క్యాడ్బరీ బిస్కెట్
క్యాడ్బరీ బిస్కెట్, దాసు రాధిక, తెలుగు కథ, సోషల్ మీడియా కథ, ఫేస్‌బుక్ వ్యామోహం, కుటుంబ కథ, దాంపత్య జీవితం, భార్య భర్తలు, తెలుగు సామాజిక కథ, ఆధునిక కుటుంబం, సోషల్ మీడియా ప్రభావం, కుటుంబ విలువలు, హాస్య కథ, భావోద్వేగ కథ, తెలుగు సాహిత్యం, మన తెలుగు కథలు, Facebook Story Telugu, Modern Family Story

Cadbury Biscuit - Telugu Family Story | Dasu Radhika
క్యాడ్బరీ బిస్కెట్ - తెలుగు కుటుంబ కథ | దాసు రాధిక
Published in manatelugukathalu.com on 22/12/2020
సాంకేతికత మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, సోషల్ మీడియా వ్యామోహం కొన్నిసార్లు మనల్ని వాస్తవ ప్రపంచం నుంచి దూరం చేస్తుంది. దాసు రాధిక రచించిన "క్యాడ్బరీ బిస్కెట్" కథలో ఫేస్‌బుక్ మోజులో చిక్కుకున్న ఒక గృహిణి, ఆమెను ప్రేమతో మార్చేందుకు ప్రయత్నించిన భర్త, చివరికి పిల్లలు ఇచ్చిన జీవిత పాఠం ఎంతో హాస్యభరితంగా, ఆలోచింపజేసేలా చిత్రించబడింది. కుటుంబ బంధాలు, నమ్మకం, సోషల్ మీడియా వినియోగం, ఆధునిక జీవనశైలి మధ్య సమతుల్యతను చక్కగా ప్రతిబింబించే ఈ కథ ప్రతి కుటుంబం తప్పక చదవాల్సినది.
మహాలక్ష్మి గొంతు వినిపించి రెండు గంటల పైన అయింది. ఇల్లు బావురుమంటోంది ఆ దెబ్బకు. శంకరానికి సాయంత్రం నాలుగింటికల్లా కాఫీ పడకపోతే తలనొప్పి తథ్యం. ఈ లోకంలోనే లేదు మహా. కంప్యూటర్ సబ్జెక్టులో ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు ఉంది.
“మహా మై డియర్!” అని మెల్లగా పిలిచాడు.
ఉహూ, ఉలుకూ పలుకూ లేదు. ఇక లాభం లేదని మహాలక్ష్మికి టెక్స్ట్ మెసేజ్ పంపాడు శంకరం; కాఫీ కావాలని ఒక కాఫీ జిఫ్ (GIF) బొమ్మ పెట్టి.
రెప్పపాటులో లేచి వచ్చి, “సారీ అండి, మీ కాఫీ టైమ్ దాటిపోయింది కదూ!” అని క్షణంలో వేడి కప్పు చేతికిచ్చింది. అంతే, ఫోనుతో సహా మళ్ళీ కంప్యూటర్ ల్యాబ్ - అదే, ఆ గదిలోకి వెళ్ళిపోయింది. లత అనుకుంటా అవతలి వైపు ఫోనులో. మహా, లతల సంభాషణ విని కంగారేసి గదిలోకి వెళ్ళాడు.
“మళ్ళీ చేస్తా లతా!” అని మహా ఫోను పెట్టేసి శంకరం వంక ప్రశ్నార్థకంగా చూసింది.
“ఫేస్‌బుక్‌లో కూడా జాయిన్ అయ్యావా?” అని అడిగాడు శంకరం.
