top of page

బామ్మ మాట బంగారు బాట


Bamma Mata Bangaru Bata Written By Saraswathi Ponnada

రచన : సరస్వతి పొన్నాడ


సదాశివం సుందరి దంపతులకు ఎనిమిది మంది సంతానం. నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. రెండవ వాడు సత్యమూర్తి...చాలా తెలివైన వాడు. చదువులో ఎప్పుడూ ఫస్టే. పెద్దకొడుకుకి, తండ్రి కరణీకం ఎలాగూ వస్తుందని...స్కూల్ ఫైనల్ తో చదువు ఆపేసి..తండ్రి దగ్గర తర్ఫీదు అవుతున్నాడు ...చిన్న వయసులోనే మొదటి ఇద్దరాడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసాడు సదాశివం.


పల్లెటూరులో జీవితాలు సాఫీగానే సాగిపోయేవి. చదువులు కూడా అంతంతమాత్రమే వున్నా...బేంక్ లలో కార్పోరేషన్ కంపెనీలలో ఉద్యోగాలొచ్చేవి. ఆడపిల్లలకు రజస్వల అవకుండానే పెళ్ళిచేసే రోజులవి. అలాగే నలుగురు ఆడపిల్లలకు ఉత్తరం ముక్క రాసేంత చదువు చెప్పించి పెళ్ళి చేయగల స్తోమత వుంది తండ్రి సదాశివానికి.


ఇప్పుడు సత్యమూర్తి దే సమస్య అయి కూర్చుంది. సత్యమూర్తి పై చదువులు చదవాలని పట్టుదల. అతనికి మద్రాసులో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. " పొరుగూరు లో అంత ఖర్చు పెట్టి చదవించలేనని" చెప్పేసాడు సదాశివం.


ఎటూ పాలుపోవని పరిస్థితి లో సత్యమూర్తి బామ్మ సుబ్బమ్మ రంగంలోకొచ్చింది. ఆవిడకు సదాశివం ఒక్కడే కొడుకు. ఆరోజుల్లో చాలా వయసు తేడాతో పెళ్ళి చేసేవారు. పెళ్ళి అయిన ఐదు ఏళ్ళకే భర్తని కోల్పోయింది సుబ్బమ్మ. సదాశివం పెద్ద అయి కరణీకం వచ్చేదాకా చాలా కష్టాలు పడింది.


సత్యమూర్తి చదువుకి దారి చూపింది సుబ్బమ్మ. సుబ్బమ్మ భర్త దగ్గర సహాయం పొందిన అతను ప్రక్క వూరిలో మునసబు. ఎంతో మంచివాడు. చేసిన మేలు మరచిపోలేదు. ఒకసారి సుబ్బమ్మ ని పలకరించడానికి వచ్చేడు...ఎప్పుడూ ఎవరినీ సహాయం అడగని కుటుంబం సదాశివం ది. మనవడి కి చదువు మీద వున్న శ్రద్ధకి మునసబు గుర్తుకు వచ్చేడు సుబ్బమ్మ కి.


" అబ్బీ మునసబు నీ చదువుకి సహాయం చేస్తాడు. అతని చిన్నతనం లో మీ తాతయ్యగారి ఉపకారం పొందేడు. ఆ కృతజ్ఞత వుందతనికి. నీవు వుద్యోగం వచ్చేక తీర్చేద్దువు గాని..ముందు ఒక సంవత్సరం డబ్బు సమకూర్చుకో… ఒకే సారి ఎక్కువ డబ్బు అడగడం కూడా మర్యాదనిపించుకోదు. రెండవ ఏడు గురించి అప్పుడు ఆలోచిద్దాం" అంది సుబ్బమ్మ. భర్త పేరు మనవడికి పెట్టడం వలన మనవడిని పేరు పెట్టి పిలవదు సుబ్బమ్మ. అందుకే అబ్బీ అని పిలుస్తుంది ఆవిడ. పైగా " నేను నీతో వచ్చి వండి పెడతాను" అని భరోసా కూడా ఇచ్చిందావిడ.


