top of page
Writer's pictureVadali Lakshminath

బుజ్జిగాడు


'Bujjigadu' written by Vadali Lakshminath

రచన : V . లక్ష్మీనాథ్

సురేఖ ఇప్పటికే నాలుగు డ్రెస్సులు మార్చింది.

ఏ డ్రెస్సు వేసుకున్నా ఏదో అసంతృప్తి.

కాన్పు తరువాత శరీరంలో వచ్చిన మార్పుల వల్ల పాత డ్రెస్సులు సరిగ్గా నప్పినట్టు అనిపించట్లేదు .


ఎంతో చక్కటి శరీరాకృతి. ఎంతో కష్టపడి తీర్చి దిద్దుకున్న రూపం. ఎప్పుడు ఏ పార్టీకి వెళ్లినా తన శరీరాకృతిని చూసిన వాళ్ళు కళ్ళు తిప్పుకోలేక పోయేవారు. అలాంటిది ఈ కాన్పు తరువాత ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఆ పాత రూపం రావట్లేదు.

ఈ మధ్య ఆన్లైన్లో తెప్పించిన డ్రెస్సులు వేసుకొంది. అవి కూడా పూర్తిగా నప్పినట్టు లేవు.

చంటి వాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అసలే చికాకుగా ఉంటే చంటి వాడి ఏడుపు మరింత చికాకు తెప్పిస్తోంది సురేఖకి.

"ఎప్పుడూ ఏడుపే, ఎన్నిసార్లు ఆకలేస్తుంది నీకు? అమ్మా! చూడు, వీడికి ఆకలేస్తోన్నట్టుంది" విసుగ్గా అరిచింది సురేఖ.

"ఎందుకంత చికాకు, పోతపాలు పిల్లలు ఇలాగే ఉంటారు. తల్లి పాలంటే కుదరదు అంటే కుదరదు అన్నావు ? పిల్లవాడు చూడు ఎంత పేలవంగా వున్నాడో, ఎంత జాగ్రత్తగా చూసినా కండ పట్టట్లేదు. ఈ అందం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందా? పిల్లల ఆరోగ్యం కంటే నీ అందం ఎక్కువైపోయింది " అనుకుంటూ పక్క గదిలోకి తీసుకొని వెళ్లింది తల్లి అన్నపూర్ణ.

పిల్లాణ్ణి లోపలికి తీసుకొని వెళ్ళి కూడా గొణుక్కొంటోంది అన్నపూర్ణ.

ముందే డ్రెస్సులు సరిపొవట్లేదంటే, పిల్లాడి ఏడుపు, అన్నపూర్ణ గొణుగుడుతో చిర్రెత్తుకొచ్చింది సురేఖకి.

పిల్లవాడు పుట్టి నాలుగు నెలలౌతోంది. బయటకు వెళ్లాలంటే అన్నపూర్ణతో రచ్చ. స్వేచ్ఛగా హాయిగా తిరిగే ప్రాణం. తీసుకొచ్చి ఈ బందిఖానాలో పెట్టారు.

ఈ పరిస్థితిని ముందే ఊహించుకొని అసలు పిల్లలు వద్దని భర్త శేఖరంతో నిక్కచ్చిగా చెప్పింది. తల్లి, భర్త బ్రతిమాలి తనకెటువంటి బాధ్యత ఇవ్వము అని హామి ఇవ్వడముతో ఈ కాన్పుకు ఒప్పుకొంది .

ఫోన్ రింగ్ చప్పుడికి గిర్రున తిరిగి ఫోన్ ఎత్తింది. కాంతి నుండి ఫోన్ "వచ్చేటప్పుడు బుజ్జిగాడిని తీసుకొని రా! నేను బబ్లూని చూడడానికి లచ్చిని తెస్తున్నాను. బుజ్జిగాడిని కూడా చూసుకొంటుంది. వచ్చిన దగ్గరనుంచి బుజ్జిగాడికోసం వెళిపోతానంటే వినేది లేదు. మనం ఎక్కువసేపు ఎంజాయ్ చెయ్యొచ్చు, అసలే మనం కలిసి చాలా రోజులైంది " అంది.

