top of page

డబ్బు విలువ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Dabbu Viluva' New Telugu Story Written By Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ


“ఏమయ్యా సత్యమూర్తి … నీ భార్య పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారట,

మరి తిండితిప్పలు ఎలా గడుస్తాయి? ఎన్ని రోజులని పస్తులుంటావు ? ఎవరు పెడతారు రోజూ నీకు.. రోజు రోజుకు శరీరం క్షీణించి పోతోంది. నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుందయ్యా”, అంటూ వచ్చాడు సత్యమూర్తి చిన్నప్పటి స్నేహితుడు సాంబయ్య.


“ఏం చెయ్యమంటావు సాంబయ్యా! నేను ఎందుకూ పనికిరాని వాణ్ణి. తినడానికి

తప్ప నయాపైసా సంపాదనలేని వాణ్ణి. కట్టుకున్నవాడు సంపాదిస్తేనే భార్య పిల్లలు

సుఖపడేది. అలాంటప్పుడు వాళ్ళను నేను ఏ విధంగా సుఖపెట్టలేనప్పుడు, నాతోనే

ఎలా ఉండగలరు? అందుకే సాంబయ్యా! వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు..” కళ్ళల్లో నీళ్ళు రాగా గొంతు బాధతో పూడుకుపోగా చెప్పడం ఆపాడు సత్యమూర్తి.


“ ఛా, ఛా… ఊరుకో సత్యం, అలా బాధపడితే ఎలా ? నువ్వు ఏదైనా పని వెతుక్కుని, నీ భార్యపిల్లలను తీసుకవచ్చేసుకో. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే రేపు నీగతి ఏంటి ఆలోచించావా? నీ భార్య… వాళ్ళ పుట్టింటిలో పిల్లలతో హాయిగా ఉంటుంది, నువ్వు ఇలా ఇంటిలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే నిన్ను పాపమనే వారే ఉండరు తెలుసా? నామాట

విని ఏదైనా పని వెతుక్కునే ఆలోచన చెయ్యి. అర్ధమయిందా? ఏదో నా స్నేహితుడివని నిన్నుఈ స్థితిలో చూడలేక చెబుతున్నాను. నిన్ను చూస్తే జాలి వేస్తోంది. ఇదిగో నీకోసమని ఇంత తొక్కన్నం తీసుకవచ్చాను. ఇంద తీసుకో,” స్నేహితుడిని చూసి బాధపడుతూ చెప్పాడు సాంబయ్య.


“సాంబయ్యా… నాకోసం బాధపడే వాళ్ళు కూడా ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కన్నతల్లి తండ్రులు నన్ను వదిలేసారు. కట్టుకున్న భార్యకు నేను పనికిరాకుండాపోయాను. పిల్లలకు పట్టెటడన్నం పెట్టలేని నన్ను ఎవరుమాత్రం భరించుకుంటారు చెప్పు సాంబయ్యా!


నేను ఏ పని చేద్దామన్నా నన్ను చూసి నాకు ఎవరూ పని ఇవ్వరు. ‘నువ్వేం చేస్తావు.. నీ నుండి కాదు’ అంటూ తరమేస్తారు, పీలగా ఉన్న నా అవతారం చూసి. పోనీ … ఏదైనా వ్యాపారం చేద్దామన్నా పొట్ట చీరితే అక్షరం ముక్కరాదు, ఇక నన్ను ఏం చెయ్యమంటావు ? ఆ లక్ష్మీదేవికి, సరస్వతి దేవికి నేను ఏ జన్మలో ఏదో పాపం చేసుంటాను. అందుకే వాళ్ళు నాకీ శాపం ఇచ్చినట్టున్నారు. బ్రతికినంత కాలం బ్రతుకుతాను,” బాధపడుతూ చెప్పాడు సత్యమూర్తి.



“ ఏంటోనయ్యా… నిన్ను చూస్తూ బాధపడడం తప్ప ఏం చెయ్యలేకపోతున్నాను. ఎవరికెంత రాసిపెట్టి ఉంటే అంతే జరుగుతుంది. ఏం చేస్తాం.. అనుభవించక తప్పదు. సరే మరి.. వస్తా” అంటూ వెళ్ళిపోయాడు సాంబయ్య.


ఒంటరిగా కూర్చోని తనలో తానే బాధపడుతూ ఒకపుల్ల చేతిలోకి తీసుకొని భూమిమీద గిల్లుతూ కూర్చున్నాడు. ఇది రోజూ చేసేపనే. అలా గిల్లుతూ గిల్లుజూ ఉండగా లోపలనుండి మిలమిలా మెరుస్తూ ఖంగుమని చప్పుడు వినిపించింది.మళ్ళీ చూసాడు. అలానే చప్పుడు వచ్చింది. ఇంకా కొంచెం లోతుగా తవ్వాడు. ధగధగలాడుతూ కనిపించింది లంకెబిందె. భయంతో బిగుసుకుపోయాడు.