చేరాలనే పట్టుదలతో ఉన్నాడేమో బామ్మ సలహా ఆశాజనకంగా అనిపించింది సత్యమూర్తి కి. తండ్రిని 'కానీ' కూడా అడగకుండా, నాలుగు మైళ్ళు కాలి నడకన వెళ్ళి, మునసబు తో పరిచయం చేసుకుని, వచ్చిన పని చెప్పేడు. ఆ కుర్రాడి శ్రద్ధకి మునసబుకు చాలా ఆనందమేసింది...మొదటి సంవత్సరం వరకూ...ఫీజు తిండీ వుండడానికి సరిపడే డబ్బుని అప్పుగా తీసుకున్నాడు సత్యమూర్తి. డబ్బు ఇచ్చి, అభిమానంగా సత్యమూర్తి తో ఆ రోజు వాళ్ళింట్లో భోజనం చేయించి పంపేడు మునసబు.


అనుకున్నట్లుగా ఒక రూములో బామ్మ తో మద్రాసులో మకాం పెట్టడం ... కాలేజీలో చేరడం జరిగిపోయింది. ఒక నెల లోపే సదాశివం పెద్దకొడుకు పెళ్ళి కూడా అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఇంకా పెళ్ళికున్నారు. పెళ్ళి అయిన పిల్లల పురుడు పుణ్యాలు బాధ్యత గా నెరవేరుస్తున్నారు సదాశివం. చిన్నకొడుకు చదువు ఎక్కడ ఆగిపోతుందోనని భయపడ్డ తల్లి సుందరి...డబ్బు సర్దుబాటు అవడంతో సంతోషంతో వేంకటేశ్వరస్వామి కి ఐదు కొబ్బరికాయలు కొట్టేసింది కూడా.


నిరాటంకంగా బామ్మ సాయంతో ఒక సంవత్సరం జరుగుతోంది. ఇంకో నెలలో మొదటి సంవత్సరం అయిపోతుందనగా...బామ్మా మనవడులకు రెండవ సంవత్సరం ఎలా బయట పడతామా అనే చింత మొదలైంది. సదాశివం ఎంతమాత్రం సహాయం చేసే స్థితిలో లేడు. కరణీకం వలన పాలు పెరుగూ, కూరలు ఎవరో ఒకరు తెచ్చి ఇస్తుంటారు. నలుగురు పిల్లలు పల్లెటూరు చదువుల వలన ఇబ్బంది లేదు.

ఈ పరిస్థితి లో ఒకరోజు బామ్మ, " నేను మనూరెళ్ళివస్తాను రా అబ్బీ" అని మనవడితో చెప్పి బయలుదేరింది.' బామ్మ తన చదువుకోసం ప్రయత్నం చేయడానికి వెళ్ళి వుంటుంది 'అని అనుకున్నాడు సత్యమూర్తి.

బామ్మ వెళ్ళిన పదిహేను రోజులకు ఒక వుత్తరం రాసింది మనవడికి " మన వూరిలో ఫలానా వారబ్బాయి పెళ్ళి కుదిరింది...అతనికి కాబోయే అమ్మాయి చెల్లెలకు కూడా సంబంధాలు చూస్తున్నారట...కుదిరితే ఇద్దరికీ ఒకేసారి చేస్తారట. నీవు ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు ఇచ్చే కట్నం డబ్బుతో రెండవ సంవత్సరం చదువు అయిపోతుంది. ఆలోచించు...వెంటనే జవాబు రాయి"..అదీ ఉత్తరం సారాంశం.

ఉత్తరం చదివిన సత్యమూర్తి 'తాను దూర సందు లేదు మెడకో డోలా' అనుకుంటూ "18 ఏళ్ళకు ఉద్యోగం లేకుండా పెళ్ళి ఏమిటి బామ్మా" అంటూ ఉత్తరం రాసి పడేసాడు.

సత్యమూర్తి వ్రాసిన ఉత్తరం చూసుకుని, 'పరిక్షలవగానే వెంటనే బయలు దేరి రమ్మని' కొడుకు చేత మనవడికి టెలిగ్రాం ఇప్పించింది సుబ్బమ్మ.

