'Bhagavan Nannu Kshaminchu' written by
Kantaspurthi Vijaya Kanaka Durga
రచన : కంఠస్ఫూర్తి విజయ కనక దుర్గ
సాయంత్రం. నాలుగున్నర. చేతిలో స్మార్ట్ ఫోను రింగ్ అయింది. స్క్రీన్ మీద భర్త ఫొటో కనపడగానే దానిమీద చూపుడువేలుతో చిన్న అడ్డ గీత గీసి, “చెప్పండి ఏమిటి ?" శ్రీవల్లి విసుగ్గా అంది.
"వల్లీ! నాన్నగారు పోయారట.. ఇప్పుడే.ఆశ్రమం నుంచి గుమస్తా ఫోన్ చేసి చెప్పాడు."దివాకరం గొంతులో బాధ.విచారం.సుడులు తిరిగాయి.
కొన్ని క్షణాలు.ఇద్దరి మధ్య. మౌనం రాజ్యమేలింది.
"ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? "శ్రీవల్లి అడిగింది.
"నేను వెళ్ళాలి.ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా”.
"అంటే.కర్మ కాండ మొత్తం మీరే చేయాలా?"
"అబ్బే అదేంలేదు. నాన్న గారు ఎప్పుడో తన కళ్ళని బాదం చారిటబుల్ ట్రస్ట్ కి తన బాడీని రంగరాయ వైద్య కళాశాలకి డొనేట్ చేశారు. కాకపోతే నేను వెళ్లి ఒకటో రెండో సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. గుమస్తా కూడా అదే విషయం ఫోన్లో చెప్పాడు .'
"అయితే . అదేదో. త్వరగాపూర్తి చేసుకుని రండి. నాని గాడు ఇంకా స్కూల్ నుంచి రాలేదు.వస్తే. వాడిని రెడీ చేయాలి. సాయంత్రం. ఎవరిదో మీ ఫ్రెండ్స్ వాళ్ళది పెళ్లి రిసెప్షన్ ఉంది అన్నారుగా" శ్రీవల్లి హుంకరిoపు.
"అవును. అది సరే. నాన్నను చూడడానికి ఆశ్రమానికి నువ్వు రావా ? "దివాకరం అడిగాడు. "అమ్మో. అక్కడ మీ నాన్నశవం హఠాత్తుగా లేచి నా చేయి పట్టుకుంటే .నేనేం చేయాలి? ఇంకేమైనా ఉందా. నా గుండె ఆగిపోదూ." ఫోన్లో.శ్రీవల్లి భయవిహ్వలoగా నవ్వింది.
ఆనవ్వులో ఎన్నోభావాలు ధ్వనించాయి. దివాకరం మాట్లాడలేదు. అతని మనసులో తండ్రి గురించిన ఆలోచనలు కలవరపెడుతున్నాయి .
నాన్నకు తను ఒక్కడే సంతానం.అమ్మ పోయిన తర్వాత నాన్న ఒంటరితనంతో దాదాపు పిచ్చివాడిలా తయారయ్యాడు. రాత్రి పగలు నిద్రలోనూ "భవానీ భవానీ" అంటూ ఒకటే కలవరింతలు.శ్రీవల్లి నాన్నకు కాఫీ ఇస్తున్నా,భోజనం పెడుతున్నా,భవాని అలా చేసేది. ఇలా పెట్టేది,అలా మాట్లాడేది, అంటూ ఒకటే ముచ్చట్లు. రాను రాను అమ్మ చింతనలో నాన్న ధోరణి పెరిగిందేగానీ తగ్గలేదు.నిత్యం అమ్మ నామస్మరణే..
శ్రీవల్లి చికాకుపడేది. విసుగు చూపించేది.
"అయితే. మీరు ఎందుకు ఇక్కడ? ఆవిడ ఎక్కడుందో ఆ దారే మీరు చూసుకోండి? తను వ్యంగ్య బాణాలు విసిరేది.ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తండ్రి మీద బోలెడు ఫిర్యాదులు శ్రీవల్లి సిద్ధం చేసి ఉంచేది. అవి క్రమంగా స్థాయి పెరిగి మీ నాన్న నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు అంటూ ఒకటేసణుగుడు. నన్ను ఏ పని చేసుకోనివ్వడం లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నా వెనక నిలబడి ఉంటున్నాడు. నన్ను అదో రకంగా చూస్తున్నాడు. నిజంగా మీ నాన్నకు మతి తప్పింది. ఏం చేయమంటారు నన్ను? "అంటూ నిలదీసేది.
