కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Badi Pilichindi' Telugu Story Written By Madhukar Vaidhyula
రచన: మధుకర్ వైద్యుల
చిన్నప్పుడు చదువుకున్న బడి
చిన్ననాటి స్మృతులకు సాక్ష్యం.
ఆ స్మృతులను కాపాడుకోవడానికి పూర్వ విద్యార్థులు నడుం బిగించారు.
వారు విజయం సాధించారో లేదో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ మధుకర్ వైద్యుల గారి కథలో తెలుసుకొండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే. ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే. ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి . ఇంకా ఎక్కడో దూరంగా వినపడుతున్న పాట...అచ్చం నా పరిస్థితి కూడా అలాగే ఉంది. పదేండ్ల తర్వాత నేను పెరిగిన, చదువుకున్న గోదావరిఖనికి పోతున్న. అందులోనూ 24 ఏండ్ల క్రితం పదవతరగతి వరకు కలిసి చదువుకున్న శారద బిడ్డ పెళ్లికి.
ఆమెకు ఇంటర్‌లోనే పెండ్లికావడం, అప్పుడే ఆమె బిడ్డ పెండ్లికి ఎదగడం ఆశ్చర్యమనిపించినా.. ఇప్పటి పరిస్థితుల్లో పెండ్లి పిల్లలు సంసారం అంతా సర్వసాధారణమే అనిపించింది. ఐనా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగడం మంచిది కదా!
24 ఏండ్ల కిందటిమాట..చిన్నతనం నుంచి కలిసి చదువుకున్న స్నేహితులము పదవతరగతి అయిపోగానే విడిపోతున్నామనే బాధతో అందరం ఎంత ఏడ్చామో. తలుచుకుంటే ఒకసారి ఆనందం, ఒకసారి బాధ రెండూ కలుగుతాయి. ఆ విషయం గుర్తు రాగానే ఒకసారి మేము చదువుకున్న బడి కండ్ల ముందు కదలాడింది.
గోదావరిఖని...సింగరేణి పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల ఎక్కడెక్కడి నుంచే అక్కడ బతకడానికి వచ్చిన ఇతర రాష్ర్టాల ప్రజలు, పల్లెలనుంచి బతుకుతెరువుకు వలస వచ్చినవారు. సింగరేణి కార్మికులు ఇలా వేర్వేరు మతాలు, కులాలు, బాషలతో ఒక మినీ ఇండియాను తలపించేది.
దానికి తోడు ఓ వైపు సింగరేణి సంస్థ నడిపే పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులతో నిండుగా కనిపించేవి. సింగరేణి పాఠశాలల్లో సీటు దొరకాలంటే గగనంగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలంటే చిన్నతనంగా భావించేవాళ్లు. అందుకే ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
కానీ నేను చదువుకున్నది పక్కా ప్రభుత్వ పాఠశాలనే. గోదావరిఖని నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణంలో రేకుల షేండ్లతో నిర్మించిన పాఠశాల. యు ఆకారంలో తరగతి గదులుండి ఎంట్రన్స్ గేటుతో చూడ ముచ్చటగా ఉండేది.
పక్కనే ఫ్లే గ్రౌండ్ ఓపెన్‌గా ఉండేది. విశాలంగ ఉండడంతో ప్రతిరోజు సాయంత్రం అక్కడ మా స్కూల్‌వాళ్లే కాకుండా దూరప్రాంతాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఆడుకునేవారితో సందడిగా ఉండేది.
మా క్లాసులో దాదాపు అందరం కూడా రెండు మూడేండ్ల తేడాతో ఒకేసారి స్కూల్‌లో చేరినవారిమే. దాదాపు రెండవతరగతి నుంచి పదవతరగతి వరకు అందరమూ కలిసే చదువుకున్నం అందుకే మా మధ్య అనుబంధాలు, అప్యాయతలు ఎక్కువే. దాదాపు ఇంటర్‌లో ఉండగానే చాలామంది మా క్లాసు అమ్మాయిల పెండ్లిండ్లు అయ్యాయి. కొంతమంది అక్కడితో చదువుమానేస్తే.. కొంతమంది మాత్రం పెండ్లి తర్వాత కూడా చదివి టీచర్లుగా స్థిరపడినవారు ఉన్నారు. ఇక అబ్బాయిలు మాత్రం ఎక్కువగా సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లిపోయారు. కొంతమంది టీచర్లు, ఇతర వ్యాపకాల్లో ఉన్నారు.
ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా! నాపేరు సమీర్. మా నాన్న సింగరేణి ఉద్యోగం కోసం గోదావరిఖని వచ్చినప్పటి నుంచి నిన్న మొన్న రిటైర్ అయ్యే వరకు గోదావరిఖనితో అనుబంధం ఉంది. ఐతే నాన్న రిటైర్ ఐనాక ఊరేళ్లడంతో అక్కడికి రావడం పోవడం కొంత తగ్గిందనే చెప్పాలి. కొంతమంది స్నేహితులు మాత్రమే కాంటాక్ట్‌లో ఉన్నారు. నేను నా ఫీజీ అయ్యాక ఉద్యోగం వెతుక్కుంటూ పోయి హైదరాబాద్‌లో ఒక కంపెనీలో పనిచేసుకుంటున్న.
చిన్నతనం నుంచి కూడా కథలు, పాటలు, కవితలు రాయడం వల్ల నాకు ఆడపిల్లలు, మొగపిల్లలు అందరూ కూడా బాగా సోపతయ్యిండ్లు. అందులోనూ నేను చిన్నతనంలోనే సారావ్యతిరేక పోరాటం, అక్షర ఉజ్వల, విద్యార్ధి ఉద్యమాల్లో ఉండడం కూడా నలుగురిలో గట్టిగా, మొండిగా మాట్లాడేతత్వం కూడా మా క్లాసందరిలో నన్ను ప్రత్యేకంగా నిలిపాయి.
ఏది ఏమైనా నేను ఇన్నాళ్లకు మళ్లీ అక్కడికి వెళ్తున్నానంటే పెండ్లి మాత్రమే కాదు. ఆ పెండ్లికి మా చిన్ననాటి దోస్తులందరినీ పిలిచిన్నని శారధ చెప్పింది. అందుకే ఇరవై నాలుగేండ్ల తర్వాత వారిని కలుస్తున్నననే ఆనందం. ఎవరూ ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ.. ఎంత తొందరగా వారిని చూస్తానా అనే ఉబలాటం. కానీ నా ఆలోచనలు సాగుతున్నంత స్పీడ్‌గా బస్ ఉరుకతలేదు.
మద్యాహ్నాం 12 గంటలకు సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో పెండ్లి. పెండ్లి కాంగానే అందరూ కలిసి మాట్లాడుకోవాలి. యోగక్షేమాలు తెలుసుకోవాలి. వీలయితే అందరం కలిసి ఒక పోటో దిగాలి. అది కూడా మేము చదువుకున్న స్కూల్ ముందు. నా ఆలోచనలు ఇలా సాగుతుండగానే...గోదావరిఖని బస్టాండ్.. అన్నడ్రైవర్ అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను.
బస్సు దిగి చుట్టూ చూశా. నా సోపతిగాండ్లు ఎవరన్న కనిపిస్తారని. కానీ ఒక్కడూ లేడు. ఒక నిరాశ...కానీ నాకంటే ముందే వచ్చి పెండ్లి దగ్గరికీ పోయిండ్లేమోననే ఆశ. ఆ ఆశతోనే బస్టాండ్ బయటకు వచ్చి ఆటో తీసుకుని పెండ్లి జరిగే క్లబ్‌కు చేరుకున్నాను.
పెండ్లి ప్రాంతం సందడిగా ఉంది. బంధువులు, స్నేహితులతో ఎవరి పనుల్లో వారున్నారు. వెనుకవైపు వెళ్లి ఖాళీగా ఉన్న ఒక కుర్చీ చూసుకుని కూర్చున్న. చుట్టూ ఎక్కడ నా స్నేహితులు కనిపించలేదు. ఒక్కసారిగా కండ్లల్లో నీళ్లు తిరిగాయి. పెండ్లి పందిరికి సమీపంలో ఒకరిద్దరూ మా క్లాసమ్మాయిలు కనిపించారు. కొంతలో కొంత ఊరట అనిపించింది.