“ ఓయ్ సత్యమూర్తి … నిన్నే పిలుస్తున్నాను. ఏంటి అలా భయపడుతూ దిక్కులు చూస్తున్నావు? నేనే లక్ష్మీదేవిని.. నీ కోసం వచ్చాను” అంది లక్ష్మీదేవి.

కానీ కనిపించడం లేదు. అందువల్ల అటు ఇటు చూస్తున్నాడు.


“ ఎవరదీ… ఎవరూ కనుపించరే, అనసూయ నువ్వేనా అలా మాట్లాడుతున్నది, ఎక్కడున్నావు? ఇంతరాత్రి తిరుగుతుంటే నిన్ను కర్రలతో కొడుతారు. ముందే నిన్నందరూ పిచ్చిదాని వంటున్నారు. మళ్ళీ ఇదో కొత్తవేషమా,” అంటూ లేచి చూసాడు. చీకటిలో ఎవరు కనిపించలేదు. గజ్జెల గలలు వినిపిస్తున్నాయి. సుగంధపరిమళాలు వెదజల్లుతున్నాయి.


మనసులో ఏదో భయం ఆవరించసాగింది సత్యమూర్తిలో.


“ ఏమిటిరా నన్నే గుర్తు పట్టలేవా? నిజంగా నేను లక్ష్మీదేవినిరా! నువ్వు బాధపడుతూ నాగురించే తలుచుకుంటున్నావు కదా! నీకు అష్టదరిద్రాలు ఉన్నాయనే కదా నీ భార్య పిల్లలు, నీ కన్నతల్లితండ్రులు నిన్ను విడిచిపెట్టారు. అందుకే నీ బాధచూడలేక నేనే వచ్చాను, నన్ను ఇంటిలోనికి ఆహ్వానించవా! నేను రావడంతోనే నీవాళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు”, అంది గలగలానవ్వుతూ, గల్లుగల్లుమని గజ్జెలసవ్వడి చేస్తూ.


“ అమ్మా తల్లి , నువ్వు నిజంగా లక్ష్మీదేవివో, దెయ్యానివో నాకర్థం కావడంలేదు, దెయ్యానివైతే నాదగ్గర ఏమి ఉందని నువ్వు వచ్చావో నాకు తెలియదు. నా భార్యపిల్లలకే నేనక్కరలేదని వెళ్ళిపోయారు. పోనీ … నువ్వు నిజంగా లక్ష్మీదేవి అంటే మాత్రం నాకు వద్దు అమ్మా! ఎందుకంటే నువ్వు ఎప్పుడు నిలకడగా ఉండేదానివి కాదు. నిన్ను నమ్ముకుంటే నట్టేటముంచి పోతావు. చపలచిత్తురాలవు, నా మానాన నన్ను బ్రతకనివ్వు. నీకు దండంపెడతాను” అంటూ రెండుచేతులు జోడించి దండంపెట్టాడు.


పకపకా నవ్వింది లక్ష్మీదేవి. “ సత్యమూర్తీ … నీకెందుకురా నామీద అంతకోపం,\? పాపం కష్టపడుతున్నావు కదాని నీకు సహాయం చేద్దామని వచ్చాను. నువ్వు పొమ్మన్నపుడే వెళ్ళిపోతాను. నాకై నేను నిన్ను వదిలిపోను. నిజం చెపుతున్నాను. నన్నునమ్మురా,” అంది.


“ ఏమో తల్లీ … నిన్ను నమ్మాలంటే నాకు భయంగా ఉంది. అయినా నామీద నీకెందుకు ఇంతదయ కలిగిందో నాకర్ధం కావడంలేదు. నన్నో పిచ్చివాడిని అనుకుంటున్నావా తల్లీ!

జీవితంలో అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ దయ ఏదో ఆరోజుల్లోనే ఉంటే మా కాపురం బాగుండేది కదా! అంతా అయిపోయాక తగుదునమ్మా అంటూ వచ్చావు. నాకెందుకో నీమీద నమ్మకం కుదరడంలేదు. నీదారి నువ్వు చూసుకో తల్లీ! నాకేమీ వద్దు. నన్నిలా బ్రతుకనివ్వు చాలు” అన్నాడు.


” ఏమిట్రా.. నేను వస్తా వస్తా అంటే వద్దంటున్నావు? నీ బాధలు చూడలేకనే వచ్చాను. నువ్వు వద్దన్నా నేను నీతోనే ఉంటాను. అంతేకాదు. నువ్వు ఎప్పుడైతే మూడుమార్లు నన్ను వెళ్ళిపొమ్మంటావో అప్పటివరకు నేను వెళ్ళనే వెళ్ళనని నీకు మాటిస్తున్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా,” అడిగింది లక్ష్మీదేవి.


