top of page

బతుకు తెరువు

Batuku Teruvu Written By Siva Rama Prasad Ch

రచన : వాణిశ్రీ


రాజారామ్‌ని చూడగానే “రాజా... రాజా...” అని ఆహ్వానిస్తూ, “మల్లేశ్‌ రాజాకి చాయ్‌ ఇవ్వు” అన్నాడు బేతయ్య,.

రాజారామ్‌ వచ్చి బేతయ్య పక్కన చెక్క బెంచీ మీద కూర్చున్నాడు. అతను ఎత్తుగా, బలిష్టంగా, గోధుమ రంగులో ఠీవిగా వుంటాడు. పలకరిస్తే తియ్యగా నవ్వుతాడు. అదే అతని ప్రత్యేకత.


ఇప్పుడెందుకో అతని ముఖంలో నవ్వు కానరాలేదు. ముఖంలో నల్లటి మేఘాలు కమ్ముకుని వున్నాయి. విచారంగా కనిపిస్తున్నాడు.


“ఏంది భాయ్‌! దిగులుగా వున్నావ్‌?” అడిగాడు బేతయ్య.


“మా ఫ్యాక్టరీ మూసేశారు మామూ!” చెప్పాడు రాజారామ్‌


“అనుకున్నదేలే. కరోనా అందర్నీ దెబ్బకొడుతోంది. వ్యాపారాలు లేక ఒక్కొక్క ఫ్యాక్టరీ మూతపడుతోంది. జనం ఎట్టా బతకాల్నో ఏందో ..!” నీరసంగా అన్నాడు బేతయ్య.


రాజారామ్‌ డైమండ్‌ ఆయిల్ ఫ్యాక్టరీలో, ప్యాకింగ్‌ సెక్షన్లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. విశాఖపట్నం ప్లాంట్‌ నుంచి ట్యాంకర్లలో వచ్చే పామాయిల్‌, హైదరాబాద్‌లో ప్యాక్‌ చేసి మార్కెటింగ్‌ చేస్తారు. లాక్‌డౌన్‌లో ఫ్యాక్టరీ మూతపడింది. లాక్‌డౌన్‌ ఎత్తేసినా సరిగా నడవడం లేదు. మలేసియా నుంచి ముడిసరుకు వైజాగ్‌ రావడం లేదు. అక్కడ శుద్ధిచేసిన పామాయిల్‌ హైదరాబాద్‌కి బంద్‌ అయింది.

దాంతో ఫ్యాక్టరీ మూసేశారు. వర్మర్లు వీధినపడ్డారు.


బీహార్‌ నుంచి వచ్చిన తోటి కార్మికులు స్వంత వూళ్ళకు పయనమయ్యారు. రైళ్ళు, బస్సులు తిరగకపోవడంతో కాలినడకన నెత్తిన మూటలు పెట్టుకుని, ఎడారిలో ఎండమావుల కేసి పోతున్నట్టుగా, వందల కిలోమీటర్లు నడుస్తూ పోతున్నారు.


ఆ హృదయ విదారక దృశ్యాలు టీ.వీల్లో చూస్తూ ఏడుపు ఆపుకుంటూ బాధపడుతున్నాడు రాజారామ్‌. ఒక్కోసారి తనూ వెళ్ళిపోవాలనుకుంటాడు.


కాని అక్కడ బతకలేకనే కదా ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చింది. కాబట్టి ఇక్కడే వుండి రెక్కలకు శక్తి తెచ్చుకుని ఎగరాలి. గత్యంతరం లేదు. ఇప్పుడు మనిషికి పరీక్షా సమయం. నిన్న వున్నవాడు ఈ రోజు లేడని తెలిసినప్పుడు కన్నీళ్ళు కార్చడం తప్ప చేసేదేం లేదు. ఆసుపత్రికి పోయినవాడు అటునుంచి అటే స్మశానానికి పోతున్నాడు. కరోనా కొండ చిలువలా ఎప్పుడో మింగేస్తుంది. జీవితం ఇక తనది కాదు. స్వగ్రామం వెళ్ళినా ఇక్కడ వున్నా తేడా లేదు. జీవితంలో ఏదో ఖాళీ ఏర్పడినట్టుగా వుంది.


