top of page

దేశం కోసం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Desam Kosam' New Telugu Story

Written By Sita Mandalika


రచన: సీత మండలీక






ఫిబ్రవరి నెల. గజ గజ వణికించే చలి. దానికి తోడు దట్టమైన పొగ మంచు వల్ల పక్కనున్న మనిషి కూడా కనబడని పరిస్థితి. ప్రజలంతా రగ్గులు రజాయ్ లు కప్పుకుని ఇళ్లల్లో వెచ్చగా పడుకుని ఉంటే మన సిపాయిలు దేశ రక్షణ కోసం చలిని, మంచుని లెక్క చెయ్యకుండా ఆఫీసర్లు మొదలుకొని జవానుల వరకు ఢిల్లీ స్టేషన్ లో తెల్లవారు ఝామున నాలుగు గంటలకి స్పెషల్ ట్రైన్ కోసం వేచి ఉన్నారు.


ఢిల్లీ నించి జమ్మూ చేరేక అక్కడినించి వారి వారి నియమిత స్థలాలకి మిలిటరీ వాన్ ల లో చేరతారు. వార్ మొదలైందని అందరి సెలవులు రద్దు చేసి ఢిల్లీ చేరమని ఆదేశాలు వచ్చేయి.

ట్రైన్ వచ్చిన వెంటనే అందరూ తమ తమ స్థానాలలో సామానులు సద్దుకుని, చిరునవ్వు తో ఒకరినొకరు పలకరించుకున్నా మనసులో పేరుకొని పోయిన వారి బాధ పోదు.. తల్లి తండ్రులని, భార్య బిడ్డలిని వదిలి వచ్చిన వారు, కొత్తగా పెళ్ళైన వారు, త్వరలో పెళ్లి కాబోతున్నవారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చుటూ తిరుగు తూనే ఉంటాయి.


అది కేవలం బోర్డర్ లో కాలు పెట్టిన వరకే. ఒక సారి అడుగు పెట్టేక వారు వీరాధివీరులై పోతారు. వాళ్ళ కళ్ళ ముందు కనబడేది భారత మాత రక్షణ ఒకటే. అందరితో పాటు కాప్టెన్ సికందర్ సింగ్ కూడా ఢిల్లీ చేరి తెల్లారి నాలుగు గంటలకల్లా స్పెషల్ ట్రైన్ ఎక్కేడు. సికందర్ ఒక్కడూ సైడ్ సీటు లో కూర్చుని తన మనీ పర్సులో ఎంతో అపురూపం గా పెట్టుకున్న రజియా ఫోటో కన్నార్పకుండా చూసుకుంటూ కొత్త గా పెళ్ళైన తన భార్య ఎలా ఉందో అని ఆలోచనలో పడ్డాడు.

పంజాబ్ లో ఒక చిన్న పట్నం సికందర్ పుట్టిన ఊరు. ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఊరిప్రజల మధ్య జాతి మత భేదాలు లేవు. ఊరంతా ఒక ఫామిలీ లా జీవిస్తున్నారు. వాళ్ళ మతం ఒక దేశ భక్తి మాత్రమే. సికందర్, రజియా అల్లాంటి వాతావరణం లో పెరిగేరు. ఆ చిన్న ఊర్నించే ఎంతో మంది దేశ సేవ కోసం యుద్ధ వీరులయ్యేరు. అక్కడ ప్రతీ ఇంటా ఒకరో ఇద్దరో సైన్యం లో ఉన్నారు.


రజియా అబ్బాజాన్ కల్నల్ గా రిటైర్ యేరు. రజియా పెద్దఅన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో, చిన్నన్నయ్య ఆర్మీ లో కార్గిల్ వార్ లో పాల్గొని దేశానికి, ఊరికి కూడా మంచి పేరు తెచ్చేరు.

