'chandini' written by Gowri Ponnada
రచన : గౌరీ పొన్నాడ
రైల్వేస్టేషన్ దగ్గర్లో చిన్న హోటల్ నడుపుకుంటూ బ్రతుకుతున్నారు ప్రతిమ, సుహాన్. ఇద్దరూ కష్టపడి అనుబంధాలు, ఆప్యాయతలు కలబోసుకున్న అందమైన పొదరిల్లు నిర్మించుకున్నారు. ఆ దంపతులను చూసి ప్రేమకు ప్రతిరూపం వీళ్లిద్దరు అనుకునేవారు తెలిసినవాళ్లంతా. వాళ్ల ప్రేమ పంట చాందిని. ఆమె పుట్టిన తరువాత వ్యాపారంలో లాభాలు వచ్చి ఆ చిన్న హోటల్ కాస్తా పెద్ద రెస్టారెంట్ గా మారింది. చాందిని అంటే ఆ దంపతులకు అంతులేని అభిమానం, ఆపేక్ష.
కొడుకు కోడలు అనుబంధాన్ని, ఆ ఇంటి మహాలక్ష్మి, వాళ్ల గారాలపట్టి చాందినిని చూసుకుని మురిసిపోతూ వాళ్లతో పాటు ఉంది సుగుణ. కొడుకు కోడలు మనవరాల్ని బాగా గారాబం చేసే చెడగొడుతున్నారని కోపగించుకుంటుంది అప్పుడప్పుడు.
"నీ కూతురికి 10 ఏళ్లొచ్చాయి. ఇంకా చంటిబిడ్డలా చంకనేసుకొని తినిపిస్తున్నావు. అది మంచి పద్ధతి కాదమ్మాయ్! చాందిని కి తన పనులు తాను చేసుకోవడం నేర్పించు. రేపు కాలం కలిసి రాక జరగకూడనిది ఏదైనా జరిగితే నీ కూతురు పరిస్థితి ఏంటో ఆలోచించు... లేదా పెళ్లి చేసిన తర్వాత దాని మొగుడు ఎత్తుకొని తినిపిస్తాడా ఏమిటి." అంటూ కోడల్ని చీవాట్లు పెట్టింది సుగుణ.
"ఊరుకోండి అత్తయ్యా , అవేం మాటలు. ఇది, మా అదృష్ట దేవత. రేపు వచ్చే ఆ పెళ్ళికొడుకుని మాకు ఇల్లరికం ఉండి పొమ్మంటాం. అంతేకానీ మా కూతుర్ని కష్టపెడతానా ఏంటి!" అంది ప్రతిమ.
"ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే తల్లీ. ఆ తర్వాత నీ ఇష్టం!" అంటూ అక్కడి నుండి వెళ్ళియింది సుగుణ.
చాందిని నిజానికి చాలా తెలివైన, అల్లరి పిల్ల. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా ఉంటుంది. తన తల్లి ఎంతగా ముద్దు చేసినా, నాన్నమ్మ దగ్గర సరదాగా కొన్ని పనులు నేర్చుకుంది.
అందమైన రంగుల హరివిల్లులా ఎంతో ఆనందంగా, సంతోషంగా, గడిచిపోతున్న ఆ అనుబంధాల పొదరింట్లో, సునామిలా తీరని కష్టం వచ్చిపడింది.
ప్రతిమ ఆరోగ్యం పూర్తిగా పాడై, ఎందరు డాక్టర్లకు చూపించినా ఫలితం లేక మరణించింది.
అంతవరకు ఆత్మీయత, అనురాగాలకు నెలవైన ఆ ఇల్లు, దెయ్యాల కొంపలా తయారయింది. సుగంధాల పూల వనం లాంటి ఆ కుటుంబం, వాడిపోయిన పూలతోటలా వెలవెలబోయింది.
ఎగిరేపక్షితో, నడిచే చీమతో, వీచే గాలితో, కురిసే వానతో అన్నిటితో ఆడుకునే చిన్నారి చాందిని, రెక్కలు తెగిన పక్షిలా, నేలకొరిగిన గాలిపటంలా, తల్లిని తలుచుకుంటూ బాధతో మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. మనవరాలిని ఆ స్థితిలో చూసిన సుగుణ గుండె తరుక్కుపోయింది. కోడలితో గారాబం వద్దని చెప్పిన సుగుణ, మనవరాలిని ఎత్తుకొని, బ్రతిమిలాడి, లాలించి భోజనం తినిపించేది. ఏం చేసినా, ఒక పసిపాపకు తల్లిలోటు తీర్చడం సాధ్యం కాదు.అందుకే సుగుణ ఒక నిర్ణయం తీసుకొని కొడుకు తో మాట్లాడింది.
