top of page
Writer's pictureLakshminageswara Rao Velpuri

చిత్రం భళారే విచిత్రం



'Chitram Bhalare Vichithram' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri

'చిత్రం భళారే విచిత్రం' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


ప్రపంచ ప్రసిద్ధి చెందిన విహార స్థలాలలో 'ఆంధ్రప్రదేశ్' లోని ఉత్తరాంధ్ర జిల్లాలోని 'విశాఖపట్నం ' తీర ప్రాంతం, 30 కిలోమీటర్ల మీద అలరాడే సముద్రపు కెరటాలతో, అశేష జనాన్ని ఆకర్షించేది విశాఖపట్నం బీచ్ ప్రాంతం.

దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడి వాతావరణం, చల్లని సముద్రపు గాలులకోసం రావడంతో నిత్యం యాత్రికులతో సమయమనేది లేకుండా కిట కిటలాడుతుంది వైజాగ్.

ఇక్కడ కొత్తగా కట్టిన సబ్ మెరైన్ మ్యూజియం, యుద్ధ విమాన మ్యూజియం, ఫిష్ అక్వేరియం, ఆహ్లాదకరమైన బీచ్ పార్కులతో సముద్రపు ఇసకలలో తాటి చెట్లతో అందంగా అలంకరించి, రాత్రిపూట విచిత్రమైన లైటింగ్లతో మన మనసులను దోచుకునే ప్రాంతం వైజాగ్.


అత్యాధునికమైన ఫైవ్ స్టార్ హోటల్స్ తో, ఉడా పార్కు, రుషికొండ బీచ్లలో చక్కని రిసార్ట్స్ తో కమ్మని విందు భోజనాల కోసం, ఎంతో దూరమైన శ్రమించి వచ్చే యాత్రికుల స్వర్గధామం విశాఖపట్నం. విశాఖపట్నంలోనే నివసించే 'ప్రకాష్' ఒక చిత్రకారుడు, తనకున్న చిత్రకళతో బీచ్లకు వచ్చే పోయే వారి కి లైవ్ లో చిత్రాలు గీస్తూ, నచ్చిన వారు ఇచ్చే పారితోషకంతో తన పేద కుటుంబాన్ని సాకుతున్నాడు, మామూలుగా ఒక మనిషి వచ్చి కూర్చుని చిత్రం గీస్తే 50 రూపాయలు ఇస్తారు! అలా రోజు మూడు గంటల నుంచి సాయంత్రం బీచ్ గట్టుమీద కూర్చొని యాత్రికుల కోసం ఎదురుచూసే ప్రయత్నంలో, ఒక కుటుంబం వచ్చి,

'బాబు.. మాకు మూడు చిత్రాలు గీయాలి. ఎంత ?” అని అడిగారు,


“ఆమ్మా, ముగ్గురికి కలిపి 150 రూపాయలు అవుతుంది” అని ప్రకాష్ అనగానే యాత్రికుడు కోపంతో “అదేంటయ్యా! చిన్నపిల్ల బొమ్మ కు కూడా డబ్బులు తీసుకుంటావా? మా ముగ్గురికి కలిపి 100 రూపాయలు ఇస్తాను. గీస్తే గీయి. లేకపోతే లేదు..” అంటూ వెళ్ళిపోతున్న వాళ్ళ ను వెనక్కి పిలిచి, “సరేలెండయ్యా, కూర్చోండి !” అంటూ చక్కనైన చిత్రం గీసి, ఆ కుటుంబానికి ఇచ్చాడు. వాళ్ళు కూడా వంద రూపాయలు చేతిలో పెట్టి, హడావిడిగా వెళ్లిపోయారు.

ప్రకాష్ తనలో తానే పోనీలే, కనీసం రేపు బియ్యానికి, కూరకి వస్తాయి, దేవుడి దయ! అనుకుంటూ మళ్లీ యాత్రికుల కోసం వేచి చూడటం రోజు ఉన్న పరిపాటే.