సికందర్, రజియా మొదటినించీ పక్క ఇళ్లల్లో ఉన్నా ఇద్దరూ ఎప్పుడూ ఒకే చోట ఉండేవారు. చిన్నతనం నించి వారి స్నేహం అలాంటిది. వాళ్ళ స్నేహం ఇంట్లో వాళ్లకి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. రజియా తన కంటే రెండేళ్లు చిన్న. ఇద్దరూ కలిసి పెరిగేరు. ఒకే స్కూల్ లోను, కాలేజీ లోను చదువుకున్నారు.


ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ అభిమానం. సికందర్ కి చిన్నప్పటినించీ ఆర్మీ లో చేరి పెద్ద ఆఫీసర్ అవ్వాలని కోరిక. సికందర్ ఎన్. డీ. ఏ ఎగ్జాం మంచి మార్కులతో పాస్ అయి ఇంటర్వ్యూ లో మంచి రాంక్ సంపాదించేడు. ఆర్మీ లో సెలెక్ట్ అయి ట్రైనింగ్ తరవాత పంజాబ్ రెజిమెంట్ లో ఆఫీసర్ గా చేరేడు.


తను వార్ ఫీల్డ్ కి వెళ్లి శత్రువులతో పోరాడి గెలవాలని ఉందని ఎన్ని సార్లో రజియా కి చెప్పేవాడు. అలాంటి ధ్యేయం తనకి ఎంతో ఇష్టం. నువ్వు తప్పకుండా వీరుడివవుతానని రజియా ఉత్సాహ పరిచేది. తమ కొడుకు యుద్ధ భూమి లో వీరుడులా పోరాడాలని ధైర్యం గా ఆర్మీ కి పంపుతామని తల్లి తండ్రులు అన్న మాట సికందర్ కి ఎంతో స్పూర్తి నిచ్చేది.


జనవరి లో సికందర్ రెండు నెలలు సెలవు పెట్టి ఊరు చేరేడు. ఊరు చేరగానే తన కళ్ళు రజియా కోసం వెతికాయి. రజియా కూడా తన కోసమే చూస్తోందన్న సంగతి సికందర్ కి తెలియక వెంటనే కనబడనందుకు కొంచెం కోపం వచ్చింది. ఇంతలో రజియా రానే వచ్చింది.

గులాబీ రంగు డ్రెస్ తో విచ్చుకున్న గులాబీ లాగ అందం గా తయారై వస్తున్నరజియా ని చూసి మంత్ర ముగ్ధుడై కోపం అంతా మరచి పోయేడు. ‘కళ్ళు తిప్పుకోలేనంత అందం నీది రజియా’ అంటూ దగ్గరగా తీసుకున్నాడు సికందర్.

రజియా చేతులో ఒక టిఫిన్ బాక్స్ తో వచ్చింది. రాగానే ప్లేట్ తెచ్చి తను చేసిన సికందర్ కి ఇష్టమైన వేడి వేడి ఆలు పరోఠా, పెరుగు టేబుల్ మీద పెట్టింది.


“ఆంటీ నీకోసం ఎప్పుడూ చేస్తారు గాని నేను నీ కోసం స్వయం గా చేసిన పరోఠాలు రుచి చూడు. అందుకే నా రాక లేటయ్యింది” అని ముద్దుగా చెప్పింది.


“రజియా! ఈ సెలవుల్లో నిన్ను పెళ్లి చేసుకుని జమ్మూ తీసుకెళ్తాను” అనగానే రజియా సిగ్గు తో తల వంచుకుంది.


“నువ్వూ నేను అంతులేని మన ప్రేమలో మునిగి తేలి పోదాం. ఈ వేళే నేను నా బాబాకి నీ అబ్బూకి చెప్పాను” అనగానే ఆనందం తో సిగ్గు మొగ్గయింది రజియా.

కిచెన్ లో వంట చేసుకుంటున్న సికందర్ తల్లి ఈ మాటలు విని ‘పిల్లల పెళ్లి త్వరలో చెయ్యాలి. ఇద్దరికీ పెళ్లీడు వచ్చింది ఈ వేళే సుబేదా బేగం కి చెప్పాలి’ అనుకుంది.