మరో రోజు పెద్ద ఫిర్యాదు చేసింది. "నేను స్నానానికి వెళుతూ ఉంటే, మీ నాన్న నా చెయ్యి పట్టుకున్నాడు "అంటూ భోరున ఏడ్చింది శ్రీవల్లి.
నాకూ అసంబద్ధంగా అనిపించింది."ఏమిటిది నాన్నా? కోడలు చేయి పట్టుకోవడం ఏమిటి?" తను గొంతు చించుకుని అరిచాడు.
"ఏం లేదురా దివాకరం! నాకు బాగా ఆకలి వేస్తోంది. నీకు తెలుసుగా నేను ఆకలికి తట్టుకోలేనని. అమ్మా! అమ్మా! నాకు అన్నం పెట్టేయి అమ్మా." అని అడిగాను. కోడలు వినిపించుకోలేదు. విసురుగా వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుని ఆపాను అంతే."
నాన్నముఖంలో ఎప్పటిలాగే అమాయకత్వం, నిర్మలమైన చూపులు. "మీ నాన్న ఆకలి మామూలు ఆకలి కాదు. ఆయన్ని నేను భరించలేను. మీరు అర్థం చేసుకుంటారా? నన్ను మరోదారి చూసుకోమంటారా ?"
శ్రీవల్లి ఇల్లు అదిరిపోయేలా కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు ఇంట్లోకి వచ్చారు. శ్రీవల్లి ఏడుపు. గోల మరింత ఎక్కువ చేసింది. పర్యవసానం, నాన్నఆశ్రమవాసం, అనివార్యమయిoది.
'సంధ్యా రాగం' వృద్ధాశ్రమంలోకి. బెరుకు బెరుకుగా అడుగుపెట్టాడు దివాకరం. ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. చుట్టూ రెల్లు గడ్డితో నేసిన పర్ణశాలలాంటి గదులు. దారి పక్క పచ్చని చెట్లు, పూల మొక్కలు, మధ్యలో ఆశ్రమ కార్యాలయం ఉంది. దివాకరం ఆ దిశగా అడుగులు వేశాడు. మనసులో ఏదో అపరాధ భావం మెలిపెడుతూoది. ''అది ఏదో త్వరగా ముగించుకొని రండి." చెవిలో శ్రీవల్లి మాటలు కరకుగా వినబడుతున్నాయి . ఈ ఆశ్రమానికి తండ్రిని చేర్పించడానికి వచ్చి వెళ్ళిన తర్వాత, నాన్నే రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు. తను మాత్రం ఆశ్రమానికి రావడం, ఇదిగో,ఇప్పుడే, ఇలా.
"రండి . . ఆశ్రమం గుమస్తా వరదరాజులు ఎదురు వచ్చి,లోపలికి దారితీశాడు. దివాకరం అనుసరించాడు.
కార్యాలయానికి పక్కగా. ప్రార్థనా మందిరం వెనుక పంచలో తండ్రి పార్థివ శరీరం ఉంచబడింది. ఎవరు వెలిగించారో,తండ్రి తలవద్ద చమురు దీపం వెలుగుతోంది. అగరవత్తులు నుసిరాలుస్తూ సుగంధ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. తండ్రి శవం వద్ద పది మందికి పైగా వృద్ధులు,ఆడ మగ గుమికూడి ఉన్నారు. విషాదవదనాలతో కొందరు,కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళు కొందరు. దివాకరం చేష్టలుడిగి చూస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కాక ఒక డాక్టరు, ఇద్దరుసహాయకులు,దివాకరం కోసం ఎదురు చూస్తున్నట్టు నిలబడి ఉన్నారు. సహాయకులు దివాకరం వద్దకు వచ్చి రెండు సంతకాలు తీసుకున్నారు .
తండ్రి ముఖం నిర్మలంగా ఉంది. నిద్రలో ఉన్నట్టుగా ఉంది. "ఇప్పుడు తనమీద కోపంతో నాన్న లేచి చెంపదెబ్బ కొడతాడా ? చిన్నప్పుడు తనను చీటికీమాటికీ చెంపదెబ్బలు కొట్టేవాడు.ఇప్పుడు కొట్టలేడు,తిట్టలేడు,ఏమి ప్రశ్నించలేడు.పిచ్చి నాన్న”.