పెండ్లి వైభవంగా సాగుతుంది. ఇంతలో నామొబైల్ మోగింది. చూస్తే రవిగాడు. వాడు అక్కడే సింగరేణిలో పనిచేస్తున్నాడు. వాడేందుకు రాలేదా అని అనుమానంతో భయటకు వచ్చి హాలో...అన్నాను.
ఓరేయ్ సమీర్ వచ్చినవారా? అన్నాడు.
నీ యబ్బా హైదరాబాద్ నుంచి వచ్చే నేను ముందుగాల రావాల్నా మీరు వస్తార్రా..
అదేం లేదురా.. 12 గంటలకు పెండ్లి అన్నరు కదా అని. బాయి మీద మాస్టారు పడి వద్దామని వచ్చా. వస్తున్నారా? నేను రాజుకుమార్‌గాన్నీ తీసుకుని వస్తరా. ఒక పది నిమిషాలు అన్నడు.
సరే తొందరగా రారా..ఒక్కణ్ణే బోరు కొడుతుంది. అని పోన్ కట్ చేశా.
అన్నట్టుగానే పదినిమిషాల్లో వారిద్దరూ వచ్చారు. చూడగానే ఇద్దరినీ గాఢంగా ఆలింగనం జేసుకున్న. నాకు తెల్వకుండనే కండ్లల్లో నీళ్లు తిరిగినయి. ఆశ్చర్యంగా వారిద్దరి పరిస్థితి కూడా అదే.
ఇంతలో మా చిన్ననాటి మిత్రులాళ్లు రాజేశ్వరీ, పద్మ, రమా దేవి, మణి, భవానీ, సుగుణ, వైజయంతి, రజిత వచ్చారు. వారు కూడా మాతో చేరారు. అక్కడే కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఎన్నోజ్ఞాపకాలు నెమరువేసుకున్నాము.
మా మాటలు ముగిసే సమయానికి పెండ్లి అయింది. భోజనాలు ముగించి అమ్మాయిని సాగనంపాము.
బంధువులంతా పలుచబడగానే మిగిలిన స్నేహితులమే మరికొంతసేపు మాట్లాడుకుని అందరం స్కూల్ దగ్గరికీ పోదామని లేచాము.
మా స్నేహితులకు ఉన్న రెండు కార్లలో అందరం స్కూల్ దగ్గరికీ చేరుకున్నాము. కారు దిగంగానే మా కండ్లను మేమే నమ్మలేకపోయాం.
చూడముచ్చటైన గదులన్నీ కూలిపోయి ఉన్నాయి. ఉన్న నాలుగైదు గదులు కూడా ఇప్పుడో అప్పుడో అన్నట్టు ఉన్నాయి.
మేము పర్యావరణ దినోత్సవం నాడు నాటిన మొక్కలు మాత్రం మహావృక్షాలై పచ్చగా కనిపించినయి.
వాటికిందనే పిల్లలు టీచర్లు కూర్చుని కనిపించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గోదావరిఖని అని నలుపు బోర్డు మీదా తెల్లని అక్షరాలతో మెరుస్తూ కనిపించే బోర్డు సిలుము పట్టి వెక్కిరిస్తున్నది.
గదుల నిండా డెస్క్‌లతో పిల్లలతో సందడిగా ఉండే స్కూల్ అంతా శిథిలావస్థలో కనిపించింది. విరిగిన బేంచీలన్నీ కూలిన గదుల్లో ఒకటిపైన ఒకటి చేరి కనిపించినయి.
ఒకప్పుడు రెండువేల మంది పిల్లలతో అల్లలల్లరిగా ఉండే పాఠశాల చిన్నబోయి కనిపించింది.
అందరం ఒకరి మొకాలు ఒకరం చూసుకొని లోపలికి వెళ్లాము. అక్కడున్న పిల్లలంతా మమ్మల్ని వింతగా చూస్తున్నారు.