ప్రపంచాన్ని కంటికి కనిపించని శత్రువు కరోనా అతలాకుతలం చేస్తోంది. భూలోకమంతా భీభత్సం. కోవిడ్‌ బారిన పడి జనం విలవిల రాలుతున్నారు పిట్టల్లా. బతికున్న వాళ్ళు భయంతో వణుకుతూ చేష్టలుడిగి కనిపిస్తున్నారు. కరోనా కరాళ నృత్యానికి మానవ సంబంధాలు విచ్చిన్నమైపోతున్నాయి. ఆసుపత్రిలో కోలుకున్న ముసలి తల్లిదండ్రులను ఇంటికి తీసుకెళ్ళకుండా మొఖాలు చాటేస్తున్నారు.


మరొకవైపు కోట్లమంది కొలువులు పోయి ఆకలితో అల్లాడుతున్నారు. మనుషులు కడుపునింపుకోవడానికి అక్కడ్నుంచి ఇక్కడకు, ఇక్కడ్నుంచి అక్కడకు వురుకులు పరుగులు తీస్తున్నారు. జన్మంతా పరుగులేనా? అని ఏడుస్తున్నారు. ఇంత కాలం ఎవరూ చూడని కొత్త అవతారం ఎత్తింది ప్రపంచం.


మల్లేశ్‌ చాయ్‌ దుకాణం చెక్క బెంచీల మీద కూర్చుని ఇవే సంగతులు మాట్లాడుకుంటున్నారు కార్మికులు.


“మామూ! మీ దగ్గరేదైనా పని వుంటే చూడు నాకు.” బేతయ్యని అడిగాడు రాజారామ్‌.


“మా దగ్గరా?” అని నిట్టూర్చాడు బేతయ్య. తర్వాత చెప్పాడు.


“మా ప్రెస్‌లో టెంపరరీ స్టాఫ్‌ని ఇంటికి పంపేశారు. పేపర్లకి గిరాకీ లేదంట. తెలుగు పేపరు ప్రింటింగ్‌ ఆపేశారు. ఇంగ్లీషు పేపరు నడుస్తోంది.

ఇప్పుడు జనం పేపరు నుంచి గూడా కరోనా అంటుకుంటుందని భయపడుతున్నారంట.”


బేతయ్య మాటల్లో నిరాశ ధ్వనిస్తోంది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌లో సెక్యూరిటీ గార్డు అతను.


రాజా ప్రెస్ లో పనైతే లేదుగాని, ఈశ్వరయ్య శేటుకి డ్రైవరు కావాలి. ఇంటి దగ్గర వుండాలి.”


బేతయ్య చెప్పింది విని రాజారామ్‌ ముఖం వికసించింది.


“మామూ! నాకు డ్రైవింగ్ లైసెన్స్‌ వుంది.” అన్నాడు.


“ఈశ్వరయ్య శేటుతాన డ్యూటీ చానా కష్టం. ఆయన మందుతాగడు. మాంసం ముట్టడు. గుడ్డు కూడా తినడు. సిగరెట్లుకి దూరం. తన డ్రైవరు గూడా అంట్టుండాలె అంటడు. కుర్ర డ్రైవర్లు పని చెయ్యలేక పారిపోయారు.”


“మామూ! నేను శేటు లెక్కనే వుంటా.”


“సరే ! తీసుకెళ్తా! శేటుకి ఇష్టమైతే నెత్తిన పెట్టుకుంటడు. లేకపోతే తన్ని తగలేస్తడు. కోపం జాస్తి...” చెప్పాడు బేతయ్య.మారేడుపల్లిలో ఈశ్వరయ్యది పాతకాలపు రెండతస్తుల బిల్డింగ్ . చుట్టూ ఎత్తెన ప్రహరీ గోడ. గేటు తెరవగానే పచ్చటి లాన్‌, పూల మొక్కలతో ఆహ్లాదకరంగా వుంటుంది. బిల్డింగ్ పక్కల, బ్యాక్‌ యార్డ్ లో మామిడి, జామ, నేరేడు, సపోటా వంటి పళ్ళ చెట్లు ఏపుగా పెరిగి చల్లటి వాతావరణం కల్పించాయి.


బేతయ్య నివాసం లోపలే, సర్వంట్‌ క్వార్టర్‌లో. అతని భార్య దేవికమ్మ అక్కడ తోటమాలి. వీళ్ళకి ఒక్కతే కూతురు సుమిత్ర. టెన్త్ ఫెయిలై టైలరింగ్‌ నేర్చుకుని ఒక షాపులో పని చేస్తూ వుంది.


