చలి చీమలు

Chali Cheemalu New Telugu Story
written by Dr. M. Suguna Rao
రచన : డాక్టర్ ఎమ్. సుగుణరావు
'A chain is only as strong as its weakest link'
*గుంపులో ఒక బలహీనుడున్నా ఆ గుంపు బలహీనమవుతుంది. *
*- జెర్మియ బోర్గ్*
సుభాకర్‌కి ఆ కొటేషన్‌లోని అర్ధం, పరమార్ధం అవగతం కావడానికి దాదాపు పదేళ్ళు పట్టింది. పదిహేనేళ్ళ వయసులో స్కూల్లో ఇంగ్లీషు మాస్టారు బ్లాక్ బోర్డ్ మీద రాసారు ఆ సామెత! ఇన్నేళ్ళయినా మనసు పొరల్లో ఆ వాక్యాలు బలంగా ఉండిపోవడానికి కారణం అవి సరిగ్గా అర్ధం కాలేదని ఎన్నోసార్లు చదివాడు. ఆ వాక్యం కంఠతా వచ్చింది గానీ భావం బోధపడలేదు.
ఇన్నేళ్ళ తర్వాత అతడికి ఆ జీవిత సత్యం తెలిసింది. దాని గురించి తెలియాలంటే అతడి జీవితంలో ముడివేయబడ్డ ఇంకో ఇద్దరి జీవితాల గురించి తెలియాల్సి వుంది.
అతను ఇంజనీరింగ్ కాలేజీలో చేరినపుడు అతనికి ఇద్దరు తోడయ్యారు. వారు అమర్, మధుమతి.
ఒకరోజు ల్యాబ్‌లో తాము ముగ్గురు ప్రయోగం చేస్తుంటే, ఏదో ట్యూబ్ తెగి, గ్యాస్ లీకయ్యింది. వెంటనే అమర్‌కు దగ్గు వచ్చి, ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. ల్యాబ్ అటెండర్లు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మధుమతి, అమర్‌ను గబగబా బైటికి తీసుకొచ్చి, బాగా వెంటిలేషన్ వున్న గదిలో పడుకోబెట్టింది. అతని ఛాతి మీద రాసి తడిగుడ్డ తో ముక్కు తుడిచింది. వెంటనే కాలేజీ అంబులెన్సుకు ఫోన్ చేసింది. అతను వెంటనే కోలుకున్నాడు. చిన్నప్పటి నుంచీ ఆస్తమా వుందని చెప్పాడు. జేబులో ఎప్పుడూ నెబులైజర్ వుంచుకుంటున్నట్టు తీసి చూపించాడు. ఇద్దరు స్నేహితులూ అతడి వంక జాలిగా చూసారు. అప్పటినుంచీ ఆమెకు అతడి పట్ల కన్సర్న్ ఎక్కువయ్యింది.
మధుమతి తండ్రిగారు ఒక పెద్ద పారిశ్రామికవేత్త. డబ్బున్న అమ్మాయిననే అహం, గర్వం లేకుండా ఆమె అందరితో సరదాగా కలిసిపోవడం, సుభాకర్‌కు ఆశ్చర్యం కలిగించేది. వాళ్ళ కాలేజీలో డిబేటింగ్ క్లబ్బు వుండేది. ఒకరోజు నాయకుడు ఎలా వుండాలి? అనే టాపిక్.
అమర్ లేచాడు. గొంతు విప్పాడు. చెప్పడం మొదలుపెట్టాడు. “ఒక్కో నాయకుడు రావడానికి ఒక్కో యుగం పడుతోంది. నాయకులను మనం యుగపురుషులు అంటున్నాం. ఒక్కో యుగం వరకు వేచి చూడాలా! అది సరి కాదు. అందుకే నాయకుడు లేని సమాజం నిర్మించడమే అసలైన నాయకుడి లక్ష్యంగా సాగుదాం! ఎవరికి వారే నాయకులు. ఎవరికి వారే పర్యవేక్షకులు.”
అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచీ అమర్ కాలేజీలో హీరో అయ్యాడు. దానికి తోడు బాగా చదివేవాడు. క్లాసులో ఫస్ట్ మార్క్స్ అతడివే! అలా చాలామంది అమ్మాయిలు అతనితో ప్రేమలో పడబోయినా, అతను మాత్రం మధుమతి ప్రేమలో పడ్డాడు.
అలా ఆ ముగ్గురి స్నేహం. ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి ఆ ముగ్గురిలో ఆ ఇద్దరు ప్రేమికులయ్యారు. సుభాకర్ వారి ప్రేమకు సాక్షి అయ్యాడు. అలాగే రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన వారి పెళ్ళికి సాక్షి సంతకం చేయడానికి తయారయ్యాడు.
మధుమతి తల్లిదండ్రులు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. అలాగే తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోతే, పెంచి పెద్దచేసి ఇంజనీరింగ్ చదివించిన అమర్ మావయ్య తన కూతురిని చేసుకోనందుకు ఆయనా ఒప్పుకోలేదు. ఇలా ఇందరి వ్యతిరేకతల మధ్య, వైరుధ్యాల మధ్య, సుభాకర్, వారి స్నేహితులు వారి పెళ్ళి చేసి, వారిని రహస్యంగా దాచారు. మధుమతి తండ్రిగారి నుంచి సుభాకర్‌కు ముప్పు వస్తుందని రెండు నెలల పాటు వారిని అజ్ఞాతంగా ఉంచారు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. అంతా సద్దుమణిగింది. ముగ్గురికీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో, రాయలసీమలోని ఒక మినరల్ ఎక్స్ ట్రాక్షన్ ప్లాంట్‌లో ఉద్యోగాలు లభించాయి. అలా ఒక కాలేజీలో చదువుకున్న ఆ ముగ్గురికి ఒకే చోట ఉద్యోగం లభించడం వారికి సంతోషం కలిగింది. ఐతే, ఆ ప్రాంతం మధుమతి తండ్రిగారి స్వంత ఊరుకు దగ్గరే!
