top of page

చేయూత


Cheyutha written by Kamaladevi Puranapanda

రచన : కమలాదేవి పురాణపండ

రామచంద్రరావు బ్యాంకు మేనేజరుగా రిటైర్ అయి

భార్యతో కలిసి స్వగ్రామం చేరాడు. తండ్రి కట్టించిన

ఆ ఇల్లంటే ఆయనకు చాలా ఇష్టం.

అదే ఊళ్లో ఉన్న మామయ్య...పినతండ్రి...వీళ్ళ పిల్లలతోను...స్నేహితులతోను కలిసి మెలిసి ఆడిన ఆటలు, అల్లరి...ఆ ఇంట్లో అడుగు పెట్టగానే గుర్తుకొచ్చి, ఆయనకు కళ్ళు ఆనందంతో చమర్చాయి.

చదువయ్యి జాబ్ లో చేరాక ట్రాన్స్ఫర్ లతో అనేక ఊళ్ళు తిరిగినా జన్మస్థలం...జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవలేదతను.

చివరి రోజుల్లో తల్లిదండ్రులను తన దగ్గరకే రమ్మని

చూశాడు తప్ప...ఆస్తి పంచుకున్నట్లుగా...తల్లిదండ్రులను కూడ ఆరునెలలు తను, మరో ఆరునెలలు తమ్ముడు చూడాలి అనే పంపకాలు పెట్టుకోలేదు.

కృష్ణమూర్తి కూడ ఇతని స్వభావానికి విరుద్ధం యేమీ కాదు. పెద్ద కొడుకుగా ఈ బాధ్యత నాదేనన్న...అన్నయ్య మాటను కాదనలేదు అతను. అప్పుడప్పుడు భార్యాపిల్లలతో కలిసి అన్నగారింటికి వచ్చి చూసివెళ్తూండేవాడు.

రామచంద్రరావు భార్య సావిత్రి...కృష్ణమూర్తి భార్య స్వప్న... తోడికోడళ్ళిద్దరూ ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా...చక్కగా అక్కచెల్లెళ్ళలా కలిసిపోయారు.

తల్లిదండ్రులిద్దరూ కాలంచేశాక ఉన్న కొద్దిపాటి ఆస్తి పంపకాల్లో...ఇల్లు రామచంద్రరావు తీసుకుంటే...

స్థలం కృష్ణ మూర్తి తీసుకున్నాడు.

ఆతరువాత కాలంలో స్థలాన్ని అమ్మేసి తను జాబ్ చేసే చోట ఇల్లు కొనుక్కున్నాడు అతను.

రామచంద్రరావు కొడుకులిద్దరు సాప్ట్వేర్ ఇంజనీర్లు. అమెరికాలో స్థిరపడ్డారు. పెద్దకొడుకు ఆదిత్య,రెండవవాడు శశికాంత్. రామచంద్రరావుకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం.

ఆదిత్య పుట్టిన రెండు సంవత్సరాల తరువాత...భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల పుట్టిందనే వార్త కోసం ఎదురుచూస్తోన్న ఆయన ఆశ ఆశగానే మిగిలిపోయింది.

మనవరాలైనా పుడుతుందేమో అనుకుంటే, కొడుకులిద్దరికీ కూడ మగపిల్లలే కలిగే సరికి నిరుత్సాహం అనిపించింది ఆయనకు.

జాబ్ లో నుండగా బ్యాంకు వారిచ్చిన 'లోను' తీసుకుని కట్టించిన... ఇళ్లు రెండూ... కొడుకు లిద్దరి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు.

స్వగ్రామం చేరిన ఆయన రెండు రోజులు రెస్ట్ తీసుకుని

ఊళ్లో తెలిసిన వారు ఎవరున్నారా...?అని వాకబు చేశారు.

తనతో కలిసి చదివిన వారు, పరిచయస్థులు...కొందరు కాలంచేస్తే...మరికొందరు కొడుకుల దగ్గరకు వెళ్ళిపోయారని తెలిసింది.