ఈశ్వరయ్యకి రాజారామ్‌ కేరెక్టర్‌ నచ్చింది. ఇక్కడ డ్రైవర్ కి ఇరవై నాలుగు గంటల డ్యూటీ. కాంపౌండ్‌ లోనే వుండటానికి సర్వెంట్‌ క్వార్టర్‌.


రాజారామ్‌ రొట్టె విరిగి తేనెలో పడింది. అన్ని సౌకర్యాలు వున్న రెండు గదుల ఇల్లు. వండుకోనక్కరలేదు. ఈశ్వరయ్య ఇంట్లోనే టిఫిన్‌, భోజనం. అతని జీవితంలో ఇంత సంతోషంగా ఎప్పుడూ గడపలేదు. ఈశ్వరయ్య దంపతుల దయాపూరితమైన సాంగత్యం ఉత్సాహాన్ని కలగబేస్తూ, పరాయి ప్రాంతంలో బతుకు తెరువు కోసం వున్నాననే భావాన్ని తుడిచేసింది.


ఈశ్వరయ్య, ప్రెస్‌ బిజినెస్‌ పెద్ద కొడుక్కి, బట్టల షాపు చిన్న కొడుక్కి, అప్పజెప్పాడు. కూతురు అమెరికాలో వుంది. ఆయన ఏదైనా మీటింగ్‌ వుంటే కారు తియ్యమంటాడు. ఈ కరోనా గొడవలో అవీ అరుదు. పెళ్ళిళ్ళు, బంధువుల ఇళ్ళలో పేరంటాలూ తక్కువయ్యాయి.

యజమానురాలు రోహిణీ దేవి ఎప్పుడన్నాషాపింగ్‌కి తీసుకెళ్తుంది.


రాజారామ్‌కి అంతా తీరికే. ఇంట్లోనే టివీ చూస్తునో, సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూనో, బోర్‌ కొడితే చెట్లలో తిరుగుతూనో కాలక్షేపం చేస్తున్నాడు.


ఒకరోజు రోహిణీ దేవిని అడిగాడు.


“అమ్మా! నాకేదైనా పని చెప్పండి. బోర్‌ కొడుతుంది.”


“ఏం పని చెప్పాలి నీకు? ఇల్లు తుడవడానికి యాదమ్మ, వంటకి రాజమ్మ, వాళ్ళమీన పెత్తనానికి దేవికమ్మ వున్నారు. ఇంకేం పని చేస్తావు? కిచెన్‌లో రాజమ్మకి అసిస్టెంట్‌గా చెయ్యి. వంట నేర్చుకో. నీ పెళ్ళాం సుఖపడుతుంది” అన్నది రోహిణీదేవి నవ్వుతూ.


“వంటా? అది ఆడవాళ్ళ పని. నేను చెయ్యనమ్మా” అన్నాడు.


రాజారామ్‌ అందరితో చనువుగా మాటలు కలుపుతూ కలిసిపోయాడు. బీహారు నుంచి తమ వూరివాళ్ళతో కలిసి మొదటి సారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఏదో తెలియని లోకంలోకి వచ్చినట్టు అర్థంకాని భాషతో ఇబ్బంది పడ్డాడు. తర్వాత పట్టుదలతో తెలుగు రాయడం, మాట్లాడ్డం నేర్చుకుని ఇక్కడి సంస్కృతిలో కలిసిపోయాడు.


ఒకరోజు బేతయ్య భార్య దేవికమ్మ, యజమానురాలు రేణుకాదేవి దగ్గరికి వచ్చింది.


“అమ్మా! మన డ్రైవర్ ‌ రాజారామ్‌కి, మా సుమిత్రనిచ్చి పెళ్ళిచేద్దామని వుంది. ఏమంటారు?” అన్నది.


“రాజారామ్‌కే బంగారం లాంటి పిల్లోడు. బాగుంటుందే దేవికా. ఈడు జోడుగా వుంటారు. పిల్ల మన కళ్ళముందే వుంటుంది. మంచి సంబంధమే” అన్నది ఆమె.


“రాజారామ్‌ పెద్దవాళ్ళతో మాట్లాడాలమ్మా! ఎక్కడుంటారో కనుక్కోండి. కులం పట్టింపులు మాకేం లేవు. బేతయ్యదీ, నాదీ ఒకే కులం కాదు. ఇద్దరం ఇష్టపడి గుళ్ళో పెళ్ళీ చేసుకున్నాం. “ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది దేవికమ్మ.