“అయ్యో, మీకు చెప్పలేదు కదూ!” అని మహా మొదలెట్టింది. “అందులో మనకెంత మంది ఫ్రెండ్స్ ఉంటే మనమంత గొప్పటండీ. మన వాడికి రేపు సంబంధాలు కూడా అందులోనే చూసుకోవచ్చునని నా ఫ్రెండ్స్ చెప్పారు. ఇన్నాళ్లు అందుకే కుదరలేదేమో వాడికి. గంటకో ప్రొఫైల్ పిక్చర్ పెడితే ఇంకా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయిట, పరిచయాలు పెరుగుతాయిట. ఇందాకంతా అదే చేశాను. నా ఫోటోలన్నీ ప్రొఫైల్ పిక్చర్ కోసం రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడే మీకు కాఫీ పెట్టిస్తూ సెల్ఫీ దిగాను, అది అప్లోడ్ చేస్తూ లతతో మాట్లాడాను.”
శంకరానికి కోపం వస్తున్నా తమాయించుకుని లాలనగా మహాకు నచ్చజెప్పాడు. అదంతా ఒక కృత్రిమ ప్రపంచమని, పిచ్చి సరదాలకు పోతే లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటామని చెప్పాడు. వేరే వ్యాపకాన్ని పెట్టుకోమన్నాడు మహాలక్ష్మిని. కానీ మంచి మాట అంత తొందరగా బుర్రకెక్కితే కదా! మర్నాడు శంకరం వారం రోజులు క్యాంపుకు వెళ్ళాడు.
ఆ రోజు పదకొండు గంటలకు రావాల్సిన ఫ్లైటు గంట ఆలస్యంగా రావడంతో శంకరం ఒంటిగంటన్నరకు ఇంటి బెల్లు కొట్టాడు. మహాను చూసి నివ్వెరపోయాడు. “నీ జుట్టుకేమైంది మహాలక్ష్మి?” అన్నాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. చేతిలో ఫోటోలు, ఫోనుతో ల్యాబ్‌లోకి నడిచింది బేతాళుడి పిశాచిలా, అర్థరాత్రి వేళలో.
మర్నాడు ఉదయం న్యూస్ పేపర్ కూడా పక్కన పెట్టి, మహాలక్ష్మి కోసం ఇల్లంతా కలియజూశాడు.
అప్పుడు పనిమనిషి కమల వచ్చి, “అమ్మగారు ఈ టయానికి మేడపై ఉంటారు సార్” అంది. శంకరం ఏమీ అడగకుండా పైకి వెళ్ళాడు. “అయ్యో మహా! నా మహా అందమైన జడ ఏది?” అని దగ్గరికెళ్ళి సూటిగా ప్రశ్నించాడు. “అదేనండి, ప్రొఫైల్ పిక్ పోటీలు ఉన్నాయని లత చెబితే, మోడరన్‌గా ఉంటే గెలుస్తానని స్టయిల్‌గా స్టెప్ కట్ చేయించాను. రెండు నెలల్లో జడ వచ్చేస్తుందిగా!” అన్నది శంకరం వైపు అమాయకంగా చూస్తూ.
శంకరానికి దిగులు పట్టుకుంది, ఈ పిచ్చిలో నుంచి మహాలక్ష్మిని ఎలా బయటకు లాగాలా అని.
అలా చూస్తూ చూస్తూ వైశాఖ మాసం నుంచి మార్గశిరం దాకా గడిచిపోయింది. ఒక రోజు పాలు పోసేవాడితో పొద్దున్నే “ఒరేయ్ రమేశూ! నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టానురా, నువ్వు చూసుకోవా? యాక్సెప్ట్ చెయ్యాలి వెంటనే. ఇప్పుడింటికెళ్ళగానే చెయ్యి” అని ఇంకా నిద్రమత్తు వదలకుండా ఆవలిస్తూనే మహా మాట్లాడటం విన్నాడు శంకరం.
