top of page

ధర్మరాజు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Dharma Raju' New Telugu Story Written By Penumaka Nageswara Rao

రచన: పెనుమాక నాగేశ్వర రావు

అన్నీ తెలిసిన రాంబాబు లాంటి వ్యక్తికైనా, ఆదరణ చూపే ధర్మరాజు లాంటి మనసున్న వ్యక్తి తోడు కావాలి. రకరకాల తర్క వితర్కాలతో కూడిన, ఆలోచింపజేసే ఈ కథను పెనుమాక నాగేశ్వర రావు గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం

ఉదయం అయిదు గంటలకి ఓ అయిదారు నిముషాలు అటుయిటుగా నిద్ర లేస్తాడు ధర్మరాజు. పేదలు కక్కుర్తి పడితే అర్ధం చేసుకోవచ్చు. జాలి చూపవచ్చు. కోట్లకి పడగలెత్తిన మారాజులు కక్కుర్తి పడితే ఎట్లా? టూత్ పేస్టు నొక్కుతూ రోజూ అనుకుంటాడు ధర్మరాజు. దాన్లో సగం పేస్ట్, సగం గాలి. అందుకే ఆయనకి ఆ అసహనం. అలా మొదలయ్యే అసహనం ఏదో ఒక కారణంగా రోజంతా వెంటాడుతూనే వుంటుంది.


దంత ధావనం చేసుకుని ఇంట్లోకి వచ్చే సరికి కాఫీ గ్లాసు చేతికి అందాలి. కప్పు పనికి రాదు. గ్లాసెడు కాఫీ లోపలికి వెళితే గానీ సంతృప్తి కలుగదు పాపం ధర్మరాజుకు. బాగా దగ్గిరి బంధువుల ఇళ్లకూ, రోజూ కలిసే స్నేహితుల ఇళ్లకూ వెళ్లినప్పుడు ఆయనకి అలా గ్లాసుతో కాఫీ అందుతుంది. కొత్త వారు మాత్రం కప్పుతోనే సరిపెడతారు. అసంతృప్తిగానే పెదవులు తడుపుకుంటాడాయన.

కాఫీ ప్రియుడు దర్మరాజు. పూర్వం కాఫీ పెడుతుంటే వంట గది లోంచి ఘుమగుమలాడుతూ చక్కని వాసన వచ్చేది. ఇప్పుడేముంది ఆ కాఫీ పొడి అంతా కల్తీ మయం. ఆ వాసనా,ఆ రుచీ మళ్ళీ ఎక్కడినుంచి వస్తయ్యంటూ వాపోతూనే కాఫీ తాగేస్తుంటాడు ధర్మరాజు. స్నానం చేస్తూ చేతిలోకి తీసుకున్న సబ్బు వంక చూసి పెదవి విరుస్తాడు. దాని పరిమాణం తగ్గింది. నాణ్యతా తగ్గింది. పరిమళమూ తగ్గింది. సబ్బు రుద్దుకుని స్నానం చేసి వస్తే ఇల్లంతా ఎంత చక్కటి సువాసన వస్తుండేది! ఇప్పుడేవి అలాంటి సబ్బులు? పేరు గొప్ప వూరు దిబ్బ అన్న చందాన వున్నయ్. అనుకుంటూనే స్నానాలగది నుంచి బయట పడతాడు.


లోపలికి వస్తూనే దేవుడి గూడు దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకుని నుంచుని చేతులు జోడిస్తాడు. భక్తిగా కళ్ళు మూసుకుని ఏవో శ్లోకాలో,పద్యాలో శబ్దం రాకుండా చదువుకుంటాడు. అప్పటికే భార్య వెలిగించిన అగరు బత్తీల వాసనకి అసంతృప్తిగా పెదవి విరచి అక్కడినుంచి హాల్లోకి చేరతాడు అప్పటినుంచి మొదలవుతుంది అసలు కధ. దిన పత్రక చేతిలోకి తీసుకుని ఒక్కో వార్తా చదవటం వ్యాఖ్యానించటం అలవాటు ధర్మరాజుకు. పైగా తాను భార్య తో చెప్పిన విషయాలేమైనా వార్త గా వస్తే రెట్టింపు ఉత్సాహంగా పెద్దగా చదివి వినిపిస్తాడు. ఆమెకు వేరే వ్యాపకం వుండకపోవటంతో కాసేపు భర్త చెప్పే వార్తా విశేషాలతో పాటు మరికొన్ని వింతలూ,విడ్డూరాలూ కూడా విని,ఆనక ఫలహారం తయారుచేసే పనికి ఉపక్రమిస్తుంది.