ముఖ్యంగా సెలవు దినాలలో జన సమర్థం ఎక్కువగా ఉండడం ఎవరికి వారు వారికి కొత్తగా వచ్చిన 'సెల్ఫోన్ కెమెరాలతో' తమ చిత్రాలను, పరిసరాలను ఫోటో తీసుకుని ఆనందపడటం, అందరి వంతు అయిపోయింది. ఎక్కడో 100 మందిలో పది మంది తనలాంటి వాడి దగ్గరకు వచ్చి చిత్రాలు గీయ మనడం అలాగే తన బ్రతుకు కొనసాగడం జరిగిపోతుంది.


ఆరోజు ఆదివారం. ఎంత కష్టపడినా నలుగురు చిత్రాలు గీయించుకున్నారు. కనీసం ఇంకొక పదిమంది అయినా వస్తే గాని, తన కుటుంబానికి కావలసిన డబ్బు రాదు. 7:30.. 8.. సాయంత్రం దాటిపోతుంది. ఎవరూ రాలేదు.. ఎంతో నిరాశగా తన సామానంత సైకిల్ కి కడుతూ, వచ్చిన రెండు, మూడు వందల రూపాయలు ఎలా సరిపోతుందో తెలియక, ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో సరిగ్గా ఆ సమయానికి, ఒక 'తెల్లటి బెంజ్ కారు ' వచ్చి తన ముందు ఆగింది.


కారు డోరు తీసిన డ్రైవర్, “ఒరేయ్ బాబు! కారు లోపల అమ్మగారు పిలుస్తున్నారు. కొంచెం వస్తావా?” అని అడిగేసరికి, వెంటనే సైకిల్ పక్కన ఆపి, కారు డోర్ దగ్గర నిలబడి, “నమస్కారమండీ!” అంటూ లోపల కూర్చున్న ఒక ధనవంతురాలైన మహిళ కు చెప్పాడు.


ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి, “నీ పేరేంటో తెలియదు” అని అనగానే, “ఆమ్మా.. నా పేరు ప్రకాష్, నేనిక్కడ బీచ్ లో బొమ్మలు గీసుకుని బతుకుతున్నాను, మీకు ఏం కావాలో చెప్పండి?” అంటూ నమస్కరించాడు.

“మరేం లేదు, నువ్వు వచ్చే ఆదివారం మా ఇంటికి వచ్చి, నా చిత్రపటాన్ని ఎంతో అందంగా తరతరాలు గుర్తుండిపోయేలా గీయగలగాలి. అది నాకు, మా 'జూలీ’ కి నచ్చితే, నీకు పదివేల రూపాయలు బహుమానం ఇస్తాను. నచ్చకపోతే నేను మరో చిత్రకారుని దగ్గరకు వెళ్లి గీయించుకుంటాను. ఇదిగో నీకు 500 రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను. నీ ఉద్దేశం ఏమిటో ఇప్పుడే చెప్పు?” అంటూ తన ఒళ్ళో అతి సుకుమారంగా కూర్చున్న 'తెల్లనిబొచ్చు కుక్క' వీపు మీద రాస్తూ అనేసరికి,

“అలాగేనమ్మ, తప్పకుండా! మీకు నచ్చిన విధంగా చిత్రం గీస్తాను, కానీ మీ ఇల్లు తెలియదు. ఎలా రావాలి?” అని అడగగానే,


“ఇక్కడ మా ఇల్లు దగ్గరలోనే 'పాండురంగాపురంలో 'ఉంది. నిన్ను ఇక్కడి నుంచే సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకు మా డ్రైవర్ వచ్చి తీసుకు వస్తాడు. ఒకవేళ చిత్రం బాగా గీస్తే, నీకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేస్తాను. నాకు తెలిసిన చాలా మంది పెద్దపెద్ద వాళ్లు ఉన్నారు. నా చిత్రం చూసిన వెంటనే నిన్ను పిలిచి మరి గీయించుకుంటారు. కాబట్టి నీ భవిష్యత్తుని బంగారు మయం చేసుకుంటావో? లేకపోతే మళ్లీ ఇదే బతుకును కొనసాగిస్తావో ? నీ ఇష్టం” అంటూ ఆ జమీందారీ మహిళ సుకుమారంగా కారు దిగి, తన తెల్లిని బొచ్చు కుక్క పిల్లని, ఎత్తుకొని కాసేపు బీచ్ లో నడిచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది.

