top of page

బహుమానం


'Bahumanam - New Telugu Story Written By Bhagavathula Bharathi

'బహుమానం' తెలుగు కథ

రచన: భాగవతుల భారతి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"వీరలక్ష్మి ఎలా ఉందో! పెళ్ళి చేసుకుని ఉండదు. అదృష్టవంతురాలు." మనసులో అనుకున్నాననుకుని పైకే అనేసాను.


"వీరలక్ష్మి ఎవరమ్మా!" పాప ప్రశ్నకు


“నాతోపాటు టెన్త్ క్లాస్ చదివిన బెంచ్ మేట్.".. నా జవాబు.


"ఆమె పెళ్ళే చేసుకోదని ఎందుకనిపించింది?” ఈయన ప్రశ్న.

"స్కూల్ లో చదివే రోజుల్లోనే ఆమె కుడిచేతికి 'బోద' ఉండేది. చిన్నప్పుడు ఆ విషయం పట్టించుకోలేని పసితనం. ఇప్పుడు అప్పుడప్పుడూ గుర్తుకు వస్తూ ఎక్కడుందో.. అని.."


"అయ్యో! 'బోదకాలు' లాగా 'బోదచెయ్యి'.. ఎంత బాధాకరం. ఎవరో ఒకరు చేసుకునే ఉంటారులే!".. ఈయన మాట పూర్తి కాలా..

"పెళ్ళేంపెళ్ళి. వెధవపెళ్ళి. వెధవమెుగుడు వెధవసంసారం.. వెధవలంపటం. వండా..పెట్టా.. ఇదేగా..

పెళ్ళి కానివాళ్ళు ఎంత అదృష్టవంతులో.." విసురుగా నేనన్నమాటలకు ఈయన చిన్నబుచ్చుకొని

"ఈమాట చాలాసార్లు అన్నావ్. సంసారమంటే అంతచేదుగాఉందా?" అంటూ పేపర్లో తలదూర్చారు.

"ఎన్ననుకున్నాతప్పదుగా!" అంటూ వంటగదికేసి విసుగ్గా విసవిసా వెళ్ళాను.

వెడుతూవెడుతూ "జీవితం మీదే విరక్తి పుడుతోంది.. ఛీ" అన్నాను.


“నిజమే! పెళ్ళి చేసుకోని వాళ్ళ జీవితమే బాగుంది. హాయిగా ఉన్నారు. లేస్తూనే, ఇళ్ళు ఊడవటాలూ, బట్టలూ, అంట్లూ, వంటలూ, పిల్లల్ని స్కూల్ కి పంపటాలూ! బాక్స్ లూ, వచ్చిపోయే అతిథులూ మళ్ళీ కాఫీలూ, టీలూ, సరుకులు తీసుకురావటానికి, సూపర్ మార్కెట్ లకు వెళ్ళటం. ఇవన్నీ రొటీన్, అయిపోయినా, వేలెడు సాయం చేయక పోయినా,"ఇంటిపెత్తనం, డబ్బులతో సహా నీదేగా!"అనే శ్రీవారూ!


చాకిరీ చేయలేక, విసుగువచ్చి, చాలాసార్లు చికాకూ వచ్చేస్తోంది. ఓ రచయిత్రిగా రచనలు చేస్తూ, ఇదిగో! ఇలాంటి పనులతో ఆడవాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతూ సతమతమయ్యే అంశాల గురించి, పత్రికలలో వ్రాస్తూ, పాపులర్ రచయిత్రినే అయ్యాను.


"నీకేమోయ్! ఇంటిపని చేసుకుంటూనే చక్కటి రచయిత్రి వయ్యావుగా" అంటారీయన.


"ఇంత చదివాను. ఉద్యోగం చేయనిచ్చారా? ఏమన్నానా? వెధవ సంసారం"అన్నాను ఎన్నోసార్లు.

"ఇల్లాలి ఉద్యోగమేమన్నా తక్కువనుకుంటున్నావుటోయ్. ఇదే కష్టం. నీతో కలిపి నలుగురు మేథావుల్ని సమాజానికి అందిస్తున్నావు. నువ్వే గొప్పదానివి. ఎక్కడతిరిగినా, ఎంతతిరిగినా, ఇల్లేకదా! స్వర్గధామం!?"


"మా పని ఎవరు గుర్తిస్తున్నారుటా?! ఇంటిపనేగా, వంటపనేగా! అని ఈజీగా అంటారెవరైనా" మూతి తిప్పుకుంటూ నేనన్న మాటలకు..