కందిపప్పు వేయించేటప్పుడు రావాల్సిన కమ్మని వాసన రానప్పుడూ, తిరగమోత తిప్పుతున్నప్పుడు గుప్పున కొట్టవలసిన కమ్మని వాసన నాసికాపుటాలకు అందనప్పుడు, ఇంపైన ఇంగువ ఘాటు లేశమైనా లేనప్పుడూ అసంతృప్తిగా పెదవులు చప్పరించకుండా వుండలేడు, పాపం ధర్మరాజు.


ధవళ వస్త్రాల లోనే దర్శనం ఇస్తుంటాడు ధర్మరాజు. వయను మూడు పదులు దాటేవరకు తెల్ల చొక్కా,తెల్ల పాంటు ధరించిన ధర్మరాజు షష్టి పూర్తి అయ్యాక ధోవతిలోనే ఎక్కువ కనపడసాగాడు. బిళ్ళ గోచీ పెట్టి కట్టుకునే ధోవతి, పొడుగు చేతుల ఖద్దరు చొక్కా లో నిండుగా గంభీరంగా కనిపిస్తాడు ఆరడుగుల ధర్మరాజు. చెదరని చిరునవ్వు ఆయనకు అదనపు ఆకర్షణ. చిన్నప్పటి నుంచీ ఖరీదైన చెప్పులే వాడటం అలవాటు. నాణ్యత కలిగిన పరిమళ ద్రవ్యం ఉపయోగిస్తాడు ధర్మరాజు. పనిమీద వెళ్ళేటప్పుడు, వూళ్ళకి వెళ్ళేటప్పుడు భుజం పైన కండువా వుండాల్సిందే. ఇది ఇప్పుడాయనకు అవసరంగా మారిన అలవాటు.


నాజూకు తనము, నాసిరకము తప్ప నాణ్యత వుండటం లేదు వస్తువుల్లోకాని, మనుషుల ఆలోచనల్లోగాని. మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతల దగ్గరికి వచ్చేసరికి చేతకానితనమే కనపడుతున్నది. చతికిల పడటమే జరుగుతున్నది. తేలిగ్గా తేల్చేస్తున్నారు. తెల్లముఖాలు వేసేస్తున్నారు. తీగలు లాగినట్లు నటిస్తున్నారు కానీ డొంకలు కదలటంలేదు.

‘’కమలా.........రేపటినుంచి నువ్వు నాకు వంట నేర్పాలోయ్’’ భార్యనుద్దేశించి అన్నాడు ధర్మరాజు

‘’అదొక్కటే తక్కువ. ఏం? మీకు పుస్తకాలు, టీ.వీ కార్యక్రమాలు, అందులో వచ్చే రాజకీయ చర్చలు, బయట చూసే నాటకాలు, సభలు, సమావేశాలు చాలటం లేదా......... వంట మీద మనసు పడుతున్నారు” ముసిముసిగా నవ్వుకుంటూనే చిరుకోపం నటించిందామె.

“కాదులే కమలా....నేను నిజంగానే అడుగుతున్నాను. రేపటినుంచి ఓ నెల రోజులు నాకు నేర్పు. ఆ తర్వాత నా నేర్పు నీకు చూపిస్తాను......... సరేనా””

“మీరంతగా అడుగుతుంటే కాదంటానా.......అలాగే”’

“వెరిగుడ్ వెరిగుడ్ దటీజ్ మై కమల. ధాంక్యూ’’ సంబరపడిపోయాడు ధర్మరాజు

ఆమె వంటపనిలో పడింది. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు.