మా పదవతరగతి క్లాసురూం పూర్తిగా కూలిపోయింది. బ్లాక్‌బోర్డు ఉన్న గోడ ఒక్కటే ఉండాలా పడిపోవాలా అని చూస్తున్నది.
మాకు తెలియకుండానే ఒకర్ని ఒకరం చూసుకుంటూ మా క్లాసురూం వైపు అడుగులు వేసినం.
అప్పటివరకు మమ్మల్నే గమనిస్తున్న ఒకరిద్దరూ టీచర్లు మేం వెళుతున్న వైపు కదులుతున్నట్టు అనిపిస్తున్నది. కానీ మా కండ్లల్లో రాలుతున్న కన్నీటి మసకలో వారెవ్వరూ కనిపించలేదు.
కూలిన క్లాసురూంలోకి వెళ్లి గదినంతా చూస్తున్నం. రజిత ఐతే ఏడుస్తూ కూర్చుండిపోయింది. సుగుణ, పద్మ పరిస్థితి కూడా అంతే.
నేనైతే నా జుట్టు ఒక్కసారి గట్టిగా పీక్కూని గుండెలమీదా చరుచుకుని మొకళ్లమీద కూర్చున్న.
రాజుకుమార్, రవిగాడు ఏం మాట్లాడలేక అలాగే నిలబడిపోయిండ్లు.
ఇంతలో మా వెనకాలే వచ్చిన టీచర్లు. ధైర్యం చేసి రవిగాన్ని అడిగారు. ఎవరూ బాబు మీరు అని.
సార్ మేము ఈ బడిలో 93-94 బ్యాచ్ పదవతరగతి విద్యార్థులం. ఒకసారి మా బడిని చూసుకుందామని వచ్చినం.
కానీ....అన్నా డు.
ఏం చెప్తాం బాబు. ప్రైవేటు బడులు పెరిగినయి. డిజిటల్‌క్లాసులనీ, టెక్నో అని ఇంకా ఏదో అని ఏవేవో పేర్లతో బడులు పెట్టిన్లు. డబ్బులున్నా లేకున్నా పక్కోడు ప్రైవేటులో చదివితే మనం చదివించాలని తల్లీదండ్రులు అటే పంపుతున్నారు.
రెండెండ్ల కింద 5 వందల మంది ఉండేది. ఇప్పుడు రెండువందలకు పడిపోయింది. స్టూడెంట్స్ లేరని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గదులన్నీ కూలిపోతున్నాయి. ఎన్నిసార్లు ఎంతమందికి మొరపెట్టుకున్న పట్టించుకునే నాథుడే లేరు.
ఎంతమంది లీడర్లకు చెప్పుకున్నా కదలిక లేదు. రేపోమాపో ఉన్న రూములన్నీ కూలిపోతాయి. ఈ చెట్లు కూడా నీడనిచ్చినన్ని రోజులు నీడనిచ్చి ఆ తర్వాత ఇవ్వి కూడా అలసిపోతాయి. ఇప్పటికే ఇక్కడి ఎమ్మెల్యే ఉన్న రూములను కూలగొట్టి ఇక్కడ కాంప్లెక్స్ కట్టాలని చూస్తున్నాడు, అదే గనుక జరిగితే అప్పుడు మనమంతా ఇక్కడ ఒకపుడు గవర్నమెంట్ బడి ఉండే అని చెప్పుకోవడం తప్ప ఏం చేయలేం. ఆ టీచరు నిరూత్సహంగా చెపుతున్న తీరు మా మనసును ఎక్కడో గెలికినట్లనిపించింది.
మరి దీనికి పరిష్కారం లేదా సార్? ఉండబట్టలేక అడిగిన.
ఎందుకులేదు బాబు. పదిహేను గదులకు బదులు పది ఉన్నా చాలు. తిరిగి కట్టి కంప్యూటర్‌లు పెట్టి ఒక కంప్యూటర్ టీచర్‌ను ఏర్పాటు చేస్తే ఒక రెండెండ్లు కష్టపడితే పూర్వ వైభవం తప్పక వస్తది. కానీ ఎవరున్నారు బాబు. అంతగా పట్టించుకునేవారు ఎవరూ?