మనవడు వచ్చేలోగా పిల్ల తండ్రికి ఒక మాట చెప్పెడానికి వెళ్ళి పిల్లను చూసింది. కుందనపు బొమ్మలా వుంది సుశీల. సిరులు ఒలుకుతున్నాయి ముఖంలో. మనవడి కి తప్పక నచ్చుతుంది అనుకుంది సుబ్బమ్మ. కట్న కానుకల విషయం మెల్లగా కదిపింది. " నాపెద్దకూతురుకి ఏమిస్తానో చిన్న కూతురికి అదే ఇస్తాను" అన్నాడు సుశీల తండ్రి సూర్యనారాయణ.

సత్యమూర్తి రాగానే సమావేశం అయ్యారందరూ... పిల్ల బావుంది. అభ్యంతరం కనపడడం లేదు. అందరికీ ఇంతకన్నా మార్గమూ కనపడలేదు. సుబ్బమ్మ మనవడితో "పిల్లకి ఎనిమిది ఏళ్ళు...పెద్దదయి కాపురానికి వచ్చేసరికి నీ చదువైపోతుంది. ఈ అవకాశం పోగొట్టుకోకు" అని నచ్చచెప్పింది. బామ్మ తన మంచే కోరుతుందని, కాదనడానికి వేరే కారణం కనపడక, సరేనన్నాడు సత్యమూర్తి.

పిల్లని చూడడం...ఓకే అనడం అయింది. కట్నకానుల విషయం మళ్ళీ వివరాలు అడగడానికి మొహమాటం అనిపించింది.ఇద్దరికీ ఒకసారి పెళ్ళి చేస్తున్నప్పుడు ఇంతని అడగడం మర్యాద కాదనుకుని వచ్చేసారు...అలా సుందరి తో సత్యమూర్తి పెళ్ళి కుదిరింది

పెళ్ళినాడు పెద్దకూతురుకి కొబ్బిరి బోండం చేతిలో పెట్టి కన్యాదానం చేసాడు సూర్యనారాయణ..అలాగే సుశీలకీ కొబ్బరి బోండం చేతిలో పెట్టి పెళ్ళిజరిగింది.


పెళ్ళికి ముందు వారిచ్చే కట్నం తాలుకా డబ్బు ప్రశక్తి తెచ్చింది సుబ్బమ్మగారు. సూర్యనారాయణ తెల్లబోయి " నేనెక్కడ ఇస్తానన్నాను" అన్నాడు. " మీరేకదా పెద్దపిల్లకి ఇచ్చినట్లే ఇస్తానన్నారు" అంది సుబ్బమ్మ గారు. అవునూ అదే చేస్తాను. మా పెద్ద అమ్మాయికి చేతిలో కొబ్బరి బోండం పెట్టి పెళ్ళి చేస్తానని అన్నాను. అలాగే మీకూ చేస్తాను. కావాలంటే ...వాళ్ళనీ అడగండి" అన్నాడు. వాళ్ళు బాగా జమిందారులు. ఇంట్లో వ్యవహారం చూసుకునే ఆడదిక్కు కావాలి. సుబ్బమ్మగారు డబ్బు ప్రస్తావన తేవక పోవడం వలన అతని తెలివికి ఇప్పుడు విస్తుపోవడం వీళ్ళ వంతైంది... కొన్ని గంటలలో ముహూర్తం పెట్టుకుని చేసుకోకుండా వెళ్ళిపోవడం మర్యాద కాదనేంత మంచివారు కాబట్టీ ...పెళ్ళి జరిపించేసారు. సమస్య మొదటికి వచ్చిందని అనుకున్నారంతా...


సుశీల పెళ్ళి అయి గృహ ప్రవేశం చేసిన వేళా విశేషం...సమయానికి డబ్బు చేకూరి సత్యమూర్తి చదువు నిరాటంకంగా సాగిపోయింది.కారణం పెళ్లికి వచ్చిన మునసబు సుబ్బమ్మ గారి వలన విషయం తెలిసి, ఈ సాయం చేసేడు. అలాగే మిగతా రెండు సంవత్సరాలు డబ్బు సర్దుబాటు అయి చదువు పూర్తి అయింది.