“సికందర్, మనం చాలా అదృష్టవంతులం. మనప్రేమ కి అడ్డులేదు. ఇంటా బయటా అందరూ ‘మీరు ఒకరికోసం ఒకరు పుట్టేరు. దేముడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అని దీవిస్తున్నారు” అన్న రజియా తో “అది నిజం రజియా! మనం ఒకరు లేకపోతే మరొకరు ఉండలేం” అన్నాడు తను.

వారం రోజుల్లో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగి పోయింది. ఆ వేళ చేతికి పండిన గోరింటాకు తో చూసిన సికందర్ “డార్లింగ్.. తుమ్హే దేఖ్ కె మై తో పాగల్ హో రహా హూ”అని నాజూకు గా ఉన్న రజియా ని రెండు చేతుల తో బంధించేడు. పచ్చని శరీర ఛాయపై ఎర్రటి గోరింట, అందమైన మెరూన్ కలర్ డ్రెస్ మెడ లో ఆభరణాలు వీటన్నిటి తో రజియా ఒక దేవ కన్య లా కనిపించింది సికందర్ కి.

మరొక వారం లోనే రజియా ని పెళ్లి చేసుకున్నాడు సికందర్. ఇద్దరి ఆనందానికి హద్దులు లేవు. ఇద్దరూ కొత్త కాపరం గురించి ముచ్చట పడిపోయేరు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ భార్యల మధ్య నువ్వు ప్రత్యేకంగా కనిపించాలని చెప్పేడు రజియాకి. సికందర్, రజియామరొక 15 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా గడిపేరు వాళ్లిద్దరూ. ఎక్కడికైనా హనీ మూన్ కి వెళ్లి రావాలని నిశ్చయించుకున్నారు.


మర్నాడు తెల్లవారు ఝామున ఐదు గంటలకి ఇద్దరూ గాఢ నిద్ర లో ఉండగా సికందర్ సెల్ మోగింది. ఈ సమయం లో ఎవరబ్బా అనుకుంటూ సెల్ తీసేడు సికందర్. సెల్ లో మెసేజ్ విని ఒక్క నిమిషం షాక్ లో ఉండిపోయేడు. అది తన కమాండర్ నించి వచ్చిన మెసేజ్. పక్క దేశం వాళ్ళు దాడి కి దిగేరని, అందరి సెలవులు రద్దు చేసేరని. వెంటనే బయలు దేరి ఢిల్లీ లో రిపోర్ట్ చెయ్యాలని, అక్కడ నించి స్పెషల్ ట్రైన్ లో జమ్మూ వెళ్ళాలి అని ఆర్డర్.

అమాయకం గా నిద్రపోతున్న రజియా ని చూస్తే ‘అబ్బా.. ఇప్పుడు వెళ్లి పోవాలా’ అన్న తలపు వచ్చింది .


మరు నిమిషం ‘ఏమిటీ ఈ ఆలోచన.. నేను ఒక సిపాయిని. దేశ సేవ నా ఊపిరి. నా ఆశయం వీరుడిలా పోరాడి శత్రువులని ఓడించి రావాలి. దేశాన్ని కాపాడుకోవాలి. ఇదే నా కర్తవ్యం. పిరికి వాడిని కాకూడదు. అలాంటి మనస్త్వత్వం రజియా కి కూడా నచ్చదు’ అనుకున్నాడు.

తెల్లారగానే రజియా కి విషయం చెప్పేడు. రజియా కూడా కొంచెం నిరాశ చెందినా వెంటనే సద్దుకుని మనసుని సమాధాన పరుచుకుంది. ఉదయాన్నే అందరూ వార్ ని గురించి చర్చించు కుంటూ, సికందర్ ప్రయాణానికి తయారయ్యేడు. అందరి దగ్గరనించీ వీడ్కోలు తీసుకుని రజియా ని దగ్గరగా తీసుకుని ధైర్యం చెప్పి ఆ సాయంత్రం ఢిల్లీ బయలు దేరేడు సికందర్.