***
రోజులు గడుస్తున్నాయి. బుతువులు మారుతున్నాయి. నగరానికి దూరంగా, అడవికి దగ్గరగా ఉంది వారు పని చేస్తున్న ఫ్యాక్టరీ. ఇంకా అభివృద్ధి చెందని ఆ టౌన్‌షిప్‌లో అమర్, మధుమతిల కొత్త సంసారం మొదలయ్యింది.
తల్లితండ్రులకు దూరంగా ఉన్న మధుమతికి కొంచెం బెంగ కలిగినా ఆ వాతావరణంలో ఆమెకు సేద తీరినట్టయ్యింది. ఇక ఆ దంపతులకు తోడుగా వారిని ప్రాణంగా చూసుకునే సుభాకరం. అలా సంవత్సరం గడిచింది. వారి అన్యోన్యత ఫలితంగా మధుమతి అమ్మ కాబోతోంది. నాలుగు నెలల ముందే ఆమెను సెలవు పెట్టించేసాడు అమర్.
ఒకరోజు వారి క్వార్టర్ ముందు ఖరీదైన కార్లు బారులుతీరాయి. పట్టుచీరలు కట్టుకున్న ఆడవాళ్ళు ఆ ఇంట్లోకి పూలు, పళ్ళు, కానుకలతో నడిచారు. వారి ముందు ఒక పెద్దాయన, పెద్దావిడ. వాళ్ళిద్దరూ భుజంగరావు, పార్వతమ్మ. మధుమతి అమ్మా నాన్నలు.
పుట్టబోయే పాపాయి కోసం తమ పంతాలు మానుకున్నారు. కూతురింటికి అలా ప్రయాణం కట్టారు. నిండు చూలాలైన కూతుర్ని ఇంటికి తీసుకువెళతాము, ఒక మంచిరోజు చూసుకుని అని ఆ దంపతులిద్దరు ప్రాధేయపడ్డారు. మధుమతి సంతోషపడింది. అమర్, మధుమతిని వారితో వెళ్ళమన్నాడు.
నెల రోజుల తర్వాత ఎన్నో అప్పగింతలు పెట్టి సుభాకర్‌కు తన భర్తను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, తన పుట్టినింటికి చేరుకుంది మధుమతి.
ఆరోజే మధుమతి తండ్రిగారు, అమర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ సమావేశానికి సుభాకర్‌ని పిలవలేదు. వారి కుటుంబ విషయాలు అని దూరంగా ఉండిపోయాడు.
***
రెండో రోజు అమర్ పిలిచాడు సుభాకర్‌ని. “రాత్రికి రా, ఇక్కడే డిన్నర్. నేనూ ఒక్కడినే కదా! నీతో చాలా మాట్లాడాలి" అన్నాడు. “సరే” అని బయలుదేరాడు. అప్పటికే వంటావిడ అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయింది. వేడిగా ఆమ్లెట్లు, మంచింగ్ కోసం వేయించిన జీడిపప్పు.
ఇద్దరికీ మందు అలవాటు వుంది అప్పుడప్పుడు తాగుతారు. అమర్ మాత్రం రోజూ ఒక పెగ్ తాగి పడుకుంటాడు. లేకపోతే మధ్యరాత్రిలో మెలకువ రావడం, ఆస్తమా ఎటాక్!
బైట మంచు కురుస్తోంది. లోపల ఏసి చల్లదనం. ఇక చుట్టుప్రక్కల తోటల్లోంచి వస్తున్న పూల సౌరభం. తమ కంపెనీ కారు డైవర్ నాగరాజు దూరంగా నుంచున్నాడు. అతనికి ముప్పయ్యేళ్ళుంటాయి. దినసరి వేతనం మీద టెంపరరీగా పని చేస్తున్నాడు. అతని అక్క ఆ ఇంట్లో వంట చేస్తుంది. ఆమెకు భర్త లేడు. ఏదో ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు పిల్లలు. నాగరాజు ఆమెను ఇంట్లో వంట చేయడానికి, ఇతర పనులకు పెట్టాడు. పొడుగ్గా, చలాకిగా ఉంటుంది. ఎంత పనైనా చేసేస్తుంది. మధుమతి కన్సీవ్ అయినప్పటి నుంచి ఆమెను ఇంట్లో పనికి కుదుర్చుకున్నారు. ఆమె వయస్సు నాగరాజు కన్నా ఒకటో రెండో సంవత్సరాలు ఎక్కువ వుంటాయేమో! అయినా, అంత వయసున్న మనిషిలా కనిపించదు. ఆవిడను చూసి అనుకున్నాడు సుభాకర్...
“ఏదైనా అవసరం ఉందా సార్?” అన్నాడు నాగరాజు.
“అవసరం అయితే పిలుస్తాము. బైట ఉండు” అన్నాడు అమర్.
“సరే సార్...” అంటూ బైటకెళ్ళిపోయాడు నాగరాజు.
గ్లాసుల్ని ద్రవాలతో నింపి, తానొకటి తీసుకుని సోఫాలో వెనక్కి వాలి చెప్పడం మొదలుపెట్టాడు అమర్.
“ఈరోజు శుభ దినం. నా ప్రాణ స్నేహితుడితో ఈ ఆనందం పంచుకోవడం బాగుంది” అంటూ నవ్వాడు అమర్.
“ఔను. నాకు ఆనందంగానే వుంది. మీ మావయ్యగారు అత్తయ్యగారు రావడం, వారితో మధు వెళ్ళడం, శుభం కార్డు పడింది” అన్నాడు.