"సరే చూస్తాను" ఫోన్ పెట్టేసింది సురేఖ. శేఖరం వచ్చిన అలికిడితో అర్ద మనస్కంగా వేసుకొన్న డ్రెస్ తో బయటకు వచ్చింది సురేఖ.

"కాంతి బుజ్జిగాడిని తీసుకొని రమ్మంటోంది" చెప్పింది సురేఖ తల్లితో.

"అసలే చలికాలం, బయట చలి కూడా ఎక్కువగా ఉంది. మీరు వెళ్ళేది కూడా ఏసి ఉన్న హోటల్. నువ్వు వెళ్లడమే నాకిష్టం లేదు. బాలింతరాలు, చంటిపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరికీ ఈ సమయంలో ఏమైనా వస్తే జీవితాంతం బాధిస్తాయి" అంది అన్నపూర్ణ.

"అమ్మా, ఆపుతావా! నువ్వూ నీ చాదస్తం, ఎప్పుడూ ఒకటే గోల" విసుగ్గా అంది సురేఖ.

"ఐదు నెలల వరకు బాలింత అరికాలు పచ్చి కూడా ఆరదంటారు. అలాంటిది నువ్వు చెవుల్లో దూది కూడా పెట్టుకోవు. ఎప్పుడూ పార్టీలు సరదాలంటే ఎలా?" అన్నపూర్ణ గొణుగుతూనే ఉంది,పిల్లవాడు ఏడుస్తూనే ఉన్నాడు. సురేఖ బాగ్ తీసుకొని బయలుదేరింది.

శేఖరం కారు తలుపు తీసి పట్టుకున్నాడు. సురేఖ ఎక్కగానే డ్రైవింగ్ సీట్ వైపు వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేసాడు.

కార్ హార్న్ కొడుతూ రయ్ రయ్ మని దూసుకొని పోతోంది. ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది.

"శేఖర్! ఎన్నాళ్ళయింది ఇలా మనం పార్టీకి వెళ్ళి. మళ్ళీ మళ్ళీ ఈ సరదాలంటే మనకి వస్తాయా? అమ్మ చాదస్తంతో చంపేస్తోంది, నావల్ల కావట్లేదు," చెబుతోంది సురేఖ.

"ఏదో పెద్దవాళ్లు .....వినీ విననట్టుండాలి. ఆవిడ చెప్పినా మనం మానలేదు కదా! వెళ్తున్నాము కదా! ఇంకా ఆలోచన దేనికి రిలాక్స్ అవ్వు బేబీ" అన్నాడు శేఖరం.

"బుజ్జిగాణ్ణి కూడా తెచ్చేస్తే రాత్రి లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే, అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. కాంతికి అయితే ఏ బాదరబందీ లేదు హాయిగా బబ్లూ నెలలోపు నుండే అన్ని చోట్లా తిరిగేది. నేనివన్నీ ముందుగానే ఊహించాను. పిల్లలు వద్దంటే వద్దు అని ఎంత మొత్తుకున్నా ఇద్దరూ విన్నారు కాదు , మొత్తం మేమే చూసుకొంటాము , నీకేమి బాధ్యత పెట్టామన్నారుగా !" చెప్పుకొని పోతోంది సురేఖ.

మాటలను కట్ చేస్తూ శేఖరం అన్నాడు, "కూల్ బేబీ అంతా అత్తయ్యనే చూస్తున్నారు కదా!" కారు స్లో అయ్యేటప్పటికి ఇద్దరి దృష్టి రోడ్డు వైపుకు మారింది.

