top of page

కాఫీ


'Coffee' New Telugu Story


Written By Sujatha Thimmana(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అమ్మ ఫోటో ముండు పొగలు గ్రక్కుతున్న కాఫీ గ్లాసు పెడుతూ...దుఃఖం ఆపుకోలేక పోయింది మంజుల .

పీట మీద వెలుగుతున్న దీపం చిరు గాలి తెరలకు మెల్లగా ఊగుతూ ఓదారుస్తుంది అమ్మ చల్లని స్పర్స లా.

"అమ్మ గా తను సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా ..తనని కన్న అమ్మని అలక్ష్యం చేసానేమో..."అన్న బాధ ఎదలో సుడులు తిరుగుతూ

ఉంటె ముడుచుకొని కూర్చున్న మోకాళ్ళపై తల ఆన్చి వెక్కి వెక్కి ఏడ్వసాగింది మంజుల.


"పాపా! ఒక్క సారి చూడాలని ఉందమ్మా..!" అని ఎంతగా కలవరించింది. తనకమో రావడానికి వీలుపడలేదు . ఆఖరి క్షణాల్లో కూడా తను దగ్గర లేకపోయింది.


"మమ్మీ ! కంట్రోల్ యువర్సేల్ప్! అమ్మమ్మ వియోగం తననీ భాదిస్తున్నా...తనను కన్న అమ్మను అనునయిస్తూ నిఖిత అమ్మని వాటేసుకొని ఓదార్చాలని ప్రయత్నిస్తుంది.


*******

1963..ఆ రోజుల్లో ఇంచు మించు అందరి ఇళ్ళల్లోనూ కుంపట్లు ఉండేవి. కుంపటి అంటే. (బొగ్గులతో మండే పొయ్యి ) కుంపట్లో సైజు ఇత్తడి గుండిగలోని మరుగుతున్న నీళ్ళలో కాఫీ పొడి వేసి

మూత పెట్టి దించేసారు నారాయణ రావు గారు.

అయిదు కాక మునుపే నిద్రలేచి పాలు పోయించు కొచ్చేవారు . ఆ సమయానికల్లా లలితాంబ వాకిలి ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి కుంపటి వెలిగించేది. నారాయణరావుగారు కాఫీ డికాషన్ కాచేవారు .అది వారి రోజు ఉదయపు దినచర్య. పాలు కూడా కాగిన తరువాత ఇద్దరు చెరొక గ్లాసు (పెద్దది) నిండా కాఫీ కలుపుకొని త్రాగేవారు మాట్లాడుకుంటూ అలా వంటింట్లోనే పీటలపై కూర్చుని.


(బ్రిటిష్ వాళ్ళ దాస్యశృంకలాలను తెంచు కొనడానికి హరహరము పోరాడి చివరికి భారత దేశం అంతా ఒక్కటై "అహింస " ఆయుధంగా "సత్యాగ్రహం "సాయుధంగా గాంధీగారి న్యాయకత్వంలో స్వతంత్రం సంపాదించుకున్నాము కాని..వాళ్ళు మనకి నేర్పి వెళ్ళిన ఈ కాఫీత్రాగే అలవాటుని మానలేక పోతున్నాం .

పొద్దున్నే ఓ గ్లాసు కాఫీ పడందే ఈ మిషన్ (శరీరం) కదలని మొరాయిస్తుంది ఏంటో?


తనలో తనే అనుకుంటూ పైకే అనేస్తూ ఉంటారు రోజుకొకసారయినా నారాయణరావు గారు .


చీకటి దుప్పటిని తోసేస్తూ తొలి కిరణాల కాళ్ళతో తన్నుతూ సంధ్య ఒడిలోంచి లేస్తూ ఉంటాడు బాల భానుడదే సమయానికి.

మంజుల , మనోహర్ రెండేళ్ళ తేడాతో ఇద్దరు పిల్లలు . ఆదాయపు శాఖలో చిన్నపాటి గుమాస్తాగా ఉద్యోగం నారాయణరావు గారిది. నిజనికయితే ఆ శాఖలో పనిచేసే ఎవరయినా...అంతో ..ఇంతో...సంపాదించు కునేవారే కానీ... నారాయణరావుగారు గాంధీగారి హయాములో వారి ఆశయాలతో జీవంపోసుకున్నవారు, నిజాయితీ ఉపిరి ఆయనకి. ఆత్మ స్తైర్యం ,స్వాభిమానం .అయన ఆహారాలు మరి ఆయనకు అన్ని విధాల తగిన అనుకూలవతి అయిన ఇల్లాలు లలితాంబ.