ఏది పుణ్యం? ఏది పాపం? ఏది మంచి? ఏది చెడు? ఏది నిజం? ఏది అబద్దం? అన్నీ ప్రశ్నలే! అన్నీ సందేహాలే! తీర్ధయాత్రలకు వెళ్లివస్తే పుణ్యం వస్తుందంటారు. నదీ స్నానం పుణ్యాన్నిస్తుందంటారు. సాధూనాం దర్శనం పుణ్యం అని కూడా అంటారు. పుణ్యం సంపాదించటానికి ఇన్ని దారులు వున్నై. ఇంకా చాలా కూడా వున్నయ్యట. పాపపు పనులు చేయకుండా వుండటమే పుణ్యం అని తేల్చేశాడు మొన్నీ మధ్యనే వచ్చి వెళ్ళిన మాస్నేహితుడు రాంబాబు. వాడు చెప్పగా,అది కూడా సమంజసంగానే తోచింది.


అతగాడు అంతటితో ఆగలా. ‘మనం ఎవ్వరికీ మోసం చేయకుండా బ్రతకటం పుణ్యం. మనం మోసపోకుండా వుండటం తెలివి, మోజు పడటం పాపం’ అని మూడు ముక్కల్లో వేదాంతం వల్లించాడు. వాడు అంత తేలిక మాటల్లో ఎంతో గొప్ప విషయాల్ని చెప్పినట్లు అనిపించింది ధర్మరాజుకు . ఇంకా కొంచం వివరంగా చెప్పమని అడిగాడు ధర్మరాజు.

“ఏం లేదు మిత్రమా ....మనం బ్రతకటానికి ఏదో ఒక పని చేస్తుంటాం కదా... ఆ పనిని చేయటానికి బద్దకించకూడదు. ఎవరి మెప్పుకోసమో చేయకూడదు. ఇష్టంగా చేయాలి. తృప్తిగా చేయాలి. తపనగా చేయాలి. నువ్వు ఆ పని చేస్తున్నందువల్లే కదా రోజూ నీ ఆకలి తీర్చుకుంటున్నావు? నీ ఆకలి తీర్చే ఆ పని పట్ల నీకు అత్యంత శ్రద్ధ వుండాలి.

ఇక రెండవది మోసపోక పోవడం… వూరకనే వచ్చే దేనినీ ఆశించకు. నువ్వు మోసపోవు. నీ మనసే నిన్ను మోసం చేసేది, ఎవరో, ఎవరో ఎవరో కాదు.


మూడవది, ముఖ్యమైనది మోజు పడకపోవటం… అంటే… ఇది ఇలాగే జరగాలి, అది అలా జరిగితేనే బాగుంటుంది అనుకోవటమే మోజు పడటం. అది లేకపోతే ఇక పాపం లేనట్లే. పాపం లేకపోతే వుండేది పుణ్యమేగా!


‘నన్ను నేను ఎవ్వరితోనూ పోల్చుకోను. పోటీ అసలే పడను. వాళ్ళు అలా వున్నారు. నేను ఇలా వున్నాను. నేను ఆనందంగా వున్నాను. హాయిగా వున్నాను. ఎవరైనా బాగున్నారంటే సంతోషిస్తాను గాని అసూయపడను. కోపం వస్తే వస్తుంది, పోతుంది గాని ఎవ్వరిపైన నాకు ద్వేషం లేదు. ఉపకారం చేస్తానో చెయ్యానో గాని అపకారం చేయను. అసలు ఆ ఆలోచన కూడా రాదు. నా పనే నా ప్రపంచం. నా ఇల్లే నా సర్వస్వం. నా ఇల్లే నా స్వర్గం.’’ చెప్పాడు రాంబాబు


మరి దేవుడి సంగతి ఏమిటంటావని అడిగాడు ధర్మరాజు కుతూహలంగా

“ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు బ్రతుక గలిగితే మనమే దేవుళ్ళం . ఇంకా దేవుడితో పనేమి వుంది. అయినా దేవుడనే వాడు ఒకడు వున్నాడు అనుకుంటే పోలా? కాస్తో కూస్తో మంచే జరుగుతుంది” అని నవ్వేశాడు రాంబాబు.


‘’నువ్వే దేవుడివి. ఇంకా దేవుడెవరు? అందరూ చెప్పేది అదే. కానీ మనం అర్ధం చేసుకోకుండా ఆ దేవుడు ఎవరో బయట ఎక్కడో వున్నాడని వెతుక్కుంటూ వెళుతున్నాం అంతే. నిన్ను నువ్వు తెలుసుకో అంటే అర్ధం అదే ’’ అన్నాడు.


