top of page

చిలిపి తాతయ్య

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Chilipi Thathayya' Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

మనవడి కొంటెతనం,

తాతయ్య చిలిపితనం,

కాబోయే మనవరాలి పంతం...

అన్నీ కలిపి ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు వండిన కథ చదవండి.

ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాంసాయంత్రపు వాహ్యాళికి తయారై రమణయ్య గారు నెమ్మదిగా మేడ దిగి హాల్లోకి

వచ్చారు.

"సమయానికి వచ్చావు తాతయ్యా! నువ్వు కూర్చో" అని ఆయనను ఒక కుర్చీలో కూర్చోబెట్టి , అక్కడ టేబుల్‌ మీద తినబండారాలున్న ఒక ప్లేటు తెచ్చి ' ఈ ప్లేటుఖాళీ చేసి కాఫీ తాగి వెళ్ళు' అంటూ అందించబోయాడు మనుమడు వివేక్‌.

' తాతయ్యా! అన్నీ నీకిష్టమైన పిండివంటలే. లాగించేసి వాకింగ్‌ కు హుషారుగా వెళ్ళొచ్చు" అంది గారాలు పోతూ మనవరాలు ప్రమీళ.

హాల్లో వున్న పదిహేనుమంది ప్రమీళ, వివేక్‌ల స్నేహితులు. , స్నేహితురాళ్ళు. తాతగారిని చూడగానే అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ఆయన నవ్వుతూ అందరినీ కూర్చోమని సైగ చేయటంతో వాళ్ళంతా కూర్చున్నారు. ఆ పార్టీ వివేక్‌ పుట్టినరోజుసందర్భంగా జరుగుతున్న చిన్న తేనీటి విందు. అక్కడున్న పిల్లలంతా చుట్టుప్రక్కల కాలనీల పిల్లలే.


ప్లేటు తీసుకోకుండా అందులోకి చూస్తూ " నీ చేతిలోనే ఉండనీ. ఏమేం ఉన్నాయి?

కోవా, బాదుషా, కారబూంది, హల్వా, బిస్కట్లు... అమ్మో! ఇప్పుడు ఇవన్నీ తింటే లేని

కడుపు నొప్పి వస్తుంది. వద్దులే. ప్రొద్దున పాయసం తిని అక్షింతలు వేశాగా. నన్ను వది

లెయ్యండి" అంటూ కుర్చీ లోంచి లేవబోతుంటే " వీల్లేదు. నువ్వు తిని వెళ్ళాల్సిందే. "

అంది ప్రమీళ తాతయ్య తో నవ్వుతూ.


" నేను తీపి ప్రాణి ని ! కదా ఈ హల్వా చాలు" అంటూ రేపర్‌ తీసి హల్వా తినటం మొదలెట్టారాయన.

" నువ్వెంత తీపో చెప్పటానికి నాన్నమ్మ లేదుగా" అంటూ నవ్వాడు వివేక్‌.


అక్కడ ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడే యౌవ్వనంలో అడుగుపెడుతున్న వాళ్ళే కావటంతో , సిగ్గు పడుతూ, ఆడ పిల్లలు మెలికలు తిరుగుతూ సిగ్గులొలుకుతూ ముసి ముసి నవ్వులు నవ్వుకోసాగారు.

" నీ వెదవ అర్థం తీయకు. నాకు తీపి అంటే చాలా ఇష్టం . కొందరికి కారంగా ఉంటే ఇష్టం. లోకోభిన్నరుచిః అన్నారుగా!” అంటూ ఆయన కూడా నవ్వుతూ లేచారు.


"కూర్చో. కాఫీ తాగి వెళ్ళు లే. ఇది పార్టీగా. పరవాలేదు" అన్నాడు వివేక్‌.

" నేను కాఫీ మానేసి ఐదేళ్ళవుతోందని తెలుసుగా, దానినట్లా సాగనీ" అన్నా

రాయన.

" తాగితే వ్రతభంగమేదీ కాదులే తాతయ్యా" అంది ప్రమీళ.

