇబ్బంది పడకండి"

అని రఘు ఎంత చెప్పినా సుబ్రహ్మణ్యంని

మాత్రం చింత వీడలేదు


"పెద్దవాళ్ళని బాధ్యతగా చూడాలి అని అనుకోవడం వేరు ,ఆచరించడంలో ఎన్ని ఇబ్బందులుంటాయో నాకు తెలుసు. మేం మీ మీద బలవంతంగా రుద్దబడుతున్నాం" అంటాడు సుబ్రహ్మణ్యం


స్తబ్దతకు చిరునామాగా మారిన వీళ్ళలో తిరిగి బతుకుమీద ఆశ కల్పించడం, చైతన్యం తేవడం మాటల్లో అయ్యేపని కాదని విని ఊరుకుంటాడు రఘు.


"మమ్మల్ని అనాధాశ్రమంలో చేర్పిస్తే మీకు కొంత మనశ్శాంతిగా ఉంటుంది ఆలోచించు" అన్నాడు సుబ్రహ్మణ్యం ఓరోజు


మామగారి మాటలకు ఉలిక్కిపడ్డాడు రఘు.



"మళ్లీ ఏదో కొత్తపల్లవి అందుకున్నానని

కంగారుపడకు .అదేం తప్పుకాదు.

ఆశ్రమంలో వదిలేసి పట్టించుకోకపోతే తప్పు. వచ్చి చూసిపోతుండండి.అక్కడ మాకు వేళకి వండిపెట్టటానికి మనుషులుంటారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామన్న గిల్టీ ఫీలింగ్ మాలో ఉండదు .


మా వయసు వాళ్ళు మాట్లాడుకునే మాటలు వేరుగా ఉంటాయి. మేం నిరాశలోనే ఆనందాన్ని వెతుక్కుంటాం.

చావు గురించి నిర్లజ్జగా మాట్లాడుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకుంటాం.

కొడిగడుతున్న దీపాలన్నీ కలుసుకుని ఒకరి పరితాపాన్ని ఒకరితో పంచుకున్నప్పుడు మాలో మాకే ఒకలాంటి రిలీఫ్ కలుగుతుంది.

అది మీకర్ధం కాదు.


ఇది ఒకనాటితో తీరిపోయేది కాదు. మీరు మాత్రం ఎన్నాళ్లని మా నిర్వేద తత్వాన్ని భరిస్తారు. మీకంటూ జీవితంలో కాస్త ప్రశాంతత కావాలిగా. మొన్న మీ నాన్న కూడా నాదగ్గర ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదేం తప్పుకాదు.ఆలోచించు" అన్నాడు సుబ్రమణ్యం.


"తప్పొప్పులు సంగతి పక్కన పెట్టండి. మీరు అలా ఆశ్రమాల్లో వుండగలరా? పరాయిచోట ఉన్నామన్న భావన ఉండదా? ఇంతబతుకూ బతికి చివరికి..."అన్నాడు రఘు.


"ఎంత బతుకు?! ఏది చివర? ముగుంపు రాయని కధలకు ఒక కొత్త ముగింపు ఊహిస్తే తప్పేముంది?అదేమీ నేరమో ఘోరమో కాదు . ఉభయతారకంగా పదిమందికి ఉపయోగపడే మంచిపని చెయ్యి నాయనా.


పుస్తకాలను భద్రపరచాలంటే గ్రంధాలయం తప్పనిసరి . అట్ట ఊడిన పుస్తకాలదీ అదే పరిస్థితి. మా వయసు వాళ్ళందరం కలిసి ముగింపేప్పుడో తెలియని వర్తమాన జీవిత పుస్తకాలను అనుభవాల దారాలతో కుట్టుకుంటూ మరమ్మతులు చేసుకుంటాం .

మాదో విలక్షణ ప్రపంచం.

ఎక్కువగా ఆలోచించకుండా

వృద్ధుల భద్రతకు నువ్వేం చేసినా అది పుణ్యకార్యమే అనుకోవోయ్. "అన్నాడు సుబ్రహ్మణ్యం.



