top of page

చెడులో కూడా మంచి


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Chedulo Kuda Manchi' New Telugu Story



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


రాధమ్మ కి ఎనిమిదవ సంవత్సరంలోనే పెళ్లిచేసేసారు ఆమె తల్లితండ్రులు.. పన్నెండేళ్ళకే కాపురానికి పంపేశారు.కట్నాలు ఇచ్చుకోలేక తమ కూతుళ్లను వయస్సు వ్యత్యాసం గానీ రెండో పెళ్లివాడనిగానీ ఆలోచించకుండా కట్టబెడ్తున్న రోజులవి..


రాధమ్మకూ, ఆమె భర్త పరమేశ్వరానికి ఇరవై సంవత్సరాల వ్యత్యాసం.. అత్తవారింటికి వచ్చిన రాధమ్మ ముగ్ధ.. ఇంకా పరిపక్వత రాని వయస్సు. పాలుగారే బుగ్గలతో, బెదురుచూపులతో ఇంటి పెద్దకోడలిగా అత్తవారింట ఒదిగిపోయింది..


భర్త ఏ పని చేస్తాడో తెలియదు.. తను చూచాయగా విన్నది ఏమిటంటే వ్యవసాయం అని.. పొద్దుటే వెళ్లిపోయిన మనిషి అర్ధరాత్రి రావడం, ఎక్కడో అలసిన శరీరంతో ఏ కొట్టుగదిలోనో నిద్రపోతున్న రాధమ్మను బలవంతంగా బర బరా ఈడ్చుకుంటూ తనగదిలోకి తీసుకుపోయి ఆమె శరీరాన్ని పశువులా ఆక్రమించుకునేవాడు.. భర్తను చూడగానే చిగురుటాకులా వణికిపోయే రాధమ్మ పదునాలుగేళ్ల వయస్సులోనే తల్లి అయింది..

" ఇదా, పెళ్లంటే "? తన స్నేహితురాలు పూర్ణకు తనకంటే ముందరే పెళ్లి అయింది.. తానూ వెళ్లిందా పెళ్లికి.. ముత్యాలపల్లకీలో పూర్ణ ఎదురుగా అందాల రాకుమారుడు ఉరేగుతుంటే తన పెళ్లి కూడా అలాగే అంగరంగ వైభవంగా అవుతుందని కలలుగంది. భర్త తనతో ఒక్క మాట మాటలాడడు.. అతని రూపం ఎలా ఉంటుందో కూడా తనకి పూర్తిగా తెలియదు.. అర్ధరాత్రి అతని స్పర్శలో నలిగిపోవడం మాత్రమే తనకు తెలుసు.. తన పెళ్లికి పరమార్ధం ఇదా అనుకుంటూ దిండులో తలదాచుకుంటూ ఏడిచేది.. ఆ నిశీధి రాత్రులలో ఆమె మూగ ఆవేదనను వినేదెవరు?..


ఒకరోజు ఒంట్లో నలతగా ఉండి ఏడాది పసిపిల్ల వకుళని పక్కలో పెట్టుకుని నిద్రపోతోంది..


ఆకొన్న సింహలా తిరిగాడు పరమేశ్వరం.. " రాధా!" అని గర్జిస్తున్నట్లుగా పిలిచాడు.. ఒణికిపోతూ భయంతో ముడుచుకు పోయింది.. అతని పైశాచిక ప్రవర్తన రాధ కు భరింపరాని చీదర జుగుప్స కలిగేది.. మరో మగబిడ్డ కు జన్మనిచ్చింది..


పరమేశ్వరానికి ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం దగ్గు వచ్చేది.. డాక్టర్ టి..బి.. అనిచెప్పాడు.. అతనికున్న చెడు వ్యసనాలు, సరైన వైద్యం చేయించుకోకపోవడంతోజబ్బు ముదిరిపోయి మూడునెలలో శాశ్వతంగా రాధమ్మ జీవితంనుండి వీడ్కోలు తీసుకున్నాడు..