ఏమీ చేయలేక కమలను సూటిపోటి మాటలన్నాడు. ఆ రాత్రి కొడుకు భాస్కర్ వారం తర్వాత ఫోను చేస్తే వాడితో కూడా పెడసరిగా మాట్లాడాడు. మహాలక్ష్మికి శంకరంలో వచ్చిన మార్పు తెలియట్లేదు. సహనానికి మారుపేరు అతను. కమలకు అర్థమైంది; అమ్మగారికి ఏదో ఫేస్‌బుక్ రోగమట అని. అది చుట్టుపక్కల పనిమనుషులతో పనికట్టుకుని మరీ చెప్పింది - దాని బాధ దానిది మరి.
శంకరం అరిచాడు. ఇవాళా నిన్నా? పదేళ్ల నుంచి చేస్తోంది ఆ ఇంట్లో పని. అప్పుడే భాస్కర్ ఎం.ఎస్. కోసం అమెరికాకు వెళ్ళాడు. రెండేళ్ల నుంచి శంకరం సార్ కొడుక్కి పెళ్లి సంబంధాలు చూసినా కుదరట్లేదు. ఇంతలో అమ్మగారికి ఇలా!
క్రిస్మస్ సెలవు రోజున శంకరం చిన్ననాటి స్నేహితుడు ఒకడు తన భార్యతో వీళ్ళ ఇంటికొచ్చాడు. అతను ఫలానా అని మహాలక్ష్మికి తెలియదు. మహాలక్ష్మిని చూస్తూనే “మీరు... ఇక్కడ...” అని ఆగిపోయాడు. శంకరం వివరం అడిగితే “ఏమీ లేదు. ఈవిడ ఫోటోలు మనలాంటి కుటుంబాల ఆడవాళ్ళ ఫోటోలు ఉండకూడని వెబ్‌సైట్‌లో చూశాను. అందుకని...” అని సణిగాడు.
మహాలక్ష్మికి కన్నీళ్లు వచ్చాయి. శంకరం వైపు తిరిగి “నాకేమీ తెలియదండి, నేనే తప్పూ చేయలేదు” అన్నది. శంకరం తన భార్యను ఓదార్చి, వచ్చిన తన మిత్రుడితో హెచ్చు స్వరంలో అన్నాడు: “చూడు రవీ! మా మహాలక్ష్మి అంటే ఏమనుకున్నావు? నిప్పు! ఎవరిని చూసి ఎవరనుకున్నావో!”
రవి వెంటనే అన్నాడు: “సరేలేరా, చూశాననిపించింది. నీ మాట నమ్మనా? వచ్చిన పని చెబుతాను.”
వాళ్ళావిడను పరిచయం చేశాడు ఇరువురికి. “సంధ్యా! మనమ్మాయి వివరాలు, జాతకం మహాలక్ష్మి గారికివ్వు” అన్నాడు. “ఈ ఊరొచ్చాను పని మీద, ఇదంతకన్నా ముఖ్యమైన పని అని ఇలా వచ్చానురా. మా అమ్మాయిని మీ భాస్కర్‌కు అడుగుదామని.”
రవి వాళ్ళు సాయంత్రం ఫ్లైటుకు విజయవాడ వెళ్లిపోయారు. అప్పుడు మహాలక్ష్మికి శంకరం చెప్పాడు - వాళ్ళు శ్రీమంతులని, ఒక్కతే అమ్మాయని, మంచివాళ్ళని.
ఈ లోపల లత ఫోను వచ్చింది. మహా ఆ ఫోన్ తీసుకోలేదు. ఫేస్‌బుక్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తీసివేసింది. శంకరం హాయిగా ఊపిరి పీల్చాడు. దెబ్బకు దయ్యం దిగిందనుకున్నాడు.
“లత మాయ మాటల్లో పడి నేను బిస్కెట్ అయిపోయాను కదా!” అన్నది మహా తన మూర్ఖత్వానికి.
“నిన్ను పెళ్లి చేసుకుని నేనెప్పుడో బిస్కెట్ అయ్యానుగా!” అన్నాడు శంకరం నవ్వుతూ.
మహాలక్ష్మి బుగ్గలు కందిపోయాయి. చిరుకోపం నటించింది.