“అది కొంతవరకు నిజమే... కానీ అంతకన్నా గొప్ప సంగతి. నేను కన్న 'కల నెరవేరబోతోంది. అంతా నేను అనుకున్నట్టే జరుగుతోంది. నేను ఎప్పుడూ లెక్కతప్పను” గ్లాసులోని ద్రవాన్ని రెండు గుటకలు వేసి చెప్పాడు.
సుభాకర్ మిత్రుడి వంక ప్రశ్నార్ధకంగా చూసాడు.
అమర్ నోరు విప్పాడు.
“రాముడు, సీతలను ఆరాధించే నమ్మకమైన మిత్రుడు హనుమంతుడు. అలాంటి ప్రాణ స్నేహితుడైన నీకు నిజం తెలియాలి. నా మనసులో మాట చెప్పాలి. ఒక నిజం ఇన్నాళ్ళు దాచాను” అంటూ ఒక్కక్షణం ఆగి మిత్రుడి కళ్ళలోకి చూసాడు.
సుభాకరం తాగడం మానేసి ఆశ్చర్యంగా అమర్ వైపు చూస్తూ ఉండిపోయాడు.
“నీకు గుర్తుందా? మనం రెండో సంవత్సరం ఇంజనీరింగ్‌లో వున్నప్పుడు ఒకరోజు కెమిస్ట్రీ ల్యాబ్‌లో గ్యాస్ లీకయితే, నేను చాలా ఇబ్బందిపడ్డాను. మధుమతి నాకు ప్రథమ చికిత్స చేసింది. మీకు తెలీని నిజం, ఆరోజు గ్యాస్ లీక్ చేసింది నేనే. ఒక పైపు కొద్దిగా కోసాను” అన్నాడు గట్టిగా నవ్వుతూ.
ఆ మాటలకు నివ్వెరపోతూ విస్మయంగా చూస్తూ వుండిపోయాడు సుభాకర్.
"ఆమెకు నాపై అటెన్షన్ కలగాలని అలా చేసాను” అన్నాడు గట్టిగా నవ్వుతూ అమర్. "ఎందుకంతా రిస్క్ చేసావు” అన్నాడు సుభాకర్.
“ఎందుకు అంత రిస్క్ చేసానా, రిస్క్ చేయనిదే విజయం రాదు. నా టార్గెట్ మధుమతి. డాటర్ ఆఫ్ భుజంగరావు. ప్రముఖ పారిశ్రామికవేత్త. వందలకొద్దీ మైనింగ్ భూములున్న కోటీశ్వరుడు. అందుకే కూతురిని మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదివించాడు. నాది లోయర్ మిడిల్ క్లాస్. తల క్రిందులుగా తపస్సు చేసినా ఆ స్థాయి చేరుకోలేను. అందుకే పెంచిన మావయ్యను పిల్లను ఇస్తాను అన్న ఆయనను వదిలేసాను...” చెప్పుకు పోతున్నాడు అమర్.
మనిషిలో మూడు ముఖాలు. ఒకటి బైటకి కనిపించేది. ఇంకొకటి లోపల కనిపించేది. ఇక మూడవ ముఖం ఎవరికీ కనిపించనిది.
ఆ ముఖాన్ని తానే స్వయంగా ఆవిష్కరించుకున్న మిత్రుడి వంక బాధగా చూసాడు. కోపంగా చూసాడు. ఇక అక్కడ వుండలేకపోయాడు. “ఇక వెళ్ళొస్తాను” అంటూ లేచాడు. అమర్, పెగ్గు మీద పెగ్గు తాగుతూనే వున్నాడు. మాటలు ముద్దగా వస్తున్నాయి.
“వెళ్ళకు మిత్రమా... ఇవి ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా మధుమతికి నువ్వు చెప్పవని తెలుసు. తనని బాధ పెట్టడం నీకు ఇష్టం వుండదు. ఇంకో నిజం కూడా చెపుతా... నువ్వు ఆంజనేయుడివి. ఆమె సీత. నేను రాముడిని కాదు, నేను ఆయనలా ఏకపత్నీవ్రతుడినీ కాదు.
ఆ మాటలకు సుభాకర్ తుళ్ళిపడ్డాడు. బైటకి నడిచాడు. మిత్రుడి అంతరంగం అర్ధమైన సుభాకర్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.
ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి భోజనం చేసి నిద్రపోయాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరవగానే అమర్ లోపలకు వచ్చాడు. అతడిని చాలా పరిశీలనగా చూసాడు.
అమర్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. ఖరీదైన చేతికి బరువుగా వ్రేళాడుతున్న బ్రాస్‌లెట్. మెడలో దళసరి చైను. విదేశం నుండి దిగుమతి చేసిన టీ షర్టు, జీన్సు, కాళ్ళకు పాయింటెడ్ లెదర్ బూట్లు.
“బైట నాగరాజు నుంచున్నాడు. నేను నీకు క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతాను. ఇష్టం లేకపోయినా ఏమిటో నీ దగ్గర నాకు ఏదీ దాచాలనిపించడంలేదు. నువ్వు నాకు మేలు చేసేవాడివే... ఎప్పటికి” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.
“మామయ్యగారికి, మనకు దగ్గరలోనే విలువైన మైనింగ్ భూములున్నాయి. అక్కడ భూమి పొరల్లో యురేనియం నిక్షేపాలున్నాయని ఎప్పుడో తెలిసింది. ప్రభుత్వం క్లియరెన్స్ కూడా ఇచ్చింది.
ఒక్కసారి సుభాకర్‌కు మనసు మొద్దుబారినట్టనిపించింది. యురేనియం పేరు చెప్పగానే అతనికి ఒంట్లో వణుకు పుట్టింది.
