top of page

బహుమతి మీకు...ఆనందం అందరికీ!!!!


'Bahumathi Miku Anandam andariki' written by Mantripragada Ravi

రచన : మంత్రిప్రగడ రవి


'నల్లపిల్లా...

వర్షాకాలపు ఏకాంతంలో మండువా సాక్షిగా మన సరిగంగ స్నానాలు...

వేసవికాలపు వెన్నెల వేళల్లో ఆరుబయట నీ మల్లెల ఘుభాళింపులు..

శీతాకాలపు మధ్యాన్నంవేళ బద్ధకపు ఒంటి విరుపులు ...

అర్ధరాత్రి మన తలగడ యుద్ధాలు

నడిరాత్రిలో నీ నిట్టూర్పులు

నా వీపు పైన నీ గోటి గిచ్చుళ్ల తియ్యని బాధలు

నా విసుగులు....నీ అల్లర్లు...నా కోపాలు...నీ తాపాలు...

ఇంతటి మధురానుభూతుల్ని నాకిచ్చిన నీకు ఏమిస్తే సరిపోతుంది?పెళ్ళయ్యాకా, పిల్లలు పుట్టాకా, బాధ్యతల వల్ల, ప్రేమని మర్చిపోతాం అని అన్నాడు మొన్న మానారాయణ. మరి నాకేంటి రవంతైనా ప్రేమ తగ్గకపోగా ఇంకా ఇంకా నచ్చుతున్నావు నువ్వు? రోజంతా ఎంత గొడవపడినా రాత్రి నువ్వొచ్చి ఇచ్చే చిన్న కౌగిలింతతో అన్నీ మర్చిపోతాను.నువ్వు లేకుంటే అసలు ఎలా ఉండేదో? ఆమ్మో...'

'ఆహా.. బొబ్బట్లు...'ఇత్తడి గిన్నెలో చెయ్యి పెట్టబోతూ అన్నాడు వంశీ.​

​'నీ మొహం మండా..మడిరా..ముట్టుకోకు.అలా దూరంగా పో.నైవేద్యం పెట్టాక తిందువుగాను’. గసిరింది మాణిక్యం అరటి ఆకు మీద నూనె రాసి పిండిలో పూర్ణాన్నిపెట్టి మెదుపుతూ...​

​'అమ్మమ్మా..నువ్వైనా పెట్టవే..హేమా,వసంత్ తొరగా రండి.అమ్మమ్మా,మామ్మ బొబ్బట్లేస్తున్నారు ఇక్కడ..' గట్టిగా అరిచాడు, తమ్ముడినీ, చెల్లినీ పిలుస్తూ. ​

​'అయ్యబాబోయ్.తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందనీ..వీడు చాలదన్నట్టు వాళ్లిద్దరూ కూడానా. వీడిని అలా తీసుకెళ్లవే రాధా. మా ప్రాణాలకి ఆదివారం ఒకటి ఇవ్వాళ.' పెనం మీది బొబ్బట్టు మీద నెయ్యి వేసి అట్లకాడతో తిప్పుతున్న సుబ్బులు...​

​ 'ఒరేయ్ పద...అయ్యాక పిలుస్తా.' వంటగదిలోంచి వంశీని లాక్కెళ్లి చేతిలో కొంచెం పూర్ణం పెట్టి’,..ష్..గప్ చుప్ మని తినెయ్...' అంది రాధ.​

​ 'ఇవ్వాళ ఎందుకమ్మా బొబ్బట్లు చేస్తున్నారు?' గుటుక్కుమని నోట్లో వేసుకుని అడిగాడు.​ 'చెప్తాలే.వెళ్లి ఆడుకో.' ​

'మ్..సరే.' వీధిలోకి పరిగెత్తాడు. ​ 'అత్తయ్యా...'తలుపుకి ఆనుకుని తొంగి చూస్తూ పిలిచింది రాధ. ​'ఏవిటే?'​