" నాకు వ్రతభంగమేమిటీ కొంటెపిల్లా! రిటైరవ్వగానే పనీపాటలు హడావుడులు ఏమీ లేవు. కాఫీ తాగి యాక్టివ్‌ గా ఉండటానికి ఏమీ పని లేదుగా. అందుకే మానేశా. దాని బదులు పంచదార లేకుండా నాలుగు సార్లు పాలు తాగుతున్నా. షుగర్‌ రాకూడదని. కానీ జిహ్వచాపల్యం యింకా పోలేదు. అందుకే తీపిపదార్థాలు దొరికినప్పుడల్లా లాగించేస్తున్నా. ఇంక కాఫీ సంగతంటే దానికో పట్టుదల , పంతం ఉన్నాయి.”

" ఆ కారణం ఏమిటో చెప్పండి తాతయ్యా! వివేక్‌, ప్రమీళ ఇద్దరూ కూడబలుక్కుని అడిగారు. వాళ్ళ స్నేహితులంతా కూడా ఏమైవుంటుందన్నట్లు , ఆశ్చర్యంగా చూశారు.

" ఐదేళ్ళ క్రిందట కాఫీ మానేస్తానన్నప్పుడు మీ నాన్నమ్మ పోట్లాడింది. తనతో పాటు ప్రక్కన కూర్చుని ప్రొద్దున్నే కాఫీ తాగే చెలికాడిని మరి. అయినా తాగనంటే తాగనన్నా. చివరకు కంపెనీ కోసం తన ప్రక్కన కూర్చుని నేను పాలు తాగేట్టు రాజీ పడ్డాం.

అంతటితో తను ఊర్కోకుండా , ‘ముఖ్యులెవరైనా కాఫీ ఇవ్వబోతే , తాగాల్సి వస్తే మొండిగాను, మూర్ఖంగానూ తిరస్కరించకుండా తీసుకోండి. లేకపోతే వాళ్ళు బాధపడతారు’ అని చెప్పింది. “

' మరి ఇంకేం! దొరికావులే, ఇక తప్పకుండా తాగాల్సిన సందర్భమే' అన్నాడు వివేక్‌

" తొందరపడకురా! నాన్నమ్మ ను అడిగాను. ‘ఇతరులెవ్వరు కాఫీ ఇవ్వబోయినా, తాగటం తప్పనిసరిలా వుంటుంది మరి. యెట్లా?’ అన్నా. ‘ఉదాహరణకో సందర్భం చెబుతా. వివేక్‌ పెళ్ళాం ఇచ్చిందనుకోండి. తీసుకోవాలి. లేకపోతే ఆ పిల్ల మనసు చివుక్కుమంటుంది’ అంది. కాబట్టి నీ భార్య ఇచ్చినప్పుడు మాత్రమే తాగుతా", అన్నారాయన.


“అది ఇప్పుడప్పుడే కాదులే” అంటూ నవ్వుకుంటూ వంకరలు పోయాడు. హాల్లో మిగి

లిన పిల్లలంతా చప్పట్లు చరుస్తూ ఉంటే ఒక్క అమ్మాయి మాత్రము ముసి ముసి నవ్వులు నవ్వుకుంటోంది. ఆ అమ్మాయి ప్రమీళ అత్తకూతురు విరజకు ఫ్రెండ్‌ శాన్వీ.

శాన్వీ అందరిలా నవ్వకుండా చిరునవ్వును సాంతం పంటితో బిగపట్టి ఏదో ఆలోచిస్తోంది. చుట్టరికపు బంధంతో తన అత్తకూతురిని పిలవటానికి వెళ్ళినప్పుడు శాన్వి పరిచయమైంది. శాన్విని కూడా రమ్మనమని మరీ మరీ చెప్పింది.


విరజ శాన్వి తో , అటు తర్వాత ప్రమీళ గురించి చెబుతూ తమ కుటుంబాల్లో ప్రమీళ వాళ్ళది కూడా మంచి. మర్యాద, మన్నన , సాంప్రదాయాలు వున్న ముచ్చటైన కుటుంబం అనీ, వాళ్ళింట్లో అందరూ స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు. చాలాచాలా మంచి వాళ్ళని చెప్పింది.