సుశీల పెద్దదయి తన పదమూడవ ఏట కాపురానికి వచ్చినప్పటికి, సత్యమూర్తి ఉద్యోగంలో స్థిరపడడమే కాకుండా చదువుకి చేసిన అప్పుని తీరుస్తూ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి సాయపడ్డాడు...తమ్ముళ్లు ఇద్దరిని డిగ్రీ చేయించి ఉద్యోగాలలో చేరేలా చేసేడు...


సుశీల కాపురానికి రావడమే క్రొత్త ఊరిలో క్రొత్త కాపురం పెట్టారు దంపతులు. సుబ్బమ్మ ను సుశీలకి కొంచెం వంట, పనీ అదీ అలవాటు అయ్యేదాకా వెళ్ళనీయక తన దగ్గరే వుంచుకున్నాడు సత్యమూర్తి. ఒక ఆరు నెలలలోనే రుచికరంగా వండే వంటలన్నీ సుబ్బమ్మ గారి దగ్గర చకచకా నేర్చేసుకుంది సుశీల. చదివింది ఎనిమిద వరకే అయినా అన్నిటా చురుకుగా వుండే సుశీల భర్తతో పాటు బామ్మకీ ఆప్తురాలయిపోయింది.


ఓపిక తగ్గిన సదాశివం కరణీకాన్ని పెద్దకొడుకుకి ఇచ్చేసాడు. తల్లిదండ్రులను, బామ్మను తీర్థయాత్రలకు బలవంతంగా ఒప్పించి పంపించేరు సత్యమూర్తి దంపతులు. వారు యాత్రలు ముగించుకుని వచ్చేసరికి సుశీల నెల తప్పిన శుభవార్త అందింది. అదే సమయంలో సత్యమూర్తి కి ట్రాన్ఫర్ అవడంతో ...వేవిళ్ళతో పుట్టింటికెళ్ళింది సుశీల. చాలా బలహీనంగా వుండడం వలన సుశీల పురిటిదాకా పుట్టింటిలోనే వుండిపోయింది. సుబ్బమ్మ గారు ఒపిక తగ్గి కొడుకు దగ్గరనే వుంది. సత్యమూర్తి వెళ్ళి భార్యను చూసి వస్తూ వుండేవాడు.


తొమ్మిదివ నెల వచ్చిన పదిహేను రోజులకు సుశీలకు మగపిల్లవాడు పుట్టి పోయాడు. అది ఇంట్లో వారందరికీ తీరని దఃఖాన్ని కలిగించింది....పెద్దమనవడికి ఇద్దరు పిల్లలు వున్నారప్పటికి మునిమనవడని సుబ్బమ్మ చూసినా, సత్యమూర్తి సంతానం చూడాలనే తపన వలన సుబ్బమ్మ గారు అందరికన్నా ఎక్కువగా మనసుకి పెట్టేసుకుంది. వయసుకు తోడు చిన్న సుస్తీ చేసీ అందరినీ విడిచి వెళ్ళిపోయింది.


సత్యమూర్తి బామ్మను దేవుడుతో సమానంగా భావించేవాడు.ఆవిడ లేని లోటు సత్యమూర్తి ని బాధించింది. ఆవిడ మాట మనవడికి బంగారు బాటగా అయింది. ' తల్లి, బామ్మ చిన్నప్పటి నుండి తన చదువుని ప్రోత్సహించేరు. తన ఉన్నతికి కారకులు వాళ్ళిద్దరే. వారి ప్రోత్సాహమే ఈనాడు ఇంత మంచి స్థితిలో వుండేలా చేసింది' అన్న విషయం సత్యమూర్తి జీవితంలో మరచిపోడు. సుబ్బమ్మ గారు పోయిన సంవత్సరమే సుశీల గర్భవతి అయింది. అందాలభరణి సుభాషిణి బామ్మ రూపంలోవారింట వెలిసింది. కాలక్రమంలో నలుగురు బిడ్డల తండ్రి అయ్యేడు సత్యమూర్తి.


