'Chilipi Kalala Chigurasa' written by Sathya Kamarushi
రచన : సత్య కామఋషి
అది సాయం సందె వేళ ఏమీ కాదు......అయినా అప్పుడే చీకట్లు కమ్ముకుంటునట్టుంది సమయం. సూరీడు కొంచెం బద్దకంగా అనిపిస్తూ, కరిమబ్బు తెరలను కప్పుకుని దోబూచులాడుతున్నాడు.
వాతావరణాన్ని గమనించుకుని, తొందరగా పొలం పని ముగుంచుకుని బయటపడదాం అనుకుంటూ హడావిడి పడుతోంది అలివేలు. ఈ లోగా పట్నం వెళ్లి తిరిగొస్తూ అలా పొలం గట్టు వెంబడి నడుచుకుంటూవెళ్తూ కనపడ్డాడు వెంకన్న.
"ఓయ్, బావా...'అంటూ గట్టిగా పిలిచింది. అది విని అయోమయంగా అటూ ఇటూ తిరిగి చూసాడు వెంకన్న, ఎవరా పిలుస్తున్నారు అన్నట్టుగా. అది గమనించి, ఇంకొంచెం గట్టిగా, "ఓయ్, బావా...ఇటు, ఇక్కడ, నేను అలివేలు" అంటూ చెయ్యి ఊపుతూ అరవసాగింది.
వెంకన్న కనుక్కోని, "అలివేలూ..ఏంటి ?" అన్నట్టుగా సైగ చేసాడు ,అటువైపుగా అడుగులు వేస్తూ.
అలివేలు : బావా, ఇంటికే గదా పోతున్నావ్..,?
వెంకన్న : ఆ.. అవును ...ఏ...?
అలివేలు : అయితే ఉండు బావా, నా పని కూడా అయిపోనాది, నేనూ కూడా వచ్చేత్తాను,కూసింత తోడుగా ఉంటావ్, అసలే వర్షం కుమ్మరించేలా ఉంది.
వెంకన్న : సరే అయితే, తొరగా కానీ మరి..అంటూ
అలా నిలబడి చూడసాగాడు..
అలివేలు చకచకా కదులుతూ పని చక్కపెడుతోంది. ఈలోగా , వర్షం మొదలైపోయింది..రావడం రావడమే జోరుగా కురుస్తూ. 'అయ్యో రామా..! అనుకుంటూనే ఉన్నా, అప్పుడే మొదలైపోయిందా..!, ఏమి వర్షమో, ఏళాపాళా లేకుండా' అంటూ విసుక్కుంటూనే పనిని సర్దుకుంటోంది అలివేలు. చూస్తూండగానే తడిసి ముద్దయిపోయింది.
అక్కడే నిలబడ్డ వెంకన్న కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయాడు. కానీ అదేమి పట్టనట్టుగా, ఏదో తన్మయత్వంలో అలా నిలబడిపోయాడు. అలివేలు, ఒక పాతికేళ్ల పడుచు, మంచి ముఖ వర్చస్సు , అంగ సౌష్టవంతో తల తిప్పుకోలేనంత అందం తన సొంతం.పూర్తిగా తడిసిన, ఉండీ లేనట్టున్న కోక రయికలతో అంతటి అందాన్ని కన్నార్పకుండా చూస్తూ, గుటకలు మింగుతూ అలా బొమ్మలా నిలబడిపోయాడు.
అలివేలు వచ్చి, "బావా, వెళ్దామా" అని రెండుమూడు సార్లు అడిగినా వినబడనంతటి తన్మయంలో.
"బావా, ఓయ్ బావా, ఏ లోకంలో ఉన్నావు..?"అంటూ గట్టిగా పట్టుకుని కుదిపి వెంకన్నను మళ్లీ ఈ లోకంలోకి తీసుకొచ్చి ," పద బాబూ పోదాం....భలే వాడివేలే" అంది..ముసిముసిగా నవ్వుకుంటూ.
ఇద్దరూ కలిసి అలా నడవసాగారు. వెంకన్న మాత్రం అలివేలు నుండి చూపు మరల్చలేక పోతున్నాడు, కానీ మళ్లీ తను ఏమనుకుంటుందో అనుకుంటూ దొంగచూపులు చూస్తూ. అలివేలు గమనిస్తూనే ఉంది అతని చూపులని.,పడుతున్న ఇబ్బందినీ,తనలో ఏదో తెలియని పులకింతకు సిగ్గుల మొగ్గవుతూ మద్య మద్యలో అనుకోని స్పర్శలతో ఒళ్ళు జల్లుమంటూంటే.. పెదవులు అదురుతున్నాయి, కళ్ళల్లో ఏదో మత్తు కమ్ముకుంటోంది. ఒకరికి తెలియకుండా ఒకరు,ఆ పారవశ్యతను ఆస్వాదిస్తూ ముందుకు సాగారు.
అనుకోకుండా హఠాత్తుగా, పెద్దగా గర్జిస్తూ నింగి గట్టిగా ఉరిమింది,ఎక్కడో పిడుగు పడినట్టుగా..ఉలిక్కిపడిన అలివేలు , భయంతో వెంకన్నను గట్టిగా హత్తుకుంది. ఇద్దరి శరీరాలు గాఢంగా దగ్గరగా పెనవేసుకుపోయాయి, ఊపిరి కూడా వారి మధ్యలో చొరబడ లేనంతగా. తన బిగి కౌగిలిలో బంధీయైన అలివేలుని ఇంకా దగ్గరకు తీసుకుంటూ వెంకన్న, ఆమె ముఖాన్ని చేతులలోకి తీసుకుని నెమ్మదిగా తన పెదవులను ఆమె పెదవులకు దగ్గరగా తీసుకు వస్తూ..,
'వద్దు బావా, తప్పు...వద్దు..'అంటూ..
ఉలిక్కిపడి లేచి కూర్చుంది అలివేలు. నిద్ర మత్తంతా దెబ్బకు వదిలిపోయి..అయోమయంగా అటూ ఇటూ చూసుకుంది, తికమక పడిపోతూ., ఇదంతా కలా..!, అనుకుంటూ. తెల్లవారు ఝామున వచ్చిన కలలు నిజమవుతాయట..,ఛీ పాడు, అనుకుంటూ,ముఖాన్ని చేతుల్లో దాచేసుకుని తెగ సిగ్గు పడిపోతూ, దిక్కులు చూస్తూ, ఎక్కడున్నాడో, ఏమి చేస్తున్నాడో,నా బావ..? అనుకుంటూ లేచి, పనిలో పడింది.
అలివేలు ఎన్నో కష్టాలు ఓర్చి అమ్మ నాన్న లేక పోయినా తమ్ముడు చదువు ,చెల్లెలు పెళ్లి బాధ్యతలు తీర్చుకొని సంక్రాంతి తర్వాత వరసైన బావతో మనువుకి సిద్ధమై కొత్త జీవితానికి స్వాగతం పలకడానికి ఎదురుచూస్తూ….కలలతో కాలం గడుపుతూ ఉంది..
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత పరిచయం :
పేరు : సత్య కామఋషి ఊరు : విశాఖపట్టణం
ఇప్పుడిప్పుడే అక్షర ప్రయాణంలో ఓనమాలు దిద్దుతున్నాను. కవితలు వ్రాయడంలో కొంత అనుభవం వచ్చింది కానీ..కథలు వ్రాయడంలో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవలసి ఉంది. ఏదో ప్రయత్నంగా ఇప్పుడు ఇక్కడ ఈ పోస్ట్ పెట్టడం
జరిగింది.
Comments