'ఇవ్వాళ కందాబచ్చలి కూర చేద్దామా?మీ అబ్బాయికి ఇష్టం కదా.' ​'చేస్తే పోయే...ఇదిగో ఇవయ్యాక మొదలెట్టేస్తా.'​ 'అంటే...ఇవ్వాళ నేను చేద్దామని అనుకుంటున్నా...'​ 'చచ్చింది గొర్రె..ఈ జిల్లా మొత్తానికే దీనంత గొప్పగా కందాబచ్చలి ఎవరూ చెయ్యరని పెద్ద బడాయి.ఇది ఇంకొకళ్ళని చెయ్యనిస్తుందా..'మాణిక్యమ్మని చూసి మూతి తిప్పింది సుబ్బులు.​ 'మరి ఏవనుకున్నావే?మా మావగారి హయాంలో పొద్దున్న వెలిగించిన కుంపటి రాత్రిదాకా వెలుగుతూనే ఉండేది.నేను ఆవ పెడితే ఆ ఘాటుకి ఊరి జనం అంతా మా ఇంటి ముందే ఉండేవారు.'​'అలా చేసే ఇలా అయ్యాం ఇప్పుడు. రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదనీ...రాధ పెళ్ళైన నాటి నుండి వినలేక చస్తున్నా నీ బోడి గొప్పలు.' అంది వియ్యపురాలి గొప్పల్ని కొట్టిపారేస్తూ సుబ్బులు. ​'ఛీ...నీతో నాకెందుకు.రాధా..జాగ్రత్తగా చెయ్యి..నేను చెప్తా పక్కనుండి.' ​'నేను బచ్చలి తెప్పిస్తా అయితే..వసంతూ...సుబ్రహ్మణ్యంగారింటికి వెళ్లి బచ్చలి తీసుకురా నాన్నా..' మండువాలోకి కంగారుగా వస్తూ అరిచింది రాధ.​

'ఓం ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా...ఏమేవ్ మట్టు బచ్చలిస్తారేమో ..తీగ బచ్చలి కావాలని చెప్పమను.. వ్యానాయ స్వాహా .గోడ మీద ఉంటుంది అడగమను వాణ్ణి.., ఉదానాయ స్వాహా,సమానాయ స్వాహా ...'నైవేద్యం పెడుతూనే వంటింట్లోంచి అరిచింది మాణిక్యమ్మ.

'అన్నయ్యా..అమ్మా వాళ్ళెందుకు ఇవ్వాళ మంచి మంచి వంటలు చేస్తున్నారు?నన్ను బచ్చలి కూడా తీసుకు రమ్మంది అమ్మ .. 'అడిగాడు వసంత్.

'తెలీదురా..అడిగితే అమ్మ చెప్పలేదు ....నాన్న పుట్టిన్రోజేమో..'​'అది ఉగాది తర్వాత కదా...అమ్మ పుట్టిన్రోజు కూడా కాదు'​. 'ఇవ్వాళ వాళ్ళ పెళ్లిరోజు. అమ్మమ్మ చెప్పింది నిన్న రాత్రి..'అంది హేమ.​ 'ఓహో..అయితే వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్ ఇద్దామా? మీ ఇద్దరి దగ్గరా డబ్బులెంతున్నాయో తీసుకురండి.' ​ముగ్గురూ లోపలకి పరిగెత్తి అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక చోట చేరారు.​ 'పన్నెండు రూపాయల ఎనభై పైసలు... వీటితో ఏమొస్తాయి?' మొహమొహాలు చూసుకున్నారు ముగ్గురూ.​

​'పోనీ మామ్మా వాళ్ళని అడుగుదామా?'​ 'ఇవి వాళ్ళిచ్చినవే అన్నయ్యా ..' చిల్లర మళ్ళీ లెఖ్ఖపెడుతూ అంది హేమ. ​'నాన్నని అడగనా?'అడిగాడు వసంత్. ​'ఛీ..వాళ్ళ గిఫ్టుకి వాళ్లనే డబ్బులు అడక్కూడదు.నేను పండు గాడి దగ్గరేమన్న డబ్బులుంటే అడిగి తెస్తా..నువ్వు పదిగంటలకి వీధి చివర రావి చెట్టు దగ్గరకి వచ్చేయ్ హేమా. పదరా వసంత్..'తమ్ముణ్ణి తీసుకుని బయల్దేరాడు వంశీ.