ఆలోచనలో పడ్డాడు సత్యమూర్తి. ‘ఇదేదో బాగానే ఉంది. నేను మూడుమార్లు వెళ్ళమంటేనే వెళుతుందట. తనకై తాను వచ్చింది కనుక నేను వెళ్ళమనే ప్రసక్తే రాకుండా చూసుకుంటాను. అదికూడా మూడుమార్లు అంటేనే కదా! సరే నేనే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక అప్పుడు ఎక్కడకు వెళ్ళే ఆలోచననే ఉండదు’ అని మనసులో అనుకుని. “ఇదిగో తల్లీ! నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పకూడదు మరి” అని అడిగాడు.


“ ఓరేయ్ సత్యమూర్తి… నా కన్నబిడ్డలాంటివాడివి.. నిన్ను మోసం చేస్తానట్రా? నువ్వు నీభార్యపిల్లలతో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పకు,” అంటూ తన నిజస్వరూపం చూపింది.


ఆశ్చర్యంతో అమ్మవారి దివ్యమంగళ స్వరూపం చూస్తూ తననోటికి వచ్చిన లక్ష్మీదేవి స్తోత్రం చదివాడు. అమ్మవారు చాలా సంతోషపడి పోయింది. ఒంటినిండా ధగధగ మెరుపులతో కలువ రేకులవంటి కన్నులతో చిరుదరహాసం ఒలికిస్తూ, గల్లుగల్లున కాలియందియలు మ్రోగుతుండగా సుతిమెత్తని పాదాలను అలవోకగా కదుపుతూ ఇంటిలోనికి వచ్చేసింది తల్లి.


ఆనంద పారవశ్యంతో అలానే చూస్తూ, తన ఒంటిని ఒకసారి గట్టిగా గిల్లుకున్నాడు సత్యమూర్తి, ఇదంతా కల కాదు కదా! అనుకుంటూ.

‘అమ్మా’ అని అరిచాడు నొప్పితో.

‘కలకాదు నిజమే. లక్ష్మీదేవి నన్ను కనికరించింది. ఇప్పుడు నేను శ్రీమంతుడ నవుతాను. అందరిలాగా నేనూ సంతోషంతో ఉంటాను’ అనుకున్నాడు.


అనుకున్నట్టుగానే పూరిల్లుపోయి పెద్ద బంగళా తయారయింది. భార్యపిల్లలు, కన్న తల్లితండ్రులు వాళ్ళంతట వాళ్ళే వచ్చేసారు. ఇక దేనికి లోటులేకుండా పచ్చని సంసారంతో కళకళలాడుతూ జీవించసాగాడు. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నామం మరవకుండా జపిస్తూనే ఉన్నాడు. పిల్లల చదువులు అయిపోయి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసాడు. తల్లితండ్రులను కంటికిరెప్పలా కాపాడుకోసాగాడు.


భార్యకు ఏ విషయంలోను లోటులేకుండా చేసాడు. ఈ పదిహేను సంవత్సరాల కాలంలో గతంలో తను పడిన కష్టాలన్ని మరచిపోయాడు. ఇక కష్టాల కడలి తన దరికి రాదు అనుకుని గర్వం మొదలైంది మనసులో. ఇంతలో లక్ష్మీదేవికి ఇన్నాళ్ళు ఇక్కడే ఉండడంతో విసుగు మొదలైంది. ఎలాగైనా ఇక్కడినుండి బయటపడాలని ఆలోచించసాగింది. నా అంతట నేను వెళతానంటే సత్యమూర్తి ఒప్పుకోడు. పోనీ , అతనే పొమ్మని అంటాడా అంటే అసలు అనడు.

ఎందుకంటే దారుణమైన కష్టాలు అనుభవించాడు కనుక. నేనే అనవసరంగా తొందరపడి మూడుమార్లు అంటేగాని గడపదాటి వెళ్ళనని చెప్పాను.

ఇప్పుడెలా?

‘ఆహా.. ఒక ఉపాయం తోచింది’ అనుకుంటూ సత్యమూర్తి ఎదుట నిలుచుంది. చిరిగిన చీర చింపిరిజుట్టుతో, చూడగానే పూటకుగతిలేని దానిలా కనిపించింది. ఏదో పరాకులో ఉన్న సత్యమూర్తికి ఆమెను చూడగానే ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. దరిద్రమంటే ఏంటో అనుభవించాడు కనుక

ఆమెను సహించుకోలేకపోయాడు. చీదరించుకున్నాడు.