అందరి మనస్సులు ఒక్కసారిగా కలుక్కుమన్నాయి. అందరం వెళ్లి ఒక చెట్టుకింద కూలిన గదుల్లోని ఇటుకలు వేసుకుని కూర్చున్నం. అందరి ఆలోచనలు ఒక్కటే బడికి పూర్వవైభవం తీసుకురావడం ఎట్ల.
ఇంతలో ఇద్దరూ విద్యార్థులు రెండు గ్లాసులు, జగ్గునిండా నీళ్లు తీసుకువచ్చి తాగడానికి ఇచ్చారు.
అన్న..మా బడి తీసేస్తారా? అందులో ఒక అబ్బాయి అడిగిండు.
అందరి కండ్లల్లో నీళ్లు తిరుగుతుండగా వాన్ని చూసి ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోయాం.
ఇంతలో వాడే సార్ మా నాయిన కూరగాయలమ్ముతాడు. సర్కారు బడికంటే పంపుతున్నాడు కానీ లేదంటే బడిమానిపించి కూరగాయలమ్మడానికి తీసుకుపోతాడు. నాకు చదువుకోవాలని ఉంది అన్న. వాడి కండ్లల్లో నీళ్లు తిరుగుతుండగా వాడన్నమాటలు మా గుండెల్లో చూటిగా గుచ్చుకున్నాయి.
అరేయ్ తమ్మి....నువ్వేం ఫికరుగాకు. మన స్కూల్‌కు ఏం గాదు. సూడు వచ్చే ఏడాదికల్లా కొత్త బడిని చూస్తవుపోరా.....ఒకింత ధైర్యంగా చెప్పిన.
మా స్నేహితులంతా ఒక్కసారిగా నావైపు చూశారు. నేను అంతే దైర్యంతో వారిని చూసి నవ్విన.
పిల్లలు అక్కడి నుంచి వెళ్లగానే నా ప్లానంతా చెప్పిన. వారంతా సంతోషంగా చేతులు కలిపిండ్లు. ఆ క్షణం ఎవరిదారిన వారు పోయినం. పదిరోజుల్లో 500 మంది ఇది వరకు మా బడిలో చదివిన వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులతో ఒక లిస్ట్ తయారైంది.
ఆ రోజు మేము అనుకున్నట్టు ఎవరికీ ఉన్న కంట్టాక్ట్‌లతో వారు నెంబర్లు, అడ్రాస్‌లు సేకరించినం.
అందరం కలిసి ఒక మ్యాటరు తయారు చేసి పోస్టర్లు, పాంప్లెంట్స్ తయారు చేసాం. అందులో...
నేను బడిని...సర్కారు బడిని..సర్కారు పట్టించుకోని బడిని గోదావరిఖని సర్కారు బడిని.
గడిచిన యాబైఏండ్ల సంది పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో వేలమందికి విద్యాబుద్దులు నేర్పిన అమ్మ ఒడిని. నా గుడిలో చదువుకున్న ఎందరో డాక్టర్లు, కలెక్టర్లు, సాఫ్ట్‌వేర్, ఇంజనీర్లు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు, టీచర్లు, నటులు, సింగరేణి అధికార్లు ఇట్ల ఎందరికో ఊపాధినిచ్చాను. ప్రతి ఏడాది ఒక్కోబ్యాచ్ నా నుంచి మీరు వెళ్లిపోతుంటే నా ఆయుష్సు తగ్గుతున్న బాధ. అయినా మీరంతా నా బిడ్డలేనన్న నమ్మకం. అందుకే మీరు ఎక్కడ ఉన్నా. ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్నొన్ని.
కానీ బిడ్డలారా...ఇప్పుడు నేను ఆయుషు నిండి...కాళ్లు చేతులు కదలక శిథిలమై చావుకు దగ్గరైన. ఒక్కసారన్న మిమ్మల్ని చూసి ఆరిపోవాలని కోరుకుంటున్న.
కానీ బిడ్డలారా...మీరు చదువుకున్నట్టు మీ తరువాతి తరం చదువుకోవాలంటే మీరంతా తలో ఒక చేయి వేసి నన్ను నిలబెడితే మరో యాభై ఏండ్లు మీ బిడ్డల చదువుల గుడినవ్వుతా.. లేదంటే మీ కండ్లముందే కనుమరుగవుతా....