వివేక్‌ తాతగారు అన్నది విన్నప్పుడు శాన్వికి వెంటనే వాళ్ళను గురించి విరజ చెప్పిన సంగతులు మనసులో వేగంగా దొర్లి , అతని అందం కూడా ఆమెను ఆకట్టుకొనటం వల్ల ఆ కుటుంబంలో తను కూడా ఒక సభ్యురాలైతే చాలా బాగుంటుందనిపించింది . ఆ ఆలోచన రాగానే , తను మంచి సాహసం చేయాలనిపించింది.


M. sc. చదివిన వివేక్‌. రీసెర్చ్‌ కూడా చేస్తున్నాడు. తనను చేపట్టటానికి, తగిన అర్హత తనకున్నాయన్న నమ్మకం, ధైర్యంతో లేచి ముందుకు కదిలింది.

శాన్వి కదలిక చూడగానే , ఆమెకేం కావాలో అడగాలని సహజ మర్యాదతో ప్రమీళ ఆమెను సమీపించే లోపలే , శాన్వి కాఫీ కెటిల్‌ దగ్గరకు వెళ్ళి ఓ కప్పులో కాఫీ పోసి తాతగారికి అందించింది. ఆయన కూడా విస్మయంతో కూడిన చిరునవ్వుతో కప్పు అందుకున్నారు. అందరూ నిర్ఘాంతపోతుంటే, విరజ శాన్వి చేష్టలతో తాతగారికి కోపం రాకుండా చూడాలనీ, శాన్విమీద కేకలేసి , ఆయనను శాంతపరచాలని కంగారుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళింది.

తాతగారు శాన్వితో " నా గురించి ప్రత్యేకంగా వచ్చి ఇచ్చావు. ఈ కాఫీ తాగాలా " అని అడిగారు.

" పిచ్చివేషాలు నువ్వూ! వెనక్కు రావే " అని శాన్వితో అంటూ, తాతగారితో తనకు శాన్వికి గల బంధుత్వం, ఆమె హైదరాబాద్‍ లోనే బిఎస్‌. సి. చదువు తున్న సంగతి చెప్పింది.

" అందుకే తాగాలి తాతగారు, " అంది తాతగారి ప్రశ్నకు వినయంగా శాన్వి చిరునవ్వుతో.

" తాగితే ఫలితం తెలుసుగా తల్లీ!" అన్నారు తాతగారు చిద్విలాసంతో.

ప్రమీళ విరజను పట్టుకుని " చక్కని సరదా కలిగిస్తున్నారిద్దరూ. కూర్చుని చూద్దాం. రావే” అంటూ ఆమెను వెనక్కు తీసుకెళ్ళింది.

" తెలియడానికేముంది, తాతయ్యగారూ- మీ నోరు తీపి అవుతుంది. లోగడ కాఫీ తాగేటప్పటి ఉత్సాహం వస్తుంది. మీ వివేక్‌, ప్రమీళలతో బాటు మేమందరమ సంతోషిస్తాము" అంది చిలిపిగా శాన్వి.

వివేక్‌ శాన్విని చూసి చూడనట్లు దొంగచూపులు చూస్తూ ఆమె అందానికి ముగ్ధుడై ఫిదా అయిపోయాడు.

ప్రమీళ పరిచయం చేసి, శాన్వి తనకు విషెస్‌ చెప్పినప్పుడే ఆమె పట్ల ఆకర్షితుడైనాడు. ఆమె అంటే సదభిప్రాయము, గౌరవము యేర్పడ్డాయి. తాతగారు ఒక కంట మనవడిని కనిపెడుతూ చిరునవ్వుతో కళ్ళెగరేశారు.


" కాఫీ చల్లారిపోతుంది. తాతగారు. తొందరగా తాగండి అంది శాన్వి.

" ఎవరిస్తే తాగాలని మీ నాన్నమ్మ వివరణ రా? అడిగారు తాతగారు వివేక్‌ ను.

" అది ఇప్పుడెందుకు గానీ, ముందర కాఫీ తాగేయ్‌" అన్నాడు వివేక్‌ ఏమీ సీరియస్‌ గా తీసుకోకుండా.

" సరేలే! తాగేసి మాట్లాడుతా మళ్ళీ, " అని కాఫీ తాగేశారు.