“యురేనియం వల్ల రేడియో ధార్మికశక్తి వెలువడుతుంది. రేడియేషన్ వస్తుంది. దానివల్ల ఎంతమంది ప్రాణాలకు ముప్పు. ముఖ్యంగా పిల్లలకు, మహిళలకు అలాగే పశువులకు - పిల్లలు తల్లి గర్భంలోనే చనిపోతారు. కేన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు సోకుతాయి. ఈ లోహం ఆటంబాంబు తయారికి ఉపయోగిస్తారనే విషయం గుర్తుంచుకుంటే చాలు. ఇది ఎంత భయానకం కలిగించే ఖనిజమో అర్ధమౌతుంది. ఇది శరీరంలో డి.ఎన్.ఎ. నాశనం చేసి మనిషి నిర్వీర్యుడినిగా చేస్తుంది” అన్నాడు.
ఆ మాటలకు పెద్ద పెట్టున నవ్వాడు అమర్. “నువ్వు నాణానికి ఒకవైపే చూస్తున్నావ్. వ్యవసాయం, వైద్యం, పవర్ ప్రొడక్షన్ వీటిలో ఈ యురేనియం ప్రాముఖ్యత ఎంత? మనం ఎప్పుడు ఎదుగుతాము. కేన్సర్ వస్తుందని తెలిసినా, గుట్లా ప్యాకెట్లు ఎందుకు తింటున్నారు? సిగరెట్లు ఎందుకు తాగుతున్నారు? మద్యం తాగితే లివర్ పాడయిపోతుందని తెలిసినా ప్రభుత్వమే ఎందుకు అమ్మేస్తోంది. వాటి రెవెన్యూతోనే కదా ప్రజలు బతికేది!” అన్నాడు.
“యురేనియం అంటే నల్లమల అడవులు కదా... ఇక్కడకు దగ్గరే వున్నట్టు చెబుతావ్?!”
ఆ మాటలకు అమర్ బదులు చెబుతూ, “నువ్వు ఎక్కడున్నావ్?! మనం ఉందేది ఏ ప్రాంతం...? ఇది రాయలసీమ. ఇక్కడకు దగ్గరలోనే నల్లమల అడవులు. మనం సైట్ సీయింగ్‌కు వెళ్ళాం కదా. మరచిపోయావా?!” అన్నాడు.
మిత్రుడిని పరిశీలనగా చూసిన సుభాకర్ అతడిని చూసి జీవితంలో మొదటిసారిగా భయపడ్డాడు. వీడినేనా ఇంత కాలం ప్రాణంలో ప్రాణంగా భావించాను అనే అంతర్మథనానికి లోనయ్యాడు.
అమర్ చెప్పుకుపోతున్నాడు.
“ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్ని ఉద్యమాలు వచ్చినా యురేనియం తవ్వకాలు ఆగవు. ప్రభుత్వంతో మా కార్పోరేట్ సంస్థ చేతులు కలుపుతోంది.”
ఆ మాటలకు వెంటనే, “చూస్తూ... చూస్తూ... ఒక మారణహోమాన్ని సృష్టించబోతున్నావా? మధుమతికి ఈ విషయం తెలిస్తే ఒప్పుకుంటుందా...? తనకు ఈ పచ్చని వాతావరణం, పర్యావరణం ఇష్టం... దాన్ని కలుషితం చేయడానికి ఒప్పుకుంటుందా...?” అన్నాడు సుభాకర్.
“తనకి తెలీదు. ప్రస్తుతానికి తెలియనివ్వము. వారి తండ్రిగారే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నా భుజ స్కంధాలపై వుంచారు. మొన్న మేం ఏకాంతంగా మాట్లాడుకున్న విషయాలు ఇవే! ఒక కొత్త శక్తిగా ఎదగడానికి ఈ క్రమంలో భాగంగా నేను రాజీనామా ఇస్తున్నాను, కంపెనీకి. ఇదంతా నీకు తెలియాలని చెపుతున్నాను. వచ్చేవారం మధుమతికి సిజేరియన్. ఆ టైములో నేనుండాలి... బై... వెళుతున్నాను” అంటూ అమర్ అక్కడి నుంచి కదిలాడు. రోజూ ఇంటికొచ్చిన మిత్రుడిని బైటకు సాగనంపే సుభాకర్ ఆరోజు గుమ్మం నుంచే వీడ్కోలు పలికాడు.
***
తరువాతి రోజునుంచీ పేపర్లలో, టీవీలో, వార్తా కథనాలు. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ భుజంగరావు, ఆయన అల్లుడు అమర్‌లు ప్రారంభించబోయే యురేనియం ఎక్సాట్రాక్షన్ ప్లాంట్. దాన్ని వ్యతిరేకిస్తున్న ఆ ప్రాంతపు ప్రజలు, ఎన్.జి.ఓ.లు.
వాటిని చూసి సుభాకర్ అనుకున్నాడు. మధుమతికి ఇవన్నీ తెలిసి వుండవు. ఆమె ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ హడావుడిలో వుంటుంది. తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందా అనుకున్నాడు.
రెండు రోజుల తర్వాత అతడికి అమర్ నుంచి ఫోన్. రేపు తెల్లవారురూమున ఊరు వెళుతున్నాను. మధుమతికి సిజేరియన్ ఫ్లాన్ చేసారు. నేను అక్కడ వుండాలి.
సుభాకర్, ఆల్ ది బెస్ట్ అని చెప్పకుండానే ఫోన్ కట్ చేసాడు అమర్.
***
రెండు రోజుల తర్వాత ఉదయం లేచి కాఫీ కలుపుకుందామని ప్రయత్నం ప్రారంభించేంతలో ఫోన్ మోగింది. అవతల, అమర్ మావగారు. ఇంత పొద్దున్నే... బహుశా, శుభవార్త మనవడు పుట్టాడని అయి వుంటుంది. ఈ విషయం అమర్ చెప్పలేదు. తన మీద కోపగించాడేమో అనుకుంటూ.
“చెప్పండి సార్” అన్నాడు.