అతగాడి మాటల్లో ఏదో కాన్ఫిడెన్స్ ద్వనించటంతో నాకు ఇంకా ఇంకా వినాలనిపించసాగింది.

‘’ఇంకొంచం వివరంగా చెప్తావా’’ ఆసక్తిగా అడిగాడు ధర్మరాజు


‘’నీలాంటి ఓ భక్తుడు దేవుని దర్శనానికి వెళ్ళి గంటకు పైగా క్యూ లో నుంచుని కాళ్ళు నొప్పులు పెడుతుండగా ‘’డబ్బులున్న మారాజులకు దగ్గర్నుంచి కనిపిస్తావు, నాబోటి పేదోళ్ళకి మాత్రం దూరం నుంచి, అదీ గంటల తరబడి నిలబెట్టి గాని దర్శనం ఈయవు. ఇదేం న్యాయం స్వామీ అని అడిగాట్ట. అందుకు బదులుగా దేవుడెమన్నాడో తెలుసా’’ అడిగాడు రాంబాబు

‘’నాకేం తెలుసు. నువ్వే చెప్పు’’అని పెద్దగా నవ్వాడు ధర్మరాజు.


‘’తల్లికి మించిన దైవం లేదు అని చెప్పాను. మీరు ఆవిడను పూజించటం లేకపోగా నిరాదరిస్తున్నారు. తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను, మీరు పాటించటం లేదు. గురువే దైవం అన్నాను, మీరు వినిపించుకోవటం లేదు. ఇక్కడా, అక్కడా అని కాదు.. నువ్వు ఎక్కడ వెతికితే అక్కడ వున్నాన్నేను అంటే నమ్మలేకపోతున్నారు. ఇబ్బందుల్లో వున్నవారికి సహాయం చేయండి, నాకు సేవ చేసినట్లే అని చెబుతుంటే ఆచరిస్తున్నారా? నన్ను ఇక్కడ నిలబెట్టి, నేను ఎప్పుడు మీకు కనిపించాలో వేళలు మీరే చెప్పి, టిక్కెట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్లు అన్నీ మీరే చేసి నన్ను నిందిస్తావా?’’ అని అడిగాట్ట దేవుడు. ఇప్పుడు చెప్పు’’ అంటూ ధర్మరాజు కళ్ళల్లోకి సూటిగా చూశాడు రాంబాబు.


‘’నువ్వు సినిమాలు బాగా చూస్తుంటావనుకుంటాను’’ అడిగాడు రాంబాబే మళ్ళీ.

“చూస్తాను . ఇప్పుడు టీ.వీ వుందిగా. సినిమాలు కాస్త తగ్గినట్లే…” అన్నాడు ధర్మరాజు నవ్వుతూ

“మంచిది..మంచిది. సినిమా అయినా, టీ.వీ సీరియల్ అయినా మనం చూస్తూ భావోద్రేకాలకి గురి అవుతుంటాం కదా? అదే విలన్ మీద కోపం వస్తుంది, హీరో మీదనో, హీరోయిన్ మీదనో జాలి పుడుతుంది, హాస్య నటుడి మాటలకి, హావభావాలకి నవ్వు వస్తుంది. ఒక సినిమా చూసేటప్పుడు మనకి కోపం కలుగుతున్నది, జాలి కలుగుతున్నది, భయం ఆనందం కూడా కలుగుతున్నై. మన జీవితం కూడా ఓ సినిమానే . ఇప్పుడు చెప్పుకున్న భావాలన్నీ కలుగుతై , పోతై. ఈ జరిగే పరిణామాలన్నింటినీ సినిమా చూస్తున్నట్లు చూడటమే మన పని. ‘’


చాలా చాలా పెద్ద విషయాన్ని చిన్న చిన్న మాటల్లో చెబుతున్నాడనిపించింది ధర్మరాజుకు. మరి కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు రాంబాబు. మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయని బాధపడే మనసున్న మనుషులు నిత్యం మనకి ఎదురవుతూనే వుంటారు. అయితే మధురాతిమధురమైన మానవ సంబంధాలు ఎందుకు మృగ్య మవుతున్నాయని ఆలోచిస్తున్నవారి సంఖ్య తక్కువే. జీవితాన్ని గురించి, జీవిత గమనాన్ని గురించి కాస్త నింపాదిగా ఆలోచించే తీరిక ఎవరికి వుంది? మనని ఎవరూ పట్టించుకొనప్పుడు మాత్రమే మానవ సంబంధాల గురించి ఆలోచిస్తున్నాం. శరీరంలో జవం , జేబులో జీవం వున్నంతవరకూ , ఒకరితో నాకేం పని అని మనుషులు విర్రవీగుతున్నారు.