'ఏరా అబ్బాయ్..ఇదెన్నోపెళ్లిరోజురా?'పూజ చేసుకుంటున్న కొడుకు మాధవని అడిగింది మాణిక్యమ్మ,ఉప్పు నీట్లో మూడుసార్లు కడిగిన కంద ముక్కల్ని రాధకిస్తూ...​ఏం చెప్తారా అని వింటోంది రాధ,కందముక్కల్ని,బచ్చల్ని,పచ్చిమిర్చిని నూనెలోవేసిమగ్గిస్తూ,ఇవ్వాళమాపెళ్ళిరోజా?మర్చిపోయానే'రాధ వంక చూసి కళ్ళెగరేస్తూ...​

​'పదిహేను..' మగ్గిన కూరని పప్పు గుత్తి తో చిన్నగా కుమ్ముతూ నిరుత్సాహంగా అంది.​ 'మర్చిపోతే ఎలారా?పాపం

పొద్దున్నుండి అది అగ్గగ్గలాడిపోతోంది.వెర్రి పీనుగ. 'రోట్లో ఆవ పిండిని దంచుతూ గసిరింది మాణిక్యమ్మ.​'పోన్లేఅమ్మా..అన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు వెళ్ళు అల్లుడూ. ఇదిగోనే చింతపండు పులుసు .'అల్లుడిని వెనకేసుకొచ్చింది సుబ్బులు. ​'ఆ..అన్నీ ఎక్కడ గుర్తుంటాయి..'వెళ్తూ అన్నాడు మాధవ. 'ఇలాగే వెనకేసుకొని రా అల్లుడూ అల్లుడూ అంటూ..కొట్టేసానే రాధా ఆవపిండి.వేడి మీద వేసేయకు, చేదొచ్చేస్తుంది కూర. పోపులోకి ఇంగువ ధరావతుగా వెయ్యి.నూనె ఎక్కువ పొయ్యి.లేకపోతె కూర ఒరుగులా ఉంటుంది.'​

​'ఏవిటి మాణిక్యం నువ్వు?అది చేస్తా అంటోంది కదా..నీ సలహాలెందుకు మధ్యలో?వెనకటికి నీ లాంటిదే ‘నువ్వు దంచు నేను భుజాలెగరేస్తాను’ అందిట..అలా ఉంది వరస.దాని మొగుడికోసం అది ఏదో తాపత్రయ పడుతోంది.పడనీ.పద ఎండొచ్చేలోపు గుడికెళ్ళొచ్చేద్దాం... '​

​'సరేలే నిజమే...ఏమే రాధా మా పనేంలేదుగా..వెళ్లమా?'తమ వంశపారంపర్యంగా వస్తున్న కందాబచ్చలికి కోడలు న్యాయం చేయగలదో లేదో అని సందేహంగా వంటింట్లోకి చూస్తూ అడిగింది మాణిక్యం.​'లేదత్తయ్యా..నేను చూసుకుంటాను.అమ్మా,ఆయనకి ఈ కాఫీ ఇచ్చేసి వెళ్లవే...'

'పండు గాడు ఇంట్లో లేడు..ప్చ్..ముందే తెలిసుంటే, కొంచం డబ్బులు దాచే వాళ్ళం..'అన్నాడు వంశీ.​

​'ఒరేయ్ అన్నయ్యా ,వేణి వాళ్ళింట్లో ఒకటుంది.అది ఇస్తే బావుంటుందేమో...కానీ మామ్మ,అమ్మమ్మాఏవంటారో..'అనుమానంగా అంది హేమ.​ 'ఏంటది?'​ చెవిలో గుసగుసగా చెప్పింది.​ 'భలే..అదైతే డబ్బులు కూడా అవసరం లేదు.'మెరిసే కళ్ళతో అన్నాడు వంశీ.​ 'కానీ,ఇస్తుందా వేణి వాళ్ళమ్మ?'అడిగాడు వసంత్. ​'హా..ముగ్గురం వెళ్లి అడిగి చూద్దాం..'వేణి ఇంటికి పరిగెత్తారు వెంటనే...

'సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళనా..?'అడిగాడు పేపర్ చదువుకుంటున్న మాధవ. ​'అఖ్ఖర్లేదు..'చూడకుండానే బట్టలు మడత పెడుతూ సమాధానం చెప్పింది రాధ. ​'ఏమన్నా నగలు చేయిద్దామంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు.'​ 'నేనడిగానా? '​ 'పోనీ ఏం కావాలో చెప్పు...మర్చిపోయా, నిజంగా..సారీ రాధా..' దగ్గరికొస్తూ అన్నాడు. ​