“అయినా నీకు ఈ ‘బిస్కెట్ భాష’ కూడా అంటించిందా ఆ మహాతల్లి లత?” అని వాపోయాడు శంకరం.
“ఇది సుపుత్రుడి పుణ్యమా అని అంటుకుంది” అని నవ్వేసింది.
భాస్కర్ ఫోను చేశాడు ఆ రోజు రాత్రి. బాంబు లాంటి వార్త చెప్పాడు. ఒకమ్మాయిని తను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. ఆ రోజు నుంచి మహాలక్ష్మికి నిద్ర పట్టలేదు. న్యూ ఇయర్‌కు భాస్కర్ వచ్చాడు. రవి గారి కూతురు మాధవి జాతకం, భాస్కర్ జాతకంతో కలిసింది.
ఇప్పుడెలా అని లోలోపల మధన పడింది మహాలక్ష్మి.
వారంలో భాస్కర్ ప్రయాణం అనగా, శంకరం మహాలక్ష్మి పోరు పడలేక పెళ్లి విషయమై కొడుకుని కదిలించాడు. ఫేస్ టైమ్ ఫోను చేసి మాధవిని పరిచయం చేశాడు భాస్కర్ తన తల్లిదండ్రులకు. మాధవి కూడా అదే పని చేసింది. అక్కడ రవిగారు, సంధ్య ప్రత్యక్షమయ్యారు. మహాలక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. శంకరంతో సహా అందరూ ఒక చిన్న నాటకం ఆడారని మెల్లగా తెలుసుకుంది.
“చెల్లెమ్మా! ఇందులో మేము పాత్రధారులం మాత్రమే, సూత్రధారి మీ ఆయనేనమ్మా!” అన్నాడు రవి. “ఆ రోజు మీ ఇంట్లో నేను అలా మాట్లాడినందుకు క్షమించమ్మా!” అని కోరాడు.
తనకు బుద్ధి చెప్పడం కోసమేనని మహాలక్ష్మి తెలుసుకుంది. శంకరం తదేకంగా మహానూ చూస్తూ ఇలా చెప్పసాగాడు: “భాస్కర్‌కు మాధవితో ఫేస్‌బుక్‌లో పరిచయం. అది పెళ్లి దాకా వచ్చింది. రెండేళ్ల నుంచి సాగుతోంది వాళ్ళ ప్రేమాయణం. ఇది తెలిసినప్పుడు నాకు మతి పోయింది. తల్లీకొడుకుల పిచ్చిని కుదర్చబోయి నేనే పిచ్చివాడిని అవుతానేమో అనుకున్నాను. అప్పుడే తెలుసుకున్నాను మాధవి వివరాలు. మిగిలిన కథ సుఖాంతమయ్యేందుకు జాగ్రత్త పడ్డాను.”
మళ్ళీ రవి అందుకుని, “నిజానికి మన పిల్లలు మనలను బిస్కెట్ చేశారు కదరా శంకరం!” అన్నాడు నవ్వుతూ.
“మామూలు బిస్కెట్ కాదు అన్నయ్య గారు, క్యాడ్బరీ బిస్కెట్!” అని మహాలక్ష్మి అన్నది.
పిల్లలతో సహా అందరూ హాయిగా నవ్వుకున్నారు.
శంకరం గుండె లో బరువు దిగిపోయింది.
కొడుకు పెళ్లి తను కోరుకున్న అమ్మాయితోనే జరిగింది. తన ప్రియమైన మహాలక్ష్మి సోషల్ మీడియాలో గ్రేస్ మార్కులతో పాస్ అయితే చాలు, డిస్టింక్షన్ రానక్కర్లేదని శంకరం తనదైన శైలిలో తెలియజేశాడు.

రచయిత్రి పరిచయం
పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక
వయసు: 52 సం.
నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)
స్వస్థలం: తెనాలి
చదువు: BA English Litt., B.Ed
వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.
ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం
పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.
స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.
కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు,





Comments