“బాబూ! ఇంత ఉదయం నేను రెండు వార్తలు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ఒకటి శుభం. వేరొకటి అశుభం” అన్నాడు. ఆ కంఠంలో విషాదపు జీర.
“ఏమయ్యింది మధుమతికి?” అన్నాడు కంగారుగా.
“మధుమతికి పండంటి బిడ్డ పుట్టాడు. క్షేమంగా ఉంది. మరయితే మీ మిత్రుడు నిన్న మధ్యాహ్నం వచ్చేసాడు కార్లో. హుషారుగా వున్నాడు. ఐదు నిమిషాలు మధుమతితో మాట్లాడాడు. ఆస్పత్రికి వెళ్ళి, ఇక ఇంటికొచ్చి అలసటగా ఉంది. రెస్టు తీసుకుంటానన్నాడు. కాసేపటికి, ఊపిరి ఆడడంలేదు, నెబులైజేషన్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి సీరియస్ అయ్యింది. వెంటిలేటర్ మీద ఉంచవలసిన పరిస్థితి. నాలుగు గంటల పాటు డాక్టర్లు పోరాడినా ఫలితం లేదు. లంగ్స్ బాగా ఇన్‌ఫెక్ట్ అయినాయంట. మీ మిత్రుడు మన కిక లేడు" ఆయన ఏడుస్తూ చెప్పాడు.
ఒక్కసారి సుభాకర్ మనసులో దుఃఖం వెల్లువలా ఉప్పాగింది. అమర్‌లోని రాక్షసుడు చావాలనుకున్నాడు. వాడు కాదు అనుకుంటూ గట్టిగా ఏడ్చాడు. వెంటనే కారు బుక్ చేసుకుని బయలుదేరాడు.
అప్పటికే అమర్ అంతిమ సంస్కారం ఏర్పాట్లు పూర్తయినాయి.
మధుమతి ముఖం చూసే ధైర్యంలేక ఆమె ఉన్న ఆస్పత్రికి వెళ్ళలేకపోయాడు. అయినా తప్పదు కదా... వెళ్ళాడు ఉండబట్టలేక. ఆ ఆస్పత్రి గదిలో ఒక వైపు ఉయ్యాలలో ఒక రోజు వయసున్న పిల్లాడు. ఆమె మౌనంగా నిర్లిప్తంగా - ఇక్కడ ఇంట్లో అతడి తండ్రి విగతజీవుడిగా -
పునరపి జననం పునరపి మరణం! ప్రకృతిని శాసించే స్థాయికి ఎదుగుదామనుకున్న అమర్ ఆ ప్రకృతిలో కలిసిపోయాడు.
అమర్‌కు ఈ ప్రపంచం నించి కడసారి వీడ్కోలు పలికి ఆరోజే తిరిగి తన ఊరు వచ్చేసాడు.
***
వారం రోజుల తర్వాత ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుంటే ఫోన్, అమర్ మావగారు.
“అత్యవసరంగా రావాలి. కారు పంపుతున్నాను. కొంచెం పనుంది” అన్నాడు.
ఐదు నిమిషాల్లో కారు వచ్చింది. ఆ ఊరికి దూరంగా ఒక ఫారమ్ హౌస్. లోపల దట్టంగా పెరిగిన లాన్. మధ్యలో పర్ణశాలలాగా ఒక ఒంటి స్తంభం మేడలాంటి భవనం. దాని చుట్టూ మొక్కలు, చెట్లు. లోపలికి వెళ్ళగానే ఆ విశాలమైన గదిలోని ఆ దృశ్యం చూసి కొయ్యబారి పోయాడు. అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నాడు, పొడుగ్గా బలంగా ఉన్న వ్యక్తి. నల్లటి టీ షర్డు. అదే శారీరక ధారుడ్యంతో, నుంచుని వున్నాడు ఇంకొక వ్యక్తి. ఆ ఇద్దరినీ చూడగానే అర్ధమైంది. వారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారని. వారి ఎదురుగా చేతులు కట్టుకుని నిలుచున్నాడు నాగరాజు. అతని ముఖం పాలిపోయి కనిపించింది. పెదవి చిట్లి రక్తం కారుతోంది. ముక్కు మీద బలంగా కొట్టిన గుర్తుగా ఎర్రగా కనిపించింది.
అతడి పక్కన ఇద్దరు పిల్లలు. వాళ్ళు తనకు తెలుసు. పెద్దవాడు నాగరాజు కొడుకు. వాడికి ఏడెనిమిదేళ్ళు వుంటాయేమో! రెండోవాడు అతడి అక్క కొడుకు. వాడికి అంతే వయసు వుండవచ్చు, అనుకున్నాడు. వాళ్ళిద్దరు భయంభయంగా చూస్తున్నారు. కానీ ఏడవడంలేదు. వారి కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క రానందుకు ఆశ్చర్యపోయాడు.
“ఏమయ్యింది” అన్నాడు కంగారుగా.
భుజంగరావుగారు చెప్పడం మొదలెట్టారు, “ఏదో అనుమానం. నాగరాజు ఏదో దాస్తున్నాడని ఇదిగో చూడండి. ఈ వీడియో "నల్లమల అడవులను రక్షించండి. యురేనియం తవ్వకాలు ఆపండి” అంటూ నినాదాలు ఇస్తున్న ఉద్యమకారుల ఫోటో. దాంట్లో ఉన్నవాడు నాగరాజు” అన్నాడు.
ఆ ఏసి గదిలో సుభాకరానికి చెమటలు పట్టాయి. “అయ్యో! అమర్ ఆస్పత్రిలో కదా చనిపోయాడు. ఇతడిని ఎందుకు ఇరికిస్తారు. వదిలెయ్యండి” అన్నాడు ఆ చిన్నపిల్లల్ని చూసి, బాధపడుతూ.