ఆరోజు ఆదివారం నీటిగా తయారై తనకి ఇష్టమైన గాయత్రీ దేవి పూజ చేసి ఓ దేవుడా ఇవాళ నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది ఆ జమీందారీ మహిళ చిత్రం గీసి బంగారు భవిష్యత్తును అందుకుంటానో లేక ఆవిడ చిత్రం నచ్చకపోతే నేను కూడా నా చిత్రకళను వదిలి బీచ్ లో మురి మిక్సర్లు బజ్జీలు అమ్ముకుంటూ బతుకుతానో నీవే నిర్ణయించి దారి చూపయ్య దేవుడా! అంటూ ప్రార్ధించి సరిగ్గా మూడు గంటలకల్లా ఆర్కే బీచ్ పేవ్ మెంట్ మీద, సామాన్లన్నీ పట్టుకుని ఆ జమీందారీ మహిళ కారు డ్రైవర్ కోసం ఎదురుచూస్తుండగా ఆయన రానే వచ్చాడు.


'ఆర్కే బీచ్ కి' దగ్గరలో ఉన్న పాండురంగాపురం కాలనీలో, అతి చక్కని విశాలమైన, అందమైన భవంతి దగ్గర ఆపి, సర్వాంగ సుందరంగా ఉన్న లాన్ లో అతి పెద్ద రంగుల గొడుగు కింద కూర్చోబెట్టి,

“ఇక్కడ ఉండండి! అమ్మగారికి కబురు చెప్తాను” అని వెళ్ళిపోయాడు. ప్రకాష్ ఆ భవంతి అందాలను చూస్తూ, ఆకుపచ్చగా ఉన్న ట్రిమ్మింగ్ చేయబడ్డ లాన్లో కూర్చుని, తన డ్రాయింగ్ బోర్డు, ఒక తెల్లని పెద్ద కాగితం షీట్ అమర్చి, ఎంతో చక్కగా చెక్కిన పెన్సిల్స్ దగ్గర పెట్టి, తన దగ్గర ఉన్న కలర్స్ కూడా నీట్ గా అమర్చాడు. ఇంతలో తెల్లని బట్టలతో నెత్తిమీద టోపీ తో, రుచికరమైన బిస్కెట్లు, టీ పాట్ తెచ్చి అక్కడే కలిపి ప్రకాష్ కి ఇచ్చాడు ఒక బట్లర్, తన అదృష్టానికి లోలోపలే మురిసిపోతూవేడివేడి టీ తాగి, అక్కడ అందాలను చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ప్రకాష్.


సరిగ్గా నాలుగు గంటలకు నును లేత ఎండలో, దగదగా మెరిసిపోతూ, తన తెల్లని జూలు కుక్కను పనిమనిషి వెంట తీసుకురాగా, దర్జాగా నడుస్తూ, అక్కడ వేసిన మంచి రంగు ముఖముల్ గుడ్డలతో కుట్టిన పెద్ద కుషన్ గల కుర్చీలో ఆ జమీందారీ మహిళ కూర్చుని, తన కళ్లద్దాలను సరి చేసుకుంటూ, ప్రకాష్ ను ఉద్దేశించి,

'ఓకే ! మీకు నేను ఏ భంగిమలో కూర్చోవాలో చెప్తే అలా కూర్చుంటాను. నేను నా జూలీ చిత్రపటం లో మెరిసిపోవాలి!” అని అనగానే, ప్రకాష్ సవినయంగా తనకు అనువైన విధంగా రాజసం ఉట్టిపడేలా ఆ జమిందారి మహిళను కూర్చోబెట్టి,

“అమ్మగారు! మీకు గొడుగు పట్టుకుని ఉన్న ఆ పనిమనిషిని పక్కకు వెళ్ళమనండి. ఎందుకంటే మీ చిత్రం వెనుక అత్యంత సుందరంగా ఉన్న మీ భవంతి, స్విమ్మింగ్ పూల్స్ కూడా వేయాలి !” అని చెప్పేసరికి, అలాగే అని, తన తన అత్యంత విలువైన నగలను, పట్టుచీరను మరొకసారి సవరించుకొని, ఎంతో అందంగా కూర్చున్నారు జమీందారు మహిళ.


