top of page

అత్తింటి అవమానాలు



'Athhinti Avamanalu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 03/06/2024

'అత్తింటి అవమానాలు' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఏయ్! సుజీ! కాఫీ తీసుకురా!" హాలులో భర్త విజయ్ పెద్దగా వేసిన కేక వంటింట్లో పనిచేస్తున్న సుజాతకి వినబడింది. 


చేస్తున్న పనిని ఆపి గబగబా కాఫీ చేసి తీసుకుని వెళ్లి ఆయనకి ఇచ్చి వచ్చింది.

కాసేపటికి బ్రేక్ఫాస్ట్ తయారుచేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్తను పిలిచింది. 


"వస్తున్నా!" అంటూ హడావుడిగా వచ్చి కూర్చోగానే ఆయనకి పెట్టి తనూ కూర్చుంది. కాసేపటి తర్వాత విజయ్ ఆఫీసుకు వెళ్గగానే తను వంటింట్లోకి వచ్చి వంట పని గావించి కాసేపు విశ్రాంతిగా కూర్చుంది సుజాత. 


క్రితం రోజున అత్తగారి తిధి. ఆ హడావిడి, వచ్చిన బంధువులకు తనే స్వయంగా వంటివార్పు, భోజనాలతో సాయంత్రం వాళ్లందరూ వెళ్లేదాకా క్షణం తీరికలేకుండా అయింది సుజాతకి. 

ఒళ్లంతా బాగా అలసటగా ఉండి కాసేపు టి.వి. చూద్దామని అది ఆన్ చేయగానే "గుర్తుకొస్తున్నాయి…. గుర్తుకొస్తున్నాయీ…" పాట వస్తోంది. ఆ పాట అంటే చాలా ఇష్టంగా చూస్తున్న సుజాత పాట అయిపోగానే టి.వి. ఆఫ్ చేసింది. సుజాత మనసు అప్రయత్నంగా తన మదిలోని జ్ఞాపకాలు గుర్తొచ్చి గతస్మృతులలోకి పరుగుతీసింది.


అవి తన పెళ్లైన క్రొత్తరోజులు. అప్పుడు తనకు పదహారు సంవత్సరాల వయస్సు.. క్రొత్త పెళ్లికూతురైన తను భయంభయంగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. తనకు స్వతహాగా సిగ్గు, బిడియము ఎక్కువ. క్రితం రోజు తల్లి తండ్రులు వచ్చి దించి వెళ్లగానే మనసులో ఎంతో దిగులనిపించింది. అప్పటిదాకా తను పుట్టిపెరిగిన ఇంట్లో అమ్మానాన్నలతో వాళ్ల ప్రేమానురాగాలతో హాయిగా గడిపింది. 


పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైనగాలి, చిన్న చిన్న సెలయేర్లు, ఆకుపచ్చని వరిచేలు, ఊరిమధ్యన శివ,విష్ణాలయాలు, హైస్కూలు, బాల్యస్నేహితుల మధ్యన ఆటపాటలతో ఎంతో సంతోషంగా గడిపింది. పదవతరగతి మంచి మార్కులతో పాసవగానే తండ్రి ఈ సంబంధం చూడడం, జాతకాలు కలవడం, ఉమ్మడి కుటుంబం, అందరిమధ్యన సంతోషంగా తన కూతురు సుఖపడుతుందని ఆశించి పెళ్లిచూపులు ఏర్పాట్లు చేశారు. 


పెళ్లి వారందరూ రావడం, వాళ్లకు తను నచ్చడం జరిగింది. ఆ మరుసటి నెలలో ఇరువైపులా పెద్దలు పెళ్లిలో ఇచ్చిపుచ్చుకోవడాలు, మర్యాదలు, లాంఛనాలు వగైరా మాట్లాడుకుని తాంబూలాలు పుచ్చుకున్నారు. తర్వాత ఇరవై రోజులకు తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేసి అత్తవారింట కాపురానికి దించి వెళ్లడం జరిగింది.