సుశీల, సత్యమూర్తి సహాయ,సహకారాలతో అందరికీ పెళ్ళిళ్ళు జరిగి, అందరూ ఎంతో కలిసికట్టుగా వుండేవారు. సుశీల ఆ ఇంట అందరికీ అన్నపూర్ణ గా వుండేది. పండుగ వచ్చిందంటే ఒకేచోట కలిసి సందడి చేసే సంప్రదాయం వారింట సాగేది. తండ్రి కాలం చేసేక తల్లిని సత్యమూర్తి తన దగ్గర వుంచుకున్నాడు.


సత్యమూర్తి జీవితం లోనూ ఉద్యోగం లోనూ అంచెలంచెలా ఎదిగి, ఉన్నతి స్థితిలో ఉండడానికి సుశీల సహచర్యమే ఎంతో సహకరించింది. అతని ఉద్యోగ నిర్వహణ లో పిల్లలు చదువులు అన్నీ సుశీలే చూసుకునేది. తన జీవితంలో ఇన్ని మంచి విషయాలు జరగేలా చేసిన బామ్మను ఎప్పటికీ మరచిపోలేదు సత్యమూర్తి.


సుబ్బమ్మ ధనుర్మాసం వచ్చి నెల గంట కొట్టగానే సాయంత్రం పేడతో వాకిట్లో కళ్ళాపి జల్లి పెద్ద ముగ్గులు వేసి, సుశీలతో గొబ్బెమ్మలు పెట్టించేది. తిరుప్పావై పాశురాలు లయ బద్ధంగా పద్యాలు పాడేది. ప్రతి సంక్రాంతి కి సుబ్బమ్మ రకరకాల స్వీట్లు చేసేది. చక్కని రంగవల్లులు తీర్చిదిద్దేది. అవన్నీ ఆవిడ కూడా కూడ వుండి సుశీల నేర్చుకునేది. ఆవిడలాగే రుచిగా చేసేది సుశీల. సుభాషిణి అయితే బామ్మకి ప్రతిరూపమే. బామ్మ లేని లోటుని సుభాషిణి తీరుస్తోంది. బామ్మ మాట బంగారు బాట అయింది సత్యమూర్తి జీవితంలో ...


అలాగే తల్లి కూడా ఇప్పటికీ తమకి పెద్దదిక్కుగా పిల్లలకు బామ్మగా ఆప్యాయతలు పంచుతోంది. సుందరి సుశీల తల్లికూతుళ్ళులా వుంటారు. సుబ్బమ్మ సుందరి అలాగే వుండే వారు. అదే సాంప్రదాయం ఆ కుటుంబం అంతా కనపడుతూ వుంటుంది.


సత్యమూర్తి తన బామ్మ పేరున ఒక పేద విద్యార్థికి చదువుకు సాయం చేస్తున్నాడు. అదే బామ్మకి ఇచ్చే నివాళి అనుకుంటాడు సత్యమూర్తి. ఒక కూతురు సుభలో బామ్మని , ఇంకో కూతురు సుధలో తల్లిని చూసుకుంటాడు సత్యమూర్తి. ఇద్దరు కొడుకులూ తండ్రి బాటలో ఉన్నత చదువులు చదువుతున్నారు. 'కష్టేఫలి' అన్నట్లు తన జీవితమే మార్గదర్శకంగా ఏ పిల్లలు ఉన్నత చదువులు చదవడానికైనా డబ్బు సహాయానికి ఎప్పుడూ ముందుంటాడు సత్యమూర్తి.

శుభం..

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


రచయిత్రి పరిచయం : నాపేరు సరస్వతి పొన్నాడ...హైదరాబాద్

చిన్నప్పటి నుండి మనసుకి హత్తుకున్న సంఘటనలు కాగితం మీద పెట్టేద్దాన్ని. ...ప్రమదావనం(ఆంధ్రప్రభ) లో నా పోస్టులు, వంటలు వచ్చేవి. శ్రీశ్రీ, ఆరుద్ర పద ప్రహేళికలు పూరించిడమే కాకుండా బహుమతులు వచ్చేయి. ఒక గ్రూపు లో ప్రహేళిక (గడుల నుడికట్టు) సంవత్సరం పైనే నిర్వహించేను. నన్ను ప్రోత్సాహిస్తున్న మనతెలుగుకథలు ఎడ్మిన్స్ కి ధన్యవాదాలు🙏


81 views0 comments

Comments


bottom of page