“ఔనా? నాకు తెలీదే ఇంతకాలం. పోనీలే కులంది ఏముంది ఈ రోజుల్లో. సిటీలో అసలు పట్టింపులు లేవు. మతాలు వేరైనా చేసేసుకుంటున్నారు. సరే! దేవికా. ముందు నేను వాడితో మాట్లాడతాను. వాడికి ఇష్టమే అంటే. పెద్దవాళ్ళతో మాట్లాడదాం.” అని అభయమిచ్చింది రేణుకాదేవి.


దేవికమ్మ సంతోషించింది. రాజారామ్‌ని పిలిపించి చెప్పింది రేణుకాదేవి.


“రాజా! నీకో సంబంధం తెచ్చాను. బేతయ్య కూతురు సుమిత్రను నీకిచ్చి పెళ్ళిచేద్దామనుకుంటున్నాను. పిల్లని రోజూ చుస్తూన్నావుగా. టెన్త్‌ వరకు చదివింది. టైలర్‌ షాపులో టైలరింగ్‌ చేస్తోంది. నీకు తోడుగా సంపాదిస్తుంది. నీకు ఈడు జోడు కూడా. ఏమంటావు? నువ్వు “వూ! అంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను.”


రాజారామ్‌ వులిక్కిపడ్డాడు.


“అమ్మా! నాకు ఇదివరకే పెళ్ళయింది. మా అమ్మకు పక్షవాతం. మంచంలో వుంది. అందుకే ఒంటరిగా వుంటున్నా. ఆర్నెల్లకోసారి వూరెళ్లి వస్తున్నాను. అమ్మ వున్నంత వరకు తప్పదు కదమ్మా” అన్నాడు.


“అలాగా. నీకు పెళ్ళయిందన్న సంగతి నాకు తెలీదు. తెలియక అడిగాను. ఏమనుకోకు అని నొచ్చుకుంది ఆమె.ఈశ్వరయ్య కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్‌ చేయించుకుంటూ రోజులు గడుపుతున్నాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తే బాగుంటుంది. కొడుకో, కూతురో ఆర్గాన్‌ డొనేట్‌ చేస్తే సూటవుతుంది. రక్త సంబంధీకులు డొనేట్‌ చేస్తే సమస్యలుండవు అన్నారు హాస్పిటల్‌ డాక్టర్లు.


కొడుకులిద్దరూ వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాలే కాకుండా, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బిల్జింగ్స్‌ కట్టుకుని విలావంతమైన జీవితం అనుభవిస్తున్నారు.


“నాకు సుగర్‌ వుంది. కిడ్నీ డొనేట్‌ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తుందేమో అంటున్నాడు ఫ్యామిలీ డాక్టర్‌.” అని నసిగాడు పెద్ద కొడుకు సురేష్‌


చిన్న కొడుకు గణేష్‌ కిడ్నీ డొనేట్‌ చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే అతని భార్యనళిని అడ్డుపడింది.


“మీరెందుకు కిడ్నీ ఇవ్వడం? మీ నాన్నకి డెబ్బై ఏళ్ళు దాటాయి. ఎంతకాలం బతుకుతాడు. కిడ్నీ మారిస్తే మాత్రం ఆ తర్వాతయినా ఏ లివరో చెడిపోతుంది. అప్పుడే చేస్తారు? మీరు కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోను. డబ్బు పారేస్తే డొనేట్‌ చేసేవాళ్ళుంటారు. చూడండి” అన్నది.


గణేష్‌ నచ్చజెప్పినా ససేమిరా అన్నది.


“నా మాట వినకుండా మొండిగా కిడ్నీ యిచ్చారంటే ఉరి పోసుకుని చస్తాను” అని ఆఖరి అస్త్రం ప్రయోగించింది. గణేష్‌ భయపడి పోయాడు.


తండ్రిని చూడ్డానికి అమెరికా నుంచి వచ్చింది సువర్చల. రేణుకా దేవి కూతుర్ని అడిగింది.


“అమ్మాయ్‌. నాన్నకి కిడ్నీ డొనేట్‌ చెయ్యి. కన్నబిడ్డల కిడ్నీ పెడితే, బాగా సూటవుతుంది. ముందు ముందు ఏ ప్రాబ్లమ్‌ రాదంటున్నారు డాక్టరు.”