పదహారు సంవత్సరాలకే రాధమ్మ నుదుట కుంకుమ చెరిగిపోయి ఇద్దరు పసిబిడ్డలతో పుట్టినింట చేరింది.. అప్పటికే రాధమ్మ తండ్రి చనిపోతే ఏ ఆధారంలేని తల్లి తన ఇద్దరి మగబిడ్డలతో అన్నగారి పంచన చేరింది.. రాధమ్మ కూడా మేనమామ పంచన చేరక తప్పలేదు.. అతను పెద్ద ఆస్తిపరుడు కాకపోయినా లౌక్యం తెలిసిన మనిషి.. సమాజంలోని దొంగ పెద్ద మనుషులకు ప్రతీక… మాయమాటలతో పబ్బం గడుపుకునేవాడు… అతని ప్రయోజనం కోసం ఇతరులకు కష్టపెట్టడానికి కూడా వెనుకాడడు..


తాను చేసే ప్రతీ పని అన్యాయం అని తెలిసినా చేస్తాడు… ఎవరినైనా నవ్వించి, ఏడిపించి, భయపెట్టి తన దారిలోకి తెచ్చుకునే లౌక్యుడు. ఏవేవే బ్రోకర్ వ్యవహారాలు నడుపుతూ బాగానే డబ్బు కూడబెట్టాడు.. చెల్లెలు, చెల్లెలు బిడ్డలే కాకుండా, విధవరాలైన మేనకోడలు కూడా తన ఇంటిని ఆశ్రయించడంతో ఆయన ఎత్తిపొడుపుమాటలు, దెప్పుళ్లతో రోజూ నరకాన్ని చవిచూస్తున్నారు.. ఇంటి చాకిరీ అంతా రాధమ్మ మీద పడింది.. తెల్లవారుఝామున నాలుగింటికే లేచి యంత్రంలా పనిచేస్తూ రాత్రి పదకొండుగంటలకుగానీ పడుకునే అవకాశం ఉండేదికాదు..


రాధమ్మా, తల్లీ కలసి విస్తరాకులు కుట్టి, అప్పడాలు, ఒడియాలూ పెట్టి అమ్ముతూ, తెలుసున్నవారింట్లో వంటలు చేస్తూ, తృణమో ఫణమో సంపాదిస్తూ మేనమామ గిరీశం చేతిలో పెట్టేవారు.. రాధమ్మ వకుళను స్కూల్ లో వేసింది.. ఆ విషయంలో గిరీశం పెద్ద రాధ్దాంతం చేస్తే, రాధ ట్రంకు పెట్టిలో దాచుకున్న పసుపుతాడికి ముడేసివున్న తన మంగళసూత్రాలను అతనిచేతిలో పెట్టేసరికి కిమ్మనకుండా నోరు మూసుకున్నాడు..

చురుకుగా ఉండే వకుళ చదువులో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ పదోక్లాస్ పాస్ అయింది.. రాధమ్మ తల్లి చనిపోవడం, తమ్ముళ్లు ఏవో చిన్న చిన్న పనులలో స్థిరపడి వివాహాలు చేసుకుని తమదారి తాము చూసుకున్నారు..

వకుళ పెద్ద చదువులు చదవాలని అలమటించిపోతోంది.. తల్లి తో తన కోరిక చెప్పింది.. రాధమ్మ భయపడుతూనే మామయ్యను అడిగింది, ‘వకుళను పై చదువులు చదివిస్తే దానికాళ్లమీద అది నిలబడగలద’ని.


అక్కడే ఉన్న అత్తయ్య గుండెలు బాదుకుంటూ, " ఏమిటీ ఇంకా చదువుతుందా నీ కూతురు? మేమేమీ మహారాజులం కాదు. చదివి ఎవరిని ఉధ్దరించాలిట.. ఎప్పటికైనా పెళ్లిచేయాలికదా.. అదొక తద్దినం ఉండనే ఉంది మాకు.. ఏదో సంబంధం చూసి పెళ్లిచేసేయాలని నేనూ మీ మామయ్యా అనుకుంటున్నాం.. కోరికలకైనా అంతుండా”లంటూ దుమ్మెత్తిపోసింది.


