top of page
Soudamini S

చిత్రమైన కల్పన



Chitramaina Kalpana written by Soudamini S

రచన : సౌదామిని S


1989 సంవత్సరం:

రిబ్బను కట్టిన రెండు జడలు, ముడి వేసిన చున్నీతో పంజాబీ డ్రస్ లలో కల్పన, ఆమె స్నేహితురాలు శశికళ జంట కవుల లాగా సైకిల్ మీద కాలేజీకి బయలుదేరారు. వాళ్ళిద్దరినీ చూడగానే మనసుకు కళ్ళెం వేసిన యువతుల్లా సంప్రదాయ బద్ధంగా, ముగ్ధ మనోహరంగా ఉన్నారు. ఇంతలో రాజేష్ వారి వెనకాలే రావటం గమనించారు.

“ఏమే శశికళ, రాజేష్ వెనకాలే వస్తున్నాడే” అని గుసగుసలాడింది కల్పన.

“అవునే బాబు, వాడు నిన్ను ఫాలో అవుతున్నాడు” అని కన్ను గీటింది శశికళ.

“ఏమోనే, అసలు వాడు అలా చూస్తుంటే గుండెల్లో సూదులు గుచ్చుకున్నట్టు ఉందే బాబు” అని

సిగ్గుతో నవ్వింది కల్పన.

“నీకే కాదు, మన క్లాస్ లో అమ్మాయిలు అందరిదీ అదే పరిస్థితి. అసలు వాడు ఆ పసుపు చొక్కా

వేసుకున్న రోజు అయితే.. ” అని కల్పన మొహంలో మార్పును గమనించి ఆపేసింది శశికళ.

“చాలు లేవే ఇంక ఆపు. వాడిని ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కీ” అని సిగ్గు పడుతూ రాజేష్

ఓరకంట తో తననే చూస్తున్నాడాని నిర్థారించుకుంది కల్పన.

ఒక చేత్తో సైకిల్ నడుపుతూ, ఇంకో చేత్తో చున్నీ ముడి విప్పింది.

“అయ్యో, నా చున్నీ సైకిల్ లో పడిపోయింది, నువ్వు వెళ్ళవే నేను వస్తాను” అని కల్పన సైకిల్ కి

బ్రేక్ వేసింది.

శశికళకు విషయం అర్థమైనట్టు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ముందుకు సాగింది.

రాజేష్ సైకిల్ ని నెమ్మది చేసి బ్రేక్ వేశాడు.

అతడు సైకిల్ దిగి సైకిల్ లో ఇరుక్కున్న కల్పన చున్నీ లాగుతూ “రంభ థియేటర్, మాట్నీ షో, శివ సినిమా” అని గుసగుసలాడాడు.

కల్పన వణుకుతున్న చేతులతో అటూ ఇటూ ఎవరు చూడలేదని నిర్థారించుకున్నాక సమాధానంగా సైకిల్ బెల్ కొట్టింది.

“బాటనీ పాఠమునది..” అని పాట పాడుకుంటూ రాజేష్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు.

రెండు సంవత్సరాల తరువాత:

కల్పన వాళ్ళ బెడ్రూం లో పడుకుని దిండు అడ్డుపెట్టుకుని ఏడుస్తోంది. తల్లి వస్తున్న చప్పుడు

విని కన్నీళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని దిగమింగుతోంది.

అప్పుడే గదిలోకి వచ్చిన ఆమె తల్లి, కల్పన చెంప చెళ్లుమనిపించింది.

“ఇది ఎంత దారుణం, ఏమే కల్పన, నువ్వు నాలుగు సబ్జెక్ట్ లలో తప్పావా? చదువుకోమని పంపిస్తే

ఇదా నువ్వు చేసిన నిర్వాకం” అని కల్పన తల్లి ఆవేశంతో ఊగిపోతోంది.

కల్పన అణచిబెట్టుకున్న కన్నీళ్ళు మళ్ళీ ధారాపాతంగా కళ్ల వెంబడి పరుగులు పెడుతున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ తప్పు చేసిన దాని లాగా తల దించుకుంది.

“అసలు కారణం నాకు ఇప్పుడే తెలిసింది, శశికళ అంతా చెప్పింది. వాడెవడో రాజేష్ ట? ఛీ, నిన్ను ఏమి చేసినా పాపం లేదు” అని అమ్మ అసహ్యంగా ఆమె వైపు నుండి మొహం తిప్పుకుంది.

ఇదంతా బయట నుండి వింటున్న కల్పన తండ్రి “నువ్వు ఆగవే, నేను మాట్లాడతాను” అని

లోపలకు వచ్చారు.