"సుహాన్, నేను ముసలిదాన్ని అయిపోయాను. నువ్వు ఎంత జాగ్రత్తగా చేసుకున్నా, ఆడపిల్లకు ఒక వయసులో తల్లి అవసరం చాలా ఉంటుంది. అందుకే పాప బాధ్యత తీసుకోవడానికి, ఇంటిని చక్కబెట్టుకోవడానికి ఇల్లాలు తప్పనిసరిగా ఉండాలి. నా కోడలు ప్రతిమ అంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసు. అటువంటి గుణవంతురాలు కోడలుగా దొరకడం నా అదృష్టమే. కానీ మన దురదృష్టం మనందరినీ ఒంటరిని చేసి తను పోయింది. నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు. చీకటి అలముకున్న నీ జీవితంలో మళ్లీ వెలుగు రావాలంటే ఈ ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు రావాలి. నేను ఎందుకోసం చెప్తున్నానో అర్థం చేసుకుని మళ్లీ పెళ్లి చేసుకో." అంది సుగుణ కొడుకు జీవితాన్ని బాగు చేయాలన్న తాపత్రయంలో.
భగవంతుడా! నేనేం పాపం చేశాను. నాకెందుకీ శిక్ష? అని మోకాళ్లపై కూర్చుని ఏడుస్తూ, "ప్రతిమ చనిపోయి సంవత్సరం కూడా కాలేదమ్మా! నా ప్రతిమను మర్చిపోయి మళ్ళీ వేరొకరిని పెళ్లి చేసుకోమంటున్నావు. వచ్చిన ఆమె నాకు భార్య అవుతుందేమో,,, నా కూతురికి తల్లి అవుతుందా?" అన్నాడు సుహాన్.
"నీ కూతురుకి తల్లిగా మారే అమ్మాయిని తీసుకొద్దాం కన్నా! నువ్వు ఇలా బాధపడుతూ జీవితం నాశనం చేసుకోవడం ప్రతిమకు కూడా ఇష్టం ఉండదు." అని కొడుకుని పెళ్ళికి ఒప్పించింది సుగుణ.
అలా సుహాన్ జీవితంలోకి రిజ్వానా వచ్చింది. రిజ్వానా చాలా అందమైన అమ్మాయి. వచ్చిన కొత్తలో చాందినిని చాలా ప్రేమగా చూసుకునేది. రిజ్వానా కూతురిపై చూపిస్తున్న ప్రేమ, ఆమె అందం చూసి పూర్తిగా ఆమెకు లొంగిపోయాడు సుహాన్. కానీ చాందినిపై ఆ కుటుంబంలో అందరూ చూపిస్తున్న ప్రేమను చూసి, ఈ బిడ్డను అందలం ఎక్కిస్తే, నాకు పుట్టబోయే బిడ్డల పరిస్థితి ఏంటి? అని ఆలోచించి, చాందినిపై అసూయ పెంచుకుంది.
అంతే ఆరోజు నుండి చాందినికి కష్టాలు మొదలయ్యాయి. అప్పటివరకు యువరాణిలా అల్లారుముద్దుగా పెరిగిన చాందిని, సవతి తల్లి పుణ్యాన తన ఇంటిలోనే దాసీగా మారుతుంది.
చాందిని బాధలు చూడలేక ఒకరోజు సుగుణ కోడలితో, "రిజ్వానా! చాందిని చాలా మంచి పిల్ల, ఈ ఇంటి అదృష్టదేవత. అది పుట్టిన తర్వాతే దాని తండ్రి వ్యాపారంలో పుంజుకున్నాడు. కర్మకాలి దాని తల్లి మరణించింది. కానీ, ప్రతిమ బ్రతికున్న రోజుల్లో బిడ్డను చంక దించేది కాదు. ఎప్పుడూ ఎత్తుకొని తిప్పేది. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన పసిదాన్ని అంతలా రాచి రంపాన పెట్టడం న్యాయం కాదు." బాధగా అంది.
అంతవరకు ఎంతో మంచిగా నటించిన రిజ్వానా, "మీరు కాస్త నోరు మూసుకొని ఉండండి. ఎక్కువ మాట్లాడారంటే ఈ ఇంటిలో మీకు స్థానం ఉండదు. ఏ వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తుంది." అంటూ అత్తను బెదిరించింది. అప్పటినుండి అంతా చూస్తూ కూడా కోడలి నోటికి భయపడి కొద్ది రోజులు నోరు మూసుకుని ఉంది సుగుణ.