పదహారేళ్ల వకుళకు భార్యపోయిన శేషాచలంతో పెళ్లి కుదిర్చాడు గిరీశం.. "వద్దన్నయ్యా నా కూతురికి వయస్సు మళ్లిన వ్యక్తితో.. అందులో రెండవ పెళ్లివాడితో వివాహం చేయడం న్యాయమేనా? నీవు పోషించక పోయినా ఫరవాలేదు, బయటకు వెళ్లిపోతాం. ఈ పెళ్లి ఆప”మని కాళ్లావేళ్లా పడ్డా గిరీశం వినలేదు.


“తర తరాలు అనుభవించే ఆస్తి, లంకంత కొంప ఉన్నాయి.. వయస్సు ముఖ్యంకాదు.. నీ పరిస్తితి ఏమైందే రాధమ్మా? భర్త చనిపోతే చేతిలో కాణీలేక నా పంచన చేరావు.. డబ్బుకున్న విలువ ముందు అన్నీ కనుమరుగౌతాయి.. నేను మంచివాడిని కాబట్టి చేరదీసి నీకూతురుని పదోక్లాస్ వరకూ చదివించాను.. లేకపోతే మీరందరూ రోడ్డుమీద బిచ్చమెత్తుకునేవారు.. లోకం నన్ను ఆడిపోసుకునేది.. మేనమామ ఉన్నా చేరదీయలేదంటూ.. నేను మాటిచ్చేసాను.. తాంబూలాలు పుచ్చుకోవడం కూడా అయిపోయింది.. పదిహేనురోజుల్లో ముహూర్తం కూడా పెట్టించేసాను, పెళ్లికి నీ కూతురిని సిధ్దం చేయ”మంటూ హెచ్చరించి మరీ వెళ్లిపోయాడు..


అప్పట్లో కన్యాశుల్కాలు ఉండేవి.. గిరీశం లౌక్యుడు కాబట్టి శేషాచలం దగ్గర బాగానే డబ్బు గుంజాడు.. పైగా బంగారపు బొమ్మలాంటి వకుళను ఆయన చేతిలో పెడ్తున్నందుకు తన పేర ఐదు ఎకరాల పొలం ఇచ్చేటట్లు వాగ్దానం చేయించుకున్నాడు.. వకుళ తల్లీ, తమ్ముడి బాధ్యత తనదే కాబట్టి ఆ మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేసేసరికి శేషాచలం సరేనన్నడు..


ఈ మూఢాచారాలలో బలి అవుతున్నది మాత్రం వకుళ లాంటి ముక్కుపచ్చలారని పసిపిల్లలే.. వకుళను ఆదుకునేదెవరు?


ఎవరి ఇష్టాఅయిష్టాలతో ప్రమేయం లేకుండా వకుళ వివాహం ఏభై అయిదేళ్ల శేషాచలంతో జరిగిపోవడం, అత్తవారింటికి రావడం జరిగిపోయింది.. శేషాచలానికి ఇరవై సంవత్సరాలు నిండి పెళ్లై పిల్లలతో సంసారం చేసుకునే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు..

వయస్సు మళ్లిన వాడైనా శేషాచలం మనసున్న వ్యక్తి.. దైవభక్తికలవాడు.. జాతకాలు, అదృష్టాలు పట్ల పిచ్చినమ్మకం.. తన జాతకంలో ద్వితీయ వివాహం రాసిపెట్టి ఉందని, అదీ పదహారేళ్ల బాలికతో అన్నది ఎవరో జ్యోతిష్యపండితుడు చెప్పాడుట. ఆ బాలికతో వివాహం అతని జీవితంలో గొప్ప గొప్ప పనులుచేసే భాగ్యం కలుగుతుందని, ఆ అమ్మాయి రాకతో తన ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని చెప్పడంతో వివేకం కాకపోయినా ఆశపడ్డాడు..