ఆమె పక్కన కూర్చుని “చూడమ్మా కల్పనా, ఆ రాజేష్ ఎవరు? అతడు ఏమి చేస్తాడు?” అని

నెమ్మదిగా అడిగారు.

“సరిపోయింది, దానికి నాలుగు వడ్డించక బ్రతిమాలుతున్నారు ఏమిటి? అసలు ఆడ పిల్లకి చదువు ఎందుకు అంటే విన్నారా” అంది కల్పన తల్లి గద్దించిన స్వరం తో.

“నువ్వు కాసేపు ఈ గదిలో నుండి వెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడతాను” అని కల్పన తల్లి కేసి

ఆయన గుర్రుగా చూశాడు.

కల్పన తల్లి విసురుగా ఆ గది లో నుండి వెళ్ళి పోయింది.

“కల్పనా, ఇప్పుడు చెప్పు ఆ అబ్బాయి ఏమి చేస్తాడు?” అని కల్పన తండ్రి ఆమె పక్కనే వెళ్ళి

కూర్చున్నారు.

“నాన్నా, రాజేష్ మా క్లాస్ మేట్. నేనంటే చాలా చాలా ఇష్టం” అని వెక్కిళ్ళ మధ్య సమాధానం

చెప్పింది కల్పన.

“అది సరే, ఇష్టం అంటే పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటే సంసారం ఎలా నడిపిస్తారు?” అని

ప్రశ్నించారు.

“నాన్నా, అది.. రాజేష్ కి కూడా నాలుగు సబ్జెక్ట్ లు పోయాయి. అవి క్లియర్ అయిపోతే..” అని ఆగిపోయింది.

“హ్మ అర్థంఅయ్యింది. చూడమ్మా ఈ వయసులో ఆడ మగ మధ్య ఆకర్షణ ఉండటం సహజమే. కానీ ఊహకి, వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ఒకరంటే ఒకరు ఇష్టపడటానికి, జీవితాంతం పెళ్లి అనే బంధం తో ముడి పడి ఉండటానికి వ్యత్యాసం ఉంది. పెళ్లి చేసుకున్నాక ఇద్దరూ బాధ్యతలు కూడా పంచుకోగలగాలి. మీరు ఇద్దరే కాదు, మేము, వాళ్ళ కుటుంబం కూడా కలిసిపోగలగాలి. అతడికి ఉద్యోగం తెచ్చుకుని నిన్ను పోషించే స్తోమత ఉందా? పోనీ అతగాడికి రాక పోతే నువ్వు ఉద్యోగం తెచ్చుకుని అతగాడిని పోషిస్తావా? ఒక విషయం ఆలోచించు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆకర్షణ. అందుకని అతడిలో అన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఐదేళ్లు అయ్యాక మీకు సంపాదన లేకుండా ఉండి కూడా ఇంత ప్రేమతో ఇద్దరూ ఉండగలరా? “ అని కూతురి కేసి చూస్తూ ఆగారు.

“నాన్నా, రాజేష్ కి నేనంటే ఇష్టం, ఉద్యోగం తెచ్చుకుని నన్ను పెళ్లి చేసుకుంటాను

అన్నాడు” అని కల్పన తడబడుతూ సమాధానం చెప్పింది.

“సరే. ఒక ఆరు నెలలు గడువు ఇస్తున్నాను. ఇవన్నీ ఆలోచించి, అతడిని పరిశీలించి ఒక

నిర్ణయానికి రా. నీ మంచి భవిష్యత్తు కోరుకునే తల్లిదండ్రులుగా నీకు నచ్చిన, నీకు సరిపోయే

నిర్ణయాన్నే తీసుకుందాం .” అని లేచారు. కల్పన మౌనంగా తల ఊపింది.

కొన్ని సంవత్సరాల తరువాత

రోడ్డు మీద శరవేగం తో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దూసుకెళ్లిపోతోంది. జీన్స్, టి షర్ట్ తో రిషి బైక్ వేగంగా

నడుపుతుంటే, ఆ వేగానికి ఎగిరిపోతున్న జుట్టుని ఒక చేత్తో సవరించుకుంటూ చైత్ర అతని

వెనకాలే కూర్చుంది. కాసేపటికి ఇద్దరూ బైక్ దిగి స్టార్ బక్స్ లోనికి ప్రవేశించారు. చిత్ర ఒక ఖాళీ టేబుల్ దగ్గర కూర్చుని ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుని పాటలు వింటోంది.

“టూ షార్ట్ మొఖా ప్లీజ్ “ అని రిషి ఆర్డర్ ఇచ్చి అదే టేబల్ వద్ద కూర్చున్నాడు.