“ఈ మధ్య అమర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ యురేనియం ప్రాజెక్టు ఆపకపోతే చంపేస్తాం అంటూ. అందుకే ఈ అనుమానం. అయినా ఏ ఆధారం లేదు. మీకు ఇతను తెలుసు కదా. మిమ్మల్ని చూసి ఏమైనా నిజం చెపుతాడేమో అని పిలిచాను” అన్నాడు అమర్ మామగారు.
“అనుమానించడానికి అర్ధం వుండాలి. అమర్‌కు ఆస్తమా వుంది పదిహేనేళ్ళుగా. ఈ మధ్య స్ట్రెస్ లో వున్నాడు. ఏసి కారులో మూడు గంటల ప్రయాణం. ఆస్తమా ఎటాక్ వచ్చింది. ఆస్పత్రిలోనే కదా చనిపోయింది” అన్నాడు మెల్లగా.
ఆ గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దం. అమర్ మావగారు వెంటనే చెప్పాడు. “వదిలెయ్యండి” అన్నాడు.
నిల్చొని వున్న కానిస్టేబుల్, తన పక్కనే వున్న నాగరాజుకు తగిలిన దెబ్బలు తుడిచాడు. ఏదో ఆయింట్‌మెంట్ రాసాడు.
“సుభాకర్ చెప్పాడని వదిలేస్తున్నాము. ఈ విషయం ఎవరికీ చెప్పకు. చెపితే నీకే ప్రమాదం” అమర్ మావగారు అన్నాడు నాగరాజు వంక చూసి.
కానిస్టేబుల్ ఆ గది తలుపులు తెరిచాడు. నాగరాజు పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచి కదిలాడు.
“వస్తానండీ” అంటూ సుభాకర్ గబగబా అక్కడ నుంచి బైటకు నడిచాడు.
బైట వెన్నెల విరగబోస్తోంది. కాని ఎందుకో ఆ వెన్నెల వేడిగా అనిపించింది సుభాకర్‌కు.
ఆ పల్చటి చీకటి తెరల మధ్యన నాగరాజు, ఆ ఇద్దరు పిల్లలతో ఒక నీడలా కదిలి పోతున్నాడు.
“చీకట్లో ఎంత దూరం నడుస్తారు... రండి. మీ ఇంట్లో దింపుతాను” అంటూ ఆ ముగ్గురినీ తన కోసం పంపిన కారులో ఎక్కించాడు. కారు కదిలింది. నాగరాజు మౌనంగా ఉన్నాడు. పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.
“ఇంతకీ మీ అక్క ఎక్కడుంది?” అన్నాడు సుభాకర్.
“నా పెద్ద మేనల్లుడికి ఒంట్లో బాగుండలేదు సార్. గుండెజబ్బు. అందుకోసం సిటీలోని కార్జియాక్ కేర్‌లో వున్నాడు. వాడి దగ్గరే వుంది” అన్నాడు.
“అలాగా” అన్నాడు ఏదో ఆలోచనలోపడి. వారిని ఇంటి ముందు దింపి తన ఇంటికి చేరుకున్నాడు సుభాకర్.
***
వారం తర్వాత తను ప్లాంటులోని ల్యాబ్‌లో పని చేసుకుంటుంటే బైట సెక్యూరిటీ నుంచి ఫోన్, “సార్... మీ కోసం ఎవరో వచ్చారు. ఆయన కలవాల్సింది అమర్‌గారిని. ఆయన చనిపోయారు కదా! అని చెబితే వారు తెలిసినవారెవరైనా ఉంటే చెప్పండి అంటున్నారు.”
“సరే. వస్తాను” అంటూ బైటకొచ్చాడు. సెక్యూరిటీ దగ్గర ఇన్‌షర్ట్ చేసుకొని, టై కట్టుకున్న ఒక యువకుడు నమస్కారం చేసి -
“సార్. నేను మన నగరంలోని శుశ్రుత కార్టియాక్ కేర్ నుంచి వస్తున్నాను. మీ ఫ్రెండ్ అమర్‌గారు పదిహేను రోజుల క్రితం ఒక చెక్ ఇచ్చారు. ఐదు లక్షలకు. అది బౌన్స్ అయ్యింది. ఒక పేషెంట్ గుండె ఆపరేషన్ కోసం అన్నీ సిద్ధంచేసాం. ఇప్పుడు ఆపరేషన్ ఆగిపోయింది. ఈ పేషెంట్ తాలుకా వాళ్ళు డబ్బులివ్వలేరు. ఇప్పుడు మీ ఫ్రెండ్ అమర్ చనిపోయారు. ఎవరిని అడగాలి?” అంటూ అమర్ ఇచ్చిన చెక్కు అమర్ ఆస్పత్రి వారికి పంపిన మెయిల్ కాపీ అందించాడు.
ఆ కాగితాలు చదివి ఏం అర్ధం కాలేదు సుభాకర్‌కు. ఆ మెయిల్‌లో భాగ్యవతిగారి పదేళ్ళ పిల్లాడి ఆపరేషన్ కోసం తను ఐదు లక్షలు చెక్కు పంపుతున్నట్టుగా వుంది ఆ ఉత్తరం.
తనకు తెలిసి ఆ భాగ్యవతి, నాగరాజు అక్క. ఆవిడ అమర్ ఇంట్లో వంటమనిషి. ఏం జరుగుతోంది? అసలు ఐదు లక్షలు చెక్కు ఎందుకిచ్చాడు. అదీ ఫండ్స్ లేకుండా...?
సుభాకర్ బుర్ర పగిలిపోయింది అర్ధంకాని ప్రశ్నలతో.
“సరే. ఆ కాగితాలు ఇవ్వండి. మీకు రేపు నేను ఫోన్ చేస్తాను” అంటూ అతడిని పంపేసాడు.