దగ్గర్లో ఏదో ఎక్సిబిషన్ ఉన్నట్టుంది. ట్రాఫిక్ జామ్ అయింది. ఇంత ట్రాఫిక్ జామ్లోనూ మనుషులు రోడ్డు దాటుతూనే ఉన్నారు. ఎవరూ ఆగేట్టు లేరు. ఫుట్ పాత్ల నిండా బుడగలమ్ముకొనే వాళ్ళు, చిన్న వ్యాపారస్తులు. వారి చుట్టూ చేరిన జనాలతో కోలాహలంగా ఉంది. కొత్త తరహాలో ఉన్న ప్లాస్టిక్ బొమ్మలు, రకరకాల రంగులతో గాలి నింపబడి ఉన్నాయి. ఆ బొమ్మలు చిన్న వాళ్ళని ఆకర్షిస్తూ, వాళ్ళు పెద్ద వాళ్ళని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి .

అవన్నీ చూస్తున్న సురేఖకి కాంతి మాటలు గుర్తుకువచ్చాయి .

"వచ్చే త్రోవలో ఒక బొమ్మల బండి చూసి బబ్లూ స్పైడర్మాన్ బొమ్మ కావాలని అడిగాడు. అప్పటికే బండి ఆపే స్పీడులో లేనందున ముందు కొందామనుకొన్నాను. కాని, మళ్ళీ అలాంటి బొమ్మలు కనపడలేదు. వచ్చేటప్పుడు ఎక్కడైనా అలాంటి బొమ్మ కనపడితే పట్టుకొని రా! వచ్చిన దగ్గరనుంచి బబ్లూ ఒకటే ఏడుపు" అని.

"శేఖర్! ఒక సారి కారు ఆపవా, ఇప్పుడే వస్తాను" అంది సురేఖ.

"అసలే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కారు ఆపడం ప్రమాదం. అయినా ఇప్పుడెందుకు?" అడిగాడు శేఖరం.

"బబ్లూ కోసం ఒక స్పైడర్మాన్ బొమ్మ కొని వెంటనే వచ్చేస్తాను." బ్రతిమాలుతున్నట్టుగా అడిగింది సురేఖ.

"నువ్వు గంటలు గంటలు బేరమాడుతావు , కారు ట్రాఫిక్ మధ్యలో ఆపలేను, పార్కింగ్ కూడా దూరము". చెప్పే మాట వినకుండా "నువ్వు పార్కింగ్ దగ్గర ఉండు నేనే వస్తాను" అంటూ బాగ్ తీసుకొని ఒక్క ఉదుటున డోర్ తీసుకొని కిందకు దిగింది సురేఖ.

కొంచం ఉంటే వెనకాల వస్తున్న బైక్ గుద్దేసేది. బైక్ మీద మనిషి కిందకు మీదకు చూసి తిట్టుకుంటూ వెళ్లిపోయాడు.

బయట గాలి చల్లగా వీస్తోంది. రోడ్డు మీద ఉన్న వాహానాలని అడ్డదిడ్డంగా తప్పించుకొంటూ ఫుట్ పాత్ మీదకు చేరింది సురేఖ.

ఫుట్ పాత్ మీద వరుసగా అక్కడక్కడా బుడగలు అమ్మేవాళ్ళు, ప్లాస్టిక్ సామానులు అమ్మేవాళ్ళు, చిన్న చిన్న ఇనప స్టాండ్ మీద అమర్చి అమ్ముతున్నారు.

అందరి చుట్టూ జనాలు తలకొకటి పుచ్చుకొని ధరలు అడుగుతున్నారు. బేరం ఆడేవాళ్ళతో కొనే వాళ్ల మాటలతో, పిల్లల ఏడుపులతో చాలా కోలాహలంగా ఉంది. కొంచం దూరంలో ఒక

బొమ్మలు అమ్మే అమ్మాయి దగ్గర కొంత రద్దీ తక్కువగా వుండడముతో సురేఖ అటు వైపుకు వెళ్లింది.

ఆమె దగ్గరకు వెళ్ళే సరికి శేఖరం నుండి మెసేజ్ వచ్చింది. "పార్కింగ్ లో ఖాళీ లేనందున ముందుకు వెళ్లడం జరిగింది. బాగా ట్రాఫిక్ ఉంది . కారు తిప్పుకొని నీ దగ్గరకే వస్తాను. కొంచం టైమ్ పడుతుంది అప్పటివరకు అక్కడే ఉండు" అని.