దివాకరం మనసు, దుఃఖానికి అటూఇటూ ఎగసి పడుతోంది. "బాదం చారిటబుల్ ట్రస్టు" వాళ్ళు, తండ్రి కళ్ళ కార్నియాలు పెకలించి తీసుకుపోయారు. నాన్న నేత్రదానం ముగిసింది . "ఇక.తను వెళ్లిపోవచ్చా? వెళ్లాలి,వెళ్ళిపోవాలి. శ్రీవల్లి వచ్చేయమని చెప్పిందిగా.”
దివాకరం మనసు తొందర పెడుతోంది.అతను తన తండ్రి నిర్జీవ శరీరాన్ని సూటిగా చూడలేక పోతున్నాడు .
ఆశ్రమం బయట మరో ఆసుపత్రి వాహనం గోలపెడుతూ వచ్చి ఆగింది . వైద్య కళాశాలకు చెందిన నలుగురు వ్యక్తులు లోపలకి వచ్చారు. వాళ్లు వరదరాజులుతో మాట్లాడిన తర్వాత, దివాకరం వద్ద సంతకాలు తీసుకున్నారు. ఆ నలుగురు వ్యక్తులు తండ్రి శరీరాన్ని కదిలించి, తెల్లటి గుడ్డ కప్పి, స్ట్రెచర్ మీద పడుకోబెట్టి, బయటకు తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు. నాన్న భౌతికకాయాన్ని పరిశోధన గదిలో, గాజుపెట్టె లో ద్రావకాల మధ్య, భద్రపరచి,వైద్య విద్యార్థులకు పాఠాలు చెబుతారట. నాన్న జీవితం ధన్యం అయిందా? ఏమో. తనకు మాత్రం అపరకర్మ బాధ్యతల నుంచి తప్పించాడు.
"నాన్నగారిని కాసేపు ఉంచమంటారా? వరదరాజులు దివాకరాన్ని అడిగాడు.
"వద్దు,అదేం లేదు,తీసుకు వెళ్ళమనండి. "దివాకరం మాటలు తడబడ్డాయి . ఆస్పత్రి వాళ్ళు తండ్రి శరీరాన్నిబయటకు మోసుకుపోయారు. వరదరాజుల తో పాటు అక్కడ వృద్ధులు అందరూ నాన్నకు తుది నమస్కారాలు చేశారు. దివాకరం అప్రయత్నంగా రెండు చేతులు జోడించాడు .
"నేను వెళ్లొచ్చా?" దివాకరం అడిగాడు.
"ఒక్క నిమిషం. మీ నాన్నగారి గది చూడరూ.? గదిలో సామాన్లు,” వరదరాజులు వెంట అయిష్టంగానే ముందుకు కదిలాడు దివాకరం. ఆయన గదిలో ఏమి ఉన్నాయి ? మూడు పంచలు. రెండుతువాళ్ళు. నాలుగు జుబ్బాలు. పొడవాటి స్టూల్ మీద నాన్న కళ్ళజోడు. పాతది రత్నం కంపెనీ పెన్ను. ఏవో కొన్ని పుస్తకాలు. మూలగా తాళంకప్పతో ట్రంకు పెట్టె.
"నాన్నగారి జ్ఞాపకంగా, వీటిలో ఏవైనా మీరు తీసుకు వెళ్ళవచ్చు". "నాకేమీ వద్దు ఎవరైనా అడిగితే ఉచితంగా ఇచ్చేయండి. దివాకరం మొహం తిప్పుకుని అన్నాడు. "మీ నాన్నగారు కష్టజీవి. నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. ఆయన ఉత్సాహంగా ఉంటూ అందరినీ ఉత్సాహపరిచేవారు. ఉపాధ్యాయ వృత్తి లో నుంచి వచ్చిన వారేమో. ఎన్నో పిట్ట కథలు నీతి కథలు సందర్భానుసారం చెప్పి,అందర్నీనవ్వించేవారు. మీ నాన్నగారు అంటే ఆశ్రమంలో అందరికీ ఒక గౌరవం. ఒక నమ్మకం". "ఈయన ఎందుకు చెప్తున్నాడు ఇదంతా? నన్ను కదలనివ్వడా? దివాకరం అసహనంగా కదులుతున్నాడు. "మీ గురించి ఏనాడు ఒక నిష్టూరపు మాట కూడా మాట్లాడలేదు. రాలేదని, చూడలేదని, అలా, నా కొడుకు, కలెక్టర్ కావలసిన జాతకం, గుమస్తాగా ఉండిపోయాడు. అంటూ బాధపడేవారు. అంతేకాదు.