“ ఏయ్ …ఎవరు నువ్వు ? నా గడపలో కాలుపెట్టడానికి ఎంత ధైర్యం? ఎవరిని అడిగి లోపలికొచ్చావు? వెళ్ళు వెళ్ళు.. ముందు నా కళ్ళముందునుండి వెళ్ళిపో,” అంటూ గదమాయించాడు.


తననుకున్నట్టుగా సత్యమూర్తి కోపంతో వెళ్ళుమని మూడుమార్లు అన్నాడు. నన్ను గుర్తుపట్టలేడు కనుక అలా అన్నాడు. నేను నేనుగా వస్తే నన్ను వెళ్ళమని అనడుకదా!

సరే ఎందుకైనా మంచిది ఇంకోమారు అడిగిచూస్తా అనుకుంది మనసులో.


“ ఏమయ్యా … నన్ను చూస్తే అంత అసహ్యించుకుంటున్నావు, నేను నీలాంటి మనిషినే కదా? నేనేం ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు, మంచి మనసుతో ఏదైనా ఇవ్వకపోతావాని చూస్తున్నాను,” అంది.


ముఖమంతా చీదరించుకుంటూ “ ఛీ , ఛీ , నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉన్నావు, ముందిక్కడనుండి వెళతావా లేదా,?అన్నాడు గట్టిగా.


“ వెళ్ళపొమ్మంటావా? నిజంగానే పొమ్మంటావానయ్యా, ఇదిగో నేను వెళ్ళిపోయాక నీ మనసు మార్చుకుని ఏమన్న ఇద్దామని నన్ను పిలిచావనుకో … అప్పుడు నేను రానేరాను ,” అంది అమాయకంగా ముఖంపెట్టి.


“ ఛీ, ఛీ … నిన్ను మళ్ళి రమ్మని పిలుస్తానా! చచ్చినా పిలవను. ఫో, ఫో, ఫోవమ్మా ,” అంటూ గడపవరకు వచ్చి ఆమెను బయటకు గెంటినంత పనిచేసాడు.


“ సరే , అయితే పోతున్నాను, ఓరేయ్ సత్యమూర్తి … నువ్వు మూడుమార్లు పొమ్మని అంటేనే వెళ్ళిపోతున్నాను, నాకై నేను పోతున్నా అనుకుంటున్నావేమో. నువ్వు వెళ్ళమంటేనే వెళుతున్నాను. జేష్టాదేవి నీ ఇంటిముందు నిలుచుంది. కానీ నిన్ను పెద్దగా ఇబ్బంది పెట్టొద్దని చెప్పాను, నువ్వేమి దిగులుపడకు,” అంటూ అంతర్ధానమొందింది లక్ష్మీదేవి.


అలానే నిర్ఘాంతపోతూ చూస్తూ నిలుచున్నాడు. కాసేపటికి తేరుకుని ” తల్లీ … నాకు తెలుసు నువ్వీ పని ఎప్పుడో చేస్తావని. అందుకే పొరపాటున కూడా ఎవరు ‘వెళతా’ అన్నా కూడా ‘వెళ్ళిరా’ అనేవాడిని. అలాంటిది ఈ రోజు నీమాయతో నన్ను మోసం చేసావు. నన్ను మళ్ళీ బికారిని చేద్దాం అనుకున్నావా తల్లీ! ఇన్నాళ్ళు ఎంతో సంతోషం అనుభవించాను. చాలా సంతోషం తల్లీ! అమ్మా … నేను నిన్నింకేమీ కోరనుగానీ, దరిద్రాన్ని మాత్రం ఇవ్వకు. పచ్చిపులుసు ప్రసాదమైనా సరేగానీ, తృప్తిగా ఉండేలా దీవించు,” అని మొరపెట్టుకున్నాడు.


“ అలాగే సత్యమూర్తి… నీకు ఇప్పుడున్నంత డబ్బు లేకపోయినా, తిండికి బట్టకు కొదవలేకుండా చూసుకుంటాను ,” అంది అశరీర రూపంలో.


రెండుచేతులెత్తి నమస్కరించాడు సత్యమూర్తి. డబ్బు విలువతెలిసివాడు కాబట్టి ‘ఉన్నంతలో ఖర్చుపెట్టుకోవాలి. లేనిపోని ఆడంబరాలకు పోవద్దు’ అనుకున్నాడు. ‘అయినా నేను కుటుంబం కోసం చెయ్యవలసినదంతా చేసాను. రామకృష్ణా అనుకుంటూ కాలం గడుపుతాను. ఈ ఇల్లు, ఉన్న సంపాదన కొడుకుకు అప్పచెప్పానంటే , పిడికెడు తిండిపెట్టకపోతారా నాకు నా భార్యకు..’

అనుకుంటూ మనసు దిటవు చేసుకున్నాడు సత్యమూర్తి.


॥॥ శుభం ॥॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ (త్రిగుళ్ళ)

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్



















123 views3 comments
bottom of page