​'అఖ్ఖర్లేదు మీ సారీ..అరె, పిల్లల పుట్టినరోజులు గుర్తుంటాయి..మిగిలిన పనికిమాలిన రోజులన్నీజ్ఞాపకం ఉంటాయి.నా పుట్టినరోజు సరేసరి, ప్రతీ ఏడు నేనే గుర్తు చేస్తా.కనీసం పెళ్లి రోజన్నా గుర్తు పెట్టుకోచ్చు కదా.అక్కడికీ నెల ముందే కేలండర్ లో గుర్తు పెట్టాను.'​

​'మర్చిపోయా అంటే వినవే?ఎప్పుడూ అంతే మీ ఆడాళ్ళు...దేనికి గొడవ పడాలో కూడా తెలీదు.నేను బైటికెళ్తున్నా..'విసురుగా బైటికెళ్ళిపోయాడు మాధవ.​'వెడితే వెళ్ళండి..భోజనం టైముకి రండి.చాలా చేసాను మీకోసం. 'అంది మడత పెట్టిన బట్టలు అలమారాలో సర్దుతూ. 'అక్కర్లేదు.కడుపు నిండిపోయింది. ' వీధి గుమ్మలోంచి అరుస్తూ వెళిపోయాడు మాధవ. ​

'ఏమడిగాన్నేను?చిన్న విషయం..అన్నిటికీ కోపమే ఈయనకి. అయినా,నాకొకదానికీ ఉంటే చాలా...'తనలో తను మాట్లాడుకుంటూ పక్క బట్టలు మార్చడానికి దుప్పటిని లాగింది విసురుగా.. తలగడ కిందనుండి పడింది ఒక చీర..దానితో పాటు ఒక చిన్న కాయితం..​నీలిరంగు నేత చీర... అంచు, ఫాల్ మీద రాధాకృష్ణుల రాసలీలలో భాగంగా కోలాటం ఆడుతున్నట్టు బొమ్మలతో వేసిన పెడన కలంకారీ మగ్గం నేత..​

'చీరలు నీకు కొత్త కాదు...కానీ నేత చీరలో నిన్ను చూడటం మాత్రం నాకు ప్రతీసారీ

ప్రత్యేకమే...చూస్తూ చూస్తూ పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయా?పెళ్లి చూపుల్లో

నిన్నామొన్నా చూసినట్టుంది నిన్ను. ఎక్కడ మీ వాళ్ళు నాకు కాకుండా నిన్ను వేరే

వాళ్ళకి ఇచ్చేస్తారో అని మీ ఇంటి చుట్టూ పచారీలు చేసిన సంగతి గుర్తొచ్చి బళ్ళో పిల్లలకి

పాఠం చెప్తూ చెప్తూ నవ్వేసా మొన్నా మధ్య.

తెలుగు మాస్టారిని అయి ఉంటే ఏమన్నా కాస్త కవిత్వం రాసేవాడినేమో.. అయినా ఏదో నీ సావాసదోషంలో నాకొచ్చింది రాసా....చూసి నవ్వుకో..కానీ నన్ను చూసినవ్వకు సుమా..ఉడుక్కుంటాను.'నల్లపిల్లా...'ఇలాగే నీతో చాలా చాలా పెళ్లిరోజులు చేసుకోవాలి. ప్రేమతో...' ​

​చూడగానే కళ్లలో నీళ్లు తిరిగిపోయాయి.అనవసరంగా విసుక్కున్నా అని చెంపమీద ఒక్కటిచ్చుకుంది. బైట ఉన్నారేమో అని పరుగున వచ్చి గుమ్మంలోకి చూసింది. కనపడలేదు.కళ్ళుతుడుచుకుని అద్దం ముందు నుంచుని చీరని తన చుట్టూ పెట్టుకుని మురిసిపోయింది.ఏ పని చేస్తున్నా ఉత్తరంలో మాటలే గుర్తొస్తున్నాయి. సిగ్గుతో నవ్వుకుంటూ గుమ్మంవైపు పదే పదే చూస్తోంది...

