top of page

చెట్టు వదలి ఎగిరి పోయిన భేతాళుడు


'Chettu Vadali Egiri Poyina Bhetaludu' written by Ayyagari Bala Thripura Sundari

రచన : అయ్యగారి బాల త్రిపుర సుందరి

పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పటి వలెనే చెట్టు వద్దకు వెళ్ళగా, బేతాళుడు ఇలా అన్నాడు.

“ఓ విక్రమార్క మహారాజా! సావధానంగా విను! ముందుగా ఇక్కడ వున్న ఈ స్టెరిలైజ్డ్ మాస్కును నీ ముక్కు, మూతి కవర్ అయ్యేలాగ ముఖానికి తగిలించుకో! ఈ శానిటైజరుతో నీ చేతులు రెండు శుభ్రం చేసుకొని, ఈ స్టెరిలైజ్డ్ గ్లౌవ్సును చేతులకు తొడుక్కుని నీ పని మొదలుపెట్టు. నాకూ,ఈ శవానికీ ఉన్న మాస్కులను చూడు. ప్రస్తుత కరోనా విపత్కాలంలో ఇవి జాగ్రత్తలు!!!”

విక్రమార్కుడు అలాగే చేసి, చెట్టు ఎక్కి శవాన్ని కిందకు దించగానే ఆ శవం విక్రమార్కుని భుజంపై భౌతికదూరానికి సరిపడే ఎత్తులో అమరుకొని అతనితో పాటుగా సాగింది. అంతకు పైన సుమారు అంతే ఎత్తులో బేతాళుడు ఎగురుతూ కథను చెప్పబోయాడు. బేతాళుణ్ణి ఆగమని, విక్రమార్కుడు.,

“ఓ బేతాళా! ఇంతకాలంగా నువ్వు కథలు చెపుతూ ప్రశ్నలు అడుగుతూనే వున్నావు; నేను సరియైన సమాధానాలు చెపుతూ వచ్చాను. ఈ ఒక్కసారికి నా వంతుగా నేను నిన్ను, నీకు తెలిసిన వాటిపైననే ప్రశ్నలు వేస్తాను. నువ్వు మాత్రం ఖచ్చితంగా సరియైన సమాధానాలు చెప్పి తీరాల్సిందే!!! అలా నువ్వు చెప్పగలిగితే, నేను జీవితాంతం ఈ పనిని చేస్తూనే వుంటాను. నువ్వు జవాబులు చెప్పలేకపోతే., ఖేల్ ఖతం, దుకాణ్ బంద్!!!”

బేతాళుడు సరేనన్నాడు.

విక్రమార్కుడు ఇలాగ అన్నాడు:

“ఓ బేతాళా! నువ్వు వివిధ టివి ఛానళ్ళలో వచ్చే సీరియల్సును చూస్తున్నావు కదా!”

ఔనన్నాడు బేతాళుడు.

“సరే! ఐతే, నా ప్రశ్నలను సావధానంగా విని, సరియైన సమాధానాలను చెప్పాలి. విను మరి.

ప్రస్తుతానికి తెలుగు సీరియళ్ళ గురించి అడుగుతున్నాను.

1. అభిపురం, అంతష్షేకం, మనసు-మాయ ఇత్యాది సీరియల్సు ఎప్పుడు పూర్తి ఔతాయి?

2. “నీ పేరు వామాక్షి” సీరియల్ లో చివరికి వామాక్షి కథ సుఖాంతం ఔతుందా? ఇది ఎప్పుడు పూర్తి ఔతుంది?

3. “కాటుక దీపం” సీరియల్ లో కాశ్యప్, ప్రదీప్తి దంపతులు కలిసి జీవిస్తారా? ఎప్పుడు?

3. “వాణీపరిణయం” సీరియల్ లో వీరవీర మలుపులు పూర్తయి, ఎప్పుడు ముగుస్తుంది?

4. “కుంకుడుపుష్పం” సీరియల్ ఎప్పుడు ముగుస్తుంది? అందులోని హీరోయిన్ అనామిత కథ సుఖాంతం ఔతుందా?

ఇంకా, ... ... ... “

“ఆపండి మహారాజా!” బేతాళుడు పిచ్చెక్కిన వాడిలా అరచి, “ఇప్పటికే తమరు అడిగిన ప్రశ్నలకు జవాబులు వెదకి చెప్పడానికి ఈ కల్పం సరిపోదు., ... ... ... “

అని పలికి, బేతాళుడు, జుత్తంతా పీక్కుంటూ వెర్రెక్కి పోయి గెంతుతూ వూగి వూగి, ఆగి, నీరసపడిపోతూ ఇలాగ అన్నాడు:

“మహారాజా! నావల్ల కాదు, వీటికి జవాబులు చెప్పడం. నేనేమిటి, అందరి తలరాతలు వ్రాసే ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. వీటి స్క్రిప్టులు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం మా ఇద్దరి వల్లను కూడా వీలుకాదు. దండాలు సామీ! ఖేల్ ఖతమ్! దుకాణ్ బంద్!”

అలా చెప్పి, మరి ఏ మాత్రం కనబడకుండా మాయమయ్యాడు.

ఆ శవం కూడా ఒక్కసారిగా ఆనందంగా, హాయిగా నవ్వి మాయమైంది.

విక్రమార్కుడు హమ్మయ్య అని అనుకుంటూ, ఆనందంగా తన రాజ్యానికి వెళ్ళాడు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.





142 views0 comments
bottom of page