“రిషి, కొత్త కే పాప్ బి. టి. ఎస్ పాట 'లైఫ్ గోస్ ఆన్' విన్నావా? బిల్ బోర్డ్స్ లో టాప్ లో ఉంది

తెలుసా?” అంటూ ఇయర్ ఫోన్ చెవిలో నుండి తీసింది.

“ఒకప్పుడు కొరియన్ పాటలా, నాన్సెన్స్ అనే దానివి. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా?” అని రిషి నవ్వుతూ కాఫీలు టేబల్ మీద పెట్టాడు.

“ఏమి చేస్తాం బాబు, మనకి తెలిసిందే రైట్ అనుకోకుండా ఫ్లెక్సిబిలిటీ తో ఉండటం తప్పు లేదు

కదా. నువ్వు కూడా నేను చెప్పిన తరువాత కర్ణాటక సంగీతం వింటున్నావు కదా. అన్నట్టు నా

కాఫీలో పిప్పర్ మింట్ సిరప్ వేయించావా?” అని కాఫీ చేతిలోకి తీసుకుంది.

“నాకు తెలుసుగా చైతూ, వేయించాను. అది సరే కానీ, లెట్స్ బి సీరియెస్. మన విషయం ఏమి

చేశావు?” అని రిషి కాఫీ కప్పు అందుకుంటూ ఆమె వైపే చూస్తున్నాడు.

“అదే చెప్తున్నా. ఈ రోజు మా పేరెంట్స్ తో మాట్లాడుతున్నాను. ఆ తరువాత మనం డెసిషన్

తీసుకుందాం” అంది చైత్ర. సిప్ చేస్తున్న కాఫీని పక్కన పెట్టి “మా ఇంట్లో వాళ్ళకి అయితే ఓకే.

మరి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే?” అని రిషి అనుమానంగా అడిగాడు.

“ నా నిర్ణయం మీద మా ఇంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్” అని కాఫీ సిప్ చేసింది చైత్ర.

“మమ్మీ, డాడీ మీకొక విషయం చెప్పాలి, ఐయామ్ ఇన్ లవ్... ” హల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న చైత్ర వాళ్ళ నాన్న గారితో చెప్పి ఒక నిమిషం ఆగింది.

“ రియల్లీ? ఎవరు చైత్రా అతను?” చైత్ర వాళ్ళ నాన్న గారు తినటం ఆపేసి గ్లాస్ నీళ్ళు

అందుకున్నారు. “డాడీ, రిషి అని నా కొలీగ్. మీకు తెలుసుగా 2-3 టైమ్స్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ కూడా చేశాడు” అంటూ రోటీని తన ప్లేట్ లోకి తీసుకుంది చైత్ర.

“గుర్తొచ్చింది.” అన్నట్టు ఆయన తల ఊపారు.

ఇంతలో చైత్ర వాళ్ళ అమ్మ గారు వంటగది లో నుండి ఇంకొన్ని రోటీలు తీసుకు వచ్చి టేబుల్

మీద పెట్టారు. “ఓహ్ ఆ అబ్బాయా, చూడటానికి బానే ఉంటాడు. మంచి వాడేనని అనిపించింది.

నీలాగే బి టెక్ చదివాడు కదా” అని చైత్ర అమ్మ గారు కూడా టేబుల్ దగ్గర కూర్చుంది.

అవునన్నట్టు చైత్ర తల ఊపింది. “కానీ.. ఇంకో సారి ఆలోచించు చైతు, నేను మీ డాడీ నీ కోసం

ఒక సంబంధం అనుకున్నాం. అబ్బాయి పిహెచ్డి, అమెరికా లో” అని కళ్ళు పెద్దవి చేసి చెప్తున్నారు చైత్ర అమ్మ గారు.

“మమ్మీ, డాడీ, నా మనస్తత్వానికి రిషి అయితే సరిపోతాడు. నాకు రిషి గురించి బాగా తెలుసు. అలాగే రిషి కి కూడా నా ఇష్టాయిష్టాలు, కోపతాపాలు అన్నీ తెలుసు. అందుకే ఇద్దరం కలిస్తే మా బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనిపించింది. మేము ఒకరినొకరం కాంప్లిమెంట్ చేసుకోగలం. “ అని చైత్ర తల్లి వైపు చూసింది.

“కాంప్లిమెంట్ ది ఏముంది? పెళ్లి అయితే ఎవరైనా అడ్జస్ట్ అయిపోతారు. ఎక్కువ చదువుకుని పెద్ద ఉద్యోగం వచ్చిన అబ్బాయి వస్తే, నువ్వు ఎక్కువ కష్టపడక్కర్లేదు కదా చైతు. రేపు మర్నాడు నీకు పిల్లలు పుడతారు, అప్పుడు ఇలా ఎలా పని చేయగలవు? ఒక సారి ఆలోచించుకో” అని చైత్ర తల్లి వేడి రోటీలు భర్త ప్లేట్ లో వేస్తూ.