ఎలాగు టైం ఉంది కనుక, బండి దగ్గరగా నిలుచొని కొనేవాళ్లను గమనిస్తోంది సురేఖ.


"ఓ అమ్మాయి నీ పేరేంటి?" అడుగుతోంది ఒకావిడ.


"రాజీ" చెప్పింది ఆ అమ్మాయి.


"చూడు రాజీ ఈ బొమ్మ ధర చాలా ఎక్కువ తక్కువ చేసి చెప్పు తీసుకొంటా" అంటోంది.


పేరడిగి, అయినవాళ్ళలాగా బేరం చేయడం చాలా విచిత్రంగా అనిపించింది సురేఖకి. వాళ్ళతో నెమ్మదిగా, చలాకీగా ప్రవర్తిస్తోంది ఆ అమ్మాయి.


రాజీకి ఇరవై లోపు వయస్సు ఉండొచ్చు .

నల్లగా ఉన్నా ముఖం కళగా ఉంది. రాజీ స్వెట్టర్ వేసుకొని తల చుట్టూ గాలి తగలకుండా గుడ్డతో చుట్టుకొంది.


"నేనొచ్చేసరికి అరగంట పైన పడుతుంది" మళ్లీ శేఖరం దగ్గర నుండి మెసేజ్.


చుట్టూ చూసింది సురేఖ నెమ్మదిగా జనాలు పలచబడుతున్నారు. రాజీ దగ్గరే కొంచం సేపు టైమ్ పాస్ చెయ్యాలని నిశ్చయించుకొంది సురేఖ.


నెమ్మదిగా స్పైడర్మాన్ బొమ్మ ను చేతిలోకి తీసుకొని ధర అడిగింది సురేఖ.


"నూట యాభై రూపాయలు "చెప్పింది రాజీ.


"డెబ్భై రూపాయలకు ఇస్తావా?" అడిగింది సురేఖ.


అటు చేసి ఇటు చేసి నూట ఇరవై రూపాయలకు ఒప్పుకొంది రాజి. సురేఖ 500 రూపాయల నోటు ఇచ్చింది.


రాజి తన బొడ్లో దోపుకున్న గుడ్డతో చేసిన సంచిలో వెతికి,

"మేడమ్ చిల్లర లేదు మీ దగ్గర ఉంటే చూడండి" అంది.

సురేఖ పర్స్ లో సరిపడా చిల్లర ఉంది. కాని, శేఖరం రావడానికి సమయం పడుతుంది కాబట్టి కొంచం సేపు టైమ్ పాస్ చెయ్యాలని "నా దగ్గర చిల్లర లేదు" అని చెప్పింది.


"ఇప్పుడే పట్టుకొని వస్తాను మేడమ్" అంటూ రాజి తన బండి వదలి రోడ్డుకు అటుపక్క వైపు చిల్లర కోసం పరుగు తీసింది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా బండి లో కదలిక గమనించింది సురేఖ.


అనాలోచితంగా కదిలే బండిని జరగకుండా పట్టుకొంది సురేఖ. బండిని పరిశీలించి

చూస్తే, అడుగున చిన్న ఊయలలా ఉంది. అందులో చంటిపిల్ల, సుమారు నెల రోజుల ఉంటాయేమో, అప్పుడే నిద్ర లేచినట్టుంది. నిద్ర లేచి చుట్టూ ఉన్న రంగు రంగుల బొమ్మలు చూసి కాళ్లు చేతులు ఆడిస్తోంది. చంటిపిల్ల కదలికలతో బండి ఊగుతోంది.


చంటిపిల్లని పరిశీలనగా చూసింది సురేఖ. నల్లగా వున్నా చాలా ఆకర్షణీయంగా ఉంది పాప. బొద్దుగా, గుండ్రం ముఖము, బోసినవ్వులు చూస్తే ఆశ్చర్యపోయింది సురేఖ. బుజ్జిగాడిని ఎప్పుడూ ఇంత ఉత్సాహంగా చూడలేదు.