వకుళ బంగారపు బొమ్మేకాదు, సౌమ్యురాలు.. ఆ లేత ముఖంలో సిరులు కురిపించే చిరునవ్వులు.. తన అదృష్టం అంతేనని, తన కన్నతల్లికి తాను బరువుకాకూడదని భావించి మౌనం వహించింది..అప్పట్లో స్త్రీలు స్వతంత్రంగా బయటకు వచ్చి జీవించలేని రోజులు.. వకుళ రావడంతో ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది..


అంత చిన్నపిల్ల ని ఏమని పిలనాలో అర్ధంకాలేదు శేషాచలం కూతుళ్లకు.. దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నారు.. మా నాన్న చెడ్జవాడుకాదు.. హాయిగా సంతోషంగా ఉండు వకుళా అంటూ పదే పదే ధైర్యం చెప్పి వెళ్లిపోయారు..


మొదటి రోజు రాత్రే శేషాచలం వకుళతో " నిన్ను పెళ్లిచేసుకున్నానని కినుకగా ఉందా వకుళా" ? నీతో భార్యగా కాపురం చేయాలని కాదు.. ఐహికపరమైన సుఖాలపట్ల వ్యామోహం లేదు నాకు.. కానీ కొన్ని మూఢనమ్మకాలను నమ్ముతాను.. నా జీవితంలోకి నీలాంటి అమ్మాయి వస్తుందని ముందే తెలుసునాకు.. అది ఎవరూ తప్పించలేని ఒక ఘటన.. నీవు ఇక్కడ స్వతంత్రంగా నిర్భయంగా ఉండచ్చు.. నీకు పై చదువులు చదవాలనే కోరిక ఉండేదని ఎవరో చెప్పారు.. ప్రైవేటుగా చదివిస్తాను..ఎంతైనా చదువుకో.. నీకు ఏదికావాలన్నా నా దగ్గర మొహమాటపడ”కంటూ ఎంతో ప్రేమగా మాట్లాడాడు..


వకుళ మనసు సంతోషంతో పురివిప్పిన నెమలిలా నాట్యమాడసాగింది.. శేషాచలం పై విపరీతమైన గౌరవం కలిగింది.. ఆయనకు అన్ని వేళలా అన్నీ అమరుస్తూ ఆయనను నీడలా కనిపెట్టుకుంటూ తను చదువుకుంటూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఆరిందలా తయారైంది.. ప్రశాంతమైన వాతావరణం, చీకూచింతాలేని జీవితం, తనను ప్రేమగా చూసుకునే భర్త సాంగత్యంలో వకుళ అందం మరింత ఇనుమడించింది.. వారింటి తోటలో ఆనందంతో పక్షుల కిల కిల రావాలు ఆ ఇంటికి మరింత శోభనిస్తున్నాయి..


గిరీశం పెళ్లికి ముందు అనుకున్న అయిదెకాల పొలం తన పేరుమీద రిజిష్టర్ చేయమంటూ, అడపాదడపా వకుళ తల్లి, తమ్ముడి పోషణ నిమిత్తార్ధమై డబ్బు కోసం శేషాచలం ఇంటికి రావడం జరుగుతోంది.. శేషాచలం గిరీశం అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ ఉండేవాడు.. ఒకరోజు ఆ సందర్భంలోనే శేషాచలం ఇంటికి వచ్చేసరికి వకుళ, శేషాచలంగారి బట్టతలకు కొబ్బరినూనె మర్దనా చేస్తూ సున్నితంగా ఆమె అందమైన వేళ్లను ఆ బట్టతలమీద నాట్యమాడిస్తోంది. అంతకముందే పూజముగించుకుని వచ్చిన శేషాచలం నుదిటిమీద కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలతో అతని ముఖం ఒక అనిర్వచనీయమైన కాంతితో మెరిసిపోతోంది..