“చూడు మమ్మీ, ఉద్యోగం చేయటం నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా. నాకు కావలసింది నన్ను అర్థం చేసుకుని, కెరీర్ లో నన్ను సపోర్ట్ చేసే అతను. పెళ్లి అయ్యాక నా స్పేస్ నాకు ఉండాలి. రిషితో అయితే అలాగ ఉంటుందని నాకు నమ్మకం. ఇంకా నేను మీ కళ్ల ఎదుటే ఈ ఊళ్లోనే ఉంటాను.” చైత్ర ధైర్యంగా తన సంజాయిషీని ఇచ్చింది.

“నువ్వు చెప్పింది ఒక రకంగా నిజమే అనుకో. మరి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో వాళ్ళ పద్ధతులు

ఏమిటో” అన్నారు చైత్ర నాన్న గారు రమేష్.

“వాళ్ళది మన రాష్ట్రం కాదు. కానీ వాళ్ళని నేను ఒక సారి ఆఫీసులో కలిశాను. ఆంటీ, అంకుల్

చాలా కూల్. రిషి వాళ్ళని ఆల్రెడీ ఒప్పించాడు. వాళ్ళకి కూడా చదువుకుని ఉద్యోగం చేసే కోడలే

కావాలిట. ఆంటీ వాళ్ళు వేరే ఊరు లోనే ఉంటారు కాబట్టి అర్థం చేసుకోవటానికి టైమ్ ఉంది. మీరు కూడా ఒక సారి వాళ్ళని కలిస్తే మీకు కూడా వాళ్ళ గురించి అర్థం అవుతుంది.” అంది చైత్ర

చేయి కడుక్కుంటూ.

“సరే, నీ నిర్ణయం మీద మాకు నమ్మకం ఉన్నా, మా సందేహాలు మాకు ఉంటాయి. ఒక సారి వాళ్ళ ఫ్యామిలీ ని కలిసి వద్దాం. వాళ్ళని చూసి వచ్చాకే మన అందరం కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం, సరేనా. ” అంది

చైత్ర తల్లి కల్పన రమేష్ వైపు చూస్తూ. రమేష్ అవునన్నట్టు తలూపాడు. అంతలో చైత్ర వెనుక నుండి వచ్చి తల్లిని చుట్టేసి “అమ్మా, డాడీ మీరు ఇంత ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తారని నాకు తెలుసు. మీ అభిప్రాయం ఏదైనా నేను గౌరవిస్తాను. పెళ్లి రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం అని నాకు తెలుసు. మీకు వాళ్ళ ఫ్యామిలీని కలిసిన తరువాత ఏదైనా తీవ్రమైన అభ్యంతరాలు వస్తే మేము స్నేహితులుగా ఉండిపోతాం” అంది.

కల్పనకు తన గతం గుర్తుకు వచ్చి ఒక సారి చెంప నిమురుకుంది. తన తండ్రి ఆ రోజు హితబోధ

చేసిన తరువాత తనకు బాధ్యత తెలిసి వచ్చింది. రెండు నెలల తరువాత 'రాజేష్ కు కావలసింది కేవలం టైమ్ పాస్ గాని, బాధ్యతలు తీసుకోవటానికి సిద్ధంగా లేడు' అని అర్థం అయ్యింది. అప్పుడు తన తప్పును గ్రహించి తల్లిదండ్రులు చూపించిన రమేష్ ను పెళ్లి చేసుకుంది. తన లాగే తన కూతురు తప్పు చేయకూడదని చిన్నప్పటి నుండి కూతురికి స్వతంత్రత తో బాటు బాధ్యతను, సరయిన నిర్ణయం తీసుకునే వివేకాన్ని నూరి పోసింది. అది ఈ రోజు తన కూతురు తీసుకున్న నిర్ణయం తో రుజువు అయ్యింది అని కూతురు కేసి గర్వంగా చూసింది.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


218 views3 comments

3 Comments


Saroja Sahas
Saroja Sahas
Jan 21, 2021

aadhunika streelu intha vivekam tho nirnayam teesukuntaaru ani sarigga cheppaaru.

Like

Mini Sri
Mini Sri
Jan 19, 2021

Thanks Chandini for your valuable comments.

Like

Chandini Balla
Chandini Balla
Jan 12, 2021

చైత్ర పాత్ర పరిపక్వత నచ్చింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే స్నేహంగా migilipotam అన్న ఆమె ఆలోచనా తీరు చాలా బాగుంది.👏👏

Like
bottom of page