అప్పుడప్పుడు సుగుణ కొడుకుతో మాట్లాడాలని ప్రయత్నించినా, అతడ్ని ఒంటరిగా వదిలేది కాదు రిజ్వానా. మనవరాలు పడుతున్న కష్టాలు చూడలేక, రిజ్వానా ఆకృత్యాలను భరించలేక చివరికి ఒకరోజు కొడుకు, కోడలితో పెద్ద గొడవ పెట్టుకుంది సుగుణ. అంతే ఆమె అడ్రస్ వృద్ధాశ్రమంగా మారింది. సుగుణ ఇంటినుండి వెళ్ళిన తర్వాత చాందినీ జీవితం అస్తవ్యస్తంగా మారింది. కానీ కాలం ఎవరికోసం ఆగదు. ఏ మార్పులు లేకుండానే ఇంకో ఐదేళ్లు గడిచిపోయింది.
ఒకరోజు రిజ్వానా తమ్ముడు రిషి ఆమె ఇంటికి వచ్చినప్పుడు, చాందిని అందం చూసి, అతని అక్కతో " నా యజమాని 60 ఏళ్ల ముసలి వాడు. అతని భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. చాందిని వయసు 15 ఏళ్లు అయినా, చూడడానికి పొడుగ్గా పెద్ద దానిలా ఉంది. ఆ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మనకి మంచి లాభం. నువ్వు ఎలాగైనా బావని ఒప్పించు." అని చెప్పాడు.
రిషి చెప్పిందంతా విన్న రిజ్వానా, "మీ బావగారు ఒప్పుకోరేమో." అంది అనుమానంగా.
"బావగారిని ఒప్పించే బాధ్యత నీదే అక్క. ఏం చేసైనా భావని ఒప్పించు. ఈ పెళ్లి చేస్తే ఆర్థికంగా నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతావు." ఆశ చూపించాడు రిషి.
చాలాసేపు ఆలోచించి, ఆ రోజు రాత్రి రిజ్వానా సుహన్ తో, "ఏమండీ మన చాందినికి ఏదో దోషం ఉందట. వారం రోజుల్లోగా 60 ఏళ్ల ముసలాడితో ఉత్తుత్తి పెళ్లి జరిపిస్తే, దోషం పోతుంది అన్నారు. ఆ తర్వాత వారికి కొంత డబ్బు ఇచ్చి వదిలించుకుంటే సరిపోతుంది. మీకు చాందిని అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. అందుకే మా తమ్ముడితో చెప్పి మనిషిని మాట్లాడమన్నాను. మీరు ఒప్పుకోవడమే ఆలస్యం. నేను ఏం చేసినా అదంతా చాందిని భవిష్యత్తు కోసమే." అంది చాందిని పై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ.
"చాందిని ఎంత అదృష్టవంతురాలు. తల్లి మరణించినా, అంతకంటే ఎక్కువగా ఆమె కోసం ఆలోచించే చిన్నతల్లి దొరికింది. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు." అన్నాడు సుహాన్ కృతజ్ఞతతో రిజ్వానా చేతులు పట్టుకుని.
"ఆ విధంగా మాట్లాడకండి. చాందిని నా కడుపున పుట్టకపోయినా నా బిడ్డే." అంది రిజ్వానా తన పాచిక పారినందుకు సంతోషిస్తూ. మరుసటి రోజు రిషితో మాట్లాడి, వారం రోజుల్లోగా పెళ్లికి ముహూర్తాలు పెట్టించింది రిజ్వానా.
అనాధ శరణాలయంలో ఉన్నా, ఎప్పటికప్పుడు మనవరాలి యోగక్షేమాలు తెలుసుకుంటున్న సుగుణ, రిజ్వానా చేస్తున్న అకృత్యాలను తెలుసుకొని, చాందిని జీవితంలో ముసురుకుంటున్న కారుమేఘాలు కోసం, దుబాయ్ లో ఉన్న ఆమె మేనమామ సుధాకర్ కు ఫోన్ చేసి, "నాయనా నువ్వు మీ అక్క చచ్చిపోయిన రోజే చాందినిని తీసుకువెళ్ళిపోతాను అంటే అడ్డుపెట్టాను. కానీ ఇప్పుడు నువ్వు రాకపోతే చాందిని జీవితం నాశనం అయిపోతుంది." అంటూ రిజ్వానా చేస్తున్న ఘోరాలన్ని వివరంగా చెప్పింది.