ఇట్లు
మీకు చదువు నేర్పిన సర్కారుబడి
కింద గోదావరిఖని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిరక్షణ సమితి పేరుతో గోదావరిఖని అంతటా పంపిణీ చేయడంతో పాటు మేము
సేకరించిన అడ్రాస్‌లతో పాటు పోన్‌నెంబర్లకు లేటర్లు, వాట్సాప్‌లలో పంపినం. పదిరోజుల వరకు ఎలాంటి స్పందనలేదు.
కానీ పదవరోజు ఒక లేటర్ అమెరికా నుంచి 90 బ్యాచ్‌లో చదివిన విద్యార్థి నందకిశోర్. రెండున్నర లక్షల చెక్కు పంపిండు. అవసరమైతే ఇంకా పంపుతానని లేఖ సారాంశం. నెలరోజుల్లో 20 లక్షలు జమాయ్యాయి.
ఇంతలో ఎలాక్షన్లు రావడం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఓడిపోయి సామాజిక బాధ్యతగా మెదిలే వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో మాకు మరింత దైర్యం వచ్చింది. వెంటనే వెళ్లి విషయమంతా చెప్పి. 20లక్షలు ఇచ్చాము.
కానీ ఆయన చాలాసేపు మాట్లాడి ఆ డబ్బులు మాకే ఇచ్చి మరో 3 లక్షల రూపాయాలతో కంప్యూటర్లు కొనిస్తానని హామీ ఇచ్చాడు. వెంటనే ఒక కాంట్రక్టర్‌ను పిలిపించి మా ముందే అన్నీ విషయాలు మాట్లాడాడు.
ఆయన 20 లక్షలకు పది గదులు నిర్మించడంతో పాటు తన సాయంగా ఒకవేదిక నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చాడు.
అనుకున్నట్లే ఏడాదికాలంలో ప్రభుత్వ పాఠశాలకు తిరిగి పూర్వరూపం వచ్చింది. ఎమ్మేల్యే హామీ మేరకు 10 కంప్యూటర్లు కొనిచ్చాడు. కంట్రాక్టర్ వేదిక నిర్మించాడు.
2019 ఆగస్టు....
ప్రియమైన స్నేహితులారా!
నిజంగా ఇది ఒక అపురూప గట్టం. ఒక ఏడాది క్రితం పదిమంది పూర్వ విద్యార్థులు వచ్చి కన్నీళ్లు కార్చి. మా బడికి పూర్వవైభవం తెచ్చుకుంటాం అంటే నేను ఇవ్వన్ని ఉత్తమాటలనుకున్నా...కానీ ఆ పదిమంది ఇక్కడ చదువుకున్న వందలాది మందిని కదిలించిన్లు. వారికున్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్నరు. ఒకటికాదు రెండు కాదు 20 లక్షలు పోగుచేసి ఇగో ఇప్పుడున్న ఈ బడికి తిరిగి ప్రాణం పోసిన్లు. వారందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్న అంటూ మేం ఏర్పాటు చేసిన గదుల ప్రారంభంతో పాటు మా పదవతరగతి బ్యాచ్ సిల్వర్‌జూబ్లీలో పాఠశాల హెచ్ ఎం కన్నీటి పర్యంతమయ్యిండు.
నిజంగా ఇది అద్బుతమే... మన పక్కన ఎవరికన్న కష్టం వస్తేనే పట్టించుకోని నేటి కాలంలో తాము చదువుకున్న బడికి తిరిగి ప్రాణం పోసిన పూర్వ విద్యార్థులు అభినందనీయులు అని నేను కంప్యూటర్లు కొని ఇచ్చాను. ఇప్పుడు మరో మాట కూడా ఇస్తున్న ఆ కంప్యూటర్ టీచర్‌కు నేనే నెలనెల నా స్వంత డబ్బులతో జీతం ఇస్తానని వేదికసాక్షిగా స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చాడు.