హార్డ్ మెలోడీస్ ఆర్ స్వీట్ అండ్ దోజ్ అన్ హార్డ్ ఆర్ స్వీటర్ అని ఇంగ్లీష్ రచయిత చెప్పినట్లు పున్నమి అందంగా వుంటుంది. అమావాస్య మరింత అందంగా వుంటుంది. కానీ ప్రస్తుతం పున్నమి లేదు,వెన్నెల లేదు. అమావాస్య అంతకన్నా లేదు. మనుషులు మనసుపెట్టి పనిచేసే రోజులు పోయినై. పని అంతా యంత్రాలతోనే. మనల్నీ, మన నైపుణ్యాలను, మన భావుకతను అమాంతంగా మనల్నే మింగేసింది సాంకేతికత. మరుగున పడిపోతున్నది నైతికత. మాయమైపోతున్నది మానవత. అసలైన మనిషే లేనప్పుడు మానవ సంబంధాలెలా వుంటై! యంత్రాలు మనల్ని మనకీ, మనవారికీ దూరం చేస్తూనే, దగ్గర చేస్తున్న భ్రమ కల్పిస్తున్నై. యంత్రాలకి అలవాటుపడ్డ మనిషి యంత్రమే అయిపోతున్నాడు . యంత్రాల మధ్యన యాంత్రిక సంబంధాలే వుంటాయి కానీ మానవ సంబంధాలుంటాయా?


మనలో చాలా మందిమి ఇంట్లో వుండే పాత సామాన్లని బయట పడేసేందుకు ఇష్టపడం. ఒకవేళ పిల్లలు గోలచేసినా, మన మనసు ఒక పట్టాన ఒప్పుకోదు. మనసు మారాం చేసి తీరుతుంది. అవి ఎంత పనికిరానివైనా, తట్టలు, బుట్టలు, గిన్నెలు, గ్లాసులు, గాజులు, సీసాలు, డబ్బాలు, రోలు, రోకలి వగైరా వగైరా....ఏ వస్తువైనా కానివ్వండి దాని వెనుక ఓ కధ, ఓ జ్నాపకం, తప్పకుండా వుండి వుంటుంది . ఆ కధ మరచిపోయి, వస్తువును పారవేసేందుకు మనసొప్పదు. ఎంత పాతబడిన వస్తువు నైనా ఇంట్లో ఏదో మూల పడేస్తామెగానీ పారెయ్యము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నమ్మకం. పాత వస్తువైనా కనిపించకపోతే మనసు విలవిల్లాడిపోతుంది.


అది కనిపించిందాకా మనసంతా అశాంతే . పాతను ప్రేమించడం గౌరవించడం మన సంస్కృతిలో భాగం. మన సంస్కారంలో భాగం. అది మనకు తెలీకుండానే మన నరనరాల్లో వున్నది.


పండుగపూట కూడా పాత మొగుడేనా అనుకోదు భార్య, పండుగపూట కూడా పాత భార్యేనా అనుకోడు భర్త. వారిద్దరూ జీవితాంతం కలసి వుండాల్సిందే. మనది యూజ్ అండ్ త్రో సంస్కృతి కాదు. పాత వస్తువుల్నే అంతా ప్రేమించే మనం, ఇంట్లోని తల్లితండ్రుల్ని, తాతా అవ్వల్నీ అన్నింటికీ అడ్డమని వృద్దాశ్రమాల్లోకి తరలించడం భావ్యమా? బంధమా? అందమా?

నేటి పాత వస్తువు ఒకనాడు కొత్తదే! ఇవ్వాల్టి మూడు కాళ్ళ ముదుసలులు ఒకప్పుడు యవ్వనంలో తొణికిసలాడిన వాళ్లే . పాత వస్తువులు లేకపోతే కొత్త వస్తువులు రావు. పాత మనుషులు లేకపోతే కొత్త మనుషులెట్లా వచ్చేవాళ్లు? ఈ జ్ణానమ్ ప్రతి భారతీయుడి మనసులో నిద్రాణంగా నైనా వుండి తీరుతుంది.