ఇరగుపొరుగూ కొత్తవారే! తాము ఉండే రోజుల్లో ఉన్నవారు ఇళ్ళమ్ముకుని వెళ్లి పోయారు.

ఊరు, ఇల్లు పాతవే... అయినా పరిచయాలు కొత్తవి.

రోజూ సాయంత్రం దగ్గరలో నున్న రామాలయం వద్ద తనలాగే రిటైర్ అయిన, ఉద్యోగులతో చేరి ఏవో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం...పిల్లలు రెండుమూడేళ్ళకో సారి వచ్చిపోవడం...హాయిగా గడిచిపోతోంది కాలం.

పదిహేను సంవత్సరాలు చూస్తూండగా ఇట్టే వెళ్ళిపోయాయి.

రాత్రి నిద్రించిన సావిత్రి తెల్లవారి బాగా పొద్దెక్కినా లేవకపోతే తట్టిలేపిన రామచంద్రరావుకు అర్థమయింది ఆవిడ ఇక లేదని... లేవలేదని.

తల్లి పోయినప్పుడు, భార్యాపిల్లలతో వచ్చిన కొడుకులిద్దరు, "తమతో వచ్చేయమని" అన్నారు తండ్రిని. కాని...

"మరీ ఒంటరిగా ఉండలేకపోతే అప్పుడు చూద్దాం...

ప్రస్తుతం రానని" అన్నారాయన.

వంట మనిషిని కుదిర్చి...చుట్టుపక్కల వారితో కాస్త చూస్తూండమని చెప్పి వెళ్ళారు ఆదిత్య, శశికాంత్.

ఏకాకిగా మిగిలిన ఆయనకు భార్య జ్ఞాపకాలు తరచు

బాధ కలిగించేవి. బాగా కృంగిపోయారు.

చేతి కర్ర సాయంతో రోజూలానే ఆరోజూ రామాలయానికి

వెళ్లి తిరిగి వస్తున్న ఆయన, కళ్ళు తిరిగి తూలి పడబోతుంటే చిన్నారి హస్తం ఒకటి చేయందించి ఆపింది.

"తాతగారూ ఇంటికి తోడురానా!" అడిగింది. జవాబు కోసం ఎదురు చూడకుండా ఆయన చేతిలో కర్ర తను తీసుకుని అందించిన తన చేయి వదలని ఆయనను ఇంటికి తీసుకు వచ్చింది.

తలుపు తాళంతీసి, లోపలకు తీసుకువచ్చి, సోఫాలో కూర్చోపెట్టాక, అప్పుడు అడిగాడాయన ఆ పదేళ్ల చిన్నారిని.

"పాపా ఎవరమ్మా నీవు...?మా ఇల్లు ఎలా తెలుసును? అక్కడ ఎందుకున్నావు?" అని

"నేను మీ ఇంట్లో పనిచేసే నాగమ్మ కూతురు చిట్టిని తాతగారూ...! రామాలయం లోపల, బయట తుడిచే పనిచేస్తూంటా!" అంది.

"చదువు కోవడం లేదా?!" అని అడిగితే తండ్రి పోయాడని... నాలుగిళ్ళల్లో పనిచేస్తున్న తల్లికి సాయంగా తనుకూడ వెళ్తుంటానని చెప్పింది.

ఆలోచించి రామచంద్రరావు ఒక నిర్ణయానికొచ్చాడు.

ఇంటికి పెరట్లో వంటషెడ్డు ఉంది. తండ్రి కాలం నుంచి ఉన్న దాన్ని పడగొట్టడమెందుకని అలాగే ఉంచారు. ఇప్పుడు ఆ తల్లీ కూతుళ్ళను అందులో ఉండమన్నాడు.

చిట్టి ఇప్పుడు స్కూలుకు వెళ్తోంది. స్కూలునుంచి వచ్చాక చిట్టి చెప్పే కబుర్లతో రామచంద్రరావుకి మనవరాలు లేని లోటు తీరింది.

***


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


26 views0 comments

Comments


bottom of page