"ఎవరో ఎందుకు? నేను గుర్తిస్తాను. వంటింట్లో ఆడవాళ్లు లేకుండా ఏదీ జరగదు. నేను ఇంత ఆఫీసర్ ను కాగలిగానంటే, కారణం ఇల్లూ, ఇల్లాలూనూ!" ఈయన ఎన్ని కితాబులిచ్చినా..


ఏదో అసంతృప్తి. ఇల్లూ, సంసారం, పిల్లలూ ఇదంతా ఓ లంపటం. పెళ్ళిచేసుకోని వారూ, మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నఆడవాళ్ళే సుఖంగా ఉన్నారు అని!


ఫోన్ మ్రోగుతోంది. ఆయనే తీసి ఏదో మాట్లాడారు.

"భానూ! మీ టెంత్ బ్యాచ్ వాళ్ళు ట. గెట్ టు గెదర్ ట. ఈనెలలోనేట. కారు తీసుకుని వెడితే వెళ్ళిరా!"


"ఎక్కడికి వెళ్ళినా, సాయంత్రానికల్లా తిరిగిరావాల్సిందే! తిరిగివచ్చి, ఆగిపోయిన పనులన్నీ చచ్చినట్టు చేసుకోవలసిందే కదా! ఇందులో ఏదీ తప్పదుకదా!" అని నిట్టూరుస్తూ బయలుదేరి వెళ్ళాను.

స్కూల్ ఆవరణలో కారు దిగేసరికి ఎన్నో కళ్ళు, ఎన్నో భావాలతో నన్ను పలుకరించాయ్.

కొన్ని ఈర్ష్యతో, కొన్నిప్రశ్నలతో ఇంకొన్ని భావరహితంగా..


పూర్ణ ఎదురొచ్చి లోపలికి తీసుకెడుతూ "భానూ! వచ్చేసావా!? కారు సొంతమేగా? నీకేమోయ్ బాగాచదువుకున్నావ్! నేనేమో టెంట్ తో ఆపేసి బావమీద వ్యామోహంతోపెళ్ళి చేసేసుకున్నాను. అందుకేనేమో నా పిల్లలను బాగా చదివించా" నిట్టూర్పులు.


హిమ "భానూ! బాగున్నావా!? నీకేం సూపర్. అప్పట్లో నేను చదువుకుంటానని గీ పెట్టినా నన్ను చదివించలా.. ప్చ్.. ఇంటిపనీ వంటపనీ!.. చదివినా నువ్వు చేసేదీ అదేగా!" అంది.


ఇలా ఫ్రెండ్స్ లో చాలా మంది చదువులు లేకుండానే పదిలోనే పెళ్ళిళ్ళయిపోయాయ్.

మెుదటిసారిగా నన్ను ఇంత చదివించిన అమ్మా నాన్నలకు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నా!


"వీరలక్ష్మీ బాగున్నావా?! నువ్వు చాలా సార్లు గుర్తుకువచ్చావ్!"


"ఏం బాగూ! చదవటమైతే చదివాను. నేను ఈ జిల్లాకే డిప్యూటీ కలెక్టర్ ని. ప్చ్ ఏం లాభం? తెలుసుగా! నాచెయ్యి 'బోద'. పెళ్ళీ పెటాకులూ లేవు. అక్కా పిల్లలూ నాదగ్గరే ఉంటున్నారు.

బావకి ఇద్దరు పెళ్ళాలు. అటూఇటూ తిరుగుతూ ఉంటాడు. నాకు వాళ్ళూ, వాళ్ళకునేనూ.."


"మరిఅక్క, బావ నీతో బాగుంటారా? బావ నీతో అడ్వాన్టేజ్ తీసుకోలేదుగా సంతోషించు. నువ్వు కలెక్టర్ హోదాలో సూపర్"


"ఏం సూపర్!? అక్కకు బావమీద కోపం వచ్చినప్పుడల్లా, డబ్బు కావాల్సినప్పుడల్లా, కోపం నా మీదచూపించి, డబ్బులు ఇస్తే చల్లబడుతుంది. నాకూ సంసారం ఉంటే.. ప్చ్.. అదృష్టం లేదు." కన్నీళ్ళు పెట్టుకుంది.


"విజయా! నిన్నుచూసి చాలా రోజులయింది. వీరపత్నివీ! వీరమాతవీట కదా?! భర్తనీ, కొడుకునీ కూడా దేశానికి బహుమానం గా ఇచ్చావ్.."