వెంటనే సుభాకర్ తమ బాస్ అనుమతి తీసుకుని, ప్లాంట్ నుంచి బైట పడ్డాడు. తన స్కూటర్‌లో -
నాగరాజు వుంటున్న లేబర్ కాలనీ వైపు వేగంగా పోనిచ్చాడు. పావుగంటలో అక్కడకు చేరుకున్నాడు. అక్కడ చిన్న ఇల్లు. పక్కనే నాగరాజు అద్దెకు తిప్పే టాక్సీ. బైట అరుగు మీద ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. అతడిని చూసి నవ్వుతూ “అంకుల్" అంటూ పలకరించారు.
నాగరాజు బైటకు వచ్చాడు. “సార్ మీరొచ్చారా... కబురుపెడితే నేనే వచ్చేవాడినిగా!” అన్నాడు.
“ఫరవాలేదు. ఏమిటీ రోజుకో కొత్త మలుపు. అమర్ మీ అక్క కొడుకు ఆపరేషన్ కోసం ఐదు లక్షల చెక్కు ఇవ్వడం ఏమిటి? అది బౌన్స్ అవ్వడం ఏమిటి? నీకు ఈ విషయం తెలుసా?” అన్నాడు.
ఆ మాటలకు అతను తలొంచుకున్నాడు. హఠాత్తుగా ముఖం పాలిపోయింది. కళ్ళు కాంతివిహీనంగా మారాయి. ముందుకు నడుస్తూ చుట్టూ చూసి చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని-
అతని మాటలు వింటుంటే సుభాకరానికి ముచ్చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంది. “'ఇన్‌డీసెంట్ ప్రొపోజల్ తాగుడు మైకంలో అమర్ చెప్పిన వాక్యాలు మనసులో మెదిలాయి.
“తను రాముడు కాదు. ఆయనలా ఏకపత్నీవ్రతుడు కాదు”.
కొడుకు ఆపరేషన్ కోసం నాగరాజు అక్క అతడికి లొంగిపోయింది. ఆమెను దారుణంగా వాడుకొన్నాడు. గుండె ఆపరేషన్ ఖర్చు భరిస్తాడని ఆమె అతడికి శరీరాన్ని కుదువ పెట్టింది. ఆమె ద్వారా కోరిక తీర్చుకుని ఆమె అవసరం తీర్చకపోవడం! ఎంత దారుణం! చెల్లని చెక్కు ఇచ్చి, ఎంత మోసం చేసాడు. ఇలాంటివాడితోనా తను ఇన్నేళ్ళూ స్నేహం చేసింది.
సుభాకరం బుర్ర వేడెక్కిపోయింది. నిమిషంతర్వాత చెప్పాడు. “ఔను. అలాంటివాడిని చంపెయ్యాల్సిందే... నిజంగా నువ్వు ఏదో చేసినట్టున్నావ్!” అన్నాడు మెల్లగా.
నాగరాజు ఒక్క క్షణం మౌనం వహించి చెప్పడం మొదలుపెట్టాడు. “క్షమించండి సార్... మీకు చెపుతాను. మీ మిత్రుడు చెప్పినట్లు మీరు సాక్షాత్తు హనుమంతులవారే! ఆయన నమ్మినట్లు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అంటూ రెండు చేతులూ జోడించాడు.
“మై గాడ్! మేం ఇద్దరం మాట్లాడుకుంటున్న మాటలు నీకెలా తెలిసాయి?” అన్నాడు ఆశ్చర్యపోతూ.
ఆరోజు మీరిద్దరూ మందు పుచ్చుకుంటున్నప్పుడు నేను ఆ గది బయటే కదా వున్నాను!” అన్నాడు నాగరాజు వివరంగా.
సుభాకర్ మెదడు మొద్దుబారిపోయింది. ఇంతకీ ఏం చేసారు? అమర్ ఎలా చనిపోయాడు? సుభాకరం పెదాలు వణుకుతున్నాయి. నాగరాజు చెప్పడం ప్రారంభించాడు మళ్ళీ, “సార్... ఆయన తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన యురేనియం ప్లాంట్ పెడతానన్నప్పుడే కోపం వచ్చింది. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నా అక్కను దారుణంగా వాడుకున్నప్పుడు ఆ కోపం మరింత పెరిగింది. ఇక చెల్లని చెక్కు ఇచ్చిమరీ దారుణంగా మోసపోయిన అక్కని చూసి, నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఆయనను చంపేయాలనుకున్నాను” అంటూ చెప్పడం ఆపి చుట్టూ చూసాడు. అక్కడ అంతా నిర్మానుష్యం.
మళ్ళీ నాగరాజు ఊపిరి బలంగా పీల్చి వదిలి చెప్పడం మొదలుపెట్టాడు, “ఆయనను ఆరోజు కార్లో తీసుకెళతారని తెల్లవారుఝామున వచ్చాను. మా దగ్గర ఆ ఇంటి డూప్లికేట్ కీ వుంది. బైట నా కొడుకును, మేనల్లుడిని కాపలాగా పెట్టాను. ఎవరైనా వస్తే ఈల వేయమని - ఆయన పడుకునే బెడ్ రూమ్‌కు ఆనుకునే వంటగది - గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోయాను. ముఖానికి బలంగా గుడ్డ కట్టుకుని వెళ్ళాను. ఆయన గాఢనిద్రలో ఉన్నాడు. నేను నాతో పాటు తెచ్చిన కిరసనాయిల్ దీపం తీసుకొచ్చాను.
జారవిడుద్దామనే ప్రయత్నం. గ్యాస్ లీక్ చేసి అంటే, బర్నర్ తిప్పి స్టవ్ ఆన్ చేయకుండా వెళ్ళిపోదామని. ఆ తర్వాత కిటికీలోంచి కిరసనాయిల్ దీపం జారవిడిచి పరిగెత్తుకు పారిపోదామని నా ప్రణాళిక.
