top of page

చిరిగిన నోటు


'Chirigina Notu' written by Vijayalakshmi Malavathu

రచన : విజయలక్ష్మి మలవతు

మొదటిసారి పోలీసుస్టేషన్ లో అడుగుపెడుతున్నా.

అక్కడ ఉన్న ఒక పోలీసుతో చెప్పాను .

"మా మామయ్య కనిపించటం లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాము' అని. అతను 'ఎప్పటి నుండి', 'ఎలా జరిగింది' అని వివరాలు అడగడం మొదలు పెట్టాడు.

"మాది బెంగళూర్ సర్. ఈ రోజు ఉదయం ఇక్కడికి ఒక పెళ్లికి అటెండ్ అవడానికి వచ్చాము. మామయ్య బయటికి వెళ్లి వస్తా అని వెళ్లారు. మూడు గంటలకు వెళ్లారు. ఇప్పటి వరకు రాలేదు.. వస్తారు అని ఒక గంట ఎదురుచూసాము, రాలేదు. అని అన్ని చోట్లా వెతికాము. ఇప్పుడు ఏడు గంటలు ఇంత వరకు కనిపించలేదు.'

మేము ఇచ్చిన మామయ్య ఫోటో, ఆధార్ కార్డ్ చూసి, "ఇతను మంచి ఆఫీసర్ లాగా ఉన్నాడు. చిన్నపిల్లవాడు ఏమీ కాదు కదా! వస్తాడు, ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. ఎందుకు అంత టెన్షన్. ఐనా ఫోన్ లేదా అతని దగ్గర. ఫోన్ చెయ్యొచ్చుగా".

"సర్! మామయ్య కు మతి సరిగా లేదు. అన్ని మర్చిపోతుంటారు.. అలాగే ఫోన్ రూంలో పెట్టి వెళ్లారు. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాం".

"సరే ఉండండి, కంప్లైంట్ తీసుకుంటాం" అని రాసుకున్నారు.

ఆ వెంటనే వెతకడానికి బయలుదేరాం వాళ్ళతో పాటు.. ఆ ఊరు ఒక టౌన్ పోలీసుల సహాయంతో కొంచెం ఈజీ గానే కనిపెట్టచ్చు అనుకున్నాం. పోలీస్ వాళ్ళు హాస్పిటల్స్ కి కూడా కాల్ చేసి కనుక్కుంటున్నారు. ఏమన్నా యాక్సిడెంట్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయా అని. అలా అన్ని రోడ్స్ చూస్తూ వెళుతున్నాం.

సడన్ గా ఒక షాప్ దగ్గర మామయ్య కనిపించారు. కార్ ఆపి వెళ్ళాం . దగ్గరికి వెళ్ళేసరికి షాప్ వాళ్ళు, అక్కడ ఇంకా కొంతమంది మామయ్యతో గొడవ పడుతూ కొట్టడానికి మీద మీదకు వెళ్తున్నారు.

అస్సలు అర్థం కాలేదు అక్కడ ఏమి జరిగిందో కూడా. చాలా సున్నితమనస్కుడు. ఎవరిని ఇంకా అనే తత్వం కూడా కాదు .మరి ఏమి జరిగిందో అనుకుంటూ వాళ్ళ మధ్యలోకి వెళ్లి ఆపి, ఏమి జరిగింది అని కోపంగా అడిగాము. అప్పుడు షాప్ అతను, మా దగ్గర వాటర్ బాటిల్, బిస్కట్స్ తీసుకొని తిని, ఈ చిరిగిన నోటు ఇచ్చాడు. అడిగితే నాదగ్గర లేదు, ఇదే తీసుకోండి అంటున్నాడు. గట్టిగా అడిగితే నేను ఎప్పుడు తీసుకున్నా మీదగ్గర! అని అబద్ధం చెప్తున్నాడు. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే కొట్టక ఏమి చెయ్యాలి?" అంటుంటే చాలా కోపము బాధ వచ్చాయి.సరే ఎంత అయిందో అడిగి ఇచ్చాము. అతనికి మతిమరుపు వల్ల అలా మాట్లాడారు అని చెప్పి, మామయ్యను వెళ్లి తీసుకొని కార్ లో కూర్చోపెట్టాము. అప్పుడు ఏమి జరిగింది అని అడిగితే,

"షేవింగ్ కోసం వచ్చాను. ఆ షాప్ కోసం అటు ఇటు తిరిగి రూమ్ మర్చిపోయా. ఎవ్వరిని అడిగినా నీళ్లు కూడా ఇవ్వలేదు. నా పాకెట్ లో ఐదువందల రూపాయల నోటు ఉండింది. అది ఇచ్చి వాటర్ బాటిల్, బిస్కట్స్ తీసుకున్నా. ఆ నోటు చిరిగి పోయింది అని వాడు గొడవ చేసాడు" అని బాధగా చెప్పారు.

అప్పుడు మామయ్యను చూసి చాలా దుఃఖం వచ్చింది. ఒక గెజిటెడ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి, ఇప్పటికి లక్ష రూపాయలు పెన్షన్ తీసుకునే ఆయన, ఒక వందరూపాయల కోసం ఎంతగా అవమానించబడ్డారు అని.

*మనిషికి ఎప్పుడు ఏ పరిస్థితి, అవసరం ఎలా వస్తుందో తెలియదు.*


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు విజయలక్ష్మి మలవతు..నా స్వస్థలం పుల్లంపేట , కడప జిల్లా..వృత్తిరీత్యా తిరుపతి వాస్తవ్యురాలిని.వ్రాయటం, చదవటం అంటే చాలా ఇష్టం.కథలు, కవితలు వ్రాస్తుంటాను.


634 views5 comments
bottom of page