ఆ పాఠశాల విద్యార్థుల ఆనందానికి హధ్దుల్లేవు. ఆ కార్యక్రమానికి వచ్చిన మరికొంతమంది ఇచ్చిన నిధులతో బడికి పర్నీచర్ కొనాలని నిర్ణయించుకున్నాం.
కార్యక్రమం ముగిసి బయటకు వస్తూ వెనక్కి తిరిగి చూశాం, ఇప్పుడు అదే గదుల ముందు ప్రభుత్వ ఉన్నత పాఠశాల బోర్డు మెరుస్తున్నది.
ఆనందంతో స్నేహితులకు వీడ్కోలు పలికి హైదరాబాద్ బస్సెక్కిన......
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
----------------------------------------------------------
రచయిత పరిచయం :
పేరు: మధుకర్ వైద్యుల
తండ్రి పేరు: సుధాకర్
చదువు: ఎం.ఎ, పీజీడీసీజే
రచనలు: స్వతంత్రసుమాలు ( కవిత్వం)-2014, నువద్ధి(కథలు)-2021, బొగ్గుపూలు (కవిత్వం)-2021, వలపోత (కరోనా కవిత్వం)-2022,
జర్నలిస్టు, కవి, రచయితగా
మధుకర్ వైద్యుల అను నేను జర్నలిస్ట్గా, కవిగా, రచయితగా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందిస్తున్నాను. ఆయా రంగాల్లో నా ప్రతిభకు తగిన గుర్తింపు కూడా పొంది ఉన్నాను. ఆయా రంగాలకు సంబంధించి పూర్తి వివరాలు.
కవిగా....
నా పదమూడవ ఏటా తొలిసారి కవిత రాశాను. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో మా స్కూల్ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తీసిన ‘శాంతికిరణం’ అనే పాఠశాల మ్యాగజిన్కు ‘జ్ఞాపిక’ అనే కవిత తొలిసారి రాశాను. అప్పటి నుంచి నిరంతర కవితా ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్లో ఉండగా కాలేజీ మ్యాగజిన్ ‘దర్శన’ కోసం ‘వరకట్న పిశాచాలు’ అనే కవిత, ‘అమ్మకావాలి’ అనే కథ రాశాను. ఆ తరువాత అనేక పత్రికలు, మ్యాగజిన్లు, ప్రత్యేక సంచికల్లో నా కవితలు ప్రచురితమయ్యాయి. నా రచనలకు గాను 2005-06 సంవత్సరానికి గాను జిల్లా యువజన సంక్షేమ శాఖ ఉత్తమ యువ రచయిత అవార్డు అందుకున్నాను. ఇక నేను రాసిన కవితలతో 2014 సంవత్సరంలో ‘స్వతంత్ర సుమాలు’ పేరుతో కవితా సంపుటి తీసుకు వచ్చాను. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డిలు ఈ పుస్త కాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ వెలు వరించిన ‘తంగేడువనం’, ‘తొలిపొద్దు’ కవితా బకవుల సంకలనంలోనూ నా కవితలు అచ్చయ్యాయి. రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య తీసుకువచ్చిన ‘వినియోగం’, చెన్నైకి చెందిన మాడభూషి సంపత్కుమార్ స్వర్గీయ అబ్దుల్కలాం మీదా తీసుకువచ్చిన ‘ఒకవిజేత’ ఇలా పలు కవితా సంకలనాల్లో నా కవితలు అచ్చయ్యాయి.
రచయితగా......
కవితలతో పాటు నాటికలు, కథలు రాయడం కూడా చిన్నతనం నుంచే అలవాటయ్యింది. నేను పదవతరగతిలో రాసిన ‘పేరులోనేముంది’ అనే హాస్యనాటిక అనేక వేదికల మీదా ప్రదర్శించబడి పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత పలు కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ‘ అమ్మకావాలి’, ‘బతుకు చిత్రం’, ఒక అమ్ము ఒక అభి’, ‘ప్రేమిస్తే’ ‘కడప టూ హైదరాబాద్ వయా అనంతపూర్ తదితర కథలు ప్రజాశక్తి, సూర్య దినపత్రికల్లో అచ్చయ్యాయి. 2015లో రాసిన ‘మా ఊరి జాడేది’ అనే కథకు గాను నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితివేత్త నోముల సత్యనారాయణ పేరుమీదా ఇచ్చే ‘నోముల కథా పురస్కారం’ అందుకున్నాను.