అసలే పసుపు పచ్చని బంగారు చ్చాయ కళకళలాడే ముఖ వర్చస్సు చూసి, ఆహా అందమంటే ధన్వంతులుదే కదా !! అని తనలో తనే అనుకుంటూ, ముందు అవుట్లైన్లన్నీ గీసి, ఆ తర్వాత చిత్రాన్ని అత్యంత సుందరంగా మలుస్తూ, కొలతలు చూసుకుంటూ, గంటన్నరలో ఆ చిత్రాన్ని గీశాడు ప్రకాష్.


అన్ని ఒక 'త్రీడీ చిత్రంలో ' ఉన్నట్టు, వెనక పచ్చని లాన్లు, అతి చక్కని భవంతి, రెండు స్విమ్మింగ్ పూల్స్ ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఆ చిత్రాన్ని పూర్తి చేశాడు ప్రకాష్. అతి మనోహరంగా వచ్చిన చిత్రాన్ని చూసి ఆనంద పడిపోతూ, ప్రకాష్ నాకు నచ్చినది ఏదైనా నా జూలీకి కూడా నచ్చాలి. కానీ నా జూలీ నాకు నచ్చిన చిత్రాన్ని చూసి కూడా, పరిగెత్తి వెళ్లి ముద్దు పెట్టలేదు! ఎందుకో కారణం తెలీదు. ఒకవేళ నా జూలీకి నచ్చకపోతే నాకు నచ్ననట్టే. దీని అర్థం ఏమిటంటే! నా జూలీకి నా బొమ్మ నచ్చలేదో, చిత్రంలో దాని బొమ్మ నచ్చలేదో? తెలీదు. ఎంతో గొప్పగా చిత్రం వేశావు గనుక, నీకు మరో అవకాశం ఇస్తున్నాను. రేపు మధ్యాహ్నం సరిగ్గా ఈ సమయానికి ఈ చిత్రాన్ని నా జూలికి నచ్చినట్టు, సరిదిద్దు. ఒకవేళ ఆ చిత్రం నా జూలీకి నచ్చితే, అది వెంటనే పరిగెత్తు కు వెళ్లి, ముద్దాడుతుంది. అప్పుడే ఆ చిత్రం నాకు నచ్చినట్టు, నీ బహుమానం 'పదివేల రూపాయలు 'నీకు అందుతాయి. సరేనా! వెళ్లి రేపు ఈ చిత్రాన్ని సరిదిద్ది తీసుకురండి” అనేసరికి ప్రకాష్ కి నోట మాట రాలేదు.


'అయ్యో దేవుడా! నా చిత్రకళకు అగ్ని పరీక్ష పెట్టావయ్యా. నా చిత్రం, నా జీవితం ఆఖరికి ఒక పెంపుడు కుక్క నిర్ణయంతో ముడి వేసావా! ఆహా ఇది ‘చిత్రం భళారే విచిత్రం!’ అని తనలో తానే మదనపడుతూ ఇంటి ముఖం పట్టాడు ప్రకాష్.

ఆరోజు రాత్రి ఎన్నో కాయితాలు మీద అదే చిత్రాన్ని పరిపరి విధాలుగా గీస్తూ, జమీందారీ మహిళలకు నచ్చినది, ఆమె ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్కకు ఎందుకు నచ్చలేదు?, అనుకుంటూ నిద్రాహారాలు కూడా మాని, పాపం నా కుటుంబానికి అదృష్టం లేదు, అయ్యో దేవుడా! నా చిత్ర లేఖనం కళ రేపటితో అంతరించిపోతుందా, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి? అని ఆలోచిస్తూ తెలతెలవారుతుండడం, చూసి వీధి బయటకు వచ్చి ఆలోచించసాగాడు ప్రకాష్.