వరదరాజులు వరద గోదావరిలా మాట్లాడుతూ ట్రంకు పెట్టి తెరిచాడు . పెట్టెలో పోస్టాఫీసు పింఛను పుస్తకం. ఏవో ధనవృద్ధి పథకాల పత్రాలు. ఎప్పటిదో, తమ పెళ్లినాటి తెలుపు నలుపు ఫోటో. పోస్ట్ చేయని ఎన్నో ఉత్తరాలు. కార్డులు,కవర్లు ఉన్నాయి .
"బాబు ఇవన్నీ నీ పేరున రాసిన ఉత్తరాలే. ఇదేదో ఈ మధ్యనే రాసిన ఉత్తరంలా ఉంది చూడు . "వరదరాజులు ఒక ఉత్తరం దివాకరం చేతికిఅందించాడు. ఆ కవర్ చించి ఉత్తరం బయటకు తీసి, ఆత్రంగా చదవసాగాడు . .
"నాన్నా! దివాకరం, నీకు ఇదే నా చివరి ఉత్తరం ఏమో? ఇంతకుముందు చాలా ఉత్తరాలు రాశాను. ఏదీ నీకు పోస్ట్ చేయలేదు. ఎందుకో ఉత్తరం రాసి ముగించే సరికి, దాన్ని నీకు పోస్ట్ చేయాలి అనిపించేది కాదు. ఈ ఉత్తరం అన్నా నీకు పోస్ట్ చేయగలనో లేదో ?
ఏదో ఒక రోజు నువ్వు వస్తావని నా ఆశ. చిన్నప్పటి నుంచి నువ్వు తప్పు చేసినప్పుడల్లా. నిన్ను చెంపదెబ్బలు కొట్టేవాడిని. నీకు క్రమశిక్షణ నేర్పాలన్న ఒక్క తపన తప్ప నీపై కోపం ఎప్పుడూ లేదు నాకు. చేయవద్దన్న పనిని చేయడమే నీకు మొదటి నుంచి అలవాటు.పెద్దయ్యాక కూడా నీ అలవాటు మారలేదు. చదువు. ఉద్యోగం చివరకు నీ పెళ్లి విషయంలోనూ. నీ పంతమే నెగ్గింది. అమ్మ అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. ఒంటరి పక్షి లా మిగిలిన నన్ను తప్పు పట్టి. దోషిగా కోడలు ముద్ర వేస్తే. నువ్వు సమర్ధించి. నలుగురి ముందు దోషిగా నిలబెట్టి .అదాటుగా వృద్ధాశ్రమానికి తరలించావు . ఇది నాకు శరాఘాతమే . అయినా నేనిప్పుడూ ఆశ్రమంలో సుఖంగానే ఉన్నాను. కానీ నీకు సుఖం ఏదిరా దివాకరం ? ఆనందం ఏది? స్వతంత్రం ఏది ? ఒకప్పుడు నా పంతమేనెగ్గాలి అన్న నీ మనస్తత్వం.కోడలు ముందు ఎంత బలహీనంగా తయారయ్యిందో. నేను అంచనా వేయగలను. .
నాన్నా, నీ పెళ్లిలో కోడలు వడ్డాణం గురించి మన వాళ్ళు ఎవరో గిల్టు నగ అని వ్యాఖ్యానించారని తను ఎంతో బాధ పడిపోయింది. అది ఉక్రోషoగా మారి, కోపంగా, పట్టుదలగా, బుసలు కొట్టి, తనకు సరిపడా వడ్డాణం చేయించమని, ఇప్పటికీ నిన్ను సాధిస్తూనే ఉంది. నిన్ను అసమర్ధునిగా చిత్రిస్తూ, చీటికీమాటికీ ఛీ కొడుతూనే ఉంది. ఇది నేను కళ్లారా చూశాను. నువ్వైతే వాగ్దానం చాలాసార్లు చేసావు గాని, ఆర్థికస్థితిగతుల వల్ల అది నీకు సాధ్యపడలేదు .
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేసిన నాకు వచ్చే పింఛనులో, ఆశ్రమం ఖర్చులు పోగా, నెల నెలా దాచిన డబ్బులు, కూడబెట్టిన సొమ్ము మొత్తం నా పోస్ట్ ఆఫీస్ ఖాతాలోనే ఉన్నాయి. ఆ సొమ్ము మొత్తం నీవు తీసుకునే వెసులుబాటు నీకు కలిగించాను. అంగీకార అధికార పత్రాలు పోస్ట్ మాస్టారుకు ఇచ్చి వచ్చాను. ఆ సొమ్ము సుమారు, పది లక్షల పైనే ఉంటుంది .