రఘు తండ్రి కూడా అతనితో అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.


"మా కళ్ళముందు మీరుండాలి,మా అవసరాలు గడవాలి. ఇంతకంటే ఈ వయసులో మాకేం పెద్ద కోరికలు ఉండవు.

చంటి పిల్లలను క్రచ్ లో ఉంచి తోటి పిల్లలతో ఆడుకోమంటారు. ఈ పెద్ద పిల్లల క్రచ్ కూడా అంతే. మీ మావగారు చెప్పినట్టు విని ఈ ఊళ్ళోనే వున్న మన పాతిల్లు బాగు చేయించు.

అందులో వృద్ధులకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించు.

ఇదీ ఓ పుణ్యకార్యమే అనుకో. అవసరమైతే మన ఊరివాళ్ళందర్నీ సంప్రదించి వాళ్ళ సలహాలు కూడా తీసుకో." అని తండ్రి చెప్పినదగ్గర్నుంచీ ఆ విషయం గురించే ఆలోచించాడు రఘు.


ఊరివారందరి సహకారంతో తన తండ్రి పేరుమీద ఉన్న పాత ఇంటిని బాగుచేయించాడు. గదులు కట్టించాడు.

చుట్టూ మొక్కలు నాటించి ,కూర్చోవటానికి బెంచీలు వేయించాడు.

డాక్టర్ నర్స్, వంటమనిషి పనిమనిషి అలాంటి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయించాడు.

ఊరివాళ్ళు కూడా రఘు చేయిస్తున్న ఆశ్రమం పనులకు తమవంతు సహకారాన్ని అందించారు.


ఆ ఊరిలో ప్రతి ఇంట్లోనూ ఉన్న పెద్దవాళ్ళెవరూ ఇప్పుడు

తమ వృద్దాప్య దశను శాపంగా భావించటంలేదు.

మలిసంధ్యను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారు.

అక్కడ ఎవరికి నచ్చినట్లు వాళ్లుండచ్చు.

నచ్చిన పని చెయ్యొచ్చు. నచ్చినట్లు మాట్లాడుకోవచ్చు.


ఇళ్లల్లో వున్నప్పుడు రెండు తరాల వాళ్ళతో సర్దుకుపోవాల్సివచ్చేది. టి వి చూడటానికి కూడా పిల్లలతో పోటీ పడాల్సివస్తే

పిల్లలకే ఓటు పడేది.


వాళ్ళ సర్దుకుపోయే గుణం చివరికి వాళ్ళని మంచానికే పరిమితం చేసింది.


ఆశ్రమంలో చేరాక వాళ్ళకీ స్వేచ్ఛ దొరికింది.

గిల్టీ ఫీలింగ్ పోయింది.వాళ్లలో కొత్త ఉత్సాహం మొదలైంది.


ఆ గ్రామంలో పడకలు, వసతులతో కూడిన గ్రంధాలయంలో

అద్భుతమైన జీవిత పుస్తకాలెన్నో పదిలంగా అమరిపోయాయి.

అస్తమయాన్ని వెతుక్కుంటున్న అట్టచెదిరిన పుస్తకాలు అనుభవతీరంలో విశ్రాంతిని పొందుతున్నాయి.


తను వృద్ధుల ఆశ్రమం నడుపుతూ తప్పు చేస్తున్నానేమో అని రఘు మనసులో ఏమూలో ఉన్న అపరాధ భావం

మామగారి మొహంలో కనబడుతున్న సంతోషాన్ని చూసినతరువాత మాయమైంది .


రఘుతో పాటు ఇంకా చాలామంది తమ తల్లిదండ్రులను చూసిపోవడానికి రోజూ సాయంత్రం పూట వస్తారు.

పిల్లల పలకరింపులతో పెద్దల ముచ్చట్లతో

ఆ ఆశ్రమం ఇప్పుడు పెళ్ళివారిల్లులా కళకళలాడుతూ ఉంది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.




125 views3 comments
bottom of page