“లోపల గదిలో ఆయన గురక స్పష్టంగా వినిపించింది. గ్యాస్ లీకయ్యింది. గబగబా బైటకొచ్చాను. పిల్లల్ని దూరంగా ఉండమన్నాను. ఐతే ఒక్క క్షణం భయపడ్డాను. ఆ గ్యాస్ సిలిండర్ పేలి, మిగతా ఇళ్ళవారికి ప్రమాదం జరుగుతుందని భయం వేసింది. ఆలోచనల్లో ఐదు నిమిషాలు దొర్లిపోయాయి. తెల్లవారుఝామున కాబట్టి నన్నెవరూ గుర్తించలేదు. వెంటనే నిర్ణయం మార్చుకున్నాను. లోపలికి వెళ్ళి సిలిండర్ బర్నర్ సరిచేసాను. కిటికీలు, తలుపులు తెరిచాను. ఇంత జరిగినా ఆయన మద్యం మత్తులో నిద్రపోయాడు. గంటసేపు ఆయన లేచేవరకు బైట వున్నాను. ఐదు నిమిషాలసేపు ఆయన గ్యాస్ పీల్చి వుంటాడు. అదే నేను చేసింది” చెప్పడం ఆపి, సుభాకరం కాళ్ళ మీద పడ్డాడు.
సుభాకరంలో ఆలోచనలు తీవ్రమయ్యాయి.
నాగరాజు మళ్ళీ చెప్పడం కొనసాగించాడు.
“గంట తర్వాత ఆయన లేచి కాసేపు దగ్గాడు. వాసన గుర్తించాడు”. వెంటనే చెప్పాను, 'సార్ మీరు కాఫీ తాగుతారని స్టవ్ ముట్టించాను. ఏదో వాసన వచ్చింది. ఏదో లీకయినట్టుంది” అన్నాను.
“ఓహో... కాఫీ వద్దు. దార్లో తాగుదాం” అన్నాడు. అలా కారెక్కి మళ్ళీ బాటిల్ తెరిచాడు. మూడు గంటలు కార్లో నిద్రపోయాడు. ఊరు చేరిన తర్వాత ఆయన హాస్పిటలైజేషన్ అయ్యారట. ఆస్పత్రిలో చనిపోయారని నాకు తర్వాత తెలిసింది. నేను తిరిగి నా కారులో వెనక్కి వచ్చేసాను. ఆయనను ఇంట్లో దింపిన వెంటనే” అన్నాడు నాగరాజు చెప్పడం ఆపి.
సుభాకరంకు అర్ధం అయిపోయింది. అమర్ తనకు తెలియకుండానే నిద్దట్లోనే గ్యాస్ పీల్చేసాడు. అది లంగ్స్ మీద పని చేసింది. స్లో పాయిజన్‌లాగా - ఆస్తమా పేషెంటుకు అది సరిపోదా చనిపోవడానికి. కోల్డ్ బ్లడెడ్ మర్దర్.
నిమిషం తర్వాత, “ఇది ఎవరికి చెప్పకు. మన మధ్యే వుండాలి” అన్నాడు సుభాకరం. ముందుకు నడుస్తూ అక్కడ చదువుకొంటున్న ఆ ఇద్దరు పిల్లల వంక చూసాడు. వెంటనే అన్నాడు, “ఆ పిల్లలకు తెలుసు కదా, జాగ్రత్త! ఎవరికైనా చెపుతారేమో” అన్నాడు మెల్లగా.
“చెప్పరు సార్. ఆరోజు నన్ను అంత గట్టిగా పోలీసులు రక్తం వచ్చేటట్టు కొట్టినప్పుడు వాళ్ళు బైట పడిపోతారేమో అనుకున్నాను. భయపడ్డాను. వాళ్ళు చెప్పలేదు. నాకు గోడలా నిలబడ్డారు” అన్నాడు.
ఆ మాటలకు సుభాకరం అప్రతిభడై అచేతనంగా ఉండిపోయాడు ఆ పిల్లలను చూస్తూ - గతంలో తను చూసిన ఆ సినిమాలోని ఆ "దృశ్యం” గుర్తుకొచ్చింది. అదే దృశ్యం, దాంతో పాటు చిన్నప్పుడు స్కూల్లో మాస్టారు చెప్పిన ఆ కొటేషన్‌కు అర్ధం అవగతమయ్యింది. పరమార్ధం బోధపడింది ఇన్నేళ్ళ తర్వాత.
బలహీనమైన ఆ పసివాళ్ళు తమ కోసం, కాపు కాస్తున్న నాగరాజు కోసం బలంగా నిలబడ్డారు - తమ కుటుంబం పడిపోకుండా కాపాడుకున్నారు. ఎందుకో బాధగా, దుఃఖంగా, బరువుగా ఉన్న అతడి మనసు ఆ పిల్లల్ని చూసేసరికి కొద్దిగా సాంత్వన కలిగినట్లయ్యింది. మెల్లగా నడుచుకుంటూ ఆ పిల్లల దగ్గరకు వచ్చాడు. వారిని తన హృదయానికి హత్తుకున్నాడు.
ఆ పిల్లలు పుస్తకంలో చదువుతున్న పద్యం అతడికి వినబడింది. “బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!”
అతడి వాహనం ముందుకు సాగింది. ది చెయిన్ ఈజ్ ఓన్లీ స్ట్రాంగ్ ఏజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్ (గుంపులో ఒక్క బలహీనుడున్నా ఆ గుంపు బలహీనమవుతుంది). చిన్నప్పుడు మాస్టారు చెప్పిన “'జెర్మియ బోర్గ్ కొటేషన్ అతని వెన్నంటే వస్తోంది.
“నాయకుడు లేని సమాజం నిర్మించే లక్ష్యం గల నాయకులు ఇలాంటి పిల్లలే భవిష్యత్తులో అనుకున్నాడు” మనసులో.
***