నాన్నా దివాకరం, ఆ సొమ్ముతో వెంటనే కోడలు కి వడ్డాణం చేయించు. అప్పుడైనా ఆమె అహం, కోపం చల్లారి, నీకు విలువ పెరుగుతుందేమో! కోడలు ముందు నిటారుగా నిలబడి మాట్లాడగలవేమో! అప్పుడైనా నీకు స్వతంత్రం, సుఖం, దక్కుతాయేమో! ఎందుకంటే అదే నా కోరిక బాబూ. నాన్నా బంధాలు, బంగారు వడ్డాణం లా, బలంగా,పటిష్టంగా పెనవేసుకు పోవాలి. బలహీనపడి తెగిపోగూడదు నాయనా .
దివాకరం, నీ గురించి బాధ పడిన నిద్రలేని రాత్రులు, అన్నిటినీ మరిచిపోయాను. నువ్వు నిటారుగా నిలబడినట్లు, కోడలు ముందు ధైర్యంగా మాట్లాడుతున్నట్టు, నువ్వు నవ్వుతూ నన్ను చూడటానికి వస్తున్నట్లు, నేనెప్పుడూ కలలు కంటుటాను. బహుశా ఈ కలలతోనే కన్నుమూస్తానేమో? నా కలలు నిజం చేస్తావు కదూ. నాన్నా."
ఇట్లు,నీ నాన్న .
చిత్తరువు భగవాన్ లు.
దివాకరం కళ్ళు మూసుకున్నాడు. నిలువునా కన్నీటి అశ్రువులతో, కరిగి నీరై పోతున్నాడు. దుఃఖభారం తో,కుప్ప కూలినట్టు, వంగి మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. అతని నోటివెంట, తొమ్మిది అక్షరాలు వెలువడ్డాయి. "భగవాన్ నన్ను క్షమించు ."
********** ************ ************
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం : నాపేరు:కంఠ స్ఫూర్తి విజయ కనకదుర్గ ..గృహిణిని..శ్రీవారు సీనియర్ రచయిత.. ఆయన సాహితీ ప్రయాణంలో నేనుసహా ప్రయాణికురాల్ని..ఆయన రాసిన కథలన్నీ చదువుతూ సలహాలు ఇస్తూ ఉంటాను..ఎక్కువగా ఆధ్యాత్మిక వ్యాసాలు రాశాను.. ఆకాశవాణి విశాఖలో 'చింతన' కార్యక్రమంలో 15కు పైగా వ్యాసాలు ప్రసారం అయ్యాయి..నా అభిరుచి మేరకు అడపాదడపా కథలు రాస్తూ ఉంటాను..ఇప్పటివరకు ఎనిమిది కథలు రాశాను.. అందులో గీతాంజలి పక్ష పత్రికలో బహుమతి వచ్చిన గొలుసు కథ.. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిన..అగ్రిమెంట్ కధ..నారీ భేరి పత్రికలో వచ్చిన భవతీ శిక్షాందేహి.. కథ పేరు తెచ్చిపెట్టాయి.. భవతి శిక్షాoదేహీ..శ్రవ్య నాటికగా దృశ్య నాటికగా ప్రజాదరణ పొందింది.. మానవసంబంధాల పై రాసిన కథలు అంటే ఎక్కువగా ఇష్టపడతాను ! సంక్షిప్తంగా ఇది నా పరిచయం!
Very touching. The author has brought out parental affection in an excellent manner.
Chala bagaa raasaaru. Parentst ni neglect cheyyadam manushula character batti untundi. Eee rojullo undi paata rojullo kooda undi. It depends upon values one holds.
ఆద్యంతం చక్కటి కథనంతో సాగింది. ఆర్ధ్రమైన ముగింపుతో గుండెను మెలిపెట్టారు. ప్రస్తుత సమాజంలో మృగ్యమౌతున్న మానవసంబంధాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రముఖ కథారచయిత శ్రీకంఠస్పూర్తి గారి సహధర్మచారిణిగా మీ కలంనుండి మరిన్ని మంచి కథలు రావాలని ఆశిస్తూ.. హృదయపూర్వక అభినందనలు మేడమ్ గారు.
- మార్ని జానకిరామ చౌదరి,
సాహితీ స్రవంతి అధ్యక్షులు, కాకినాడ.
Aunty... All the best... Story is very well written aunty......
కథ చాలా బాగుందండి.