ఎప్పుడూ ఆప్యాయతల పొదరిల్లులా ఉంటుంది ఆ చిన్న పెంకుటిల్లు.


అయన చేసిన కాఫీ త్రాగుతూ అయన భావాలని జీర్ణం చేసుకొని ఆ కొమ్మలోనుంచి వచ్చిన పూవులాగే మంజుల పెరుగుతుంది . కొద్దో గొప్పో ..తమ్ముడనని గారం వల్ల కొంచం పెంకితనం అబ్బినా బుద్దిగా చదువుకునేవాడు మనోహర్.

కాలమనే పాకుడు రాళ్ళపై సంవత్సరాలెప్పుడు జారిపడిపోతూనే ఉంటాయి మరి.


డిగ్రి వరకు చదువుకుంది . పై చదువులు చదవాలని ఉన్నా "మంచి సంబంధం వచ్చింది కదమ్మా.. ఉద్యోగంతో పాటు...అబ్బాయి కూడా చక్కగా ఉన్నాడు " అని నాన్న చెప్పిన మాటకి కట్టుబడి వివాహానికి తల వంచింది. భర్త ఉద్యోగరీత్యా డిల్లి వెళ్లిపోవలిసి వచ్చింది మంజులకి .


మనోహర్ చదువులో ఉన్నతంగా ఉండటమే కాదు మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు హైదరాబాదులో. తప్పని సరిగా తల్లి తండ్రులకు దూరంగా ఉండవలిసి వచ్చింది.. తనతోటి సహా ఉద్యోగి అయిన అవంతిని ఇష్టపడ్డాడు . అతని కోరికపై అవంతి తల్లితండ్రులతో మాట్లాడి ఇరు పక్షాల సమ్మతితోనే వివాహం జరిపించారు.


రిటైర్ అయిన నారాయణరావుగారు భార్యతో కలిసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు ఉన్నంతలో.

తోటివారికి సహాయం తను చేయగలిగినంత చేస్తూ....

'లలితా! అలా బాబాగారి గుడివరకు వెళ్లి వస్తా....' అంటూ దగ్గరే ఉన్న గుడికి వెళ్లారు నడుచుకుంటూ...

దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చున్నారు మెట్లపై వచ్చేపోయే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ...

చిరు చీకట్లు ముసురుతుండటంతో మెల్లగా లేచారు. మెట్టు దిగబోతూ...తూలి అమాంతంగా కింద పడ్డారు. నుదురుకి గట్టు గట్టిగా కొట్టుకుంది. రక్తం ధారాపాతంగా కారసాగింది. అప్పుడే అటుగా వెళుతున్న 'రఘు' (పక్కింటి అబ్బాయి ) చూసి ' అరె రే...బాబాయ్ ఏమైంది...!' అంటూ పిలుస్తూనే ..కదిపి చూసాడు...అప్పటికే..సృహ కోల్పోయారు ..వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు...అయినా లాభం లేక పోయింది. ఆయన సున్నితమైన హృదయం పని చెయ్యనని మొరాయించింది.

లలితమ్మ నిశ్చేష్టురాలే అయింది. ఇప్పుడే వస్తా అని వెళ్ళిన మనిషి తిరిగి రాని లోకాలకి వెళ్లి పోయారని. ఆవిడని ఓదార్చలేని పరిస్థితి. మనోహర్..మంజుల కుటుంబాలతో సహా హుట హుటిన వచ్చారు. జరగవలసిన కార్యక్రమాలన్ని బంధువుల సహాయంతో జరిపించేసారు.


******


అమ్మని ఆ ఊరిలో ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు ఇద్దరు పిల్లలకి .ఆవిడ తను రాలేనని ఎంతగా చెప్పినా ..వినలేదు . మంజుల తనతో రమ్మంది ...కానీ ఆవిడ కూతురింటికి అసలు రానంది.

మనవరాలు గారాలు పోయినా కూడా...తను సర్ది చెప్పింది. మనోహర్ అతి బలవంతం మీద తనతో హైదరాబాద్ తీసుకొచ్చాడు .