అత్తగారు, ఇద్దరు బావగార్లు, తోడికోడళ్లు, వాళ్లకి ఇద్దరేసి మగపిల్లలు ఉన్న ఉమ్మడి కుటుంబం కావడంతో నెమ్మదిగా ఆ ఇంటి వాతావరణం, పధ్ధతులు, ఇంట్లోని మనుషులను అర్ధం చేసుకుని ఆ ప్రకారం నడుచుకుంటూఉంది. తోడికోడళ్లిద్దరూ అత్తగారికి మేనకోడళ్లే కనుక ఆవిడ వాళ్లను చాలా ప్రేమగా, ఆదరంగా చూసుకోవడాన్ని గ్రహించింది సుజాత. తనకి కూడా అలాంటి అలాంటి ఆదరణ లభిస్తుందని ఎంతగానో సంబరపడింది సుజాత. 


ఆ ఇంట అత్తగారి మాటకు ఎదురులేదు. అందరితో మంచిగా, వినయవిధేయతలతో ఉంటూ ఇంట్లో ఎవరేంచెప్పినా వాళ్లకు అణకువగా పనిచేసేది సుజాత. స్వతహాగా మెత్తని స్వభావం, ఎదురుచెప్పే ధైర్యం లేనందున అది అలుసుగా తీసుకుని అందరూ ఆమెచేత వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్లు. 


"మాకోడలు చామన ఛాయ, అయినా కోడలిగా చేసుకున్నాము" అని కావాలని తన ముందే అందరికీ గొప్పగా చెప్పేది అత్తగారు. 


వింటున్న సుజాతకి చాలా బాధేసేది. చాలా చులకనగా కూడా మాట్లాడేవాళ్లు. వాళ్ల ప్రవర్తనకు చాలా బాధపడేది సుజాత. తన బాధని భర్తతో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే అతను అర్థం చేసుకోకపోగా వాళ్లనే వెనకేసుకొచ్చేవాడు. అతనికి తల్లిమాటే వేదం. ఆవిడ మాటను జవదాటడు. ఇది గ్రహించిన సుజాత తన బాధలన్నీ మనసులోనే దాచుకుంటూ ఓర్పుగా సంసారం చేస్తోంది. 


ఇలా ఉండగా కొన్నాళ్లకి సుజాత గర్భవతైంది. విషయం తెలిసి అందరూ సంతోషించారు. సుజాత తల్లితండ్రులకు తెలిసి సంతోషంగా వచ్చి కూతుర్ని చూసి వెళ్లారు. రోజులు గడుస్తున్నాయి. ఏడవనెలలో సీమంతం వేడుకలని చాలా ఘనంగా చేశారు సుజాత తల్లి తండ్రులు. అత్తవారింట్లో ఆనవాయితీ లేదుట. కూతురిని పురిటికి పంపమని వాళ్లు 

అడిగితే 'తొమ్మిదవనెల వచ్చాక తీసికెళ్లండి' అని అత్తగారి ఆర్డరు. చేసేదిలేక తలిదండ్రులు మిన్నకుండిపోయి వాళ్ల ఊరెళ్లారు. 'గర్భవతైన సుజాత పనిచేస్తే ఆమెకు కాన్పు సులభం' అన్న వంకతో చాకిరీచేయించుకునేవాళ్లు. 


'ఎప్పుడు తొమ్మిదవనెల వస్తుందా? అమ్మ వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుందామా!' అని ఎదురుచూసేది సుజాత. తొమ్మిదవనెల రానే వచ్చింది. సుజాత తల్లితండ్రులు వచ్చి ఆమెని పుట్టింటికి తీసికెళ్లారు. ఒక శుభముహూర్తాన చక్కటి ఆడపిల్లకు జన్మనిచ్చింది సుజాత. విషయాన్ని సంతోషంగా అత్తింటివారికి కబురుచేసి చూడటానికి రమ్మన్నారు సుజాత తల్లి తండ్రులు. 


ఆడపిల్ల పుట్టిందన్న సాకు చెప్పి భర్త విజయ్ కూడా చూడటానికి రాలేదు. వాళ్ల ప్రవర్తనకు సుజాత, వాళ్ల తల్లి తండ్రులు చాలా బాధపడ్డారు. చివరకు 21 వరోజున పాపకు 'దివ్య' అని పేరు పెట్టి ఎలాగో బారసాల అయిందనిపించి సుజాతను, దివ్యను తీసికెళ్లారు విజయ్ వాళ్లు. 

ఇంక అక్కడికి వెళ్లినాక ముద్దులొలికే దివ్య ను చూసైనా తన పరిస్థితి బావుంటుంది అనుకున్న సుజాత ఆశ నిరాశే అయింది. దివ్య క్రమేణా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తోంది. తనకి మూడవసం… నిండగానే అక్షరాభ్యాసం చేసి మంచి స్కూలులో చేర్చారు. దివ్య చక్కగా చదువుతూ మంచి మార్కులతో పాసవుతోంది. 