రజియా అమ్మీ, అబ్బా, సికందర్ తల్లి తండ్రులు ‘ధైర్యం గా పోరాడి విజయం గా తిరిగి రా’ అని దీవించేరు.


రజియా సికందర్ నుదుటి ఫై బొట్టు పెడుతూ ‘నువ్వు పుట్టింది వీరుల దేశం లో. నువ్వు పెరిగింది వీరుల మధ్య. నీకు వీరత్వం గురించి చెప్పనక్కర్లేదు. నీకు కావలిసిన ధైర్యం సాహసం ఉన్నాయి. యుద్ధం లో శత్రువులని చీల్చి చెండాడి విజయోత్సాహం తో భారత మాతకి ముద్దు బిడ్డ అనిపించుకో”అంది.


ఎంత బాగా చెప్పింది నా రజియా అనుకుంటూ భార్యని గట్టిగా కౌగలించుకుని వెనక్కి తిరిగి చూడకుండా కార్ లో కూర్చున్నాడు సికందర్.


ట్రైన్ జమ్మూ చేరడం తో అందరూ తమ తమ యూనిట్లకు రిపోర్ట్ చేసేరు. పక్క దేశం వాళ్ళు ఒక సెక్టార్ లో కొంత భారత దేశపు భూభాగం ఆక్రమించేరని తెలిసింది. సికందర్ కంపెనీ కి ఆ సెక్టార్ లో దాడి చేసి శత్రువులని తరిమి కొట్టాలని ఆదేశాలు వచ్చాయి. సికందర్ తో, జే. సి. ఓ లతో ౩౦ మంది జవానులు కూడా ఆర్మీ వెహికల్ లో బయల్దేరేరు. గ్రూప్ లీడర్ సికందర్. అందరూ నియమిత మైన శత్రువులున్న ప్రదేశాల దగ్గర గా చేరుకున్నారు.


సికందర్ తన జవాన్లకు సౌంజ్జ్య ల తో ఆర్డర్ లు ఇస్తుంటే తగిన రీతిగా గ్రెనేడ్ లతో బాంబులతోదాడి మొదలయ్యింది. శత్రువు కూడా నేను తక్కువ కాదని తిప్పి కొడుతున్నాడు.

సికందర్ కంపెనీ లో జవాన్ లందరికీ సికందర్ అంటే చాలా గౌరవం. దానికి కారణం సికందర్ అందరినీ తన స్వంత మనుషుల్లాగే చూసుకుంటాడు. అందులో ఎవరికీ కష్టం వచ్చిన తను సాయం చెయ్యడానికి ముందు ఉంటాడు. కొందరికి ధన సహాయం కూడా చేసే వాడు. అందరికి అతనొక దేవుడు.


ఈ యుద్ధం నాలుగు రోజులు సాగింది. కంపెనీ లో అందరూ నిష్ఠ తో పని చేసి నాలుగు రోజుల్లో శత్రువుని చాల వరకు తరిమి కొట్టేరు. శత్రు సైన్యం లో ఐదుగురు జవాన్ లు కూడా యుద్ధం లో చనిపోయేరు. సికందర్ కంపెనీ లో యిద్దరు మృత్యువు పాలయ్యేరు. శత్రువులలో ఇంకా కొద్దీ మందే మిగిలిన ఆ ప్రదేశానికి సైన్యం దూసుకెళ్తోంది.


శత్రువులందరూ పరిగెడుతున్నారు. మన ప్రదేశం ఇంక కొన్ని గజాల దూరం లోనే ఉంది. ఆక్రమించిన ప్రదేశాన్ని ఖాళీ చెయ్యడానికి అందరూ ముందుకి సాగుతున్నారు. మిగిలిన శత్రువులని పట్టుకుని పీ ఓ డబ్ల్యు గా అప్పచెప్పడమే మిగిలి ఉంది.