మనోహర్ ఇంట్లో ఆవిడకి ఏమి తోచటం లేదు . ఉదయాన్నే ఆవిడకి ' కాఫీ ' (పెద్ద గ్లాసు) త్రాగటం అలవాటు కధా! కోడలు అవంతికి అసలు కాఫీ, టీ త్రాగటం అలవాటు లేదు. మనోహర్ కి కూడా ఆ అలవాటు మానిపించేసింది. ఇంట్లో అసలు కాఫీ..టి పౌడర్ తేరు. మొదట రెండు రోజులు ఎలాగో అలా గడప గలిగింది లలితమ్మ .


మూడోరోజు.." బాబు! మనోహర్..! నాకు ఉదయాన్నే కాఫీ తాగందే...ఉండలేనురా.." అంటూ చెప్పలేక చెప్పింది.

అతని జవాబు కంటే ముందే కోడలు అవంతి అందుకొని .." అత్తయ్యగారు! కాఫీ త్రాగటం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు, కాఫీ లో కఫయిన్ అనే పదార్ధం వాళ్ళ అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెదడు మొద్దు బారి పోతుంది. నిద్ర లేమి..అలసట..క్రమంగా శరీర బాగాలు పని చెయ్యటం మనివేస్తాయి. అత్తయ్యగారు..! నేనిలా చెపుతున్నానని ఏమి అనుకోకండి...! మీరు ఆరోగ్యంగా ఉండటమే మెమూ కోరుకునేది " అంటూ ఒక గంట సేపు ఉపోద్గాతం ఇచ్చింది .


అవంతి చెప్పిన వన్ని విని తిరిగి మాట్లాడలేక పోయింది లలితమ్మ . ఆవిడ పరిస్థితిని అర్ధం చేసుకోలేక పోయాడు కొడుకు మనోహర్.

భార్య మంచే చెపుతుంది కదా..అనుకుని..." నిజం అమ్మా ! కాఫీ త్రాగటం మెల్లగా మానివేసేస్తే సరి.

తెలిసి తెలిసి ఆరోగ్యం పాడు చేసుకోవటం ఎందుకు చెప్పు " తల్లి బుజం మీద చెయ్యి వేస్తూ అనునయంగా చెప్పాడు మనోహర్.


యాబై సంవత్సరాలుగా అలవాటైన వ్యవహారం. కాఫీ త్రాగందే ఆవిడ దినచర్య ప్రారంబం కాదు . అటువంటిది కాఫీ లేకుండా ఉండటం ఆవిడకి కళ్ళు గాలిలో తేలిపోతున్నట్టు., ఒళ్ళు తులి పడుతున్నట్టు ఎదో లాగా అయిపోతూ ఉంది ఆవిడకి .


నిజానికి చెప్పాలంటే....ఆవిడకి ఏ విధమయిన ఆరోగ్యసమస్యలు లేవు. భర్త అకాలమరణం ఒక వైపు ఆవిడని క్రుంగ దీస్తూ ఉంది. స్వతః మిత భాషి, మృదు స్వభావం.. భర్త కనుసన్నలలో బ్రతికిన బేలతనం ఆవిడను మౌనంగా దిగులును దిగమింగేలా చేస్తున్నాయి.


కోడలు తనే వంట చేస్తుంది. వంటికి ఇలా ఉంటె మంచిది, అలా వండకూడదు అని అనేక ఆరోగ్యసుత్రాలు వల్లె వేస్తూ.....పొద్దున్నే పాలు త్రాగమంటుంది. ఆవిడకి పాలు అసలు పడదు. అన్ని కూరలు చప్పగా...సగం ఉడికి ఉడకక ఉంటాయి . తను ఏమి చెప్పలేని పరిస్థితి.


అమ్మాయి మంజుల కి చెప్పి చూసింది ఫోన్లో ఒక సారి ...కానీ కూతురు కుడా కోడలి వెనకేసు కోస్తూ.."హాయిగా చేసి పెడుతుంది కదా అమ్మా! ఎదో అలా తిని రెష్ట్ తీసుకుంటూ ఉండమ్మా!" అని సర్ది చెప్పింది.

కానీ కాఫీ త్రాగటం తనకు కుడా అలవాటే కాబట్టి తమ్ముడికి అర్ధమయ్యేలా చెప్పింది..