వకుళ చిలిపిగా శేషాచలంతో ఏదో అనడం, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండడం చూసిన గిరీశం " అబ్బో ముసలిమొగుడితో బాగానే సరాగాలు ఆడుతోందే ఈ వకుళ", మొదట్లో ముసలాడిని పెళ్లిచేసుకోనంటూ తెగ విర్రవీగింది.. ఇప్పుడు వీడి ఆస్తి ఐశ్వర్యం చూసి మైకం కమ్మేసినట్లుంది.. బాగున్నపుడే వీరిని బుట్టలో పడేసి నాలుగు డబ్బులు గుంజుకోవాలి.. అతని బుర్రలో రక రకాల ప్రణాళికలు రూపుదిద్దుకోసాగాయి..


" ఏమోయ్ గురీశం, ఏమిటీ ఇంతపొద్దున్నే విచ్చేసావు??


గిరీశం నీళ్లు నములుతూ “మీకు తెలియనిదేముంది.. పొలం రిజిష్ట్రేషన్ కు ఎల్లుండి మంచిరోజుట.. అది చెప్పి వెడదామని వచ్చాను.. అలాగే కొంతం పైకం కూడా కావాలి.. ఇంట్లో నా చెల్లెలి కుటుంబ పోషణ ఖర్చులు బాగా పెరిగిపోయాయి..”


“ఇకనుండి కాణీ కూడా ఇచ్చేది లేదు గిరీశం.. ఆ అయిదెకరాలపొలం కూడా వకుళ తల్లి గారి పేరుమీద వ్రాసి రిజిస్ట్రేషన్ చేయించే పనిలో ఉన్నాను.. పాపం వాళ్ల పోషణ బాధ్యత ఇంకా నీకెందుకు చెప్పు? వకుళ తమ్ముడిని పట్టణం పంపించి పెద్ద చదువులు చదివించాలని అనుకుంటున్నాను..


ఇక్కడే బాలవితంతవులకు ఒక సేవాసదనం నిర్మించి వాళ్లకు అనేక రకాల వృత్తుల్లో శిక్షణ ఇప్పించి వారు స్వతంత్రంగా ఆర్ధికంగా వాళ్లకాళ్లమీద నిలబడేటట్లు చేయాలని నేను వకుళా నిర్ణయించుకున్నాం.. అలాగే ఒక ట్రస్టను ఏర్పరచి బీద విద్యార్ధులకు చదువులకోసం ఖర్చుచేయాలనుకుంటున్నాం..


వేద పాఠశాలను నిర్మించి బీద బ్రాహ్మణ విద్యార్ధులకు శిక్షణ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం.. ఆ ట్రస్టులను వకుళే చూసుకుంటుంది.. వకుళ అమ్మగారు సేవాసదనం చూసుకుంటారు.. ఇంక నీవు వెళ్లచ్చోయ్ గిరీశం.. ఇంతవరకూ వకుళ కుటుంబానికి నీవు చేసిన సాయం చా”లంటూ ఆయన లోపలకు వెళ్లేందుకు లేచారు..


గిరీశం ముఖం నల్లగా కమిలిపోయింది.. తన లౌక్యం ఇంక అక్కడ పనిచేయదనుకుంటూ మరొకరిని బుట్టలో పడేసి తన పబ్బం గడుపుకునేందుకు ఆయత్తమైనాడు..ఈ సమాజంలో గిరీశం లాంటి వ్యక్తులు మన చుట్టూనే ఉంటూ అనేక విషయాలలో బ్రోకర్లుగా వ్యవహరిస్తూ మనలని నమ్మించి మోసంచేస్తూ తమ పబ్బం గడుపుకుంటారు. అందుకే తగిన సమయంలో జాగ్రత్తగా ఉండాలన్న సందేశం..

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.




62 views0 comments
bottom of page