అప్పుడే ప్రారంభమైన ఉదయాన్ని, ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ, మనసు ప్రశాంతం చేసుకుంటుంటున్నాడు ప్రకాష్.

అదే సమయంలో రాత్రంతా గస్తీలు తిరిగి అలసిపోయిన ఊర కుక్కలు, కొన్ని ప్రతి ఇంటి ముందు పడేవేసిన ఎంగిలాకులు, చెత్త బుట్టల లో వి, పైకి తీసి మరి వాటిని ఆత్రుతగా నాకుతూ, పరిశుభ్రం చేయడం గమనిస్తున్నాడు ప్రకాష్.


అంతలో తళుక్కున ఒక ఆలోచన మెదిలింది ప్రకాష్ కి, వెంటనే తన భార్య రాత్రి వండిన 'చేపల కూర ఇగురు' ఉన్న మూకుడును ఒక చెంచాతో గీకి దానినీ తీసుకువెళ్లి, అక్కడే పడి ఉన్న ఒక ఇంగిలాకు మీద రాశాడు, అంతే ఆ వాసన పసిగట్టి ఒక ఊర కుక్క పరిగెత్తుకు వచ్చి, ఆ ఇగురు రాసిన ఆకును పదేపదే నాకుతూ, కూర లేకపోయినా ఆ ఇగురు ని అతి ఇష్టంగా నాకడం చూసి,


‘ఓరి దేవుడా! చివరి క్షణాలలో కూడా అణగారిన బ్రతుకులను కాపాడటం నీ ఒక్కడి వల్లే సాధ్యమయ్యా!!’ అని మనసులోని నమస్కరించుకొని, స్నానపానాదులు గావించి, తనకు ఇష్టమైన 'గాయత్రి పూజ 'చేసి, భార్యతో, “చూడు! నిన్న రాత్రి చేసిన కూర అలాగే చేయి, నాకు చిన్న బాక్స్ లో పెట్టి ఇవ్వు. అక్కడ అన్నం ఉంటుంది, గనక నేను అక్కడే తిని వస్తాను” అని చెప్పి, భార్య ఇచ్చిన కూర చిన్న బాక్సులో పెట్టుకొని త్వరగా జమీందారీ మహిళ గారి ఇంటికి వచ్చాడు ప్రకాష్.


సరిగ్గా మళ్లీ అన్న మాట ప్రకారము జమీందారీ మహిళా గారు తన పెంపుడు కుక్క జూలీతో సరిగ్గా సమయానికి వచ్చి అంతే రాజసం ఉట్టిపడేలా కూర్చున్నారు. మరొకసారి ప్రకాష్ తన శాయి శక్తులు ఉపయోగించి, మళ్లీ గంటన్నరలో నిన్నటి కన్నా ఇంకా బాగా చిత్రాన్ని గీశాడు.

అప్పటికే భోజనాలు టైం అవ్వడంతో, “అమ్మగారు! మీరు వెళ్లి భోంచేసి రండి, నేను కూడా ఈ లోపల ఈ చిత్రానికి రంగులు వేసి సరిదిద్దుతాను” అని అనగానే “చూడండి ప్రకాష్ గారు, మీకు చివరి అవకాశం, నాకు నా జూలీకి నచ్చేటట్లుగా చిత్రించి ఉంచండి. మీకు మా బట్లరు భోజనం తెస్తాడు” అంటూ నవ్వుకుంటూ పనిమనిషి గొడుగు పట్టుకుని ఉండగా, దర్జాగా లోపటికి వెళ్ళిపోయారు జమీందారీ మహిళ గారు.