"అమ్మ కాఫీ త్రాగకుండా ఉండ లేదురా.మను! అవంతికి ఈ విషయంలో కొంచం చెప్పరా!' అని.


కానీ ..అతను భార్యకి ఎదురు చెప్పలేకపోయాడు..ఆవిడ క్రమంగా నీరసించి ..లేవలేని స్థితిలోకి వెళ్ళసాగింది. కోడలు మెల్లగా విసుక్కోవడం ప్రారంభించింది. గుడ్ల నీరు కుక్కుకుంటూ...విపరీతమయిన మనస్థాపానికి గురి కాసాగింది లలితాంబ. నలుగు నెలలు కూడా గడవకుండానే...రాత్రి పడుకున్నది మరి లేవలేదు.ఈ రోజుకు ఐదో రోజు.


స్వగతంలో అనుకుంటూనే......

"బేబీ! నిఖీ! ఎట్టి పరిస్థితులలోనూ నేను చనిపోయే వరకు కూడా...కాఫీ త్రాగొద్దు అని చెప్పోద్దమ్మా.!!" కడివెడు నీళ్ళను చీరకొంగుతో తుడుచుకోవటానికి ప్రయత్నిస్తూ... అంది మంజుల.


'మమ్మీ! ఏంటి ఈ పిచ్చి మాటలు. నాకు తెలుసు కదా....అమ్మమ్మ అసలు అమాయకంగా దిగులు పెట్టుకుంది ..." ఇక ఆపై మాట్లాడలేక తను కూడా తల్లి ఒడిలో ఒదిగిపోయింది నిఖిత.


"నిజంరా...నిఖీ! ఒక వయసు వచ్చినవారిని తరువాత ఆరోగ్య సూత్రాలు పాటించమని చెప్పాలి కానీ..పూర్తిగా నిర్భందించ కూడదు వారి వారి అలవాట్లని.

పరిస్థితులు, కాలం,స్థల మార్పు, అలవాట్లు మనిషిని ఏ రీతిగా క్షీణింప జేస్తాయో....అమ్మమ్మే ఉదాహరణరా..ఆరోగ్యపరంగా తనకి బి.పీ. షుగర్ ...లాంటి ఏ రకమయిన సమస్యలు లేకున్నా...

మానసికంగా తనని తను కుంచింప జేసుకుని ...ప్రాణాల మీదకి తెచ్చుకుని మనని వదిలి వెళ్లి పోయిందమ్మా!!" ఇక ఆపై మట్లలేక..వెక్కిళ్ళు పట్టింది మంజుల.


(ఉపాధ్యాయ మాస పత్రికలో అచ్చయిన కథ)

**సమాప్తం**

సుజాత తిమ్మన గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


********* సమాప్తం *******

రచయిత్రి పరిచయం: పేరు సుజాత తిమ్మన.

డిగ్రీ చదువుతుండగానే వివాహం... ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు.

చిన్నప్పటి నుంచీ మనసులో కలిగిన భావాలను నోటు పుస్తకంలో వ్రాసుకోవడం అలవాటు.

అలా కవితలు లెక్కకు మించి వ్రాసాను, వ్రాస్తూనే ఉంటాను.

ఆంధ్ర భూమి సచిత్ర వార పత్రికలో తరచుగా ప్రచురితం అయ్యేవి.

బహుమతులు, ప్రశంసా పత్రాలు రావడం సర్వ సాధారణం.

ముఖ పుస్తకంలో అనేక సమూహాలలో నేను కనిపిస్తూనే ఉంటాను.

30 కథల వరకు వ్రాసాను. ఇక ఈ కథ "అర్థాంగి" నమస్తే తెలంగాణ వీక్లీ లో అచ్చయిన కథ.

మన తెలుగు కథలు లో నన్ను చేర్చుకున్నందుకు ధన్యవాదాలతో...

సుజాత తిమ్మన.


45 views2 comments

2 Comments


Shantha Peddireddy • 2 days ago

పెద్ద వాళ్లను మరీ అంతగా నిర్భందించరాదు

Like

naaj • 2 days ago

కథ చాలా బాగా వ్రాశారు సుజాత గారు మీకు హృదయపూర్వక అభినందనలు

Like
bottom of page