జర్నలిస్టుగా
నా 1996లో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన నేను పాత్రికేయునిగా కోల్వాయిస్, చర్చ, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో పాత్రికేయునిగా సేవలందించాను. ఆ తర్వాత సూర్య దినపత్రికలో సబ్ఎడిటర్గా చేరి ప్రతిభ చూసి అనతికాలంలోనే ఆదివారం అనుబంధం ఇన్చార్జ్గా, ఫీచర్స్ ఇన్చార్జ్గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో సీనియర్ జర్నలిస్ట్గా సేవలందిస్తున్నారు. ఉద్యమసమయంలో ఎంతోమంది తెలంగాణ కళాకారులు, సామాజిక కార్యకర్తలను వెలుగులోకి తీసుకువచ్చి ఉద్యమానికి చేయూతనిచ్చాను. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక కథనాలతో అనేక కవర్స్టోరీలు రాస్తూ పలువురి మన్ననలు అందుకున్నాను.
అందుకున్న ఆవార్డులు
-డా. కాలువ మల్లయ్య సాహితీ స్పూర్తి పురస్కారం-2022
-ఫీచర సునీతారావు సాహితీ పురస్కారం-2022
-బి.ఎస్.రాములు సాహితీ ప్రతిభాపురస్కారం-2019
-తెలంగాణ సాహిత్య అకాడమీ కవితాసప్తాహం-2019
-రాష్ట్ర పర్యాటక శాఖ వారి టూరిజం ఎక్స్‌లెన్స్ ఆవార్డు-2018
-మధురవాణి డాట్.కం(అమెరికా) వారి ఉత్తమ కథా పురస్కారం-2017
-బండికల్లు వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్ జాతీయ కవితల పోటీ-2017
-ప్రపంచ తెలుగు మహాసభల్లో మంత్రి డా౹౹ లక్ష్మారెడ్డితో సత్కారం-2017
-తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారి రాష్ట్రకవితల పోటీలో ద్వితీయ
బహుమతి-2017
-సామాజిక రచయితల సంఘం రాష్ట్రస్థాయి కవితల పోటీలో ద్వితీయ బమతి-2017
- తెలంగాణ సాహితీ వేదిక (కరీంనగర్) వారి రాష్ట్రస్థాయి కథల పోటీల్లో ద్వితీయ
బమతి-2016
- రాష్ట్ర పర్యాటక శాఖ వారి టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు-2016
- చీటి జగన్రావు స్మారక జిల్లా ఆత్మీయ సేవా పురస్కారం -2016
- నోముల సత్యనారాయణ కథాపురస్కారం-2015
- జాగృతి కవితా పురస్కారం-2015
- కువైట్ ఎన్నారైస్ డాట్కం ఉత్తమ కవితా పురస్కారం-2015
- సాహితి సేవా ఉత్తమ కవితా పురస్కారం -2014
- జాగృతి కవితా పురస్కారం-2013
- నేషనల్ యూత్ ప్రాజెక్ట్ వారి బెస్ట్ యూత్ అవార్డు-2008
- జిల్లా యువజన సంక్షేమ శాఖ ఉత్తమ యువ రచయిత అవార్డు -2005-06
- ఫోక్ ఆర్ట్ అకాడమీ వారి గ్రామీణ కళాజ్యోతి అవార్డు-2004
- బెస్ట్ జర్నలిస్ట్గా పద్మపీఠం పురస్కారం-2003
- బెస్ట్ వాలంటరీగా శాతావాహన కళోత్సవాలలో సర్టిఫికెట్-2003
- శివజ్యోతి జానపద కళా మిత్ర మండలి వారి జిల్లా ఉత్తమ యువకవి అవార్డు-2002
- నెహ్రూ యువకేంద్రం సర్టిఫికెట్-2001
ashok garipelli • 3 hours ago
అభినందనలు ఒక గొప్ప ప్రయత్నం మంచి కథ