వారు వెళ్లడంతోనే, తన జీవితంలో ఎన్నటికీ ఎరగని భోజనాన్ని ఆ బట్లరు తెచ్చి ఇచ్చాడు. సంతుష్టిగా భోజనం చేసిన తర్వాత మళ్లీ ఆ చిత్రం మీద మంచి రంగులు అద్ది, ఆ చిత్రంలో కనీ కనపడకుండా జమీందారీ మహిళ గారి పాదాల మీద, జూలీ కుక్క ఉన్న బొమ్మ దగ్గర కొంచెం కొంచెం గా పైకి కనబడకుండా తను తెచ్చిన 'కూర ఇగురు’ను ఒక లేపనంగా రాసి, దాని మీద తెలియకుండా మంచి రంగులు వేసి, ఆ రంగులన్నీ ఆరిన కొద్దిసేపటికి అమ్మగారిని పిలవమని కబురు పంపించాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకాష్.


జమీందారీ మహిళ గారు కొంచెం విశ్రమించాక తన పని మనుషులు వెంటరాగా ప్రకాష్ గీసిన చిత్రానికి దగ్గరగా వచ్చి, ఓహో అద్భుతం అత్యద్భుతం. నీ చిత్రకళని మెచ్చుకోవాలి, నాకు ఎంతో నచ్చింది. ఇక చూద్దాం నా జూలీకి నచ్చుతుందో లేదో.. అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అంటూ నవ్వుతూ తన ఒడిలో ఉన్న జూలీని ముద్దు పెట్టుకుని ఒక్కసారిగా ఆ చిత్రం దగ్గర వదిలింది. అక్కడున్న వాళ్ళందరికీ ప్రకాష్ తో సహా టెన్షన్ మొదలైంది.

ఎంతో అందంగా ఉన్న 'జూలు కుక్క' ఒక్క ఉదుటున ఎగిరి, పదిసార్లు జమీందారీ మహిళ గారి పాదాలను ముద్దు పెట్టుకుని, తన బొమ్మ దగ్గర కూడా వాసన చూస్తూ, ముద్దు పెట్టుకుని ఆనందించడం చూసి, అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టగా, ఆ జమీందారీ మహిళ ఆనందంతో తన జూలిని ఎత్తుకొని, “బాబు ప్రకాష్!! నీ చిత్ర లేఖనం కొనియాడదగినది, నాకు, నా జూలీకి ఎంతో నచ్చినది గనుక, ఇదిగో నీకు 10 వేల రూపాయలు బహుమానంగా ఇస్తున్నాను” అంది.


అలాగే పని వాళ్ళని పిలిచి, “ఆ చిత్రానికి 'బంగారు ఫ్రేమ్' కట్టమని చెప్పి లోపలికి తీసుకెళ్లమంది. “బాబు ప్రకాష్ ! ఇకనుంచి, నాకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు, ధనవంతులు, నిన్ను పిలిచి చిత్రాలు వేయించుకుంటారు, ఇక నీ దశ తిరిగినది” అంటూ 'పదివేలు రూపాయల నోట్లు' ఉన్న కవర్ను ప్రకాష్ ఇస్తూ, “నీకు తొందరలోనే మరో రెండు చిత్రాలకు అనుమతి వస్తుంది, నీ పేరు నిలబెట్టుకో!” అంటూ ఆ జమిందారీ మహిళ ప్రకాష్ ను, తన బెంజ్ కారులోనే ఇంటి దగ్గర దింపమని డ్రైవర్ను పంపారు.

"ఆహా దేవుడా! కరుణించావు అయ్యా! ఆ జమీందారీ మహిళ 'మహాలక్ష్మి దేవిలా' నన్ను కరుణించింది, నా కుటుంబ పోషణకు ఇక దిగులు లేదు, నేనేమీ మాయ చేయలేదు, ఎవరికీ తెలియకుండా ఒక జంతు ప్రేమను నా చిత్రకళతో పొందాను” అనుకున్నాడు.

"ఏ కళను సానబెట్టాలన్న, ఆ కళతో పాటు, సమయస్ఫూర్తి, తెలివితేటలు సమయానుకూలంగా మనిషి రంగరించి, తన కళను ప్రదర్శించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది”.


*******


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.





48 views1 comment

1 則留言


sudershanap44
2023年8月03日

ఆహా మీ కథ ఇంకా కొంత చదివితే బాగుండు అని అనిపించేలా ఉంది అభినందనలు.

按讚
bottom of page