“అమ్మా నాకు ఇవ్వాలనే వుందమ్మా! మీ అల్లుడు ఒప్పుకోవడం లేదు. విడాకులిస్తానని బెదిరిస్తున్నాడు” అన్నది.


తండ్రి ఆపదలో వుంటే స్పందించని పిల్లల ప్రవర్తన చూసి రేణుకాదేవికి భూమి గిరిగిరా తిరుగుతున్నట్టనిపించింది.


తమ రక్త మాంసాలు పంచుకుని పుట్టి, చిన్నప్పుడంతా తన కొంగు పట్టుకుని తిరిగిన పిల్లలు ఇంత స్వార్ధపరులా? అవకాశవాదులా? అని ఆక్రోసించింది. ఆమె మనసు. నిశ్చేష్టురాలైంది. ఆవేదనతో వూపిరాడక చచ్చిపోతానేమో, అనిపించింది ఆమెకు. “అందుకే అంటారు సమయం వస్తేగాని మనిషి బుద్ధి బైటపడదని అనుకుని నిట్టూర్చింది.


ఈశ్వరయ్యకి కిడ్నీ డోనర్‌ కావాలని ప్రకటనలు ఇచ్చారు కొడుకులు.


డాక్టర్‌ గిరిధర్‌ దగ్గరికి వచ్చాడు రాజారామ్‌.


“సాబ్‌ మీతో మాట్లాడాలి” అన్నాడు.


“చెప్పు ! నీకేదైనా ప్రాబ్లమా?” అడిగాడు డాక్టర్‌.


“నాకేం లేదుసాబ్‌, అయ్యగారికి నా కిడ్నీ ఇస్తాను. టెస్టులు చెయ్యండి.”


“డాక్టర్‌ ఆశ్చర్యపోయాడు.


“అయ్యగారు నాకు తండ్రితో సమానం. ఆయన్ని ఆదుకోవాలి సాబ్‌”


సరేనని రాజారామ్‌కి టెస్టులు చేశారు. అతని కిడ్నీ సూటవుతుందని తేలింది. ఈశ్వరయ్య భార్య సంతోషించింది.


“కన్న బిడ్డలు కిడ్నీ ఇవ్వమంటే పారిపోయారు. పరాయి వాడు, ఏ బంధుత్వం లేనివాడు ముందుకు వచ్చాడు. ఏ జన్మలో బుణానుబంధమో?” అనుకుని వుద్వేగంతో కన్నీళ్ళు కార్చింది రేణుకాదేవి.
తర్వాత ఈశ్వరయ్యకి, రాజారామ్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది.


“రాజా! నువ్వు మీ వూరెళ్ళి నీ తల్లి దండ్రుల్ని భార్యను హైదరాబాద్‌ తీసుకొచ్చెయ్‌. నువ్విక్కడ, వాళ్ళు అక్కడ ఎంతకాలం?” అన్నాడు ఈశ్వరయ్య.


“ఇప్పుడెందుకు సాబ్‌, తర్వాత చూద్దాం లెండి.” అన్నాడు రాజారామ్‌ అనాసక్తిగా.


“ఇక్కడ నువ్వుంటున్న సర్వెంట్‌ క్వార్టర్‌ సరిపోదు అని తెలుసు. నీ పేరుతో ఒక ఫ్లాట్‌ కొంటున్నాను. మూడు బెడ్‌ రూములుంటాయి.

ఇబ్బంది ఉండదు.”


ఈశ్వరయ్య చెప్పింది విని బిత్తరపోయాడు రాజారామ్‌. ఆయన సరికొత్త ఫ్లాట్‌ కొనడం తెలుసు. అది కోటి రూపాయలు. అది తనకు గిఫ్ట్‌గా ఇచ్చేస్తున్నాడా? తన పాస్‌పోర్టు ఫోటో అతికించిన పేపర్ల మీద సంతకాలు పెట్టమంటే ఎందుకో అనుకున్నాడు. ఇందుకా? అతని మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.


“ఇప్పుడేం తొందర సాబ్‌. తర్వాత తీసుకొస్తా...” మొఖమాటంగా అన్నాడు.


“ఫ్యామిలీని తీసుకురమ్మంటే, తప్పించుకుంటావెందుకురా రాజా. ఒంటరిగా వుండడం నీకు హ్యేపీగా వున్నట్టుందే” అని నువ్వుతూ చురకవేశాడు ఈశ్వరయ్య.