కాలం గడుస్తోంది. ఇంకో సం… తర్వాత సుజాత గర్భం దాల్చగానే ఇంట్లో అందరూ సంతోషించారు. నెలలు నిండగానే సుజాతను పురిటికి పుట్టింటికి తీసుకెళ్లారు వాళ్ల తల్లితండ్రులు. ఒక శుభముహూర్తాన సుజాత మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. 

ఆ శుభవార్తను సుజాత తండ్రి వాళ్లకు చెప్పగానే "అయ్యో! ఈసారి ఆడపిల్లేనా!" అనే నిష్టూరాలు. 

ఇవన్నీ ఊహించినదే కనుక సుజాత వాళ్ల మాటలకు ఈసారి అంతగా బాధపడలేదు. ఆ పాపకు "రమ్య" అని పేరుపెట్టారు. ఎప్పటిలాగే అత్తారింట్లో అదే చాకిరీ, అదే పరిస్థితి. విజయ్ ప్రవర్తన ఏం మారలేదు. అతను తల్లి చాటువాడు. ఏదో అంటీముట్టనట్లుగా పిల్లలను చూసేవాడు. ఇంక వాళ్ల స్వభావం మారదు అనుకుని తన బిడ్డలను ప్రాణంగా పెంచుకుంటోంది సుజాత. 

ఇంట్లో ఏ శుభకార్యాలైనా సుజాత చేత నూతన దంపతులకు మంగళహారతిని కూడా పట్టనిచ్చేవాళ్లుకారు అత్త‌, తోడికోడళ్లు. అక్షింతలు వేసి దీవిస్తే వాళ్లకి కూడా నీకు లాగే ఆడపిల్లలు పుడతారనేది అత్తగారు. ఆవిడ మాటలకు, చేసే అవమానాలకు సుజాత ఎంతో బాధపడేది. 


విజయ్ తో చెబుదామనుకుని ధైర్యం చేసి ఒకసారి అతనితో చెప్పగా అతను తల్లిని వెనకేసుకొచ్చి తనపై చేయికూడా చేసుకున్నాడు. ఇంక 'తన ఖర్మ ఇంతే' అనుకుని ఎంతో ఓర్పుగా ఆ ఇంట్లో ఉంటూ తన పిల్లలను పెంచుతోంది సుజాత. 


కాలం గడుస్తోంది. విజయ్ అన్నల పిల్లల చదువులు పూర్తయి వాళ్లకి వేరే చోట్ల ఉద్యోగాలు కూడా వచ్చాయి. 


 దివ్య, రమ్యలు చక్కగా చదువుతూ మంచిగా వృధ్ధిలోకి వస్తున్నారు. వాళ్ల అభివృద్దినిచూస్తూ తన బాధలన్నిటినీ మర్చిపోతూ పిల్లలే ప్రాణంగా బ్రతుకుతోంది సుజాత. పిల్లలుకూడా ఎదుగుతూన్న కొలదీ ఇంటి పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. ముందుగా తండ్రిని మార్చే ప్రయత్నం చేశారు కానీ ప్రయోజనం శూన్యం. 


ఇంట్లో వాళ్లు కూడా అదే తీరు. ఇంక పిల్లలు తమ తల్లిని, ఆమె పరిస్థితిని అర్ధం చేసుకుని తల్లిని ఊరడించి సంతోషపెట్టేవారు. 


కాలం వేగంగా సాగుతోంది. చూస్తూ ఉండగానే దివ్య, రమ్యలు చక్కగా మెరిట్ మార్కులను తెచ్చుకుంటూ ఇంజనీరింగ్ ను పూర్తిచేశారు. సుజాతావాళ్లు వాళ్లకు మంచి సంబంధాలను చూసి పెళ్లి చేశారు. కానీ అల్లుళ్లు అమెరికాలో ఉద్యోగాలు. బుధ్ధిమంతులు, మంచి అల్లుళ్లు దొరికారు అని సుజాత సంతోషపడి ఆ భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకుంది. 