స్నేహితులంతా. కబుర్లు, , జోకులతో మార్మోగిపోతూ, పార్టీ పూర్తి అయిపోయినందున ఒక్కొక్కరే బై బై చెప్పుకుంటూ ఇళ్ళకు వెళ్ళిపోసాగారు. మిగిలిన వాళ్ళు కుటుంబ సభ్యులు, విరజ, శాన్వీ. వాళ్ళ మధ్య ఏవో హాస్యాలు నడుస్తున్నాయి.

చేతిరుమాల్‌ తో మూతి తుడుచుకుని తాతగారు వివేక్‌ శాన్వీలతో " మీ రిద్దరూ నా చేత కాఫీ తాగించారు. మీతో నేనింక మాట్లాడేది లేదు”. చేయకూడని పని ఏదో తాను చేసి బాధ పడుతున్నట్లు ముఖం పెట్టి అన్నారు.

వివేక్ ప్రమీళ తో పాటు విరజ, శాన్వి లు కూడా తాతగారూ ఇప్పటివరకు ఎంతో ఉల్లాసభరితంగా, ఆహ్లాదం గా ఉండి , మనసు మారిందేమిటా అని నివ్వెరపోయారు. వారి భయానికి తగ్గట్టే విరజకి ప్రమీళ మొబైల్‌ యిప్పించి , శాన్వి నాన్నగారికి కలిపి ఇవ్వమన్నారు.

అనుకున్నంతా అయిందనుకుని విరజ తలుస్తూ " వద్దలెండి తాతగారూ, నేను ఇంటికి వెళ్ళగానే ఫోనులో మా మామయ్యగారికి జరిగినదంతా చెబుతా. ఆయన శాన్వి ని కోప్పడుతారులెండీ" అంది ప్రాధేయపడుతూ.


తాతాగారు విరజతో " సరేలేమ్మా, అట్లాగేలే. ఇంటికెళ్ళగానే ఫోన్‌ చెయ్యి. నేను మీ మామయ్యగారిని రెండు మూడు రోజులలో రమ్మనమన్నానని. ఇక్కడ జరిగిన కథ ఎట్లాగో చెబుతావులే.

ధైర్యసాహసాలు కల విద్యావతి, గుణవతి , రూపవతి అయిన శాన్విని మెచ్చుకుని నా మనవడికి తగిన సంబంధంగా భావించానని చెప్పు. నిశ్చయతాంబూలాలకు ఆయన వచ్చి నా కుమారుని కలవాలని ఆశిస్తున్నానని , ఇచ్చి పుచ్చుకునే ఇతర ప్రమేయాలేమి ఉండవని చెప్పు" అన్నారు.


ఆశ్చర్యానందాలతో ప్రమీళ విరజలు, వివేక్‌ శాన్వీ లకు అభినందనలు తెలియజేశారు.

శాన్వి తాతగారి కాళ్ళకు " పాదాభివందనం"చేస్తే, ఆయన కళ్యాణమస్తు అని దీవించారు మందహాసం చేస్తూ.

" తాతయ్యా, నువ్వింత కొంటెవాడివి, అల్లరి వాడివయ్యావేంటీ? అని ఆయన చేయి పట్టుకుని వూపుతూ నవ్వింది మనవరాలు ప్రమీళ.

" అప్పుడే కాలేదు నా అల్లరి. నీ శ్రీవారి కోసం ఎదురు చూస్తున్నా" అన్నారాయన మరీ కొంటె కోణంగితనంతో.

ప్రమీళ " పో తాతయ్యా" అంది.

విరజ, శాన్విలు తాతగారికి నమస్కరించి అన్నాచెళ్ళెళ్ళకు బైబై అని చెప్పి వెళ్ళారు.

వివేక్‌ తో " నీ కింకా కొన్నాళ్ళు విరహం తప్పదు" అని నవ్వుతూ అని , తాతగారు వాహ్యాళి కి వేళ దాటటంతో మేడ పైకి వెళ్ళిపోయారు. వివేక్‌ కు పుట్టినరోజు కానుకగా

పెళ్ళి కుదిరింది.

-------------------------శుభంభూయాత్‌---------------------------------

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


285 views0 comments

Comments


bottom of page