"సరే అత్తయ్యా! మీరేం కంగారు పడకండి. చాందినిని కాపాడుకునే బాధ్యత నాపై ఉంది." అని సుగుణకు ధైర్యం చెప్పి వెంటనే బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలు పెట్టాడు సుధాకర్.
అదృష్టవశాత్తు సరిగ్గా పెళ్లిరోజుకు, పోలీసులను తీసుకొని సుధాకర్ మండపానికి చేరుకున్నాడు. ముసలి వాడి పక్కన కూర్చున్న మేనకోడలిని చూసి, "నువ్వసలు తండ్రివేనా? బంగారంలాంటి కూతురిని, ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు. అక్కతో పాటు నీ మనస్సాక్షి కూడా చచ్చిపోయిందా బావ." అన్నాడు కోపం ఆపుకోలేక.
సుధాకర్ ఆవేశం చూసి సుహాన్, "నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు సుధాకర్. ఇది నిజం పెళ్లి కాదు. చాందిని దోషం పోగొట్టడానికి చేస్తున్న ఉత్తుత్తి పెళ్లి." అన్నాడు అనునయంగా.
"నువ్వెంత గుడ్డివాడివైపోయావు బావా. అతని దగ్గర డబ్బులు తీసుకుని, తన తమ్ముడితో కలిసి ఈ పెళ్లి చేస్తోంది నీ భార్య. అది పసిగట్టక, దగ్గరుండి మరీ నీ కూతురి జీవితం నాశనం చేస్తున్నావు నువ్వు. ఇంక నీ దగ్గర నా మేనకోడలికి రక్షణ లేదు. నా వెంట తీసుకు వెళ్ళిపోతాను. తనని బాగా చదివించి, నా అక్క కోరుకున్నట్లుగా మంచి వ్యక్తితో వివాహం జరిపించి, తన జీవితంలో మళ్లీ నవ్వులు పూయిస్తాను. తన బంగారు భవితవ్యాన్ని తనకి అందించి, తన జీవితాన్ని రంగులమయం చేస్తాను." అని చెప్పి చాందినిని తనతో తీసుకువెళ్ళిపోయాడు సుధాకర్.
సుహాన్ , రిజ్వానా ఆమె తమ్ముడు రిషిని, ముసలివాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లారు..
నిజానిజాలు గ్రహించకుండా, కూతురు జీవితాన్ని చీకటిమయం చేయడంలో తన పాత్ర కూడా ఉంది కాబట్టి, భగవంతుడు విధిస్తున్న ఈ శిక్షకు తాను అర్హుడనే అని, భార్య మోసాన్ని ఇన్నాళ్లుగా తెలుసుకో లేనందుకు బాధపడుతూ, మౌనంగా పోలీసుల వెంట నడిచాడు సుహాన్.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం :
నమస్తే నా పేరు గౌరీ పొన్నాడ, నేను సెకండరీ గ్రేడ్ టీచర్ ని, మాది శ్రీకాకుళం జిల్లా నేను 2020 లో లాక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మొదటిసారిగా ప్రతిలిపి ఆన్లైన్ ఆప్ లో నాకు ఎంతో ఇష్టమైన కథలను రాయడం మొదలుపెట్టాను సహరి, స్వేరో టైం పత్రికల్లో నా కథలు ప్రచురితమయ్యాయి. మరి కొన్ని పత్రికలకు పంపిన కథలు పరిశీలనలో ఉన్నాయి. కరోనా కథలు కవితలు పోటీలలో మొదటి సారి బహుమతి వచ్చింది. ప్రతి లిపిలో జరిపిన సైన్స్ ఫిక్షన్ కథల పోటీలో రెండో బహుమతి వచ్చింది. నా భర్త మధుసూదనరావు చదువుకున్న రైతు పాప సిక్స్త్ క్లాస్ బాబు ఫిఫ్త్ క్లాస్
Nice story
Thank you all
Hrudayanni kadilinchina paatralandi mivi
Excellent story kula mathalaku athithamga super ga rasaru
Oka ammayi ki Savathi thalli pettey kshtalni chala baga varnincharu miru chala great kadha chadivina prethi mahila telusukovalsinadhi andhukey oka ammayi kashtalu inkoka ammi key telustaii ani antaru miru varninchina e kadha chala bhagundhi and miru anno anno prizes gelchukovali ani korukuntu selavu...