దివ్య, రమ్యలు వాళ్ల భర్తలతో అమెరికా వెళ్లారు. కన్న పిల్లలను అంత దూరంగా పంపుతున్నందుకు బాధపడుతున్న తల్లిని వాళ్లిద్దరూ ఓదార్చి "వాట్సాప్, వీడియో కాల్స్ ఉంటాయి కదమ్మా! ఏమీ బాధపడకు. కొన్నాళ్ళకి నీవే మా వద్దకు వచ్చి ఉండచ్చు" అన్న వాళ్ల మాటలకు తనకి తనే నిబ్బరించుకుని వాళ్లను సంతోషంగా అమెరికా పంపింది. 

అమెరికాలో దివ్య, రమ్యలు సంతోషంగా కాపురం చేసుకుంటూ వారాంతంలో తల్లిదండ్రులకు వాట్సాప్, వీడియో కాల్స్ చేస్తున్నారు. క్రమేపీ విజయ్ మనస్తత్వం కాస్త మారి పిల్లలపై ప్రేమ పెరుగుతోంది. ఇది గ్రహించిన సుజాత సంతోషించింది. క్రమేణా దివ్య, రమ్యలు అమెరికాలో మంచి కంపెనీలలో ఉద్యోగాలను సాధించారు. 


రెండు సంవత్సరాల తర్వాత దివ్య గర్భవతైంది. విషయం విన్న సుజాతా వాళ్లు చాలా సంతోషించారు. అమెరికన్ పౌరసత్వం కోసం అక్కడే పురుడు అన్న కూతురు, అల్లుడి మాట కాదనలేకపోయింది సుజాత. పాస్పోర్ట్ వగైరాలు వాళ్లే ఏర్పాటు చేశారు. తొమ్మిదవ నెలలో సుజాత అమెరికా వెళ్లింది. కొన్ని రోజులయ్యాక దివ్యకు సుఖప్రసవం జరిగి పండంటి బాబు పుట్టాడు. 


విషయం విని విజయ్ తను తాత అయినందుకు చాలా సంతోషించాడు. ఆ బాబుని చూసి విజయ్ తల్లి ఆనందించింది. అమెరికాలో ఆరునెలలు ఉండి కూతురి ఆరోగ్యాన్ని, మనవడి ఆలనాపాలనా చూసి ఇండియాకు వచ్చింది సుజాత. 


 కొన్ని నెలలయ్యాక సుజాతా వాళ్లింట్లో అందరూ పెద్దవాళ్లయ్యారని తల్లి సమక్షంలో ఆస్తి పంపకాలయ్యాయి. విజయ్ అన్నలు వాళ్ల భార్యలతో వేర్వేరు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆఖరికొడుకైన విజయ్ వద్దే ఉంటానని అత్తగారు వాళ్లకు చెప్పి ఇక్కడే ఉంటోంది. సుజాత తనకు జరిగిన బాధలను, అవమానాలను మనసులో పెట్టుకోకుండా తన అత్తగారికి సపర్యలు చేస్తూ ఆవిడను కంటికి రెప్పలా చూసుకుంటోంది. విజయ్ అన్నావదినలు అప్పుడప్పుడు వచ్చి ఆవిడను చూసి వెళ్లేవాళ్లు. 


ఒకరోజున ఆవిడకు పక్షవాతం వస్తే విజయ్, సుజాతలు ఆవిడను కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్చి మంచి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చారు. కొన్నినెలలయ్యాక ఆవిడ నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూసింది. విజయ్, సుజాతలు దుఃఖించి అందరికీ కబుర్లు చేశారు. 


జరిగింది తెలిసి విజయ్ అన్నలు, వదినలు వచ్చి జరుగవలసిన తతంగాన్ని పూర్తిచేసి పదిరోజులపాటు అక్కడే ఉండి అంతా ఎవరిళ్లకు వాళ్లెళ్లారు.. చూస్తూ ఉండగానే విజయ్ తల్లి సంవత్సరీకాలు కూడా పూర్తయ్యాయి. ఏదో చప్పుడైతే సుజాత గతస్మృతులనుంచి తృళ్లిపడి లేచి వంటగదిలోకి వెళ్లింది. 


క్రితం రోజున అత్తగారి ఆబ్దీకమైనాక ఇదివరకు ఆవిడ మాటలు, చేసిన అవమానాలు మర్చిపోదామని అనుకున్నా మనసులో పదే పదే గుర్తుకొచ్చి బాధపడుతోంది సుజాత. 

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



71 views0 comments

Comments


bottom of page