ఈ పిల్ల బొమ్మల అమ్మాయి రాజీ కూతురు! తనలో తానే అనుకొంది సురేఖ.


ఇంతలో ఒక మధ్య వయస్కురాలు వచ్చి చంటిపిల్లని తీయాలని చూస్తోంది.


"ఎవరమ్మా నువ్వు? ఆ చంటిపిల్లని ముట్టుకోడానికి వీలు లేదు. వాళ్లమ్మ చిల్లర కోసం రోడ్డుకు అటువైపు వెళ్ళింది" అంది.


"అది నా కూతురు అమ్మా! ఈ పిల్ల నా మనవరాలు" అంది.

ఈ లోపల రాజీ పరుగు పరుగున వచ్చింది. బిడ్డ ఏడుపు మొదలు పెడుతోంది. రాజీ మెడలో ఉన్న చీరల చాటున బిడ్డని సర్దుకొని, బిడ్డ నోట్లోకి పాలు అందించింది. ఆ పిల్ల ఆత్రంగా పాలు తాగుతుంటే , రాజీ బిడ్డని ముద్దులతో ముంచెత్తుతోంది .


"ఎన్ని నెలలు?" అడిగింది సురేఖ రాజీ తల్లిని.


"ఇంకా నెల నిండలేదమ్మా" చెప్పింది ఆమె.


"అప్పుడే ఎందుకు ఇలా అమ్ముకోవడానికి రావడం" అడిగింది సురేఖ.


"ఏం సెయ్యాలమ్మా ! దీని మగడు టక్కర్ అయ్యి కాలు ఇరగ్గొట్టుకొని ఇంట్ల ఉన్నాడు . దవాఖానలో మస్తు పైసలైనాయి. ఆడ ఈడ అప్పులైనాయి. ఇది కూడ ఇంట్ల కూకుంటే,


తిండి ఏడికెల్లి వత్తాది . ఎక్సిబిషన్ టైమ్ లో అయితే నాలుగు డబ్బులు ఎక్కువ సంపాయించొచ్చు" చెప్పింది రాజీ తల్లి.

"మరీ నెలరోజుల పిల్లనెస్కోని ఇట్లా చలిలో ఎందుకు? పిల్లల్ని ఇంట్లో పెట్టి రావచ్చుగా! " సురేఖ ప్రశ్నించింది.

"పాలు తాగే పిల్ల కదమ్మా ! ఎట్ల వదులుతామమ్మా,

తల్లి పాలతో తల్లికి ఊరట, బిడ్డకి బలం, పోషణ. బిడ్డని పెంచే నేర్పు దేముడు ఒక్క ఆ తల్లికే ఇచ్చాడమ్మా . ఎంత ఏడ్చినా తల్లి చెయ్యి తగలగానే బిడ్డ ఊరుకొంటుందమ్మా. ఎవరు ఎంత చూసినా తల్లి ప్రేమకు సరికాదు కదా !" బదులిచ్చింది రాజీ తల్లి.

"ఇంత పోషణ కష్టమైనప్పుడు అసలు పిల్లలెందుకు? వద్దనుకొంటే పోలా!" అంది సురేఖ.


"బలే చెప్పారమ్మగోరూ ....అట్లనుకుంటే నువ్వుండవు నేనుండను . అల్లదిగో ఆ రోడ్డుకు అవతల ఆ బొమ్మలమ్ముతున్న ఎర్ర అంగీ ఓడు నా కొడుకు. ఇంత చిన్న వయసులో నాకెంత తోడు. నా భర్త పోయినాకా ఈలిద్దర్నీ చూసుకొనే నేను బతుకుతున్నా. వీళ్ళే నా ఆశ. అట్లే రేపు నా బిడ్డ పెద్దయినాకా ఒక ఆసరా ఉండొద్దా! ఎవరైనా కన్న పిల్లల తర్వాతే. కాలు చేయి ఒరిగినాక బిడ్డలే కదా చూసేది .