"ప్చ్.. ఏం ఒరిగిందనీ? అవార్డ్ లూ పతకాలూ తప్ప.. బైటికి పొంగిపోతాం.. లోపల అభద్రతాభావం.. సరిహద్దు దేశాలు, నా భర్తశవాన్ని నాకే బహుమతిగా పంపాయి. ప్రభుత్వం వీరమరణం పొందాడని.. సైనిక వందనంతో గంధపు చెక్కలతో కాల్చిన బూడిదతో పాటు, ఆయన సైనిక డ్రస్ నా చేతిలో పెట్టింది.


ఈగౌరవం అంతా చూసి నాకొడుకూ సైన్యంబాట పట్టాడు. వాడు బహుమానం గా శవమై వస్తాడో, దేశగౌరవాన్నే తెస్తాడో చూడాలి." సన్నటి కన్నీటి పొరను దాటుకుంటూ మళ్లీ అంది..


మళ్ళీ విజయే "ఇక నా కూతురు.. స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ మీద మెడల్స్ కొడుతోంది. వయసువచ్చింది, ఇకఆపి పెళ్ళి చేసుకోమన్నాను. కానీ ఒలింపిక్స్ లో ఏదో ఓ మెడల్ దేశానికి కానుకగా తీసుకువచ్చాకే పెళ్ళి అంటోంది."


"మంచిదేగా! మీకుటుంబాన్ని చూసి దేశం గర్వపడుతుందిగా"


"మరినేనూ! ఏకాకిగా బ్రతకాలా? అదికూడా నీలాగా చదువుకుని, చక్కగా పెళ్ళి చేసుకుని, ఒద్దికగా ఉంటే ఎంతచక్కగా ఉంటుంది."


ఐన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతం గుర్తుకు వచ్చింది. సాపేక్షం అంటే పోలిక. ఒకదాన్ని మరొకదానితో పోలిక. అన్నీ, అంతా సాపేక్షమే. ఎంత చిన్న విషయమైనా పెద్దవిషయమైనా, దేన్నీ మరొకదాని ప్రసక్తి లేకుండా, మరొక దానితో పోల్చకుండా చెప్పటానికి వీలులేదు. విశ్వంలో సాపేక్షం కానిది అంటే.. మరో దానితో పోల్చబడనిది ఏదీలేదు.


ఉంటే గింటే విశ్వానికి అవతలే. ఈ ప్రమేయమే అన్నిటిలోనూ హెచ్చుతగ్గులుచూపించే కొలమానం. దానికి చాలా ఉదాహరణలు ఇచ్చాడు, ఐన్ స్టీన్.


కానీ ఇక్కడ జీవనసాపేక్షాలు బోలెడు చూసాను. చదువుకునీ, చక్కని సంసారం లో ఉన్న నేను గొప్పదాన్నా? చదువుకోకుండా పెళ్లి చేసుకుని ఇంటికి అంకితమైన వీళ్ళు గొప్పవాళ్ళా?


అంగవైకల్యాన్ని సైతం ఎదిరించి, డిప్యూటీ కలెక్టర్ కాబోయే కలెక్టర్ హోదాలో కూడా, పెళ్ళి కాలేదనే.. అసంతృప్తి తో రగులుతున్న వీరలక్ష్మి మాత్రం ఎవరికి ఆదర్శం?


మరి ఈ వీరపత్ని, వీరమాత సంగతేంటి? ఎవరి జీవితం వాళ్ళకి వెగటుగా, పక్కవాళ్ళ జీవితం దేవుడిచ్చిన బహుమతిగా కనబడుతోంది.


నిజానికి ఎవరి పరిస్థితులకు తగ్గట్టు ఎవరిజీవితం వారికి బహుమానంగానే ఉంది. అందరూ సేఫ్ జోన్లలోనే ఉన్నారు.

ఇక.. మా టెన్త్ ఫ్రెండ్స్ లో బాగా చదువుకుని మంచి పొజిషన్ కు వచ్చిన కొందరికి సన్మానాలు జరిగినాయ్. రచయిత్రిగా నాకూ సన్మానం చేసి బహుమతి ఇచ్చారు..


దానికన్నా..నేను ఇక్కడికి రాకపోతే చాలా జీవితసత్యాలను మిస్సయ్యేదాన్నేమో!? అనేంత కానుక పొందాను.

ఇంటికితిరిగి వచ్చిన నాకు శ్రీవారు ఎదురై "మీ బ్యాచ్ వాళ్ళు నీకేం బహుమతి ఇచ్చి సత్కరించారోయ్" అడిగారు నవ్వుతూ.


నేను గభాలున కౌగిలించి "మిమ్మల్ని నాకు బహుమతిగా ఇచ్చారు" అన్నాను.

నాకు తెలుసు! నేనే మన్నానో ఆయనకు అర్థం కాలేదని..

@@@@@@@@@@@@

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
114 views2 comments
bottom of page