ఆ రోజు సాయంకాలం ఈశ్వరయ్య దంపతులు మార్కెట్‌లో షాపింగ్‌ చేశారు. తిరిగి ఇంటికెళ్ళడానికి నెమ్మదిగా కారు దగ్గరికి వస్తున్నారు. వారి వెనుక రాజారామ్‌ క్యారీ బ్యాగులు పట్టుకుని అనుసరిస్తున్నాడు.


“రహీ.. రహీం...” అని కేక వినపడింది.


ఉలిక్కి పడ్డాడు రాజారామ్‌. వెనక్కితిరిగి చూచి వెంటనే వడివడిగా ముందుకు అడుగులు వేశాడు. కారు దగ్గరకు చేరకోబోతుండగా

“ రహీం భాయ్‌.. టైరో” అంటూ ఒక యువకుడు వచ్చి రాజారామ్‌ భుజం పట్టుకుని ఆపాడు.


“సాబ్‌ మై హుస్సేన్‌. బీహార్‌ మే షాజహాన్‌పూర్‌ గావ్‌మేరా. రహీం మేరా బచ్‌పన్‌గా దోస్త్‌...” చెప్పాడు హుస్సేన్‌.


రాజారామ్‌ అతన్ని దూరంగా తీసుకెళ్ళి మాట్లాడి పంపేశాడు. ఈశ్వరయ్య దంపతులు కారులో కూర్చున్నారు.


ఇంటికి రాగానే ఈశ్వరయ్య రాజారామ్‌ని నిలదీశాడు.


“ఏరా...! నువ్వు రాజారామ్‌ కాదా? రహీంవా?”


“హౌ సాబ్‌ మేరా నామ్‌ రహీం” తలవంచుకుని చెప్పాడు.


“ఎందుకురా అలా పేరు మార్చుకున్నావ్‌?”


“బతుకు తెరువు కోసం సాబ్‌. బీహర్‌ నుంచి వచ్చి ఇక్కడ పనులు వెతుక్కునే మా ముస్లింలు, చాలామంది హిందూ పేర్లతో బతుకుతాం సాబ్‌. ముస్లింలని తెలిస్తే పనులు ఇవ్వరు సాబ్‌...!


ఈశ్వరయ్య, రేణుకాదేవి స్థాణువులయ్యారు. నమ్మలేనట్లు విచిత్రంగా చూస్తున్నారు అతన్ని. ఇట్లా గూడా జరుగుతూ వుందా?


“సాబ్‌ నేను మోసం చేశానని మీరనుకుంటే వెళ్ళిపోతాను సాబ్‌...” అంటూ వుంటే రహీం గొంతు జీరపోయింది.


ఈశ్వరయ్య కదిలిపోయాడు. అమాంతం రహీంని హత్తుకున్నాడు.


“ఎక్కడికిరా పోయేది నువ్వు? నిన్ను పోనివ్వను. అడక్కుండానే కిడ్నీ డొనేట్‌ చేశావు. నాకన్న కొడుకుల కంటే ఎక్కువ. ఆత్మబందువ్వి. బతకడానికి పేరుమార్చుకోనవసరం లేదు. రహీంగానే వుండు. మనిషి ఏదోక మతంలో పుడతాడు. మనిషి కోసం మతం.


అంతేకాని మతం కోసం మనిషికాదు. “ఈశ్వరయ్యలో లేచిన భావోద్వేగపు అలలు ఆనందంలో ముంచెత్తాయి.


రేణుకాదేవి వారి అనుబంధాన్ని చూసి కళ్ళు తుడుచుకుంటూ, రహీం భుజం మీద చెయ్యి వేసింది.


“నువ్వెక్కడికీ వెళ్ళొద్దు” అన్నది.


“అమ్మా! ఇంకొకటి గూడా చెప్పాలి మీతో. నాకు పెళ్ళి కాలేదు. బేతయ్య మామూ కూతుర్ని పెళ్ళి చేసుకోమని మీరంటే మిమ్మల్ని మోసం చెయ్యలేక అబద్దం చెప్పాను..” అన్నాడు రహీం.


“గొప్పోడివిరా! కోటికొక్కడుంటాడు నీలాంటోడు.” మెచ్చుకుంది రేణుకాదేవి.


“మనిషి బతుకు తెరువుకి ఎన్ని పాట్లు పడతాడు? ఎన్ని నాటకాలు వేస్తాడు? మనిషి బతుకే బహుకృత వేషం మరి అనుకుంది ఆమె.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.23 views0 comments

Comments


bottom of page