మధ్యాన్నం భోజనాలయ్యాక..​'అమ్మా..నాన్నా..మీ పెళ్లి రోజు కదా.మీ కోసం ఒక బహుమతి తెచ్చాం...'ముగ్గురు పిల్లలూ ఒకేసారి అన్నారు.​ 'అబ్బో.ఏవిట్రోయ్ అది..' అంది సుబ్బులు. 'మమ్మా..అమ్మమ్మా..మమ్మల్నేవీ అనకూడదు మరి...'పెద్ద వాళ్ళిద్దర్నీ చూస్తూ.​'బావుంది..మీ అమ్మా నాన్నలకి మీరేదో ఇస్తే మేవెందుకు తిడతాం..'అన్నారిద్దరూ తాంబూలం చుట్టుకుంటూ.​ 'సరే తెస్తాం..ఆగండి..' పరిగెత్తారు బైటికి.​ ఆసక్తిగా చూస్తున్నారు అందరూ..ఏం తెస్తారా అని.​'కళ్ళు మూసుకోండి..కళ్ళు మూసుకోండి..'​'సరే..'​ అందరూ కళ్ళు మూసుకోగానే వాళ్ళ ముందు ఒక బుట్ట పెట్టి లోపలకి పరిగెత్తి గోడ చాటునుండి అన్నారు.'ఇప్పుడు తెరవండి..'వెదురుతో చేసిన పళ్ళబుట్ట...పచ్చని చిన్న గుడ్డ కప్పి ఉంది..తియ్యగానే...​'కుయ్..కుయ్...'అంటూ చిన్న బొచ్చు కుక్కపిల్ల. భయంభయంగా చూస్తోంది బుట్టలోంచి.​ 'ఒరేయ్..వెధవల్లారా..దాన్ని తీసి బయట పారెయ్యండి..'పెంకులెగిరి పోయేలా అరిచారు పెద్దవాళ్లిద్దరూ.​

'తిట్టం అని చెప్పారు కదా..'గోడ చాటు నుండి బైటికి రాకుండానే అన్నాడు వంశీ.​ 'ఒరేయ్ ఇది మీకు బహుమతా..మాకా?'అడిగాడు మాధవ పిల్లల్ని చూసి నవ్వుతూ..'ఎంత ముద్దుగా ఉందో కదండీ.. ఎత్తేసుకోవాలనుంది నాకు...'అత్తగారి వంక, సుబ్బులు వంక చూసి ఆగిపోయింది రాధ.​ 'ఏవిటే రాధా..ఇప్పుడు దీన్ని తెచ్చి ఇంట్లో పెడతావా?ఆ పిల్ల వెధవలకి బుద్ధి లేదు సరే నీకేవైందే? మన మడీ,ఆచారం...అగ్రహారం అంతా ఉమ్మేస్తారు.'​ 'మరే వదినా..తా దూర సందులేదు,మెడకో డోలనీ...మనకితోడు ఇప్పుడు ఇదొహటా......' వంత పాడింది మాణిక్యం.​

'అరె..భలే కలిసిపోయారే మీరిద్దరూ...ఇలాంటి వాటికి మాత్రం ఇద్దరిదీ ఒకే మాట కదా ?పిల్లలేదో ఆశ పడి తెచ్చారు..మొదటిసారి మా ఇద్దరికీ కలిపి ఇచ్చిన బహుమతి. రాధ కి కూడా నచ్చింది.అది మనింట్లోనే ఉంటుంది. మనతో పాటే తింటుంది. బయట ఎవరేం అనుకున్నా నాకేం నష్టం లేదు.' మాణిక్యమ్మని, సుబ్బులుని మార్చి మార్చి చూస్తూ గట్టిగా అన్నాడు మాధవ.​

​'ఏయ్...భలే భలే... 'గోడచాటు నుండి చప్పట్లు కొడుతూ వచ్చేసి,ఆ కుక్కపిల్లని తీసి రాధ చేతిలో పెట్టారు.​ 'ఊ..'భరోసా ఇచ్చాడు మాధవ.​ తెల్లగా కుందేలులా అందంగా ఉంది. మెత్తగా వెచ్చగా ఉంది దాని పొట్ట. దగ్గరికి తీసుకోగానే దానికేం అర్ధమైందో రాధ మొహం అంతా ముద్దులతో తడిపేసింది దాని భాషలో. 'దీన్ని వింటర్ అని పిలుద్దాం..'రాధాచేతిలో ఉన్న కుక్కపిల్లని చూసి అన్నాడు మాధవ. 'అయ్యో..అయ్యో..అయ్యో..చూసావా వదినా?ఎక్కడా కనీ వినీ ఎరగలేదు..అయిపోయిందమ్మా మన కాలం అయిపోయింది.ఇంక ఇంట్లో అంతా పిల్లల మాటే.'​ 'బాగా చెప్పావ్ వదినా!!! మనం ఎందుకు ఇక్కడ ఇంక పద పోదాం.' పెద్దవాళ్ళిద్దరూ బైటికెళ్లి, వాకిట్లో చెరో స్థంబానికి అనుకుని, తమ రోజుల్ని తలుచుకుంటూ కూచున్నారు.