శత్రువు తన ధైర్యాన్ని కోల్పోయేడు . సికందర్ అందరికంటే ముందుండి తన మనుషులని నడిపిస్తున్నాడు. శత్రువు లొంగి పోయినట్లే ఉంది. ఇంతలో ఎక్కడినించి వచ్చిందో ఒక బులెట్ సికందర్ గుండెల్లో తగిలింది. పారిపోయే శత్రు సైన్యం లో ఒకడు ఓడిపోయేమన్న నిరాశతో షూట్ చేసి పారిపోయినట్టున్నాడు.

‘జై హింద్’ అని అరుస్తూ సికందర్ కింద పడిపోయేడు. మెడికల్ టీమ్ వచ్చి సికందర్ ని స్ట్రెచర్ మీద రియర్ గార్డ్ లో ఉన్న మెడికల్ రూమ్ కి తీసుకు పోయేరు . సికందర్ శరీరం రక్తసిక్తం అయ్యింది.


కొన ఊపిరి తో ఉన్న సికందర్ మాటలు ఆగి ఆగి వస్తున్నాయి. ‘మన పోస్ట్ ఏమయింది’ అని బాధలోనే కమాండర్ ని అడిగేడు సికందర్.


“సికందర్! నువ్వు గెలిచి ఒక అద్భుతమైన సిపాయి లాగ నిలిచి పోయేవు. నీ పేరు ఎప్పటికీ నిలుస్తుంది” అని కమాండర్ అన్నాడు.


“చాలా సంతోషం గాను గర్వం గాను ఉంది. నేను సిపాయిగా చేరింది దేశ సేవ కోసమే. అది నాకు దొరికింది. కానీ ఒకటే బాధ. పదిహేను రోజుల క్రితమే నా పెళ్లి రజియా తో అయ్యింది. పాపం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను చాల ధైర్యవంతురాలు, దేశ భక్తురాలు. ఒక మాట నా రజియా కి చెప్పండి. నా ప్రాణం పోయినా నేను ఎప్పుడూ తన మనసు లోనే ఉంటాను. జీవితం ధైర్యం గా ఎదురుకోవాలి అని నా మాట గా చెప్పండి” అంటూ కళ్ళు మూసేడు సికందర్.


చుట్టూ ఉన్న వాళ్ళందరి కళ్ళు నీళ్ల తో నిండిపోయేయి . ఆ చిన్న పట్నం లో సికందర్ ఆ పోస్ట్ ని స్వాధీనం చేసుకున్న సంగతి, మరు క్షణమే తను వీర మరణం పొందిన సంగతి, రెండూ ఒకే సారి తెలిసేయి. ఊరంతా ‘సికందర్ సింగ్ అమర్ రహే. షహీద్ హో గయా’ అనే నినాదాలతో సికందర్ ఇంటి దగ్గర చేరేరు. తల్లి తండ్రి, అత్తా మామలు కన్నీరు మున్నీరై ఏడిచేరు. కానీ తమ ఒక్కగానొక్క బిడ్డ దేశ సేవకై అంకితం అయిపోయేడన్న భావన కూడా వాళ్ళ మనసు లో కలిగింది.


వార్త విన్న రజియా తన దుఃఖం అంతా మనసు లో దాచుకుని కన్నీరు బొట్టు కూడా రానీయలేదు.


‘తన పేరు సికందర్.. అంటే గెలిచినవాడు . నా భర్త సికందర్ ఆఖరి వరకు పోరాడి గెలిచేడు. తను అమర వీరుడు. మాప్రేమని నేను అమర ప్రేమ అనుకుంటున్నాను. నా మనసులో నా సికందర్ ఎప్పుడూ బతికే ఉంటాడు. జండా ఊంచే రహే హమారా’ అంటూ తన గది లోకి వెళ్లి పోయింది రజియా.


***సమాప్తం***


సీత మండలీక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది.




29 views0 comments

Comments


bottom of page