భగమంతుడు మా అసాంటోళ్ళకి డబ్బు లేదని ఆసారాగా పిల్లల్ని ఇస్తాడు. మీ అసొంటి దొరసానుల పిల్లలు లేక మా బస్తీలలో మా పిల్లల కోసం తిరుగుతారు" చెబుతోంది రాజితల్లి.


శేఖరం "దగ్గర్లో ఉన్నాను "అనే మెసేజ్ ఇవ్వడముతో , బొమ్మ చేత పుచ్చుకొని అడుగు ముందుకు వేసింది సురేఖ.


రాజీ "మేడమ్ చిల్లర" అంటూ వెంట పడింది.


"వద్దు రాజీ! ఉండనీ, పాపాయికి నా తరపున ఒక గౌను కొను" అంటూ పరుగు లంకించుకొంది .


శేఖరం కారు కనిపించడంతో కారు ఎక్కి కూర్చుంది సురేఖ.

"సారీ సురేఖ! ట్రాఫిక్ వల్ల నిన్ను అలా ఇంత సేపు చల్లగాలిలో వదిలేశాను. ఐ అం సో సారీ" చెప్పాడు శేఖరం.

కాంతి నుండి ఫోన్ " మీకోసం వెయిటింగ్..... ఎప్పుడొస్తారు" అంది.


"సారీ కాంతి ట్రాఫిక్ లో ఉండిపోయాము, మేము రాలేము. యు క్యారీ-ఆన్" చెప్పి ఫోన్ పెట్టేసింది సురేఖ.


"అదేంటి సురేఖ, మనం వెళ్తున్నాము" అన్నాడు శేఖరం.


" పరవాలేదు, బాబు ఏడుస్తున్నాడు కదా! ఇంటికి వెళ్లిపోదాము" అంది.

"బొమ్మ కూడా కొన్నావుగా" అన్నాడు శేఖరం.


"బుజ్జిగాడు కూడా బొమ్మలతో ఆడుకొంటాడు" నవ్వుతూ చెప్పింది సురేఖ.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

రచయిత్రి పరిచయం :

పేరు :- సుబ్బలక్ష్మి rachakonda. ,

కలం పేరు :- వడలి లక్ష్మీనాథ్.

ఊరు :-గుజరాత్.

స్వస్థలం :- హైదరాబాద్,


నా కథను పబ్లిష్ చేసినందుకు ధన్యవాదాలు. నేను తెలంగాణ ప్రభుత్వ సంస్థలో గజిటెడ్ ఆఫీసర్ గా పనిచేసి 2019 లో స్వచ్ఛంద పదవీ విరమణ పొంది, ప్రస్తుతం కొడుకు దగ్గర గుజరాత్ లో ఉంటున్నాను.


రిటైర్ అయ్యాక ఖాళీ సమయాల్లో మనసుకి నచ్చిన విషయాల మీద కథలు, కవితలు వ్రాయడము హాబీగా పెట్టుకొన్నాను. కొన్ని దినపత్రికలకి , వివిధ మాధ్యమాలలో కలిపి 50 వరకు కథలు, కవితలు ప్రచురించపడ్డాయి. కొన్ని పోటీలలో పాల్గొని బహుమతులు కూడా పొందాను.

































441 views3 comments

3件のコメント


kishore
2021年1月16日

స్వానుభవాన్ని మించిన పాఠం లేదు అని చక్కగ చెప్పిన కథ - చాల బాగుంది. ఆమ్మాయి కాపురం బాగుంటుంది.

いいね!

kamvadali
2021年1月16日

పెళ్ళి కాని అమ్మాయిలకు, అప్పుడే పెళ్ళిచేసుకున్న‌‌‌ అమ్మాయిలకు మంచి

సందేశమిచ్చిన కధ. కధాశైలి బావుంది.

కామాక్షి గుళ్ళపల్లి

いいね!

vadalivv
2021年1月15日

కథ చాలా బావుంది. Very realistic

いいね!
bottom of page