పది రోజులు యుద్ధం ప్రకటించారు పెద్దవాళ్ళిద్దరూ.. ఆ కుక్కపిల్ల ఉన్న ఇంట్లో మెతుకు ముట్టం అని భీష్మించుక్కూర్చున్నారు....రాధ మాత్రం యధా విధిగా అందరికీ వండుతోంది...వండినగిన్నెలు ఖాళీ అయిపోతున్నాయి చడీచప్పుడు లేకుండా. ​

​వాళ్ళ దగ్గరున్న పన్నెండు రూపాయల ఎనభై పైసలతో ఒకచిన్నగంట కొని దాని మెళ్ళో కట్టారు పిల్లలు. ఆ కుక్కపిల్లకి కూడా అర్ధం అయిపోయిందో ఏవిటో..ఇంట్లో అమ్మ రాధే అని...ఎప్పుడూ రాధ చుట్టే తిరుగుతోంది.​

​'ఒసేయ్ ఒసేయ్...అది ఇల్లంతా పోసేస్తోందే..బైటికి తీసుకెళ్లి తగలెయ్ దాన్నిచిల్లుకుండలా అస్తమానూ పోస్తోంది. 'అరిచింది మండువాలో వత్తులు చుడుతున్న మాణిక్యమ్మ. ​'అయితే వదినా ఇంక మనకి ఇది తప్పదంటావా?'అంది చుట్టిన వట్టల్ని దారంతో కట్ట కడుతూ సుబ్బులు. ​'అలాగే ఉంది..ఏ మాటకామాటే సుబ్బులూ ముద్దుగా ఉంది కదే.’. ​​'అన్నావూ....అనుకున్నాను.నువ్వు దానికి మొన్న ఇడ్లీ ముక్క వేసినపుడే అనుకున్నాను దాని మీద నీకు ప్రేమ పుట్టేసింది అని.' ​

​'ఏ..నువ్వు మాత్రం మొన్న ఎవరూ చూడకుండా దాని బొచ్చు నిమరలేదూ?'​ 'ఆ..అది ఏదో దగ్గరికొస్తే..విదిలించడానికలా చేసాను.'​ 'చూస్తే చిరాకేసింది గానీ,అది పాలు కావాలని కుయ్ కుయ్ అంటే ప్రాణం ఉసూరుమనిపోతోంది వదినా...'​ 'మరే..నేను పూజ చేసుకోనున్నంత సేపు ఎంత శ్రద్ధగా కూచుంటుందో..'​ 'ఆ దేవుడి దగ్గర పెట్టే బెల్లం ముక్క కోసం..నీ చిన్న మనవరాలు...'​ ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు దాని వంక చూస్తూ. వంట గదిలోంచి వీళ్ళ సంభాషణ విన్న రాధ హాయిగా ఊపిరి తీసుకుంది వింటర్ కి మెత్తగా అన్నం కలుపుతూ.'ఒరేయ్ వంశీ వింటర్ అంటే ఏవిట్రా..?'​ 'శీతాకాలం అని అర్ధం మామ్మా..?'​

​'అదా సంగతి..అందుకే మీ నాన్న దానికా పేరు పెట్టాడు.'​ 'ఎందుకు మామ్మా?' ఉత్సాహంగా అడిగారు ముగ్గురు పిల్లలూ..​ 'మీ ముగ్గురి పేర్లేవిటి?'​

​'శరత్ వంశీ..హేమా మాధవి...వసంత్ మురళి..'


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి​.రచయిత పరిచయం :

నా కథని ప్రచురణకి తీసుకున్నందుకు ధన్యవాదాలు.నా పేరు రవి మంత్రిప్రగడ. ఐర్లాండ్‌లో పనిచేస్తున్నాను. నేను 2019 నుండి కథలు మరియు నవలలు రాయడం ప్రారంభించాను. లాక్ డౌన్ వల్ల పుట్టుకొచ్చిన మరో రచయిత అనుకోవద్దు.ఈనాడు ఆదివారం లోను,ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు, మరియు కొన్ని అప్ లలో నా కథలను ప్రచురించారు.


577 views8 comments
bottom of page