అటాచ్ మెంట్, ప్రేమకు మూలం. కాలం గడిచిన కొద్దీ అటాచ్ మెంట్ పెరుగు తుంది. ప్రేమ ఘనీభవిస్తుంది. విడదీయరాని సంబంధ మేర్పడుతుంది. పాత అంటే హృదయంగమైన జ్ఞాపకాలు. పాపయ్యశాస్త్రి గారి పుష్పాలు

‘మా వెలలేని ముగ్ధ సుకుమార, సుగంధ, మరంద , మాధురీ జీవనమెల్ల

మీకయి కృశించి, నశించి, త్యజించి పోయె, మా యవ్వనమెల్ల కొల్లగొని

మమ్మావల పారవేతురుగదా!’ అని ఏడ్చినట్లు పాత సామాన్లు ఏడుస్తాయి.

పాత మనుషులూ ఏడుస్తారు. వినగల చెవులుండాలి.


మనది కాని విధానానికి అలవాటు పడ్డప్పుడు కొత్తేమిటి , పాతేమిటి, అన్నింటినీ పారేస్తాం. వృద్దులైన అమ్మానాన్నల్ని పిల్లలు వృద్దాశ్రమాలకు తరలిస్తుంటే, చదువు పేరుతో, ఉద్యోగాల పేరుతో పెద్దలు పిల్లల్ని హాస్టళ్లకో, విదేశాలకో తరలించటం లేదూ.. తోలేయటంలేదూ? ! అదో ఘనకార్యంగా భావించటంలేదూ ? గర్వంగా పదిమందికీ చెప్పుకోవటం లేదూ?


పాతని వదిలించుకోవాలనుకోవటం మన పద్ధతి కాదు. అది కొత్తని కూడా వదిలించుకునే దుస్థితికి తీసుకొచ్చింది. ఇది మన ఐడెంటిటీ ని పోగొట్టుకోవడం. మనం మనం కాకుండా పోవటం. పడమటి గాలి బలంగా వీస్తున్నది. అందులో కొట్టుకుపోతున్నాం మనం.

కానీ స్వధర్మే నిధనం శ్రేయః పర ధర్మే భయావహ అని మరచిపోతున్నాం.


అట్లా మరచిపోయే రాంబాబుని పిల్లలు పట్టించుకోకుండా వదిలేశారు . భార్య కాలం చేసింది. ఒంటరి గా వుంటున్న రాంబాబు కు ఆదాయం ఏమీ లేదు. పల్లెటూరు కాబట్టి, పాత తరం మనుషులు కొద్దిమంది వుండబట్టి రాంబాబు కడుపు నిండుతున్నది. కొద్ది రోజులు వేచి చూసిన ధర్మరాజు తనకు సన్నిహితంగా వుండే వాళ్ళను పిలిపించుకుని రాంబాబు భుక్తికి వాళ్ళంతా కూడా వారివారి ఇళ్ళల్లో అవకాశం కల్పించేటట్లు ఏర్పాటు చేశాడు.


ధర్మరాజే ప్రతి ఏడాది ఉగాదికి, దసరాకీ రెండు జతల బట్టలు కొనిస్తాడు రాంబాబుకి. ఆయన దారిలోనే మరికొందరు. అలా కట్టుకోవటానికి, కడుపు నింపుకోవటానికి ఇబ్బంది లేకుండా, రాత్రయ్యేసరికి ధర్మరాజు ఇంటికి చేరి పంచలో పడుకుంటాడు రాంబాబు. పగలంతా వూళ్ళో తిరుగుతాడు. వూళ్ళోవాళ్ళకి చిన్నచిన్న పనులు చేసిపెడుతుంటాడు.


ధర్మరాజు వున్నంతవరకు నా బతుక్కి దిగుల్లేదని ధైర్యంగా బతుకుతున్నాడు రాంబాబు . రాంబాబులు ఎక్కువైపోతున్నారు. ధర్మరాజులు నూటికో కోటికో.. ఒకరో, ఇద్దరో కనిపిస్తున్నారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



220 views0 comments
bottom of page